
తవ్వకాల్లో బయల్పడ్డ అస్థి పంజరం
హాల్‌స్టాట్... ఆస్ట్రియాలోని ముండెన్ జిల్లాలో ఉన్న అతి పురాతనమైన ఉప్పుగని. 1997లో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన ఈ ప్రదేశం పర్యాటకులను ఆకర్షించడంతో పాటుగా, చరిత్రకారుల పరిశోధనలకు గమ్యస్థానంగానూ మారింది. హాల్‌స్టాట్ సంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ ఉప్పుగని గర్భంలో చరిత్ర పూర్వ యుగానికి సంబంధించిన ఎన్నెన్నో నిజాలు దాగున్నాయంటున్నారు పురావస్తు శాస్త్రవేత్త హాన్స్ రెష్రెటెర్. ఏడు వేల ఏళ్లుగా ఉప్పు ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా నిలిచిన ఈ ప్రదేశం... ఒకప్పుడు సంపన్న నాగరికతకు ఆనవాలుగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి తమ పరిశోధనల్లో వెలుగు చూసిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
3 వేల ఏళ్ల నాటి చెక్క వంతెన...
నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే ఈ చారిత్రక ప్రదేశానికి సంబంధించిన ఆసక్తికర అంశాలు తెలుసుకునేందుకు 1838 నుంచే తవ్వకాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా క్రీ. పూర్వం 1100 నాటి చెక్క వంతెనను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వంతెన ద్వారానే గనిలోకి వెళ్లి ఉప్పును సేకరించి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ ఒకప్పుడు యూరప్‌లోని సగం దేశాలకు హాల్‌స్టాట్ ఉప్పు సరఫరా కేంద్రంగా ఉండేది. ఈ గని ద్వారా రోజుకు సుమారు ఒక టన్ను ఉప్పును ఉత్పత్తి చేసేవారు. అయితే ఇక్కడ దొరికిన ఈటెల వంటి పదునైన ఆయుధాలు కాంస్య యుగం నాటికి చెందినవిగా భావిస్తున్నామని’ పేర్కొన్నారు. ఇన్ని వేల సంవత్సరాలైనా ఆ వంతెన మాత్రం చెక్కుచెదరలేదని, అయితే ప్రస్తుతం చేపట్టిన పునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా చిన్న చిన్న మరమ్మతులు చేస్తున్నారని తెలిపారు.
రెండో దఫా తవ్వకాల్లో షాకింగ్ నిజాలు..
వియన్నాకు చెందిన మ్యూజియం ఆఫ్ నాచురల్ హిస్టరీ గత 60 ఏళ్లుగా హాల్‌స్టాట్‌లో తవ్వకాలు జరుపుతోంది. ఈ క్రమంలో... తాజాగా జరుపుతున్న రెండో దఫా తవ్వకాల్లో వేలాది అస్థిపంజరాలు బయల్పడ్డాయని హాన్స్ పేర్కొన్నారు. ‘ ప్రస్తుత తవ్వకాల్లో భాగంగా వేలాది అస్థిపంజరాలు బయల్పడ్డాయి. వీరిలో చాలా మంది మెడలో కాంస్య యుగం నాటి ఆభరణాలు ధరించి ఉన్నట్లు కనుగొన్నాం. అలాగే వారి అస్థికల పటుత్వాన్ని బట్టి శరీర నిర్మాణం కూడా చాలా ధృడంగా ఉండేదని అర్థమవుతోంది. దీన్ని బట్టి ఒకప్పుడు ఇక్కడ సంపన్న నాగరికత విలసిల్లిందని భావించవచ్చు. కానీ ఇక్కడ కూడా ఆర్థిక అసమానతలు ఉండేవని నిరూపించేందుకు మరికొన్ని పూర్తిగా ఎదగని శరీర నిర్మాణాలను కనుగొన్నామని’ ఆయన వ్యాఖ్యానించారు.
పారిశ్రామిక విప్లవానికి నాంది..
19 వ శతాబ్దంలో బయల్పడిన సమాధుల ఆధారంగా పూర్వ రాతి యుగానికి సంబంధించిన చరిత్రను తెలుసుకునే దిశగా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా.. గనిలోని 100 మీటర్ల లోపలికి వెళ్లి పరిశోధనలు కొనసాగిస్తున్నామని హాన్స్ చెప్పారు. ఇందులో భాగంగా 3 వేల ఏళ్ల క్రితం నాటి లెదర్ గ్లోవ్స్, మందమైన తాళ్లు, గొడ్డలి వంటి నిర్మాణం కలిగిన పదునైన ఆయుధాలు కనుగొన్నామని.... వీటిని బట్టి వేల ఏళ్ల క్రితం నాడే పారిశ్రామిక విప్లవానికి పునాది పడిందని భావించవచ్చన్నారు.
సందర్శకులకు స్వర్గధామం కూడా..
సముద్ర మట్టం నుంచి 800 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ సహజ సిద్ధమైన సరస్సును, అందులో నిక్షిప్తమైన ఉప్పు గని సందర్శించేందుకు ఏటా లక్షల మంది పర్యాటకులు వస్తూంటారని ఎగువ ఆస్ట్రియా గవర్నర్ థామస్ స్టెల్జర్ అన్నారు. వీరిలో ఎక్కువ మంది ఆసియా నుంచి వచ్చే వారి సంఖ్య అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. హాల్‌స్టాట్ సంస్కృతికి చిహ్నంగా నిలిచిన ఈ గని ద్వారా ఏటా 2 లక్షల 50 వేల టన్నుల ఉప్పును ఉత్పత్తి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతి అందాలకు నిలయంగా విలసిల్లుతున్న ఈ చారిత్రక సంపదను రక్షించుకోవడం తమ కర్తవ్యమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment