వాట్సాప్‌కు సీఈవోగా భారతీయుడు..! | Will Neeraj Arora Become WhatsApp CEO | Sakshi
Sakshi News home page

వాట్సాప్‌కు సీఈవోగా భారతీయుడు..!

Published Thu, May 3 2018 10:19 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Will Neeraj Arora Become WhatsApp CEO - Sakshi

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన పలు బహుళ జాతి సంస్థలకు భారతీయులు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మరో పేరు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ చాట్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్‌ సీఈవోగా భారత్‌కు చెందిన నీరజ్‌ అరోరాను నియమించే ఆవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఆ సంస్థ సీఈవో పదవి నుంచి జాన్‌ కౌమ్‌ వైదొలగడంతో..  వాట్సాప్‌ కొత్త సీఈవో వేటలో పడింది. 2014లో వాట్సాప్‌ను కొనుగోలు చేసిన ఫేస్‌బుక్‌ ప్రస్తుతం డేటా లీకేజీ వ్యవహరంతో ఇబ్బంది పడుతోంది. అయితే ఫేస్‌బుక్‌తో కలిసి పనిచేయడం ఇష్టం లేకనే జాన్‌ ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. యూజర్ల డేటా భద్రత అనేది ప్రధాన సమస్యగా మారిన ఈ తరుణంలో కొత్త సీఈవో ఎంపిక విషయంలో చాలా కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 
అయితే  వాట్సాప్‌  ఇప్పటికే అర్హులతో కూడిన ఓ జాబితాను రూపొందించినట్టు సమాచారం. అందులో వాట్సాప్‌ బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌గా వ్యవహరిస్తున్న నీరజ్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్న నీరజ్‌.. గతంలో గూగుల్‌లో కార్పొరేటు డెవలప్‌మెంట్‌ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఐఐటీ ఢిల్లీలో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన నీరజ్‌ ఓ క్లౌడ్‌ సొల్యూషన్‌ సంస్థలో చేరి.. ఆ కంపెనీలో ఉన్నత స్థాయికి చేరాడు. 2006లో ఐబీఎస్‌ నుంచి ఎంబీఏ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన అనంతరం ఏడాదిన్నర పాటు టైమ్స్‌ ఇంటర్నెట్‌ లిమిటెడ్‌లో వర్క్‌ చేశాడు. ఆ తర్వాత గూగుల్‌లో చేరిన నీరజ్‌.. 2011లో వాట్సాప్‌లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం భారత్‌కు చెందిన సుందర్‌ పిచాయ్‌ గూగుల్‌కు, సత్యానాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు, శంతను నారాయణ్‌ అడోబ్‌కు సీఈవోలుగా వ్యవహరిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement