సాక్షి, యాదాద్రి: మాజీ మంత్రి,సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు బీఆర్ఎస్ తొలి జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుంచి బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేయాలనుకున్న మోత్కుపల్లికి అవకాశం దక్కకపోవడంతో భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. గురువారం యాదగిరిగుట్టలో తన అనుచరులతో సమావేశం అవుతున్నారు.
అవమానంగా భావించి
దళితబంధు పథకం ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ మోత్కుపల్లి సలహాలు, సూచనలు తీసుకున్నారు. అయితే, ఆ తర్వాత పట్టించుకోలేదు. ఆరు నెలలుగా కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం అవమానంగా భావిస్తున్నారు. టికెట్లు ప్రకటించే సమయంలోనైనా సిట్టింగులకే ఇ స్తున్నామని మాట వరుసకైనా చెప్పలేదన్న ఆవేదన ఆయనలో ఉందని అనుచరులు చెబుతున్నారు.
కాగా ఇప్పటికే నకిరేకల్ టికెట్ ఇస్తారన్న ఆశతో ఉన్నా మాజీ ఎమ్మెలే వేముల వీరేశానికి బీఆర్‌ఎస్ మొండిచేయి చూపడంతో ఆ పార్టీకి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే. నకిరేకల్‌లో ఆత్మీయ సమ్మేళనంలో ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వారం రోజుల్లో ఏ పార్టీలో చేరాలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.
చదవండి: అసంతృప్తులకు గాలం
నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు:
వైరా: ‘నేను నమ్ముకున్న నాయకులు న్యాయం చేయలేదు. నాకు టికెట్ రాకపోవడంతో నియోజకవర్గ వ్యాప్తంగా కార్యకర్తలు బరువెక్కిన హృదయంతో ఉన్నారు. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటా’అని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. బుధవారం ఆయన వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని, అయితే వృద్ధాప్యంలో ఉన్నందున వద్దన్నానని తెలిపారు.
తనకు ఎలాంటి అసంతృప్తి లేదని, అందరితో కలిసి పని చేస్తానని, వైరా టికెట్ కేటాయించిన మదన్‌లాల్ గెలుపు కోసం కృషి చేస్తానని అన్నారు. సీఎం కేసీఆర్ భగవంతుడి కంటే ఎక్కువని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నారని చెప్పారు. చీకటి తర్వాత వెలుగు వస్తుందంటూ కేసీఆర్ ఆశీర్వాదం ఎప్పటికైనా తనకు లభిస్తుందని దీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment