ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: కరోనా కంటే ఎక్కువగా ఫంగస్ కేసులు జనాలను తీవ్రంగా భయపెడుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్నామని సంతోషించే లోపలే ఫంగస్ వ్యాప్తి ప్రాణాలకు మీదకు తెస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా బ్లాక్, వైట్, యెల్లో అంటూ వేర్వేరు ఫంగస్‌లను గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా వైట్ ఫంగస్ బారిన పడిన వ్యక్తిలో అరుదైన లక్షణాలు కనిపించాయి. ఫంగస్ వల్ల బాధితురాలి చిన్న పేగులు, పెద్ద పేగుల్లో రంధ్రాలు ఏర్పడ్డాయని వైద్యులు తెలిపారు. ఈ తరహా కేసు ప్రపంచంలో ఇదే మొదటిదన్నారు.
ఆ వివరాలు..ఈ నెల 13న 49 ఏళ్ల మహిళ ఒకరు తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులతో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆస్పత్రిలో చేరింది. ఇక బాధితురాలు క్యాన్సర్‌తో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరడానికి వారం రోజుల ముందే ఆమెకు కీమో థెరపీ చేయించారు. ఆ తర్వాత ఆమె కడుపునొప్పితో బాధపడుతుండటంతో గంగా రామ్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డాక్టర్లు ఆమెకి సీటీ స్కాన్ చేయగా పేగులకు రంధ్రాలు పడినట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా సర్ గంగా రామ్ ఆసుపత్రిలోని గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ ప్యాంక్రియాటికోబిలియరీ సైన్సెస్ విభాగానికి చెందిన డాక్టర్ (ప్రొఫెసర్) అమిత్ అరోరా మాట్లాడుతూ.. ‘‘నాలుగు గంటల పాటు సాగిన శస్త్రచికిత్స ద్వారా, మహిళ ఆహార పైపు, చిన్న పేగు, పెద్ద పేగులలోని రంధ్రాలు మూసివేశాము. బాధితురాలి శరీరం లోపల ద్రవం లీకేజీని ఆపడానికి ఈ శస్త్రచికిత్స సహాయపడుతుంది’’ అని తెలిపారు.
డాక్టర్ అరోరా మాట్లాడుతూ స్టెరాయిడ్ వాడకం వల్ల ఇటీవల పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల్లో కొన్ని చోట్ల పేగులకు రంధ్రాలు పడిన కేసులు కొన్ని వెలుగు చూశాయి. అయితే వైట్ ఫంగస్ కేసులో.. పేగుల్లో రంధ్రాలు ఏర్పడిన కేసు ప్రపంచంలో ఇది మొదటిది అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment