![Rajasthan Declares Black Fungus An Epidemic In The State - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/20/Black-Fungus_0.jpg.webp?itok=Ue551aCA)
జైపూర్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపెడుతోంది. కొన్ని లక్షలమంది ఈ వైరస్ బారినపడ్డారు, వారిలో కొంతమంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి మహమ్మారులు మానవాళికి కొత్తకాదు. మన పూర్వీకులు ఎదుర్కొన్న అంటురోగాల్లో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్న విషయం తెలిసిందే.అయితే మహమ్మారి రూపంలో ప్రపంచాన్ని భయపెట్టిన కొన్ని అంటువ్యాధులు కాలక్రమేణా అంతమైపోయాయి. బ్యుబోనిక్ ప్లేగు, మశూచి, కలరా, ఇన్‌ఫ్లుయెంజా, సార్స్ వ్యాధులు వల్ల ఎంతో మంది మృతి చెందారు. ఇక దేశమంతా కరోనా వైరస్ ఉధృతితో వణుకుతుంటే మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మ్యుకర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) వ్యాధి లక్షణాలు కరోనా బాధితుల్లో కనిపించడం కలవరపెడుతోంది.
తాజాగా బ్లాక్ ఫంగస్‌ను(మ్యూకోర్‌మైకోసిస్‌ను) రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో దాదాపు 100మంది బ్లాక్‌ఫంగస్ బారిన పడినట్టు గుర్తించారు. వీరికి చికిత్స అందించేందుకు జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించారు. ‘రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చాం’ అని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తెలిపారు.
బ్లాక్ ఫంగస్, కరోనా వైరస్‌కు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అరోరా తెలిపారు. మధుమేహ రోగులు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఢిల్లీలో 75, ఉత్తరప్రదేశ్‌లో 50, మధ్యప్రదేశ్ 19, ఉత్తరాఖండ్‌లో 38, హర్యానాలో 115, మహారాష్ట్రలో 201 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు తెలుస్తోంది.
(చదవండి: వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!)
Comments
Please login to add a commentAdd a comment