కామ్నా గౌతమ్
ఒక మంచి పని చేసినప్పుడు అభినందించే వారే కాదు అనుసరించే వారు కూడా ఉంటారు. సోషల్ మీడియాలో పాపులర్ అయిన కామ్నా గౌతమ్ విషయంలోనూ ఇలాగే జరిగింది.
‘పర్యావరణహిత మార్గం వైపు ప్రయాణం మన ఇంటి నుంచే మొదలు కావాలి’ అంటుంది కామ్నా గౌతమ్...
‘పర్యావరణ సంరక్షణకు మన వంతుగా ఉడతాభక్తిగా చేయడానికి ఎంతో ఉంది. అందుకు మన ఇంటి నుంచే శ్రీకారం చుట్టాలి’ అంటుంది కామ్నా గౌతమ్. తన ఇన్‌స్పైరింగ్ మాటలతో సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన కామ్నా నూట్రీషనిస్ట్. వేస్ట్ మేనేజ్‌మెంట్ టెక్నిక్‌లు, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం... మొదలైన వాటి గురించి విస్తృతంగా ప్రచారం చేస్తోంది కామ్నా గౌతమ్.
బేబీ–వియరింగ్, బ్రేస్ట్‌ఫీడింగ్‌లాంటి అంశాలకు సంబంధించి ఉపయోగకరమైన సమాచారం అందించడంతో కామ్న సోషల్ మీడియా జర్నీ మొదలైంది.
‘నేను ఒక బిడ్డకు తల్లిని. బిడ్డ భవిష్యత్ బాగుండాలని ప్రతి తల్లీ కోరుకుంటుంది. అందుకే బిడ్డల బంగారుభవిష్యత్ కోసం పర్యావరణహిత మార్గాన్ని ఎంచుకున్నాను’ అంటుంది కామ్న.
పర్యావరణ హిత మార్గంలో తన ఇంటి నుంచే తొలి అడుగు వేసింది. ఇంట్లో ప్లాస్టిక్ వస్తువులు కనిపించకుండా చేసింది. కుటుంబ సభ్యులను ఒప్పించింది. ‘మన ఇంట్లో ప్లాస్టిక్ బాటిల్స్‌ను ఎందుకు ఉపయోగించడం లేదో తెలుసా?’ అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పింది.
‘నేను ఇలా చేస్తున్నప్పుడు ఇతరులు కూడా చేయవచ్చు కదా. వారిలో ఎందుకు స్పందన కనిపించడం లేదు?’ అంటూ బాధ పడేది కామ్నా. అయితే ఆ తరువాత మాత్రం ఒక్కరొక్కరుగా ఆమెను అనుసరించడం ప్రారంభించారు. ఇంటిని ఎన్విరాన్‌మెంట్–ఫ్రెండ్లీగా తీర్చిదిద్దడం మొదలు పెట్టారు.
ప్లాస్టిక్ బ్యాగులు కనిపించకుండా ఉండాలంటే ప్రతి ఇంట్లో క్లాత్‌బ్యాగులు ఉండాలి, డిస్పోజబుల్ వాటర్ బాటిల్ కాదు మీదైన సొంత వాటర్ బాటిల్ ఉండాలి, ట్రెండ్‌లను అనుసరిస్తూ పర్యావరణానికి హాని కలిగించే వస్త్రాలు లేదా వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వకూడదు, ఇంట్లోని వ్యర్థాలను తడి, పొడి విభాగాలుగా వేరు చేయండి...ఇలాంటి విషయాలెన్నో చుట్టుపక్కల వారికి చెబుతున్నప్పుడు మొదట్లో వారి స్పందన ఎలా ఉండేదో తెలియదుగానీ ఆ తరువాత మాత్రం మార్పు కనిపించింది.
Comments
Please login to add a commentAdd a comment