సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: మన దేశంలోని సముద్ర తీర ప్రాంతాల్లోని 35 కోట్ల మంది రానున్న 30 ఏళ్లలో ముంపు ముప్పు ఎదుర్కోనున్నారని అమెరికా వాతావరణ సంస్థ క్లైమెట్ సెంట్రల్ నివేదిక వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో దేశంలో గుజరాత్ తర్వాత అతి పొడవైన.. 974 కిలోమీటర్ల సముద్ర తీరం కలిగిన మన రాష్ట్రం పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. పెను తుపాన్లు మహా విధ్వంసం సృష్టించడానికి కారణం భూతాపం పెరగటమేనని నేషనల్ క్లైమెట్ సెంటర్ నివేదిక స్పష్టం చేసింది. దీనివల్ల వాతావరణం వేడెక్కి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయని, ఫలితంగా తీరం భారీగా కోతకు గురవుతోందని పేర్కొంది. సమీప భవిష్యత్తులో సంభవించే తుపాన్లలో గాలి వేగం పెరుగుతుందని, వరద ఉధృతి తీవ్రత అధికమవుతుందని ఈపీసీసీ (ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఆన్ క్లైమెట్ ఛేంజ్) నివేదికలో వెల్లడించింది.
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే..
1876 అక్టోబర్ 8న సంభవించిన తుపాను 150 కిలోమీటర్ల గాలి వేగంతో విశాఖపట్నంపై విరుచుకుపడినట్లు 1907 విశాఖ జిల్లా గెజిట్ స్పష్టం చేస్తోంది. అప్పట్లో తీర ప్రాంతంలో మడ అడవులు, తాటి తోపులు ఎక్కువగా ఉండటం వల్ల పెద్దగా నష్టం వాటిల్లలేదు. 2014లో విశాఖ తీరాన్ని తాకిన హుద్‌హుద్ తుపాను ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. సహజ రక్షణ కవచాలైన మడ అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తినట్లు తేలింది. ఒక్క విశాఖ తీరంలోనే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా సముద్ర తీరమంతటా రక్షణ చర్యలు కొరవడ్డాయి. పదేళ్ల కాలంలో పరిస్థితి మరీ దిగజారింది. సముద్ర అలల తాకిడి పెరిగినప్పుడు వచ్చే నీరు నిల్వ ఉండే ప్రాంతాలు (బ్యాక్ వాటర్ ల్యాండ్స్) పూర్తిగా కనుమరుగయ్యాయి. పదేళ్లుగా అభివృద్ధి, పరిశ్రమల పేరిట వాటిని ధ్వంసం చేశారు. అడ్డగోలుగా ఆక్రమించారు.
70 శాతం జనాభా తీర ప్రాంతాల్లోనే..
సముద్ర తీరం నుంచి 20 కి.మీ. భూభాగం పరిధిలో 70 శాతం జనాభా నివసిస్తున్నారు. వీరంతా ప్రమాదం అంచున ఉన్నారు. తుపానుల సమయంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతం బెంగాల్, బంగ్లాదేశ్ (10–13 మీటర్లు) తరువాత మన రాష్ట్రంలోనే (5–7 మీటర్లు) ఎక్కువ.
ప్రమాదపు అంచున..
తీరానికి 300 మీటర్ల కంటే తక్కువ దూరంలో.. ముప్పు పొంచి ఉన్న ప్రాంతాలివీ. శ్రీకాకుళం జిల్లాలో డొంకూరు, బారువ, పితాలి, మీలా గంగువాడ, పల్లిసారధి నువ్వలరేవు, దేవునల్తాడ, నందిగం, కళింగపట్నం, ఇప్పిలి, కొవ్వాడ, చింతపల్లి బందరువానిపేట. విజయనగరం జిల్లాలో కోనాడ, భోగాపురం సమీప ప్రాంతాలు. విశాఖ జిల్లాలో చిననాగమయ్యపాలెం, పెద్ద నాగమయ్యపాలెం, భీమిలి, విశాఖ నగరం ఏరాడ, అప్పికొండ, గంగవరం, పూడిమడక, రేవు పోలవరం, పెద్దతీనర్ల, పెంటకోట, రాజానగరం, ముత్యాలమ్మపాలెం, రేవు పోలవరం. తూర్పు గోదావరి జిల్లాలో ఉప్పాడ, గొల్ల ముసలయ్యపేట, కాకినాడ, కోరింగ, తాళ్లరేవు, మట్లపాలెం, పటవల, గోదావరి లంకలు, భైరవపాలెం, గాడిమొగ, పల్లంకుర్రు, సూరసేన యానాం, ఓడలరేవు, అంతర్వేదిపాలెం. పశ్చిమగోదావరి జిల్లాలో పేరుపాలెం, పోదు, ఇంటేరు, లంక గ్రామాలు. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, మంగినపూడి, హంసలదీవి, కృష్ణా బ్యాక్ వాటర్ ప్రాంతాలు. గుంటూరు జిల్లా రేపల్లె, ప్రకాశం జిల్లాలో చీరాల, పెద్దగంజాం, కనుపర్తి, పాదర్తి, నెల్లూరు జిల్లాలో కొత్తపట్నం, ఈతముక్కల, రామయ్యపట్నం.
2014లో హుద్‌హుద్ తుపాను బీభత్సంతో విశాఖలో దెబ్బతిన్న రహదారి (ఫైల్)
విధ్వంసక తుపాన్లు
- దేశంలో వందేళ్ల తుపాన్ల చరిత్రను చూస్తే అతి భీకర తుపాన్లు 40 ఏళ్ల నుంచే ఎక్కువయ్యాయి.
- 40 ఏళ్లలో మన రాష్ట్రంలో ఇప్పటివరకు 23 తుపాన్లు విధ్వంసం సృష్టించాయి.
- 1977 నవంబర్ 19న 250 కిలోమీటర్ల వేగంతో విరుచుకుపడిన దివిసీమ ఉప్పెన పెను విధ్వంసం సృష్టించింది.
- 1984 నవంబర్ 14న శ్రీహరికోట వద్ద 220 కిలోమీటర్ల వేగంతో పెను తుపాను తీరాన్ని దాటింది.
- 1990 మే 9న మరో తుపాను 230 కిలోమీటర్ల వేగంతో మచిలీపట్నం పరిసర ప్రాంతాలను ముంచెత్తింది.
- 1996 నవంబర్ 6న సంభవించిన తుపాను 210 కిలోమీటర్ల వాయు వేగంతో కోనసీమపై విరుచుకుపడి పెను విధ్వంసం సృష్టించింది.
- 2013 అక్టోబర్ 12న పైలీన్ పెను తుపాను 220 కిలోమీటర్ల గాలి వేగంతో దక్షిణ, ఒడిశా, ఉత్తర కోస్తాను తాకింది.
- 2014 అక్టోబర్ 12న హుద్‌హుద్ తుపాను 260 కిలోమీటర్ల గాలి వేగంతో విశాఖ మహా నగరం, ఉత్తర కోస్తాలో విధ్వంసం సృష్టించింది.
మడ అడవుల్ని పునరుద్ధరించాలి
ప్రపంచ వ్యాప్తంగా యూకే, ఫ్రాన్స్, కెనడా, ఐర్లాండ్ దేశాలతో పాటు 1,175 నగరాలు వాతావరణ అత్యయిక పరిస్థితి (క్లైమెట్ ఎమర్జెన్సీ) ప్రకటించాయి. రానున్న విపత్తులను నివారించేందుకు యుద్ధ ప్రాతిపదికన మడ అడవులను పునరుద్ధరించుకోవాలి.
– జేవీ రత్నం, పర్యావరణవేత్త
కాలుష్యం, భూతాపం తగ్గించాలి
చమురు, గ్యాస్ వెలికితీత వల్ల భూమి లోనికి దిగబడి సముద్ర మట్టం పెరుగుతోంది. అంతులేని కాలుష్యం వల్ల వేడి పెరుగుతోంది. ఈ పరిస్థితి అనర్థదాయకం. కాలుష్యం, భూతాపం తగ్గించడమే శరణ్యం.
– ప్రొఫెసర్ బైరాగిరెడ్డి, పర్యావరణ విభాగం, ఆంధ్ర విశ్వవిద్యాలయం
రూ.78 కోట్లతో షెల్టర్ బెల్ట్‌లు
సముద్ర తీర ప్రాంత రక్షణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ (ఐసీజెడ్‌ఎం) కింద రూ.78 కోట్లతో మడ అడవుల పెంపకం, షెల్టర్ జోన్ ప్లాంటేషన్‌కు చర్యలు చేపట్టాం.
– ఎన్.ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ దళాల అధిపతి
Comments
Please login to add a commentAdd a comment