కరోనా వైరస్‌ మృత్యుపాశం | 10956 new Covid-19 cases on 396 lifeless in single day | Sakshi
Sakshi News home page

కరోనా మృత్యుపాశం

Published Sat, Jun 13 2020 4:53 AM | Last Updated on Sat, Jun 13 2020 7:39 AM

10956 new Covid-19 cases on 396 lifeless in single day - Sakshi

కరోనా బాధితులను ఆసుపత్రులకు తరలించడానికి గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌ కార్యాలయం ఎదుట పార్క్‌ చేసిన అంబులెన్స్‌లు

న్యూఢిల్లీ/ముంబై: ఇండియాలో కరోనా వైరస్‌ మృత్యుపాశం విసురుతోంది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించడంతో మహమ్మారి విలయతాండవం చేస్తోంది. పాజిటివ్‌ కేసులు, మరణాలు శరవేగంగా పెరిగిపోతున్నాయి. కేసులు 3 లక్షలకు, మరణాలు 9 వేలకు చేరువవుతున్నాయి. తొలిసారిగా ఒక్కరోజులోనే 10 వేలకు పైగా కేసులు బయటపడ్డాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు.. కేవలం 24 గంటల వ్యవధిలో 10,956 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 396 మంది కరోనా బాధితులు మృతిచెందారు.

దేశంలో కరోనా భూతం అడుగుపెట్టాక ఒక్క రోజులో ఇన్ని కేసులు, మరణాలు వెలుగుచూడడం ఇదే మొదటిసారి. భారత్‌లో ఇప్పటిదాకా మొత్తం 2,97,535 కరోనా కేసులు నమోదయ్యాయని, 8,498 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది. ప్రస్తుతం క్రియాశీల కరోనా కేసులు 1,41,842 కాగా, 1,47,194 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. అంటే 49.47 శాతం మంది కోలుకున్నట్లు స్పష్టమవుతోంది. రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు సంభవిస్తుండడంతో కరోనా ప్రభావిత దేశాల్లో భారత్‌ నాలుగో స్థానానికి చేరింది. తొలి మూడు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్, రష్యా ఉన్నాయి.  

17.4 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు  
దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు రెట్టింపయ్యే వ్యవధి వారం క్రితం 15.4 రోజులు కాగా, ప్రస్తుతం అది 17.4 రోజులుగా నమోదయిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని తెలియజేసింది. తొలిసారిగా లాక్‌డౌన్‌ విధించిన (మార్చి 25న) సమయంలో కరోనా కేసులు కేవలం 3.4 రోజుల్లో రెండింతలు అయ్యాయని గుర్తుచేసింది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఇప్పటిదాకా 53,63,445 నమూనాలను పరీక్షించినట్లు భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) వివరించింది. ఇందులో 1,50,305 శాంపిళ్లను గత 24 గంటల్లో పరీక్షించినట్లు తెలిపింది.  

మహారాష్ట్ర మంత్రికి పాజిటివ్‌  
మహారాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి ధనుంజయ ముండేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం గమనార్హం. మంత్రి ధనుంజయ ముండే ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని ప్రజారోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే చెప్పారు. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) నాయకుడైన ధనుంజయ ఇటీవల రాష్ట్ర కేబినెట్‌ భేటీకి హాజరయ్యారు. రెండు రోజుల క్రితం ఎన్సీపీ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. మహారాష్ట్రలో కరోనా బారినపడిన మంత్రుల్లో మూడో వ్యక్తి ధనుంజయ ముండే. జితేంద్ర అహ్వాద్, అశోక్‌ చవాన్‌ అనే మంత్రులకు గతంలోనే కరోనా సోకింది.  

మళ్లీ లాక్‌డౌన్‌ లేదు  
లాక్‌డౌన్‌ నిబంధనల్లో ఇచ్చిన సడలింపులను ఉపసంహరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందన్న వార్తల్లో ఏమాత్రం
వాస్తవం లేదని ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరే శుక్రవారం చెప్పారు. అలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ వల్ల దెబ్బతిన్న ఆర్థి్థక వ్యవస్థను పునరుద్ధరించడానికి  దశలవారీగా సడలింపులు ఇచ్చామని గుర్తుచేశారు. రాష్ట్రంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధించాలన్న ఉద్దేశం తమకు లేదన్నారు. కొన్ని మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా వేదికలు తప్పుడు వార్తలతో ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నాయని తప్పుపట్టారు. పుకార్లు పుట్టించడం నేరమని హెచ్చరించారు. కరోనా నియంత్రణకు జాగ్రత్తలు పాటించాలని
ప్రజలను కోరారు.

మహారాష్ట్రలో కల్లోలం  
మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. గత 24 గంటల్లో 3,493 మంది కరోనా బారినపడ్డారు. 127 మంది బాధితులు చనిపోయారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,01,141కు, మరణాల సంఖ్య 3,717కు చేరడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో 47,796 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు.


చైనా రాజధాని బీజింగ్‌లో 56 రోజుల తర్వాత మళ్లీ కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం బీజింగ్‌లో రెండు కేసులు నిర్థారణయ్యాయి. దీంతో చైనాలో కొత్తగా 10 మంది ఈ వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఒకటి నుంచి మూడో తరగతి దాకా ప్రాథమిక పాఠశాలలు తెరవాలన్న నిర్ణయాన్ని చైనా ప్రభుత్వం ఉపసంహరించుకుంది.      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement