59 నిమిషాల్లోనే నెగ్గిన పోలాండ్ స్టార్
రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి
ప్రత్యర్థికి ఒక్క గేమ్ మాత్రమే ఇచ్చిన రెండో సీడ్
ఆరో సీడ్ రిబాకినాకు చుక్కెదురు
మెల్‌బోర్న్: టెన్నిస్ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో పోలాండ్ స్టార్ ఇగా స్వియాటెక్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తన ప్రత్యర్థికి కేవలం ఒక్క గేమ్ మాత్రమే ఇచ్చి ఈ మాజీ నంబర్‌వన్ విజయాన్ని దక్కించుకుంది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ స్వియాటెక్ 6–0, 6–1తో ఇవా లిస్ (జర్మనీ)పై గెలిచి ఈ టోర్నీలో రెండోసారి క్వార్టర్ ఫైనల్లోకి చేరింది. వరుసగా ఏడోసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న 23 ఏళ్ల స్వియాటెక్ 2022లో సెమీఫైనల్‌కు చేరుకుంది.
ఇవా లిస్‌తో 59 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో స్వియాటెక్ మూడు ఏస్‌లు సంధించింది. ప్రత్యర్థి సర్వీస్‌ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. నెట్ వద్దకు 10 సార్లు దూసుకొచ్చి తొమ్మిదిసార్లు పాయింట్లు గెలిచింది. మూడో రౌండ్‌లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ ఎమ్మా రాడుకాను (బ్రిటన్)తో జరిగిన మ్యాచ్‌లోనూ ఒక్క గేమ్ మాత్రమే చేజార్చుకున్న స్వియాటెక్... రెబెకా స్రామ్‌కోవా (స్లొవేనియా)తో జరిగిన రెండో రౌండ్ మ్యాచ్‌లో రెండు గేమ్‌లు మాత్రమే కోల్పోయింది. క్వార్టర్ ఫైనల్లో ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా)తో స్వియాటెక్ తలపడుతుంది.
కీస్ సంచలనం
మరోవైపు టైటిల్ ఫేవరెట్స్‌లో ఒకరైన ఆరో సీడ్ రిబాకినా (కజకిస్తాన్) పోరాటం ప్రిక్వార్టర్ ఫైనల్‌కే పరిమితమైంది. అమెరికా ప్లేయర్, 19వ సీడ్ మాడిసన్ కీస్ 6–3, 1–6, 6–4తో రిబాకినాపై సంచలన విజయం సాధించి నాలుగోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో 28వ సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–4, 6–1తో కుదెర్‌మెటోవా (రష్యా)పై, ఎమ్మా నవారో 6–4, 5–7, 7–5తో తొమ్మిదో సీడ్ కసత్‌కినా (రష్యా)పై గెలిచి క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నారు. 12వసారి ఆ్రస్టేలియన్ ఓపెన్‌లో ఆడుతున్న స్వితోలినా మూడోసారి క్వార్టర్ ఫైనల్ చేరగా... నవారో తొలిసారి ఈ ఘనత సాధించింది.
సినెర్ ముందంజ
పురుషుల సింగిల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్ యానిక్ సినెర్ క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. 13వ సీడ్ హోల్గర్ రూనె (డెన్మార్క్)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో ఈ ఇటలీ స్టార్ 6–3, 3–6, 6–3, 6–2తో గెలుపొందాడు. 3 గంటల 13 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సినెర్ 14 ఏస్‌లు సంధించి, ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేశాడు. 35 విన్నర్స్ కొట్టిన సినెర్ ప్రత్యర్థి సరీ్వస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు.
ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో ఎనిమిదో సీడ్ అలెక్స్ డిమినార్ (ఆస్ట్రేలియా) 6–0, 7–6 (7/5), 6–3తో మికిల్సన్ (అమెరికా)పై, లొరెంజో సొనెగో (ఇటలీ) 6–3, 6–2, 3–6, 6–1తో క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ (అమెరికా)పై విజయం సాధించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. గేల్ మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)తో జరిగిన మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 7–6 (7/3), 6–7 (3/7), 7–6 (7/2), 1–0తో ఆధిక్యంలో ఉన్నదశలో మోన్‌ఫిల్స్ గాయంతో వైదొలిగాడు. దాంతో బెన్ షెల్టన్ రెండోసారి ఈ టోరీ్నలో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను దక్కించుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment