privacy issue
-
భారతీయులకు గుడ్‌న్యూస్.. డేటా రక్షణకు కొత్త బిల్లు
న్యూఢిల్లీ: వ్యక్తిగత డేటా రక్షణకు సంబంధించి కొత్త బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నాటికి తీసుకొస్తామని ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖా మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును లోక్‌సభ నుంచి బుధవారం ఉపసంహరించుకున్న నేపథ్యంలో మంత్రి వైష్ణవ్ దీనిపై మాట్లాడారు. ఈ బిల్లుపై పార్లమెంట్ సంయుక్త కమిటీ మంచి నివేదిక ఇచ్చినట్టు అశ్వని వైష్ణవ్ తెలిపారు. ‘‘బిల్లులోని 99 సెక్షన్లకు గాను 81 సవరణలను సూచించింది. అలాగే, కొత్తగా మరో 12 ముఖ్యమైన సిఫారసులు కూడా చేసింది. ఈ పరిస్థితుల్లో కొత్త బిల్లు తీసుకురావడం మినహా మారో మార్గం లేదు. నిజానికి సుప్రీంకోర్టు తీర్పు, వ్యక్తిగత సమాచార గోప్యత విషయంలో రాజీ పడకుండా కొత్త చట్టాన్ని తయారు చేశాం. పార్లమెంటు ప్రక్రియ కూడా పూర్తి చేశాం. త్వరలోనే కొత్త చట్టాన్ని అనుమతి కోసం తీసుకొస్తాం. వచ్చే బడ్జెట్ సమావేశాల నాటికి కొత్త బిల్లు ఆమోదం పొందొచ్చు’’ అని మంత్రి వివరించారు. ఎల్రక్టానిక్స్, ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. సమగ్రమైన కార్యాచరణతో వస్తామని ప్రకటించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమైన డేటా గోప్యత, అత్యాధునిక సాంకేతికతలు, డేటా గవర్నెన్స్ కార్యాచరణ ఇందులో ఉంటాయన్నారు. అంతర్జాతీయ చట్టాలను పరిశీలించాలి: నాస్కామ్ వ్యక్తిగత సమాచార రక్షణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకురావడానికి ముందు, అంతర్జాతీయంగా అమల్లో ఉన్న డేటా గోప్యత చట్టాలను అధ్యయనం చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీల సమాఖ్య నాస్కామ్ సూచించింది. అలాగే, కిందటి బిల్లుపై వచ్చినన అభిప్రాయాలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ప్రభుత్వం డేటా రక్షణకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని ప్రకటించిన నేపథ్యంలో నాస్కామ్ కీలక సూచనలు చేయడం గమనార్హం. గత బిల్లులో దేశాల మధ్య డేటా బదిలీకి సంబంధించి కఠినమైన నిబంధనల పట్ల దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు గగ్గోలు పెట్టడం తెలిసిందే. డేటా ఆధారిత సేవలు సురక్షితంగా, విశ్వసనీయ మార్గంలో వృద్ధి చెందేలా అవకాశం కల్పించాలని నాస్కామ్ కోరింది. సంప్రదింపుల్లో భాగం కల్పించండి.. వ్యక్తిగత డేటా రక్షణ బిల్లును భారత్ వెనక్కి తీసుకోవడాన్ని అంతర్జాటీయ టెక్నాలజీ దిగ్గజాలు అభినందించాయి. కొత్త బిల్లుకు సంబంధించి చర్చల్లో తమకూ భాగస్వామ్యం కల్పించాలని అమెరికాకు చెందిన ఐటీఐ కోరింది. ఇందులో గూగుల్, మెటా, అమెజాన్ తదితర కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ‘డిజిటల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించి సమగ్రమైన న్యాయ కార్యాచరణను (కొత్త చట్టం) తిరిగి పరిశీలించే విషయంలో బలమైన భాగస్వామ్యుల సంప్రదింపులకు అవకాశం కలి్పంచాలనే ప్రణాళికను ఐటీఐ స్వాగతిస్తోంది’అని ఐటీఐ కంట్రీ మేనేజర్ (భారత్) కుమార్‌దీప్ తెలిపారు. ఇది కూడా చదవండి: యాపిల్ లవర్స్‌కు గుడ్‌న్యూస్... -
పెగసస్ స్పైవేర్‌ను కొన్న చంద్రబాబు సర్కార్: మమతా బెనర్జీ
కోల్‌కతా: వివాదాస్పద పెగసస్ స్పైవేర్‌ను నాలుగైదేళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అందిస్తామంటూ అప్పట్లో బెంగాల్‌లోని తమ ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందాయన్నారు. అయితే, ఈ అంశం ప్రజల వ్యక్తిగత గోప్యతకు సంబంధించినది, చట్ట విరుద్ధమైంది అయినందున తాము కొనలేదని వెల్లడించారు. ‘ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్వో సంస్థ పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను రూ.25 కోట్లకు అమ్ముతామంటూ నాలుగైదేళ్ల క్రితం మా రాష్ట్ర పోలీసులను సంప్రదించింది. విషయం నాకు తెలిసి, మాకు ఆ సాఫ్ట్వేర్ అవసరం లేదని చెప్పాను’ అని ఆమె వెల్లడించారు. కానీ ఈ స్పైవేర్‌ను కొనుగోలు చేసిన కేంద్రం ప్రభుత్వం, దానిని దేశ భద్రత కోసం ఉపయోగించడానికి బదులుగా రాజకీయ ప్రయోజనాల కోసం జడ్జీలు, ప్రతిపక్షనేతలు, ఇతర అధికారులపై నిఘాకు వాడుకుందని ఆరోపించారు. 2017లో పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను భారత ప్రభుత్వం 2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్‌టైమ్స్‌లో వచ్చిన కథనం ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. -
అంతచిన్న కెమెరా.. పర్మిషన్ లేకుండా తీస్తే ఎలా?
Facebook Sunglass: ఫేస్బుక్ కొత్తగా తీసుకొచ్చిన స్మార్ట్ కళ్లజోడు విషయంలో ఊహించిందే జరుగుతోంది. కళ్లజోడుపై ఉన్న చిన్న కెమెరా గురించి పలువురు అనుమానాలు లేవనెత్తుతున్నారు. అవతలి వాళ్లను అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే విషయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ కళ్లజోడు కంపెనీ రే-బాన్‌తో కలిసి ఫేస్బుక్ ‘రే బాన్ స్టోరీస్’ పేరిట స్మార్ట్ కళ్లజోడును మార్కెట్లోకి రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కళ్లజోడుకు పైభాగంలో చిన్న కెమెరా ఉంటుంది. దీని సాయంతో ఫొటోలు, షార్ట్ వీడియోలు తీయొచ్చని ఫేస్బుక్ ప్రకటించుకుంది కూడా. అయితే ఎదుటివారి అనుమతులు లేకుండా ఫొటోలు, వీడియోలు తీసే అవకాశం ఉన్నందున యూరోపియన్ యూనియన్ ప్రైవసీ రెగ్యులేటర్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఐర్లాండ్ డాటా ప్రొటెక్షన్ కమిషన్(డీపీసీ) ఎదుట హాజరైన ఫేస్బుక్ ప్రతినిధులు.. కెమెరా పైభాగంలో ఉండే చిన్న ఎల్ఈడీ ఇండికేటర్ లైట్ గురించి వివరించారు. ఒకవేళ ఎదుటివాళ్లు ఫొటోగానీ, వీడియోగానీ తీస్తుంటే.. ఆ లైట్ ఆధారంగా గుర్తించొచ్చని ఫేస్బుక్ వివరణ ఇచ్చుకుంది. కానీ, డీపీసీ ఈ వివరణతో సంతృప్తి చెందనట్లు తెలుస్తోంది. కెమెరా చిన్నదిగా ఉండడం, పైగా ఆ లైట్ వెలుతురూ అంతగా లేకపోవడంపై డీపీసీ అభ్యంతరాలు లేవనెత్తినట్లు సమాచారం. ట్రబుల్ మేకర్ ఇటలీ ప్రైవసీ విభాగం ‘ది గరాంటే’.. ఇదివరకే ఈ స్మార్ట్కళ్లజోడు విషయంలో ప్రజల భద్రత గురించి ప్రశ్నలు లేవనెత్తింది. అయితే ఫేస్బుక్ రీజియన్ బేస్ ఐర్లాండ్‌లో ఉండడం వల్ల.. ఐర్లాండ్ డాటా ప్రొటెక్షన్ కమిషన్ విచారణ నడుస్తోంది. ఇక డీపీసీ తలనొప్పి ఫేస్‌బుక్‌కు కొత్తేం కాదు. ఫేస్బుక్ చాలాకాలం నుంచి తేవాలనుకుంటున్న ఫేషియల్ ట్యాగింగ్ ఫీచర్, డీపీసీ అభ్యంతరాల వల్లే వాయిదా పడుతోంది. అంతేకాదు వాట్సాప్ డాటాను మాతృక సంస్థ ఫేస్బుక్ పంచుకుంటోందన్న ఆరోపణలపై విచారణ కొనసాగుతోంది కూడా. ఇక ఫేస్బుక్, ఫేస్బుక్ బిజినెస్ వ్యవహరాలకు సంబంధించిన ఫిర్యాదులెన్నో డీపీసీ ముందు పెండింగ్‌లో ఉండగా.. ఈ మధ్యే ‘ట్రాన్సపరెన్సీ ఫెయిల్యూర్’ ఫిర్యాదు ఆధారంగా 267 డాలర్ల పెనాల్టీ సైతం విధించింది. వచ్చే ఏడాది మరొకటి అయితే ఈ ఫిర్యాదులపై ఫేస్బుక్ సానుకూలంగా స్పందించింది. అప్రమత్తత కారణంగా ఇలాంటి అనుమానాలు లేవనెత్తడం సహజమేనని, ఆ అనుమానాల్ని నివృత్తి చేస్తూ వివరణలు ఇస్తామని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇక ఫేస్బుక్ ప్రస్తుతం విడుదల చేసిన కళ్లద్దాలు అగుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ కాకుండానే మార్కెట్లోకి రిలీజ్ అయ్యింది. వచ్చే ఏడాదిలో ప్రమఖ కళ్లజోడు కంపెనీ లగ్జోట్టికా సహకారంతో ఏఆర్ సంబంధిత కళ్లద్దాల్ని తేనున్నట్లు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఇదివరకే ప్రటించాడు కూడా. ఇక ప్రస్తుతం తెచ్చిన రే బాన్ స్టోరీస్ కళ్లజోడులో 5ఎంపీ కెమెరా ఉంది. 299 డాలర్లు(సుమారు 22 వేల రూపాయలు) ప్రారంభ ధర కాగా.. యూకేతో పాటు ఈయూ పరిధిలోని ఐర్లాండ్, ఇటలీలో అమ్ముతున్నారు. చదవండి: ఫోన్ మాట్లాడేందుకు కళ్లజోడు.. ఈ కంపెనీనే! -
ఫేస్‌బుక్‌కు మరో దెబ్బ
ఇటీవల ఫేస్బుక్లో చోటు చేసుకున్న ప్రైవసీ స్కాండల్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కాండల్ నేపథ్యంలో వాట్సాప్ సీఈవో జాన్ కౌమ్, తన పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించారు. వాట్సాప్ నుంచి తాను వైదొలుగుతున్నట్టు కౌమ్ తన ఫేస్బుక్ పేజీలో సోమవారం ధృవీకరించారు. అదేవిధంగా ఫేస్బుక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నుంచి కూడా కౌమ్ రాజీనామా చేస్తున్నట్టు వాషింగ్టన్ పోస్టు రిపోర్టు చేసింది. కౌమ్ రాజీనామాపై ఫేస్బుక్ ఇంకా ఎలాంటి కామెంట్ చేయలేదు. కౌమ్ కూడా తాను ఎందుకు కంపెనీని వీడాలనుకుంటున్నారో తెలుపలేదు. వాట్సాప్ స్ట్రాటజీ విషయంలో పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో వివాదాలు చోటు చేసుకున్నాయని, ఈ కారణం చేత ఆయన వైదొలుగుతున్నట్టు రిపోర్టులు వెలువడ్డాయి. ఫేస్బుక్, వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత డేటా వాడుతుందని, వాట్సాప్ ఎన్క్రిప్షన్ను ఇది బలహీనపరుస్తుందని కౌమ్ ఆందోళన చెందుతున్నట్టు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది. ‘బ్రైయిన్, నేను కలిసి వాట్సాప్ ప్రారంభించి దశాబ్దమవుతోంది. కొంతమంది మంచి వ్యక్తులతో కలిసి సాగిన ఈ ప్రయాణం ఎంతో అద్భుతం’ అని వాట్సాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న కౌమ్ పేర్కొన్నారు. కానీ తాను బయటికి వచ్చేసే సమయం ఆసన్నమైందంటూ కూడా తెలిపారు. అయితే ఏ తేదీన తాను వాట్సాప్ సీఈవోగా తప్పుకోనున్నారో కౌమ్ వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో కౌమ్ కంపెనీని వీడటం ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆందోళన పరుస్తోంది. 5000 యాప్ సాఫ్ట్వేర్ డెవలపర్లు, కొంతమంది వాట్సాప్ యూజర్లతో జుకర్‌బర్గ్ సమావేశం ఏర్పాటు చేశారు. కౌమ్ ఫేస్బుక్ పోస్టుకు సమాధానమిచ్చిన జుకర్‌బర్గ్, మీతో కలిసి పనిచేయడం మిస్ అవుతామని పేర్కొన్నారు. 2014లో వాట్సాప్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫేస్‌బుక్‌తో వచ్చిన పొరపచ్చలతో గతేడాదే వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్ కంపెనీని వీడారు. తాజాగా మరో సహ వ్యవస్థాపకుడు కౌమ్ కూడా వాట్సాప్‌కు గుడ్‌బై చెబుతున్నారు. -
ప్రమాదంలో వాట్సాప్ యూజర్లు
-
సర్కారుపై కోర్టుకెక్కిన మైక్రోసాఫ్ట్!
వినియోగదారులకు తెలియకుండానే వాళ్ల ఈ మెయిల్ లేదా ఆన్లైన్ ఫైళ్లను పరిశీలించేందుకు వీలు కల్పించేలా చట్టం చేసినందుకు.. అమెరికా ప్రభుత్వం మీద మైక్రోసాఫ్ట్ కేసు పెట్టింది. వ్యక్తుల రహస్యాలకు సంబంధించి టెక్ పరిశ్రమకు, అమెరికా అధికారులకు మధ్య గొడవలు జరగడం ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఇలాంటి వివాదాలు చోటుచేసుకున్నాయి. అవసరాన్ని బట్టి ఈమెయిళ్లు, ఫొటోలు, ఆర్థిక రికార్డులు అన్నింటినీ కస్టమర్లు దాచుకునే ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లేదా క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్లను తాము సులభంగా యాక్సెస్ చేసేలా ఉండాలని అమెరికా ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాదిస్తున్నారు. దానికోసమే తాజాగా చట్టం చేశారు. కానీ, అమెరికా న్యాయశాఖ ఈ విషయంలో 1986 నాటి ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ప్రైవసీ చట్టాన్ని ఉల్లంఘిస్తోందని మైక్రోసాఫ్ట్ వాదిస్తోంది. ఎవరివైనా ఫైళ్లను చూడాలంటే తప్పనిసరిగా కోర్టు అనుమతి ఉండాలని, కానీ అలా కాకుండా ఏపకక్షంగా అధికారులే చూస్తే పౌరుల హక్కులకు భంగం కలుగుతుందని చెబుతోంది. ఈ విషయమై సీటెల్ ఫెడరల్ కోర్టులో గురువారం నాడు మైక్రోసాఫ్ట్ ఓ కేసు దాఖలుచేసింది. కానీ తాము ప్రధానంగా బాలలపై అత్యాచారాలు చేసేవాళ్లు, ఇళ్లలో దారుణాలకు పాల్పడేవారు, క్రూరమైన నేరస్తులు, ఉగ్రవాదుల వివరాలపై మాత్రమే నిఘా ఉంచుతామని ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఒకరు చెబుతున్నారు. అయితే, ప్రభుత్వం మనమీద దర్యాప్తు చేస్తున్నప్పుడు వాళ్లు ఏం చేస్తున్నారో తెలిస్తే అప్పుడు డిఫెన్స్‌కు సిద్ధం అయ్యే అవకాశం ఉంటుందని, అలా కాకుండా ప్రభుత్వం తనంతట తానే వ్యక్తుల ఫైళ్లను చూసేస్తుంటే ఇక వాళ్లు తమను తాము కాపాడుకునే అవకాశం ఉండదని మరికొందరు వాదిస్తున్నారు. వైట్‌కాలర్ నేరాలు సహా పలు రకాల కేసుల దర్యాప్తు విషయంలో ఈసీపీఏ చట్టం కింద ప్రభుత్వం చేసే డిమాండ్లు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయని మైక్రోసాఫ్ట్ చెబుతోంది. అత్యంత ముఖ్యమైన కేసుల్లోనే ఇలా అడగాలి గానీ, ఈమధ్య కాలంలో ఈ తరహా ఉత్తర్వులు మరీ సర్వసాధారణం అయిపోతున్నాయని మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ ఓ ప్రకటనలో చెప్పారు. గడిచిన 18 నెలల్లో 5,600 సార్లకు పైగా కస్టమర్ల వివరాల కోసం అధికారులు డిమాండ్ చేశారట. వాటిలో సగానికి పైగా కేసుల్లో కోర్టు మాత్రం వాటిని రహస్యంగా ఉంచాల్సిందిగా ఆదేశించింది. కొన్ని కేసులలో ఉత్తర్వులకు కాలదోషం పట్టినా, మిగిలిన 1750 కేసుల్లో మాత్రం ఇప్పటికీ ఆ ఉత్తర్వులు అలాగే ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ చెబుతోంది. చాలామంది తమ డేటాను ఆన్లైన్లోనే స్టోర్ చేసుకుంటున్నారని, దాన్ని ప్రభుత్వం అలుసుగా తీసుకోవాలని భావిస్తోందని అంటోంది. మైక్రోసాఫ్ట్‌కు ప్రత్యర్థి సంస్థ యాపిల్ కూడా ఈ విషయంలో ఇప్పటికే అమెరికా ప్రభుత్వంతో పోరాడిన విషయం తెలిసిందే. ఐఫోన్లలో స్టోర్ చేసిన డేటాను అన్‌లాక్ చేసి తమకు ఇవ్వాలని ఎఫ్‌బీఐ పట్టుబట్టడం, చివరకు యాపిల్‌తో సంబంధం లేకుండానే అన్‌లాక్ చేసేసుకోవడం లాంటి పరిణామాలు జరిగాయి. ప్రభుత్వం ఇలా చేయడం అలవాటుగా మారిందని అమెరికా పౌరహక్కుల సంఘం తరఫు న్యాయవాది అలెక్స్ అబ్డో అన్నారు. -
తప్పు చూపించాడని.. ఉద్యోగం పీకేసిన ఫేస్బుక్!
ఫేస్బుక్.. ఆ కంపెనీలో ఉద్యోగం గానీ, ఇంటర్న్‌షిప్ గానీ వస్తే చాలన్నది బీటెక్ విద్యార్థుల కల. కానీ, అది కూడా అన్ని కంపెనీల లాంటిదేనని తేలిపోయింది. మెసెంజర్ యాప్‌లో ఉన్న ఓ పెద్ద లోపాన్ని ఎత్తి చూపించినందుకు భారత సంతతికి చెందిన ఓ యువ ఇంజనీర్ ఇంటర్న్‌షిప్ రద్దు చేసింది. పైగా అతడు ఆషామాషీ కుర్రాడు కాదు.. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకుని వచ్చినవాడు. అరన్ ఖన్నా అనే ఆ కుర్రాడు ఓ ప్లగిన్ రూపొందించాడు. దాన్ని బట్టే ఫేస్బుక్ మెసెంజర్లో ఉన్న ఓ అతిపెద్ద లోపం బయటపడింది. మెసెంజర్ ద్వారా ఎవరైనా చాట్ చేస్తుంటే.. తాము ఎక్కడున్నామన్న విషయం అవతలి వాళ్లకు ఆటోమేటిగ్గా తెలిసిపోతుంది. దాంతో.. విజయవాడలో ఉండి చాట్ చేస్తూ, నేను హైదరాబాద్‌లో ఉన్నా అని చెప్పడానికి వీలుండదు. అంటే.. చాట్ చేసేవాళ్ల గుట్టంతా రట్టయిపోతుందన్నమాట. అరన్ రూపొందించిన ప్లగిన్ ఇన్స్టాల్ చేసుకుంటే.. ఒక కన్వర్సేషన్ త్రెడ్‌లో ఉన్నవాళ్లు ఎక్కడెక్కడ తిరుగుతున్నారన్న విషయం కూడా తెలిసిపోతుంది. అవతలివాళ్లు ఫేస్బుక్లో తమకు ఫ్రెండ్స్ కాకపోయినా కూడా వాళ్లెక్కడున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయం అరన్ కనిపెట్టడంతో.. అతడు రూపొందించిన ప్లగిన్‌ను 85 వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ద గార్డియన్, డైలీ మెయిల్, హఫింగ్టన్ పోస్ట్.. ఇలాంటి ప్రముఖ పత్రికలన్నీ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి. అయితే, ఫేస్బుక్ యాజమాన్యం వెంటనే ఆ ప్లగిన్‌ను డిజేబుల్ చేయాలని చెప్పడంతో అతడు వెంటనే డిజేబుల్ చేసేశాడు. మీడియాతో మాట్లాడొద్దని చెప్పడంతో అలాగే చేశాడు. వారం రోజుల తర్వాత ఫేస్బుక్ తన మెసెంజర్ యాప్‌ను అప్డేట్ చేసింది. కానీ అరన్ ఖన్నా ఉద్యోగాన్ని మాత్రం పీకేసింది.