పిల్లలకు సోహెల్ మీడియా | World countries are ban social media, faces the most restrictions | Sakshi
Sakshi News home page

పిల్లలకు సోహెల్ మీడియా

Published Sat, Nov 30 2024 5:56 AM | Last Updated on Sat, Nov 30 2024 5:56 AM

World countries are ban social media, faces the most restrictions

  నియంత్రణకు చట్టాలు చేస్తున్న దేశాలు 

సోషల్‌ మీడియా.. ప్రపంచాన్ని శాశిస్తున్న ప్రచారమాధ్యమం. ఫేస్‌బుక్, ఎక్స్‌ (గతంలో ట్విట్టర్‌), స్నాప్‌చాట్, టిక్‌టాక్‌.. వంటి ఫ్లాట్‌ఫామ్‌లు కొంతకాలం కిందట అనుసంధాన వేదికలుగా మాత్రమే పనిచేశాయి. ప్రశంసలందుకున్నాయి. కానీ రానురాను పరిస్థితి మారింది. అశ్లీల  కంటెంట్, నకిలీ వార్తల వ్యాప్తి, సైబర్‌ బుల్లీయింగ్‌ మాధ్యమాలను ముంచెత్తాయి. ఇవి  ఎన్నికలనూ శాసిస్తున్నాయి.

 పెద్దలమాట సరేసరి.. పిల్లలపై ఇవి చూపుతున్న ప్రభావాన్ని నియంత్రించేందుకు చాలా దేశాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇటీవలే ఆ్రస్టేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం విధించింది. దేశంలో పెద్ద దుమారమే రేపింది. అయినా ఆ్రస్టేలియా తరహాలోనే పలు దేశాలు కఠినమైన ప్రైవసీ చట్టాలు, మైనర్లపై నిషేధం  వంటి విధానాల ద్వారా సోషల్‌ మీడియాను ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నించాయి. 

ఆయ దేశాల వివరాలు, అవి చేస్తున్న ప్రయత్నాలు ఓసారి చూద్దాం.  

ఆ్రస్టేలియా
సోషల్‌ మీడియా మినిమమ్‌ ఏజ్‌ బిల్లు ప్రకారం ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్‌ యజమాని మెటా నుంచి టిక్‌టాక్‌ వరకు మైనర్లు లాగిన్‌ కాకుండా నిరోధించాలని బిల్లు తీసుకొచ్చింది. వీటి అమలును ఉల్లంఘిస్తే 32 మిలియన్‌ డాలర్ల వరకు జరిమానాలు విధించనుంది. ఏడాదిలో ఈ నిషేధం అమల్లోకి రానుంది. జనవరి నుంచి అమలు చేసే పద్ధతులపై ట్రయల్‌ ప్రారంభమవుతుంది.  

స్పెయిన్‌
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియాను ఉపయోగించడాన్ని నిషేధించే బిల్లును స్పెయిన్‌ జూన్‌లో ప్రవేశపెట్టింది. దీని అమలు, వయస్సు ధ్రువీకరణ వంటివాటిపై 
చర్చ జరుగుతోంది. ప్రభుత్వం విధానాలను రూపొందించాల్సింది ఉంది.

దక్షిణ కొరియా 
ఈ దేశం 2011లోనే సిడ్రెల్లా చట్టం రూపొందించింది. దీని ప్రకారం 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న వారు అర్ధరాత్రి నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఆన్‌లైన్‌గేమ్స్‌ ఆడకూడదు. ఒక దశాబ్దం తరువాత ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ‘చాయిస్‌ పర్మిట్‌’వ్యవస్థను ఏర్పాటు చేసింది. వారి పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలో నిర్ణయించే అధికారాన్ని తల్లిదండ్రులకు ఇచ్చింది. అతికొద్ది మంది మాత్రమే ఈ వ్యవస్థను ఉపయోగించారు. 16 ఏళ్లలోపు వారు సోషల్‌ మీడియా వాడకాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన బిల్లును ఈ ఏడాది ఆగస్టులో ప్రతిపాదించారు. దీనిని యువజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లును ‘సిండ్రెల్లా’చట్టం మాదిరిగా యువతను నియంత్రించే వివక్షాపూరిత ప్రయత్నమని విమర్శిస్తున్నాయి.  

ఫ్రాన్స్‌ 
గత ఏడాదే ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. సోషల్‌ మీడియా వినియోగదారుల వయస్సును ధ్రువీకరించాలని, 15 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారికి తల్లిదండ్రుల అనుమతిని పొందాలని ఫ్రాన్స్‌ 2023 జూన్‌లో చట్టం చేసింది. నిబంధనలను ఉల్లంఘించే సోషల్‌ నెట్‌వర్క్‌కు ప్రపంచ ఆదాయంలో ఒక శాతం వరకు జరిమానా విధిస్తారు. ఈ చట్టం ఈయూ చట్టానికి అనుగుణంగా ఉందని యూరోపియన్‌ కమిషన్‌ ఇంకా ధ్రువీకరించలేదు. దీంతో అమలులోకి రాలేదు. 

ఇటలీ
ఇక్కడ 14 ఏళ్లలోపు వారు సోషల్‌ మీడియా ఖాతా తెరవాలంటే తల్లిదండ్రుల సమ్మతి అవసరం. ఆపై వయసున్న వారిపై ఎలాంటి నిషేధాలు లేవు. ఎవరి సమ్మతీ అవసరం లేదు.  

జర్మనీ
ఈ దేశ నిబంధనల ప్రకారం 13 నుంచి 16 ఏళ్ల లోపు పిల్లలు తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే సోషల్‌ మీడియాను ఉపయోగించాలి. ఈ నియంత్రణలు సరిపోవని, ప్రస్తుత చట్టాలను సక్రమంగా అమలు చేయాలని బాలల రక్షణ న్యాయవాదులు వాదిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి దీనికంటే ముందుకెళ్లే ఉద్దేశంలో ఆ దేశం లేదు. 

బెల్జియం 
13 ఏళ్లు నిండిన పిల్లలకు మాత్రమే సోషల్‌ మీడియాలో అకౌంట్‌ ఉండాలని, అది తల్లిదండ్రుల అనుమతితోనే చేయాలని 2018లో బెల్జియం చట్టం చేసింది.

నార్వే
ఇక నార్వేలో సోషల్‌ నెట్‌వర్క్‌లకు ఉపయోగించడానికి కనీస వయస్సు 13 సంవత్సరాలు. అయినా 12 ఏళ్ల పిల్లల్లో ఎక్కువ మంది, తొమ్మిదేళ్ల పిల్లల్లో సగానికిపైగా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. దీంతో కనీస వయోపరిమితిని 15 సంవత్సరాలుగా నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల అమలులో విఫలమైన నేపథ్యంలో సమర్థవంతమైన మార్గాలను అన్వేíÙస్తోంది. 

నెదర్లాండ్స్‌ 
ఇక్కడ సోషల్‌ మీడియాను ఉపయోగించడానికి వయో పరిమితి లేదు. పిల్లల్లో ఏకాగ్రతను పెంచడానికి అక్కడి ప్రభుత్వం తరగతి గదుల్లో మొబైల్‌ పరికరాలను నిషేధించింది. ఇది 2024 జనవరి నుంచి అమల్లో ఉంది. అయితే డిజిటల్‌ పాఠాలకు, వైద్య అవసరాలు, వైకల్యాలు ఉన్నవారికి మినహాయింపులు వర్తిస్తాయి.

చైనా
2021 నుంచి మైనర్లకు యాక్సెస్‌ ఆంక్షలు అమలు చేస్తున్న చైనా ఇందుకు మంచి ఉదాహరణ. ఇక్కడ ఇంటర్నెట్‌ వినియోగం ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. దీంతో సోషల్‌ మీడియాను ఉపయోగించకుండా నిరోధించడం ఇక్కడ సులభం. టిక్‌టాక్‌ వంటి చైనీస్‌ డౌయిన్‌లో 14 ఏళ్లలోపు వినియోగదారులకు పరిమితి ఉంది. రోజుకు 40 నిమిషాలు మాత్రమే వినియోగించాలనే నిబంధన ఉంది. పిల్లలు అంతకంటే ఎక్కువసేపు ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడటానికి కూడా అనుమతి లేదు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement