దేవుడక్కడ.. గంటలు ఇక్కడ | Strange In the famous Kolanupaka temple | Sakshi
Sakshi News home page

దేవుడక్కడ.. గంటలు ఇక్కడ

Published Thu, Apr 25 2019 2:23 AM | Last Updated on Thu, Apr 25 2019 2:23 AM

Strange In the famous Kolanupaka temple - Sakshi

దేవాలయానికి వెళ్లగానే భక్తులు స్వామి విగ్రహం ముందు నిలబడి.. అప్రయత్నంగానే దైవం ముందున్న గంటను మోగిస్తారు. ఆలయం అనగానే దేవుడి ప్రతిరూపం కళ్లముందు కదలాడితే, అలయ పవిత్ర గంటల శబ్దం చెవుల్లో మారుమోగుతుంది. గంట మోగిస్తే దేవుడు తమ కోరికను ఆలకిస్తాడని భక్తులు విశ్వసిస్తారు. అందుకే గంట సరిగ్గా గర్భాలయం ముందు మూలవిరాట్టుకు ఎదురుగా ఉంటుంది.

కానీ, చారిత్రక ప్రసిద్ధి గాంచిన కొలనుపాక దేవాలయం పరిస్థితి వేరు. ఆ ఆలయ గంటలు మోగిస్తే గర్భాలయంలోని స్వామికి వినిపించవు. విచిత్రంగా, విడ్డూరంగా అనిపించినా ఇది నిజం....ఎందుకంటే.. ఆలయాలు కొలనుపాకలో ఉంటే, ఆ గుడి గంటలు అక్కడికి 77 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌లో ఉన్నాయి. గంటలు దేవాలయంలో ఉండాలిగాని, హైదరాబాద్‌లో ఉండటమేంటన్న గందరగోళానికి పురావస్తుశాఖ నిర్వాకమే కారణం.
– సాక్షి, హైదరాబాద్‌

ఇదీ సంగతి...
కొలనుపాక అనగానే ప్రపంచ ఖ్యాతి పొందిన అద్భుత జైన దేవాలయం మదిలో మెదులుతుంది. ప్రస్తుత యాదాద్రి– భువనగిరి జిల్లా పరిధిలోని ఆలేరు సమీపంలో ఈ గ్రామముంది. రాష్ట్రకూటులు పదో శతాబ్దంలో ఇక్కడ విశాలమైన జైన దేవాలయాన్ని నిర్మించారు. అందులో ఐదడుగుల పచ్చరాతి మహావీరుని విగ్రహం భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. రాష్ట్రకూటుల తర్వాత పాలనాపగ్గాలు చేపట్టిన కళ్యాణి చాళుక్యులు పదకొండో శతాబ్దంలో దానికి చేరువలో సోమేశ్వరాలయం, పక్కనే వీరనారాయణస్వామి ఆల యాలను నిర్మించారు. వెరసి ఇది జైన, శైవ, వైష్ణవ సంప్రదాయంతో వర్ధిల్లిన ప్రాంతంగా చరిత్రకెక్కింది. శైవంలో కాలకమైన పంచ ఆచార్యుల్లో రేణుకాచార్య మనుగడ సాగించింది కొలనుపాకలోనే అన్న ఆధారాలుండటంతో దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులొస్తారు.  ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి జైన భక్తులు కొలనుపాకకు వచ్చి సేదతీరుతారు. ఈ ఆలయాలకు చెందిన రెండు భారీ గంటలు ఆలయాలకు దూరంగా హైదరాబాద్‌ స్టేట్‌ మ్యూజియంలో ఉండిపోయాయి.

నాటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో జైన ఆలయం ధ్వంసమైంది. మిగతా కొన్ని నిర్మాణాలు కూడా విధ్వంసానికి గురయ్యాయి. 1970లలో అక్కడ జరిపిన అన్వేషణలో ఆలయాలకు చెందిన భాగాలు, ఇతర వస్తువులు వెలుగుచూశాయి. నాడు ధ్వంసమైన జైన దేవాలయం స్థలంలో తర్వాత పాలరాతి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పుడది జైన భక్తుల ఇలవేల్పు. అక్కడికి సమీపంలో ఊబదిబ్బగా పేర్కొనే వాగు ఇసుకలో 2 భారీ గంటలు లభించాయి. కంచుతో రూపొందిన ఈ గంటలు అద్భుత శిల్పకళానైపుణ్యంతో వెలుగొందుతున్నాయి. ఈ రెండు కూడా కంచుతో రూపొందిన బరువైన గంటలు. వాటిని మోగిస్తే వచ్చే శబ్ద తరంగాలు వినసొంపుగా చాలాదూరం వినిపిస్తాయి. వాటి ని అప్పట్లో స్టేట్‌ మ్యూజియంకు తరలించి మరిచిపోయారు. ఐదారేళ్లుగా వీటిని తిరిగి ఆలయాలకు తరలించాలన్న విన్నపం భక్తుల నుంచి వస్తోంది. ఇవి ఆ ఆలయాలకు చెందినవే కావటంతో వాటిని మళ్లీ ఆలయాల్లో ఏర్పాటు చేయాలి. కానీ విలువైన ఆ గంటలను స్మగ్లర్ల బారి నుంచి కాపాడాలంటే భద్రత అవసరం. ఉద్యోగుల జీతాలకే దిక్కులేని దుస్థితిలో ఉన్న పురావస్తుశాఖ వాటిని కాపాడలేనని చేతులెత్తేసింది. కాపలా సిబ్బంది ఖర్చులు భరించే స్తోమత లేనందున వాటిని మ్యూజియంలోనే ఉంచి చేతులు దులిపేసుకుంది.  

గంటపై శాసనం...
సాధారణంగా శాసనాలు రాళ్లు, రాతి పత్రాలపై రాస్తారు. కానీ ఈ రెండు గంటల్లో ఓ దానిపై శాసనం లిఖించి ఉండటం విశేషం. ‘స్వస్తిశ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ’అని కన్నడలో లిఖించి ఉంది. కండప్ప నాయకరు కొల్లిపాక స్వామి సోమేశ్వరదేవుడికి విరాళంగా ఇచ్చిందన్న అర్ధం.  

కాశీ కొలనుపాక బింభావతి పట్టణంగా చరిత్రలో కొలనుపాక వెలుగొందింది. కళ్యాణి చాళుక్యుల హయాంలో రెండో రాజధానిగా కూడా భాసిల్లింది. మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీనిపేరు కొల్లిపాకైగా ఉంది. కాకతీయ రుద్రదేవుని శాసనంలో కొల్లిపాక అని ఉంది. ఇలా ఈ పేరు రూపాంతరం చెందుతూ కొలనుపాకగా స్థిరపడింది. ఈ గంటల్లో ఒకదానిపై అంజలి ముద్ర, అక్షమాల, గిండి ధరించి పద్మాసనంలో కూర్చున్న బ్రహ్మ, పరుశు, పాశం, దంతం, మోదుకం ధరించి లలితాసనంలో ఉన్న గణపతి, రెండు చేతులు అంజలి ముద్ర, మరో రెండు చేతుల్లో శంఖుచక్రాలు ధరించిన విష్ణువు, అభయహస్తం, శ్రీఫలం, శూలం, ఖట్వాంగం ధరించిన శివుడు ప్రతిరూపాలున్నాయి. మరో గంటపై ఆసీనుడైన బ్రహ్మ, విష్ణు, సూర్యుడు, గణపతి విగ్రహాలున్నాయి. 

కొంతమంది భక్తులకు ఈ గంటల ఖ్యాతి తెలిసి చూసేందుకు ఆలయాలకు వెళ్తున్నారు. కానీ అవి హైదరాబాద్‌లో ఉన్నాయని తెలిసి తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. వాటిని వెంటనే కొలనుపాక ఆలయంలో ఏర్పాటు చేసి తగు భద్రత కల్పించాలి. అలనాటి ఆ గంటలు మోగించి ఆధ్యాత్మికానందం పొందే అవకాశాన్ని భక్తులకు కల్పించాలి.
– రత్నాకరరెడ్డి ఔత్సాహిక పరిశోధకుడు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement