
భువనేశ్వర్: పూరీలోని ప్రఖ్యాత జగన్నాథస్వామి ఆలయం రత్న భండార్(ఖజానా)ను దాదాపు 34 ఏళ్ల తర్వాత తెరిచేందుకు ఒడిశా ప్రభుత్వం ఆలయ నిర్వాహకులకు అనుమతిచ్చింది. రత్న భండార్ పటిష్టత, భద్రతల్ని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) పరీక్షిస్తుందని ఆలయ ప్రధాన నిర్వహణాధికారి పీకే జెనా తెలిపారు. ఖజానాలోని సంపదను లెక్కించబోమని స్పష్టం చేశారు. భక్తులు స్వామివారికి సమర్పించిన విలువైన ఆభరణాలు, రాళ్లను ఈ ఖజానాలో భద్రపర్చినట్లు వెల్లడించారు.
రత్న భండార్‌ను తెరవడంపై గురువారం ఆలయ పూజారులతో చర్చించి విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు. 1984లో ఈ ఆలయంలో పనిచేసిన ఆర్.ఎన్.మిశ్రా మాట్లాడుతూ.. అప్పట్లో ఖజానాలోని 7 గదుల్లో మూడింటినే తాము తెరవగలిగామని చెప్పా రు. తనిఖీల కోసం నాలుగో గదికి దగ్గరకు వెళ్లగానే పాములు బుసలుకొట్టిన శబ్దాలు విన్పించాయన్నా రు. జగన్నాథస్వామి ఆలయ పునరుద్ధరణ పనుల్ని ఒడిశా హైకోర్టు పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.