ఇటీవల ఫేస్‌బుక్‌లో చోటు చేసుకున్న ప్రైవసీ స్కాండల్‌పై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఈ స్కాండల్ నేపథ్యంలో వాట్సాప్ సీఈవో జాన్ కౌమ్, తన పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించారు. వాట్సాప్ నుంచి తాను వైదొలుగుతున్నట్టు కౌమ్ తన ఫేస్‌బుక్ పేజీలో సోమవారం ధృవీకరించారు. అదేవిధంగా ఫేస్‌బుక్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నుంచి కూడా కౌమ్ రాజీనామా చేస్తున్నట్టు వాషింగ్టన్ పోస్టు రిపోర్టు చేసింది. కౌమ్ రాజీనామాపై ఫేస్‌బుక్ ఇంకా ఎలాంటి కామెంట్ చేయలేదు. కౌమ్ కూడా తాను ఎందుకు కంపెనీని వీడాలనుకుంటున్నారో తెలుపలేదు. వాట్సాప్ స్ట్రాటజీ విషయంలో పేరెంట్ కంపెనీ ఫేస్‌బుక్‌తో వివాదాలు చోటు చేసుకున్నాయని, ఈ కారణం చేత ఆయన వైదొలుగుతున్నట్టు రిపోర్టులు వెలువడ్డాయి. ఫేస్‌బుక్, వాట్సాప్ యూజర్ల వ్యక్తిగత డేటా వాడుతుందని, వాట్సాప్ ఎన్‌క్రిప్షన్‌ను ఇది బలహీనపరుస్తుందని కౌమ్ ఆందోళన చెందుతున్నట్టు వాషింగ్టన్ పోస్టు పేర్కొంది.
‘బ్రైయిన్, నేను కలిసి వాట్సాప్ ప్రారంభించి దశాబ్దమవుతోంది. కొంతమంది మంచి వ్యక్తులతో కలిసి సాగిన ఈ ప్రయాణం ఎంతో అద్భుతం’ అని వాట్సాప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా ఉన్న కౌమ్ పేర్కొన్నారు. కానీ తాను బయటికి వచ్చేసే సమయం ఆసన్నమైందంటూ కూడా తెలిపారు. అయితే ఏ తేదీన తాను వాట్సాప్ సీఈవోగా తప్పుకోనున్నారో కౌమ్ వెల్లడించలేదు. ఈ పరిస్థితుల్లో కౌమ్ కంపెనీని వీడటం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆందోళన పరుస్తోంది. 5000 యాప్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, కొంతమంది వాట్సాప్ యూజర్లతో జుకర్‌బర్గ్ సమావేశం ఏర్పాటు చేశారు. కౌమ్ ఫేస్‌బుక్ పోస్టుకు సమాధానమిచ్చిన జుకర్‌బర్గ్, మీతో కలిసి పనిచేయడం మిస్ అవుతామని పేర్కొన్నారు. 2014లో వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫేస్‌బుక్‌తో వచ్చిన పొరపచ్చలతో గతేడాదే వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు బ్రెయిన్ కంపెనీని వీడారు. తాజాగా మరో సహ వ్యవస్థాపకుడు కౌమ్ కూడా వాట్సాప్‌కు గుడ్‌బై చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment