వాట్స్‌యాప్ వ్యవస్థాపకులకు రూ. 55,000 కోట్లు
శాన్ ఫ్రాన్సిస్కో: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సంస్థకు తమ కంపెనీని విక్రయించిన వాట్స్‌యాప్ వ్యవస్థాపకులు జాన్ కౌమ్, బ్రియాన్ యాక్టన్ భారీ జాక్‌పాట్ దక్కించుకున్నారు. డీల్‌లో భాగంగా ఫేస్‌బుక్‌లో వారికి 116 మిలియన్ షేర్లు లభించాయి. వీటి విలువ దాదాపు 9 బిలియన్ డాలర్లు(దాదాపు రూ. 55,000 కోట్లు) ఉంటుంది.
మెసేజింగ్ సర్వీసుల సంస్థ వాట్స్‌యాప్‌ను ఫేస్‌బుక్ 22 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. అమెరికా మార్కెట్ నియంత్రణ సంస్థకు ఫేస్‌బుక్ తెలిపిన వివరాల ప్రకారం కౌమ్‌కు 5.8 బిలియన్ డాలర్ల విలువైన 76.4 మిలియన్ల షేర్లు లభించాయి. దీంతో ఫేస్‌బుక్‌లో ఆయన నాలుగో అతి పెద్ద వాటాదారుగా మారారు. యాక్టన్‌కు 3 బిలియన్ డాలర్లు విలువ చేసే 39.7 మిలియన్ల ఫేస్‌బుక్ షేర్లు లభించాయి. వాట్స్‌యాప్‌లో 45 మంది ప్రస్తుత, మాజీ ఉద్యోగులకు ఫేస్‌బుక్ షేర్లు లభించాయి.