
వాషింగ్టన్: అమెరికాలో కోవిడ్ మరణాల సంఖ్య ముందుగా అంచనా వేసిన దానికంటే తక్కువగా ఉండే అవకాశముందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటి విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆశాభావం వ్యక్తం చేశారు. కోవిడ్–19 కారణంగా మంగళవారం నాటికి అమెరికాలో సుమారు 12,700 మంది ప్రాణాలు కోల్పోగా, సోమవారం నుంచి మంగళవారం వరకూ మాత్రమే 1,900 మంది మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైరస్ బారిన పడ్డ వారి సంఖ్య అత్యధికంగా నాలుగు లక్షలకు చేరుకుంటూండగా ఒక్క న్యూయార్క్ నగరంలోనే 5,400 మంది మరణించారు, 1.38 లక్షల మంది వ్యాధి బారిన పడ్డారు. న్యూజెర్సీలో 1,200 మంది ప్రాణాలు కోల్పోగా, 44,416 మంది కోవిడ్ కోరల్లో చిక్కుకున్నారు.
నిలకడగా బ్రిటన్ ప్రధాని ఆరోగ్యం
కోవిడ్ లక్షణాలు తీవ్రం కావడంతో ఐసీయూలో చేరిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని, చికిత్సకు స్పందిస్తున్నారని అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. బోరిస్ జాన్సన్ అధికారిక కార్యకలాపాలు చేపట్టకపోయినప్పటికీ అధికారులతో మాట్లాడుతున్నారు.
భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోసులు
కోవిడ్–19 పేషెంట్లకు వినియోగించేందుకు భారత్ నుంచి 2.9 కోట్ల హైడ్రాక్సీ క్లోరోక్విన్ డోస్‌లను కొనుగోలు చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ‘భారత ప్రధాని మోదీతో మాట్లాడాను. హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను పంపగలరా? అని అడిగాను. ఆయన చాలా గొప్పవాడు. చాలా మంచివాడు’ అని ఫాక్స్ న్యూస్‌తో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఎగుమతి చేసేందుకు భారత్ మంగళవారం అంగీకరించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment