నిరాధార వార్తలు రాస్తే సహించే ప్రసక్తే లేదని భారత బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్యారిస్ ఒలింపిక్స్-2024కు సన్నద్దమయ్యే క్రమంలో ప్రభుత్వం తనకు రూ. 1.5 కోట్లు కేటాయించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది. విశ్వ క్రీడలకు సిద్దమయ్యేందుకు కేంద్ర క్రీడా శాఖ టార్గెట్ ఒలింపిక్ పోడియం ఫినిష్ స్కీమ్(TOPS) పేరిట టాప్ అథ్లెట్ల శిక్షణకై నిధులు కేటాయించింది.
అయితే, అంచనాలకు అనుగుణంగా భారత క్రీడాకారులు రాణించలేకపోయారు. ప్యారిస్‌లో కేవలం ఆరు పతకాలు మాత్రమే గెలిచి స్వదేశానికి తిరిగి వచ్చారు. భారత్‌కు ఈ సారి షూటింగ్‌లో మూడు, హాకీ పురుషుల జట్టు, రెజ్లింగ్‌లో ఒక్కో కాంస్యం, జావెలిన్ త్రోలో రజతం మాత్రమే వచ్చాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత బ్యాడ్మింటన్ స్టార్లు పూర్తిగా నిరాశపరిచారు.
పీవీ సింధు, లక్ష్య సేన్, హెచ్ ఎస్ ప్రణయ్ తదితరులు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఈ క్రమంలో భారత బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె సైతం భారత షట్లర్ల తీరును విమర్శస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగతంగానూ ఓటములకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చురకలు అంటించారు.
కోట్ల రూపాయల నిధులు
ఈ నేపథ్యంలో వార్తా సంస్థ పీటీఐ.. భారత షట్లర్లకు TOPS కేటగిరీలో కేంద్రం కేటాయించిన నిధులకు సంబంధించి ఓ కథనం వెలువరించింది. ఆ వివరాల ప్రకారం.. ‘‘2023 వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఆసియా క్రీడల కాంస్య పతక విజేత హెచ్‌ఎస్ ప్రణయ్ ఒలింపిక్స్‌కు సిద్దమయ్యేందుకు.. క్రీడా శాఖ 1.8 కోట్ల రూపాయలు కేటాయించింది.
అయితే, చికున్‌గున్యా బారిన పడ్డ ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లో భారత్‌కే చెందిన లక్ష్యసేన్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టాడు. ఇక పీవీ సింధు జర్మనీ ట్రెయినింగ్ కోసం రూ. 26.60 లక్షలు, లక్ష్యసేన్‌కు ఫ్రాన్స్‌లో శిక్షణ కోసం రూ. 9.33 లక్షల నిధులు విడుదల చేసింది. ఇక ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్ పతకాలు సాధించిన సింధు ప్రిపరేషన్ కోసం ఓవరాల్‌గా 3.13 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. అయితే, ఆమె కూడా ప్రిక్వార్టర్స్‌లో వెనుదిరిగింది.
ఇక మహిళల డబుల్స్ జోడీ అశ్విని పొన్నప్ప, తానిషాలకు ఒక్కొక్కరికి 1.5 కోట్ల రూపాయల మేర నిధులు విడుదల చేసింది. అయితే, వారు గ్రూప్ స్టేజిలోనే ఎలిమినేట్ అయిపోయారు. మరోవైపు.. పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి కోసం ఏకంగా భారీ మొత్తంలో రూ. 5.62 కోట్ల నిధులు కేటాయించింది. ఈ జోడీ క్వార్టర్ ఫైనల్ కూడా దాటలేకపోయింది. ఓవరాల్‌గా బ్యాడ్మింటన్ బృందానికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(SAI) రూ. 72.03 కోట్లు ఖర్చుపెట్టింది’’.
ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా?
ఈ మేర వివరాలను ఉటంకిస్తూ పీటీఐ ఇచ్చిన ఆర్టికల్‌పై అశ్విని పొన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆర్టికల్స్ ఎలా రాస్తారు? ఈ అబద్దాన్ని ఎందుకు రాశారు? ఒక్కొక్కరికి రూ. 1.5 కోట్లా? ఎవరి నుంచి? ఎవరికి? ఎందుకు? నేను ఎవరి నుంచి ఎలాంటి డబ్బు తీసుకోలేదే! అసలు TOPS ఫండింగ్‌లో నా పేరు కూడా లేదు’’ అని ఎక్స్ వేదికగా అశ్విని పొన్నప్ప తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేసింది.
చదవండి: నీరజ్ చోప్రాతో మనూ పెళ్లి?.. స్పందించిన షూటర్ తండ్రి
Comments
Please login to add a commentAdd a comment