epidemic
-
ముగింపు దశకు కరోనా! అయినా నిర్లక్ష్యం వద్దు.. బూస్టర్ డోసు తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న తరుణంలో ఈసీఎంఆర్ మాజీ సైంటిస్ట్ డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ కీలక విషయాలు వెల్లడించారు. కరోనా వైరస్ ముగింపు దశకు చేరుకుందని, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావాల్సిన అవసరంలేదని చెప్పారు. అయితే వైరస్‌ను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తలు మాత్రం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వివిధ రకాలుగా రూపాంతరం చెంది(మ్యుటేషన్లు) బలహీన పడుతోందని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. ఇప్పుడు వైరస్ సోకిన వారికి స్వల్ప లక్షణాలే కన్పిస్తున్నాయని, తీవ్ర అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సిన సందర్భాలు చాలా తక్కువగా ఉంటున్నాయని చెప్పారు. ఇంకా కొన్ని మ్యూటేషన్ల అనంతరం కరోనా పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్‌పై ఈ ఏడాది జనవరిలో తొలిసారి వెలుగుచూసిన ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ కూడా అంత ప్రమాదకరం కాదని డా.గంగాఖేడ్కర్ పేర్కొన్నారు. గత మూడు నెలల్లో దేశంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనం అన్నారు. 'XBB.1.16 అనేది రీకాంబినెంట్ వైరస్. ఇది మానవ శరీరంలో అనుకోకుండా తయారవుతుంది. రెండు వేర్వేరు వేరియంట్లు మానవ శరీరంలోకి ప్రవేశించినప్పుడు, పునరుత్పత్తి సమయంలో జన్యు పదార్ధం మిక్స్అప్ అయినప్పుడు అవి తయారవుతాయి.' అని ఆయన వివరించారు. బూస్టర్ డోసులు, మాస్కులు దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నందున ఇంకా బూస్టర్ డోసు టీకా తీసుకోని వారు, ఆలస్యం చేసిన వారు ఎవరైనా ఉంటే వెంటనే తీసుకోవాలని డాక్టర్ సూచించారు. అలాగే ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని చెప్పారు. పిల్లలు అనారోగ్యానికి గురైతే వాళ్లను స్కూళ్లకు అసలు పంపవద్దని తల్లిదండ్రులకు సూచించారు. ఒకవేళ వారికి సోకింది కరోనా అయితే అది ఇతర విద్యార్థులకు, టీచర్లకు, సిబ్బంది సోకి మరింత మందికి వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. చదవండి: మాక్‌డ్రిల్‌తో అప్రమత్తమైన భారత్.. కొత్తగా 5,676 కేసులు, 15 మరణాలు -
షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..!
బీజింగ్: కరోనా కోరల నుంచి బయటపడిన ప్రపంచంపై మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతాయని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు. ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు. చైనాలో కరోనా ఆంక్షలు ఇటీవలే ఎత్తివేశారు. దీంతో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అక్కడ రోజులు కాదు గంటల్లోనే వైరస్ బాధితులు రెట్టింపు అవుతున్నారు. ఆస్ప్రత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే 90 రోజుల్లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చైనాలో అత్యధికంగా 60 శాతం మందికి వైరస్ సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా ప్రపంచ దేశాల్లో 10 శాతం మంది వైరస్ బారిన పడవచ్చని చెబుతున్నారు. కొత్త సంవత్సరం సమయానికి చైనాలో మరో కరోనా వేవ్ వస్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి కరోనా మూడో వేవ్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయన్నారు. చదవండి: మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు.. -
రష్యాను వణికిస్తున్న ‘ఫ్లూ’ భయం.. ఇప్పటికే అనారోగ్యంతో పుతిన్! బంకర్లోనే
మాస్కో: రష్యాను ‘ఫ్లూ’ భయం వణికిస్తోంది. దేశంలో చాలా ప్రాంతాల్లో ఫ్లూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వ అధికార యంత్రాంగంలో చాలామంది అంటువ్యాధి బారినపడినట్లు తెలిసింది. అధ్యక్ష భవనంలో అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో కలిసి పనిచేసే సిబ్బందికి సైతం ఫ్లూ సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా పుతిన్‌ను అధికారులు రష్యా తూర్పు ప్రాంతంలోని ఉరాల్ పర్వతాల వెనుక ఉన్న ఓ బంకర్‌కు తరలించినట్లు సమాచారం. ప్రస్తుతం పుతిన్ అక్కడే ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం వేడుకలను ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి బంకర్లోనే జరుపుకుంటారని ఓ మీడియా సంస్థ పేర్కొంది. 70 ఏళ్ల పుతిన్ ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్యంపై మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఏడాది రష్యా పార్లమెంట్ ఎగువ సభ డ్యుమాలో తన ప్రసంగాన్ని రద్దు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రతి ఏటా సంవత్సరం ఆఖరున నిర్వహించే మీడియా సమావేశాన్ని పుతిన్ రద్దు చేసుకున్నారని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు. ఇందుకు గల కారణాలను మాత్రం ఆయన బహిర్గతం చేయలేదు. పుతిన్ ఇలా మీడియా సమావేశాన్ని రద్దు చేసుకోవడం గత పదేళ్లలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. అయితే, ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా వైఫల్యానికి సంబంధించి విలేకరులు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి లేకే ఆయన వార్షిక మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కరోనా తర్వాత ప్రపంచానికి మరో ఉపద్రవం.. అన్నింటికంటే డేంజర్..?
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి కకావికలం చేసిన విషయం తెలిసిందే. 66 లక్షల మందిని బలిగొన్న ఈ వైరస్ కోట్ల మంది జీవితాలను నాశనం చేసింది. శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కనిపెట్టడంతో ప్రపంచం కోవిడ్ కోరల నుంచి బయటపడింది. అయితే రాబోయో రోజుల్లో కరోనాకు మించిన ప్రాణాంతక వైరస్ ప్రపంచంపై పంజా విసరబోతుందని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. మార్బర్గ్ అనే వైరస్ కేసులు పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో వెలుగుచుశాయని, ఈ రోగులకు సరైన చికిత్స అందించి.. వైరస్‌ను కట్టడి చేయలేకపోతే మరో మహమ్మారిలా విశ్వమంతటా వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ప్రస్తుతానికి దీనికి 'డిసీజ్-ఎక్స్' గా నామకరణం చేసింది. డిసీజ్-ఎక్స్ ఎబోలా కంటే చాలా ప్రమాదకరం. ఈ వ్యాధి సోకినవారిలో 80 శాతం మంది రోగులు మరణిస్తారు. ఇప్పటికే కోట్ల మంది కరోనా బారినపడ్డారు. వారిలో రోగ నిరోధక శక్తి తగ్గింది. ఈ సమయంలో డిసీజ్-ఎక్స్ ఎటాక్ చేస్తే వాళ్లు తట్టుకోలేరని, కరోనా కంటే ఊహించని ప్రాణనష్టం సంభవిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మందు లేదు.. డిసీజ్-ఎక్స్‌కు ఇప్పటివరకు వ్యాక్సిన్ గానీ, ఔషధాలు గానీ అందుబాటులో లేవు. దీనికి సంబంధించిన సమాచారం కూడా లేకపోవడంతో శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు జరుపుతున్నారు. ఒకవేళ ఇది మరో మహమ్మారిలా పరిణమిస్తే మానవాళి మనుగడకే ప్రమాదమని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్తలు ఈ వైరస్‌కు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ ఇంకా పూర్తిగా కోలేదు. అన్ని దేశాల్లో ఇప్పటికీ కొత్త కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇలాంటి తరుణంలో డిసీజ్-ఎక్స్ కేసులు పెరిగి విశ్వమంతా వ్యాపిస్తే.. ఆ పరిస్థితి ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. చదవండి: ఎలాన్ మస్క్ తీరుతో అసంతృప్తి.. ట్విట్టర్‌కు అధికార పార్టీ గుడ్‌బై.. -
ఐహెచ్ఐపీతో అంటువ్యాధులకు చెక్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అంటువ్యాధుల వ్యాప్తిని నివారించేందుకు వైద్య శాఖ చర్యలు చేపట్టింది. ఇంటిగ్రేటెడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ప్లాట్‌ఫాం(ఐహెచ్ఐపీ)ను వినియోగించడం ద్వారా అంటువ్యాధులు విస్తరించకుండా చూస్తోంది. డెంగీ, మలేరియా, చికున్ గున్యా, డయేరియా తదితర 33 రకాల కేసుల వివరాలను ఐహెచ్‌ఐపీలో నమోదు చేయించి.. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలోని 7,305 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 1,956 ప్రభుత్వాస్పత్రులు, 1,910 ప్రభుత్వ ల్యాబ్‌లను ఐహెచ్ఐపీ పోర్టల్‌కు మ్యాపింగ్ చేశారు. తొలుత ఏఎన్ఎం స్థాయిలో అనుమానిత లక్షణాలున్న వారి వివరాలను నమోదు చేస్తున్నారు. రెండో స్థాయిలో ఆస్పత్రిలో, మూడో స్థాయిలో ల్యాబ్‌లో నిర్ధారణ అయిన కేసుల వివరాలను ఎప్పటికప్పుడు పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. గత వారం రోజుల్లో విలేజ్ క్లినిక్ స్థాయిలో 94 శాతం, ఆస్పత్రుల్లో 98 శాతం, ల్యాబ్‌లలో 97 శాతం కేసుల వివరాలను పోర్టల్‌లో నిక్షిప్తం చేశారు. ఈ వివరాల ఆధారంగా అధికంగా అంటు వ్యాధులు నమోదైన ప్రాంతాలను వైద్య శాఖ హాట్ స్పాట్లుగా గుర్తిస్తోంది. ఆయా ప్రాంతాల్లో అంటువ్యాధుల నియంత్రణకు చర్యలు చేపడుతోంది. సచివాలయాల మ్యాపింగ్కూ చర్యలు.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎంలను నియమించింది. వీరి ద్వారా ప్రజలకు ఆరోగ్య కార్యక్రమాలను మరింత చేరువ చేసింది. ఈ క్రమంలో ఐహెచ్‌ఐపీలో సచివాలయాలను కూడా మ్యాపింగ్ చేస్తే.. ఆ స్థాయిలోనే అంటువ్యాధుల వ్యాప్తిని గుర్తించి, నియంత్రణ చర్యలు చేపట్టవచ్చని వైద్య శాఖ భావిస్తోంది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యాధికారులు ఇటీవల కేంద్ర వైద్య శాఖ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కేంద్ర వైద్య శాఖ నుంచి సానుకూల స్పందన లభించినట్లు అధికారులు చెప్పారు. వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ఏడీ డాక్టర్ రామిరెడ్డి మాట్లాడుతూ.. ఐహెచ్ఐపీ వల్ల అంటువ్యాధులు విస్తరించకుండా అరికట్టవచ్చన్నారు. అలాగే ప్రస్తుత సీజన్లో నమోదైన కేసుల ఆధారంగా.. వచ్చే సీజన్లో వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కార్యాచరణ కూడా రూపొందించుకోవచ్చని పేర్కొన్నారు. -
ఆరోగ్య కార్యకర్తలకు భద్రత కల్పించండి
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడిలో కీలకంగా పని చేస్తున్న ఆరోగ్య కార్యకర్తల భద్రత, సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది. అంటువ్యాధుల చట్టాన్ని(సవరణ) కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. కరోనా కాలంలో ప్రజారోగ్య పరిరక్షణలో హెల్త్‌కేర్ వర్కర్స్ పాత్ర విస్మరించలేనిదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ప్రశంసించారు. వారి భద్రత, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అదనపు చీఫ్ సెక్రెటరీలకు, ప్రిన్సిపల్ సెక్రెటరీలకు, హెల్త్ సెక్రెటరీలకు లేఖ రాశారు. కొన్ని ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలపై దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోందని, ఇది చాలా బాధాకరమని అన్నారు. పనిచేసే చోట, నివాసం ఉండే చోట వారికి పూర్తి భద్రత కల్పించాలని కోరారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో ఇటీవల వైద్యులు, నర్సులపై భౌతిక దాడులు జరిగాయని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిణామాలు ఆరోగ్య కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలపై దాడికి దిగేవారిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలంటూ అంటువ్యాధుల చట్టం–1897లో సవరణ చేస్తూ గత ఏడాది ఏప్రిల్ 22న ఆర్డినెన్స్ తీసుకొచ్చామని, దీన్ని ఒక చట్టంగా సెప్టెంబర్ 29న నోటిఫై చేశామని లవ్ అగర్వాల్ గుర్తుచేశారు. ఈ చట్టం కింద హెల్త్ కేర్ సిబ్బందికి, వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. చదవండి: సీఎం కుమారుడిపై చర్యలు తీసుకోండి -
వందేళ్లుగా వణికిస్తున్నాయి.. నిలబడుతూనే ఉన్నాం
కొవిడ్-19 మహమ్మారితో మానవాళి సహజీవనం ఏడాదిన్నర పూర్తి చేసుకుంది. వైరస్ తీరు తెన్నులు గందరగోళంగా ఉండడంతో సరైన మందు కనిపెట్టడం పరిశోధకులకు కష్టంగా మారుతోంది. అయితే శాస్త్ర విజ్ఞానం ఇంతగా అభివృద్ధి చెందని రోజుల్లో ప్రమాదకరమైన అంటువ్యాధుల్ని, మహమ్మారుల్ని ఎదుర్కొన్నాం. తట్టుకుని నిలబడగలిగాం. స్పానిష్ ఫ్లూ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్‌గా స్పానిష్ ఫ్లూ చెప్తుంటారు. 19వ శతాబ్దం ప్రారంభంలో విజృంభించిన ఈ వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా యాభై కోట్ల మందికి సోకినట్లు ఒక అంచనా. అదే విధంగా కోట్ల సంఖ్యలో మనుషులు స్పానిష్ ఫ్లూకి బలయ్యారు. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో మనిషి అపరిశుభ్రమైన అలవాట్ల నుంచి పుట్టిన ఈ వైరస్.. చాలా వేగంగా ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందింది. భారత సైనికుల ద్వారా 1918లో బాంబే(ఇప్పుడు ముంబై) నుంచి తొలి కేసు మొదలై.. రైల్వే ప్రయాణాల వల్ల మన దేశంలో వేగంగా విస్తరించింది(బాంబే ఫీవర్‌గా పిలిచారు). బ్రిటిష్ ప్రభుత్వ నిర్లక్క్ష్యంతో కోట్ల మందికి ఈ వైరస్ సోకింది. చివరికి.. విమర్శలతో మెరుగైన మందులు తీసుకొచ్చి వైద్యం అందించడం మొదలుపెట్టాక పరిస్థితి రెండేళ్లకు అదుపులోకి వచ్చింది. కలరా కలరా మహమ్మారి తొలిసారి 1817లో విజృంభించింది. రష్యాలో మొదలైన ఈ మహమ్మారి శరవేగంగా ప్రపంచమంతటా విస్తరించింది. దాదాపు 150 ఏళ్ల వ్యవధిలో ఏడుసార్లు కలరా మహమ్మారి మానవాళిపై పంజా విసిరింది. 1961 టైంలో ఇండోనేషియా నుంచి ఎల్ టొర్ స్ట్రెయిన్ మొదలై.. మూడేళ్ల తర్వాత మన దేశం మీద తీవ్ర ప్రభావం చూపెట్టింది. గంగా పరివాహక ప్రాంతంలో అపరిశుభ్రత, కలకత్తా(కొల్కట్టా) వాతావరణం ఈ కలరా విజృంభణకు దారితీసింది. మరణాల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ.. దీని కట్టడికి ఏడాదిపైనే సమయం పట్టింది. ఇక కలరా నివారణకు వ్యాక్సిన్‌ను 1885లోనే తయారు చేసినా.. ఈ మహమ్మారి విజృంభణ ఆగకపోవడం విశేషం. కలరా కారణంగా 1817-1923 మధ్య కాలంలో దాదాపు 3.5 కోట్ల మంది మరణించారు. ఇప్పటికీ కలరా ఉనికి ఉన్నప్పటికీ.. వైద్య రంగం అభివృద్ధితో తారా స్థాయిలో అది వ్యాపించడం లేదు. స్మాల్ఫాక్స్ అంటువ్యాధి మశూచి. ఈజిప్ట్‌ల కాలం నుంచే ఉందని భావిస్తున్న ఈ వ్యాధిని..1520లో అధికారికంగా గుర్తించారు. 1980లో నిర్మూలించబడిన వ్యాధుల జాబితాలో ప్రపంచ ఆరోగసంస్థ చేర్చింది. ఇక మన దేశంలో 1974 జనవరి నుంచి మే మధ్య ఐదు నెలలపాటు స్మాల్ఫాక్స్తో 15,000 మంది చనిపోయారు. తట్టుకోగలిగిన వాళ్లలో చాలా మంది చూపు పొగొట్టుకున్నారు. కకావికలం చేసిన ఈ అంటువ్యాధి.. చివరికి డబ్ల్యూహెచ్‌వో చొరవతో అదుపులోకి తేగలిగారు. 1977లో మన దేశంలో మశూచిని అదుపులోకి తేగలిగారు. అయితే మశూచికి 1796లోనే వ్యాక్సిన్(ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టాడు) తయారుచేసినప్పటికీ.. పూర్తిగా నిర్మూలించడానికి రెండు వందల సంవత్సరాలకు పైనే పట్టడం విశేషం. సూరత్ ప్లేగు భయంకరమైన అంటువ్యాధి. బ్యాక్టీరియా ద్వారా ఎలుకలు వాహకంగా ఈ అంటువ్యాధి వ్యాపిస్తుంది. 1994లో గుజరాత్ సూరత్‌లో ప్లేగు కేసులు మొదలయ్యాయి. తెరిచి ఉన్న నాలలు, చెత్త కుప్పలు, చచ్చిన ఎలుకల ద్వారా ఇది మొదలైంది. దీంతో లక్షల మంది పట్టణం వదిలి వెళ్లిపోయారు. ఇది వ్యాధి మరింత వ్యాపించడానికి కారణమైంది. ఆగష్టు నుంచి అక్టోబర్ మధ్యే దీని విజృంభణ కొనసాగింది. అయితే ఇది ఎక్కువగా విస్తరించకపోవడంతో 52 మంది మాత్రమే చనిపోయినట్లు లెక్కలు చెప్తున్నాయి. ఇది ఇతర దేశాలకు వ్యాపించినట్లు కూడా ఎక్కడా ఆధారాలు లేవు. పైగా దీని వ్యాప్తి విషయంలో నెలకొన్న గందరగోళం నడుమే.. ఈ వ్యాధి కనుమరుగుకావడం విశేషం. డెంగ్యూ, చికున్‌గున్యా 1635లో వెస్టిండీస్‌లో మొదటిసారిగా డెంగ్యూను అంటువ్యాధిగా గుర్తించారు. చికున్‌గున్యా కేసుల్ని 1952లో టాంజానియాలో గుర్తించారు. ఇక 2006లో ఒకేసారి డెంగ్యూ, చికున్‌గున్యా వ్యాధులు రాష్ష్ర్టాలను అతలాకుతలం చేశాయి. దోమల ద్వారా సంక్రమించే ఈ వ్యాధులు.. ఢిల్లీతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్(ఉమ్మడి) ఎక్కువ ప్రభావం చూపెట్టాయి. 2006లో భారత్‌లో అధికారికంగా డెబ్భై వేలకుపైగా డెంగ్యూ కేసులు నమోదు కాగా, 50 మరణాలు సంభవించాయి. దేశంలో పదకొండు లక్షల చికున్‌గున్యా కేసులు నమోదుకాగా.. ప్రభుత్వం మాత్రం మరణాల లెక్క సున్నా అని చెప్పడం విమర్శలకు దారితీసింది. ఎన్సెఫలిటిస్(మెదడువాపు) జపనీస్ ఎలిటిస్(జేఈ) 1871లో జపాన్‌లో మొదటి కేసును గుర్తించారు. ఎక్యుట్ ఎస్పెఫలిటిస్ సిండ్రోమ్(ఎఈఎస్) కేసును 1955లో మద్రాస్ రీజియన్‌లో గుర్తించారు. 1978 నుంచి పాతిక వేలమంది పిల్లల ప్రాణాల్ని బలిగొన్న వ్యాధి ఇది. 2017లో గోరఖ్‌పూర్(యూపీ) నుంచి వీటి విజృంభణ ఎక్కువైంది. దోమల వల్ల వైరల్ ఇన్ఫెక్షన్ సోకి.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది.ఆ ఏడాదిలో మొత్తం 4,759 ఎఈఎస్ కేసులు నమోదు కాగా, 595 మరణాలునమోదు అయ్యాయి. జేఈ కేసుల సంఖ్య 677 కాగా, 81 మరణాలు సంభవించాయి. చికిత్స ద్వారానే ఈ వ్యాధిని అదుపు చేయడం విశేషం. నిఫా వైరస్ జునోటిక్(జంతువుల ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతుంది) వైరస్. మనుషులతో పాటు పందులపైనా ఈ వైరస్ ప్రభావం ఉంటుంది. నిఫా వైరస్ గబ్బిలాల(ఫ్రూట్ బ్యాట్స్) ద్వారా వ్యాప్తి చెందుతుంది. 1998లో మలేషియాలో నిఫామొదటి కేసును గుర్తించారు. అక్కడి సుంగై నిఫా అనే ఊరి పేరు మీదుగా దీనికి ఆ పేరు పెట్టారు. 2018 మే నెలలో కేరళలో నిఫా కేసులు మొదలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో 18 మంది చనిపోగా.. కేవలం నెలలోనే పరిస్థితిని పూర్తిగా అదుపు చేసుకోగలిగింది కేరళ. దీనికి వ్యాక్సిన్ లేదు. అప్రమత్తంగా ఉండడమే మార్గం. సార్స్ సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. కరోనా వైరస్ రకాల్లో ఒకటి సార్స్. 21వ శతాబ్దంలో వేగంగా వ్యాపించే జబ్బుగా గుర్తింపు దక్కించుకుంది. 2002లో చైనా ఫొషన్ నుంచి మొదలైంది. తుంపర్ల ద్వారా ఈ వైరస్ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 2003లో సార్స్(సార్స్ కోవ్) మన దేశంలో మొదటి కేసు నమోదు అయ్యింది. మొత్తం మూడుకేసులు నమోదుకాగా.. అంతా కోలుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో దాదాపు ఎనిమిది వేల మంది సార్స్ బారినపడగా.. 774 మంది మృతిచెందారు. దీని కొత్త స్ట్రెయినే ఇప్పడు కరోనా వైరస్(సార్స్ కోవ్ 2)గా విజృంభిస్తోంది. -
ఆందోళనకరంగా బ్లాక్ ఫంగస్!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆరోగ్య వ్యవస్థకు మరో వ్యాధి సవాల్ విసురుతోంది. కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో ఎక్కువగా కనపడుతున్న మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) ఇప్పుడు దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్, హరియాణాలతో పాటు మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ బారినపడిన వారిని ఇప్పటికే గుర్తించారు. పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల దృష్ట్యా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్తాన్, హరియాణా, ఒడిశా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో దీనిని అంటువ్యాధుల చట్టం క్రింద గుర్తించదగ్గ వ్యాధిగా ప్రకటించాయి. ఈ వ్యాధికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక అడ్వైజరీని జారీ చేసింది. అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసుల దృష్ట్యా ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్– 1897 ప్రకారం దీనిని రాష్ట్రంలో గుర్తించదగిన వ్యాధిగా (నోటిఫైయబుల్ డిసీజ్) వర్గీకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కోవిడ్ రోగుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని, మరణాలను పెంచుతోందని తెలిపింది. ‘మ్యూకోర్మైకోసిస్ రూపంలో కొత్త సవాల్ ఎదురవుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. స్టెరాయిడ్లు ఉపయోగించిన, మధుమేహం నియంత్రణలో లేని కోవిడ్–19 రోగుల్లో ఇది ప్రధానంగా కనిపిస్తోంది‘ ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది. అంతేగాక బ్లాక్ ఫంగస్ కేసులను నిర్ధారించిన వెంటనే ఆరోగ్యశాఖకు తప్పనిసరిగా రిపోర్ట్ చేసేలా అన్ని హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలకు సూచించారు. వీటితోపాటు బ్లాక్‌ఫంగస్‌ను గుర్తించేందుకు, చికిత్స చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్ గతంలో విడుదల చేసిన గైడ్‌లైన్స్ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. రోగనిరోధక శక్తి బలహీనపడితేనే ముప్పు మ్యూకోర్మైసెట్స్గా పిలిచే శీలింధ్రాల (ఫంగస్) కారణంగా బ్లాక్ ఫంగస్ వస్తుంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ ఫంగస్ సాధారణంగానే ఉండేదే. మట్టిలో, కుళ్లిపోతున్న ఆకుల్లో, పేడకుప్పల్లో, కుళ్లుతున్న జీవవ్యర్థాల్లో ఇది ఉంటుంది. మామూలు పరిస్థితుల్లో మన రోగనిరోధక శక్తి దీన్ని సమర్థంగా అడ్డుకుంటుంది. అయితే కరోనా సోకిన వారిలో డెక్సామెథాసోన్ లాంటి స్టెరాయిడ్లు వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే షుగర్ నియంత్రణలో లేని వారిలో, సుదీర్ఘకాలం ఐసీయూలో ఉన్న కోవిడ్ రోగులకు బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఐసీయూలో వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్ అందించినపుడు తేమ కారణంగా కూడా బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంటుంది. నొసటి భాగంలో, ముక్కు, దవడ, కళ్ల భాగంలో ఫంగస్ పేరకుపోయి స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కళ్లకు, ఊపిరితిత్తులకు... కొన్నిసార్లు మెదడుకు కూడా ఇది పాకుతుంది. వ్యాధి ముదిరితే ముక్కు పైభాగంలో నల్లబారడం, చూపు మసకబారడం, లేదా రెండుగా కనపడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గినపుడు రక్తం పడటం జరుగుతుంది. కంటిచూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మహారాష్ట్రలో ప్రమాద ఘంటికలు దేశంలో అత్యధికంగా కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ ప్రభావం సైతం పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 1,500 మందిలో బ్లాక్ ఫంగస్‌ను గుర్తించగా అందులో 90 మంది ప్రాణాలు కోల్పోయారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తెలిపారు. బ్లాక్ ఫంగస్ నియంత్రణ అనేది ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాతాంశమని, అందువల్ల చికిత్సలో ఉయోగించే ఔషధాలను సరఫరా చేయాలని ఆయన ప్రధానిని కోరారు. అంతేగాక బ్లాక్ ఫంగస్‌ను గుర్తించిన 1,500 మందిలో సుమారు 500 మంది కోలుకున్నారని, సుమారు 850 మందికి చికిత్స కొనసాగుతోందని రాజేష్ తోపే పేర్కొన్నారు. ► రాజస్తాన్: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటివరకు 400 మంది కంటిచూపు కోల్పోయారు. కేవలం జైపూర్‌లోనే 148 మందికి సోకింది. జోధ్‌పూర్‌లో 100 కేసులు నమోదయ్యాయి. 30 కేసులు బికనేర్ నుంచి, మిగిలినవి అజ్మీర్, కోటా, ఉదయపూర్ నుండి రావడంతో బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధుల చట్టం క్రింద గుర్తించదగ్గ వ్యాధిగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. ► ఢిల్లీ: దేశ రాజధానిలో బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య 300 దాటింది. చికిత్సకు వాడే ఆంఫోటెరిసిన్–బి ఇంజక్షన్లకు తీవ్రకొరతను ఎదుర్కొంటోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో గత ఒక్కవారంలోనే 75–80మంది రోగులు చేరారు. వీరిలో 30 మంది పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. దేశ రాజధానిలో బ్లాక్ ఫంగస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మూడు ఆసుపత్రుల్లో బ్లాక్ ఫంగస్ చికిత్సకు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం ప్రకటించారు. ► మధ్యప్రదేశ్: గత 27 రోజుల్లోనే 239 మంది బ్లాక్ ఫంగస్ రోగులు భోపాల్‌కు చేరుకున్నారు. చికిత్స సమయంలో 10 మంది రోగులు మరణించగా, 174 మంది ఆసుపత్రులలో చేరారు. వీరిలో 129 మంది రోగులకు శస్త్రచికిత్స జరిగింది. అయితే, ప్రభుత్వం భోపాల్‌లో 68 మంది రోగులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 585 మంది రోగులను గుర్తించారు. ► హరియాణా: రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ రోగులు 316 మంది ఉన్నారు. దీనిని అంటువ్యాధుల చట్టం కింద గుర్తించదగ్గ వ్యాధిగా ప్రకటించిన మొదటి రాష్ట్రం హరియాణా. ► ఛత్తీస్‌గఢ్: రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్ రోగుల సంఖ్య 100కి చేరుకుంది. ఆస్పత్రుల్లో 92 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్‌లో అత్యధికంగా 69 మంది రోగులు ఉండగా, 19 మందికి ఆపరేషన్లు పూర్తయ్యాయి. వెలుగులోకి వైట్ ఫంగస్ బిహార్ రాజధాని పట్నాలో ఇప్పుడు వైట్ ఫంగస్ (కాన్డిడోసిస్) వెలుగులోకి వచ్చింది. బ్లాక్ ఫంగస్ కంటే ప్రమాదకరమైన వైట్ ఫంగస్ సంక్రమించిన నలుగురు రోగులను బిహార్‌లో గుర్తించారు. వైట్ ఫంగస్ ఊపిరితిత్తులతో పాటు, చర్మం, గోర్లు, నోటి లోపలి భాగాలు, కడుపు, మూత్రపిండాలు, జననేంద్రియాలు, మెదడుకు సోకుతుంది. వ్యాధి సోకిన నలుగురిలో కోవిడ్ రోగుల లక్షణాలే కనపడినా పరీక్షల్లో అది వైట్ ఫంగస్‌గా తేలిందని (వీరికి కరోనా లేదు) పాట్నా మెడికల్ కాలేజీ మైక్రోబయాలజీ చీఫ్ డాక్టర్ ఎస్.ఎన్.సింగ్ వెల్లడించారు. ఫంగస్ నిరోధక మందులు వాడితే వీరు కోలుకున్నారని తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వాడుతున్న వారికి దీనివల్ల ముప్పు ఎక్కువని వెల్లడించారు. ఆంఫోటెరిసిన్–బి ఉత్పత్తికి అనుమతులివ్వండి: ఐఎంఏ బ్లాక్ ఫంగస్ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్– బి ఇంజెక్షన్ల ఉత్పత్తికి అర్హత కలిగిన ఫార్మా సంస్థలను అనుమతించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రధాని మోదీని కోరింది. ఈ ఔషధానికి తీవ్ర కొరత ఉందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఒకే ఒక అమెరికా కంపెనీకి ‘ఆంఫోటెరిసిన్–బి’ని దిగుమతి చేసుకొనే లైసెన్స్ ఉందని ప్రధాని దృష్టికి తీసుకువచ్చింది. గత ఏడాది డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) పలు ఫార్మా కంపెనీలకు ఆంఫోటెరిసిన్– బి ఉత్పత్తికి అనుమతులిచ్చి తర్వాత ఉపసంహరించుకుందని, ఇప్పుడు పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రధాని వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని ఫార్మా కంపెనీలకు తాత్కాలిక అనుమతులిచ్చేలా డీజీసీఐకి సూచించాలని విజ్ఞప్తి చేసింది. -
Black Fungus: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు కరోనా నుంచి కోలుకున్న వారి పాలిట బ్లాక్ ఫంగస్ శాపంగా మారుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం బ్లాక్‌ఫంగస్‌ను ఎపిడమిక్ యాక్ట్ 1897లో చేర్చింది. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్‌ఫంగస్ (మ్యూకోర్‌మైకోసి)ను గుర్తించదగిన వ్యాధిగా ప్రకటించింది. ఈ మేరకు బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపించిన బాధితుల సమాచారాన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు వైద్య ఆరోగ్య శాఖకు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి ప్రతిరోజు రిపోర్టులు ఇవ్వాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలిచ్చారు. ఇక దేశ వ్యాప్తంగానే కాకుండా.. తెలుగు రాష్ట్రాల్లో కూడా బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. కాగా మ్యూకోర్మైకోసిస్ (బ్లాక్ ఫంగస్)ను రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే అంటువ్యాధిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు పలు సూచనలు కూడా చేసింది. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. (చదవండి: Koti ENT Hospital: బ్లాక్ ఫంగస్‌కు మెరుగైన చికిత్స) -
బ్లాక్ ఫంగస్: అంటువ్యాధిగా ప్రకటించిన రాజస్థాన్
జైపూర్: కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అందరినీ కలవరపెడుతోంది. కొన్ని లక్షలమంది ఈ వైరస్ బారినపడ్డారు, వారిలో కొంతమంది తమ ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఇలాంటి మహమ్మారులు మానవాళికి కొత్తకాదు. మన పూర్వీకులు ఎదుర్కొన్న అంటురోగాల్లో కొన్ని ఇప్పటికీ మనతోనే ఉన్న విషయం తెలిసిందే.అయితే మహమ్మారి రూపంలో ప్రపంచాన్ని భయపెట్టిన కొన్ని అంటువ్యాధులు కాలక్రమేణా అంతమైపోయాయి. బ్యుబోనిక్ ప్లేగు, మశూచి, కలరా, ఇన్ఫ్లుయెంజా, సార్స్ వ్యాధులు వల్ల ఎంతో మంది మృతి చెందారు. ఇక దేశమంతా కరోనా వైరస్ ఉధృతితో వణుకుతుంటే మరోవైపు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మ్యుకర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) వ్యాధి లక్షణాలు కరోనా బాధితుల్లో కనిపించడం కలవరపెడుతోంది. తాజాగా బ్లాక్ ఫంగస్‌ను(మ్యూకోర్‌మైకోసిస్‌ను) రాజస్థాన్ ప్రభుత్వం అంటువ్యాధిగా ప్రకటించింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో దాదాపు 100మంది బ్లాక్‌ఫంగస్ బారిన పడినట్టు గుర్తించారు. వీరికి చికిత్స అందించేందుకు జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ ఆస్పత్రిలో ప్రత్యేక వార్డును కేటాయించారు. ‘రాజస్థాన్ అంటువ్యాధుల నివారణ చట్టం 2020 కింద రాష్ట్రంలో దీనిని గుర్తించదగిన వ్యాధుల్లో చేర్చాం’ అని రాజస్థాన్ ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అఖిల్ అరోరా తెలిపారు. బ్లాక్ ఫంగస్, కరోనా వైరస్‌కు సమగ్రమైన, సమన్వయంతో కూడిన చికిత్స అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అరోరా తెలిపారు. మధుమేహ రోగులు బ్లాక్ ఫంగస్ బారినపడే అవకాశం అధికంగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఇప్పటివరకు ఢిల్లీలో 75, ఉత్తరప్రదేశ్‌లో 50, మధ్యప్రదేశ్ 19, ఉత్తరాఖండ్‌లో 38, హర్యానాలో 115, మహారాష్ట్రలో 201 మంది బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు తెలుస్తోంది. (చదవండి: వైరల్: శునకం యోగాసనాలు..నెటిజన్లు ఫిదా!) -
వైరస్ల పేరిట వెలసిన దేవతలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో మానవాళిని వదిలిపెట్టి పోయేలా కనిపించడం లేదు. ఇలాంటి అంటురోగాలు వందేళ్లకోసారి అన్నట్లు మానవాళిపై అనాదిగా దాడిచేస్తూ వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు శాస్త్ర విజ్ఞానం అంతగా పరిఢవిల్లలేదు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అంటు రోగాలను దేవతలుగా కొలిచేవారు. ‘మమ్ము విడిచి పో పొమ్ము’ అంటూ వేడుకునే వారు. 1897లో ‘ప్లేగ్’ మహమ్మారి ప్రబలినప్పుడు బెంగళూరులో ‘ప్లేగ్ అమ్మ’ పేరిట పలు ఆలయాలు వెలిశాయి. ప్లేగ్‌ను కన్నడ భాషలో ‘పిడుగు’, ‘కాడు’ అని పిలిచేవారు. కోయంబత్తూర్‌లో ‘ప్లేగ్ మరియమ్మాన్’ పేరిట ఆలయాలు వెలిశాయి. తమిళ భాషలో మరి అంటే వర్షం అని అర్థం. వర్షాల రాకతో అంటురోగాలు ప్రబలేవి కనుక వర్షం సూచనతో మరియమ్మార్ అని పేరు పెట్టి ఉంటారు. ప్లేగ్‌ను తమిళంలో ‘వాతాగళ్, కొల్లాయ్ నాయి’ అని కూడా వ్యవహరించేవారు. 150 సంవత్సరాల క్రితం ప్లేగ్ వల్ల అప్పటికీ ఎప్పుడు లేనంతగ ప్రాణ నష్టం సంభవించింది. అంతకుముందు ఎక్కువ మందికి కామన్‌గా వచ్చేది ‘స్మాల్‌పాక్స్’. దీన్ని తెలుగులో తట్టు పోసింది, తల్లి చేసిందీ అనే వాళ్లు. రుగ్వేద కాలం నుంచి ఈ స్మాల్‌పాక్స్ ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త వైఎల్ నేని తెలిపారు. రుగ్వేదంలో దీన్ని ‘శిపద’, శిమిద’గా పేర్కొన్నారట. శిమదను తీసుకొని పొమ్మంటూ నాడు ప్రజలు నదులకు పూజలు చేసేవారట. ఆప్టే సంస్కృత డిక్షనరీ ప్రకారం శిప అనే చర్మం అని అర్థం. చర్మంపై బొబ్బలు వచ్చే జబ్బునే తట్టు పోసింది అని అంటాం. నాడు దక్షిణాదిలో తట్టు తగ్గేందుకు ‘సితాల దేవి’ని పూజించేవారని చారిత్రక, పౌరానికి, తాంత్రిక పుస్తకాలు తెలియజేస్తున్నాయి. భావ మిశ్ర సంకలనం చేసిన ‘భావ ప్రకాష’ పుస్తకంలో ‘సితాల దేవి’ ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో భారత్‌లో అన్ని జబ్బులను ఆడ దేవతల పేరిటే వర్ణించేవారు, కొలిచేవారు. నాడు పిల్లల బాగోగులను కన్న తల్లులే చూసుకునేవారు కనుక, ఆడవాళ్లదే బాధ్యతగా భావించి ఆడ దేవతల పేర్లే పెట్టేవారేమో! 16వ శతాబ్దంలోనే ‘ది పాథాలోజీ ఆఫ్ సితాల’ అందుబాటులోకి వచ్చింది. అప్పుడు ఈ అంటురోగాలు రావొద్దంటూ ‘సీతాలష్టమీ’ జరిపేవారని రఘునందన్ భట్టాచార్య అనే బెంగాలీ రచయిత అందులో పేర్కొన్నారు. 1690లో, 1750, 1770 మధ్య సీతాలమ్మపై పలు కవిత్వాలు కూడా వచ్చాయి. ‘సీతాలమ్మ మంగళ్’ పేరిట నిత్యానంద చక్రవర్తి ఏకంగా స్త్రోత్రమే రాశారు. ఇక మహమ్మారి పదం హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి వచ్చింది. నేటి కరోనాను కూడా మమమ్మారిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. -
కీలక అవయవాలపై మహమ్మారి దాడి..
న్యూయార్క్ : కరోనా మహమ్మారి మానవ శరీరంలో ఊపిరితిత్తులు, గొంతు, గుండె, కాలేయం, మూత్రపిండాలు, పేగులు సహా అన్ని కీలక అవయవాలను ఇన్ఫెక్షన్కు గురిచేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. ఊపిరితిత్తులే కాకుండా అన్ని అవయవాలపై వైరస్ దాడి చేస్తుందని దీంతో కోవిడ్-19 లక్షణాలు సైతం బహుముఖంగా ఉంటాయని రెండు వేర్వేరు నివేదికలు వెల్లడించాయి. కరోనా రోగుల్లో లక్షణాలపై ఈ అథ్యయన వివరాలు స్పష్టతను తీసుకువచ్చాయి. మహమ్మారి దాడితో యువతలో స్ట్రోక్‌కు దారితీసేలా బ్లడ్ క్లాట్స్ ఏర్పడం, విపరీతమైన తలనొప్పి, కిడ్నీ వైఫల్యం వంటి తీవ్ర లక్షణాలు కపిపిస్తాయని వెల్లడించింది. శ్వాసకోశ వైరస్‌గా పేరొందిన కోవిడ్-19 రోగి నోటి నుంచి వెలువడే తుంపరల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి కొన్ని సార్లు డయేరియాకు దారితీయడంతో పాటు పేగు, జీర్ణవ్యవస్థలో ఇబ్బందుల వంటి ఇతర లక్షణాలతోనూ కూడి ఉంటుందని పరిశోధకులు పేర్కొన్నారు. రోగుల మలంలోనూ వైరస్ జాడను శాస్త్రవేత్తలు గుర్తించారు. సార్స్-కోవిడ్-2 వాహకంగా జీర్ణవ్యవస్థ మారవచ్చని నేచర్ మెడిసిన్‌లో ప్రచురితమైన జీఝూ, యూనివర్సిటీ ఆఫ్ హాంకాంగ్ పరిశోధకులు చేపట్టిన అథ్యయనం పేర్కొంది. ఇక మానవ శరీరంలోని కీలక అవయవాలన్నింటిలో వైరస్ ఆనవాళ్లను గుర్తించామని న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన మరో అథ్యయనం వెల్లడించింది. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకూ ఆ ఛాన్స్ -
కరోనా కట్టడి : త్వరలోనే మహమ్మారికి చెక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుదలలో కొద్దిరోజుల్లోనే నిలకడ రావచ్చని నీతిఆయోగ్ సభ్యులు వీకే పాల్ అన్నారు. తొలి, రెండు దశల్లో ఇచ్చిన సడలింపుల ఫలితాలను కొనసాగించేందుకే ప్రభుత్వం మరో రెండు వారాల పాటు లాక్డౌన్ పొడిగింపునకు మొగ్గుచూపిందని అన్నారు. వైరస్ చైన్‌ను నిలువరించడమే లాక్డౌన్ ఉద్దేశమని, మధ్యలోనే లాక్‌డౌన్‌ను విరమిస్తే ఆ ఉద్దేశం నీరుగారుతుందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో వైరస్ ఉనికి లేని ప్రాంతాల్లో అత్యంత జాగరూకతతో సడలింపులు ప్రకటించాలని కరోనా కట్టడికి సంబంధించి వైద్య పరికరాలు, నిర్వహణ ప్రణాళికా సాధికార గ్రూపునకు నేతృత్వం వహిస్తున్న పాల్ పేర్కొన్నారు. చదవండి : వీళ్లు మరణించే అవకాశం పదిరెట్లు ఎక్కువ భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో సమూహ వ్యాప్తి దశకు చేరుకుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నా ఇప్పటికీ నిరోధించే వ్యూహాన్ని అమలు చేయడం సాధ్యమేనని అన్నారు. లాక్‌డౌన్‌కు ముందు కరోనా కేసుల తీవ్రతతో పోలిస్తే ఇప్పుడు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల పెద్దగా లేదని చెప్పుకొచ్చారు. లాక్డౌన్ ముందు దశలో కేసుల సంఖ్య కేవలం ఐదు రోజుల్లో రెట్టింపవగా, తర్వాత ప్రతి మూడు రోజులకూ కేసులు రెట్టింపయ్యాయని, ఇప్పుడు అది 11-12 రోజులకు పెరిగిందని గుర్తుచేశారు. వైరస్ వ్యాప్తి మొత్తంగా తగ్గిందని, అయితే కేసుల సంఖ్యలో ఇంకా నిలకడ రాలేదని, ఇది ఎప్పటికైనా కుదురుకుంటుందని చెప్పారు. కాగా దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,980కి చేరుకోగా మరణాల సంఖ్య 1301కి పెరిగింది. -
ఈ యుద్ధంలో మీరే సారథులు
న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధానికి ప్రజలే సారథులని ప్రధాని మోదీ అభివర్ణించారు. ప్రజల సారథ్యంలోయుద్ధం సాగించడం ద్వారానే భారత్‌లో ఈ ప్రాణాంతక మహమ్మారిపై విజయం సాధ్యమవుతుందన్నారు. ప్రతీ నెల చివరి ఆదివారం రోజు చేసే రేడియో ప్రసంగ కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం ఆయన ప్రజలకు పలు సూచనలు చేశారు. కరోనా సంక్షోభం ముగిసిన తరువాత.. భవిష్యత్తులో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు.. ఈ మహమ్మారిపై ప్రజల నేతృత్వంలో భారత్ జరిపిన పోరును చరిత్ర చెప్పుకుంటుందని వ్యాఖ్యానించారు. నెల రోజులకు పైగా కొనసాగిన లాక్‌డౌన్‌కు కొన్ని మినహాయింపులు ఇచ్చిన నేపథ్యంలో.. ‘అతి విశ్వాసం వద్దు. మీ నగరానికో, మీ పట్టణానికో, మీ గ్రామానికో లేక మీ వీధిలోకో కరోనా ఇంకా రాలేదన్న ధీమాతో నిర్లక్ష్యంగా ఉండకండి’అని హెచ్చరించారు. వారికి నా నమస్సులు: కరోనా మహమ్మారిపై ముందుండి పోరాడుతున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు తదితర వర్గాలను ఆయన కొనియాడారు. ఆపద సమయంలో అన్నార్తులకు సాయమందిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తులను ప్రశంసించారు. ఆపత్కాలంలో అభివృద్ధి చెందిన దేశాలు సహా పలు ప్రపంచ దేశాలకు ఔషధ సాయం అందించిన భారత్.. ప్రపంచదేశాధినేతల ప్రశంసలు పొందిందని వివరించారు. యోగా తరువాత ఇప్పుడు ఆయుర్వేదం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు. రోగ నిరోధక శక్తిని పెంచుకునే అత్యుత్తమ మార్గాలుగా వాటిని ప్రపంచం ఇప్పుడు చూస్తోందన్నారు. వారియర్స్‌గా మారండి కరోనాపై పోరులో ప్రతీ ఒక్కరు తమ శక్తిమేరకు పోరాడుతున్నారని, ‘సర్వేజన సుఖినోభవంతు’భావన ఇప్పుడు ప్రపంచవ్యాప్తమయిందని పేర్కొన్నారు. కరోనాను కట్టడి చేసే కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొనేందుకు ‘కోవిడ్ వారియర్స్. గవ్.ఇన్’లో రిజిస్టర్ చేసుకోవాలని కోరారు. ఇప్పటికే ఈ పోర్టల్‌లో 1.25 కోట్ల మంది రిజిస్టరయ్యారన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం, అక్షయ త్రిథియ సందర్భంగా దేశ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ కన్నా ముందే ఈ కరోనా మహమ్మారి పీడ ప్రపంచానికి తొలగాలని, గతంలో మాదిరిగానే ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుందామని ఆకాంక్షించారు. వారిపై గౌరవం పెరిగింది పారిశుద్ధ్య కార్మికులు, ఇంటి దగ్గరి కిరాణా వర్తకులపై ప్రజల అభిప్రాయాల్లో ఇప్పుడు చాలా మార్పు వచ్చిందని ప్రధాని గుర్తు చేశారు. ప్రజల్లో పోలీసులపై ఉన్న తప్పుడు అభిప్రాయాలు కూడా తొలగిపోయాయని, వారిలోని మానవీయ కోణాన్ని ఇప్పుడు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. వచ్చే నెల మన్ కీ బాత్ నాటికి కరోనాపై పోరు విషయంలో ఒక శుభవార్త వినాలని తాను కూడా కోరుకుంటున్నానన్నారు. అయితే, అంతవరకు భౌతిక దూరం, మాస్క్ ధరించడం.. తదితర జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలన్నారు. -
మహమ్మారిని గుర్తించేలోపే..
న్యూఢిల్లీ : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 వ్యాప్తి, మహమ్మారి కదలికలు వైద్య నిపుణులకే అంతుచిక్కని క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత వైరాలజిస్ట్ పీటర్ కోల్చిన్స్కీ ఈ వైరస్‌పై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సార్స్-కోవిడ్-2 వైరస్‌ను చతురత కలిగిన దుష్టశక్తిగా ఆయన అభివర్ణించారు. ఎలాంటి లక్షణాలు లేకుండానే ఇది పెద్దసంఖ్యలో ప్రజలకు వ్యాపించి సైలెంట్ కిల్లర్‌గా మారుతుందని వ్యాఖ్యానించారు. సార్స్ వైరస్ కంటే ఇది ప్రమాదకరమైందని, కోవిడ్-19, సార్స్ వైరస్ల మధ్య కొంత సారూప్యత ఉందని చెప్పారు. సార్స్ కుటుంబానికే కోవిడ్-19 వైరస్ చెందినప్పటికీ దీని దూకుడు భిన్నంగా ఉంటుందని, సార్స్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించి బాధిత వ్యక్తిని గుర్తించే అవకాశం ఉంటుందని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ అన్నారు. గొంతు ద్వారా వ్యక్తి శరీరంలోకి ప్రవేశించే కోవిడ్-19 లక్షణాలు మాత్రం పెద్దగా కనిపించవని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి నోటి తుంపరల ద్వారా మరొకరి శరీరంలోకి గొంతు ద్వారా లోపలికి ప్రవేశిస్తుందని అన్నారు. ఈ వైరస్ సోకిన వ్యక్తికి పైకి ఎలాంటి లక్షణాలు కనిపించవని, జలుబు చేసి ఉంటుందనే భ్రమలో ఉంటారని అన్నారు. లక్షణాలు కనిపించి ఆస్పత్రికి తరలించేలోగానే జరగాల్సిన నష్టం జరుగుతుందని చెప్పారు. తనకు కోవిడ్-19 సోకిందని తెలియని బాధితుడు అప్పటివరకూ సన్నిహితంగా మెలిగిన వారందరికీ ఈ వ్యాధిని సంక్రమింపచేసే అవకాశం ఉందని ఆందోళణ వ్యక్తం చేశారు. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం, ఇతర రక్షణ పరికరాలతో మహమ్మారికి దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. చదవండి : లాక్డౌన్: పోలీసులతో కలబడ్డారు -
అమెరికాలో మూడు లక్షలు
వాషింగ్టన్/బీజింగ్/జెనీవా: ఇదీ కరోనా మహమ్మారి చేస్తున్న విలయం తాండవం. కోవిడ్–19 అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ మొత్తం 3 లక్షల కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 30 వేల కొత్త కేసులు నమోదైతే, అదే సమయంలో 1,500 మంది మరణించారు. ఈ పరిణామాలతో అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సిఫారసు చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలందరూ సాధారణ మాస్క్‌లే ధరించాలని చెప్పారు. తీవ్రంగా మాస్క్‌ల కొరత ఎదుర్కొంటున్న అమెరికా వైద్యసిబ్బందికి అవసరమయ్యే ఎన్95 మాస్క్‌లు పౌరులు వాడవద్దని సూచించారు. ఇంట్లో తయారు చేసుకునే మాస్క్ వేసుకోవాలన్నారు. అయితే తాను మాత్రం మాస్క్ వేసుకోనని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం. ఒక వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదని చెప్పగా, అమెరికా శాస్త్రవేత్తలు కేసుల సంఖ్య పెరగడానికి గాలి ద్వారా వైరస్ సోకుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. అమెరికాలో కేసులు ఇంచుమించుగా 3 లక్షలకి దగ్గర్లో ఉంటే, మృతులు 7 వేలు దాటేశాయి. గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలి: యూఎన్: కరోనా విశ్వరూపం చూపిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ అన్నారు. యుద్ధవాతావరణం ఉండి, పెద్ద సంఖ్యలో శరణార్థులు ఉన్న సిరియా, లిబియా, యెమన్ వంటి దేశాలకు వైరస్ విస్తరిస్తే ఎంతటి కల్లోలం రేగుతుందో ఊహించడానికే కష్టంగా ఉందని అన్నారు. కోవిడ్ మృతులకు చైనా నివాళి కోవిడ్‌తో మృతి చెందిన వారికి చైనా జాతియావత్తూ శనివారం నివాళులర్పించింది. కరోనా వైరస్‌పై తొలిసారిగా హెచ్చరించిన డాక్టర్ లీ వెన్లియాంగ్తో సహా 3,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారి మృతికి సంతాప సూచకంగా ప్రజలందరూ మూడు నిముషాలపాటు మౌనం పాటించారు. జాతీయ జెండాను అవనతం చేశారు. స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి పొడిగింపు స్పెయిన్‌లో కరోనా మృతుల సంఖ్య రాను రాను పెరిగిపోతూ ఉండడంతో జాతీయ అత్యవసర పరస్థితిని మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని సాంచెజ్ ప్రకటించారు. శనివారానికి ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 11,744కి చేరుకుంది. ఇక కేసుల సంఖ్య లక్షా 24 వేలు దాటేసింది. ఇటలీలో మరో 766 మంది మరణిస్తే కొత్త కేసుల సంఖ్య పెరుగుదల నాలుగు శాతం మాత్రమే నమోదైంది. జర్మనీలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 6,082 మందికి వైరస్ సోకింది. కువైట్‌లో శనివారం తొలి మరణం సంభవించింది. బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఒకేరోజు 708 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,313కి చేరుకుంది. న్యూయార్క్‌లో రెండున్నర నిమిషాలకో మరణం కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తున్న న్యూయార్క్‌లో అంతిమ సంస్కారానికి కూడా వేచి చూసే పరిస్థితులు నెలకొని ఉంటే మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇంచుమించుగా ప్రతీ రెండున్నర నిమిషాలకు ఒక మరణం నమోదవుతోందని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్యూ క్యూమో వెల్లడించారు. గత 24 గంటల్లో 562 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య దాదాపుగా 3 వేలకు చేరుకుంది. ఇక కేసుల సంఖ్య లక్ష దాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు: 11,69,262 మరణాలు: 62,730 కోలుకున్న వారు: 2,41,762 -
కోవిడ్.. జాతీయ విపత్తు
న్యూఢిల్లీ: కోవిడ్‌ను భారత్ జాతీయ విపత్తుగా ప్రకటించింది. వ్యాధి కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు హోంశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు శనివారం రాసిన ఒక లేఖలో పేర్కొంది. కోవిడ్ ఉధృతి నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించిన కారణంగా కేంద్రం దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలని నిర్ణయించినట్లు తెలిపింది. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద రాష్ట్రాలకు సాయం అందించేందుకు నిర్ణయించింది. కోవిడ్ చికిత్సకు ఆసుపత్రుల్లో చేరేవారి కోసం ఈ నిధులు రాష్ట్రాలకు అందిస్తామని, ఇందుకు తగిన రేట్లను ఆయా రాష్ట్రాలే నిర్ణయిస్తాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ బాధితులకు తాత్కాలిక వసతి ఇచ్చేందుకు, ఆహారం, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు. క్వారంటైన్ క్యాంపుల సంఖ్య, ఎంత కాలం కొనసాగాలి? ఎంత మందిని ఈ క్యాంపుల్లో ఉంచాలన్నది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించుకుంటాయి. ఎస్డీఆర్ఎఫ్ నిధులను ధర్మల్ స్కానర్లు, వెంటిలేషన్ తదితర పరికరాల కొనుగోలుకూ వాడవచ్చునని హోం శాఖ తెలిపింది. మార్గదర్శకాలను ట్వీట్ చేసిన ప్రధాని కోవిడ్ వైరస్‌ను నిరోధించేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసిన మార్గదర్శకాలను ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘వ్యాధి లక్షణాలు ఉన్న వారు ఇళ్లలోనే గడిపే సందర్భంలో తీసుకోవాల్సిన ఈ జాగ్రత్తలు మిమ్మల్నీ, మీ వాళ్లను రక్షించుకునేందుకు ఉపయోగపడతాయి’ అని ట్వీట్ చేశారు. వ్యాధి లక్షణాలు ఉన్నవారు అటాచ్డ్ బాత్రూమ్ ఉండే, గాలి, వెలుతురు బాగా వచ్చే గదిలో ఉండాలని సూచించారు. ఎక్కువ మంది అదే గదిలో ఉండాల్సి వస్తే 3అడుగుల కంటే ఎక్కువ దూరంలో ఉండాలని చెప్పారు. వీలైనంత వరకు వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు దూరంగా ఉండాలన్న ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను ట్వీట్లో పేర్కొన్నారు. పద్మ ప్రదానోత్సవాలు వాయిదా మార్చి 26, ఏప్రిల్ 3వ తేదీల్లో ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో జరగాల్సిన పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాలను కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్రప్రభుత్వం వాయిదావేసింది. వేర్వేరు రంగాల్లో విశేష కృషిచేసిన 141 మందికి కేంద్రప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం తెల్సిందే. ఏడుగురికి పద్మ విభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ అవార్డులను గతంలో ప్రకటించారు. అంత్యక్రియలపై మార్గదర్శకాలు ఢిల్లీలో వైరస్ కారణంగా మృతి చెందిన 68 ఏళ్ల మహిళ అంత్యక్రియలపై వివాదం చెలరేగిన నేపథ్యంలో కరోనా మృతుల అంతిమ సంస్కారాలపై మార్గదర్శకాలను రూపొందించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధమవుతోంది. మృతుల శరీరాల నుంచి ఇతరులకు వ్యాధి సోకే అవకాశం లేకపోయినప్పటికీ ప్రజల్లో అవగాహన పెంచేందుకు, అపోహలను తొలగించేందుకు ఈ మార్గదర్శకాలు దోహదంచేస్తాయి. శ్వాస సంబంధిత వ్యాధి అయిన కోవిడ్ దగ్గు, తుమ్ముల వల్ల బయటకు వచ్చే ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుందని, మార్చురీ నుంచి లేదా మృతదేహం నుంచి వ్యాపించే అవకాశం లేదని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఎబోలా, నీపా వంటి వైరస్లు మృతుల శరీరాల నుంచి వెలువడే ద్రవాలను తాకడం ద్వారా రావచ్చుకానీ కరోనా అలా కాదని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం శరీరాన్ని తగు విధంగా చుట్టి దహనం/ఖననం చేయవచ్చునని పేర్కొనడం గమనార్హం. -
కోవిడ్ ప్రపంచవ్యాప్త మహమ్మారి: డబ్ల్యూహెచ్ఓ
జెనీవా: వందకుపైగా దేశాల్లో వేగంగా విస్తరించిన కరోనా వైరస్ (కోవిడ్–19)ను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) బుధవారం ప్రకటించింది. పలు దేశాలు ఈ వ్యాధి నియంత్రణకు సరైన చర్యలు తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రెస్ అధానొమ్ గెబ్రియేసుస్ బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. చైనా వెలుపల కరోనా కేసులు 13 రెట్లు పెరిగాయన్నారు. సత్వర చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు. ప్రజలు గుంపులు గుంపులుగా చేరే చోట వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు. దీనిపై ఆయా దేశాలు దృష్టి పెట్టాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. మానవ జీవితాన్ని గౌరవిస్తూ, ఈ మహమ్మారిని ఆపే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న కరోనా కేసుల దృష్ట్యా మరణాలు పెరిగే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనాను ప్రపంచవ్యాప్త మహమ్మారిగా ప్రకటించడంతో ఇన్సూరెన్స్ కవరేజీ వర్తించదు. బ్రిటన్ మంత్రికి కరోనా బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ, ఆరోగ్య శాఖ ఉపమంత్రి నాడీన్ డోరిస్‌కు కోవిడ్ సోకింది. ఈమె గతవారం బ్రిటన్ ప్రధాని, ఇతర ఎంపీలు హాజరైన విందులో పాల్గొన్నారు. దాంతో ఎవరెవరికి వైరస్ సోకిందేమోనన్న ఆందోళన నెలకొంది. అమెరికాలో ఇప్పటివరకు 31 మంది మరణిస్తే, 38 రాష్ట్రాలకు ఈ వ్యాధి విస్తరించింది. వెయ్యికిపైగా కేసులు నమోదయ్యాయి. చైనాలో కరోనా వైరస్ కాస్త నిలకడగా ఉంటే, ఇరాన్, ఇటలీ, జపాన్, దక్షిణ కొరియాలో పరిస్థితి తీవ్రరూపం దాలుస్తోంది. ఇరాన్లో ఒక్కరోజే ఏకంగా 63 మంది మరణించారు. ప్రపంచదేశాల్లో కరోనా కేసులు: ఇంచుమించుగా లక్షా 18 వేలు మృతులు: 4,250కి పైగా వ్యాధి విస్తరించిన దేశాలు: 107 -
డర్మటాలజీ కౌన్సెలింగ్
కాలివేళ్ల మధ్య చర్మం ఎర్రబారుతోంది.. ఏం చేయాలి? నా వయసు 55 ఏళ్లు. గృహిణిని. బట్టలు ఉతకడం లాంటి పనులన్నీ నేనే చేసుకుంటూ ఉండటం వల్ల తడిలో ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది. దాంతో నా కాలి వేళ్ల మధ్యన చర్మం చెడినట్లుగా అవుతోంది. చూడటానికి ఎర్రగా, ముట్టుకుంటే మంటగా అనిపిస్తోంది. దీనికి సరైన మందులు చెప్పండి. - నాగవర్ధని, కోదాడ మీరు చెబుతున్న సమస్య చాలా సాధారణం. నీళ్లలో ఎక్కువగా ఉండేవారు, నిత్యం నీళ్లలో కాళ్లు తడుస్తూ ఉండేవారికి ఇది ఎక్కువగా వస్తుంటుంది. ప్రధానంగా సబ్బునీళ్లలో కాళ్లుతడుస్తుండేవారిలో ఇది మరీ ఎక్కువ. దీన్ని వైద్యపరిభాషలో ‘క్యాండిడియాసిస్’ అంటారు. మీ సమస్యను దూరం చేసుకోవడం కోసం మీరు ‘టెర్బినఫైన్’ అనే మందు ఉన్న క్రీమును ప్రతిరోజూ ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి చొప్పున నాలుగు వారాల పాటు రాసుకోవాలి. అలాగే ఇట్రకొనజోల్ 100 ఎంజీ అనే ట్లాబ్లెట్ను పొద్దునే టిఫిన్ అయ్యాక వేసుకోవాలి. అన్నిటి కంటే ముఖ్యమైనది కొన్నాళ్ల పాటు మీరు తడిలో, తేమ ఉన్న చోట కాలు పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. లేదా అలాంటిచోట్ల తిరగాల్సి వస్తే కాలికి తడి అంటకుండా స్లిప్పర్లు వేసుకొని తిరగండి. నా వయసు 16 ఏళ్లు. ఇటీవలే ఇంటర్మీడియట్ కోసం మా ఊరినుంచి వచ్చి వైజాగ్‌లోని ఒక హాస్టల్లో ఉంటున్నాను. నేను హాస్టల్లో చేరిన కొద్దిరోజుల తర్వాత నుంచి నా చేతివేళ్ల మధ్యన కురుపుల్లాగా వస్తున్నాయి. దురదగా కూడా ఉంటోంది. ఇదేమైనా అంటువ్యాధా? దీనికి తగిన పరిష్కారం చెప్పండి. - సందీప్, విశాఖపట్నం హాస్టల్లో ఉండే పిల్లల్లో చాలామందికి వచ్చే చాలా సాధారణమైన వ్యాధి ఇది. దీన్ని ‘స్కేబిస్’ అంటారు. మీరు ఊహించినట్లే ఇది చాలా త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. కేవలం 20 నిమిషాల పాటు కలిసి ఉన్నా ఒకరి నుంచి మరొకరికి సోకుతుందంటే, ఇది ఎంతటి తీవ్రమైన అంటువ్యాధో ఊహించవచ్చు. దీని చికిత్స కోసం మీరు ఫెక్సోఫినడిన్ 180 ఎంజీ అనే ట్యాబ్లెట్‌ను రోజూ రాత్రివేళ 10 రోజుల పాటు తీసుకోండి. ఇది దురదను తగ్గిస్తుంది. ప్రతిరోజూ సాయంత్రం వేడినీటితో స్నానం చేసి, ఆ టైమ్‌లో వేళ్ల మధ్య స్క్రబ్ (శుభ్రం అయ్యేలా గట్టిగా రాసుకోవడం) చేసుకోండి. ఆ తర్వాత ఒకసారి పర్మెథ్రిన్ 5% అనే లోషన్‌ను శరీరమంతా రాసుకుని నిద్రపోండి. మళ్లీ ఉదయం లేవగానే వేళ్లమధ్య స్క్రబ్ చేసుకుంటూ స్నానం చేయండి. హాస్టల్లో ఒకరికి ఉన్నా... మొత్తం హాస్టల్లో ఉన్నవారంతా ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే నెల తర్వాత ఇదే ట్రీట్మెంట్ మళ్లీ తీసుకోవాలి. -
వైద్య,ఆరోగ్య సేవలు అన్ని గ్రామాలకు చేరాలి
నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు అన్ని గ్రామాలలోను ప్రత్యేక వైద్యశిబిరాలు ఐటీడీఏ పీఓ వినయ్‌చంద్ పాడేరు: ఏజన్సీలోని ఎపిడమిక్ సీజన్‌ను సమర్ధంగా ఎదుర్కోవాలని, గిరిజనులకు వైద్యసేవల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని ఐటీడీఏ పీఓ వి.వినయ్‌చంద్ హెచ్చరించారు. ఏజెన్సీలోని 36 ఆరోగ్య కేంద్రాల పరిధిలో వైద్య ఆరోగ్య కార్యక్రమాలు, సీజనల్ వ్యాధుల తీవ్రతపై శుక్రవారం సాయంత్రం తన కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారులు, ఎస్పీహెచ్ఓలు, వైద్యఅధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రత్యేకాధికారులంతా ఎపిడమిక్ సీజన్ ముగిసేంత వరకు వైద్య ఆరోగ్య కార్యక్రమాలను అనుక్షణం సమీక్షించాలని ఈ సందర్భంగా పీవో ఆదేశించారు. మలేరియా, డయేరియా, వైరల్ జ్వరాలు, క్షయవ్యాధి నివారణకు చేపడుతున్న వైద్య ఆరోగ్య కార్యక్రమాలన్నీ అన్ని గ్రామాలకు చేరాలని సూచించారు. ఎక్కడ అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే వైద్యాధికారి, ఇతర సిబ్బంది ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించాలన్నారు. అన్ని గ్రామాల్లోను దోమల నివారణ మందును స్ప్రేయింగ్ చేయాలన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాలు, ఉప ఆరోగ్య కేంద్రాలు, ఆశ కార్యకర్తల వద్ద పూర్తిస్థాయిలో మందుల నిల్వలు ఉండాలని, ఎస్పీహెచ్ఓలు కూడా ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసి వైద్యసిబ్బంది పనితీరును సమీక్షించాలని ఆదేశించారు. ఎక్కడ అనారోగ్య సమస్యలతో గిరిజనులు మృతి చెందినా సంబంధిత వైద్యసిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఉంటాయన్నారు. మరణాలకు సంబంధించి రోజువారీ నివేదికను తమకు అందజేయాలన్నారు. ప్రతి పంచాయతీకి రూ. 4 లక్షల మేరకు నిధులు అందుబాటులో ఉన్నాయని తద్వారా పారిశుధ్యం, తాగునీటి వనరుల క్లోరినేషన్ పనులు చేపట్టాలన్నారు. సమావేశంలో పాడేరు ఆర్డీఓ రాజకుమారి, ఐటీడీఏ ఏపీఓ పీవీఎస్ నాయుడు, గిరిజన సంక్షేమ డీడీ బి.మల్లికాార్జునరెడ్డి, ఈఈ ఎంఆర్జీ నాయుడు, పీహెచ్ఓ చిట్టిబాబు, పీఏఓ భాగ్యలక్ష్మి, డీఎంఓ ప్రసాదరావు, ఇన్చార్జి ఏడీఎంహెచ్ఓ డాక్టర్ లీలాప్రసాద్, అన్ని క్లష్టర్ల ఎస్పీహెచ్ఓలు, వైద్యాధికారులు పాల్గొన్నారు. -
ఎపిడమిక్‌ను ఎదుర్కొంటాం
డయేరియా బాధితులకు మెరుగైన సేవలు అన్ని పీహెచ్‌సీలకు అంబులెన్స్‌లు, డాక్టర్లు వైద్య సేవల పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ పాడేరురూరల్, న్యూస్‌లైన్ : ఏజెన్సీలో ఎపిడమిక్ తీవ్రతను ఎదుర్కొని నియంత్రిస్తామని పాడేరు ఐటీడీఏ పీవో వి.వినయ్‌చంద్ తెలిపారు. ఇక్కడి ప్రాంతీయ ఆస్పత్రిలో చేరిన డయేరియా బాధితులను శుక్రవారం పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆస్పత్రి వైద్యులకు సూచించారు. అన్ని వార్డుల్లోకి వెళ్లి సేవల తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ డయేరియా ప్రబలిన రవ్వలమామిడి, గిడ్డివలస, గొల్లమామిడి గ్రామాలతో పాటు మన్యంలోని అన్ని గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్య సమస్య తలేత్తకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 36 పీహెచ్‌సీల్లో వైద్యుల కొరత లేకుండా చూస్తామన్నారు. అంబులెన్స్‌లను ఏర్పాటు చేసామన్నారు. సుదూర ప్రాంతాల నుంచి రోగులను తరలించేందుకు 1200 పల్లకీలను సిద్ధం చేసినట్టు చెప్పారు. ఈ సేవలన్నీ సోమవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్టు తెలిపారు. ఎపిడమిక్ ముగిసేంతవరకు పాడేరు, అరుకు ప్రాంతీయ ఆస్పత్రుల్లో డిప్యుటేషన్‌పై మైదాన ప్రాంతాల నుంచి వైద్యులను నియమిస్తామన్నారు. పీహెచ్సీ అభివద్ధి నిధులను సక్రమంగా ఖర్చు చేయాలని సూచించారు. అవి చాలకుంటే ఐటీడీఏ నుంచి అదనంగా కేటాయిస్తామన్నారు. గ్రామాల్లో వైద్య సేవల పర్యవేక్షణకు డీడీ స్థాయి అధికారులను మండలానికొకరిని నియమిస్తామన్నారు. ఇప్పటికే 1200 గ్రామాల్లో దోమల నివారణ మందు పిచికారీ చేపట్టామని, మిగిలిన గ్రామాల్లోనూ నెలాఖరుకు పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గ్రామ స్థాయిలో విస్తృత వైద్య సేవలకు ఆశ కార్యకర్తలకు తరచూ శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆయన వెంట ఏడీఎంహెచ్‌వో డాక్టర్ లీలాప్రసాద్, ఎస్పీహెచ్వో డాక్టర్ విశ్వేశ్వరరావు, ప్రాంతీయ ఆస్పత్రి వైద్యులు శ్రీనివాసరావు, కష్ణారావు ఉన్నారు.