Austria
-
‘ప్రతిసారి దూకుడు పనికిరాదు.. సూపర్ ఫిట్‌గా ఉండాలి’
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఆస్ట్రియాలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల ఈ షట్లర్ కాంస్య పతకం చేజార్చుకొని నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్లో ఆడటానికి ముందు అత్యుత్తమ ఫిట్నెస్ సాధించేందుకు ఆదివారం ఆస్ట్రియా బయలుదేరాడు. ఈ నేపథ్యంలో లక్ష్య కోచ్ విమల్ కుమార్ మాట్లాడుతూ.. బలాబలాలు అంచనా వేసుకునేందుకు, సానుకూలతలు పెంచుకునేందుకు ఈ పర్యటన లక్ష్య సేన్‌కు ఉపయోగపడనుందని పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం లక్ష్యసేన్ పూర్తి ఫిట్నెస్తోనే ఉన్నాడు. కానీ అతడికి మరింత శారీరక శిక్షణ అవసరం. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్‌పై దృష్టి పెట్టాలి. అందుకే లక్ష్య వారం రోజుల పాటు ఆస్ట్రియాలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటాడు. ఫిట్నెస్ను మరింత మెరుగు పరుచుకోవడంతో పాటు... అతడి ఆటలో వేగం పెంచుకునేందుకు ఈ శిక్షణ తోడ్పడనుంది. సాధారణంగా లక్ష్య ఆటతీరు దూకుడుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు డిఫెన్స్ కూడా ముఖ్యమే. నెట్ గేమ్‌పై పట్టు సాధించాలంటే సూపర్ ఫిట్‌గా ఉండాలి’అని విమల్ పేర్కొన్నాడు. వచ్చే నెలలో హాంకాంగ్ సూపర్–500, చైనా ఓపెన్ సూపర్–1000 టోరీ్నల్లో లక్ష్యసేన్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి. -
టేలర్ స్విఫ్ట్ కచేరీపై ఉగ్రదాడికి కుట్ర
వియన్నా: ఆ్రస్టియా భద్రతాధికారులు సకాలంలో స్పందించి పెనుముప్పు నివారించగలిగారు. అమెరికా గాయని టేలర్ స్విఫ్ట్ గురువారం రాజధాని వియన్నాలో తలపెట్టిన కచేరీలో నరమేధానికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను భగ్నం చేశారు. 19 ఏళ్ల ప్రధాన సూత్రధారి సహా 17 ఏళ్ల మరో యువకుడిని అరెస్ట్ చేశారు. 15 ఏళ్ల మరో అనుమానితుడిని ప్రశి్నస్తున్నారు. ఎర్నెస్ట్ చాపెల్ స్టేడియానికి వచ్చే వారిని పేలుడు పదార్థాలు వాడి లేదా కత్తులతో పొడిచి సాధ్యమైనంత ఎక్కువమందిని చంపాలని పథకం వేసినట్లు తేలింది. వీరికి ఉగ్ర సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో సంబంధాలున్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. ఈ పరిణామం నేపథ్యంలో టేలర్ పాల్గొనాల్సిన మొత్తం మూడు కచేరీలను రద్దు చేశారు. -
పొట్టి క్రికెట్లో సంచలనం.. 11 బంతుల్లో 66 రన్స్
యూరోపియన్ క్రికెట్ టీ10 టోర్నీలో సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రొమినియాపై ఆస్ట్రియా అద్భుత విజయం సాధించింది. 168 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆస్ట్రియా కేవలం 3 వికెట్లు కోల్పోయి 9. 5 ఓవర్లలో చేధించింది.అయితే ఛేజింగ్‌లో ఆస్ట్రియా 8 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్లు కోల్పోయి కేవలం 107 పరుగులు మాత్రమే చేసింది. ఆస్ట్రియా విజయానికి ఆఖరి మూడు ఓవర్లలో 61 పరుగులు అవసరమయ్యాయి. దీంతో ఆస్ట్రియా ఓటమి లాంఛనమే అంతా భావించారు.కానీ సరిగ్గా ఇదే సమయంలో ఆస్ట్రియా బ్యాటర్లు ఇమ్రాన్ ఆసిఫ్, అకిబ్ ఇక్బాల్ అద్భుతం చేశారు. 11 బంతుల్లో ఏకంగా 66 పరుగులు చేసి ఆస్ట్రియాకు సంచలన విజయాన్ని అందించారు. ఆస్ట్రియా బ్యాటర్లు 9వ ఓవర్లో ఏకంగా 41 పరుగులు రాబట్టగా.. 10వ ఓవర్లో తొలి 5 బంతులలో 20 పరుగులు వచ్చాయి. దీంతో లక్ష్య చేధనలో ఆస్ట్రియా 9. 5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆస్ట్రియా బ్యాటర్లలో ఇక్భాల్(19 బంతుల్లో 72, 2 ఫోర్లు,10 సిక్స్‌లు) టాప్ స్కోరర్ నిలవగా.. ఆసిఫ్ 12 బంతుల్లో 22 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఆస్ట్రియా బ్యాటర్ల విధ్వంసానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
PM Narendra Modi: యుద్ధాలకు సమయం కాదిది
వియన్నా: ప్రపంచం ఇప్పటికే అనేకానేక సమస్యలతో సతమతమవుతున్న నేపథ్యంలో ఇది యుద్ధాలకు సమయం కాదని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. రెండు రోజుల ఆ్రస్టియా పర్యటనలో భాగంగా ఆ దేశ చాన్సలర్ కార్ల్ నెహమర్‌తో బుధవారం ఆయన భేటీ అయ్యారు. పశి్చమాసియా సంక్షోభంతో పాటు ఉక్రెయిన్ యుద్ధం తదితరాలపై నేతలిద్దరూ లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసుకోవాలని, అందుకోసం మైలిక సదుపాయాలు, సంప్రదాయేతర ఇంధన వనరులు, ఇన్నొవేషన్లు, నీటి–వ్యర్థాల నిర్వహణ వంటి అన్ని రంగాల్లోనూ అవకాశాలనూ మరింతగా అందిపుచ్చుకోవాలని నిర్ణయించారు. ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. శాంతియుత వాతావరణంలో చర్చలే యుద్ధాలకు ఏకైక పరిష్కారమమని పేర్కొన్నారు. అందుకు అన్నివిధాలా సహకరించేందుకు ఇరు దేశాలూ సిద్ధమని ప్రకటించారు. ఔరాసతో పాటు పలు అంతర్జాతీయ సంస్థల్లో సమకాలీన అవసరాలకు తగ్గట్టుగా సంస్కరణలు అవసరమని నేతలు అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు మొదలుకుని ఉగ్రవాదం దాకా అన్ని అంశాలపైనా చర్చించినట్టు వివరించారు. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తుల నిర్వహణ మౌలిక సదుపాయాల కూటమి, జీవ ఇంధన కూటమి తదితరాల్లో భాగస్వామి కావాలని ఆ్రస్టియాను మోదీ ఈ సందర్భంగా ఆహా్వనించారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ పాత్ర కీలకమని నెహమర్ అభిప్రాయపడ్డారు. గార్డాఫ్ ఆనర్ భారత ప్రధాని ఆ్రస్టియాలో పర్యటించడం 41 ఏళ్ల అనంతరం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో బుధవారం మోదీకి వియన్నాలో గార్డాఫ్ ఆనర్ లభించింది. స్థానిక కళాకారులు వందేమాతరం ఆలపించారు. మోదీని నెహమర్ ఆలింగనం చేసుకున్నారు. ఆయనతో సెల్ఫీ తీసుకుంటూ సందడి చేశారు. ఆ ఫొటోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘మోదీ జీ! వియన్నాకు స్వాగతం’ అని పేర్కొన్నారు. అంతకుముందు నేతలిద్దరూ పలు అంశాలపై చాలాసేపు మనసు విప్పి మాట్లాడుకున్నారు.సీఈవోలతో భేటీభారత్లో ఇన్ఫ్రా, ఇంధన, టెక్నాలజీ తదితర రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ్రస్టియా కంపెనీలను మోదీ ఆహ్వానించారు. స్థానిక హాఫ్బర్గ్ ప్యాలెస్‌లో ఆ్రస్టియా, ఇండియా సీఈఓల రౌండ్‌టేబుల్ భేటీలో మోదీ, నెహమర్ పాల్గొన్నారు. ఇరు దేశాల నడుమ 2023లో 293 కోట్ల డాలర్ల మేర వర్తకం జరిగింది.అధ్యక్షునితో భేటీ ఆ్రస్టియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్ బెలన్తో మోదీ భేటీ అయ్యారు. పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై లోతుగా చర్చించుకున్నట్టు చెప్పారు. ఈ మేరకు మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తమ భేటీ అద్భుతంగా జరిగిందన్నారు. -
యుద్ధంతో సమస్యలు పరిష్కారం కావు.. ఆస్ట్రియాలో భారత ప్రధాని మోదీ
వియన్నా: మూడోసారి భారత్ ప్రధానిగా ఎన్నిక అయ్యాక ఆస్ట్రియాలో పర్యటించే అవకాశం రావటం చాలా ఆనందంగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ప్రధాని మోదీ ఆస్ట్రియా పర్యటన బుధవారం కొనసాగుతోంది. ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ ఉన్నతస్థాయి సమావేశం అయ్యారు. అనంతరం ప్రధాని మోదీ, ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ‘ఇది యుద్ధం చేసే సమయం కాదు. ఇదే విషయాన్ని నేను గతంలో చెప్పాను. యుద్దంతో సమస్యలకు పరిష్కారాన్ని కనుగొనలేం. ప్రపంచంలో ఎక్కడైనా అమాయక ప్రజలను బలితీసుకోవటం ఆమోదించదగ్గ విషయం కాదు. భారత్, ఆస్ట్రియా కలిసి దౌత్యపరంగా సహకారం అందిస్తాం. .. నేను మూడోసారి ప్రధానిగా ఎన్నికయ్యాక ఇక్కడికి వచ్చే అవకాశం రావటం చాలా ఆనందంగా ఉంది. 41 ఏళ్ల తర్వాత ఆస్ట్రియా పర్యటించటం చాలా ప్రత్యేకంతో పాటు చారిత్రాత్మకమైంది. ఇవాళ ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో సానుకూలమైన చర్చలు జరిగాయి. ఇరుదేశాల మధ్య భవిష్యత్తులో చేసుకొనే పలు ఒప్పందాల వృద్దిపై చర్చించాం. అందులో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక శక్తి, హైడ్రోజన్, వాటర్, వ్యర్థాల నిర్వహణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో అభివృద్ధి కోసం ఒప్పందాలపై చర్చలు జరిపాం’ అని ప్రధాని మోదీ తెలిపారు.#WATCH | Vienna: PM Modi says, " ...I have told earlier also, this is not the time for war, we won't be able to find solution to problems in the Warfield. Wherever it is, killing of innocent people is unacceptable. India and Austria emphasize dialogue and diplomacy, and for that,… pic.twitter.com/GwrGL1E9PN— ANI (@ANI) July 10, 2024 అంతకుముందు.. ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్ మాట్లాడారు. ‘‘నిన్న రాత్రి, ఇవాళ ఉదయం భారత ప్రధాని మోదీతో ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దురాక్రమణపై చాలా విషయాలు చర్చించుకున్నాం. యూరోపియన్ దేశాల ఆందోళన భారత్ తెలుసుకోవటం, సాయం అందించటం చాలా ముఖ్యమైన అంశం. అదే విధంగా మధ్య ప్రాచ్యంలో నెలకొన్న ఘర్షణలు చాలా ప్రధానమైనవి. భౌగోళికంగా సవాలు విసురుతున్న ఈ ఘర్షణ పరిస్థితులపై సహకారంపై చర్చలు జరిపాం. 1950 నుంచి ఇండియా , ఆస్ట్రియా దేశాల మధ్య స్నేహం కొనసాగుతోంది. ఈ స్నేహం నమ్మకంతో ముందుకుసాగుతోంది. 1955లో ఇండియా ఆస్ట్రియాకు సాయం చేసింది. అప్పటి నుంచి భౌగోళిక రాజకీయ పరిస్థితుల అభివృద్ధిపై ఇరు దేశాలను ఏకం చేస్తోంది’’ అని పేర్కొన్నారు.#WATCH | Vienna: Austrian Chancellor Karl Nehammer says, "...There is a very good relationship between India and Austria. It's a relationship of trust which began in the 1950s...India helped Austria and in 1955, the negotiations came to a positive conclusion with the Austrian… pic.twitter.com/Vg4wX0e1IK— ANI (@ANI) July 10, 2024దీని కంటేముందు ప్రధాని మోదీకి ఆస్ట్రియాలో ఘనస్వాగతం లభించింది. రెండ్రోరోజుల రష్యా పర్యటన అనంతరం మోదీ బుధవారం ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో రిట్జ్ కార్ల్టన్ హోటల్లో భారతీయులు, ఆస్ట్రియన్స్ కళాకారులు వందేమాతరం గీతంతో మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. -
ఆస్ట్రియాలో ప్రధాని మోదీ.. ‘వందేమాతరం’తో ఘన స్వాగతం
వియన్నా : ప్రధాని మోదీకి ఆస్ట్రియాలో ఘనస్వాగతం లభించింది. రెండ్రోరోజుల రష్యా పర్యటన అనంతరం మోదీ బుధవారం ఆస్ట్రియాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీ ఆస్ట్రియా రాజధాని వియన్నాలో రిట్జ్ కార్ల్టన్ హోటల్లో భారతీయులు, ఆస్ట్రియన్స్ కళాకారులు వందేమాతరం గీతంతో మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. Landed in Vienna. This visit to Austria is a special one. Our nations are connected by shared values and a commitment to a better planet. Looking forward to the various programmes in Austria including talks with Chancellor @karlnehammer, interactions with the Indian community and… pic.twitter.com/PJaeOWVOm1— Narendra Modi (@narendramodi) July 9, 202441 ఏళ్లలో భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి. 1983లో ఆ దేశాన్ని సందర్శించిన చివరి ప్రధాని ఇందిరా గాంధీ.ఇక మోదీ తన పర్యటనలో భాగంగా ఆస్ట్రియా ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్‌తో కలిసి ఆస్ట్రియా, భారత్‌కు చెందిన వ్యాపార వేత్తలతో ఉన్నత స్థాయి చర్చలు జరపనున్నారు.దీంతో పాటు ఆస్ట్రియాతో పలు ఒప్పందాలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మోదీ పర్యటనపై స్పందించిన నెహమ్మర్ఇక మోదీ పర్యటనపై ఆస్ట్రియా ఛాన్సలర్ నెహమ్మర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు నేను ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే 41ఏళ్లలో తొలిసారి భారత ప్రధాని ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. భారత్‌తో దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు సందర్భంగా మనం వేడుక జరుపుకుంటున్నాం’ అని నెహమ్మర్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఈ పర్యటనలో ఆస్ట్రియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ వాన్ డెర్ బెల్లెన్‌తో భేటీ అవుతారని, చాన్స్‌లర్‌తో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వశాఖ (ఇఎఎం) వెల్లడించింది. ‘మా ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవడం, అనేక భౌగోళిక రాజకీయ సవాళ్లపై సన్నిహిత సహకారం గురించి మాట్లాడటానికి మాకు ఇదొక గొప్ప అవకాశం’అని ఆస్ట్రియన్ ఛాన్సలర్ నెహమ్మర్ అన్నారు.ధన్యవాదాలు నెహమ్మర్నెహమ్మర్ ట్వీట్‌పై మోదీ స్పందించారు. ‘ధన్యవాదాలు, ఛాన్సలర్ కార్ల్ నెహమ్మర్. ఈ చారిత్రాత్మక సందర్భానికి గుర్తుగా ఆస్ట్రియాను సందర్శించడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాను. మన దేశాల మధ్య బంధాలను బలోపేతం చేయడం, సహకారానికి కొత్త మార్గాలను అన్వేషించేందుకు నేను ఎదురుచూస్తున్నాను’అని మోదీ రిప్లయి ఇచ్చారు. -
European Chess Club Cup 2022: హరికృష్ణ జట్టుకు యూరోపియన్ చెస్ క్లబ్ టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ సభ్యుడిగా ఉన్న నోవీ బోర్ చెస్ క్లబ్ ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ (ఈసీసీ) టోర్నమెంట్లో టైటిల్ సాధించింది. ఆస్ట్రియాలో జరిగిన ఈ టోర్నీలో మొత్తం 70 క్లబ్ జట్లు పాల్గొన్నాయి. చెక్ రిపబ్లిక్కు చెందిన నోవీ బోర్ క్లబ్ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లోనూ గెలిచి అజేయంగా నిలిచి 14 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుంది. నోవీ బోర్ క్లబ్లో హరికృష్ణతోపాటు గ్రాండ్‌మాస్టర్లు విదిత్ సంతోష్ (భారత్), రాడోస్లా (పోలాండ్), డేవిడ్ నవారా (చెక్ రిపబ్లిక్), ఎన్గుయెన్ థాయ్ డై వాన్ (చెక్ రిపబ్లిక్), నిల్స్ గ్రాండెలియస్ (స్వీడన్), డేవిడ్ గిజారో (స్పెయిన్), మార్కస్ రేజర్ (ఆస్ట్రియా) సభ్యులుగా ఉన్నారు. వ్యక్తిగత విభాగంలో హరికృష్ణకు రజత పతకం లభించింది. బోర్డు–1పై ఆడిన హరికృష్ణ మొత్తం ఏడు పాయింట్లకుగాను 4.5 పాయింట్లు స్కోరు చేశాడు. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ ప్రాతినిధ్యం వహించిన ఆఫర్స్పిల్ చెస్ క్లబ్ (నార్వే) ఏడో స్థానంలో... భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్, యువ గ్రాండ్‌మాస్టర్ గుకేశ్ సభ్యులుగా ఉన్న సీఎస్‌యు ఏఎస్ఈ సూపర్‌బెట్ (రొమేనియా) క్లబ్ ఆరో స్థానంలో... తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్ సభ్యుడిగా ఉన్న తాజ్ఫన్ లుబియానా (స్లొవేనియా) క్లబ్ ఎనిమిదో స్థానంలో నిలిచాయి. -
నోబెల్ 2022: ఫిజిక్స్‌లో ముగ్గురికి ప్రైజ్
స్టాక్‌హోమ్: భౌతిక శాస్త్రంలో 2022 ఏడాదికిగానూ నోబెల్ బహుమతిని ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కమిటీ ఈ ప్రకటన చేసింది. భౌతిక శాస్త్ర మేధావులు అలెయిన్ ఆస్పెక్ట్, జాన్ ఎఫ్. క్లౌజర్, ఆంటోన్ జెయిలింగర్‌లకు సంయుక్తంగా ఈసారి ప్రైజ్ దక్కింది. చిక్కుబడ్డ ఫోటాన్లు, బెల్ అసమానతలను ఉల్లంఘించడం, క్వాంటం ఇన్ఫర్మేషన్ సైన్స్‌కు మార్గదర్శకత్వం వహించడం లాంటి పరిశోధలకుగానూ ఈ ముగ్గురికి ఈసారి నోబెల్ పురస్కారం దక్కింది. వీళ్ల ప్రయోగాత్మక సాధనాల అభివృద్ధి ‘క్వాంటం టెక్నాలజీ’ కొత్త శకానికి పునాది వేసిందని రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటన సమయంలో పేర్కొంది. ఫ్రాన్స్‌కు చెందిన భౌతిక శాస్త్రవేత్త అలెయిన్ ఆస్పెక్ట్ కాగా.. జాన్ ఎఫ్. క్లౌజర్ అమెరికాకు చెందిన భౌతిక శాస్త్రవేత్త. ఇక ఆంటోన్ జెయిలింగర్ ఆస్ట్రియాకు చెందిన క్వాంటం భౌతిక శాస్త్రవేత్త. BREAKING NEWS: The Royal Swedish Academy of Sciences has decided to award the 2022 #NobelPrize in Physics to Alain Aspect, John F. Clauser and Anton Zeilinger. pic.twitter.com/RI4CJv6JhZ — The Nobel Prize (@NobelPrize) October 4, 2022 చిక్కుకుపోయిన క్వాంటం స్థితులను ఉపయోగించి సంచలనాత్మక ప్రయోగాలను నిర్వహించారు ఈ ముగ్గురు. ఇక్కడ రెండు కణాలు విడిపోయినప్పుడు కూడా ఒకే యూనిట్‌గా ప్రవర్తిస్తాయి. ఈ ముగ్గురి సాధన ఫలితాలు.. క్వాంటం సమాచారం ఆధారంగా కొత్త సాంకేతికతకు మార్గం క్లియర్ చేశాయి అని నోబెల్ కమిటీ ప్రకటించింది. ► కిందటి ఏడాది కూడా ఫిజిక్స్‌లో ముగ్గురికే సంయుక్తంగా అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ► 1901 నుంచి ఇప్పటిదాకా భౌతిక శాస్త్రంలో 115 బహుమతులను ఇచ్చారు. ఇందులో నలుగురు గ్రహీతలు మాత్రమే మహిళలు. మేడమ్ క్యూరీ(1903), మారియా జియోప్పెర్ట్ మయర్(1963), డొన్నా స్ట్రిక్‌ల్యాండ్(2018), ఆండ్రియా గెజ్(2020) ఈ లిస్ట్‌లో ఉన్నారు. ► ఇక ఫిజిక్స్‌లో చిన్నవయసులో నోబెల్ ఘనత అందుకుంది లారెన్స్ బ్రాగ్. కేవలం పాతికేళ్ల వయసుకే ఇతను 1915లో ఫిజిక్స్ నోబెల్ అందుకున్నాడు. -
వరస్ట్ కండీషన్స్, డిప్రెస్డ్ ఫీలింగ్స్.. మీకోసమే ఇది.. ఒక్కసారి చదివితే!
‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రద్ధా కపూర్‌కు పుస్తకాలు శ్రద్ధగా చదువుకోవడం చాలా ఇష్టమైన పని. ఆమెకు బాగా నచ్చిన పుస్తకాల్లో ఒకటి...మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఈ పుస్తకం గురించి తెలుసుకుందాం... ‘ఈ జీవిత పరమార్థం ఏమిటి?’ అనే బరువైన ప్రశ్నకు అంతకంటే బరువైన సమాధానాలు చెప్పిన పుస్తకాలు వచ్చాయి. చాలా తేలికగా చెప్పిన పుస్తకాలు వచ్చాయి. ఈ పరంపరలోనిదే ఈ పుస్తకం. ఆస్ట్రియా న్యూరోలజిస్ట్, సైకియాట్రిస్ట్ రాసిన పుస్తకం...మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్. ఎంత గట్టి మనిషికి అయినా బేలగా మారిపోయి నిరాశలోకి జారిపోయే సందర్భాలు ఎదురవుతుంటాయి. వరస్ట్ కండీషన్స్, డిప్రెస్డ్ ఫీలింగ్స్ నుంచి బయటపడడానికి ఎంతో ఉపకరించే పుస్తకం ఇది. ‘లోగోథెరపీ’ ఫౌండర్‌గా ప్రసిద్ధి పొందిన విక్టర్ ఫ్రాంక్ల్ ఈ పుస్తకంలో తన నిజజీవిత సంఘటనలు, కేస్స్టడీస్లను ఉదహరించారు. పేథాలాజికల్ టర్మ్స్‌ను ఉపయోగించి వాటి గురించి వివరించారు. ఫస్ట్ సెక్షన్లో కాన్సన్ట్రేషన్ క్యాంపులలో ఖైదీల దుర్భర జీవితాన్ని గురించి వివరిస్తారు. ఆ అనుభవం తనకు స్వయంగా ఉండడం, ఇతర ఖైదీలతో మాట్లాడే అవకాశం లభించడంతో బలంగా రాయగలిగారు. మొదటి సెక్షన్ ముగిసేలోపు ‘జీవితపరమార్థం ఏమిటి?’ అనే ప్రశ్నకు సమాధానం దొరికినట్లే అనిపిస్తుంది. రెండో సెక్షన్లో లోగోథెరపీ అంటే ఏమిటి? లోగోథెరపీకి, సైకోఎనాలసిస్కు మధ్య ఉండే తేడా ఏమిటి? అనేది తెలియజేస్తారు. ఎగ్జిస్టెన్షియల్ వాక్యూమ్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సర్వైవల్.... మొదలైన ‘లోగోథెరపీ’ కాన్సెప్ట్‌ల గురించి వివరంగా తెలియజేస్తారు. ‘ఖాళీ ఛాంబర్లోకి గ్యాస్ వదిలితే కొద్దిసేపట్లోనే ఆ గ్యాస్ ఛాంబర్‌ను పూర్తిగా ఆక్రమిస్తుంది. ఆ ఛాంబర్ పెద్దదా? చిన్నదా? అనేది విషయం కాదు. గ్యాస్ అంతటా విస్తరించడం అనేది వాస్తవం’ ‘గ్యాస్’ అనేది సమస్య అనుకుంటే అది ఎంతైనా విస్తరిస్తుంది. 170 పేజీల ‘మ్యాన్స్ సెర్చ్ ఫర్ మీనింగ్’ పుస్తకం ‘షార్ట్ అండ్ స్వీట్’ అని పేరు తెచ్చుకుంది. ఈ పుస్తకాన్ని ఒక్కరోజులో చదివేయవచ్చు. ఆలోచిస్తూ ఆలోచిస్తూ, మనలోకి మనం ప్రయాణం చేస్తూ సంవత్సరాలు చదివేయవచ్చు. జీవితం అనేది అదుపుతప్పిన బండిలా పరుగులు తీస్తున్నప్పుడో, లక్ష్యం లేని బాణంలా దూసుకుపోతున్నప్పుడో, మనిషిగా కాకుండా మనకు మనమే భౌతికవస్తువుగా అనిపిస్తున్నప్పుడో... ఒక ప్రశ్న తప్పనిసరిగా వేసుకోవాల్సిందిగా చెబుతుంది ఈ పుస్తకం. ‘జీవిత పరమార్థం ఏమిటి?’ ఈ ప్రశ్న తీసుకువచ్చే సమాధానం మన జీవితాన్ని వెలుగుమయం చేయవచ్చు. వేనవేల కొత్తశక్తులను బహుమానంగా ఇవ్వవచ్చు. చదవండి👉🏾 ∙ Pooja Hegde: థింకింగ్, ఫాస్ట్ అండ్ స్లో.. ‘రెండూ అబద్ధాలే ఎందుకు కాకూడదు’! -
అసెంబ్లీకి ఆస్ట్రియా పార్లమెంటరీ బృందం
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రెండురోజుల తెలంగాణ పర్యటనకు వచ్చిన ఆస్ట్రియా పార్లమెం టరీ ప్రతినిధి బృందం మంగళవారం శాసనసభను సందర్శించి బడ్జెట్ సమావేశాలను వీక్షించింది. ఈ సందర్భంగా ఆస్ట్రియా ప్రతినిధి బృందం అసెంబ్లీ సమావేశాలను వీక్షిస్తోందని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించగా సభ్యులు అభివాదం చేశారు. ఈ ప్రతినిధి బృందంలో ఆస్ట్రియా నేషనల్ కౌన్సిల్ (దిగువ సభ) ప్రెసిడెంట్ వుల్ఫ్‌గాంగ్ సోబోట్కా, ఫెడరల్ కౌన్సిల్ (ఎగువ సభ) ప్రెసిడెంట్ క్రిస్టినా స్వర్జ్–ఫచ్‌తోపాటు 17 మంది పార్లమెంట్ సభ్యు లు ఉన్నారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో సమావేశమయ్యారు. 400 ఏళ్లకు పైబడిన హైదరాబాద్ నగర ప్రత్యేకతలను స్పీకర్ వివరించారు. ఆస్ట్రియా ప్రతినిధి బృందం పర్యటన భారత్‌తో సుదృఢ సంబంధాలకు తోడ్పడుతుందని వుల్ఫ్‌గాంగ్ సొబోట్కా అన్నారు. ఆస్ట్రియాతో సంబంధాలు బలోపేతం: దీక్షిత్ ఇండియా, ఆస్ట్రియా మధ్య సంబంధాలు మరింత బలపడేలా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్‌లో ఆస్ట్రియా దేశ గౌరవ కాన్సులేట్ జనరల్ వాగీష్ దీక్షిత్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఆస్ట్రియా కాన్సులేట్ జనరల్ కార్యాలయాన్ని ఆయన ఆస్ట్రియా పార్లమెంటు సభ్యులతో కలసి ప్రారంభించారు. -
కొన్న రేటు రూ. 500.. అమ్మింది ఏమో రూ. 16 లక్షలకు!!!
Wooden Chair Bought From Junk Shop Brings Luck For UK Lady: అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. ‘టకాటకా’మని బాదినప్పుడే తలుపు తీయాలి. ఓ మహిళ అలా చేసింది కాబట్టే ఇంట కాసుల వర్షం కురిసింది. జంక్ షాపులో కొన్న ఓ పాత కుర్చీ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఎలాగో ఇది చదవండి.. ఈస్ట్ సస్సెక్స్(యూకే) బ్రిగ్టన్కు చెందిన ఓ మహిళ.. పాత సామాన్లు అమ్మే ఓ షాపు నుంచి ఆమధ్య ఓ కుర్చీ కొనుక్కుంది. దాని ధర 5 పౌండ్లు(మన కరెన్సీలో 500రూ. దాకా). అయితే అప్పుడు దాని విలువ ఆమెకి తెలియదు. పాత సామాన్లపై ఆసక్తి ఉన్న ఓ దగ్గరి బంధువు ఆ కుర్చీ మీద వేసిన డేట్ చూశాడు. స్టడీ చేసి దాని గొప్పతనం గురించి చెప్పడంతో ఆమె దానిని వేలంపాటకు తీసుకెళ్లింది. వేలంలో ఆమెకు 16, 250 పౌండ్లు వచ్చాయి. మన కరెన్సీలో దాని విలువ రూ. 16 లక్షల 40 వేల రూపాయలకు పైనే. ఆ కుర్చీ 20వ శతాబ్దంలో వియన్నా(ఆస్ట్రియా) ఎవంట్ గార్డే ఆర్ట్ స్కూల్‌కి చెందిందట. ఆస్ట్రియన్ పెయింటర్ కోలోమన్ మోసర్ 1902లో దానిని డిజైన్ చేశాడట. కోలోమన్ సంప్రదాయ శైలిలను వ్యతిరేకిస్తూ.. మోడ్రన్ ఆర్ట్ వర్క్ ద్వారా ఆస్ట్రియాలో పేరు సంపాదించుకున్నారు. నిచ్చెన తరహా స్టైల్లో పట్టీలను ఉపయోగించి ఆ కుర్చీనీ రూపొందించారాయన. ఇదంతా తెలిశాక ఆ మహిళ ఆ పాత కుర్చీతో ఎస్సెక్స్‌లోని స్వోడర్స్ యాక్షనీర్స్ ఆఫ్ మౌంట్ఫిట్చెట్ వాళ్లను సంప్రదించింది. వాళ్లు దానిని వేలం వేయగా.. ఆస్ట్రియాకు చెందిన ఓ డీలర్ దానిని 16,250 పౌండ్లు చెల్లించి దక్కించుకున్నాడు. విశేషం ఏంటంటే.. 120 ఏళ్లు గడుస్తున్నా కుర్చీ ఇంకా ఒరిజినల్ కండిషన్లోనే ఉండడం. చదవండి: వాసి వాడి తస్సాదియ్యా! 23 ఏళ్లకే 400 కోట్ల సంపాదన! -
బైజూస్ గూటికి జియోజెబ్రా
న్యూఢిల్లీ: ఇటీవల ఇతర సంస్థలను చేజిక్కించుకోవడంలో వేగం చూపుతున్న ఎడ్టెక్ దిగ్గజం బైజూస్ తాజాగా ఆస్ట్రియా కేంద్రంగా పనిచేస్తు న్న జియోజెబ్రాను కొనుగోలు చేసింది. అయితే డీల్ విలువను బైజూస్ వెల్లడించలేదు. లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా 11.5 కోట్ల మంది విద్యా ర్ధులకు సేవలందిస్తున్న బైజూస్ తాజా కొనుగోలుతో ప్రస్తుత మాథమాటిక్స్ పోర్ట్‌ఫోలియోకు మరిన్ని అభ్యాసన విధానాలను జత చేసుకోనుంది. అంతేకాకుండా కొత్త ప్రొడక్టులను సైతం ప్ర వేశపెట్టనుంది. కాగా.. మాథమాటిక్స్ లెర్నిం గ్లో పటిష్ట ప్లాట్‌ఫామ్స్ కలిగిన జియోజెబ్రా ఇకపైన కూడా వ్యవస్థాపకుడు, డెవలపర్ మార్కస్ హోహెన్వార్టర్ ఆధ్వర్యంలో స్వతంత్ర యూనిట్‌గా కొనసాగనున్నట్లు బైజూస్ పేర్కొంది. -
కరోనా 4వ వేవ్: 10 రోజుల లాక్డౌన్.. జనాల నిరసన
Covid 4th Wave Austria Re Enter Partial 10 Days Lockdown: గత కొద్ది రోజులుగా నెమ్మదించిన కరోనా మహమ్మారి ఉధ్రుతి పెంచింది. యూరప్ దేశాల్లో కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో పశ్చిమ యూరప్ దేశాల్లో ఒక్కటైన ఆస్ట్రియాలో 10 రోజుల పాక్షిక లాక్డౌన్ సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చింది. నాలుగో వేవ్ కారణంగా ఆస్ట్రియాలో శనివారంనాడు 15,297 కొత్త కేసులు నమోదయ్యాయి. గత వారం రోజూ 10వేలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతుండటంతో అక్కడ పాక్షిక లాక్డౌన్ అమలుచేయాలని నిర్ణయించారు. గరిష్ఠంగా 10 రోజుల పాటు దేశంలో ఈ లాక్డౌన్ అమలులో ఉంటుందని ఆస్ట్రియా ప్రభుత్వం ప్రకటించింది. సోమవారం ఉదయం నుంచి లాక్డౌన్ అమలులోకి రాగా.. పది రోజుల తర్వాత పరిస్థితిని సమీక్షించి తదుపరి నిర్ణయం తీసుకోనుంది. (చదవండి: టీకా వేయించుకోని వారికి ఆస్ట్రియాలో లాక్డౌన్) పాక్షిక లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా షాపులు, రెస్టారెంట్స్ మూతపడ్డాయి. సుమారు 8.9 కోట్ల మంది జనాలు ఇంటికే పరిమితం అయ్యారు. కాగా నిత్యవసారాలు, కార్యాలయాలకు వెళ్లేవారికి మాత్రం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు. పాఠశాలలు, కిండర్‌గార్డెన్స్ తెరిచి ఉంచినప్పిటికి.. కొన్ని రోజుల పాటు పిల్లలు ఇంటి వద్దనే ఉంచి.. ఆన్లైన్ క్లాసులు అటెండ్ అయ్యేలా చూడాలి అని ప్రభుత్వం తల్లిదండ్రులను కోరింది. అయితే వ్యాక్సిన్ వేయించుకోని వారికి మాత్రం లాక్డౌన్ కొనసాగుతుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం హెచ్చరించింది. అటు వాక్సినేషన్‌ను వేగవంతం చేసినట్లు ఆ దేశ ఇంటీరియర్ మంత్రి కార్ల్ నెహమ్మీర్ ఆదివారంనాడు మీడియాకు తెలిపారు. (చదవండి: 15 నెలలు..15 ఏళ్లుగా గడిచాయి...ఇక నావల్ల కాదు ) ఫిబ్రవరి 1 నుంచి దేశంలోని ప్రతిఒక్కరికా వ్యాక్సిన్ తప్పనిసరి చేయనున్నట్లు ఆ దేశ ఛాన్సలర్ అలెగ్జాండెర్ ఛాలెన్‌బెర్గ్ శుక్రవారంనాడు స్పష్టంచేశారు. అయితే దీన్ని ఎలా అమలుచేయనున్నారో ఆయన వెల్లడించలేదు. పశ్చిమ యూరప్‌లో అతి తక్కువగా ఆస్ట్రియాలో 66 శాతం మంది మాత్రమే ఇప్పటి వరకు పూర్తిగా వ్యాక్సినేషన్ తీసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ కట్టడికి సరైన చర్యలు తీసుకోకపోగా లాక్డౌన్ పేరుతో జనాలను బలి చేస్తున్నారని మండిపడుతున్నారు. చదవండి: ఒక్క కేసు.. లాక్డౌన్లో 6 మిలియన్ల మంది ప్రజలు -
టీకా వేయించుకోని వారికి ఆస్ట్రియాలో లాక్డౌన్
బెర్లిన్: కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో ఆస్ట్రియా ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ టీకా వేయించుకోని వారు ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ ఆదివారం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఈ ఆంక్షలు పది రోజుల పాటు అమలవుతాయని తెలిపింది. దేశ జనాభాలో కేవలం 65% మంది మాత్రమే కోవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నారు. దీంతో, 12 ఏళ్లు పైబడి టీకా వేయించుకోని వారు మరీ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆంక్షలు విధించింది. కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో సరిపోను వైద్య సౌకర్యాలు లేవని పౌరులను హెచ్చరించింది. -
పెన్షన్ డబ్బుల కోసం.. తల్లి మృతదేహాన్ని ‘మమ్మీ’గా మార్చి
వియాన్న: తల్లి చనిపోయింది. కానీ ఆమె మరణించింది అని తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్ డబ్బులు రాకుండా ఆగిపోతాయి. అలా జరిగితే తాను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని భావించిన ఓ వ్యక్తి తల్లి మృతదేహాన్ని మమ్మీగా మార్చాడు. అలా ఏడాది పాటు డెడ్‌బాడీని ఇంట్లోనే పెట్టుకుని కాలం వెళ్లదీయసాగాడు. విషయం కాస్త పోలీసులకు తెలియడంతో సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటన ఆస్ట్రియాలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. 89 ఏళ్ల వృద్ధురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ క్రమంలో ఆమె పెద్ద కుమారుడి(66)తో కలిసి టైరోల్ ప్రాంతంలోని ఇన్స్బ్రక్ సమీపంలో నివసిస్తుండేది. వృద్ధురాలికి ప్రతి నెల పెన్షన్ వస్తుండేది. ఈ క్రమంలో గతేడాది జూన్‌లో సదరు వృద్ధురాలి మరణించింది. ఈ విషయం బయటకు తెలిస్తే తల్లి పేరు మీద వచ్చే పెన్షన్ ఆగిపోతుందని భావించిన ఆమె కుమారుడు.. తల్లి మృతదేహాన్ని ఐక్‌ప్యాక్స్‌లో పెట్టి భద్రపరిచాడు. (చదవండి: పదిసార్లు తిరిగినా.. కళ్లకు కనిపిస్తలేనా.. పింఛన్ ఎందుకివ్వరు?) ఆ తర్వాత తల్లి మృతదేహానికి బ్యాండేజ్‌లు చుట్టి.. రసాయనాలలో ఉంచాడు. బ్యాండేజ్‌లు ఆ ద్రవాలను పీల్చుకుని.. మృతదేహాన్ని మమ్మీలా మార్చాయి. ఆ తర్వాత మమ్మీగా మార్చిన మృతదేహాన్ని ఇంటిలోపల దాచాడు. ఇక అతడి సోదరుడు తరచుగా ఇంటికి వచ్చి తల్లి గురించి ప్రశ్నించేవాడు. దానికి నిందితుడు.. ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆస్పత్రిలో చేర్చాను అని తెలిపేవాడు. ఇలా ఏడాదిగా తల్లి మరణాన్ని దాచి ఆమె పేరు మీద వస్తోన్న పెన్షన్ డబ్బులను తీసుకున్నాడు. అలా ఇప్పటి వరకు 60 వేల డాలర్ల(44,05,743 రూపాయలు) పెన్షన్ సొమ్మును తీసుకున్నాడు. (చదవండి: వృద్ధ గోవులకు పింఛను) ఎలా బయటిపడిందంటే.. ఏడాదిపాటుగా సాగుతున్న ఈ వ్యవహారం కొత్త పోస్ట్‌మ్యాన్ రాకతో బయటపడింది. పెన్షన్ సొమ్ము ఇవ్వడానికి ఇంటికి వచ్చిన కొత్త పోస్ట్‌మ్యాన్ తాను లబ్ధిదారుని చూశాకే డబ్బులు ఇస్తానని తెలిపాడు. అందుకు నిందితుడు అంగీకరించలేదు. దాంతో పోస్ట్‌మ్యాన్ ఈ వ్యవహారం తేడాగా ఉందని భావించి.. అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారు నిందితుడి ఇంటికి వచ్చి దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రసుత్తం నిందితుడిని అరెస్ట్ చేసి.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: విజేత: కల చెదిరినా కాసుల వర్షం కురిసింది -
విజేత: కల చెదిరినా కాసుల వర్షం కురిసింది
Bitpanda CEO Eric Demuth Success Story: ‘ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగింది’.. ఇదే జరిగింది ఎరిక్ డెమ్యూత్(34) లైఫ్‌లో. వృథా ఖర్చులకు వెనుకాడే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు తన కలను సైతం వదిలేసుకుని.. మరో దారిలోకి దిగాడు. విజయమో.. ఓటమో ఏదో ఒకటి తేల్చుకుని కెరీర్లో పోరాడాలనుకున్నాడు. అతని ప్రయత్నానికి అదృష్టం తోడైంది. ఒకప్పుడు జేబులో పాకెట్ మనీకి మూడు డాలర్లు పెట్టుకుని తిరిగిన కుర్రాడు.. ఇప్పుడు మిలియన్ల సంపదతో యూరప్‌ను శాసించే క్రిప్టో ట్రేడర్‌గా ఎదిగాడు మరి. బిట్‌పాండా.. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో ఓ సంచలనం. యూరప్‌లో క్రిప్టో కరెన్సీని ప్రధానంగా ప్రచారం చేసింది ఇదే. ఆస్ట్రియా-వియన్నా నియోబ్రోకర్గా ఉన్న ఈ కంపెనీ.. కామన్ పీపుల్‌కు క్రిప్టోకరెన్సీని చేరువచేసింది. డిజిటల్ కరెన్సీ ఇన్వెస్ట్మెంట్, బిట్‌కాయిన్‌ను హ్యాండిల్ చేయడం, డిజిటల్ ఆస్తుల కొనుగోలు-అమ్మకం, గోల్డ్ దాచుకోవడం, సేవింగ్స్.. ఇలా క్రిప్టో బిజినెస్ తీరుతెన్నులను సాధారణ పౌరులకు సైతం అర్థం అయ్యేలా చేసింది బిట్‌పాండా. ఈ ప్రత్యేకత వల్లే ఏడేళ్లు తిరగకుండానే యూరప్‌లో బిట్‌పాండా అగ్రస్థానంలో నిలిచింది. ప్రస్తుతం బిట్‌పాండా విలువ సుమారు 4.1 బిలియన్ డాలర్లపైనే ఉండగా.. అందులో డెమ్యూత్ వాటా దాదాపు 820 మిలియన్ల డాలర్లు. కష్టజీవి వియన్నాకి చెందిన ఎరిక్ డెమ్యూత్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడు. చిన్నప్పటి నుంచే పొదుపరిగా ఉండే ఈ కుర్రాడు ఏనాడూ పైసా విదిల్చేవాడు కాదు. పైగా తన చిన్నతనంలో పేరెంట్స్ చేసే వృథా ఖర్చులపై నిలదీసేవాడు. అలాంటి ఎరిక్‌కు షిప్‌కు కెప్టెన్ కావాలని కల ఉండేది. అందుకే చెప్పాపెట్టకుండా 23 ఏళ్ల వయసులో కంటెయినర్ షిప్స్ మీద కూలీ పనికి వెళ్లాడు. చైనా, జపాన్.. నైరుతి ఆసియా ప్రాంతాల్లో పని చేశాడు. షిప్ కెప్టెన్ కావాలన్నది అతని కల. ఆ కల కోసం అలా ఎన్నాళ్లైనా కష్టం భరించాలనుకున్నాడు. ఒక్కపూట తిండి.. చాలిచాలని జీతంతో గడిపాడు. కానీ, రెండున్నరేళ్లు గడిచాక అతని వల్ల కాలేదు. మెకానిక్‌గా, యాంకర్లు వేసే కూలీగా సంచార జీవనం గడపడం అతనికి బోర్‌గా అనిపించింది. అందుకే ఆ ఉద్యోగం వదిలేశాడు. వియన్నాకు తిరిగి వచ్చేశాడు. ఈసారి ఫైనాన్స్ చదవులోకి దిగాడు. పౌల్ క్లాన్స్చెక్తో డెమ్యూత్ కాళ్లు అరిగేలా తిరిగి, ఒప్పించి.. ఫైనాన్స్ కోర్స్ పూర్తి చేశాక.. డిజిటల్ బిజినెస్ ఎక్స్పర్ట్ పౌల్ క్లాన్స్చెక్ను కలిశాడు డెమ్యూత్. వీళ్లిద్దరూ మరో ఫైనాన్స్ ఎక్స్పర్ట్ క్రిస్టియన్ ట్రమ్మర్తో కలిసి క్రిప్టో కరెన్సీ ట్రేడ్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. పీటర్ థెయిల్ ‘వాలర్’ వెంచర్స్ సాయం కోసం ప్రయత్నించారు. కానీ, వాళ్లు ఒప్పుకోలేదు. అయినా టైం వేస్ట్ చేయకుండా వాలర్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగారు. వాళ్ల ప్రయత్నం థెయిల్ను ఆకట్టుకుంది. కొంతమేర పెట్టుబడులకు ముందుకొచ్చాడు. వారం తిరగకముందే 263 మిలియన్ డాలర్ల ఫండింగ్‌తో బిట్‌పాండా కంపెనీ మొదలైంది. ఇందులో డెమ్యూత్ ఖర్చు పెట్టకుండా దాచుకున్న సొమ్మంతా కూడా ఉంది. ఫలితం ఎలా ఉన్నా సరే.. ఇదొక బిజినెస్ పాఠం కావాలని ముగ్గురూ నిర్ణయించుకున్నారు. కట్ చేస్తే.. ఏడేళ్లకు యూరప్ క్రిప్టో కరెన్సీతో డిజిటల్ మార్కెట్‌ను శాసిస్తోంది ఆపరేటింగ్ ట్రేడ్ ప్లాట్‌ఫామ్ బిట్‌పాండా. మనిషి జీవితంలో అన్ని అనుకున్నట్లు జరుగుతాయన్న గ్యారెంటీ ఉందా?. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా మిగతా వాళ్లలాగే నాకు సరదాగా ఉండాలని ఉండేది. కానీ, వృథా ఖర్చులతో ఏం ఉపయోగం ఉండదని అర్థం చేసుకున్నా. నా లక్క్ష్యం ఒకటి ఉండేది. అది తప్పినా మరోదారిని ఎంచుకుని విజయం కోసం ప్రయత్నిస్తున్నా.(తనది పూర్తి విజయంగా ఒప్పుకోవట్లేదు డెమ్యూత్). నాలాగే చాలామందికి ఏదో సాధించాలనే తాపత్రయం ఉంటుంది. అందరికీ కల నెరవేర్చుకునేందుకు పరిస్థితులు అనుకూలించకపోవచ్చు. లేదంటే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. అలాంటప్పుడే సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే జీవితంలో ఏదో ఒక గొప్ప విజయాన్ని అందుకున్నవాళ్లం అవుతాం. - ఎరిక్ డెమ్యూత్ చదవండి: బిజినెస్ పాఠాలు నేర్పిన చిరంజీవి సినిమా తెలుసా? -
ఆవు కడుపులోని ఆ ద్రవాలతో ప్లాస్టిక్ భూతానికి చెక్!
తినడానికి తిండి లేక నగర వీధుల్లోని ఆవులు ప్లాస్టిక్ సంచులను తినడం సాధారణంగా చూసే ఉంటారు. అయితే.. ఆస్ట్రియా శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం ఇది ప్లాస్టిక్ భూతానికి చెక్ పెట్టే ఓ మార్గాన్ని సూచించింది! ఎందుకంటే.. ప్లాస్టిక్‌ను సైతం ముక్కలుగా చేసేయగల శక్తి ఆవు కడుపులోని ద్రవాలకు ఉంటుందని వీరు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే కొన్ని ఎంజైమ్‌లు ప్లాస్టిక్ చెత్తను నాశనం చేయగలవన్నమాట. పాస్టిక్ చెత్త భూమి లోపలికి చేరి నాశనమయ్యేందుకు వందల ఏళ్లు పడుతుందన్నది మనకు తెలిసిన విషయమే. కానీ ఇటీవల బ్యాక్టీరియా సాయంతో ఈ సమయాన్ని తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆవు కడుపులోని ద్రవాల్లో ఉండే ఎంజైమ్‌లు కూడా అలాంటివే. ప్లాస్టిక్ సంచీల తయారీ సమయంలోనే ఇలాంటి ఎంజైమ్‌లు చేర్చేందుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. తాజాగా ఆస్ట్రియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఆవు కడుపులోని ద్రవాలను పరిశీలించగా.. అందులోని సూక్ష్మజీవులు కనీసం మూడు రకాల ప్లాస్టిక్‌లను ముక్కలు చేయగలవని కనుగొన్నారు. ఒక రకమైన సూక్ష్మజీవులతో పోలిస్తే ద్రవంలోని వివిధ రకాల బ్యాక్టీరియా కలసికట్టుగా మరింత సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే వేర్వేరు ఎంజైమ్‌లు ఇందుకు కారణమని శాస్త్రవేత్త డాక్టర్ డోరిస్ రిబిట్ వివరించారు. కబేళాల్లో నిత్యం ఈ ద్రవం అందుబాటులో ఉంటుంది కాబట్టి.. అక్కడికక్కడే ప్లాస్టిక్ చెత్తను నాశనం చేసే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. -
UEFA Euro 2020: ఆస్ట్రియా తొలిసారి...
బుకారెస్ట్: యూరో కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఆస్ట్రియా జట్టు తొలిసారి నాకౌట్ దశకు అర్హత సాధించింది. ఉక్రెయిన్‌తో సోమవారం జరిగిన గ్రూప్ ‘సి’ చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రియా 1–0తో గెలిచింది. 21వ నిమిషంలో బౌమ్గార్ట్నర్ ఆస్ట్రియాకు ఏకైక గోల్ అందించాడు. రెండో విజయంతో గ్రూప్ ‘సి’లో ఆస్ట్రియా ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. 2008, 2016 యూరో టోర్నీలలో ఆస్ట్రియా లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. మరోవైపు అమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ 3–0తో నార్త్ మెసడోనియాను ఓడించి తొమ్మిది పాయింట్లతో గ్రూప్ ‘సి’ టాపర్‌గా నిలిచింది. నెదర్లాండ్స్ తరఫున డెపే (24వ ని.లో) ఒక గోల్ చేయగా... వినాల్డమ్ (51వ, 58వ ని.లో) రెండు గోల్స్ సాధించాడు. -
మార్కెట్లోకి మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్!
దేశంలో చమురు ధరలు రోజు రోజుకి పెరుగుతున్న తరుణంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోళ్లవైపు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ప్రజల ఆసక్తికి అనుగుణంగా మార్కెట్లోకి కంపెనీలు కొత్త కొత్త ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా స్వీడిష్ కి చెందిన ఆస్ట్రియన్ కంపెనీ హుస్క్వర్నా మోటార్ సైకిల్స్ కూడా వచ్చి చేరింది. ఈ సంస్థ 2018 సంవత్సరంలో 6.7-హెచ్‌పీ మినీబైక్‌ను ఆవిష్కరించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ-పీలెన్ అనే బైక్‌తో ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల విభాగంలోకి అడుగు పెడుతున్నట్టు ప్రకటించింది. తాజాగా ఆస్ట్రియా ప్రధాన కార్యాలయ సంస్థ వెక్టోర్ అనే పేరుతో వెక్టార్ మోడల్‌తో కొత్త బ్యాటరీ స్కూటర్‌ను సంస్థ ఆవిష్కరించింది. ఈ సంస్థ తన బ్రాండ్ పేరుతో ఆవిష్కరించిన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌గా ఇది వస్తుంది. పట్టణ ప్రాంతాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ స్కూటర్‌ను రూపొందించారు. మెట్రో నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు, పెరుగుతున్న ఇంధన ధరలకు ఈ బైక్ చెక్ పెట్టనుందని కంపెనీ భావిస్తోంది. అయితే ఈ వెక్టార్ స్కూటర్‌ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే.. సుమారు 95 కిలోమీటర్ల వరకు ప్రయాణించనుందని కంపెనీ చెబుతోంది. కంపెనీ తన విస్తరణ ప్రణాళికలలో భాగంగా మొదట జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలలో తీసుకురావాలని యోచిస్తుంది. అయితే, హుస్క్వర్నా తన ఎలక్ట్రిక్ స్కూటర్ వెక్టర్ ను ఎప్పుడు తీసుకొస్తారు అనే దానిపై స్పష్టత లేదు. కానీ వినిపిస్తున్న ఊహాగనాల ప్రకారం, వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకొని రావచ్చు అని అంచనా. వెక్టోర్ ఒక ప్రత్యేకమైన వృత్తాకార హెడ్‌లైట్‌ను కలిగి ఉంది, రెండు వైపులా ఫెయిరింగ్ మరియు పసుపు రంగు స్ట్రోక్‌లతో రెండు-టోన్ పెయింట్ స్కీమ్‌ను కలిగి ఉంది. వెక్టార్ స్కూటర్‌పై అత్యధికంగా 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. చదవండి: Petrol Price: సెంచరీ కొట్టేసిన పెట్రోలు ధరలు -
15 నెలలు..15 ఏళ్లుగా గడిచాయి...ఇక నావల్ల కాదు
బెర్లిన్: అధిక పనితో బాగా అలసి పోయా నంటూ ఆస్ట్రియా ఆరోగ్య మంత్రి రుడాల్ఫ్ అన్సోబెర్ (60) మంగళవారం పదవికి రాజీనామా చేశారు. పనిభారం ఎక్కువై ఆరోగ్యం దెబ్బతిందని ఆయన పేర్కొన్నారు. వెంటనే విశ్రాంతి తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరించారని, అందువల్ల రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. పదవీ కాలంలో ఉన్న 15 నెలలు.. 15 ఏళ్లుగా గడిచాయని పేర్కొన్నారు. కరోనా వచ్చిననాటి నుంచి ప్రభుత్వం తరఫున సూచనలు/సమాచారం అందించేందుకు రుడాల్ఫ్ తీవ్రంగా శ్రమించారు. కాగా జనవరి 2020 నుండి రుడాల్ఫ్ ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. రుడాల్స్ రాజీనామాపై ఆస్ట్రియా చాన్సలర్ సెబాస్టియన్ కుర్జ్ ట్విటర్ ద్వారా స్పందించించారు. ఆరోగ్య మంత్రి మొదటినుంచీ బాధ్యతతో వ్యవహరించిన ఆయన కరోనా మహమ్మారిపై పోరులో భాగాంగా గత 16 నెలలుగా దేశం కోసం ఎంతో త్యాగం చేశారని ప్రశంసించారు. -
ఫైనల్లో డొమినిక్ థీమ్
లండన్: ఆద్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ పోరులో ప్రపంచ మూడో ర్యాంకర్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) పైచేయి సాధించాడు. వరుసగా రెండో ఏడాది పురుషుల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో టైటిల్ పోరుకు అర్హత సాధించాడు. టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)తో 2 గంటల 54 నిమిషాలపాటు జరిగిన తొలి సెమీఫైనల్లో గతేడాది రన్నరప్ థీమ్ 7–5, 6–7 (10/12), 7–6 (7/5)తో గెలుపొందాడు. రెండో సెట్లో నాలుగు మ్యాచ్ పాయింట్లు వదులుకున్న థీమ్... నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో ఒకదశలో 0–4తో వెనుకబడ్డాడు. కానీ వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన థీమ్ 6–4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత జొకోవిచ్ మరో పాయింట్ గెలిచినా... ఆ వెంటనే థీమ్ మరో పాయింట్ సాధించి 7–5తో టైబ్రేక్తోపాటు సెట్‌ను, మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. థీమ్ కెరీర్లో ఇది 300వ విజయం కావడం విశేషం. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మెద్వెదేవ్ (రష్యా) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో థీమ్ ఆడతాడు. -
అమెరికాలో ఒక్కరోజులో లక్షన్నర
వాషింగ్టన్: అమెరికాలో వరుసగా 12 వ రోజు లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో శనివారం నమోదైన కేసుల సంఖ్య 1,66,555. దీంతో ఆ దేశంలో నమోదైన మొత్తం కోవిడ్–19 కేసుల సంఖ్య 1,12,48,681కి చేరింది. అలాగే, కరోనాతో శనివారం 1,266 మంది చనిపోయారు. దీంతో, అక్కడి కరోనా మరణాల సంఖ్య 2,51,330కి చేరింది. అమెరికాలో కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఆసుపత్రులపై భారం మరింత పెరగడంతో పాటు, లాక్డౌన్ ప్రకటించాల్సిన పరిస్థితి రావచ్చనంటున్నారు. మరోవైపు, మెక్సికోలో కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అక్కడ కరోనాతో 98,259 మంది చనిపోయారు. ఆస్ట్రియాలో మళ్లీ లాక్డౌన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఆస్ట్రియాలో మంగళవారం నుంచి మరోసారి దేశవ్యాప్త లాక్డౌన్ విధిస్తున్నారు. ఆస్త్రియాలో శుక్రవారం 9,586 కేసులు నమోదయ్యాయి. కుటుంబ సభ్యులు మినహా ఎవరినీ కలుసుకోవద్దని ఆ దేశ చాన్సెలర్ సెబాస్టియన్ దేశ ప్రజలను కోరారు. మంగళవారం నుంచి డిసెంబర్ 6 వరకు అత్యవసర సేవలు మినహా అన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించారు. యూరోప్ లోని పలు దేశాల్లోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇటలీలోని కంపేనియా, టస్కనీల్లో ఆదివారం నుంచి లాక్డౌన్ విధిస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. కంపేనియాలో వైద్యారోగ్య వ్యవస్థ కుప్పకూలే స్థాయికి చేరుకుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పోర్చుగల్‌లో రాత్రి కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. -
ఆస్ట్రియాలో ఉగ్రదాడి
వియన్నా: ఆస్ట్రియాలో ఉగ్రదాడి కలకలం రేపింది. సెంట్రల్ వియన్నాలోని వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం రాత్రి ఒక దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు. 17 మంది గాయపడ్డారు. కాల్పులకు తెగబడిన దుండగుడు కుజ్తిమ్ ఫెజ్జులాయి ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) సానుభూతిపరుడని ఆ్రస్టియా అంతర్గత వ్యవహారాల మంత్రి కార్ల్ నెహమ్మార్ తెలిపారు. కుజ్తిమ్కి ఆస్ట్రియా, నార్త్ మేస్డోనియన్ ద్వంద్వ పౌరసత్వం ఉంది. గతంలో అతను ఐఎస్‌లో చేరడానికి సిరియా వెళుతుండగా నిర్బంధించి జైలు శిక్ష విధించారు. అయితే జువైనల్ చట్టం ప్రకారం గత డిసెంబర్లోనే విడుదలై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కుజ్తిమ్ ఆటోమేటిక్ రైఫిల్స్, గన్స్, కత్తి ధరించి పౌరులపై దాడికి దిగాడు. ఒక ప్రాంతంలో రాత్రి 8 గంటలకు కాల్పులు జరుపుతున్న కుజ్తిమ్పై పోలీసులు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇరువురి మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారికి గాయాలయ్యాయి. ఆ తర్వాత 8:09 గంటలకు దుండగుడు హతం అయ్యాడని పోలీసులు వెల్లడించారు. సెంట్రల్ వియన్నాలోని మొత్తం ఆరు ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ దాడిలో గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే కాల్పులు ఈ దాడికి సంబంధించి సోషల్ మీడియాలో ఏకంగా 20 వేల వీడియోలు అప్లోడ్ అయ్యాయి. పలు వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక వ్యక్తి కత్తితో పొడుస్తూ, రైఫిల్‌తో కాలుస్తూ వీధుల్లో స్వైరవిహారం చేసిన దృశ్యాలు భీకరంగా ఉన్నాయి. జనం ఎక్కువుండే∙బార్లు ఉండే ప్రాంతాల్లో దాడులు జరిగినట్టు ఆ వీడియోల్లో తెలుస్తోంది. ఆ్రస్టియాకు అండగా ఉంటాం: మోదీ దాడిపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో ఆస్ట్రియాకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంగళవారం ట్వీట్ చేశారు. ఇటీవల ఫ్రాన్స్‌లో మూడు సార్లు ఉగ్రదాడులు జరిగిన నేపథ్యంలో ఆస్ట్రియాలో జరిగిన దాడితో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ దాడిని ఖండించారు. -
జొకోవిచ్‌కు షాక్!
వియన్నా: ప్రపంచ నంబర్ వన్, 17 టెన్నిస్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ విజేత నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)కు ఊహించని ఓటమి ఎదురైంది. ఆస్ట్రియా రాజధానిలో జరుగుతున్న వియన్నా ఓపెన్‌లో అనామక ఆటగాడు లొరెంజో సొనెగొ (ఇటలీ) చేతిలో అతను కంగుతిన్నాడు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి దాటాక జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో జొకోవిచ్ 2–6, 1–6తో లొరెంజో చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు. 2005 ఆస్ట్రేలియా ఓపెన్ తొలి రౌండ్ ఓటమి తర్వాత జొకోవిచ్‌కు ఎదురైన దారుణ పరాభవం ఇదే కావడం విశేషం. ఈ రెండు మ్యాచ్‌ల్లో జొకోవిచ్ కేవలం మూడు గేములను మాత్రమే సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ ఆరంభం నుంచే తడబడ్డ జొకోవిచ్... ఎక్కడా ప్రత్యర్థికి పోటీ ఇవ్వలేకపోయాడు. ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరు సార్లు బ్రేక్ చేసే అవకాశం వచ్చినా ఒక్కసారి కూడా సఫలం కాలేదు. ఈ మ్యాచ్‌లో లొరెంజో ఎనిమిది ఏస్‌లను కొట్టగా... జొకోవిచ్ కేవలం మూడు ఏస్‌లను మాత్రమే సంధించాడు. క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో ఓడి ఈ టోర్నీకి ముందుగా అర్హత సాధించలేకపోయిన 42వ ర్యాంకర్ లొరెంజో...అదృష్టం కలిసొచ్చి ‘లక్కీ లూజర్’గా అడుగు పెట్టడం విశేషం. గతంలో 12 సార్లు ఇలాంటి లక్కీ లూజర్లపై తలపడి ఓటమి ఎరుగని జొకోవిచ్, తొలిసారి పరాజయం పాలయ్యాడు. -
‘నా ముగ్గురు కూతుళ్లను చంపేశా’
వియన్నా: ముగ్గురు కూతుళ్లను చంపిన ఓ తల్లి, ఆ తర్వాత తనను తాను అంతం చేసుకునేందుకు సిద్ధమైంది. కానీ అంతలోనే మనసు మార్చుకుని, స్వల్ప గాయాలతో బయటపడింది. చేసిన నేరాన్ని అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ ఘటన ఆస్ట్రియా రాజధాని వియన్నాలో చోటుచేసుకుంది. వివరాలు.. డొనాస్టడ్ జిల్లాకు చెందిన మహిళకు తొమ్మిది, మూడేళ్ల వయస్సు గల ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎనిమిది నెలల క్రితం ఆమె మరో ఆడశిశువుకు జన్మనిచ్చింది. (చదవండి: బాత్రూంలో ప్రసవం.. బిడ్డను విసిరేసింది) ఈ క్రమంలో శనివారం ఉదయం ఐదున్నర గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేసి తమ ఇంటికి రావాల్సిందిగా కోరింది. తన కుమార్తెలను చంపేశానని, తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వారికి చెప్పింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితురాలి ఇంటికి బయల్దేరారు. రక్తపు మడుగులో ఉన్న పడి ఉన్న బాలికల మృతదేహాలను పరిశీలించారు. పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. నిందితురాలికి కూడా గాయాలు అయ్యాయని, ఆమె కోలుకున్న తర్వాతే విచారణ జరుపుతామని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. -
అక్కడ టూ వీలర్స్‌పై పూర్తి నిషేధం
వియన్నా : ఆస్ట్రియా రాజధాని వియన్నా సిటీ సెంటర్లో అన్ని రకాల మోటారు సైకిళ్లను నిషేధించాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. వియన్నాను మోటార్ సైకిల్ ఫ్రీ సెంటర్‌గా మార్చాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసకున్నారు. ఆస్ట్రియాలోనే అత్యధిక జనాభా కలిగిన వియన్నా ప్రాంతం యూరోప్ ఖండంలోనే అద్భుతమైన రహదార్లను కలిగి ఉండి టూ వీలర్ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. కాగా ఆస్ట్రియాలోని టైరోల్ రాష్ట్రంలో కొద్దికాలం కిందట పర్యావరణం కాపాడడంపై మోటారు సైకిళ్లపై నిషేధం విధించారు. తాజాగా వియన్నాలో కూడా దీనిని అమలు చేయనున్నారు. అయితే టైరోల్ ప్రాంతంలో ఉన్న నిషేధానికి భిన్నంగా ఇక్కడ అమలు చేయనున్నారు. అందుకు వియన్నాలో ప్రఖ్యాత మోటారు సైకిల్ బ్రాండ్ కెటిఎమ్ తన మద్దతు తెలిపింది. ('తండ్రిగా వాడి కోరికను తీర్చా') అన్ని రకాల టూ వీలర్స్ అంటే పర్యావరణానికి అనువుగా ఉండే బ్యాటరీ, ఎలక్ట్రికల్ చార్జింగ్‌తో నడిచే అన్ని రకాల వాహనాలను పూర్తిగా నిషేధం విధించనున్నారు.ఇప్పటికే వియాన్నా ప్రాంతంలో అత్యధికులు ద్విచక్ర వాహనాల నుంచి ఎలక్ట్రికల్ వాహనాలకు మారారు. అంతేగాక ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లను కూడా అక్కడి పౌరులు విస్తృతంగా అంగీకరించారు. అయితే మోటారు వాహనాలను పూర్తిగా నిషేధించాలని చేపట్టిన చర్యలపై వాహనదారులు ఆలక్ష్యం వహించడంతో స్థానిక అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వియన్నా సిటీ సెంటర్లో బైక్ పార్కింగ్‌లో ఉన్న వాహనాలపై కూడా ఈ నిషేధం వర్తించనుంది. అయితే సిటీ సెంటర్ వెలుపల ఉన్న రింగ్‌రోడ్డుపై మాత్రం అన్ని రకాల ప్రైవేట్ కార్లు, వాన్లు, మోటార్ సైకిళ్లు ఆ మార్గాన్ని ఉపయోగించుకోవడానికి అనుమతులు ఇచ్చింది. వియన్నా సిటీ సెంటర్లో నివసించే వ్యక్తులు, ప్రైవేట్ గ్యారేజీలో పనిచేసే వాళ్లకు మాత్రం ఫ్రీ రోడ్లో తిరిగే అవకాశంతో పాటు వాహన పార్కింగ్‌కు అనుమతులిచ్చారు. -
ఆస్ట్రియా యువరాణి ఆకస్మిక మృతి
టెక్సాస్ : భారత సంతతికి చెందిన చెఫ్‌ను పెళ్లి చేసుకున్న ఆస్ట్రియా యువరాణి మరియా గాలిట్జీన్ (31) మృతి చెందారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో హ్యూస్టన్‌లో కన్నుమూశారు. అయితే మరియా మరణ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మే 4న మరియా మృతి చెందగా స్థానిక మీడియాలో వచ్చిన సంతాప వార్త ఆధారంగా ప్రపంచానికి ఆమె మరణ వార్త తెలిసింది. 2017లో హ్యూస్టన్‌లో నగరంలో చెఫ్ రిషి రూప్ సింగ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడు మాక్సిమ్ ఉన్నాడు. రిషి రూప్ ఎగ్జిక్యూటివ్ చెఫ్‌గా పనిచేస్తున్న హ్యూస్టన్లోనే మరియా ఇంటిరీయర్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. (ఇప్పట్లో స్కూళ్లు లేనట్లే! కాలేజీలకు మాత్రం.. ) మరియా.. ప్రిన్సెస్ మరియా- అన్నా,ప్రిన్స్ పియోటర్ గాలిట్జీన్ కుమార్తె. 1988లో లగ్జంబర్గ్‌లో జన్మించారు. మరియాకు ముగ్గురు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు. ఆమెకు అయిదు సంవత్సరాల వయస్సులోనే రష్యాకు మకాం మార్చారు. అక్కడే గ్యాడ్యూయేషన్ పూర్తిచేసుకున్న మరియా ఆర్ట్ ఆండ్ డిజైన్ కాలేజీలో చేరేందుకు బెల్జియంకు వెళ్లారు. బ్రస్సెల్స్తోపాటు చికాగో, ఇల్లినాయిస్, హ్యూస్టన్ వంటి నగరాలలో ఆమె పనిచేశారు. చిన్న వయస్సులోనే మరియా మరణించడంతో రాజ కుటంబీకులంతా సంతాపం ప్రకటించారు. (ప్రముఖ హస్యనటుడి మృతి ) -
టి20 ప్రపంచకప్‌ను రద్దు చేయకండి: హాగ్
మెల్బోర్న్: ఏదేమైనా సరే ఆస్ట్రేలియా ఈ ఏడాది అక్టోబర్–నవంబర్లలో టి20 ప్రపంచకప్ నిర్వహించాల్సిందేనని ఆ దేశ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ అన్నాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా లేదంటే రద్దు లాంటివి చేయవద్దని సూచించాడు. ‘ప్రపంచకప్‌పై చాలా చర్చ జరుగుతోంది. ఈవెంట్‌ను రద్దు చేయడమో లేదంటే రీషెడ్యూల్ చేస్తారంటున్నారు. ఇది సరికాదు. పకడ్బందీ చర్యలు తీసుకుంటే కప్ నిర్వహణ సాధ్యమే. పాల్గొనే అన్ని జట్లను ఓ నెలన్నర ముందుగానే చార్టెడ్ ఫ్లయిట్లలో ఇక్కడికి తీసుకురావాలి. క్వారంటైన్ సహా కరోనా పరీక్షలు చేసేందుకు వీలవుతుంది. అలాగే ఈ సమయంలో వారి సన్నాహాలు జరుగుతుంటాయి. షెడ్యూలు వరకల్లా మెగా ఈవెంట్‌ను అనుకున్నట్లే ప్రారంభించవచ్చు’ అని హాగ్ సూచించాడు. -
మీరు వెంటనే వెనక్కి రండి!
న్యూఢిల్లీ: ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ.. నిబంధనలు ఉల్లంఘించారనే కారణాలతో ఆస్ట్రియాలోని భారత రాయబారి రేణూ పాల్‌ను కేంద్ర విదేశాంగ శాఖ వెంటనే వెనక్కి పిలిచింది. రేణూ పాల్‌ను అర్ధంతరంగా వెనక్కి పిలిపించడానికి ముఖ్యంగా.. నిబంధనలు అతిక్రమించి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేయడమే ప్రధానకారణంగా తెలుస్తోంది. 1988 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన రేణూ పాల్ ఆస్ట్రియాలో భారత రాయబారిగా వ్యవహరిస్తున్నారు. మరో నెలరోజుల్లో ఆమె పదవీ విరమణ చేయనున్నారు. కేవలం తన ఇంటి అద్దె కోసం నెలకు రూ.15 లక్షల నిధులు ఖర్చు చేసినట్టు గుర్తించారు. చదవండి: వారిది నా రక్తం.. పవన్ రక్తం కాదు: రేణూ దేశాయ్ దీనికి సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి. శాఖాపరమైన అనుమతులు తీసుకున్నట్లు తప్పుగా చూపించి పెద్ద ఎత్తున వ్యాట్ రీఫండ్లు చేసుకున్నారని వీరి నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆమెను డిసెంబర్ 30వ తేదీలోగా భారత్‌కు తిరిగి రావాలంటూ ఆదేశాలు జారీచేసింది. మరో నెలరోజుల్లో పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆమెను ఢిల్లీకి బదిలీ చేయడంతో పాటు.. ఆర్థిక అధికారాలపైనా కోత విధించడం గమనార్హం. -
ఓల్గా, హండ్కేలకు సాహితీ నోబెల్
స్టాక్‌హోమ్: సాహితీ రంగంలో విశేషంగా కృషిచేసిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఆస్ట్రియాకి చెందిన ప్రముఖ నవల, నాటక రచయిత పీటర్ హండ్కేకి 2019 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారం వరించింది. 2018 సంవత్సరానికి పోలండ్‌కి చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్‌కి ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్‘ అనే నవలకు గానూ ఈ బహుమతి లభించింది. జ్ఞానపిపాసతో ఆమె చేసిన సృజనాత్మక రచనకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. అద్భుతమైన భాషా పరిజ్ఞానంతో మానవ అనుభవాల విశిష్టతను ప్రభావవంతంగా చాటి చెప్పినందుకు ఆమెకు ఈ ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. 15 మంది స్త్రీలకే నోబెల్ పురస్కారం ఇప్పటి వరకు సాసాహితీరంగంలో కేవలం 14 మంది మహిళలనే నోబెల్ పురస్కారం వరించింది. ఈ రంగంలో నోబెల్ బహుమతి వచ్చిన మహిళల్లో ఓల్గా టోర్కార్క్విజ్ 15వ వారు. ఈమె రచనల్లో భిన్నత్వం ఉంటుంది. రెండు విభిన్న అంశాల మధ్యనున్న అంతరాన్ని ఉద్వేగపూరితంగా వర్ణిస్తారు. ఆమె నవలల్లో స్త్రీపురుషుల మధ్య, ప్రకృతికీ సంస్కృతికీ మధ్య, వివేచనకీ, అవివేకానికీ మధ్య వారి అంతరాంతరాల్లో రగులుతోన్న అంతర్మథనాన్ని అద్భుతంగా వర్ణిస్తారని నోబెల్ పురస్కారాన్ని ప్రకటించిన స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. నిజానికి ఓల్గా టోర్కార్క్విజ్ని కొంత ఆలస్యంగా ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపిక చేసినట్టు వారు వెల్లడించారు. చంపేస్తామన్నారు.. జీవితంలో ఎన్నో చీకటి కోణాలను చూసిన 57 ఏళ్ళ పర్యావరణ వేత్త, శాఖాహారి అయిన ఓల్గా టోర్కార్క్విజ్ పోలండ్ మతతత్వ ప్రభుత్వ విధానాలనూ, చట్టాలనూ తూర్పారబట్టేందుకు వెనకాడని రాజకీయవేత్త. సాహసోపేతమైన, నిర్భీతితో కూడిన ఆమె రచనలు పోలండ్ సమాజాన్ని కుదిపేసాయి. ‘సహనశీల పోలండ్ మిథ్య’ అంటూ ఆమె చేసిన రచనల కారణంగా 2015లో ఆమెను చంపేస్తామన్న బెదిరింపులు సైతం వచ్చాయి. దీంతో ప్రచురణకర్తలు ఆమెకు బాడీగార్డులను సైతం ఏర్పాటుచేశారు. సృజనాత్మకత ఉట్టిపడేలా చిత్రీకరించిన ఆమె రచనల్లోని పాత్రల కవితాత్మకత వర్ణన పాఠకులను కట్టిపడేస్తుంది. 1962, జనవరి 29న పోలండ్‌లోని వెస్ట్రన్ టౌన్లో ఓల్గా జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ వార్సాలో ఆమె చదువుకున్నారు. ఆమె తండ్రి లైబ్రేరియన్ కావడంతో పుస్తకపఠనమే ప్రపంచంగా పెరిగారు. ఆమె తొలి నవల ‘ద జర్నీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్’ 1993లో ప్రచురించారు. ఓల్గా రచించిన ‘ఫ్లైట్స్’ నవలకు 2017లో బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె రచించిన 900 పేజీల ‘‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్’’ ఏడు దేశాలకూ, మూడు ప్రాంతాలకూ, ఐదు భాషల చరిత్రకు సంబంధించినది. 18వ శతాబ్దానికి చెందిన జూయిష్ అనే చిన్న తెగకు చెందిన బహుకొద్ది చరిత్ర మాత్రమే తెలిసిన ఫ్రాంకిసమ్ అనే వ్యక్తి చరిత్రను అన్వేషిస్తుంది. హండ్కే – వివాదాస్పద రచయిత.. పీటర్ హండ్కే రచనలెంత ప్రాముఖ్యతను సాధించాయో, అంతే స్థాయిలో ఆయన వివాదాస్పదుడు కూడా. 1990లో యుగోస్లేవియా యుద్ధ సమయంలో సెర్బ్ల పక్షాన్ని వహించినందుకు ఆయనపై అనేక విమర్శలొచ్చాయి. మానవ హననం సాగించాడని, యుద్ధనేరానికి పాల్పడ్డాడని ఆరోపణలున్న మాజీ సెర్బ్ నేత స్లోబోదన్ మిల్సేవిక్ అంతిమయాత్రలో ఆయనకు మద్దతుగా ప్రసంగించడం కూడా పీటర్ హండ్కే వివాదాస్పదుడవడానికి మరో కారణం. 2014లో సాహిత్యరంగంలో నోబెల్ బహుమతిని నిషేధించాలని కూడా పీటర్ డిమాండ్ చేశారు. ఆయన రాసిన ‘ద అవర్ వియ్ న్యూ నథింగ్ ఆఫ్ ఈచ్ అదర్’ అనే సంభాషణలు లేని నాటకం చాలా ప్రసిద్ధి గాంచింది. పీటర్ హండ్కే పూర్తి స్వచ్ఛమైన జర్మన్ భాషా రచయితల్లో బతికి ఉన్న అతి కొద్దిమందిలో ఒకరు. సాహితీరంగంలో నోబెల్ పురస్కారాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ‘ఇది ఒక్క క్షణం ఆసక్తికీ, ఆరుపేజీల పత్రికా వార్తకీ’ సంబంధించినదంటూ 2014లో అన్నారు. హండ్కే ఆస్ట్రియాలో రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1942, డిసెంబర్ 6) జర్మనీ సైనికుడికీ, స్లొవేనియాకు చెందిన మైనారిటీ తల్లికి జన్మించారు. బాల్యం యుద్ధ వాతావరణంలోగడిచింది. ఆ తరువాత ఆయన ఆస్ట్రియాలో ఆయన పెరిగి పెద్దయ్యారు. 1966లో ‘ద హార్నెట్స్’ అనే నవలతో సాహితీరంగంలో సంచలనం సృష్టించారు. దీంతో న్యాయవాద చదువుని మధ్యలోనే వదిలేసి సాహితీరంగం వైపు వచ్చారు. -
1368 అడుగుల ఎత్తులో ఆటాపాటా
ఆస్ట్రియాలోని 1368 అడుగుల ఎల్తైన ప్రదేశంలో ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ చిందేశారు. వీరి ఆటాపాటా ‘సాహో’ సినిమా కోసమే. ప్రభాస్, శ్రద్ధ జంటగా ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్, విక్రమ్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలోని ఓ పాటను ఆస్ట్రియాలోని అద్భుతమైన, అందమైన లొకేషన్స్‌లో ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ నేతృత్వంలో చిత్రీకరించారు. 1368 అడుగుల ఎత్తులో కేబుల్ కార్స్ తీసుకుని సాంగ్ మేకింగ్ చేశారు చిత్రబృందం. అంత ఎత్తులో షూటింగ్ జరుగుతున్నప్పుడు యూనిట్ కంగారుపడకుండా ప్రభాస్ అందర్నీ ప్రోత్సహించారట. ‘‘మాకు ఇంతలా సపోర్ట్ చేసిన చిత్రబృందానికి థ్యాంక్స్. ఈ చిత్రానికి జిబ్రాన్ నేపథ్య సంగీతం ప్రత్యేకంగా నిలవనుంది. ప్రతీ సీన్‌ని ఎలివేట్ చేసే విధంగా వరల్డ్ క్లాస్ క్వాలిటీ రీ రికార్డింగ్ అందిస్తున్నారు జిబ్రాన్. స్వాతంత్య్ర దినోత్సవం కానుకగా ఆగస్ట్ 15న ‘సాహో’ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: మది. -
ఆస్ట్రియాలో ఆటాపాటా
హీరోయిన్ శ్రద్ధాకపూర్‌తో కలిసి ఫారిన్లో ప్రేమరాగం తీస్తున్నారు ప్రభాస్. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘సాహో’. ఇందులో శ్రద్ధాకపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు చిత్రబృందం. ఇందులో ప్రభాస్ పోలీస్ ఇన్ఫార్మర్గా నటిస్తున్నారని సమాచారం. శ్రద్ధాకపూర్ పోలీసాఫీసర్‌గా నటిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లో కీలక షెడ్యూల్స్‌ని కంప్లీట్ చేసిన టీమ్ ప్రస్తుతం ప్రభాస్, శ్రద్ధాలపై ఆస్ట్రియాలో ఓ పాటను చిత్రీకరిస్తోంది. ఈ పాటతో ఈ సినిమా షూట్ ఆల్మోస్ట్ పూర్తయినట్లే. ఈ సినిమాకు జిబ్రాన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. జాకీష్రాఫ్, మందిరా బేడీ, నీల్‌నితిన్ ముఖేష్, అరుణ్‌విజయ్, ‘వెన్నల’ కిశోర్ తదితరులు నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: మధి. -
ఫార్ములా వన్ దిగ్గజం కన్నుమూత
వియన్నా: ఆస్ట్రియా ఫార్ములా వన్ దిగ్గజం నికీ లాడా (70) కన్నుమూశారు. గతకొంత కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నికీ.. 1975, 1977, 1984లో టైటిల్స్ సొంతం చేసుకున్నారు. అత్యుత్తమ ఎఫ్-1 రేసర్‌గా పేరు సొంతం చేసుకున్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. 1976లో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. తృటిలో ప్రాణాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. 1949లో ఆస్ట్రియాలో జన్మించిన నిక్కీ.. ఫార్మాల్ వన్ రేసులో అత్యుత్తమ స్థాయి వరకు ఎదిగారు. -
చరిత్ర గుట్టు విప్పే ఉప్పు గని!!
హాల్‌స్టాట్... ఆస్ట్రియాలోని ముండెన్ జిల్లాలో ఉన్న అతి పురాతనమైన ఉప్పుగని. 1997లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశం పర్యాటకులను ఆకర్షించడంతో పాటుగా, చరిత్రకారుల పరిశోధనలకు గమ్యస్థానంగానూ మారింది. హాల్‌స్టాట్ సంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ ఉప్పుగని గర్భంలో చరిత్ర పూర్వ యుగానికి సంబంధించిన ఎన్నెన్నో నిజాలు దాగున్నాయంటున్నారు పురావస్తు శాస్త్రవేత్త హాన్స్ రెష్రెటెర్. ఏడు వేల ఏళ్లుగా ఉప్పు ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఈ ప్రదేశం... ఒకప్పుడు సంపన్న నాగరికతకు ఆనవాలుగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తమ పరిశోధనల్లో వెలుగు చూసిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 3 వేల ఏళ్ల నాటి చెక్క వంతెన... నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ఈ చారిత్రక ప్రదేశానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు తెలుసుకునేందుకు 1838 నుంచే తవ్వకాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా క్రీ. పూర్వం 1100 నాటి చెక్క వంతెనను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వంతెన ద్వారానే గనిలోకి వెళ్లి ఉప్పును సేకరించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ ఒకప్పుడు యూరప్‌లోని సగం దేశాలకు హాల్‌స్టాట్ ఉప్పు సరఫరా కేంద్రంగా ఉండేది. ఈ గని ద్వారా రోజుకు సుమారు ఒక టన్ను ఉప్పును ఉత్పత్తి చేసేవారు. అయితే ఇక్కడ దొరికిన ఈటెల వంటి పదునైన ఆయుధాలు కాంస్య యుగం నాటికి చెందినవిగా భావిస్తున్నామని’ పేర్కొన్నారు. ఇన్ని వేల సంవత్సరాలైనా ఆ వంతెన మాత్రం చెక్కుచెదరలేదని, అయితే ప్రస్తుతం చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు. రెండో దఫా తవ్వకాల్లో షాకింగ్ నిజాలు.. వియన్నాకు చెందిన మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ గత 60 ఏళ్లుగా హాల్స్టాట్లో తవ్వకాలు జరుపుతోంది. ఈ క్రమంలో... తాజాగా జరుపుతున్న రెండో దఫా తవ్వకాల్లో వేలాది అస్థిపంజరాలు బయల్పడ్డాయని హాన్స్ పేర్కొన్నారు. ‘ ప్రస్తుత తవ్వకాల్లో భాగంగా వేలాది అస్థిపంజరాలు బయల్పడ్డాయి. వీరిలో చాలా మంది మెడలో కాంస్య యుగం నాటి ఆభరణాలు ధరించి ఉన్నట్లు కనుగొన్నాం. అలాగే వారి అస్థికల పటుత్వాన్ని బట్టి శరీర నిర్మాణం కూడా చాలా ధృడంగా ఉండేదని అర్థమవుతోంది. దీన్ని బట్టి ఒకప్పుడు ఇక్కడ సంపన్న నాగరికత విలసిల్లిందని భావించవచ్చు. కానీ ఇక్కడ కూడా ఆర్థిక అసమానతలు ఉండేవని నిరూపించేందుకు మరికొన్ని పూర్తిగా ఎదగని శరీర నిర్మాణాలను కనుగొన్నామని’ ఆయన వ్యాఖ్యానించారు. పారిశ్రామిక విప్లవానికి నాంది.. 19 వ శతాబ్దంలో బయల్పడిన సమాధుల ఆధారంగా పూర్వ రాతి యుగానికి సంబంధించిన చరిత్రను తెలుసుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. గనిలోని 100 మీటర్ల లోపలికి వెళ్లి పరిశోధనలు కొనసాగిస్తున్నామని హాన్స్ చెప్పారు. ఇందులో భాగంగా 3 వేల ఏళ్ల క్రితం నాటి లెదర్ గ్లోవ్స్, మందమైన తాళ్లు, గొడ్డలి వంటి నిర్మాణం కలిగిన పదునైన ఆయుధాలు కనుగొన్నామని.... వీటిని బట్టి వేల ఏళ్ల క్రితం నాడే పారిశ్రామిక విప్లవానికి పునాది పడిందని భావించవచ్చన్నారు. సందర్శకులకు స్వర్గధామం కూడా.. సముద్ర మట్టం నుంచి 800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సహజ సిద్ధమైన సరస్సును, అందులో నిక్షిప్తమైన ఉప్పు గని సందర్శించేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తూంటారని ఎగువ ఆస్ట్రియా గవర్నర్ థామస్ స్టెల్జర్ అన్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. హాల్‌స్టాట్ సంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ గని ద్వారా ఏటా 2 లక్షల 50 వేల టన్నుల ఉప్పును ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతి అందాలకు నిలయంగా విలసిల్లుతున్న ఈ చారిత్రక సంపదను రక్షించుకోవడం తమ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. -
ఆస్ట్రియా ఓపెన్ విజేత కశ్యప్
వియన్నా: మూడేళ్ల తర్వాత భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ తన ఖాతాలో మరో అంతర్జాతీయ టైటిల్‌ను జమ చేసుకున్నాడు. శనివారం ముగిసిన ఆస్ట్రియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టోర్నీలో ఈ హైదరాబాద్ ప్లేయర్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో కశ్యప్ 23–21, 21–14తో జూన్ వె చీమ్ (మలేసియా)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో కశ్యప్ 21–18, 21–4తో రౌల్ మస్త్ (ఎస్తోనియా)ను ఓడించాడు. 2015లో సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలిచాక కశ్యప్ నెగ్గిన మరో టైటిల్ ఇదే కావడం గమనార్హం. మరోవైపు స్విస్ ఓపెన్‌లో భారత్‌కే చెందిన సమీర్ వర్మ కూడా ఫైనల్‌కు చేరాడు. సెమీఫైనల్లో సమీర్ వర్మ 21–14, 11–21, 21–12తో వాంగ్‌చరోయిన్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. -
లవ్ లాక్
ఫిబ్రవరి 14... ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులంతా తాము ప్రేమించిన వారిపై ప్రేమను రకరకాల రూపాల్లో చూపిస్తుంటారు. కొందరు గిఫ్ట్స్ ఇచ్చి, కొందరు సర్ప్రైజ్లు ఇచ్చి, ఒక్కొక్కరు ఒక్కోలా. ఎవరు ఎలా ప్రేమను చూపించినా కూడా ఆ ప్రేమను చిరకాలం జ్ఞాపకంగా మార్చుకోవటానికే. రామ్‌చరణ్, ఆయన వైఫ్ ఉపాసన కూడా ఈ వేలంటైన్స్ డేను ఆస్ట్రియాలో ఆ దేశ స్టైల్లోనే జరుపుకున్నారు. ‘రంగస్థలం’ షూటింగ్ కంప్లీట్ చేసుకొని హాలిడేకు వెళ్లిన రామ్‌చరణ్ దంపతులు వాళ్ల ప్రేమను లాక్ చేసుకున్నారు. ప్రేమను లాక్ చేసుకోవటం ఏంటీ? అనుకుంటున్నారా... లవ్‌ను లాక్ చేసుకోవటమే ఆస్ట్రియాలోని ‘సాల్జ్‌బర్గ్ లవ్ లాక్ బ్రిడ్జ్’ ప్రత్యేకత. ఆ బ్రిడ్జ్ మీద ఇద్దరి ప్రేమికుల పేర్లను ఒక లాక్ (తాళం కప్ప) పై రాసి, దాన్ని ఆ బ్రిడ్జ్‌కి సైడ్ ఉన్న ఫెన్స్‌కు లాక్ చేసి, ఆ కీను ఆ నదిలో పారేస్తారట. అలా చేస్తే వారి ప్రేమ విడదీయలేని బంధంగా మారుతుందని నమ్ముతారట. ఉపాసన కూడా ఉప్సీ–రామ్ అంటూ ఓ లాక్‌పై రాసి వేలంటైన్స్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. ఫొటోలో ఉప్సీ–రామ్ అని రాసి ఉన్న తాళం కనిపిస్తోంది కదా. అదే ఈ జంట లవ్ లాక్. -
ఆస్ట్రియాలో బురఖాపై నిషేధం
వియాన్నా : మొహం కనిపించకుండా మాస్క్‌లు ధరించడాన్ని ఆస్ట్రియా ప్రభుత్వం నిషేధించింది. ఇందులో ముస్లిం మహిళలు సంప్రదాయంగా ధరించే బురఖాలను కూడా చేర్చింది. అంతేకాక ఆసుపత్రుల్లో ఆపరేషన్ల సమయంలే ధరించే ఫేస్ మాస్క్‌లను కూడా బయట ప్రదేశంలో ధరించరాదని ఆస్ట్రియా ప్రభుత్వం సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు కఠినంగా ఉంటాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే బురఖాను ఫ్రాన్స్, బెల్జియం, జర్మనీ తదితర దేశాలు నిషేధించాయి. -
ట్రంప్ అంకుల్.. ట్రంప్ అంకుల్..!
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 11 సంవత్సరాల బాలిక రాసిన ఉత్తరం ఇప్పుడు అంతర్జాలంలో హల్చల్ చేస్తోంది. ఈ లెటర్‌కు ఫేస్బుక్లో ఇప్పటివరకూ 10 వేలకు పైగా రియాక్షన్స్ వచ్చాయి. వేల మందిని ఈ ఉత్తరం కదిలిస్తోంది. ఇంతకూ ఎవరా బాలిక.. ఏమిటా ఉత్తరం.. ట్రంప్‌కు ఎందుకు రాసింది.. అనే సందేహాలు మీకు వస్తున్నాయా? అయితే ఈ వార్తను చదవాల్సిందే. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించారు. దీనిపై స్పందించిన ఆస్ట్రియా బాలిక పౌలా.. ట్రంప్‌కు ప్రత్యేకంగా ఒక ఉత్తరం రాసింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆస్ట్రియా అధ్యక్షుడు అలెగ్జాండర్ వాండెర్.. ఆ ఉత్తరాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అందించారు. అంతేకాక ఆయన ఆ లెటర్‌ను తన ఫేస్‌బుక్‌లోనూ పోస్ట్ చేశారు. ఆ ఉత్తరంలో.. ‘మిస్టర్ ప్రెసిడెంట్.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఇది నిజం. వాతావరణంలో వస్తున్న మార్పులకు అంతర్జాతీయ సమాజంతో కలిసి పరిష్కారాలను వెతకాల’ని 11 ఏళ్ల పౌలా.. ట్రంప్‌కు విజ్ఞప్తి చేసింది. -
ఐస్‌క్రీమ్ కిల్లర్
క్రైమ్ ఫైల్ జూన్ 10, 2011... వియెన్నా (ఆస్ట్రియా) ‘‘టిమ్... లే త్వరగా. మిట్ట మధ్యాహ్నం ఏంటీ నిద్ర?’’... భర్తని పట్టి కుదిపింది మార్గరెట్. ‘‘ఏంటి మ్యాగీ నువ్వు? శెలవు కదా అని హాయిగా పడుకుంటే, ఏం కొంప మునిగిపోయిందని లేపుతున్నావ్?’’... విసుక్కున్నాడు టిమ్. ‘‘కొంప మునిగిందనే లేపుతున్నాను. లే ముందు’’ అంటూ చెయ్యిపట్టి లాగింది. ఇక తప్పదని లేచాడు టిమ్. ‘‘రా నాతో’’ అంటూ బయటకు లాక్కెళ్లింది మార్గరెట్. పక్కింటి ముందు జనం గుమిగూడి ఉన్నారు. పోలీసులు కూడా ఉన్నారు. ‘‘ఏం జరిగింది? ఇంతమంది ఉన్నా రేంటి? పోలీసులెందుకు వచ్చారు?’’ అంటూ అటు పరుగెత్తాడు టిమ్. ఆ ఇంటి బేస్మెంట్లో పోలీసులు ఏదో వెతుకు తున్నారు. వాళ్ల దగ్గరకు వెళ్లాడు టిమ్. ‘‘ఏంటి సర్ ఇదంతా?’’ అన్నాడు. టిమ్‌ని పరికించి చూశాడు ఇన్స్పెక్టర్. ‘‘మీరెవరు?’’ అన్నాడు. ‘‘నా పేరు టిమ్. నాది పక్కిల్లే.’’ అలాగా అన్నట్టు తలూపాడు. ‘‘ఈ ఇంట్లో వాళ్ల గురించి మీకేమైనా తెలుసా?’’... అడిగాడు. ‘‘ఈ ఇంట్లో మ్యాన్‌ఫ్రెడ్ హింటర్ బర్గర్, అతని భార్య ఎలిజబెత్ ఉంటున్నారు. వాళ్లది ఐస్‌క్రీమ్ వ్యాపారం. ఇద్దరూ చాలా మంచివాళ్లు.’’ ‘‘వాళ్లతో మీకెప్పటి నుంచి పరిచయం? క్లోజ్‌గా ఉంటారా?’’ ‘‘మరీ క్లోజేమీ కాదు సర్. హలో అంటే హలో అనుకుంటాం. మేమిక్కడికి వచ్చి ఏడాదిన్నరే అయ్యింది. కానీ వాళ్లు ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారట. ఇంతకీ ఏం జరిగింది సర్? వాళ్లకేమైనా అయ్యిందా కొంపదీసి?’’ ‘‘ఎవరికో ఏదో జరిగింది మిస్టర్ టిమ్. కానీ ఎవరికో తెలియదు. ఓసారి అలా చూడండి .’’ ఇన్స్పెక్టర్ చూపించిన వైపు చూశాడు టిమ్. అక్కడ... గోడ పక్కగా రెండు ఐస్‌క్రీమ్ టబ్స్ ఉన్నాయి. ‘‘ఐస్‌క్రీమ్ టబ్స్... మ్యాన్‌ఫ్రెడ్ వాళ్ల షాపులోవి అయ్యుంటాయి’’ అన్నాడు టిమ్ వాటిలో వింతేముంది అన్నట్టు. ‘‘నేను చూడమంది వాటిని కాదు. వాటిలోంచి కింద దిమ్మ రించిన కాంక్రీట్‌ని’’ అన్నాడు ఇన్స్పెక్టర్. అప్పుడు అటువైపు దృష్టి సారించాడు టిమ్. అక్కడ పొడి కంకర ఉంది. ఏమీ అర్థం కాలేదు. ఏంటన్నట్టు ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. ఇన్స్పెక్టర్ అన్నాడు... ‘‘అర్థం కాలేదు కదూ! అది మామూలు కంకర కాదు మిస్టర్ టిమ్. ఆ కంకర అక్కడక్కడా తడిసి గడ్డ కట్టింది. అది నీటి తడి కాదు... రక్తం. కంకర నిండా కుళ్లిపోయిన మాంసపు ముక్కలు.. ఎముకలు.. ఏవేవో ఉన్నాయి. అవన్నీ ఏ కోడివో, కుక్కవో కాదు.. మనిషివి! కాదు.. మనుషులవి. రెండు గుండెలు, నాలుగు ఊపిరితిత్తులు ఉన్నాయి. అంటే అవి ఇద్దరు మనుషుల శరీర భాగాలన్నమాట’’. వింటుంటేనే కడుపులో దేవినట్ట య్యింది టిమ్‌కి. ‘‘ఏంటి సర్ ఈ దారుణం? ఎవరివా శరీర భాగాలు?’’ ‘‘తెలియదు. బేస్‌మెంట్‌ని బాగు చేస్తుంటే వర్కర్‌కి ఈ టబ్స్ కనిపించాయి. తెరిచి చూస్తే కంకర. తీసి వాడదామను కుంటే భయంకరమైన దుర్వాసన. వెంటనే మాకు ఫోన్ చేశారు. మేం వచ్చి చూస్తే ఇవన్నీ కన్పించాయి. ఇంతకీ ఈ ఇంట్లో వాళ్లని మీరెప్పుడు చూశారు?’’ ‘‘మ్యాన్ఫ్రెడ్ని చూసి చాలా రోజు లయ్యింది సర్. ఎలిజబెత్ అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు సర్?’’ ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు. తాళం పగులగొట్టి, ఇంటి లోపలంతా పరిశీలిం చాడు. కొన్నిచోట్ల గోడల మీద రక్తపు మరకలు తుడిచిన ఆనవాళ్లున్నాయి. వంటింట్లో ఓ మూల రంపం ఉంది. దాని చెక్క పిడి మీదా రక్తపు మరకలు ఉన్నాయి. దాంతో పలు సందేహాలు తలెత్తాయి. హాల్లో ఉన్న మ్యాన్‌ఫ్రెడ్, ఎలిజబెత్‌ల ఫొటోలు తీసుకుని స్టేషన్‌కి బయలుదేరాడు. వియెన్నా ప్రధాన రహదారి... ఓ కారు వేగంగా దూసుకుపోతోంది. అంతలో ఉన్నట్టుండి మరో కారు అడ్డుగా రావడంతో దానికి ఠక్కున బ్రేకు పడింది. ‘‘ఏయ్... బతకాలని లేదా? ఏంటా చెత్త డ్రైవింగ్? బ్రేక్ పడటం ఆలస్యమై ఉంటే చచ్చి ఉండేవాడివి’’... అరిచింది డ్రైవింగ్ సీట్లో కూర్చున్నామె. ‘‘మనుషుల్ని చంపడం మీకు అలవాటేగా మిసెస్ ఎలిజబెత్ కరాన్జా’’ అంటూ కారు దిగాడు ఇన్స్పెక్టర్. ఖంగు తింది ఎలిజబెత్. ‘‘సారీ సర్... ఎవరో అనుకుని అలా మాట్లాడాను’’ అంది ఎంతో మృదువుగా. ఆమె కారు దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్. డోరు తెరిచాడు. ఎలిజబెత్ చేతిని పట్టుకుని బేడీలు వేశాడు. అవాక్క యిపోయింది ఎలిజబెత్. ‘‘ఏంటి సర్... నేనేం చేశాను?’’ అంది కంగారుగా. ‘‘స్టేషన్‌కి వెళ్లి మాట్లాడుకుందాం. రోడ్డుమీద ఏం బాగుంటుంది?’’ అంటూ ఆమెను తీసుకెళ్లి కారెక్కించాడు. ‘‘ఇక వాదించి లాభం లేదు. నాకు సగం నిజం తెలిసింది. మిగతా సగం నువ్వు చెప్పేస్తే మంచిది.’’ తల అడ్డంగా ఊపింది ఎలిజబెత్. ‘‘మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు సర్. నేను...’’ ‘‘ఏ తప్పూ చేయలేదు అంటావ్. కానీ అది నమ్మడానికి నేనంత పిచ్చోణ్ని కాదు. నీ భర్త హోల్జర్ హాల్జ్ మూడేళ్ల క్రితం ఉన్నట్టుండి మాయమైపోయాడు. వదిలేసి ఎక్కడికో వెళ్లిపోయాడన్నావ్. తర్వాత నీ జీవితంలోకి వచ్చిన ప్రియుడు మ్యాన్‌ఫ్రెడ్ మాయ మయ్యాడు. ఎవరైనా అడిగితే బ్రేకప్ అయ్యిందన్నావ్. కానీ వాళ్లిద్దరూ మాంసపు ముద్ద లుగా కాంక్రీటులో దాగివున్నా రని నాకు తెలిసిపోయింది. కాబట్టి ఇక అడ్డంగా బొంకొద్దు. నిజం చెప్పు. ఏం జరిగింది? చెప్పకపోతే ఆడపిల్లవని కూడా చూడకుండా మా ట్రీట్మెంట్ రుచి చూపించాల్సి ఉంటుంది.’’ ‘‘వద్దు సార్’’... అరిచినట్టే అంది ఎలిజబెత్. ‘‘ఆ పని మాత్రం చేయకండి. నేనిప్పుడు గర్భవతిని.’’ ఉలిక్కిపడ్డాడు ఇన్స్పెక్టర్. ‘‘ఏంటీ... గర్భవతివా? ఎవరి బిడ్డకి... హాల్జ్ బిడ్డకా, మ్యాన్‌ఫ్రెడ్ బిడ్డకా?’’ ‘‘వాళ్లిద్దరూ ప్రాణాలతో లేరని మీరే అన్నారు కద సార్. ఇక వాళ్ల బిడ్డకి తల్లినెలా అవుతాను? నా కడుపులో ఉన్నది నా కొత్త బాయ్‌ఫ్రెండ్ బిడ్డ’’ ‘‘అంటే వాళ్లిద్దరినీ...’’ ‘‘నేనే చంపాను. చంపి ముక్కలు ముక్కలు చేసేశాను.’’ ‘‘ఎందుకు?’’ ఇన్స్పెక్టర్ అలా అడగ్గానే పెద్దగా నవ్వింది ఎలిజబెత్. ఆ నవ్వు వికృతంగా ఉంది. ‘‘ఎందుకేమిటి సర్? ఒకణ్ని నేను పెళ్లి చేసుకున్నాను. మంచి భార్యగా నడచుకున్నాను. కానీ వాడు మాత్రం మంచి భర్త కాలేకపోయాడు. నా మీద ప్రేమ లేదు. ఇంట్లో టీవీ ఉంది, ఫ్రిజ్ ఉంది, కంప్యూటర్ ఉంది, ఓ పెళ్లామూ ఉంది అన్నట్టుగా ప్రవర్తించేవాడు. వాడెలా ఉన్నా ఒక బిడ్డను ఇస్తే చాలనుకున్నాను. కానీ ఆ సంతోషమూ లేకుండా పోయింది. ఓరోజు రాత్రి వాడితో నాకో బిడ్డ కావాలన్నాను. ముఖం తిప్పుకున్నాడు. అటువైపు తిరిగి పడుకున్నాడు. గుర్రు పెట్టి నిద్రపోయాడు. నాకు చిర్రెత్తు కొచ్చింది. నేను, నా ఫీలింగ్స్ వాడికి పట్టవని అర్థమైంది. అలాంటివాడు నాకెందుకని చంపి పారేశాను.’’ నోరు తెరచుకుని వింటున్నాడు ఇన్స్పెక్టర్. ఎంతో కూల్‌గా, రిలాక్స్డ్గా తను చేసిన దారుణాన్ని వివరిస్తోన్న ఎలిజబెత్‌ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదతనికి. ఎలిజబెత్ మాత్రం చెప్పుకుంటూ పోతోంది. ‘‘ఆ తర్వాత మ్యాన్‌ఫ్రెడ్ పరిచయ మయ్యాడు. ప్రేమన్నాడు. పెళ్లన్నాడు. సహజీవనం మొదలు పెట్టాడు. పెళ్లి కాక పోయినా ప్రపంచానికి వాడు నా భర్త అనే చెప్పాను. వాడినీ నేనెంతో ప్రేమించాను. వాడయినా నాకో బిడ్డను ఇస్తాడని ఆశపడ్డాను. కానీ నా కల నెరవేరలేదు. పైగా వాడు వేరే అమ్మాయితో ప్రేమాయణం మొదలెట్టాడు. దాంతో వాడినీ నా భర్త దగ్గరకే పంపేశాను.’’ ‘‘వాళ్లనలా ముక్కలు చేయడానికి నీకు మనసెలా ఒప్పింది?’’ ‘‘నన్ను బాధ పెట్టడానికి వాళ్లకు మనసొప్పినట్టే నాకూ ఒప్పింది. చంపాక బాడీస్‌ని ఏం చేయాలో తోచలేదు. ఐస్ క్రీమ్స్ పెట్టే బాక్సుల్లో ఉంచాను. అయినా కంపు కొట్టాయి శవాలు. ఎన్ని స్ప్రేలు వాడినా ఫలితం లేకపోయింది. అందుకే ముక్కలు చేసేసి, కాంక్రీట్‌లో కలిపి టబ్బుల్లో పెట్టాను. తీసుకెళ్లి బేస్మెంట్లో పడేశాను. కానీ పొద్దున్న అవి పనివాళ్ల కంటబడ్డాయి. వాళ్లు మీకు ఫోన్ చేయడం విన్నాను. విషయం బయటపడుతుందని అర్థమై వేరే చోటికి పారిపోదామనుకునే లోపే మీరు నన్ను పట్టుకున్నారు.’’ ‘‘ఛ... ఓ ఆడదానివై ఉండి ఇంత దారుణం చేశావా? ఇప్పుడు మరొకరితో ప్రేమలో ఉన్నావ్. ఒకవేళ అతడూ నిన్ను తల్లిని చేయకపోతే చంపేసేదానివా?’’ నవ్వింది ఎలిజబెత్. ఆ నవ్వు వెనుక అర్థమేమిటో ఇన్స్పెక్టర్కి అర్థమయ్యింది. ‘‘సాటి మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపేసిన నీలో అమ్మ మనసు ఉందంటే ఆశ్చర్యంగా ఉంది. ఒక ప్రాణికి జన్మనివ్వడానికి రెండు ప్రాణాలు తీసిన నిన్నెలా అర్థం చేసు కోవాలి?’’ అనేసి వెళ్లిపోతోన్న ఇన్స్పెక్టర్ వైపు చూసి తనలో తనే నవ్వుకుంది ఎలిజబెత్... నాలుగు నెలల బిడ్డ ఉన్న తన పొట్టని తడుముకుంటూ! 2012, నవంబర్ 23న ఎలిజబెత్ కరాన్జాకి జీవిత ఖైదును విధిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. తీప్పు వెలువడే లోపే బిడ్డకు జన్మనిచ్చింది ఎలిజబెత్. ఆ బిడ్డ తండ్రిని జైలు అధికారుల సమక్షంలోనే పెళ్లాడింది కూడా. ఈ కేసు ఆస్ట్రియాలో పెద్ద సంచలనం సృష్టించింది. ‘ఐస్‌క్రీమ్ కిల్లర్’ అంటూ మీడియా విరివిగా కథనాలు ప్రసారం చేసింది. 2011లో ‘ఎడిషన్ ఎ’ అనే పబ్లిషింగ్ కంపెనీ ‘ద ఐస్ కిల్లర్’ అనే పుస్తకాన్ని వెలువరించింది. దీనిలో ఎలిజబెత్ కథ మొత్తం ఉంది. ఆమె జీవితంలో ఏం జరిగింది, ఎలా తన భర్తనీ ప్రియుణ్నీ చంపింది వంటి విషయాలన్నీ కూలంకషంగా ఉన్నాయి. తర్వాత స్వయంగా కర్జానాయే తన జీవితం ఆధారంగా ‘మై టూ లైవ్స్’ అనే పుస్తకం రాసింది. ఈ పుస్తకం విరివిగా అమ్ముడయ్యింది. - సమీర నేలపూడి -
ఫేస్‌బుక్‌పై కేసు నమోదు
డబ్లిన్ : సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు ఐర్లాండ్ అధికారులు వెల్లడించారు. ఆస్ట్రియాకు చెందిన విద్యార్థి మాక్స్ స్క్రేమ్స్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హైకోర్టులో దర్యాప్తు చేస్తున్న డాటా ప్రొటెక్షన్ అధికారులు తెలిపారు. ఐర్లాండ్ ఫేస్బుక్ డిపార్ట్మెంట్ తాను పోస్ట్ చేసిన డాటా, వ్యక్తిగత వివరాలను అమెరికా నిఘా విభాగానికి ట్రాన్స్ఫర్ చేస్తోందని మాక్స్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 4,500 కంపెనీల డాటాను అమెరికాకు అందుబాటులో ఉండేలా యూరోపియన్ కోర్టు తీర్పు ఇవ్వడం ఈ కేసుకు మరింత ఊతమిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈయూ కోర్టు తీర్పు పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించడంతో పాటు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడానికి దారితీస్తుందని యూరోపియన్ యూనియన్‌కు చెందిన దేశాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో అప్పుడే తొందరపడి ఓ నిర్ణయం తీసుకోవద్దని న్యాయమూర్తి జస్టిస్ గెరార్డ్ హోగన్ సూచించారు. ఫేస్బుక్ యూరోపియన్ ప్రధాన కార్యాలయం డబ్లిన్‌లో ఉండటంతో ఐర్లాండ్ నిఘా వర్గాలు ఈ కేసును దర్యాప్తు చేసేందుకు వీలు కల్పించినట్లయింది. -
పిజ్జా కోసం..
లండన్: పిల్లలు తమకు కావాల్సింది సాధించుకోవడంకోసం వారి మంకుపట్లు, పేచీలు అందరికీ తెలిసిన విషయమే. కానీ లండన్‌లో 11 ఏళ్ల పిల్లాడు పిజ్జా కోసం తల్లిదండ్రులకు చుక్కలు చూపించాడు. తాను అడిగిన పిజ్జా కొనివ్వలేదనే కోపంతో లోపల గడియ వేసుకున్నాడు. తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా తలుపు తీయలేదు. చివరికి పోలీసులు రంగంలోకి దిగి పిల్లాడిని బతిమలాడి, బామాలితే తప్ప తలుపు తీయలేదు. వివరాల్లోకి వెడితే లంచ్‌లోకి తనకు పిజ్జా కావాలని అడిగాడో గడుగ్గాయి. అయితే వాళ్లమ్మ పిజ్జాకు బదులుగా పాస్తా చేసి పెట్టింది. దీంతో పిల్లాడు నాకు పిజ్జానే కావాలంటూ పేచీ మొదలుపెట్టాడు. ఎంత బుజ్జగించినా వినిపించుకోలేదు. దీంతో విసిగిపోయిన తల్లిదండ్రులు కొద్దిసేపు బయటికి వెళ్లారు. అంతే లోపల్నించి తలుపు తాళం వేసుకున్నాడు. మిమ్మల్ని లోపలికి రానీయంటూ మంకు పట్టు పట్టాడు. పిల్లాడితో తలుపు తీయించేందుకు ప్రయత్నించి విఫలమైన తల్లిదండ్రులు చివరకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మెల్లిగా బాల్కనీలోకి ప్రవేశించిన పోలీసులు బాలుడిని ఒప్పించి తలుపు తీయించారు. -
హామిల్టన్‌కే ‘పోల్’
నేడు ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి స్పీల్బెర్గ్ (ఆస్ట్రియా): ఈ సీజన్లో తన జోరు కొనసాగిస్తున్న లూయిస్ హామిల్టన్ ఏడోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 08.455 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్‌కే చెందిన రోస్‌బర్గ్ రెండో స్థానం నుంచి, వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానం నుంచి, సెర్గియో పెరెజ్ 16వ స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. తాజా ప్రదర్శనతో హామిల్టన్ అత్యధికసార్లు ‘పోల్ పొజిషన్’ సాధించిన డ్రైవర్ల జాబి తాలో మూడో స్థానానికి చేరుకున్నాడు. 45 ‘పోల్స్’తో హామిల్టన్, వెటెల్ (ఫెరారీ) సం యుక్తంగా మూడో స్థానంలో ఉన్నారు. తొలి రెండు స్థానాల్లో షుమాకర్ (68), సెనా (65) ఉన్నారు. నేటి ప్రధాన రేసు సాయంత్రం గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
‘సాగర్’ ప్రక్షాళనకు ఆస్ట్రియా సాయం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఆస్ట్రియన్ బృందం(ఆస్ట్రియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సైంటిస్టు మార్టిన్‌జంగ్, డాక్టర్ బివాస్, వాబగ్ సంస్థకు చెందిన మహేశ్ థర్గాల్కర్, పీఎస్ రంగరాజన్) నగరానికి వచ్చింది. శనివారం ప్రతినిధి బృందంతో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీలో సమావేశమయ్యారు. సాగర్.. అందులో కలుస్తున్న వ్యర్థాలు.. ఇప్పటివరకు తాము చేపట్టిన పనులపై స్థానిక అధికారులు వారికి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వివిధ సంస్థలు జరిపిన అధ్యయన నివేదికల్ని అందజేశారు. తమ దేశంలోని వియన్నాలో ఇదే మాదిరిగా ఉన్న డాన్యూబ్ నది ప్రక్షాళనకు తాము అవలంబించిన విధానాలను ఆస్ట్రియన్ బృందం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించింది. అనంతరం ప్రతినిధి బృందం సీఎస్ రాజీవ్‌శర్మతో సమావేశమైంది. సాయంత్రం హుస్సేన్‌సాగర్‌ను, కూకట్పల్లి, పికెట్ నాలాలను పరిశీలించింది. ఆది, సోమవారాల్లో పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత తమ ప్రతిపాదనలను సీఎంకి వివరిస్తామన్నారు. సమావేశంలో హెచ్ఎండీఏ కమిషనర్ శాలినీమిశ్రా, జలమండలి ఎండి జగదీశ్వర్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ ఆర్.ధన్సింగ్లతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆ బాలుడు ఉగ్రవాదే
వియెన్నా: ఆస్ట్రియాలో మెర్కెన్ జీ అనే 14 ఏళ్ల బాలుడిపై ఉగ్రవాద కేసులు నమోదయ్యాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ద్వారా అతడు ప్రేరేపితమై పలు హింసాత్మక దాడులకు పాల్పడాలని ప్రణాళికలు రచించే ప్రయత్నాల్లో ఉండగా పోలీసులు ఈ విషయం గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును పరిశీలించిన సెయింట్ పాలిటన్ సిటీ ప్రాసీక్యూటర్ కార్యాలయం అతడి నేరాన్ని గుర్తించింది. బాంబుల తయారీ, వాటిని పేల్చే విధానం వంటి విషయాలను ఇంటర్నెట్ ద్వారా డౌన్లోడ్ చేయడమే కాకుండా స్వయంగా డిటోనేటర్ రూపొందించి దానిని వియెన్నాలోని వెస్ట్ బానఫ్ రైల్వే స్టేషన్లో పెట్టి పేల్చి వేయాలని కూడా ప్లాన్ చేశాడట. అంతేకాకుండా, అతడి ల్యాప్ టాప్‌లో మొత్తం ఐఎస్ చేసే హింసాత్మక చర్యల వీడియోలు, వారి మాటల రికార్డులు, ఆకృత్యాల ఫొటోలు ఉన్నాయని కూడా పోలీసులు తెలిపారు. -
ఆస్ట్రియా : ప్రపంచ వీక్షణం
చరిత్ర: ప్రస్తుత ఆస్ట్రియా భూభాగం చాలా చిన్నది. క్రీస్తు పూర్వం 500లో కెల్ట్ అనే తెగ ప్రజలు ఈ ప్రాంతంలో నివాసం ఏర్పరచుకొని తమ ఆధిపత్యాన్ని చూపించారు. ఆ తర్వాత రోమన్లు, వండాల్లు, విసిగోత్లు, హన్లు, హంగేరియన్ మాగ్యార్లు, జర్మనీ తెగలు ఈ ప్రాంతాన్ని వందలాది సంవత్సరాలు పరిపాలించారు. అప్పుడు ఆస్ట్రియా భూభాగంలో చెకొస్లోవేకియా, హంగేరి, యుగోస్లావియా దేశ భూభాగాలు కలిసి ఉండేవి.క్రీస్తుశకం 1246లో స్విట్జర్లాండ్‌కు చెందిన ఆల్సేసియన్ కుటుంబం... ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని పరిపాలన ఆరంభించింది. ఆ కుటుంబమే హాప్స్‌బర్గ్ కుటుంబం. ఈ రాజులే ఆ కాలంలో ఆ భూభాగానికి వియన్నాను రాజధానిగా నిర్మించింది. 1530 నాటికి వియన్నా ఒక గొప్పనగరంగా విస్తరించింది. ఈ రాజులు ఇటలీ, నెదర్లాండ్, స్పెయిన్ వరకు తమ భూభాగాన్ని విస్తరించారు. ప్రతిసారీ రాజకుటుంబం పవిత్ర రోమన్ చక్రవర్తిని ఎన్నుకునేది. ఈ హాప్స్‌బర్గ్ కుటుంబం ఆస్ట్రియాను దాదాపు 600 సంవత్సరాల వరకు పరిపాలించింది. 1914 జూన్ 28న సరజోనో అనే ప్రాంతంలో ఒక సెర్బియన్ వ్యక్తి రాజ కుటుంబపు యువరాజు ఆర్చిడ్యూక్ ఫ్రాంజ్ ఫెర్డినాండ్‌ను పిస్తోలుతో కాల్చి చంపాడు. ఈ సంఘటన క్రమంగా పెద్దదై మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. ప్రజలు - సంస్కృతి దేశంలో 8% ప్రజలు రోమన్ క్యాథలిక్కులు. ఇక్కడి సమాజంలో చర్చి ఒక గొప్ప శక్తిమంతమైన కేంద్రం. వర్జిన్ మేరీ ఆలయాలు ఎక్కువ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు ఆదివారం రోజున చర్చిని సందర్శిస్తారు. ప్రజలకు మతం పట్ల ఎంతో నమ్మకం. ఇక ప్రతీ కుటుంబానికి తప్పకుండా ఇల్లు ఉంటుంది. దేశంలో నిరుద్యోగ సమస్య లేదు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ మాతృభూమి ఆస్ట్రియా. కాని ఆయన జర్మనీకి వలస వెళ్లి అక్కడ అధికారం చూపించాడు. దేశంలో జర్మన్ల జనాభా అధికం కావడం వల్ల జాతీయ భాషగా జర్మనీ భాషను గుర్తించారు. ఇంకా టర్కిష్లు, హంగేరియన్లు, పోలిష్, సెర్బియన్లు, క్రొయేషియన్లు ఇలా అనేక దేశాలవాళ్లు ఉన్నారు. దేశంలో వివిధ జాతుల వాళ్లు ఉండడం వల్ల వాళ్ల మూలాలను కాపాడుకోవడానికి తమ జాతిపరమైన ఆచార వ్యవహారాలను పాటిస్తుంటారు. వీరిలో అధికశాతం క్రిస్టియన్లు కావడం వల్ల క్రీస్తు ఆరాధన అధికంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ ఆధునిక శైలి దుస్తులనే ధరిస్తారు. వ్యవసాయం చేసే రైతులు కూడా ఆధునికంగానే ఉంటారు. ఈ దేశపు ప్రముఖ వ్యక్తులు - హాలీవుడ్ నటుడు ఆర్నార్డ్ స్క్వర్జ్నెగ్గర్, సిగ్మండ్ ఫ్రాయిడ్, మోజార్ట్, అడాల్ఫ్ హిట్లర్, ఎర్పిన్ ష్రోడింగర్. పరిపాలనా రీతులు ఆస్ట్రియా దే శాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం తొమ్మిది రాష్ట్రాలుగా విభజింకారు. ఈ రాష్ట్రాలు తిరిగి జిల్లాలుగా విభజింపబడి ఉన్నాయి. తొమ్మిది రాష్ట్రాలు ఇలా ఉన్నాయి. బర్గెన్లాండ్, కారింధియా, లోయర్ ఆస్ట్రియా, సార్జ్బర్గ్, స్ట్రెరియా, టైరోల్, అప్పర్ ఆస్ట్రియా, వియన్నా, వోరల్బెర్గ్. దేశంలో పెద్ద నగరాలు వియన్నా, గ్రాజ్, సార్జ్బర్గ్, ఇన్నిస్బ్రక్, క్లాగెన్‌ఫర్ట్, విల్లాచ్, వెల్స్ మొదలైనవి ఉన్నాయి. దేశంలో ఫెడరల్ రాజ్యాంగం అమలులో ఉంది. ఫెడరల్ ప్రెసిడెంట్ దేశాధిపతి. ఇతనితో పాటు ఫెడరల్ ఛాన్సలర్ కూడా ఉంటాడు. ప్రెసిడెంట్‌ను నేరుగా ప్రజలు ఎన్నుకుంటారు. దేశంలో ప్రజలకు 16 ఏళ్లు నిండగానే ఓటు హక్కు లభిస్తుంది. ప్రజలు - ఆహారం ఆస్ట్రియా దేశంలో ప్రజల ముఖ్య ఆహారం మాంసం. మాంసంతో చేసిన వంటకం పూర్వ కాలం నుండీ ఒక ప్రధాన వంటకంగా వస్తోంది. దీనిని రాయల్ క్యూసిన్ ‘హాఫ్కాచి’ అంటారు. ఆఫ్రికాట్ జామ్‌తో చేసిన క్రాప్ఫెన్, ఆపిల్స్‌తో చేసిన ఆఫ్ఫెల్ స్ట్రుడెల్, టాప్ఫెన్ లాంటి పేర్లు గల వంటకాలను భుజిస్తారు. వీరు పాల ఉత్పత్తులను బాగా తింటారు. దేశంలో వివిధ దేశాల ప్రజలు ఉండటం వల్ల ఇక్కడ వివిధ దేశాల వంటకాలు లభ్యమవుతాయి. ఐన్స్పేనర్ అని పిలిచే కాఫీ ఈ దేశపు ప్రత్యేకత. ప్రజలు బీరు, వైన్ బాగా తాగుతారు. దేశంలో చూడదగిన ప్రదేశాలు వియన్నా వియన్నా నగరం దేశానికి రాజధాని. ఇది 12 శతాబ్దంలో నిర్మితమైంది. ఎందరో రాజులు ఈ నగరం నుండే తమ పరిపాలనను కొనసాగించారు. దేశంలో అతి పెద్ద నగరం వియన్నానే. 1275లో నిర్మితమైన ఈ నగరం నడిబొడ్డున అద్భుతమైన హాఫ్బర్గ్ రాజప్రాసాదం నగరానికే తలమానికమైన రాజప్రాసాద భవనం. 88 సంవత్సరాల తర్వాత కూడా ఈ భవనం చెక్కు చెదరకుండా నిలిచి ఉంది. దేశాధ్యక్షుడు ఈ రాజప్రాసాదం నుండే వ్యవహారాలను నడుపుతాడు. 59 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ భవనంలో 2600 గదులు ఉన్నాయి. 19 వసారాలు ఉన్నాయి. వియన్నా న గరంలో ఇంపీరియల్ పాలెస్తో పాటు సెసేషన్ మ్యూజియమ్, అప్లైడ్ ఆర్ట్ మ్యూజియం, స్ట్రాట్సోపర్ నేషనల్ ఓపెరా భవనం, స్టీఫెన్స్డమ్ క్యాథడ్రల్, డోనాటర్మ్ టవర్, స్పానిష్ రైడింగ్ స్కూల్, హెర్మిస్ విల్లా, ఫెర్రీవీల్, ఎంపరర్స్ టోంబ్ ఇలా అనేక అద్భుత కట్టడాలు ఉన్నాయి. వియన్నా నగరంలోని ఆ కాలం నాటి విశాలమైన, అద్భుతమైన భవనాలను చూస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. విశాలమైన రోడ్లు, పురాతన, అధునాతన భవనాలు చూపరులను ఎంతో ఆకర్షిస్తాయి. దేశంలో వియన్నా నగరాన్ని చూడడానికి సంవత్సరంలో లక్షలాది సందర్శకులు వస్తూ ఉంటారు. ఇన్స్బ్రక్ ఆల్పైన్ పర్వత పాదాల వద్ద నెలకొన్న ఇన్స్బ్రక్ నగరం ప్రకృతి శోభను వెదజల్లే ఒక అందమైన నగరం. పర్వతాలను ట్రెక్కింగ్ చేయడానికి, నగరానికి పరిసరాల్లో ఉన్న 25 రిసార్ట్ గ్రామాలను పర్యటించి అందాలను ఆస్వాదించాలన్నా తప్పక ఇన్స్బ్రక్ వెళ్లాల్సిందే. ఈ నగరం టైరోల్ రాష్ట్రానికి రాజధాని. 15వ శతాబ్దంలో ఈ నగరం నిర్మించబడింది. పాతనగరంలో 15వ శతాబ్దం నాటి భవనాలు, రాజుల నివాసాలు ఇప్పటికీ కనిపిస్తాయి. ఈ నగరంలోనే ఎక్కువగా వింటర్ ఒలింపిక్స్ జరుగుతూ ఉంటాయి. స్కై రిసార్సులు అనేకం ఇక్కడ ఉన్నాయి. ఆస్ట్రియా దేశంలో ఈ నగరం ఆటలకు ప్రసిద్ధి. చలికాలంలో ఈ నగరంలో మంచు పరుచుకుని ఎంతో అందంగా కనబడుతుంది. ఈ నగరంలో సెయింట్ జాకబ్ క్యాథడ్రల్, మారియాహిఫ్ భవనం. బెర్గిసెల్ స్కై జంపింగ్ కొండ, అన్నాసాలే, నోర్డ్పార్క్, ఎనిమిది మ్యూజియంలు, గోల్డెన్ రూఫ్, ట్రయంఫ్ ఆర్చ్, స్ల్కాన్ అంబ్రాస్ ప్రాసాదం, విల్టెనర్ బాలిసికా, ఇలా ఎన్నో వింతలు, విశేషాలు ఈ నగరంలో కనిపిస్తాయి. విద్యార్థుల నగరం - గ్రాజ్ మొత్తం దేశంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్న నగరం గ్రాజ్. ఈ నగరంలో ఆరు విద్యాలయాలు ఉన్నాయి. దాదాపు 50 వేల మంది విద్యార్థులు ఈ విద్యాలయాల్లో చదువుతూ ఉన్నారు. నగరంలో అనేక మ్యూజియంలు ఉన్నాయి. ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తించింది. మూర్నది తీరంలో ఈ నగరం ఉంది. 12వ శతాబ్దం నాటి కట్టడాలు ఇప్పటికీ ఇక్కడ ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జొహన్నన్ కెప్లర్ ఈ నగరంలోనే పుట్టాడు. నివాస గృహాలు ఎంతో విచిత్రంగా ఉంటాయి. పైకప్పులు ఎరుపు రంగులో ఉంటాయి. పాతనగరంలో టౌన్‌హాల్ భవనం, స్ల్కాస్బర్, క్లాక్‌టవర్, ఆర్ట్ మ్యూజియం, లాండ్హౌస్, లాండెస్ జుగాస్, ఓపెర్నాస్, క్యాథడ్రల్, ఫెర్డినాండ్ మాసోలియం, ఫ్రెడరిక్ బుర్జ్, పెయింటింగ్ హౌస్, ఆధునిక ఆర్ట్ మ్యూజియం మొదలైన పురాతన కట్టడాలు, దాదాపు 21 మ్యూజియంలు, 228 అతి ఎత్తై భవనాలు ఉన్నాయి. ఈ నగరం 17 జిల్లాలుగా విభజింపబడి ఉంది. పురాతన నగరం వాచౌ క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి ఈ నగరం ఉనికిలో ఉందని చ రిత్ర చెబుతుంది. ఎందరో రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఈ నగరంలోనే ఒకప్పుడు ఇంగ్లండు రాజు కొంతకాలం రిచర్డు బందీగా ఉన్నాడు. ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. క్రీ.పూ. 15వ శతాబ్దంలో రోమన్లు ఈ ప్రాంతాన్ని పాలించారు. క్రీ.శ. 995లో క్రేమ్స్లు పాలించారు. వాచే అనే పేరు అప్పుడు పెట్టిందే. ఆ తరువాత అనేకమంది రాజులు ఈ ప్రాంతాన్ని పాలిస్తూ వచ్చారు. ఈ నగరంలో ఉన్న మెల్క్ అచే, కెనన్స్ అచే కట్టడాలు ఆ కాలంలో కట్టినవే. అవి నేటికీ నిలిచి వున్నాయి. డాన్యూబ్ నదీ తీరంలో వెలిసిన ఈ నగరంలో చూడదగిన కట్టడాలు అనేకం ఉన్నాయి. మెల్క్ అచే, గోట్టిగ్ అచే, డర్న్స్టీన్ కాజిల్, కూన్రింగర్ క్యాజిల్, షాలాబర్గ్ క్యాజిల్, గోతిక చర్చి, 15వ శతాబ్దంలో నిర్మించిన స్టీనర్టో గేటు, ఎరెన్ ట్రూడిస్ చాపెల్. 12వ శతాబ్దంలో నిర్మించిన బర్గ్రూయిన్ ఆగస్టీన్ క్యాజిల్, స్ల్కాస్ షాన్బెహల్, ఇలా ఎన్నో శతాబ్దాల నాటి కట్టడాలు నేడు మనం చూడవచ్చు. డాన్యూబ్‌నది ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో అక్కడక్కడ చిన్న చిన్న పట్టణాలు వెలయడం వల్ల వాచౌ నగరం ఒక గొప్ప ప్రకృతి రమణీయమైన పాత కొత్త కలయికల అపూర్వ నగరంగా విరాజిల్లుతోంది. సాల్జ్‌బర్గ్ నగరం ఆస్ట్రియా దేశపు కథల పుస్తకం సాల్జ్‌బర్గ్ అని ప్రసిద్ధి. ఈ నగరం సాల్జాక్ నది తీరంలో ఉంది. కొండ మీద 900 సంవత్సరాల క్రితం నిర్మించబడిన రాజ భవనం ఈ రోజు ఈ నగరానికి ఒక గొప్ప ఆకర్షణ కేంద్రంగా నిలిచింది. ఈ నగరాన్ని యూరప్ దేశపు గుండె కాయ అంటారు. దేశం మొత్తంలో జాతీయ పండగల నిర్వహణ ఈ నగరంలోనే జరుగుతుంది. ప్రపంచ ప్రసిద్ధ సంగీతకారుడు వెలుజార్ట్ జన్మస్థానం ఈ నగరమే. అందువల్ల ఈ నగరంలో నేషనల్ ఓపెరా భవనం నిర్మింపబడింది. ఇదొక అద్భుత కట్టడం. ఇక్కడ సంగీత కార్య్రకమాల్లో పాల్గొనడానికి ఎన్నో దేశాల నుండి కళాకారులు, సంగీత ప్రియులు ఇక్కడికి వస్తారు. నగరానికి చుట్టూ సరస్సులు, పర్వత సానువులు ఉండడం వల్ల ఈ నగరం పూర్తిగా ఒడిలో ఉన్నట్టుగా కనబడుతుంది. పాతనగరంలోని పురాతన కట్టడాలు చూపరులను ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఆస్కార్ ఆర్నథర్ భవనం, సాల్జ్‌బర్గ్ గుమ్మటాలు, చర్చి భవనాలు, రాజ ప్రాసాదాలు, క్యాజిల్స్ నగరంలో పర్యాటకులను ఆకర్షించే నిర్మాణాలు. ఈ పాత నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేది. సెయింట్ పీటర్స్ అనీ, మోడరన్ ఆర్ట్ మ్యూజియం భవనాలు కూడా చూడదగ్గవి. నైసర్గిక స్వరూపం ఖండం: యూరప్ వైశాల్యం: 83,879 చదరపు కిలోమీటర్లు జనాభా: 85,72,895 (తాజా అంచనాల ప్రకారం) రాజధాని: వియన్నా ప్రభుత్వం: పార్లమెంటరీ రిపబ్లిక్ కరెన్సీ: షిల్లింగ్ భాషలు: జర్మన్, మాగ్యార్, స్లోవీన్లు మతం: క్రైస్తవులు 88% వాతావరణం: జనవరి -4 నుండి 1 డి గ్రీలు, జూలై 15 నుండి 25 డిగ్రీలు ఉంటుంది. పంటలు: పశుపోషణ, గొర్రెల పెంపకం, గోధుమలు, మొక్కజొన్నలు, బంగాళాదుంపలు, బార్లీ, చెరుకు, ద్రాక్ష. పరిశ్రమలు: ఇనుము, ఉక్కు, యంత్ర పరికరాలు, కలప, రసాయనాలు, దుస్తులు, చమురు, సహజ వాయువులు, చమురుశుద్ధి, వైన్, బీర్, ఫుడ్ ప్రాసెసింగ్, పాల ఉత్పత్తులు. స్వాతంత్య్రం: మొదటిసారి 1918లో... రెండోసారి 1945లో... సరిహద్దులు: పశ్చిమ జర్మనీ, చెకొస్లోవేకియా, హంగేరి, యుగోస్లోవియా, స్విట్జర్లాండ్ -
ఫోర్ ఇన్ వన్..
ఇదో వినూత్న వాటర్‌క్రాఫ్ట్. పేరు కార్మోరన్. ఇది ఫోర్ ఇన్ వన్ అన్నమాట. అంటే దీన్నొక్కదాన్ని కొంటే మనం కేటమారన్, ట్రైమారన్, మోనోహాల్, హైడ్రోఫాయిల్ కొనాల్సిన పని లేదు. ఇవన్నీ ఏమిటి అనుకుంటున్నారా? ఇవి వాటర్క్రాఫ్ట్స్లో రకాలు. కార్మోరన్ ఒక్కటే ఇలా అన్ని రకాలుగా మారిపోతుంది. అదీ ప్రయాణిస్తుండగానే..! 1,500 కిలోల బరువుండే ఈ హైటెక్ వాటర్‌క్రాఫ్ట్ బటన్లు నొక్కుతున్న కొద్దీ.. మూడు నాలుగు రకాల బోట్లులాగా మారిపోతుంది. హైడ్రోఫాయిల్ మోడ్‌లో బోటు గాల్లో ప్రయాణిస్తున్నట్లు ఉంటుంది. కింద ఉండే హైడ్రోఫాయిల్స్ తెరుచుకుని.. బోటును కొంచెం పైకి లేపుతాయి. ఈ లగ్జరీ బోటును ఆస్ట్రియాకు చెందిన కార్మోరన్ కంపెనీ తయారుచేసింది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కార్మోరన్లో ముగ్గురు ప్రయాణించొచ్చు. అంతేకాదు.. దీన్ని సన్బాతింగ్కు అనువుగా చకచకా మార్చేసుకోవచ్చు కూడా. కార్మోరన్లోని ప్రధాన భాగాన్నంతా కార్బన్ ఫైబర్‌తో తయారుచేశారు. త్వరలో మార్కెట్లోకి రానున్న ఈ వినూత్న బోటు ధరను ఇంకా ప్రకటించలేదు. -
పసిడి నవ్వులు!
ఫొటో స్టోరీ ఈ ఫొటో 1946లో తీసినది. ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేరు పొందింది. తీసిన ఫొటోగ్రాఫర్ ఎవరో తెలియదు కానీ... దీని వెనుక ఉన్న కథ మాత్రం ఎందరినో ఆలోచింపజేసింది. ఈ చిన్నారి ఆస్ట్రియాలోని ఒక అనాథాశ్రమంలో ఉండేవాడు. తనవారు ఎవరో తెలియక, తనతో ఉన్నవారు తనకు ఏమవుతారో అర్థంకాక దిగులుగా ఉండేవాడు. అలాంటప్పుడే రెడ్‌క్రాస్ సభ్యులు ఆ ఆశ్రమాన్ని సందర్శించడానికి వచ్చారు. పిల్లలందరికీ రకరకాల బహుమతులు ఇచ్చారు. ఈ బుడతడికి ఒక జత బూట్లు ఇచ్చారు. వాటిని చూసి వాడి కళ్లు మెరిశాయి. ముఖం మతాబులా వెలిగిపోయింది. అంతవరకూ ఉన్న దిగులు మాయమైపోయింది. ఆ కొత్త బూట్ల జతను గుండెలకు హత్తుకుని తన ఆనందాన్ని ఇలా ప్రకటించాడు. మనం చేసే చిన్న సాయం అవతలివారికి కలిగించే సంతోషం ఎంతలా ఉంటుందో తెలియజేసిందీ చిత్రం! -
పిట్ట కాదు.. పువ్వు..
చూడ్డానికి రంగురంగుల పిట్టలా కనిపిస్తోంది కదూ.. నిజానికిది ఓ ఆర్చిడ్. ఆస్ట్రియాలోని లింజ్లో ఉన్న బొటానికల్ గార్డెన్లో క్రిస్టియన్ అనే ఫొటోగ్రాఫర్ కెమెరాకు చిక్కిన చిత్రమిది. ఏదో మామూలుగా ఆర్చిడ్స్ తాలూకు ఫొటోలు తీసుకుంటున్న క్రిస్టియన్ ఓ గులాబీ ఆర్చిడ్ను దగ్గర నుంచి ఫొటో తీయడానికి ప్రయత్నిస్తూ.. లెన్స్‌ను జూమ్ చేసేసరికి.. ఆర్చిడ్ లోపలి భాగం ఓ పక్షిలా ఉందన్న విషయాన్ని గుర్తించారు. ఈ ఫొటోను చూసినోళ్లందరూ ఇదో ఆర్చిడ్ చిత్రమంటే నమ్మడం లేదని క్రిస్టియన్ చెబుతున్నారు. -
ఫేస్ బుక్ పై కేసుకు పెరుగుతున్న మద్దతు!
లండన్:సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ కు వ్యతిరేకంగా దాఖలైన దావా కేసులో యూజర్ల మద్దతు క్రమేపీ పెరుగుతోంది. ఆస్ట్రియాకు చెందిన మాక్సిమలియిన్ ష్రెమ్స్ అనే న్యాయ విద్యార్థి ఫేస్ బుక్ పై వేసిన కేసుకు సంబంధించి 11,500 మంది యూజర్లు అండగా నిలిచారు. లక్షలాది యూజర్ల వ్యక్తిగత విషయాలను ఎన్ఎస్ఏ నిఘా సంస్థకు వాళ్ల 'ప్రిజమ్' అనే నిఘా కార్యక్రమం కోసం ఫేస్బుక్ ఇచ్చేసిందని ష్రెమ్స్ కేసు వేశాడు. యూజర్ల వ్యక్తిగత రహస్యాలను ఉల్లంఘించిందంటూ ఫేస్‌బుక్‌పై కేసు వేయడమే కాక.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నవాళ్లంత తనతో ఈ పోరాటంలో కలిసిరావాలని కోరాడు. లైక్ బటన్ ద్వారా థర్డ్ పార్టీ వెబ్సైట్లకు చెందిన యూజర్లను కూడా ట్రాక్ చేస్తోందని, యూజర్లు ఆన్లైన్లో ఏం చేస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోవడం ద్వారా డేటా ప్రైవసీ చట్టాలను ఉల్లంఘిస్తోందని ఆ దావాలో పేర్కొన్నాడు. దీనిపై రూ.4.6 కోట్లను ఫేస్ బుక్ చెల్లించాలని దావా వేశాడు. ఫేస్బుక్లో ఉల్లంఘనకు పాల్పడిన ప్రతీ యూజర్ నుంచి 41 వేల రూపాయిలు చొప్పున తనకు ఇప్పించాలని కోర్టుకు విన్నవించాడు. ఆగస్టు ఒకటో తేదీ వరకు ష్రిమ్స్తో పాటు అతడి పోరాటంలో 2,500 మంది చేరగా, కేవలం నాలుగు రోజుల వ్యవధిలో పదివేల మందికి పైగా యూజర్ల మద్దతు తెలుపుతున్నందుకు ష్రెమ్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.ఇది తాను భావించిన దానికంటే చాలా ఎక్కువ అని స్పష్టం చేశాడు. -
ఫేస్‌బుక్‌పై దావా కేసు
లండన్: ఆస్ట్రియాకు చెందిన న్యాయ విద్యార్థి మ్యాక్స్ స్ర్కీమ్స్ ఫేస్‌బుక్‌పై దావా కేసు దాఖలు చేశాడు. తన గోప్యతకు భంగం కలిగిందని ఆరోపిస్తూ వియన్నాలోని వాణిజ్య కోర్టును ఆశ్రయించాడు. ఫేస్బుక్లో ఉల్లంఘనకు పాల్పడిన ప్రతీ యూజర్ నుంచి 41 వేల రూపాయిలు చొప్పున తనకు ఇప్పించాలని కోర్టుకు విన్నవించాడు. తన న్యాయపో్రాటానికి 130 కోట్లమంది ఫేస్బుక్ ఖాతాదారులందరూ మద్దతుగా నిలవాలని మ్యాక్స్ అభ్యర్థించాడు. వ్యక్తిగత వివరాలను రక్షించడంలో సోషల్ మీడియా న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నదే తన ఆశయమని చెప్పాడు. -
ఈ జంగ్...గిటార్ కింగ్!
ఆ కుర్రవాడు సరదాగా గిటార్ వాయించడం మొదలుపెట్టాడు. ఆస్ట్రియాకు చెందిన థామస్ లీబ్, ఇంగ్లండ్‌కు చెందిన మార్టిన్ టేలర్... వీరంతా ఆ కుర్రవాడి గిటార్ ప్రదర్శన యూట్యూబ్‌లో చూసి ‘ఆసమ్’ అంటూ చప్పట్లు కొట్టారు. వినసొంపైన అతడి గిటార్ విన్యాసం ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది... తన శరీరంతో సమానంగా ఉన్న గిటార్‌తో ప్రపంచాన్ని సమ్మోహనపరచిన ఆ వ్యక్తి పేరు సుంఘాజంగ్. అతడిని చూసినవారంతా చైల్డ్ ప్రాడిజీ అంటుంటారు. జంగ్ తన గురించి ఇలా వివరించాడు... ‘‘మా నాన్నగారు అప్పుడప్పుడు గిటార్ వాయిస్తుండేవారు. బహుశ అది చూసే నాకు దాని మీద ఆసక్తి కలిగిందో ఏమో, మూడవతరగతి చదువుతున్నప్పు డే, మా నాన్నగారిని గిటార్ నేర్పించమని అడిగాను. ఆయన బేసిక్స్ నేర్పారు. ఆ తరవాత నాకు నేనుగా నేర్చుకున్నాను. మా ఇంట్లో ఉన్న గిటారు చాలా పెద్ద గిటారు కావడం వల్ల వాయించేటప్పుడు చాలా ఇబ్బందిపడేవాడిని. తీగెలను నొక్కుతుంటే చేతులు బాగా నొప్పి చేసేవి. అయినప్పటికీ ఎంతో కష్టపడి పాటలు నేర్చుకునేవాడిని. ఒక పాట పూర్తిగా వచ్చిన వెంటనే మరో పాట వాయించాలనిపిం చేది. అప్పుడే అనుకున్నాను, నేను ఎప్పటికీ గిటార్‌ని విడిచిపెట్టకూడదని. గిటార్ మీద వచ్చే విదేశీగీతాలు విని వాటినే ప్రాక్టీస్ చేయడం వలన, కొరియన్ పాప్ సాంగ్స్, సింగర్స్ నాకు పెద్దగా తెలియదు. నాకు ఫింగర్స్టయిల్ పాటలే బాగా నచ్చుతాయి. క్లాసికల్ అంతగా ఇష్టపడను. అలాగే లిరికల్ మెలడీ ట్యూన్స్ అంటే చాలా ఇష్టం. బ్రైట్ ట్యూన్స్ కూడా ఇష్టమే. గిటార్ మీద వేరేవాళ్లు వాయించిన మెలోడియస్ ట్యూన్స్ విని నేర్చుకుంటున్నాను. ఈ మధ్యే ‘నైట్ ఫ్లయిట్’ అనే ఆల్బమ్ కంపోజ్ చేసి, యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను. దానికి పెద్దపెద్ద వారి దగ్గర నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. నేను ప్రతి రోజూ మూడుగంటల పాటు సాధన చేస్తాను. చదువు ప్రధానం కనుక, హోమ్‌వర్క్ పూర్తయ్యాకే ప్రాక్టీస్ ప్రారంభిస్తాను. ప్రాక్టీస్ చేయనప్పుడు స్నేహితులతో ఆడుకుంటాను. సెల్మా గిటార్ (సెల్మా బ్రాండ్ గిటార్లు తయారుచేసే సంస్థ) కంపెనీ నా వీడియోలు చూసి, నా పాటలను స్పాన్సర్ చేయడానికి ముందుకొచ్చింది. నేను వాయించే పెద్ద గిటార్ చూసి, నా సైజ్‌కి సరిపడా గిటార్‌ను తయారుచేసి ఇచ్చారు. కొరియాలో మంచి గిటార్ కళాకారుడిగా పేరు సాధించాలన్నది నా ఆశయం.’’ - డా.వైజయంతి సముద్రమంటే ఇష్టం... కొరియాలో 1996, సెప్టెంబర్ 2వ తేదీన పుట్టిన సుంఘాజంగ్ ఎకోస్టిక్ ఫింగర్స్టయిల్ గిటారిస్ట్. యూట్యూబ్ ద్వారా అత్యున్నతస్థాయికి ఎదిగాడు. మే, 2013 నాటికి ఇతని గిటార్ విన్యాసాన్ని 687 మిలియన్ల మంది వీక్షించారు. 1,950,000 మంది సబ్‌స్క్రైబ్ చేశారు. అల్టిమేట్ గిటార్.కామ్ పేజీలో అతని ట్యూన్స్‌ని రింగ్‌టోన్స్‌గా డౌన్లోడ్ చేసుకోవడానికి అనువుగా ఉంచారు. యూ ట్యూబ్‌లో ఇతడికి 15 అవార్డులు వచ్చాయి. ‘పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్’ మ్యూజిక్‌ని కొన్ని మిలియన్లమంది వీక్షించారు. ఏ పాటనైనా కేవలం మూడు రోజులు ప్రాక్టీస్ చేసి, తనకు తానే రికార్డ్ చేసుకుని, యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేస్తాడు. 2010లో నార్షా సోలో ఆల్బమ్‌కి చేశాడు. ట్రేస్ బండీతో కలిసి అమెరికా, స్కాండినేవియా, జపాన్లలో ప్రదర్శనలిచ్చాడు. ఇప్పటివరకు మొత్తం 18 ఆల్బమ్స్ స్వరపరిచాడు జంగ్. 2010లో ‘పర్ఫెక్ట్ బ్లూ’ 2011లో ‘ఐరనీ’ 2012లో ‘ద డ్యూయెట్స్’ 2013లో పెయింట్ ఇట్ ఇకోయిస్టిక్ అనే ఆల్బమ్‌లు విడుదల చేశాడు. 2011లో ‘ది సూయిసైడ్ ఫోర్కాస్ట్’ అనే ఒక కొరియన్ సినిమాలో నటించాడు. కొరియన్ టెలివిజన్‌లో పాపులర్ టీవీ షో అయిన ‘స్టార్ కింగ్’లో ఇతడితో ఇంటర్వ్యూ చేసినప్పుడు... గిటార్ ప్రాడి జీ, అగస్ట్ రష్ ఇన్ కొరియా... అని పిలిచారు. 2007లో సుమారు 50 గంటల క్లాసికల్ గిటార్ లెసన్స్ చెప్పాడు జంగ్. ఈ మధ్యనే డ్రమ్స్, జాజ్, పియానో కూడా నేర్చుకుంటున్నాడు. జంగ్‌కి సముద్రమంటే చాలా ఇష్టం కావడం వల్ల తన బ్లాగ్‌కి ‘బ్లూ సీ’ అని పేరు పెట్టుకున్నాడు.