ఆందోళనకరంగా బ్లాక్‌ ఫంగస్‌! | Black Fungus Notifiable Disease under Epidemic Diseases Act | Sakshi
Sakshi News home page

ఆందోళనకరంగా బ్లాక్‌ ఫంగస్‌!

Published Fri, May 21 2021 5:16 AM | Last Updated on Fri, May 21 2021 5:16 AM

Black Fungus Notifiable Disease under Epidemic Diseases Act - Sakshi

మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్‌లో ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బ్లాక్‌ ఫంగస్‌ బాధితుడు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా విజృంభణతో ఇప్పటికే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న ఆరోగ్య వ్యవస్థకు మరో వ్యాధి సవాల్‌ విసురుతోంది. కరోనా నుంచి కోలుకున్న రోగుల్లో ఎక్కువగా కనపడుతున్న మ్యూకోర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) ఇప్పుడు దేశంలో రోజురోజుకీ పెరుగుతోంది. ఉత్తర్‌ప్రదేశ్, ఢిల్లీ, రాజస్తాన్, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాఖండ్, హరియాణాలతో పాటు మరికొన్ని ఇతర రాష్ట్రాల్లో బ్లాక్‌ ఫంగస్‌ బారినపడిన వారిని ఇప్పటికే గుర్తించారు. పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసుల దృష్ట్యా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, రాజస్తాన్, హరియాణా, ఒడిశా రాష్ట్రాలు తమ రాష్ట్రంలో దీనిని అంటువ్యాధుల చట్టం క్రింద గుర్తించదగ్గ వ్యాధిగా ప్రకటించాయి. ఈ వ్యాధికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు ఒక అడ్వైజరీని జారీ చేసింది.

అనేక రాష్ట్రాల్లో పెరుగుతున్న బ్లాక్‌ ఫంగస్‌ కేసుల దృష్ట్యా ఎపిడెమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌– 1897 ప్రకారం దీనిని రాష్ట్రంలో గుర్తించదగిన వ్యాధిగా (నోటిఫైయబుల్‌ డిసీజ్‌) వర్గీకరించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. కోవిడ్‌ రోగుల్లో దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీస్తోందని, మరణాలను పెంచుతోందని తెలిపింది. ‘మ్యూకోర్‌మైకోసిస్‌ రూపంలో కొత్త సవాల్‌ ఎదురవుతోంది. పలు రాష్ట్రాల్లో ఈ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. స్టెరాయిడ్లు ఉపయోగించిన, మధుమేహం నియంత్రణలో లేని కోవిడ్‌–19 రోగుల్లో ఇది ప్రధానంగా కనిపిస్తోంది‘ ఆరోగ్యశాఖ రాష్ట్రాలకు రాసిన లేఖలో పేర్కొంది. అంతేగాక బ్లాక్‌ ఫంగస్‌ కేసులను నిర్ధారించిన వెంటనే ఆరోగ్యశాఖకు తప్పనిసరిగా రిపోర్ట్‌ చేసేలా అన్ని హాస్పిటల్స్, మెడికల్‌         కాలేజీలకు సూచించారు. వీటితోపాటు బ్లాక్‌ఫంగస్‌ను గుర్తించేందుకు, చికిత్స చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, ఐసీఎంఆర్‌ గతంలో విడుదల చేసిన గైడ్‌లైన్స్‌ తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.  

రోగనిరోధక శక్తి బలహీనపడితేనే ముప్పు
మ్యూకోర్‌మైసెట్స్‌గా పిలిచే శీలింధ్రాల (ఫంగస్‌) కారణంగా బ్లాక్‌ ఫంగస్‌ వస్తుంది. మన చుట్టూ ఉన్న వాతావరణంలో ఈ ఫంగస్‌ సాధారణంగానే ఉండేదే. మట్టిలో, కుళ్లిపోతున్న ఆకుల్లో, పేడకుప్పల్లో, కుళ్లుతున్న జీవవ్యర్థాల్లో ఇది ఉంటుంది. మామూలు పరిస్థితుల్లో మన రోగనిరోధక శక్తి దీన్ని సమర్థంగా అడ్డుకుంటుంది. అయితే కరోనా సోకిన వారిలో డెక్సామెథాసోన్‌ లాంటి స్టెరాయిడ్లు వాడటం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే షుగర్‌ నియంత్రణలో లేని వారిలో, సుదీర్ఘకాలం ఐసీయూలో ఉన్న కోవిడ్‌ రోగులకు బ్లాక్‌ ఫంగస్‌ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఐసీయూలో వెంటిలేటర్ల ద్వారా ఆక్సిజన్‌ అందించినపుడు తేమ కారణంగా కూడా బ్లాక్‌ ఫంగస్‌ సోకే ప్రమాదం ఉంటుంది.  నొసటి భాగంలో, ముక్కు, దవడ, కళ్ల భాగంలో ఫంగస్‌ పేరకుపోయి స్కిన్‌ ఇన్‌ఫెక్షన్‌ వస్తుంది. కళ్లకు, ఊపిరితిత్తులకు... కొన్నిసార్లు మెదడుకు కూడా ఇది పాకుతుంది. వ్యాధి ముదిరితే ముక్కు పైభాగంలో నల్లబారడం, చూపు మసకబారడం, లేదా రెండుగా కనపడటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గినపుడు రక్తం పడటం జరుగుతుంది. కంటిచూపును కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది.  

మహారాష్ట్రలో ప్రమాద ఘంటికలు
దేశంలో అత్యధికంగా కరోనాతో ప్రభావితమైన మహారాష్ట్రలో బ్లాక్‌ ఫంగస్‌ ప్రభావం సైతం పెరుగుతోంది. ఇప్పటివరకు సుమారు 1,500 మందిలో బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించగా అందులో 90 మంది ప్రాణాలు కోల్పోయారని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్‌ తోపే గురువారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తెలిపారు. బ్లాక్‌ ఫంగస్‌ నియంత్రణ అనేది ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాతాంశమని, అందువల్ల చికిత్సలో ఉయోగించే ఔషధాలను సరఫరా చేయాలని ఆయన ప్రధానిని కోరారు. అంతేగాక బ్లాక్‌ ఫంగస్‌ను గుర్తించిన 1,500 మందిలో సుమారు 500 మంది కోలుకున్నారని, సుమారు 850 మందికి చికిత్స కొనసాగుతోందని రాజేష్‌ తోపే పేర్కొన్నారు.

► రాజస్తాన్‌: రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా ఇప్పటివరకు 400 మంది కంటిచూపు కోల్పోయారు. కేవలం జైపూర్‌లోనే 148 మందికి సోకింది. జోధ్‌పూర్‌లో 100 కేసులు నమోదయ్యాయి. 30 కేసులు బికనేర్‌ నుంచి, మిగిలినవి అజ్మీర్, కోటా, ఉదయపూర్‌ నుండి రావడంతో బ్లాక్‌ ఫంగస్‌ను అంటువ్యాధుల చట్టం క్రింద గుర్తించదగ్గ వ్యాధిగా రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది.  

► ఢిల్లీ: దేశ రాజధానిలో బ్లాక్‌ ఫంగస్‌ రోగుల సంఖ్య 300 దాటింది. చికిత్సకు వాడే ఆంఫోటెరిసిన్‌–బి ఇంజక్షన్లకు తీవ్రకొరతను ఎదుర్కొంటోంది. ఢిల్లీ ఎయిమ్స్‌లో గత ఒక్కవారంలోనే 75–80మంది రోగులు చేరారు. వీరిలో 30 మంది పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. దేశ రాజధానిలో బ్లాక్‌ ఫంగస్‌ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మూడు ఆసుపత్రుల్లో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ప్రత్యేక సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం ప్రకటించారు.

► మధ్యప్రదేశ్‌: గత 27 రోజుల్లోనే 239 మంది    బ్లాక్‌ ఫంగస్‌ రోగులు భోపాల్‌కు చేరుకున్నారు. చికిత్స సమయంలో 10 మంది రోగులు        మరణించగా, 174 మంది ఆసుపత్రులలో చేరారు. వీరిలో 129 మంది రోగులకు శస్త్రచికిత్స జరిగింది. అయితే, ప్రభుత్వం భోపాల్‌లో 68 మంది రోగులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది.  కాగా, రాష్ట్రవ్యాప్తంగా 585 మంది రోగులను గుర్తించారు.  

► హరియాణా: రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ రోగులు 316 మంది ఉన్నారు. దీనిని అంటువ్యాధుల చట్టం కింద గుర్తించదగ్గ వ్యాధిగా ప్రకటించిన మొదటి రాష్ట్రం హరియాణా.  

► ఛత్తీస్‌గఢ్‌: రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ రోగుల సంఖ్య 100కి చేరుకుంది. ఆస్పత్రుల్లో 92 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఎయిమ్స్‌లో అత్యధికంగా 69 మంది రోగులు ఉండగా, 19 మందికి ఆపరేషన్‌లు పూర్తయ్యాయి.  

వెలుగులోకి వైట్‌ ఫంగస్‌
బిహార్‌ రాజధాని పట్నాలో ఇప్పుడు వైట్‌ ఫంగస్‌ (కాన్డిడోసిస్‌) వెలుగులోకి వచ్చింది. బ్లాక్‌ ఫంగస్‌ కంటే ప్రమాదకరమైన వైట్‌ ఫంగస్‌ సంక్రమించిన నలుగురు రోగులను బిహార్‌లో గుర్తించారు. వైట్‌ ఫంగస్‌ ఊపిరితిత్తులతో పాటు, చర్మం, గోర్లు, నోటి లోపలి భాగాలు, కడుపు, మూత్రపిండాలు, జననేంద్రియాలు, మెదడుకు సోకుతుంది. వ్యాధి సోకిన నలుగురిలో కోవిడ్‌ రోగుల లక్షణాలే కనపడినా పరీక్షల్లో అది వైట్‌ ఫంగస్‌గా తేలిందని (వీరికి కరోనా లేదు) పాట్నా మెడికల్‌ కాలేజీ మైక్రోబయాలజీ చీఫ్‌ డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.సింగ్‌ వెల్లడించారు. ఫంగస్‌ నిరోధక మందులు వాడితే వీరు కోలుకున్నారని తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు, దీర్ఘకాలికంగా స్టెరాయిడ్లు వాడుతున్న వారికి దీనివల్ల ముప్పు ఎక్కువని వెల్లడించారు.

ఆంఫోటెరిసిన్‌–బి ఉత్పత్తికి అనుమతులివ్వండి: ఐఎంఏ
బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో వాడే ఆంఫోటెరిసిన్‌– బి ఇంజెక్షన్ల ఉత్పత్తికి అర్హత కలిగిన ఫార్మా సంస్థలను అనుమతించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) ప్రధాని మోదీని కోరింది. ఈ ఔషధానికి తీవ్ర కొరత ఉందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో ఒకే ఒక అమెరికా కంపెనీకి ‘ఆంఫోటెరిసిన్‌–బి’ని దిగుమతి చేసుకొనే లైసెన్స్‌ ఉందని ప్రధాని దృష్టికి తీసుకువచ్చింది. గత ఏడాది డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) పలు ఫార్మా కంపెనీలకు ఆంఫోటెరిసిన్‌– బి ఉత్పత్తికి అనుమతులిచ్చి తర్వాత ఉపసంహరించుకుందని, ఇప్పుడు పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రధాని వ్యక్తిగతంగా జోక్యం చేసుకొని ఫార్మా కంపెనీలకు తాత్కాలిక అనుమతులిచ్చేలా డీజీసీఐకి సూచించాలని విజ్ఞప్తి చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement