రాత్రి 10తర్వాత సోషల్‌ మీడియాలో ఉంటే..! | Checking Social Media After 10 pm Leads To Depression, Loneliness | Sakshi
Sakshi News home page

రాత్రి 10తర్వాత సోషల్‌ మీడియాలో ఉంటే..!

Published Wed, May 16 2018 8:33 PM | Last Updated on Mon, Oct 22 2018 6:10 PM

Checking Social Media After 10 pm Leads To Depression, Loneliness - Sakshi

చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అంతా సమాజం గురించి మాట్లాడేవారే. ప్రతి విషయాన్ని నేరుగా కాకుండా సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకోవడానికి ఉవ్విళ్లూరుతుంటారు. సామాజిక మాధ్యమాల్లో ‘బిజీ’గా ఉంటూ నిద్రాహారాలు మరిచిపోయేవారే ఎక్కువవుతున్నారు. అయితే రాత్రి, పగలూ తేడా లేకుండా సోషల్‌ మీడియాలో మునిగిపోయే వారికి మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం చాలా ఎక్కువని తాజాగా ఓ సర్వే బయట పెట్టింది.

రాత్రి పది గంటలు దాటిన తర్వాత సోషల్‌ మీడియాలో గడపటం, టీవీ చూడటం వంటి అలవాట్లున్న వారు తీవ్రమైన ఒత్తిడి, ఆత్మన్యూనత భావం, ఒంటరితనం వంటి మానసిక సమస్యలకు గురికాక తప్పదని ‘ది లాన్సెట్‌ సైకియాట్రీ జర్నల్‌’లో విడుదలైన ఒక నివేదిక వెల్లడించింది. అలాంటి వారి రోజూవారి దినచర్యల్లో తీవ్ర మందకొడితనం నెలకొంటుందని తెలిపింది. బై పోలార్‌ డిసార్డర్‌ ద్వారా కోపం, బాధ, చిరాకు వంటివి వారిలో తీవ్రమవుతాయని రిపోర్టు పేర్కొంది. తగినంత విశ్రాంతి లేకపోవడంతో వారు నరాల వ్యాధులకు కూడా గురికావొచ్చని నివేదిక హెచ్చరించింది. బాగా పొద్దు పొయాక నిద్ర పోయేవారు ఆనందంగా ఉండలేరని, ఎప్పుడూ ఒంటరి తనంతో బాధ పడుతుంటారని ఈ రిపోర్టు స్పష్టం చేసింది.

‘దాదాపు 91 వేల మంది మధ్య వయస్కులపై పరిశోధన చేసి ఈ రిపోర్టు తయారు చేశాం. వారందరినీ సోషల్‌ వేదికలు, టీవీల్లో మునిగిపోయేలా చేసి వారి దినచర్యల్లో వచ్చిన మార్పులను గుర్తించాం. కంటినిండా నిద్రలేకుండా.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సోషల్‌ వేదికల్లో అహోరాత్రులు గడుపుతూ, మధ్య మధ్యలో టీ, కాఫీలు తీసుకునే వారు ఈ ముప్పుని ఎదుర్కొన్నార’ని నివేదిక తయారు చేసిన డానియెల్‌ స్మిత్‌ పేర్కొన్నారు. పరిశోధనలో పాల్గొన్న వారిలో పావువంతు జనాభా ఈ కింది మానసిక రుగ్మతలకు గురయ్యారని ఆయన తెలిపారు.

  • 6 శాతం మంది మానసిక ఒత్తిడి
  • 11 శాతం మంది బై పోలార్‌ డిసార్డర్‌
  • 9 శాతం మంది ఆనందంగా లేకపోవడం

‘విమానాలలో కొన్ని గంటల ప్రయాణం చేసినప్పుడు, ఒకటి రెండు రాత్రులు తగినంత నిద్ర లేనప్పుడు సహజంగా మన ప్రవర్తన, రోజూవారి కార్యక్రమాలపై ప్రభావం పడుతుంది. ఆలోచనా శక్తి మందగిస్తుంది. మరి అదే పనిగా శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తూ.. నిద్రకు దూరం చేస్తే విపరీత పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. సహజ జీవనానికి భిన్నంగా బతకడం అంటే సమస్యలకు తలుపులు తీయడమే’ అని స్మిత్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement