డాన్యూబ్ నది
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఆస్ట్రియన్ బృందం(ఆస్ట్రియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సైంటిస్టు మార్టిన్‌జంగ్, డాక్టర్ బివాస్, వాబగ్ సంస్థకు చెందిన మహేశ్ థర్గాల్కర్, పీఎస్ రంగరాజన్) నగరానికి వచ్చింది. శనివారం ప్రతినిధి బృందంతో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు జీహెచ్‌ఎంసీలో సమావేశమయ్యారు. సాగర్.. అందులో కలుస్తున్న వ్యర్థాలు.. ఇప్పటివరకు తాము చేపట్టిన పనులపై స్థానిక అధికారులు వారికి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వివిధ సంస్థలు జరిపిన అధ్యయన నివేదికల్ని అందజేశారు.
తమ దేశంలోని వియన్నాలో ఇదే మాదిరిగా ఉన్న డాన్యూబ్ నది ప్రక్షాళనకు తాము అవలంబించిన విధానాలను ఆస్ట్రియన్ బృందం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించింది. అనంతరం ప్రతినిధి బృందం సీఎస్ రాజీవ్‌శర్మతో సమావేశమైంది. సాయంత్రం హుస్సేన్‌సాగర్‌ను, కూకట్‌పల్లి, పికెట్ నాలాలను పరిశీలించింది. ఆది, సోమవారాల్లో పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత తమ ప్రతిపాదనలను సీఎంకి వివరిస్తామన్నారు. సమావేశంలో హెచ్‌ఎండీఏ కమిషనర్ శాలినీమిశ్రా, జలమండలి ఎండి జగదీశ్వర్, జీహెచ్‌ఎంసీ ఈఎన్‌సీ ఆర్.ధన్‌సింగ్‌లతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.