ఓ వైపు కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండగా దీనికి తోడు అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. డెంగీ వ్యాధి జనాలను వణికిస్తున్నది. బస్తీలు, కాలనీలు అన్న తేడా లేకుండా ఈ మహమ్మారి అందరినీ వణికిస్తున్నది. రెండు వారాల నుంచి బంజారాహిల్స్ పరిధిలోని ఆరుగురు డెంగీ బారిన పడ్డారు. హడావుడిగా జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ సిబ్బంది వచ్చి దోమల నివారణ పిచికారి చేసి వెళ్ళడమే తప్పితే ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న పాపాన పోవడం లేదు.
సాక్షి, బంజారాహిల్స్: కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతుండటంతో జనం మరోసారి ఆందోళన చెందుతున్నారు. కరోనా పరీక్షల కోసం బాధితులు ఆస్పత్రుల వద్ద బారులు తీరుతున్నారు. ఇటీవల కొన్ని నెలలుగా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కరోనా పరీక్షల కోసం బంజారాహిల్స్ రోడ్ నెం. 7లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి గత నాలుగైదు రోజుల నుంచి రోజుకు 15 నుంచి 20 మంది వరకు వచ్చి పరీక్షలు నిర్వహించుకుంటున్నారు. ఇందులో అయిదారుగురికి కరోనా నిర్ధారణ అవుతోంది.
► ఒక వైపు కరోనా పరీక్షలు, మరో వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆస్పత్రుల్లో కొనసాగుతున్నది. అయితే బంజారాహిల్స్ రోడ్ నెం 7లోని పీహెచ్‌సీలో మాత్రమే కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు.
►కేవలం కోవిషీల్డ్, కోర్బివాక్స్ వ్యాక్సిన్ మాత్రమే అందుబాటులో ఉండగా కోవాగ్జిన్ టీకా లేకపోవడంతో గడువు సమీపించి ముగిసిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
►బస్తీలు, కాలనీలు అన్న తేడా లేకుండా కరోనాతో బాధపడుతూ పరీక్షల కోసం వస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
►కరోనా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇది మరింత విజృంభించే అవకాశాలున్నట్లు వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. ఆస్పత్రుల్లో సైతం కరోనా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఇష్టానుసారంగా ఆస్పత్రులకు రాకపోకలు సాగుతున్నట్లు సిబ్బంది ఆరోపిస్తున్నారు.
చదవండి: ఇంటర్‌లో ఫస్ట్‌క్లాస్ సాధించిన అవిభక్త కవలలు వీణ-వాణి
దోమల స్వైర విహారం
► వ్యర్థాలు పడుతుండటంతో మరోవైపు దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. మురుగు నీటి కాల్వలు, వరద నిలిచే ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. దీంతో అంటు వ్యాధులు ప్రబలుతూ బస్తీల్లో ఇంటికొకరు చొప్పున జ్వరపీడితులవుతున్నారు.
► దోమల నివారణకు జీహెచ్‌ఎంసీ ఎంటమాలజీ విభాగం ఏ మాత్రం కృషి చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
► నామమాత్రంగా దోమల నివారణ పిచికారీ చేస్తున్నారు తప్పితే ఫాగింగ్ మాటే ఎత్తడం లేదు.
► ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో రెండు నెలల నుంచి దోమల నివారణకు అవగాహన కార్యక్రమాలు తప్పితే క్షేత్ర స్థాయిలో వాటి నిర్మూలనకు ఏ మాత్రం సిబ్బంది పని చేయలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment