వంట చేయకుండా.. సోషల్‌మీడియాలో ఉందని.. | Woman Killed For Not Cooking Food | Sakshi
Sakshi News home page

వంట చేయకుండా.. సోషల్‌మీడియాలో ఉందని..

Jan 27 2018 5:57 PM | Updated on Oct 22 2018 6:05 PM

Woman Killed For Not Cooking Food - Sakshi

కోల్‌కతా : సోషల్‌మీడియా వ్యసనం మనిషిని బయటి ప్రపంచం నుంచి దూరం చేస్తోంది. అదే లోకంగా బతికేలా చేస్తోంది. కోల్‌కతా జరిగిన ఓ సంఘటన ఇందుకో ఉదాహరణ. భర్త ఇంటికి వచ్చేసరికి ఓ వివాహిత వంట చేయడం మర్చిపోయి సోషల్‌మీడియాను వినియోగిస్తోంది. దీంతో కోపగించుకున్న భర్త క్షణికావేశంతో మృగంలా ప్రవర్తించడంతో ఆమె తనువు చాలించింది.

కోల్‌కతాలోని అలీపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 24న సురజిత్‌పాల్‌ పని నుంచి మధ్యాహ్న భోజనానికి ఇంటికి వచ్చాడు. భార్య తుంపాపాల్‌ సోషల్‌ మీడియాలో బిజీ బిజీగా ఉండడం చూసి కోపోద్రేకుడయ్యాడు. వంట కూడా చేయకుండా ఆమె అదే పనిగా సోషల్‌ మీడియాలో గడపడం చూసి భార్య తలపై కత్తితో పలుమార్లు దాడి చేశాడు.

ఆ తర్వాత టవల్‌ను మెడకు చుట్టి ఊపిరాడనీయకుండా చేయడంతో ఆమె మరణించింది. భార్యను హత్య చేసిన తర్వాత సురజిత్‌ కూడా ఆత్మహత్యకు యత్నించాడు. కత్తితో చేతి మణికట్టును కోసుకున్నాడు. ఎక్కడ ప్రాణాలు పోతాయనే భయంతో గాయానికి బ్యాండేజ్‌ వేసుకుని పారిపోతుండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు.

సురజిత్‌పాల్, తుంపాపాల్‌లకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. హత్య జరిగిన సమయంలో ఓ అబ్బాయి ఊరెళ్లగా.. మరో అబ్బాయి కళాశాలకు వెళ్లాడు. కాలేజ్‌ నుంచి తిరిగొచ్చిన చిన్న కుమారుడు తల్లి విగతజీవిగా పడి ఉండడం చూసి స్థానికులకు తెలిపాడు. స్థానికుల సమాచారంతో సురజిత్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement