'పర్యావరణవేత్తగా శివుడి'కి చోటు దక్కలేదు!
మైసూర్: ప్రపంచంలో అతిపెద్ద పర్యావరణవేత్త పరమశివుడేనంటూ ఓ వృక్షశాస్త్రవేత్త సమర్పించాల్సిన పరిశోధక పత్రానికి మైసూర్‌లో జరుగుతున్న 'ఇండియన్ సైన్స్ కాంగ్రెస్'లో చోటు లభించలేదు. ప్రాచీన భారతంలోనే యుద్ధవిమానం ఉందంటూ గత సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పేర్కొనడం వివాదం సృష్టించడంతోపాటు తాజా పరిశోధక పత్రంపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ పత్రం సదస్సు ముందుకు రాకపోవడం గమనార్హం.
వృక్షశాస్త్రవేత్త డాక్టర్ అఖిలేశ్ పాండే సమర్పించిన ఈ పత్రాన్ని పర్యావరణ సైన్స్ విభాగంలో ఎంపిక చేయడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. రాజకీయ అజెండాతోనే అశాస్త్రీయమైన అంశాలను సదస్సులో చేర్చారని నిర్వాహకులు, ఆతిథ్యమిస్తున్న మైసూర్ యూనివర్సిటీ బాధ్యులపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో సైన్స్ కాంగ్రెస్ సదస్సు ముందుకు ఈ పత్రం రాలేదు. అయితే తన గైర్హాజరికి వివాదంతో ఎలాంటి సంబంధం లేదని, తన కాలుకి దెబ్బతగలడంతోనే తాను సదస్సుకు రాలేకపోయానని బొటనీలో పీహెచ్‌డీ చేసిన పాండే తెలిపారు. 'నా పరిశోధక పత్రంతో సైన్స్‌తో సంబంధం లేకపోతే ఏంటి? సైన్స్ అంటే ఏమిటి? ఈనాటి కల్పన రేపటి సైన్స్. ఆవిష్కరణలకు మూలం కల్పనే కదా' అని ఆయన చెప్తున్నారు. వృక్షశాస్త్రంలో పరిశోధనలకుగాను పాండే ఇప్పటివరకు పలు అవార్డులు, సత్కారాలు పొందారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగానే తాను పరిశోధక పత్రాన్ని సమర్పించినట్టు తెలిపారు.
'ఈ రోజు సైన్స్ అని చెప్పుకొంటున్న విషయాలన్నీ వేదాలు, పురాణాల్లో ఉన్నవే. ఈ విషయంలో నా వానదతో ఏకీభవించకపోతే.. వారు శాస్త్రీయంగా తమ వాదనను నిరూపించుకోవాలి. మనమంతా శివుడిని కొలువడం లేదా? మరి ఆయన మార్గంలో ప్రయాణిస్తే తప్పేంటి? పర్యావరణ పరిరక్షణ కానీ మరో విషయం కానివ్వండి సమాజం కేవలం నిబంధనలతో నడువదు. అందుకు మతం కూడా ఒక మార్గం చూపించాల్సి ఉంటుంది' అని భోపాల్‌కు చెందిన ఆయన తెలిపారు.