స్టాక్‌హోమ్: సాహితీ రంగంలో విశేషంగా కృషిచేసిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఆస్ట్రియాకి చెందిన ప్రముఖ నవల, నాటక రచయిత పీటర్ హండ్కేకి 2019 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారం వరించింది. 2018 సంవత్సరానికి పోలండ్‌కి చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్‌కి ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్‘ అనే నవలకు గానూ ఈ బహుమతి లభించింది. జ్ఞానపిపాసతో ఆమె చేసిన సృజనాత్మక రచనకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. అద్భుతమైన భాషా పరిజ్ఞానంతో మానవ అనుభవాల విశిష్టతను ప్రభావవంతంగా చాటి చెప్పినందుకు ఆమెకు ఈ ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది.
15 మంది స్త్రీలకే నోబెల్ పురస్కారం
ఇప్పటి వరకు సాసాహితీరంగంలో కేవలం 14 మంది మహిళలనే నోబెల్ పురస్కారం వరించింది. ఈ రంగంలో నోబెల్ బహుమతి వచ్చిన మహిళల్లో ఓల్గా టోర్కార్క్విజ్ 15వ వారు. ఈమె రచనల్లో భిన్నత్వం ఉంటుంది. రెండు విభిన్న అంశాల మధ్యనున్న అంతరాన్ని ఉద్వేగపూరితంగా వర్ణిస్తారు. ఆమె నవలల్లో స్త్రీపురుషుల మధ్య, ప్రకృతికీ సంస్కృతికీ మధ్య, వివేచనకీ, అవివేకానికీ మధ్య వారి అంతరాంతరాల్లో రగులుతోన్న అంతర్మథనాన్ని అద్భుతంగా వర్ణిస్తారని నోబెల్ పురస్కారాన్ని ప్రకటించిన స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. నిజానికి ఓల్గా టోర్కార్క్విజ్‌ని కొంత ఆలస్యంగా ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపిక చేసినట్టు వారు వెల్లడించారు.
చంపేస్తామన్నారు..
జీవితంలో ఎన్నో చీకటి కోణాలను చూసిన 57 ఏళ్ళ పర్యావరణ వేత్త, శాఖాహారి అయిన ఓల్గా టోర్కార్క్విజ్ పోలండ్ మతతత్వ ప్రభుత్వ విధానాలనూ, చట్టాలనూ తూర్పారబట్టేందుకు వెనకాడని రాజకీయవేత్త. సాహసోపేతమైన, నిర్భీతితో కూడిన ఆమె రచనలు పోలండ్ సమాజాన్ని కుదిపేసాయి. ‘సహనశీల పోలండ్ మిథ్య’ అంటూ ఆమె చేసిన రచనల కారణంగా 2015లో ఆమెను చంపేస్తామన్న బెదిరింపులు సైతం వచ్చాయి. దీంతో ప్రచురణకర్తలు ఆమెకు బాడీగార్డులను సైతం ఏర్పాటుచేశారు. సృజనాత్మకత ఉట్టిపడేలా చిత్రీకరించిన ఆమె రచనల్లోని పాత్రల కవితాత్మకత వర్ణన పాఠకులను కట్టిపడేస్తుంది.
1962, జనవరి 29న పోలండ్‌లోని వెస్ట్రన్ టౌన్‌లో ఓల్గా జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ వార్సాలో ఆమె చదువుకున్నారు. ఆమె తండ్రి లైబ్రేరియన్ కావడంతో పుస్తకపఠనమే ప్రపంచంగా పెరిగారు. ఆమె తొలి నవల ‘ద జర్నీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్’ 1993లో ప్రచురించారు. ఓల్గా రచించిన ‘ఫ్లైట్స్’ నవలకు 2017లో బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె రచించిన 900 పేజీల ‘‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్’’ ఏడు దేశాలకూ, మూడు ప్రాంతాలకూ, ఐదు భాషల చరిత్రకు సంబంధించినది. 18వ శతాబ్దానికి చెందిన జూయిష్ అనే చిన్న తెగకు చెందిన బహుకొద్ది చరిత్ర మాత్రమే తెలిసిన ఫ్రాంకిసమ్ అనే వ్యక్తి చరిత్రను అన్వేషిస్తుంది.
హండ్కే – వివాదాస్పద రచయిత..
పీటర్ హండ్కే రచనలెంత ప్రాముఖ్యతను సాధించాయో, అంతే స్థాయిలో ఆయన వివాదాస్పదుడు కూడా. 1990లో యుగోస్లేవియా యుద్ధ సమయంలో సెర్బ్‌ల పక్షాన్ని వహించినందుకు ఆయనపై అనేక విమర్శలొచ్చాయి. మానవ హననం సాగించాడని, యుద్ధనేరానికి పాల్పడ్డాడని ఆరోపణలున్న మాజీ సెర్బ్ నేత స్లోబోదన్ మిల్‌సేవిక్ అంతిమయాత్రలో ఆయనకు మద్దతుగా ప్రసంగించడం కూడా పీటర్ హండ్కే వివాదాస్పదుడవడానికి మరో కారణం. 2014లో సాహిత్యరంగంలో నోబెల్ బహుమతిని నిషేధించాలని కూడా పీటర్ డిమాండ్ చేశారు. ఆయన రాసిన ‘ద అవర్ వియ్ న్యూ నథింగ్ ఆఫ్ ఈచ్ అదర్’ అనే సంభాషణలు లేని నాటకం చాలా ప్రసిద్ధి గాంచింది.
పీటర్ హండ్కే పూర్తి స్వచ్ఛమైన జర్మన్ భాషా రచయితల్లో బతికి ఉన్న అతి కొద్దిమందిలో ఒకరు. సాహితీరంగంలో నోబెల్ పురస్కారాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ‘ఇది ఒక్క క్షణం ఆసక్తికీ, ఆరుపేజీల పత్రికా వార్తకీ’ సంబంధించినదంటూ 2014లో అన్నారు. హండ్కే ఆస్ట్రియాలో రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1942, డిసెంబర్ 6) జర్మనీ సైనికుడికీ, స్లొవేనియాకు చెందిన మైనారిటీ తల్లికి జన్మించారు. బాల్యం యుద్ధ వాతావరణంలోగడిచింది. ఆ తరువాత ఆయన ఆస్ట్రియాలో ఆయన పెరిగి పెద్దయ్యారు. 1966లో ‘ద హార్నెట్స్’ అనే నవలతో సాహితీరంగంలో సంచలనం సృష్టించారు. దీంతో న్యాయవాద చదువుని మధ్యలోనే వదిలేసి సాహితీరంగం వైపు వచ్చారు.
ఓల్గా, హండ్కేలకు సాహితీ నోబెల్
Published Fri, Oct 11 2019 4:26 AM | Last Updated on Fri, Oct 11 2019 5:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment