hussain sagar Cleanser
-
దుర్గంధమయంగా హుస్సేన్‌సాగర్
సాక్షి, సిటీబ్యూరో: చారిత్రక హుస్సేన్‌సాగర్ కంపు కొడుతోంది. నెక్లెస్ రోడ్లో సేదతీరేందుకు వచ్చే సందర్శకులకు దుర్గంధం స్వాగతం పలుకుతోంది. దీంతో కొందరు తలనొప్పి, వాంతులు, కళ్లు తిరగడం తదితర సమస్యలతో బాధపడుతుండగా... మరికొందరు కళ్ల మంటలు, చర్మంపై దురద రావడం లాంటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఘన వ్యర్థాలు, గుర్రపు డెక్కతో నిండిన సాగర జలాల్లోని బ్యాక్టీరియా.. కూకట్పల్లి, బాలానగర్ నాలా నుంచి వచ్చి చేరుతున్న పారిశ్రామిక రసాయన జలాల్లోని సల్ఫేట్‌ను గ్రహిస్తుండడంతో రసాయనిక చర్య జరిగి దుర్గంధం వెలువడుతుండడంతోనే ఈ దుస్థితి తలెత్తింది. ప్రస్తుతం జలాశయం నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతం సున్నాకు చేరుకోవడం ఆందోళనకలిగిస్తోంది. ఇక హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలన్న సర్కార్ సంకల్పం అటకెక్కింది. ఆర్భాటంగా ప్రారంభించిన ‘మిషన్’ గాడి తప్పింది. దశాబ్ద కాలంగా సాగర్ ప్రక్షాళనకు సుమారు రూ.326 కోట్లు ఖర్చు చేసినా ఫలితం శూన్యం. సాగర జలాల్లో ఆక్సిజన్ శాతం పెంచేందుకు రెండేళ్ల క్రితం కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ చేసిన ప్రయోగం సైతం విఫలమవడం గమనార్హం. ప్రక్షాళన పనుల్లో ఇప్పటి వరకు పూర్తయ్యింది గోరంతే. మిగిలిన పనుల పూర్తి అడుగుకో తడబాటులా మారింది. కాగా కూకట్పల్లి నాలా మళ్లింపు పనులను పూర్తి చేసినట్లు ప్రకటించినప్పటికీ... ఈ నాలా నుంచి పారిశ్రామిక వ్యర్థాలు జలాశయంలోకి నేటికీ చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు దశాబ్దాలుగా బల్క్‌డ్రగ్, ఫార్మా కంపెనీలు వెదజల్లిన గరళాన్ని తన గర్భంలో దాచుకున్న జలాశయం అట్టడుగున గడ్డకట్టుకుపోయిన ఘన వ్యర్థాల తొలగింపు పనులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ప్రక్షాళనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో జలాశయం ఉపరితల భాగంలో తెట్టులా పేరుకున్న వ్యర్థాల తొలగింపునకు విదేశాల్లో వినియోగించే ఎనిమిది కాళ్ల ఎక్స్కావేటర్ను వినియోగిస్తున్నప్పటికీ ఇవన్నీ పైపై మెరుగులేనన్న వాదనలు వినిపిస్తుండడం గమనార్హం. జలాశయం ప్రక్షాళన పర్వంలో ప్రస్తుతానికి సాధించింది గోరంతేనని... చేయాల్సిన పనులు కొండంత ఉన్నాయని పర్యావరణ వాదులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం పీవీ జ్ఞానభూమి నుంచి కిమ్స్ ఆస్పత్రి మార్గంలో సాగరజలాల్లో ఘన వ్యర్థాలు గుట్టలుగా పోగుపడడం ప్రస్తుత సాగర్ దుస్థితికి అద్దం పడుతోంది. ‘మిషన్ హుస్సేన్‌సాగర్’లోచేపట్టాల్సిన పనులివీ... ♦ జలాశయం నీటి నాణ్యత మెరుగుపరచడం, జలాశయంలోకి ఘన వ్యర్థాలు చేరకుండా చర్యలు. ♦ దశాబ్దాలుగా జలాశయం అడుగున బెడ్‌లా ఏర్పడిన ఘన వ్యర్థాలను డ్రెడ్జింగ్ ప్రక్రియ ద్వారా తొలగించడం. ♦ నాలుగు నాలాల నుంచి చేరుతున్న మురుగు నీటిని దారి మళ్లించడం. ♦ జలాశయం, దాని పరిసరాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం. ♦ జలాశయం నీటిని ల్యాండ్‌స్కేపింగ్, గార్డెనింగ్అవసరాలకు వాడుకునే స్థాయిలో నీటి నాణ్యతను మెరుగుపరచాలి. ♦ హుస్సేన్‌సాగర్ వద్దనున్న 20 ఎంఎల్డీ ఎస్టీపీ ఆధునికీకరణ, సామర్థ్యం పెంపు. ♦ హుస్సేన్‌సాగర్ చుట్టూ రింగ్‌సీవర్ మెయిన్స్ నిర్మించి మురుగునీరు జలాశయంలో చేరకుండా చూడడం. ♦ శుద్ధి చేసిన నీరు మాత్రమే జలాశయంలోకి ప్రవేశించే ఏర్పాటు. ♦ జలాశయంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు ఏరియేషన్ వ్యవస్థ ఏర్పాటు. సాగర మథనం సాగుతోందిలా.. ప్రధానంగా కలుస్తోన్న నాలాలు: కూకట్పల్లి, పికెట్, బుల్కాపూర్, బంజారా నాలాలు. ప్రక్షాళనకు తీసుకున్న చర్యలు: 2006లో రూ.270 కోట్లతో ఎస్టీపీల నిర్మాణం, ఘన వ్యర్థాల తొలగింపు. 2014: రూ.56 కోట్లతో కూకట్పల్లి నాలా డైవర్షన్ పనులు. 2015: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఎనిమిది కాళ్ల ఎక్స్కావేటర్తో వ్యర్థాల తొలగింపు. 2017: హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో సాగర జలాల్లో ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ఎజాక్స్ కంపెనీ శాటిలైట్ ఆధారిత టెక్నాలజీ వినియోగం. (ఈ ప్రయోగం ఉచితంగానే చేశారు) హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు దశాబ్ద కాలంలో చేసిన వ్యయం: సుమారు రూ.326 కోట్లు. బయో రెమిడియేషన్‌తో సత్ఫలితాలు బయో రెమిడియేషన్‌తో హుస్సేన్‌సాగర్‌లో ఆర్గానిక్ వ్యర్థాలు, దుర్వాసన తొలగించేందుకు హెచ్ఎండీఏ చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలిస్తున్నాయి. బెంగళూర్‌కు చెందిన నాకాఫ్ సంస్థ ఈ పనులు చేపట్టింది. ప్రధానంగా ఈ సంస్థ పర్యావరణహితమైన బ్యాక్టీరియా, ఇతర సాంకేతిక విజ్ఞానంతో సాగర్‌ను శుద్ధి చేస్తోంది. ఈ బ్యాక్టీరియాతో నీటిలో దుర్వాసనతో పాటు ఈ–కోలి, పాథోజెనిక్ బ్యాక్టీరియాను తొలగించడంతో పాటు సాగర్‌లో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (సీఓడీ), బయోలాజికల్ ఆక్సిజన్ (బీఓడీ) డిమాండ్, కరిగిన ఘన వ్యర్థాలు(టీడీఎస్), కరిగిన రేణువులు (టీఎస్ఎస్), నీటిలో కరిగిన ఆక్సిజన్ శాతాన్ని పీసీబీ ప్రమాణాల మేరకు ఉండేలా చూస్తున్నాయి. – అర్వింద్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ -
సాగర్ ప్రక్షాళనకు గ్లోబల్ టెండర్లు!
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. 2017 సెప్టెంబర్‌లో ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదుట పైప్‌లైన్ పగిలిపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో మురుగు నీటిని సాగర్‌లోకి మళ్లించాల్సి వచ్చిందని తెలిపారు. ‘సాగర్ ప్రక్షాళన కోసం అప్పటికే రూ.350 కోట్లు ఖర్చు చేశాం. అక్కడి నీటిలో కాలుష్యం బాగా తగ్గిందని నమూనా పరీక్షలు తేల్చాయి. అయితే అనుకోకుండా మురుగు నీటిని మళ్లించడం వల్ల నీటి కాలు ష్యం మళ్లీ తీవ్రమైన మాట వాస్తవమే’అని చెప్పారు. పురపాలక శాఖ బడ్జెట్ పద్దులపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు. చెన్నై కన్నా మన మెట్రోనే బెటర్ ‘హైదరాబాద్ మెట్రో రైలు నష్టాల్లో నడుస్తోందని పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే ప్రారంభమైన నాగోల్–అమీర్‌పేట్, అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లో రోజూ 50 వేల నుంచి 60 వేల మంది ప్రయాణిస్తున్నారు. చెన్నై మెట్రో రైలుతో పోల్చితే హైదరాబాద్ మెట్రోకు మంచి స్పందన ఉంది. వచ్చే జూలైలోగా మియాపూర్–ఎల్బీ నగర్, సెప్టెంబర్‌లోగా నాగోల్–హైటెక్ సిటీ, డిసెంబర్‌లోగా జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఇమ్లీబన్ బస్‌స్టేషన్ మార్గాల్లో మెట్రో సేవలను ప్రారంభిస్తాం. హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ కోసం బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించాం’అని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో మనుషులతో మురుగు నీటి కాల్వలు శుభ్రం చేయించడాన్ని పూర్తిగా నిషేధించామని, ప్రత్యామ్నాయంగా 75 మినీ జెట్టింగ్ యంత్రాలు వినియోగిస్తున్నామని చెప్పారు. త్వరలో మరో 75 మినీ జెట్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 5 పట్టణాల్లోనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, మిగిలిన 69 పట్టణాల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. రూ.1000 కోట్లతో టీఎఫ్యూడీసీ ద్వారా రాష్ట్రంలోని 43 పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. జపాన్‌లోని టోక్యో క్లీన్ అథారిటీ అందించనున్న సాంకేతిక సహకారంతో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. జీవన ప్రమాణాల్లో నంబర్‌వన్ రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా జీహెచ్ఎంసీకి రూ.300 కోట్ల రుణం లభించిందని, ఇంకా రూ.800 కోట్ల కోసం త్వరలో మళ్లీ బాండ్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్‌ల తరహాలో హైదరాబాద్‌లోని మురికివాడల్లో బస్తీ క్లినిక్‌లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించనున్నామన్నారు. రూ.100 కోట్లతో గండిపేట జలాశయం చుట్టూ చేపట్టిన సుందరీకరణ పనులు మూడు నెలల్లో పూర్తి కానున్నాయని, దీంతో నగరానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. జీవన ప్రమాణాల రీత్యా దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ వరుసగా నాలుగో సారి నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు. -
‘సాగర్’ ప్రక్షాళనకు ఆస్ట్రియా సాయం
సాక్షి, హైదరాబాద్: హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు సంబంధించి అధ్యయనం చేసేందుకు ఆస్ట్రియన్ బృందం(ఆస్ట్రియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన సైంటిస్టు మార్టిన్‌జంగ్, డాక్టర్ బివాస్, వాబగ్ సంస్థకు చెందిన మహేశ్ థర్గాల్కర్, పీఎస్ రంగరాజన్) నగరానికి వచ్చింది. శనివారం ప్రతినిధి బృందంతో మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంజీ గోపాల్, జీహెచ్ఎంసీ స్పెషలాఫీసర్ సోమేశ్‌కుమార్, వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీలో సమావేశమయ్యారు. సాగర్.. అందులో కలుస్తున్న వ్యర్థాలు.. ఇప్పటివరకు తాము చేపట్టిన పనులపై స్థానిక అధికారులు వారికి పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. వివిధ సంస్థలు జరిపిన అధ్యయన నివేదికల్ని అందజేశారు. తమ దేశంలోని వియన్నాలో ఇదే మాదిరిగా ఉన్న డాన్యూబ్ నది ప్రక్షాళనకు తాము అవలంబించిన విధానాలను ఆస్ట్రియన్ బృందం పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించింది. అనంతరం ప్రతినిధి బృందం సీఎస్ రాజీవ్‌శర్మతో సమావేశమైంది. సాయంత్రం హుస్సేన్‌సాగర్‌ను, కూకట్పల్లి, పికెట్ నాలాలను పరిశీలించింది. ఆది, సోమవారాల్లో పూర్తిస్థాయి అధ్యయనం తర్వాత తమ ప్రతిపాదనలను సీఎంకి వివరిస్తామన్నారు. సమావేశంలో హెచ్ఎండీఏ కమిషనర్ శాలినీమిశ్రా, జలమండలి ఎండి జగదీశ్వర్, జీహెచ్ఎంసీ ఈఎన్సీ ఆర్.ధన్సింగ్లతోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.