
వాషింగ్టన్: అమెరికాలో వరుసగా 12 వ రోజు లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో శనివారం నమోదైన కేసుల సంఖ్య 1,66,555. దీంతో ఆ దేశంలో నమోదైన మొత్తం కోవిడ్–19 కేసుల సంఖ్య 1,12,48,681కి చేరింది. అలాగే, కరోనాతో శనివారం 1,266 మంది చనిపోయారు. దీంతో, అక్కడి కరోనా మరణాల సంఖ్య 2,51,330కి చేరింది. అమెరికాలో కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఆసుపత్రులపై భారం మరింత పెరగడంతో పాటు, లాక్‌డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి రావచ్చనంటున్నారు. మరోవైపు, మెక్సికోలో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అక్కడ కరోనాతో 98,259 మంది చనిపోయారు.
ఆస్ట్రియాలో మళ్లీ లాక్‌డౌన్
కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆస్ట్రియాలో మంగళవారం నుంచి మరోసారి దేశవ్యాప్త లాక్‌డౌన్ విధిస్తున్నారు. ఆస్త్రియాలో శుక్రవారం 9,586 కేసులు నమోదయ్యాయి. కుటుంబ సభ్యులు మినహా ఎవరినీ కలుసుకోవద్దని ఆ దేశ చాన్సెలర్ సెబాస్టియన్ దేశ ప్రజలను కోరారు. మంగళవారం నుంచి డిసెంబర్ 6 వరకు అత్యవసర సేవలు మినహా అన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. యూరోప్ లోని పలు దేశాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటలీలోని కంపేనియా, టస్కనీల్లో ఆదివారం నుంచి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కంపేనియాలో వైద్యారోగ్య వ్యవస్థ కుప్పకూలే స్థాయికి చేరుకుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పోర్చుగల్‌లో రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు.