
సాక్షి, హైదరాబాద్: కరోనా బారిన పడ్డ కొంతమందిలో బయటపడుతున్న బ్లాక్ ఫంగస్ వ్యాధి ‘నల్ల దళారీ’లకు కొత్త వ్యాపారంగా మారింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే యాంఫైట్ 50 ఎంజీ ఇంజెక్షన్లనూ అదేబాట పట్టిస్తున్నారు. ఇలా బ్లాక్ మార్కెట్‌లో మందులు విక్రయిస్తున్న ఓ నలుగురిని నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఐదు యాంఫైట్ ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
పీర్జాది గూడకు చెందిన నరిమెల్ల యాదయ్య మెడిసిన్స్ సప్లయర్‌గా, బండ్లగూడకు చెందిన పి.సతీశ్, కోఠికి చెందిన సాయికుమార్‌లు మెడికల్ షాపుల్లో, మణికొండకు చెందిన బి.రాజశేఖర్‌రెడ్డి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పని చేస్తున్నారు. ఇటీవల బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండటంతో దీనికి వాడే ఇంజెక్షన్లకు డిమాండ్ రావడంతో యాంఫైట్ ఇంజెక్షన్లను అక్రమంగా సేకరించారు. ఒక్కొక్కటి రూ.7,858 ఖరీదు చేసే వాటిని రూ.50 వేలకు అమ్మడానికి సిద్ధమయ్యారు. దీనిపై సమాచారం అందడంతో పోలీసులు వలపన్ని నలుగురినీ పట్టుకుని అరెస్టు చేశారు.