సాక్షి, హైదరాబాద్: హుస్సేన్ సాగర్ ప్రక్షాళనకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని, త్వరలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. 2017 సెప్టెంబర్‌లో ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదుట పైప్‌లైన్ పగిలిపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో మురుగు నీటిని సాగర్‌లోకి మళ్లించాల్సి వచ్చిందని తెలిపారు. ‘సాగర్ ప్రక్షాళన కోసం అప్పటికే రూ.350 కోట్లు ఖర్చు చేశాం. అక్కడి నీటిలో కాలుష్యం బాగా తగ్గిందని నమూనా పరీక్షలు తేల్చాయి. అయితే అనుకోకుండా మురుగు నీటిని మళ్లించడం వల్ల నీటి కాలు ష్యం మళ్లీ తీవ్రమైన మాట వాస్తవమే’అని చెప్పారు. పురపాలక శాఖ బడ్జెట్ పద్దులపై శుక్రవారం శాసనసభలో జరిగిన చర్చలో పలువురు సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు కేటీఆర్ బదులిచ్చారు.
చెన్నై కన్నా మన మెట్రోనే బెటర్
‘హైదరాబాద్ మెట్రో రైలు నష్టాల్లో నడుస్తోందని పత్రికల్లో వస్తున్న కథనాల్లో వాస్తవం లేదు. ఇప్పటికే ప్రారంభమైన నాగోల్–అమీర్‌పేట్, అమీర్‌పేట్–మియాపూర్ మార్గాల్లో రోజూ 50 వేల నుంచి 60 వేల మంది ప్రయాణిస్తున్నారు. చెన్నై మెట్రో రైలుతో పోల్చితే హైదరాబాద్ మెట్రోకు మంచి స్పందన ఉంది. వచ్చే జూలైలోగా మియాపూర్–ఎల్బీ నగర్, సెప్టెంబర్‌లోగా నాగోల్–హైటెక్ సిటీ, డిసెంబర్‌లోగా జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి ఇమ్లీబన్ బస్‌స్టేషన్ మార్గాల్లో మెట్రో సేవలను ప్రారంభిస్తాం. హైటెక్ సిటీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు మార్గం విస్తరణ కోసం బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించాం’అని కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్‌లో మనుషులతో మురుగు నీటి కాల్వలు శుభ్రం చేయించడాన్ని పూర్తిగా నిషేధించామని, ప్రత్యామ్నాయంగా 75 మినీ జెట్టింగ్ యంత్రాలు వినియోగిస్తున్నామని చెప్పారు. త్వరలో మరో 75 మినీ జెట్టింగ్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కేవలం 5 పట్టణాల్లోనే భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఉందని, మిగిలిన 69 పట్టణాల్లో ఈ వ్యవస్థ ఏర్పాటు కోసం కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. రూ.1000 కోట్లతో టీఎఫ్‌యూడీసీ ద్వారా రాష్ట్రంలోని 43 పురపాలికల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. జపాన్‌లోని టోక్యో క్లీన్ అథారిటీ అందించనున్న సాంకేతిక సహకారంతో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు.
జీవన ప్రమాణాల్లో నంబర్‌వన్
రూ.3 వేల కోట్లతో హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి తదితర పనులు చేపట్టామని కేటీఆర్ తెలిపారు. మునిసిపల్ బాండ్ల జారీ ద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.300 కోట్ల రుణం లభించిందని, ఇంకా రూ.800 కోట్ల కోసం త్వరలో మళ్లీ బాండ్లు జారీ చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మొహల్లా క్లినిక్‌ల తరహాలో హైదరాబాద్‌లోని మురికివాడల్లో బస్తీ క్లినిక్‌లు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించనున్నామన్నారు. రూ.100 కోట్లతో గండిపేట జలాశయం చుట్టూ చేపట్టిన సుందరీకరణ పనులు మూడు నెలల్లో పూర్తి కానున్నాయని, దీంతో నగరానికి పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. జీవన ప్రమాణాల రీత్యా దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ వరుసగా నాలుగో సారి నంబర్ వన్ స్థానంలో నిలిచిందని కేటీఆర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment