విలువల పతనానికి ‘ఈ’ తోడైతే! | dileep reddy write article on social media | Sakshi
Sakshi News home page

విలువల పతనానికి ‘ఈ’ తోడైతే!

Published Fri, Feb 9 2018 12:54 AM | Last Updated on Mon, Oct 22 2018 6:35 PM

dileep reddy write article on social media - Sakshi

సమకాలీనం
ఇలా జరిగే ఘోరాలు, నేర ఘటనల్ని దర్యాప్తు సంస్థలు కదిలించినపుడు ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మాధ్యమాల లింకులు బయటపడుతున్నాయి. దారితప్పేలా చేసిన ప్రేరణ వెల్లడవుతోంది. వివాహేతర సంబంధాల వల్ల జరిగే హత్యలు, ఆత్మహత్యలు, నేరపూరిత దాడుల ఘటనల్లోనూ కొత్త పరిచయాల నుంచి అనుచిత, లైంగిక సంబంధాలు, వైషమ్యాల వరకు సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు పోషిస్తున్న పాత్ర విడదీసి చూడరానిదిగా ఉంటోంది.

ఒక టెలివిజన్‌ జర్నలిస్టు నుంచి ఉదయం వాట్సాప్‌లో నాకో గుడ్‌మార్నింగ్‌ మెసేజ్‌ వచ్చింది. అందులో ‘ఈ ప్రపంచంలో ఏదీ ‘మంచి’ లేదా ‘చెడు’ అని నిర్దిష్టంగా ఉండదు. మన ఆలోచనల్ని బట్టే ఏదైనా! ప్రాణాల్ని కాపాడేందుకు ఓ వైద్యుడు శస్త్రచికిత్సకు వాడుతున్నపుడు కత్తి మంచిది. ప్రాణాల్ని తీసేందుకు ఓ ఉగ్రవాది వినియోగిస్తున్నపుడు కత్తి చెడ్డది’ ఇదీ సంక్షిప్త సందేశం. అంటే, కత్తి కాకుండా దాని వినియోగాన్ని బట్టే ఫలితం మంచైనా, చెడైనా! సామాజిక మాధ్యమాలపైన ఈ మధ్య తరచూ చర్చ జరుగుతోంది. అవి మంచా–చెడా? శాపమా–వరమా?  నిజానికీ చర్చకు ముగింపు లేదు. 

ఎందుకంటే, చాలా విషయాల్లోలాగానే ఇందులోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి! మంచి–చెడు పాళ్లలో వ్యత్యాసం, హెచ్చు తగ్గులే ఈ చర్చను సజీ వంగా ఉంచుతాయి. చెడును పరిహరించి, మంచిని స్వీకరించడమే మనం చేయాల్సింది. శాస్త్ర–సాంకేతిక పరిజ్ఞానం ఫలాలను సమాజం గరిష్టంగా ఉపయోగించుకొని ప్రయోజనం పొందగలుగుతుంది. ఆ తెలివిడి మనకు, అంటే ప్రజా సమూహాలకు, పౌర సంఘాలకు, పాలకులకు ఉండాలి. చెడును తగ్గించి, మంచి నిష్పత్తిని పెంచినపుడు సామాజిక మాధ్యమాలైనా, అంత ర్జాల వ్యవస్థయినా సత్ఫలితాలిస్తుంది. భారతదేశానికి అపారంగా మానవవ నరులున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక పెద్ద చేయూత. యువశక్తి వనరుల్ని భవిష్యత్‌ సంపదగా మలిచే క్రమంలో ఈ శాస్త్ర–సాంకేతికత సద్వినియోగం అవసరం. 

మార్కెట్‌ శక్తులు, సమాచారం శాసించే నేటి విశ్వసమాజంలో మనకు మనంగా స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. జ్ఞాన–సమాచార వ్యాప్తి, వ్యాపార–వాణిజ్య విస్తరణ, వ్యక్తులు–సంస్థల మధ్య పరస్పర భావ వినిమయం వంటి ఎన్నో ప్రయోజనాలు ఈ సామాజిక మాధ్యమాలు, సైబర్‌ సాంకేతికత వల్ల ప్రభావవంతంగా నెరవేరతాయి. అలా కాకుండా, దుర్వినియోగమైనపుడు సమాజ వికాసం కుంటుపడుతుంది. తిరోగమనంలో సాగుతాం, ఓ నిర్వీర్య–నిస్తేజపు తరం ఆవిర్భవిస్తుంది. అంతర్జాలం, ఆ సాంకేతికత ఆధారంగా పనిచేసే గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విటర్, లింక్‌డిన్‌... తదితర మాధ్యమ వేదికలు సమాచార వ్యవస్థలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తు న్నాయి. ఉపయోగాన్ని బట్టి మంచి ఉపకరణాలు కాగలిగిన బలం, నేపథ్యం వాటికుంది. కానీ, పట్టుతప్పి చెడు మార్గం పడితే, ఒడుపుగా కాక నిర్లక్ష్యంగా ఉపయోగంలో పెడితే... అందుకు తగ్గ సమాజ పతనాన్ని రచించే శక్తి కూడా ఈ ఉపకరణాలకు ఉంది. పెడపోకడలను పెరుగుతున్న సంకేతాలు కనిపి స్తూనే ఉన్నాయి. 

ఇరువైపులా పదునున్న కత్తినెలా వాడాలి?
అదివరకటి వందేళ్ల ప్రపంచ ప్రగతిని మించిన అభివృద్ధి గత ఇరవయేళ్లలో లభించింది. మానవేతిహాసంలో నిప్పును గుర్తించి, వాడటం ఒక విప్లవాత్మక మార్పుగా చెబుతారు. తర్వాత.. ‘చక్రం’ కనుగొనడం ఓ మేలు మలుపై పారి శ్రామిక విప్లవానికి దారులు పరిచింది. ఆధునిక కాలంలో ‘అంతర్జాలం’ అనేక సంచలనాలకు మూలమైంది. సమాచార వ్యవస్థ వేగంగా వృద్ధి–విస్త రణ చెందింది. అది దన్నుగా నూతన ఆర్థిక, రాజకీయ విధానాల నీడలో ఎన్నెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాల స్వరూప స్వభవాలే మారిపోయాయి. సమాజ గతి పెను మార్పులకు లోనవుతోంది. ఖండాలకతీతంగా మనుషుల జీవన శైలిలో వేగంగా మార్పులొస్తున్నాయి. 

వ్యక్తిగత సౌఖ్యాలు, సదుపాయాలు, ఆస్తులు పెరుగుతున్న క్రమంలోనే విలు వలు నశిస్తున్నాయి. కట్టడిలేని కాలుష్యం! సహజవనరుల అసాధారణ విని యోగంతో భవిష్యత్తును భయానకం చేస్తున్నారు. శాస్త్ర–సాంకేతికత వృద్ధితో సమాచార, రవాణా సదుపాయాలు పెరిగాయి. ఫలితంగా భౌతిక దూరాభా రాలు తగ్గి ప్రపంచమే ఓ కుగ్రామమౌతున్న తరుణంలో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. సాటి మనుషులపైన, జన సమూహాలపైన, వారి జీవన స్థితిగతులపైన అవగాహన లేమి కన్నా మనుషుల్లో ‘పట్టింపులేని తనం’ పెరిగిపోతోంది! ఆర్థిక అసమానతలు ప్రమాదకర స్థాయికి చేరాయి. 73 శాతం సంపద రెండు శాతం జనాభా వద్ద కేంద్రీకృతమైంది. ఎందుకిలా జరుగుతోంది? ఇది కోటి రూకల ప్రశ్న. మనిషి స్వార్థం హెచ్చడం, నిజా యితీ, విలువలు, సహజ జీవన పద్ధతులు నశించి కృత్రిమత్వం పెరగటం వల్లే ఇదంతా అనే వాదనా ఉంది. 

సంప్రదాయ ప్రసారమాధ్యమాలతో పాటు సామాజిక మాధ్యమాలు, అంతర్జాల వ్యవస్థ విస్తరించిన నేటి పరిస్థితుల్లో వనరుల హేతుబద్ధ వినియోగం, సంపద సృష్టి, సమగ్ర పంపిణీ, సమస మాజ స్థాపన, పర్యావరణ పరిరక్షణకు చక్కటి సావకాశమున్న సమయమిది. కృత్రిమ మేధ, రోబోటిక్స్‌ యుగంలోకి దూసుకువెళ్లినా మానవ విలువల పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. వినిమయవాద సంస్కృతి పెరిగి డబ్బు–సంపదకు ఇచ్చిన విలువ సాటి మనుషులకు ఇవ్వటం లేదు. మను షులతో సంబంధాలు, నెట్‌వర్క్, విద్యావ్యాప్తి, సహాయ–సహకారాలు, సమాచారం–ఆధునీకరణ, వాణిజ్యవృద్ధి, అవగాహన పెంచడం, నేరాల నియంత్రణ, విభిన్న సమాజాల నిర్మాణం.... ఇలా పలు విషయాల్లో ఈ– సైట్లు బాగా ఉపయోగపడుతాయి. కానీ, వాటిని మంచి కోసం ఎక్కువగా వాడుకోవడం లేదు. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, చైనా వంటి అభి వృద్ధి చెందిన సమాజాలతో పోల్చినపుడు, వెనుకబడిన, ముఖ్యంగా భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో ఇదింకా వేగం పుంజుకోవాల్సి ఉంది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం తగ్గి సద్వినియోగం పెరగాలి.

మానవ సంబంధాల విధ్వంసం
సున్నితమైన, విలువల ఆధారితమైన మానవ సంబంధాలే సమాజాల స్థితి గతిని నిర్వచిస్తాయి. విలువలతో కూడిన జీవన విధానమే ప్రపంచానికి భారత్‌ ఇచ్చిన కానుక అని, అమెరికా అధ్యక్షుడి హోదాలో బారాక్‌ ఒబామా మన పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి మాట్లాడుతూ కీర్తించారు. ఆయన పొగిడింది చాన్నాళ్ల కిందటి మన గతం. ఇదివరకే క్షీణిస్తూ ఉన్న విలువలు నేడు మరింత సన్నగిల్లుతున్నాయి. సమిష్ఠి కుటుంబ వ్యవస్థ క్రమంగా కను మరుగవుతూ చిన్న కుటుంబాలు రావడం, సగటుమనిషి ఆలోచనలు డబ్బు మయమవడం, అన్ని రంగాల్లోనూ విలువలు–ప్రమాణాలు పడిపోవడం, అవసరాలకు–అవకాశాలకు మధ్య సంఘర్షణ వంటివి మనుషుల్లో నైతికతను తగ్గిస్తున్నాయి. మారిన విద్యా విధానంతో పాటు ఇందుకెన్నెన్నో కారణా లున్నా, అంతర్జాల వ్యవస్థ, సామాజిక మాధ్యమాల పాత్ర కూడా ఉంది. 

ముఖ్యంగా సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్స్‌ (ఎస్సెన్నెస్‌) యువతపై తీవ్ర ప్రతి కూల ప్రభావం చూపుతున్నాయి. మంచి కన్నా చెడు వైపు వేగంగా ఆకర్షితు లవుతున్నారు. ఫలితంగా వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తుల సామాజిక అనుబం ధాలు బలహీనపడుతున్నాయి. పిల్లలు, యువతరం ఎదుగుదలలో బహు ముఖ వికాసం కనిపించడం లేదు. పనికిమాలిన సమయం వృధా వ్యవహా రాల్లో మునిగి తేలుతూ మేధోమరుగుజ్జులవుతున్నారు. సైట్ల ప్రభావం వారిపై అలా ఉంది. ‘మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నదే ప్రధానంగా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది’ అంటారు శంకరాచార్యుడు. దేశంలో 42 కోట్లమందకి పైగా అంత ర్జాలం వినియోగిస్తున్నారు. అందులో సగం మంది సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలంగా ఉన్నారు. 18–24 మధ్య వయస్కులే అత్యధికులు. దేశంలో నేడు సెల్‌ఫోన్‌ వాడని యువతీయువకులు లేరేమో? పొద్దస్తమానం అదే పనిగా సామాజిక మాధ్యమాలతో గడిపేవారే అత్యధికులు. 

వారికి లభించే సరుకు అలా ఉంది. ఎదిగే పిల్లల చదువులు, కౌమారంలోని వారి ఆలోచ నలు, యవ్వనంలోని యువతీయువకుల సంబంధాలు తీవ్రంగా ప్రభావిత మౌతున్నాయి. అశ్లీలసైట్ల విచ్చలవిడి తనానికి హద్దే లేదు. 16, 17 ఏళ్ల వయసులోనే ప్రేమలని, వైఫల్యాలని, మానసిక కుంగుబాట్లని, కక్ష్యలు– కార్పణ్యాలని, కడకు ఆత్మహత్యలు, హత్యల వైపు సాగుతున్న ఘటనలెన్నో! ఇలా జరిగే ఘోరాలు, నేర ఘటనల్ని దర్యాప్తు సంస్థలు కదిలించినపుడు ఫేస్‌బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి మాధ్యమాల లింకులు బయటపడుతున్నాయి. దారితప్పేలా చేసిన ప్రేరణ వెల్లడవుతోంది. వివాహేతర సంబంధాల వల్ల జరిగే హత్యలు, ఆత్మహత్యలు, నేరపూరిత దాడుల ఘటనల్లోనూ కొత్త పరిచయాల నుంచి అనుచిత, లైంగిక సంబం ధాలు, వైషమ్యాల వరకు సెల్‌ఫోన్లు, సామాజిక మాధ్యమాలు పోషిస్తున్న పాత్ర విడదీసి చూడరానిదిగా ఉంటోంది. 

‘నిర్మిత ప్రపంచంలోని యాదృ చ్ఛిక సంబంధాలకు, వాస్తవిక ప్రపంచంలోని అర్థవంతమైన సంబంధాలకు మధ్య తేడాలు తెలుసుకునే విచక్షణా జ్ఞానాన్ని సామాజిక మాధ్యమాలు హరించివేస్తాయి’ అని కార్నెల్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్‌ స్టీవెన్‌ స్ట్రాంగజ్‌ అంటారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్య మాల పట్ల అజాగ్రత్తగా ఉంటే జరిగే నష్టాలను ప్రపంచ మేధావులు ఏకరువు పెడుతున్నారు. జాగ్రత్త పడకుంటే, బనాయింపుల్తో .... బలహీన మనస్కుల్ని వేధించి, ఆత్మహత్యలకు పురికొల్పే సైబర్‌ రౌడీయిజం, డాటాను కొల్లగొట్టే  హ్యాకింగ్స్, నిలువునా ముంచే నేరాలు–స్కామ్‌లు, వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడాలు పెచ్చుమీరతాయి. వాడేవారికిదొక వ్యసనంగా మార డం, శారీరక–మానసిక రుగ్మతలకు దారితీయడం వంటి అరిష్టాలెన్నో!
మూలాల్ని గుర్తించి మందేయాలి

విలువల పరిస్థితి మెరుగు పరచకుండా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ‘సరుకు’ ప్రమాణాల్ని నియంత్రించకుండా పైపై చర్యలు ఎన్ని చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదనే భావన వ్యక్తమౌతోంది. ‘షీ–టీమ్‌’లు, సీసీ కెమె రాలు, ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ఏర్పాటు వంటివి తదనంతర నియంత్రణ చర్యలే తప్ప సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలు వెతకటం కాదనే పెదవి విరుపు ఉంది. పట్టణాలు, మండల–గ్రామ స్థాయిల్లో ఇప్పటికే ఇదొక నియం త్రణ లేని వ్యవస్థగా, చేయి దాటిన వ్యసనంగా మారింది. కౌమారంలోని పిల్లలు చదువులు పక్కన పడేసో, చదువుతూనో, అదరాబాదరాగా చదువు ముగించో... పొద్దస్తమానం ఈ సైట్లతో గడిపేస్తున్నారు. వాటి ద్వారానే తప్ప, ప్రత్యక్ష సంభాషణలు, కలయికల్ని మానేస్తున్నారని ‘చైల్డ్‌ మైండ్‌ డాట్‌ ఆర్గ్‌’ వంటి సంస్థల అధ్యయనాలు తేల్చాయి. ఫలితంగా పిల్లలు–యువతలో సంయమనం, సమ్యక్‌దృష్టి, నిర్ణయసామర్థ్యం, విచక్షణ లోపిస్తున్నాయని తేలింది. సాధారణ స్థాయి బుద్ధి కుశలత, పనినైపుణ్యాల్ని కూడా చూపలేకపో తున్నారు. 

ఆదాయాలు, జీవన ప్రమాణాలకు ఆధునిక సెల్‌ఫోన్, ఈ–సైట్స్‌ వంటి సదుపాయాలకు మధ్య సమతూకం లేనపుడు కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. నిరంతరం అవే చూస్తుండటం, తమ పరిస్థితిని ఇతరులతో పోల్చి చూసుకోవడం వల్ల కూడా అసంతృప్తి స్థాయి, ఆత్మన్యూనతా భావ నలు పెరిగి అనర్థాలకు దారి తీస్తోందని డాక్టర్‌ స్టీవెన్‌ అడెయిర్‌ విశ్లేషిస్తారు. ఈ–సైట్ల వ్యవసనపరుల్లో తెగించి అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా ఈర్ష్య, దుగ్ధ, కక్ష్య–కార్పణ్యం వంటివి పెరిగి హింసకు పురికొల్పుతున్న ఘట నలూ ఉన్నాయి. ‘నీ మిత్రులెవరో చెప్పు... నీవేంటో చెబుతా!’ అన్నాడట బెర్నార్డ్‌షా. ‘పదినిమిషాలు నీ సెల్‌ఫోన్‌ ఇవ్వు... నీవేంటో చెబుతా అంటోంది శాస్త్ర సాంకేతికత! తస్మాత్‌ జాగ్రత్త!!

- దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement