లాక్‌లు ఎత్తేస్తున్నారు. ఆంక్షల చట్రంలోంచి జనం బయటకొస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకి ఊతమిచ్చేలా మార్కెట్లు తెరుచుకుంటున్నాయి. కానీ కరోనా భూతం ఇంకా భయపెడుతోంది. రోజుకి 20వేలకి పైగా కేసులు, వెయ్యికి పైగా మృతులు నమోదవుతూ అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కరోనా కొమ్ములు వంచడానికి అగ్రరాజ్యం చేస్తున్న కృషిలో విజయాలెన్ని ? వైఫల్యాలేంటి ?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదట్లో వైరస్‌ను తేలిగ్గా తీసుకున్నారు. జనవరిలో కరోనా అదుపులో ఉందని స్టేట్‌మెంట్లు ఇచ్చారు. ఫిబ్రవరిలో కరోనాపై పోరాటంలో విజయం సాధించామని ధీమాగా చెప్పారు. మార్చి వచ్చేసరికి స్వరం మారింది. ఇది చైనా వైరస్ అని, వూహాన్ ల్యాబ్ నుంచి వైరస్ వచ్చిందని ఆరోపిస్తూ ఆ దేశంపై పరోక్ష యుద్ధానికి దిగారు. దీనిని మహమ్మారిగా పేర్కొని జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించారు. చిమ్మ చీకటి సొరంగం ప్రయాణంలో వెలుగు రేఖ కనిపిస్తోందని ఏప్రిల్ అంతా ఆశతో చూశారు.
మే వచ్చేసరికి అమెరికా చరిత్రలోనే కోవిడ్–19ని అతి పెద్ద దాడిగా అభివర్ణించారు. పెరల్ హార్బర్ కంటే, సెప్టెంబర్ 11 వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి కంటే అతి పెద్దదని ప్రకటించారు. దీనిపై చైనా ఎందుకు ముందే హెచ్చరించలేదని, ఆ దేశమే వైరస్ వ్యాప్తిని అరికట్టి ఉండాల్సిదంటూ ప్రత్యక్ష పోరాటానికే తెరతీశారు. మే 16 నాటికి 15 లక్షల కేసులు, 90 వేల మరణాలతో అగ్రరాజ్యం అతలాకుతలమవుతోంది. అయితే న్యూయార్క్, న్యూజెర్సీ వంటి రాష్ట్రాల్లో కేసుల పెరుగుదల నిలకడగా ఉంటే అరిజోనా, అలబామా, మినోసెటా వంటి రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి.
విజయాలు
► సామాజిక దూరం పాటించడంలో అమెరికాలో చాలా రాష్ట్రాలు విజయం సాధించాయి. ఒక పది రాష్ట్రాలు మినహా మిగిలిన చోట్ల కరోనాని బాగా కట్టడి చేశాయి. లేదంటే ఈ పాటికి కోటి మందికి వైరస్ సోకేదని ఒక అంచనా.
► కోవిడ్–19 కేసులు లక్షల్లో నమోదు కావడంతో ఆస్పత్రి సదుపాయాలు లేక జనం అల్లాడిపోయారు. కానీ ఇప్పుడు న్యూయార్క్, న్యూజెర్సీ, మేరీల్యాండ్ మసాచుసెట్స్ రాష్ట్రాల్లో కొత్త ఆస్పత్రుల్ని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఎవరికైనా కరోనా సోకితే ఆస్పత్రిలో బెడ్ ఖాళీ లేదు అన్న మాటే అక్కడ వినిపించదు.
► వెంటిలేటర్స్ తయారీలో కూడా అగ్రరాజ్యం భళా అనిపించుకుంది. ట్రంప్ సర్కార్ 70 ఏళ్ల క్రితం నాటి డిఫెన్స్ ప్రొడక్షన్ యాక్ట్‌ని బయటకు తీసి జనరల్ మోటార్స్ వంటి సంస్థలకు వెంటిలేటర్లను రూపొందించే పని అప్పగించారు. వెంటిలేటర్ కొరతతో ఇకపై ఒక్క రోగి కూడా మరణించే అవకాశమే లేదు. భారత్‌తో పాటు లాటిన్ అమెరికా, యూరప్, ఆఫ్రికా దేశాలకు కూడా వెంటిలేటర్లను సరఫరా చేస్తోంది.
► కరోనా వైరస్‌కు టీకాయే పరిష్కారం. ట్రంప్ ప్రభుత్వంతో పాటు , బిల్‌గేట్స్ ఫౌండేషన్ వందల కోట్ల డాలర్లు ఈ పరిశోధనలకే ఖర్చు పెడుతున్నాయి. దేశవ్యాప్తంగా 10 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. రెమ్‌డెసివర్ మందుని కరోనా రోగులకు వాడడానికి అనుమతినివ్వడం వల్ల కూడా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించింది. ఈ మందు ఇచ్చిన వారిలో 31శాతం మంది కోలుకుంటున్నారు.
వైఫల్యాలు
► ఆయుధాలు లేకుండా యుద్ధం చేయడంలో అగ్రరాజ్యం కూడా మినహాయింపు కాదు. కోవిడ్ రోగులకు చికిత్సనందించే వైద్యులకు పీపీఈ కిట్లకు కొరత ఇంకా ఉంది. ప్రాజెక్టు ఎయిర్‌బ్రిడ్జ్ పేరుతో ఇతర దేశాల నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యక్తిగత రక్షణ పరికరాలను భారీగా దిగుమతి చేసుకుంది కానీ కొరతను అధిగమించ లేకపోయింది. ఇప్పుడు అమెరికాయే స్వయంగా తయారీ మొదలు పెట్టినా పంపిణీలో లోపాలు కనిపిస్తున్నాయి
► పెరిగిపోతున్న కోవిడ్ రోగులకు చికిత్స అందించడానికి నిపుణులైన వైద్యులు కూడా లేరు. దీంతో ట్రంప్ సర్కార్ ఇతర దేశాల నుంచి సుశిక్షితులైన వైద్యుల్ని తీసుకురావడానికి హెచ్1బీ వీసాలకు అనుమతులిచ్చింది.
► మరే ఇతర దేశం చేస్తున్నట్టుగా కోవిడ్–19 పరీక్షలు చేస్తున్నామని ట్రంప్ పదే పదే ప్రకటనలు చేస్తున్నారు కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. కరోనా వైరస్ కమ్మేసిన మొదట్లో నిర్లక్ష్యం చేసిన ట్రంప్ ఏప్రిల్ నాటికి కానీ కళ్లు తెరవలేదు. ఇప్పటికీ దేశ జనాభాలో కేవలం 2.74% మందికే పరీక్షలు నిర్వహించారు.
► కోవిడ్–19ని ఎదుర్కోవడానికి అమెరికా చరిత్రలోనే అత్యంత భారీగా దాదాపు 3లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీ అయితే ప్రకటించారు కానీ దాని కేటాయింపులు సరిగా జరపలేదు. లాక్‌డౌన్ కారణంగా వేతనాలు లభించని వారికి, ఉద్యోగాలు కోల్పోయిన వారికే సగానికి పైగా నిధులు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో వేశారే తప్ప, ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టే పని జరగలేదు.
► బీజింగ్ నగర వాసులు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని చైనా ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్–19 మహమ్మారి పుట్టిన చైనాలోనే కరోనా నుంచి కాపాడుకునేందుకు మాస్క్‌లు వాడటం ప్రారంభమైంది. ఇప్పుడు యావత్ ప్రపంచంలోనే మాస్క్‌లు వాడని మొట్టమొదటి నగరంగా బీజింగ్ నిలవనుంది.
Comments
Please login to add a commentAdd a comment