AP Budget 2025: నేడు ఏపీ బడ్జెట్‌.. | Finance Minister Keshav To Present Annual Budget In Assembly On Feb 28th, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

AP Budget 2025: నేడు ఏపీ బడ్జెట్‌..

Published Fri, Feb 28 2025 5:56 AM | Last Updated on Fri, Feb 28 2025 9:48 AM

Finance Minister Keshav to present annual budget in Assembly

ఉదయం పది గంటలకు అసెంబ్లీలో 2025–26 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి కేశవ్‌

వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు  

కూటమి సర్కారు రెండో బడ్జెట్‌ ఇది.. 

హామీలు ఎగ్గొట్టడం, మేనిఫెస్టోను మాయం చేయడంలో మాస్టర్‌ చంద్రబాబు 

బడ్జెట్‌లో అరకొర కేటాయించి మమ అనిపించడం ఆయనకు మామూలే.. 

ఈ బడ్జెట్‌లోనూ మరోమారు అలాంటి గారడీకి బాబు సిద్ధం 

వలంటీర్లను కొనసాగిస్తామని, రూ.10వేలు ఇస్తామని హామీ ఇచ్చి అసలు వ్యవస్థనే మాయం చేసిన బాబు 

సాక్షి, అమరావతి: హామీలపై చంద్రబాబు మరోమారు ఎలా మోసగించబోతున్నారు అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ శుక్రవారం ఉదయం 10గంటలకు అసెంబ్లీలో రాష్ట్ర 2025–26 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అదే సమయానికి శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్‌ను అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి నారాయణ ప్రవేశపెడతారు. అంతకుముందు ఉదయం 9గంటలకు అసెంబ్లీలోని సీఎం చంద్రబాబు చాంబర్‌లో మంత్రివర్గం సమావేశమై 2025–26 బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలపనుంది. 

కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్‌ ఇది. ఏడాదిగా హామీల ఊసెత్తని బాబు ఈ బడ్జెట్‌లో పథకాలకు కేటాయింపుల గారడీ చేయనున్నట్లు సమాచారం. ఎందుకంటే కేటాయింపులు చేసేద్దాం.. ఎటూ నిధులు ఇచ్చేది లేదుగా అని చంద్రబాబు తలపోస్తున్నట్లు సమాచారం. 2014–19లో కూడా ఆయన చాలా హామీలన్నీ బుట్టదాఖలా చేశారు. రుణమాఫీకి కొన్ని నిధులు కేటాయించినా పూర్తిగా చేసేసినట్లు భ్రమ కల్పించారు.  రకరకాల షరతులు, మాయోపాయాలతో రుణమాఫీ లబ్దిదారులను కుదించేసిన చంద్రబాబు నిరుద్యోగ భృతిని పూర్తిగా మాయం చేశారు. 

హామీలను ఎగ్గొట్టడం, అసలు మేనిఫెస్టోనే మాయం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తులు. కొన్ని హామీలకు సంబంధించి బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు జరిపినా ఆనక మమ అనిపించడం ఆయనకు మామూలే.  వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తానని, గౌరవవేతనాన్ని రూ.10వేలు చేస్తానని ఈ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన బాబు చివరకు ఆ వ్యవస్థనే లేకుండా వారి పొట్టకొట్టడం తెలిసిందే. యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, లేదంటే నెలకు రూ.3వేలు చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు. 

స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇస్తామని చెప్పారు. మూడో హామీ కింద ఏటా ప్రతి రైతుకు రూ.20వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రతి మహిళకు (19 నుంచి 59 ఏళ్ల మధ్య) నెలకు రూ.1,500 చొప్పున ఇస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇలాంటి పథకాలలో కొన్నింటికి ఈ బడ్జెట్‌లో కంటితుడుపుగా కేటాయింపులు జరిపి మమ అనిపించేద్దామని చంద్రబాబు చూస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement