Environmentalist
-
Kamana Gautam: ప్రతి ఇంటి నుంచి పచ్చటి అడుగు
ఒక మంచి పని చేసినప్పుడు అభినందించే వారే కాదు అనుసరించే వారు కూడా ఉంటారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కామ్నా గౌతమ్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ‘పర్యావరణహిత మార్గం వైపు ప్రయాణం మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటుంది కామ్నా గౌతమ్... ‘పర్యావరణ సంరక్షణకు మన వంతుగా ఉడతాభక్తిగా చేయడానికి ఎంతో ఉంది. అందుకు మన ఇంటి నుంచే శ్రీకారం చుట్టాలి’ అంటుంది కామ్నా గౌతమ్. తన ఇన్స్పైరింగ్ మాటలతో సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన కామ్నా నూట్రీషనిస్ట్. వేస్ట్ మేనేజ్మెంట్ టెక్నిక్‌లు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం... మొదలైన వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది కామ్నా గౌతమ్. బేబీ–వియరింగ్, బ్రేస్ట్ఫీడింగ్లాంటి అంశాలకు సంబంధించి ఉపయోగకరమైన సమాచారం అందించడంతో కామ్న సోషల్ మీడియా జర్నీ మొదలైంది. ‘నేను ఒక బిడ్డకు తల్లిని. బిడ్డ భవిష్యత్ బాగుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అందుకే బిడ్డల బంగారుభవిష్యత్ కోసం పర్యావరణహిత మార్గాన్ని ఎంచుకున్నాను’ అంటుంది కామ్న. పర్యావరణ హిత మార్గంలో తన ఇంటి నుంచే తొలి అడుగు వేసింది. ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా చేసింది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. ‘మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఎందుకు ఉపయోగించడం లేదో తెలుసా?’ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పింది. ‘నేను ఇలా చేస్తున్నప్పుడు ఇతరులు కూడా చేయవచ్చు కదా. వారిలో ఎందుకు స్పందన కనిపించడం లేదు?’ అంటూ బాధ పడేది కామ్నా. అయితే ఆ తరువాత మాత్రం ఒక్కరొక్కరుగా ఆమెను అనుసరించడం ప్రారంభించారు. ఇంటిని ఎన్విరాన్మెంట్–ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడం మొదలు పెట్టారు. ప్లాస్టిక్ బ్యాగులు కనిపించకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో క్లాత్‌బ్యాగులు ఉండాలి, డిస్పోజబుల్ వాటర్ బాటిల్ కాదు మీదైన సొంత వాటర్ బాటిల్ ఉండాలి, ట్రెండ్లను అనుసరిస్తూ పర్యావరణానికి హాని కలిగించే వస్త్రాలు లేదా వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఇంట్లోని వ్యర్థాలను తడి, పొడి విభాగాలుగా వేరు చేయండి...ఇలాంటి విషయాలెన్నో చుట్టుపక్కల వారికి చెబుతున్నప్పుడు మొదట్లో వారి స్పందన ఎలా ఉండేదో తెలియదుగానీ ఆ తరువాత మాత్రం మార్పు కనిపించింది. -
కాలుష్యంపై ఏం చేస్తారో చెప్పండి?: సుప్రీం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్)–ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా పడిపోతోందని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిష్క్రియాపరత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కాలుష్యాన్ని అరికట్టడానికి ఏం చేస్తారో చెప్పాలని పేర్కొంది. 24 గంటల్లోగా పరిష్కార మార్గాలతో ముందుకు రావాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. కాలుష్యాన్ని నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమైతే తామే అసాధారణ చర్యలకు పూనుకుంటామని తేల్చిచెప్పింది. ఢిల్లీ, ఎన్సీఆర్లో గాలి నాణ్యతను పెంచాలని, పరిసర రాష్ట్రాల రైతులకు పంట వ్యర్థాలను నిర్మూలించే యంత్రాలను అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ పర్యావరణవేత్త ఆదిత్య దూబే, న్యాయ విద్యార్థి అమన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. కాలుష్యం స్థాయిలు పడిపోయేలా కఠిన చర్యలు చేపడతారని తాము ఆశిస్తున్నట్లు తెలిపింది. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ ప్రచార కార్యక్రమం ‘రెడ్ లైట్ ఆన్, గాడీ ఆఫ్’పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలు ష్యంపై ప్రచారం పేరిట బ్యానర్లు చేతికి ఇచ్చి చిన్నపిల్లలను రోడ్లపై నిలబెడుతున్నారని, వారి ఆరో గ్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని నిలదీసింది. ఢిల్లీలో నేటినుంచి స్కూళ్లు మూసివేత దేశ రాజధానిలో అన్ని పాఠశాలలను శుక్రవారం నుంచి మూసివేస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ప్రకటించింది. బోర్డు పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని వెల్లడించింది. ఢిల్లీ పాఠశాలల్లో భౌతికంగా తరగతులు నిర్వహిస్తుండడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహించిన కొన్ని గంటల్లోనే ప్రభుత్వం ప్రతిస్పందించింది. -
ఆవిడను చూసి అందరూ చేతులెత్తి నమస్కరించారు.. ఇంతకు ఆమె ఏం చేశారు?
డెభ్బై ఏళ్లకు పైబడ్డ తులసి చెట్టు కోటను వదిలి అడుగులో అడుగేస్తూ...రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టింది! ప్రాంగణంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆ మెత్తటి అడుగుల దిశగా తలతిప్పి చూశారు! ఆతృతగా చూసిన ఆ చూపులు ఒక్కసారిగా తులసి దగ్గర ఆగిపోయాయి! కదిలే వన దేవతలా ఉన్న ఆమెకు మహామహులెందరో .. రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అతిరథ మహారథులను కట్టిపడేసిన తులసి..అడవిలో ప్రాణం పోసుకున్న వేలాది చెట్లకు అమ్మ! సోమవారం జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో..తులసి గౌడ అని పేరు పిలవగానే ఓ పెద్దావిడ..జుట్టును ముడేసుకుని, మెడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు, జాకెట్ లేకుండా, ఒంటికి చీర చుట్టుకుని, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా కాస్త ఆశ్చర్యంగా, తరువాత ఆనందంగానూ, అభినందనగా చూశారు. ఆమె మరెవరో కాదు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్‌గా పిలిచే గిరిజన మహిళ తులసీ గౌడ. గత అరవై ఏళ్లుగా వేల మొక్కలను పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది ఆమె. మొక్కలను ఎలా పెంచాలి? ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో చిటికెలో చెప్పేస్తుంది. వేలాది మొక్కల పెంపకం, ఔషధ గుణాలపై ఉన్న అపార అనుభవానికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు తులసిని వరించింది. కర్ణాటక రాష్ట్రం అనకోలా తాలుకలోని హొన్నలి గ్రామంలో పుట్టిన తులసి హక్కాళి తెగకు చెందిన గిరిజన మహిళ. అసలే నిరుపేద కుటుంబం, దీనికి తోడు తులసికి రెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. పొట్టకూటికోసం తన తల్లి తోబుట్టువులతో కలిసి కూలి పనులు చేసేది. దీంతో బడికి వెళ్లి చదువుకునే అవకాశం దొరకలేదు. తులసికి పదకొండేళ్లకే బాల్య వివాహం జరిగింది. అయినా తన కష్టాలు తీరకపోగా, కొద్ది కాలంలోనే భర్త మరణించడంతో తన బాధ్యతలు, కష్టాలు మరింత పెరిగాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుకు సాగేది. మాటలు కాదు చేతల్లో చూపింది ప్రముఖ పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది చేయండి? అది చేయండి? భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వండి అని వివిధ వేదికలపై గళం విప్పుతోంది. గ్రేటా కంటే చాలా చిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది తులసీ గౌడ. చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టమున్న తులసి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుతుండేది. ఈ ఆసక్తిని గమనించిన ఫారెస్ట్ కన్జర్వేటర్ యల్లప్ప రెడ్డి ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. విత్తనాలు నాటి అవి మొలిచి, ఏ ఆటకం లేకుండా పెరిగేలా చేయడం తులసి పని. 35 ఏళ్లపాటు నర్సరీలో రోజువారి కూలీగా పని చేసింది. తరువాత తులసి పనితీరు నచ్చడంతో శాశ్వత ఉద్యోగిగా నియమించారు. తన 15ఏళ్ల సర్వీసులో.. యూకలిప్టస్, టేకు, ఇండియన్ రోజ్ ఉడ్, ఏగిస, చండ్ర, మద్ది మొక్కలను పెంచింది. తర్వాత మామిడి, పనస చెట్లను కూడా పెంచింది. ఉద్యోగం చేసినప్పుడు కాలంలో వందల నుంచి వేల సంఖ్యలో విత్తనాలను నాటి, మొక్కలను పరిరక్షించి, వృక్షాలుగా మార్చారు. ఇలా ఇప్పటిదాకా 40వేలకు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. రిటైర్ అయినప్పటికీ గతంలోలాగే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అంతేగా హళక్కి గిరిజన తెగ సమస్యలు, అడవుల నాశనం పైనా ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర,, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులేగాక, డజనుకుపైగా ఇతర అవార్డులు అందుకున్నారు. నడిచే వన దేవత.. విత్తనాలు ఎప్పుడు నాటాలి? మొక్కలను ఎలా పరిరక్షించాలి? వాటిని ఎలా విస్తరించాలి వంటి అనేక ప్రశ్నలకు తులసి తడుముకోకుండా చెబుతారు. అటవీ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మొక్కల గురించి ఏ సందేహం అడిగినా చిటికెలో చెప్పేస్తుండడంతో.. పర్యావరణ వేత్తలతో సహా అంతా ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. విత్తనాలు నాటిన నుంచి మొక్క పెద్దయ్యేంత వరకు కాపాడుకుంటుండడం వల్ల మొక్కల దేవతగా కూడా తులసిని అభివర్ణిస్తున్నారు. తాను పెంచిన వృక్షాల్లో ఏజాతి మొక్క ఎక్కడ ఉంది, వాటిలో మొదటి మొక్క ఏది? వంటి వాటికి తులసి దగ్గర ఇట్టే సమాధానాలు దొరుకుతాయి. తల్లిమొక్క నుంచి తీసిన విత్తనాలు నాటినప్పుడు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అందువల్ల ఆమె తల్లిమొక్క నుంచి విత్తనాలు తీసి నాటేది. ఏ విత్తనాలు ఎప్పుడు తీసుకోవాలి? వాటిని ఎలా నాటాలి? మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తులసికి అపార అనుభవం ఉంది. చదువుకోకపోయినప్పటికీ తన అరవైఏళ్ల అనుభవంలో మొక్కలు, వృక్షాల గురించి ఎన్నో విషయాలను గూగుల్ కంటే వేగంగా చెబుతుంది. దీంతో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చినవారు మొక్కల గురించి తెలుసుకుంటుంటారు. డెబ్భై పైబడినప్పటికీ ఇప్పటికీ ఇంత చురుకుగా ఉంటూ, పర్యావరణ సమతౌల్యతకి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తులసి. 300 మొక్కలను గుర్తుపడుతుంది.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా 28 ఏళ్లు పనిచేసిన తరువాత తులసి గౌడను కలిసాను. అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయ వృక్షాలను మళ్లీ పెంచాలనుకుంటున్న సమయంలో తులసి కనపడడం అదృష్టం, ఆమె అపార అనుభవాన్ని జోడించి అడవిని విస్తరించాలనుకున్నాను. అందువల్ల అటవీశాఖ విభాగంలో చేర్చుకుని మొక్కల పెంపకాన్ని ఆమెకు అప్పజెప్పాము.అలా పెంచుతూ పోతూ వేల మొక్కలను పెంచింది. అంతేగాక 300 ఔషధ మొక్కలను గుర్తుపట్టడంతోపాటు, రోగాలను తగ్గించే ఔషధమొక్కల పేర్లను ఆమె ఇట్టే చెప్పేస్తుంది. ఆమె విత్తనాలు వేసి పెంచిన వృక్షాలు లక్షలు కాదు కోట్లలోనే ఉంటాయి’’ అని యల్లప్ప రెడ్డి చెప్పారు. -
పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!!
‘పిక్చర్ ఆఫ్ ది డే’ అంటూ ఈ ఫొటోను సోషల్ మీడియాలో నెటిజనులు షేర్ చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్లో సోమవారం జరిగిన పద్మ పురస్కారాలు ప్రదానోత్సవం సందర్భంగా తీసిన చిత్రమిది. ప్రత్యేక వస్త్రాలంకరణతో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అవార్డు అందుకోవడానికి వెళుతున్న వృద్ధురాలికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముకుళిత హస్తాలతో అభివాదం చేస్తుండడం ఈ ఫొటోలో కనిపిస్తుంది. ఈ చిత్రంలో ఉన్న వృద్ధురాలి పేరు తులసి గౌడ. సామాజిక సేవ విభాగంలో ఆమెకు పద్మశ్రీ పురస్కారం దక్కింది. అటవీ విజ్ఞాన సర్వస్వం కర్ణాటకకు చెందిన 73 ఏళ్ల తులసి గౌడ.. అడవుల్లోని సమస్త జీవజాతుల గురించిన తెలిసిన, అటవీ విజ్ఞాన సర్వస్వంగా ప్రఖ్యాతి గాంచారు. గత ఆరు దశాబ్దాలుగా పర్యావరణ పరిక్షరణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. 30 వేలకు పైగా మొక్కలు నాటి ప్రకృతి పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. ఇప్పటికీ ఆమె ఈ యజ్ఞాన్ని కొనసాగిస్తూ ఆదర్శమూర్తిగా నిలిచారు. ఆమె నిస్వార్థ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. (చదవండి: పద్మ పురస్కారాలు.. ఏపీ నుంచి ముగ్గురు) సింప్లిసిటీకి జేజేలు పద్మశ్రీ అవార్డును అందుకోవడానికి దేశరాజధాని ఢిల్లీకి వచ్చిన తులసి గౌడ ఎటువంటి ఆడంబరాలకు పోకుండా తనకు అలవాటైన వస్త్రాధారణనే కొనసాగించారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోవడానికి నిరాడంబరంగా వచ్చిన ఆమెను చూసి ప్రధాని మోదీ సహా ఇతర మంత్రులు, ఉన్నత అధికారులు వినమ్రంగా నమస్కరించారు. తులసి గౌడ నిరాడంబరతకు నెటిజనులు సైతం జేజేలు పలుకుతున్నారు. ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో విరివిగా షేర్ చేస్తూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు. శభాష్.. హజబ్బ! కాగా, కర్ణాటక రాష్ట్రానికే చెందిన హరేకల హజబ్బ కూడా కాళ్లకు చెప్పులు లేకుండా నిరాడంబరంగా రాష్ట్రపతి చేతులు మీదుగా పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. అక్షరం ముక్క రాని హజబ్బ ఎంతోమంది పిల్లలకు చదువుకునే భాగ్యం కల్పించారు. మంచి పనికి పేదరికం అడ్డుకాదని ఆయన నిరూపించారు. పళ్లు అమ్ముకుని జీవనం సాగిస్తున్న హజబ్బ.. సొంతిల్లు కూడా కట్టుకోకుండా తన ఊరి పిల్లల కోసం ఏకంగా పాఠశాల కట్టించారు. పద్మ అవార్డుతో వచ్చిన 5 లక్షల రూపాయలను కూడా స్కూల్‌కే ఇచ్చేసి మంచి మనసు చాటుకున్నారు. నెటిజనులు ఆయనకు కూడా సలాం చేస్తున్నారు! (Harekala Hajabba: అవమానం నుంచి పుట్టిన ఆలోచన..) -
‘ఐరాస బృందం’లో భారత పర్యావరణవేత్త
ఐక్యరాజ్యసమితి: భారత్‌కు చెందిన మహిళా యువ పర్యావరణవేత్త ఒకరు ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెరస్ సలహా మండలికి ఎంపికయ్యారు. రోజు రోజుకూ దారుణంగా మారుతున్న పర్యావరణ పరిస్థితిని మెరుగు పరిచేందుకు అవసరమైన సలహాలను వీరు యూఎన్ చీఫ్‌కు అందిస్తారు. ఈ మండలికి ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు (18–28 ఏళ్ల వారు) ఎంపిక కాగా భారత్ నుంచి అర్చన సొరెంగ్(24) అందులో ఒకరు కావడం విశేషం. పర్యావరణాన్ని సమతులంగా ఉంచేందుకు ఆదివాసులు ఉపయోగిస్తున్న పద్ధతులను, వారి సంప్రదాయ నైపుణ్యాన్ని పరిరక్షించేందుకు అర్చన పరిశోధనలు సాగిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. ఈ సందర్భంగా అర్చన మాట్లాడుతూ.. మన పూర్వీకులు సంప్రదాయ విధానాల్లో అడవులను, పర్యావరణాన్ని పరిరక్షించారని, ఇప్పుడు ఆ బాధ్యత మనపై ఉందని, వాతావరణ మార్పులతో మనం పోరాడాల్సి ఉందని చెప్పారు. ఈమె టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ముంబై (టిస్) నుంచి రెగ్యులేటరీ గవర్నెన్స్ పూర్తి చేశారు. ఆమె టిస్ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా పనిచేశారు. ‘మనం పర్యావరణ అత్యవసర పరిస్థితిలో ఉన్నాం. మనకు ఎక్కువ సమయం లేదు’అని గుటెరస్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. త్వరితగతిన నిర్ణయాలు తీసుకుని కోవిడ్‌తో పాటు, అన్యాయం, అసమానత్వం, పర్యావరణ నాశనం వంటి వాటిపై పోరాడాలన్నారు. యువతను మరింత ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగానే సలహామండలిని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. -
ఉప్పెనలా ముప్పు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మన దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లోని 35 కోట్ల మంది రానున్న 30 ఏళ్లలో ముంపు ముప్పు ఎదుర్కోనున్నారని అమెరికా వాతావరణ సంస్థ క్లైమెట్ సెంట్రల్ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో దేశంలో గుజరాత్ తర్వాత అతి పొడవైన.. 974 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన మన రాష్ట్రం పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. పెను తుపాన్లు మహా విధ్వంసం సృష్టించడానికి కారణం భూతాపం పెరగటమేనని నేషనల్ క్లైమెట్ సెంటర్ నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల వాతావరణం వేడెక్కి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, ఫలితంగా తీరం భారీగా కోతకు గురవుతోందని పేర్కొంది. సమీప భవిష్యత్తులో సంభవించే తుపాన్లలో గాలి వేగం పెరుగుతుందని, వరద ఉధృతి తీవ్రత అధికమవుతుందని ఈపీసీసీ (ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్) నివేదికలో వెల్లడించింది. రక్షణ చర్యలు లేకపోవడం వల్లే.. 1876 అక్టోబర్ 8న సంభవించిన తుపాను 150 కిలోమీటర్ల గాలి వేగంతో విశాఖపట్నంపై విరుచుకుపడినట్లు 1907 విశాఖ జిల్లా గెజిట్ స్పష్టం చేస్తోంది. అప్పట్లో తీర ప్రాంతంలో మడ అడవులు, తాటి తోపులు ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదు. 2014లో విశాఖ తీరాన్ని తాకిన హుద్‌హుద్ తుపాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. సహజ రక్షణ కవచాలైన మడ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తేలింది. ఒక్క విశాఖ తీరంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్ర తీరమంతటా రక్షణ చర్యలు కొరవడ్డాయి. పదేళ్ల కాలంలో పరిస్థితి మరీ దిగజారింది. సముద్ర అలల తాకిడి పెరిగినప్పుడు వచ్చే నీరు నిల్వ ఉండే ప్రాంతాలు (బ్యాక్ వాటర్ ల్యాండ్స్) పూర్తిగా కనుమరుగయ్యాయి. పదేళ్లుగా అభివృద్ధి, పరిశ్రమల పేరిట వాటిని ధ్వంసం చేశారు. అడ్డగోలుగా ఆక్రమించారు. 70 శాతం జనాభా తీర ప్రాంతాల్లోనే.. సముద్ర తీరం నుంచి 20 కి.మీ. భూభాగం పరిధిలో 70 శాతం జనాభా నివసిస్తున్నారు. వీరంతా ప్రమాదం అంచున ఉన్నారు. తుపానుల సమయంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం బెంగాల్, బంగ్లాదేశ్ (10–13 మీటర్లు) తరువాత మన రాష్ట్రంలోనే (5–7 మీటర్లు) ఎక్కువ. ప్రమాదపు అంచున.. తీరానికి 300 మీటర్ల కంటే తక్కువ దూరంలో.. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలివీ. శ్రీకాకుళం జిల్లాలో డొంకూరు, బారువ, పితాలి, మీలా గంగువాడ, పల్లిసారధి నువ్వలరేవు, దేవునల్తాడ, నందిగం, కళింగపట్నం, ఇప్పిలి, కొవ్వాడ, చింతపల్లి బందరువానిపేట. విజయనగరం జిల్లాలో కోనాడ, భోగాపురం సమీప ప్రాంతాలు. విశాఖ జిల్లాలో చిననాగమయ్యపాలెం, పెద్ద నాగమయ్యపాలెం, భీమిలి, విశాఖ నగరం ఏరాడ, అప్పికొండ, గంగవరం, పూడిమడక, రేవు పోలవరం, పెద్దతీనర్ల, పెంటకోట, రాజానగరం, ముత్యాలమ్మపాలెం, రేవు పోలవరం. తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పాడ, గొల్ల ముసలయ్యపేట, కాకినాడ, కోరింగ, తాళ్లరేవు, మట్లపాలెం, పటవల, గోదావరి లంకలు, భైరవపాలెం, గాడిమొగ, పల్లంకుర్రు, సూరసేన యానాం, ఓడలరేవు, అంతర్వేదిపాలెం. పశ్చిమగోదావరి జిల్లాలో పేరుపాలెం, పోదు, ఇంటేరు, లంక గ్రామాలు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, మంగినపూడి, హంసలదీవి, కృష్ణా బ్యాక్ వాటర్ ప్రాంతాలు. గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లాలో చీరాల, పెద్దగంజాం, కనుపర్తి, పాదర్తి, నెల్లూరు జిల్లాలో కొత్తపట్నం, ఈతముక్కల, రామయ్యపట్నం. 2014లో హుద్‌హుద్ తుపాను బీభత్సంతో విశాఖలో దెబ్బతిన్న రహదారి (ఫైల్) విధ్వంసక తుపాన్లు - దేశంలో వందేళ్ల తుపాన్ల చరిత్రను చూస్తే అతి భీకర తుపాన్లు 40 ఏళ్ల నుంచే ఎక్కువయ్యాయి. - 40 ఏళ్లలో మన రాష్ట్రంలో ఇప్పటివరకు 23 తుపాన్లు విధ్వంసం సృష్టించాయి. - 1977 నవంబర్ 19న 250 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన దివిసీమ ఉప్పెన పెను విధ్వంసం సృష్టించింది. - 1984 నవంబర్ 14న శ్రీహరికోట వద్ద 220 కిలోమీటర్ల వేగంతో పెను తుపాను తీరాన్ని దాటింది. - 1990 మే 9న మరో తుపాను 230 కిలోమీటర్ల వేగంతో మచిలీపట్నం పరిసర ప్రాంతాలను ముంచెత్తింది. - 1996 నవంబర్ 6న సంభవించిన తుపాను 210 కిలోమీటర్ల వాయు వేగంతో కోనసీమపై విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించింది. - 2013 అక్టోబర్ 12న పైలీన్ పెను తుపాను 220 కిలోమీటర్ల గాలి వేగంతో దక్షిణ, ఒడిశా, ఉత్తర కోస్తాను తాకింది. - 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను 260 కిలోమీటర్ల గాలి వేగంతో విశాఖ మహా నగరం, ఉత్తర కోస్తాలో విధ్వంసం సృష్టించింది. మడ అడవుల్ని పునరుద్ధరించాలి ప్రపంచ వ్యాప్తంగా యూకే, ఫ్రాన్స్, కెనడా, ఐర్లాండ్ దేశాలతో పాటు 1,175 నగరాలు వాతావరణ అత్యయిక పరిస్థితి (క్లైమెట్ ఎమర్జెన్సీ) ప్రకటించాయి. రానున్న విపత్తులను నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన మడ అడవులను పునరుద్ధరించుకోవాలి. – జేవీ రత్నం, పర్యావరణవేత్త కాలుష్యం, భూతాపం తగ్గించాలి చమురు, గ్యాస్ వెలికితీత వల్ల భూమి లోనికి దిగబడి సముద్ర మట్టం పెరుగుతోంది. అంతులేని కాలుష్యం వల్ల వేడి పెరుగుతోంది. ఈ పరిస్థితి అనర్థదాయకం. కాలుష్యం, భూతాపం తగ్గించడమే శరణ్యం. – ప్రొఫెసర్ బైరాగిరెడ్డి, పర్యావరణ విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాలయం రూ.78 కోట్లతో షెల్టర్ బెల్ట్‌లు సముద్ర తీర ప్రాంత రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ (ఐసీజెడ్‌ఎం) కింద రూ.78 కోట్లతో మడ అడవుల పెంపకం, షెల్టర్ జోన్ ప్లాంటేషన్‌కు చర్యలు చేపట్టాం. – ఎన్.ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి -
ఓల్గా, హండ్కేలకు సాహితీ నోబెల్
స్టాక్‌హోమ్: సాహితీ రంగంలో విశేషంగా కృషిచేసిన ఇద్దరు ప్రముఖ సాహితీవేత్తలకు ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. ఆస్ట్రియాకి చెందిన ప్రముఖ నవల, నాటక రచయిత పీటర్ హండ్కేకి 2019 సంవత్సరానికి గాను నోబెల్ పురస్కారం వరించింది. 2018 సంవత్సరానికి పోలండ్‌కి చెందిన ప్రముఖ పర్యావరణ వేత్త, స్త్రీవాది, మేధావి, నవలా రచయిత్రి ఓల్గా టోర్కార్క్విజ్‌కి ‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్‘ అనే నవలకు గానూ ఈ బహుమతి లభించింది. జ్ఞానపిపాసతో ఆమె చేసిన సృజనాత్మక రచనకు ఈ అత్యున్నత పురస్కారం లభించింది. అద్భుతమైన భాషా పరిజ్ఞానంతో మానవ అనుభవాల విశిష్టతను ప్రభావవంతంగా చాటి చెప్పినందుకు ఆమెకు ఈ ప్రతిష్టాత్మక నోబెల్ బహుమతి లభించింది. 15 మంది స్త్రీలకే నోబెల్ పురస్కారం ఇప్పటి వరకు సాసాహితీరంగంలో కేవలం 14 మంది మహిళలనే నోబెల్ పురస్కారం వరించింది. ఈ రంగంలో నోబెల్ బహుమతి వచ్చిన మహిళల్లో ఓల్గా టోర్కార్క్విజ్ 15వ వారు. ఈమె రచనల్లో భిన్నత్వం ఉంటుంది. రెండు విభిన్న అంశాల మధ్యనున్న అంతరాన్ని ఉద్వేగపూరితంగా వర్ణిస్తారు. ఆమె నవలల్లో స్త్రీపురుషుల మధ్య, ప్రకృతికీ సంస్కృతికీ మధ్య, వివేచనకీ, అవివేకానికీ మధ్య వారి అంతరాంతరాల్లో రగులుతోన్న అంతర్మథనాన్ని అద్భుతంగా వర్ణిస్తారని నోబెల్ పురస్కారాన్ని ప్రకటించిన స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. నిజానికి ఓల్గా టోర్కార్క్విజ్ని కొంత ఆలస్యంగా ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపిక చేసినట్టు వారు వెల్లడించారు. చంపేస్తామన్నారు.. జీవితంలో ఎన్నో చీకటి కోణాలను చూసిన 57 ఏళ్ళ పర్యావరణ వేత్త, శాఖాహారి అయిన ఓల్గా టోర్కార్క్విజ్ పోలండ్ మతతత్వ ప్రభుత్వ విధానాలనూ, చట్టాలనూ తూర్పారబట్టేందుకు వెనకాడని రాజకీయవేత్త. సాహసోపేతమైన, నిర్భీతితో కూడిన ఆమె రచనలు పోలండ్ సమాజాన్ని కుదిపేసాయి. ‘సహనశీల పోలండ్ మిథ్య’ అంటూ ఆమె చేసిన రచనల కారణంగా 2015లో ఆమెను చంపేస్తామన్న బెదిరింపులు సైతం వచ్చాయి. దీంతో ప్రచురణకర్తలు ఆమెకు బాడీగార్డులను సైతం ఏర్పాటుచేశారు. సృజనాత్మకత ఉట్టిపడేలా చిత్రీకరించిన ఆమె రచనల్లోని పాత్రల కవితాత్మకత వర్ణన పాఠకులను కట్టిపడేస్తుంది. 1962, జనవరి 29న పోలండ్‌లోని వెస్ట్రన్ టౌన్లో ఓల్గా జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్ వార్సాలో ఆమె చదువుకున్నారు. ఆమె తండ్రి లైబ్రేరియన్ కావడంతో పుస్తకపఠనమే ప్రపంచంగా పెరిగారు. ఆమె తొలి నవల ‘ద జర్నీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద బుక్’ 1993లో ప్రచురించారు. ఓల్గా రచించిన ‘ఫ్లైట్స్’ నవలకు 2017లో బుకర్ ప్రైజ్ లభించింది. ఆమె రచించిన 900 పేజీల ‘‘ద బుక్స్ ఆఫ్ జాకోబ్’’ ఏడు దేశాలకూ, మూడు ప్రాంతాలకూ, ఐదు భాషల చరిత్రకు సంబంధించినది. 18వ శతాబ్దానికి చెందిన జూయిష్ అనే చిన్న తెగకు చెందిన బహుకొద్ది చరిత్ర మాత్రమే తెలిసిన ఫ్రాంకిసమ్ అనే వ్యక్తి చరిత్రను అన్వేషిస్తుంది. హండ్కే – వివాదాస్పద రచయిత.. పీటర్ హండ్కే రచనలెంత ప్రాముఖ్యతను సాధించాయో, అంతే స్థాయిలో ఆయన వివాదాస్పదుడు కూడా. 1990లో యుగోస్లేవియా యుద్ధ సమయంలో సెర్బ్ల పక్షాన్ని వహించినందుకు ఆయనపై అనేక విమర్శలొచ్చాయి. మానవ హననం సాగించాడని, యుద్ధనేరానికి పాల్పడ్డాడని ఆరోపణలున్న మాజీ సెర్బ్ నేత స్లోబోదన్ మిల్సేవిక్ అంతిమయాత్రలో ఆయనకు మద్దతుగా ప్రసంగించడం కూడా పీటర్ హండ్కే వివాదాస్పదుడవడానికి మరో కారణం. 2014లో సాహిత్యరంగంలో నోబెల్ బహుమతిని నిషేధించాలని కూడా పీటర్ డిమాండ్ చేశారు. ఆయన రాసిన ‘ద అవర్ వియ్ న్యూ నథింగ్ ఆఫ్ ఈచ్ అదర్’ అనే సంభాషణలు లేని నాటకం చాలా ప్రసిద్ధి గాంచింది. పీటర్ హండ్కే పూర్తి స్వచ్ఛమైన జర్మన్ భాషా రచయితల్లో బతికి ఉన్న అతి కొద్దిమందిలో ఒకరు. సాహితీరంగంలో నోబెల్ పురస్కారాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ‘ఇది ఒక్క క్షణం ఆసక్తికీ, ఆరుపేజీల పత్రికా వార్తకీ’ సంబంధించినదంటూ 2014లో అన్నారు. హండ్కే ఆస్ట్రియాలో రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1942, డిసెంబర్ 6) జర్మనీ సైనికుడికీ, స్లొవేనియాకు చెందిన మైనారిటీ తల్లికి జన్మించారు. బాల్యం యుద్ధ వాతావరణంలోగడిచింది. ఆ తరువాత ఆయన ఆస్ట్రియాలో ఆయన పెరిగి పెద్దయ్యారు. 1966లో ‘ద హార్నెట్స్’ అనే నవలతో సాహితీరంగంలో సంచలనం సృష్టించారు. దీంతో న్యాయవాద చదువుని మధ్యలోనే వదిలేసి సాహితీరంగం వైపు వచ్చారు. -
ఇది మానవతప్పిదమే: గాడ్గిల్
పణజీ: కేరళ ప్రకృతి విలయానికి మానవ తప్పిదమే ప్రధాన కారణమని ప్రముఖ పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ అన్నారు. పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల బృందానికి నేతృత్వం వహించిన ఆయన.. నదీ తీరాలపై అక్రమ నిర్మాణాలు, అక్రమ క్వారీలు, మైనింగ్ కారణంగానే విపత్తు తలెత్తిందన్నారు. ‘నాటి మా నివేదికను ప్రభుత్వం మినహా ఎవరూ తప్పుబట్టలేదు. అక్రమ మైనింగ్, క్వారీయింగ్‌లనుంచి పశ్చిమ కనుమలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి విపత్తులు తప్పవు. కేరళలో ఈసారి భారీ వర్షాలు కురిశాయి. అసాధారణవర్షాలు కాదు’ అన్నారు. -
'పర్యావరణవేత్తగా శివుడి'కి చోటు దక్కలేదు!
మైసూర్: ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణవేత్త పరమశివుడేనంటూ ఓ వృక్షశాస్త్రవేత్త సమర్పించాల్సిన పరిశోధక పత్రానికి మైసూర్లో జరుగుతున్న 'ఇండియన్ సైన్స్ కాంగ్రెస్'లో చోటు లభించలేదు. ప్రాచీన భారతంలోనే యుద్ధవిమానం ఉందంటూ గత సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పేర్కొనడం వివాదం సృష్టించడంతోపాటు తాజా పరిశోధక పత్రంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ పత్రం సదస్సు ముందుకు రాకపోవడం గమనార్హం. వృక్షశాస్త్రవేత్త డాక్టర్ అఖిలేశ్ పాండే సమర్పించిన ఈ పత్రాన్ని పర్యావరణ సైన్స్ విభాగంలో ఎంపిక చేయడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. రాజకీయ అజెండాతోనే అశాస్త్రీయమైన అంశాలను సదస్సులో చేర్చారని నిర్వాహకులు, ఆతిథ్యమిస్తున్న మైసూర్ యూనివర్సిటీ బాధ్యులపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సైన్స్ కాంగ్రెస్ సదస్సు ముందుకు ఈ పత్రం రాలేదు. అయితే తన గైర్హాజరికి వివాదంతో ఎలాంటి సంబంధం లేదని, తన కాలుకి దెబ్బతగలడంతోనే తాను సదస్సుకు రాలేకపోయానని బొటనీలో పీహెచ్డీ చేసిన పాండే తెలిపారు. 'నా పరిశోధక పత్రంతో సైన్స్‌తో సంబంధం లేకపోతే ఏంటి? సైన్స్ అంటే ఏమిటి? ఈనాటి కల్పన రేపటి సైన్స్. ఆవిష్కరణలకు మూలం కల్పనే కదా' అని ఆయన చెప్తున్నారు. వృక్షశాస్త్రంలో పరిశోధనలకుగాను పాండే ఇప్పటివరకు పలు అవార్డులు, సత్కారాలు పొందారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగానే తాను పరిశోధక పత్రాన్ని సమర్పించినట్టు తెలిపారు. 'ఈ రోజు సైన్స్ అని చెప్పుకొంటున్న విషయాలన్నీ వేదాలు, పురాణాల్లో ఉన్నవే. ఈ విషయంలో నా వానదతో ఏకీభవించకపోతే.. వారు శాస్త్రీయంగా తమ వాదనను నిరూపించుకోవాలి. మనమంతా శివుడిని కొలువడం లేదా? మరి ఆయన మార్గంలో ప్రయాణిస్తే తప్పేంటి? పర్యావరణ పరిరక్షణ కానీ మరో విషయం కానివ్వండి సమాజం కేవలం నిబంధనలతో నడువదు. అందుకు మతం కూడా ఒక మార్గం చూపించాల్సి ఉంటుంది' అని భోపాల్‌కు చెందిన ఆయన తెలిపారు.