
భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఆస్ట్రియాలో ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నాడు. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో 22 ఏళ్ల ఈ షట్లర్ కాంస్య పతకం చేజార్చుకొని నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సర్క్యూట్‌లో ఆడటానికి ముందు అత్యుత్తమ ఫిట్‌నెస్ సాధించేందుకు ఆదివారం ఆస్ట్రియా బయలుదేరాడు.
ఈ నేపథ్యంలో లక్ష్య కోచ్ విమల్ కుమార్ మాట్లాడుతూ.. బలాబలాలు అంచనా వేసుకునేందుకు, సానుకూలతలు పెంచుకునేందుకు ఈ పర్యటన లక్ష్య సేన్‌కు ఉపయోగపడనుందని పేర్కొన్నాడు. ‘ప్రస్తుతం లక్ష్యసేన్ పూర్తి ఫిట్‌నెస్‌తోనే ఉన్నాడు. కానీ అతడికి మరింత శారీరక శిక్షణ అవసరం. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్‌పై దృష్టి పెట్టాలి. అందుకే లక్ష్య వారం రోజుల పాటు ఆస్ట్రియాలో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటాడు.
ఫిట్‌నెస్‌ను మరింత మెరుగు పరుచుకోవడంతో పాటు... అతడి ఆటలో వేగం పెంచుకునేందుకు ఈ శిక్షణ తోడ్పడనుంది. సాధారణంగా లక్ష్య ఆటతీరు దూకుడుగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు డిఫెన్స్ కూడా ముఖ్యమే. నెట్ గేమ్‌పై పట్టు సాధించాలంటే సూపర్ ఫిట్‌గా ఉండాలి’అని విమల్ పేర్కొన్నాడు. వచ్చే నెలలో హాంకాంగ్ సూపర్–500, చైనా ఓపెన్ సూపర్–1000 టోరీ్నల్లో లక్ష్యసేన్ బరిలోకి దిగే అవకాశాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment