కరోనా మృతులకు సంతాపసూచకంగా చైనాలోని వూహాన్‌లో మౌనం పాటిస్తున్న ప్రజలు
వాషింగ్టన్/బీజింగ్/జెనీవా: ఇదీ కరోనా మహమ్మారి చేస్తున్న విలయం తాండవం. కోవిడ్–19 అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అక్కడ మొత్తం 3 లక్షల కేసులు నమోదయ్యాయి. కేవలం 24 గంటల వ్యవధిలో 30 వేల కొత్త కేసులు నమోదైతే, అదే సమయంలో 1,500 మంది మరణించారు. ఈ పరిణామాలతో అమెరికాలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ప్రజలందరూ బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సిఫారసు చేసింది. ఈ విషయాన్ని వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజలందరూ సాధారణ మాస్క్‌లే ధరించాలని చెప్పారు.
తీవ్రంగా మాస్క్‌ల కొరత ఎదుర్కొంటున్న అమెరికా వైద్యసిబ్బందికి అవసరమయ్యే ఎన్95 మాస్క్‌లు పౌరులు వాడవద్దని సూచించారు. ఇంట్లో తయారు చేసుకునే మాస్క్ వేసుకోవాలన్నారు. అయితే తాను మాత్రం మాస్క్ వేసుకోనని ట్రంప్ వ్యాఖ్యానించడం విశేషం. ఒక వైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ గాలి ద్వారా వైరస్ వ్యాప్తి చెందదని చెప్పగా, అమెరికా శాస్త్రవేత్తలు కేసుల సంఖ్య పెరగడానికి గాలి ద్వారా వైరస్ సోకుతుందేమోనన్న అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై పరిశోధనలు కొనసాగుతున్నాయని నిర్ధారించడానికి మరికొంత సమయం పడుతుందని స్పష్టం చేశారు. అమెరికాలో కేసులు ఇంచుమించుగా 3 లక్షలకి దగ్గర్లో ఉంటే, మృతులు 7 వేలు దాటేశాయి.
గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలి: యూఎన్: కరోనా విశ్వరూపం చూపిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెరెస్ అన్నారు. యుద్ధవాతావరణం ఉండి, పెద్ద సంఖ్యలో శరణార్థులు ఉన్న సిరియా, లిబియా, యెమన్ వంటి దేశాలకు వైరస్ విస్తరిస్తే ఎంతటి కల్లోలం రేగుతుందో ఊహించడానికే కష్టంగా ఉందని అన్నారు.
కోవిడ్ మృతులకు చైనా నివాళి
కోవిడ్‌తో మృతి చెందిన వారికి చైనా జాతియావత్తూ శనివారం నివాళులర్పించింది. కరోనా వైరస్‌పై తొలిసారిగా హెచ్చరించిన డాక్టర్ లీ వెన్‌లియాంగ్‌తో సహా 3,300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వారి మృతికి సంతాప సూచకంగా ప్రజలందరూ మూడు నిముషాలపాటు మౌనం పాటించారు. జాతీయ జెండాను అవనతం చేశారు.
స్పెయిన్‌లో అత్యవసర పరిస్థితి పొడిగింపు
స్పెయిన్‌లో కరోనా మృతుల సంఖ్య రాను రాను పెరిగిపోతూ ఉండడంతో జాతీయ అత్యవసర పరస్థితిని మరో రెండు వారాలు పొడిగిస్తున్నట్టుగా ప్రధాని సాంచెజ్ ప్రకటించారు. శనివారానికి ఆ దేశంలో కరోనా మృతుల సంఖ్య 11,744కి చేరుకుంది. ఇక కేసుల సంఖ్య లక్షా 24 వేలు దాటేసింది. ఇటలీలో మరో 766 మంది మరణిస్తే కొత్త కేసుల సంఖ్య పెరుగుదల నాలుగు శాతం మాత్రమే నమోదైంది. జర్మనీలో కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో 6,082 మందికి వైరస్ సోకింది. కువైట్‌లో శనివారం తొలి మరణం సంభవించింది. బ్రిటన్‌లో కరోనా మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఒకేరోజు 708 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 4,313కి చేరుకుంది.
న్యూయార్క్‌లో రెండున్నర నిమిషాలకో మరణం
కరోనా వైరస్ ఉగ్రరూపం చూపిస్తున్న న్యూయార్క్‌లో అంతిమ సంస్కారానికి కూడా వేచి చూసే పరిస్థితులు నెలకొని ఉంటే మృతుల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. ఇంచుమించుగా ప్రతీ రెండున్నర నిమిషాలకు ఒక మరణం నమోదవుతోందని ఆ రాష్ట్ర గవర్నర్ ఆండ్యూ క్యూమో వెల్లడించారు. గత 24 గంటల్లో 562 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య దాదాపుగా 3 వేలకు చేరుకుంది. ఇక కేసుల సంఖ్య లక్ష దాటేసింది.
ప్రపంచ వ్యాప్తంగా మొత్తం కేసులు: 11,69,262
మరణాలు: 62,730
కోలుకున్న వారు: 2,41,762
Comments
Please login to add a commentAdd a comment