సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఇటీవలి కాలంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం బాగా పెరిగిన క్రమంలో..యువత, పెద్దలు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని వివిధ సేవా, అత్యవసర సమయాల్లో ఆదుకునే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. వాట్సప్, ఫేస్‌బుక్ యాప్‌ల ద్వారా..క్షణాల్లో సమాచార బదిలీ జరిగిపోతోంది. సరదా అంశాలు, కబుర్లకే పరిమితం కాకుండా అత్యవసర సేవలు, ఆపత్కాలంలో ఆదుకోవడం వంటి కార్యకలాపాలు అరచేతిలోని స్మార్ట్‌ఫోన్ ద్వారానే నిర్వహిస్తున్నారు. రక్తదానాలు, ఆర్థికసాయాలు, ఆస్పత్రిలో వైద్యానికి అండగా నిలవడం, అనాథలను చేరదీయడం, వితరణలు చేయడం ఇలా అనేక సేవలకు ఆపన్నహస్తం అందించేలా..వ్యవహరిస్తున్నారు.
గ్రూపు షేర్ తీర్చేను బెంగ..
మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న ఆనంద్ శిక్షణ కోసం బెంగళూరులో ఉండగా..హైదరాబాద్‌లో ఉంటున్న తమ్ముడు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడని, అర్జంట్‌గా రావాలని అతడికి ఫోన్ వచ్చింది. ఖమ్మంలో ఉన్న తల్లి తాను వెళ్లడానికి సత్వరం ఏర్పాట్లు చేయాలని కొడుకుకు ఫోన్ చేసి..ప్రాదేయపడడంతో అంత దూరంలో ఉన్న అతడికి ఏమి చేయాలో తోచక తీవ్ర కలత చెందాడు. అప్పుడే ఒక మెరుపులాంటి ఆలోచన ఆనంద్‌కు తట్టింది. తన కారులో ఖమ్మంలో ఉన్న అమ్మను హైదరాబాద్‌లో దించాలని ఎవరైనా వెళ్లే వారు ఉంటే సంప్రదించాలంటూ ఫ్రెండ్స్ గ్రూపులో మెసేజ్ పోస్ట్ చేశాడు. దీంతో ఆయా గ్రూపుల నుంచి విశేష స్పందన వచ్చింది. రాము అనే మిత్రుడు తాను అమ్మను హైదరాబాద్‌లో దించి వచ్చేటప్పుడు తన కుటుంబ సభ్యులను ఖమ్మం తీసుకొస్తానని వెంటనే ఆనంద్‌కు మెసేజ్ పెట్టాడు. ఇందుకు ఆనంద్ సరే అనడంతో..ఆ తల్లి సకాలంలో హైదరాబాద్‌లో బిడ్డ ఉన్న ఆస్పత్రికి చేరింది. ఆనంద్ బెంగళూరు నుంచి చేరుకునే లోపు లక్ష్మి రోడ్డు ప్రమాదానికి గురైన కిరణ్‌ను చూడటమే కాకుండా..దగ్గరుండి వైద్యం అందేలా చేయగలిగింది. ఆనంద్‌కు సాయం చేయడంతో పాటు..వృద్ధాప్యంలో ఉన్న తన తల్లిదండ్రులను జాగ్రత్తగా కారులో ఇంటికి తెచ్చుకోగలిగాడు. స్మార్ట్‌ఫోన్ ఇలా రెండు కుటుంబాల బెంగను తీర్చింది.
స్మార్ట్‌గా..స్పీడ్‌గా..
స్మార్ట్ ఫోన్ వచ్చాక..వివిధ రకాల సేవలను కేవలం బుక్ చేసుకోవడం ద్వారా సులభతరంగా పొందగలుగుతున్నారు. ప్రతి చిన్న అవసరానికి షాపుల చుట్టూ తిరగకుండా.. కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా తమకు కావాల్సిన వస్తువులను మెసేజ్ పెడితే షాపు నుంచి డోర్ డెలివరీ అయ్యే సులభతర మార్గం సోషల్ మీడియా ద్వారా అందుబాటులోకి వచ్చింది. ఇది ఎంతో ఊరట కల్పిస్తోంది. అనేకమంది తమ ఇంట్లో జరిగే శుభకార్యాలు, కుటుంబ సభ్యులు మరణించిన సమాచారం.. దశదిన కర్మలు, పార్టీలు, వేడుకలు, వివాహ సమాచారం సైతం సోషల్‌మీడియా ద్వారానే తన ఆత్మీయులకు, మిత్రులకు తెలియజేయడం ఇప్పుడు సరికొత్త ఆనవాయితీగా మారింది. ఇంటింటికీ వెళ్లి కార్డులు ఇచ్చే సంస్కృతి దాదాపు తగ్గిపోతోంది. సోషల్ మీడియాలో ఒక్క ఆహ్వాన పత్రిక అందజేస్తే చాలు వందలమందికి తెలుస్తుండటంతో..ఇటు సమయం ఆదా కావడమే కాకుండా..వందలాదిమంది మిత్రులకు ఒకేసారి సమాచారం ఇచ్చే వెసులుబాటు కలుగుతోంది.
సర్కారు కూడా దృష్టి..
ఇప్పుడు సోషల్‌మీడియా ప్రైవేట్ కార్యక్రమాలకే పరిమితం కాలేదు. ప్రభుత్వ అధికారులు సైతం క్షేత్రస్థాయి సమాచారం కోసం వినియోగించుకుంటున్నారు. మారుమూల ప్రాంతంలో ఒక గ్రామస్థాయి అధికారి చేసిన సర్వే రిపోర్టు క్షణాల్లో జిల్లాస్థాయి అధికారులకు చేరుతోంది. కొన్ని గంటల వ్యవధిలో శాఖాపరమైన సమావేశాలు పెట్టుకోవాలనుకున్నప్పుడు జిల్లా ఉన్నతాధికారులు తమ సిబ్బందికి సోషల్‌మీడియా ద్వారానే సమాచారం అందిస్తున్నారు. ఒకే గ్రూపులో ఉండే సభ్యులందరికీ సమాచారం ఏకకాలంలో చేరుతుండడంతో తెలియదనే అపవాదు సైతం ఇందువల్ల తొలగుతుందని కీలకశాఖ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
ఎన్నో ఘటనలు..
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ రంగంలో పనిచేస్తున్న ప్రమోద్ ఖమ్మంలో ఉన్న ఇంటి మరమ్మతులు చేయించడానికి ఐదు రోజులు సెలవు పెట్టాడు. మేస్త్రి కావాలని ఇలా మెసేజ్ పెట్టాడో లేదో.. అనేక ఫోన్ నంబర్లు ఆయనకు రిప్లయ్‌గా వచ్చాయి. అందులో ఒకరితో పనులు పూర్తి చేయించాడు.
ఖమ్మంలో నివాసం ఉంటున్న 80 సంవత్సరాల వయసు గల మధురమ్మ ఆకస్మికంగా మరణించింది. హైదరాబాద్‌లో ఉండే ఆమె కుమారులు హడావిడిగా ఇక్కడికి వచ్చేందుకు బయల్దేరారు. దహన సంస్కారాల ఏర్పాట్ల కోసం..ఆమె పెద్ద కుమారుడు లక్ష్మణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వాట్సాప్ గ్రూపులో ఉన్న ఆయన మిత్ర బృందం అండగా నిలిచారు. వారు వచ్చేసరికి శ్మశాన వాటిక వద్ద సామగ్రిని సైతం సమకూర్చి..దుఃఖ సమయంలో ఓదార్పుగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment