మెల్‌బోర్న్: 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధించే బిల్లును ఆస్ట్రేలియా ప్రతినిధుల సభ బుధవారం ఆమోదించింది. దీనికి ప్రకారం టిక్‌టాక్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, రెడిట్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక వేదికల్లో వారికి ఖాతాలు ఉండకూడదు.
దీన్ని అతిక్రమిస్తే ఏకంగా 3.3 కోట్ల డాలర్ల దాకా జరిమానా విధిస్తారు! ప్రధాన పార్టీలన్నీ బిల్లుకు మద్దతిచ్చాయి. దానికి అనుకూలంగా 102, వ్యతిరేకంగా 13 ఓట్లొచ్చాయి. బిల్లు ఈ వారంలో చట్టంగా మార నుంది. వయోపరిమితుల అమలుకు సామాజిక మాధ్యమాలకు ప్రభుత్వం ఏడాది గడువిచ్చింది. ఆ తర్వాత నుంచి జరిమానాలు విధిస్తారు.
అమలు ఎలా?
ఈ చట్టాన్ని ఎలా అమలు చేస్తారన్నది పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే వయో నిర్ధారణ కోసం సామాజిక మాధ్యమాలు వినియోగదారుల నుంచి ప్రభుత్వ గుర్తింపు పత్రాలను డిమాండ్ చేయలేవు. డిజిటల్ ఐడెంటిఫికేషన్ యాక్సెస్ ఇచ్చే అవకాశం లేదు. కనుక చట్టం అమలు అనుమానమేనని విపక్ష సభ్యుడు డాన్ తెహాన్ అభిప్రాయపడ్డారు. అమలు చేయగలిగితే మాత్రం ప్రజల జీవితాల్లో మార్పు ఖాయమన్నారు. ఈ బిల్లుపై స్వతంత్ర సభ్యులు తీవ్ర విమర్శలు చేశారు.
ప్రభుత్వం ఏదో చేస్తున్నట్లు ప్రజలకు అనిపించేలా చేయడమే దీని లక్ష్యం తప్ప సోషల్ మీడియాను సురక్షితంగా మార్చేందుకు ఇది దోహదపడబోదని కొన్ని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ‘‘లోతైన పరిశీలన లేకుండా పార్లమెంటు ఆమోదం పొందిన ఈ బిల్లు పెద్దగా పనికొచ్చేది కాదు. పిల్లలకు ఏది మంచిదో నిర్ణయించే తల్లిదండ్రుల అధికారాన్ని హరించేలా ఉంది’’ అని కూడా విమర్శలున్నాయి. ఈ నిషేధం పిల్లలను ఏకాకులను చేస్తుందని, సోషల్ మీడియా తాలూకు సానుకూల అంశాలను వారికి దూరం చేస్తుందని పరిశీలకు లు అంటున్నారు. వారిని డార్క్‌వెబ్ వైపు నడిపినా ఆశ్చర్యం లేదని హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment