Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

ENG VS IND 2nd Test Day 3: Indian pacer Mohammed Siraj took six wickets1
సిరాజ్‌ ‘సిక్సర్‌’

భారత బౌలింగ్‌ ధాటికి ఒకదశలో ఇంగ్లండ్‌ స్కోరు 84/5... ఇక మూడో రోజే మ్యాచ్‌ మన చేతికి చిక్కినట్లే అనిపించింది. అయితే జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్‌ అసాధారణ బ్యాటింగ్‌తో ఎదురుదాడి చేసి ‘ట్రిపుల్‌ సెంచరీ’ భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లండ్‌ తేరుకోగలిగింది. హైదరాబాదీ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ ఆరు వికెట్ల ప్రదర్శన శుక్రవారం ఆటలో హైలైట్‌గా నిలవగా, ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో ఆరుగురు ‘డకౌట్‌’ కావడం విశేషం. అయినా సరే తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 180 పరుగులతో కలిపి ఇప్పటికే 244 పరుగులు ముందంజలో ఉన్న టీమిండియా మ్యాచ్‌ను శాసించే స్థితికి చేరింది. నేడు మన బ్యాటర్లు చెలరేగి ప్రత్యర్థి ముందు ఎంత లక్ష్యం ఉంచుతారనేది ఆసక్తికరం.బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో రెండో టెస్టుపై భారత్‌ పట్టు బిగించింది. మ్యాచ్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తమ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టానికి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం జట్టు ఓవరాల్‌గా 244 పరుగుల ఆధిక్యంలో ఉంది. జైస్వాల్‌ (22 బంతుల్లో 28; 6 ఫోర్లు) అవుట్‌ కాగా... కేఎల్‌ రాహుల్‌ (38 బంతుల్లో 28 బ్యాటింగ్‌; 6 ఫోర్లు), కరుణ్‌ నాయర్‌ (7 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 77/3తో శుక్ర వారం ఆట కొనసాగించిన ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 407 పరుగులకు ఆలౌటైంది. జేమీ స్మిత్‌ (207 బంతుల్లో 184 నాటౌట్‌; 21 ఫోర్లు, 4 సిక్స్‌లు), హ్యారీ బ్రూక్‌ (234 బంతుల్లో 158; 17 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 303 పరుగులు జోడించారు. భారత పేసర్లు మొహమ్మద్‌ సిరాజ్‌ (6/70), ఆకాశ్‌దీప్‌ (4/88) కలిసి ప్రత్యరి్థని పడగొట్టారు. మెరుపు భాగస్వామ్యం... మూడో రోజు ఆటలో తొలి 10 బంతులు ముగిసేసరికి మ్యాచ్‌ భారత్‌ చేతుల్లోకి వచ్చేసినట్లు అనిపించింది! ‘హైదరాబాద్‌ పేసర్‌’ సిరాజ్‌ వరుసగా రెండు చక్కటి బంతులతో రూట్‌ (22), స్టోక్స్‌ (0)లను పెవిలియన్‌ పంపించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెండోసారి ఇంగ్లండ్‌ వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. అయితే ఈ వికెట్ల తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. బ్రూక్, స్మిత్‌ కలిసి బౌండరీలతో చెలరేగిపోయారు. వీరిద్దరిని నిలువరించేందుకు తీవ్రంగా ప్రయత్నించిన భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన స్మిత్‌ 80 బంతుల్లోనే సెంచరీ (14 ఫోర్లు, 3 సిక్స్‌లు) సాధించడం విశేషం. తొలి సెషన్‌లో ఇంగ్లండ్‌ 27 ఓవర్లలో ఏకంగా 172 పరుగులు రాబట్టడం విశేషం. తప్పిన ఫాలోఆన్‌... లంచ్‌ తర్వాత కూడా బ్రూక్, స్మిత్‌ అంతే పట్టుదలతో బ్యాటింగ్‌ను కొనసాగించారు. ఈ క్రమంలో బ్రూక్‌ కూడా 137 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా, భాగస్వామ్యం 200 పరుగులు దాటింది. రెండో సెషన్‌లో ఒక్క వికెట్‌ కూడా కోల్పోని ఇంగ్లండ్‌ 28 ఓవర్లలో 106 పరుగులు జోడించింది. విరామానంతరం సిరాజ్‌ ఓవర్లో స్మిత్‌ స్వే్కర్‌ లెగ్‌ దిశగా ఆడి రెండు పరుగులు తీయడంతో పార్ట్‌నర్‌íÙప్‌ 300 పరుగులకు చేరింది. అయితే ఎట్టకేలకు ఈ జోడీని ఆకాశ్‌దీప్‌ విడదీశాడు. కొత్త బంతితో వేసిన మూడో ఓవర్లోనే బ్రూక్‌ను ఆకాశ్‌దీప్‌ బౌల్డ్‌ చేయగా... తర్వాతి ఓవర్లోనే ఇంగ్లండ్‌కు ఫాలో ఆన్‌ ప్రమాదం తప్పింది. అయితే ఆ తర్వాత 12 పరుగుల వ్యవధిలో చివరి 4 వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. స్కోరు వివరాలు భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 587; ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలీ (సి) నాయర్‌ (బి) సిరాజ్‌ 19; డకెట్‌ (సి) గిల్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 0; పోప్‌ (సి) రాహుల్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 0; రూట్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 22; బ్రూక్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 158; స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 0; స్మిత్‌ (నాటౌట్‌) 184; వోక్స్‌ (సి) నాయర్‌ (బి) ఆకాశ్‌దీప్‌ 5; కార్స్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 0; టంగ్‌ (ఎల్బీ) (బి) సిరాజ్‌ 0; బషీర్‌ (బి) సిరాజ్‌ 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (89.3 ఓవర్లలో ఆలౌట్‌) 407.వికెట్ల పతనం: 1–13, 2–13, 3–25, 4–84, 5–84, 6–387, 7–395, 8–396, 9–407, 10–407. బౌలింగ్‌: ఆకాశ్‌దీప్‌ 20–2–88–4, సిరాజ్‌ 19.3–3–70–6, ప్రసిధ్‌ 13–1–72–0, నితీశ్‌ రెడ్డి 6–0–29–0, జడేజా 17–2–70–0, సుందర్‌ 14–0–73–0. భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (ఎల్బీ) (బి) టంగ్‌ 28; రాహుల్‌ (బ్యాటింగ్‌) 28; నాయర్‌ (బ్యాటింగ్‌) 7; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 64. వికెట్ల పతనం: 1–51. బౌలింగ్‌: వోక్స్‌ 5–0–28–0, కార్స్‌ 5–1–23–0, టంగ్‌ 3–1–12–1. ఒకే ఓవర్లో 23 పరుగులు... ప్రసిధ్‌ కృష్ణ ఓవర్లో స్మిత్‌ చెలరేగిన తీరు ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో తొలి బంతికి పరుగు తీయని స్మిత్‌ ఆ తర్వాత వరుసగా 4, 6, 4, 4, (వైడ్‌), 4 బాదడంతో మొత్తం 23 పరుగులు వచ్చాయి. తొలి టెస్టులోనే ఆరుకు పైగా ఎకానమీతో చెత్త బౌలింగ్‌ ప్రదర్శన చేసిన ప్రసిధ్‌ ఈ టెస్టులోనూ ఘోరంగా విఫలమయ్యాడు.క్యాచ్‌లు చేజారె... మూడో రోజు ఆటలో బ్రూక్, స్మిత్‌ జోరును నిలువరించేందుకు కొన్ని అవకాశాలు వచి్చనా అవి వృథా అయ్యాయి. మరీ సులువైనవి కాకపోయినా... మూడు క్యాచ్‌లు వదిలేయడం ఇంగ్లండ్‌కు మేలు చేసింది. జడేజా బౌలింగ్‌లో బ్రూక్‌ (వ్యక్తిగత స్కోరు 63) ఇచ్చిన క్యాచ్‌ను గిల్‌ అందుకోలేకపోయాడు. వేగంగా వచి్చన బంతి అతని తలకు కూడా తగిలింది. తన బౌలింగ్‌లోనే స్మిత్‌ ఇచ్చిన రిటర్న్‌ క్యాచ్‌ (స్కోరు 90)ను సుందర్‌ చేజార్చాడు. ఆ తర్వాత నితీశ్‌ బౌలింగ్‌లో స్మిత్‌ (స్కోరు 121) ఇచి్చన క్యాచ్‌ను పంత్‌ నేలపాలు చేశాడు.⇒ 4 సిరాజ్‌ కెరీర్‌లో నాలుగో సారి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ నాలుగూ వేర్వేరు దేశాల్లో (ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌) రావడం విశేషం.⇒ ఇంగ్లండ్‌ గడ్డపై ఐదు వికెట్ల ప్రదర్శన కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నా. అందుకే నమ్మశక్యంగా అనిపించడం లేదు. నిజానికి నేను చాలా బాగా బౌలింగ్‌ చేస్తున్నా వికెట్లు మాత్రం రావడం లేదు. ఇప్పటి వరకు నాలుగు వికెట్లకు మించి తీయలేదు. ఇప్పుడు ఆరు వికెట్లు సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. పిచ్‌ నెమ్మదిగా ఉన్నా క్రమశిక్షణతో సరైన చోట బంతులు వేస్తే ఫలితం రాబట్టవచ్చని నమ్మాను. కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తూ పరుగులు నిరోధించే ప్రయత్నం చేశాను. మిగతా ఇద్దరితో పోలిస్తే నాకే అనుభవం ఎక్కువ కాబట్టి ఆ సవాల్‌ను స్వీకరించి బాధ్యతగా బౌలింగ్‌ చేశాను. –సిరాజ్‌

SEBI bans Jane Street over Rs 4843 crore unlawful earnings2
‘జేన్‌ స్ట్రీట్‌’ స్కామ్‌!

న్యూఢిల్లీ: దేశీ స్టాక్‌ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడినందుకు గాను అమెరికన్‌ సంస్థ జేన్‌ స్ట్రీట్‌ (జేఎస్‌) గ్రూప్‌పై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొరడా ఝుళిపించింది. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ట్రేడింగ్‌ చేయకుండా గ్రూప్‌ సంస్థలపై నిషేధం విధించింది. అక్రమంగా ఆర్జించిన రూ. 4,843 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. స్టాక్‌ సూచీలను ప్రభావితం చేసి, జేఎస్‌ గ్రూప్‌ భారీగా లబ్ధి పొందిందనే ఆరోపణలపై చేపట్టిన విచారణలో భాగంగా సెబీ ఈ మేరకు మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. జేన్‌ స్ట్రీట్‌ (జేఎస్‌) గ్రూప్‌లో భాగమైన జేఎస్‌ఐ ఇన్వెస్ట్‌మెంట్స్, జేఎస్‌ఐ2 ఇన్వెస్ట్‌మెంట్స్, జేన్‌ స్ట్రీట్‌ సింగపూర్, జేన్‌ స్ట్రీట్‌ ఏషియా ట్రేడింగ్‌ సంస్థలకు ఇవి వర్తిస్తాయి. 2023 జనవరి–2025 మే మధ్య కాలంలో 21 ఎక్స్‌పైరీ తేదీల్లో సూచీలను ప్రభావితం చేసే విధంగా క్యాష్, ఫ్యూచర్స్‌ మార్కెట్లో గ్రూప్‌ పెద్ద ఎత్తున ట్రేడింగ్‌ చేసినట్లు, తద్వారా ఆప్షన్స్‌ మార్కెట్లో పొజిషన్లతో భారీగా లాభాలు ఆర్జించినట్లు సెబీ విచారణలో తేలింది. జేన్‌ స్ట్రీట్, దాని అనుబంధ సంస్థలు భారతీయ ఆప్షన్స్‌ మార్కెట్లో అనధికారిక ట్రేడింగ్‌ వ్యూహాలు అమలు చేస్తున్నాయంటూ 2024 ఏప్రిల్‌లో మీడియాలో వార్తలు రావడం ఈ కేసుకు బీజం వేశాయి. ఎక్స్‌పైరీ రోజు దగ్గరపడే సమయంలో, ఇండెక్స్‌ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా, జేఎస్‌ గ్రూప్‌ సందేహాస్పద ట్రేడింగ్‌ లావాదేవీలు నిర్వహిస్తోందని సెబీ గుర్తించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్చరికలు జారీ చేసినప్పటికీ, ఇలాంటివి చేయబోమంటూ ఎన్‌ఎస్‌ఈకి హామీ ఇచ్చినప్పటికీ గ్రూప్‌ సంస్థలు తమ తీరును మార్చుకోలేదని ఉత్తర్వుల్లో సెబీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘2025లో ఎన్‌ఎస్‌ఈ జారీ చేసిన అడ్వైజరీని కూడా పట్టించుకోకుండా, లెక్కలేనితనాన్ని ప్రదర్శిస్తూ జేఎస్‌ గ్రూప్‌ వ్యవహరించిన తీరు చూస్తే, మిగతా ఎఫ్‌పీఐలు, మార్కెట్‌ వర్గాల్లాగా, అది నమ్మతగినది కాదని అర్థం అవుతోంది. గతంలోలాగే లావాదేవీలు కొనసాగించేందుకు జేఎస్‌ గ్రూప్‌ను అనుమతిస్తే ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు కచ్చితంగా భంగం వాటిల్లుతుందని ప్రాథమిక సాక్ష్యాధారాలు కనిపిస్తున్నాయి’’ అని సెబీ వ్యాఖ్యానించింది. నిబంధనలను ఉల్లంఘిస్తూ జేఎస్‌ గ్రూప్‌ అక్రమంగా ఆర్జించిన రూ. 4,843.57 కోట్ల మొత్తాన్ని ఎస్క్రో అకౌంటుకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఉత్తర్వులకు సంబంధించినవి అయితే తప్ప, తమ అనుమతి లేకుండా, జేఎస్‌ గ్రూప్‌ సంస్థల ఖాతాల్లో ఎలాంటి డెబిట్‌ లావాదేవీలను జరగనివ్వరాదంటూ బ్యాంకులకు సెబీ ఆదేశాలు ఇచ్చింది. ఇతరత్రా సూచీల్లోనూ జేఎస్‌ గ్రూప్‌ ట్రేడింగ్‌ లావా దేవీలపై సెబీ విచారణ చేపడుతోంది. సెబీ ఉత్తర్వుల ప్రకారం ఇండెక్స్, స్టాక్‌ ఆప్షన్లలో ట్రేడింగ్‌ ద్వారా జేఎస్‌ గ్రూప్‌ రూ.44,358 కోట్లు ఆర్జించింది. స్టాక్‌ ఫ్యూచర్స్‌లో రూ.7,208 కోట్లు, ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌లో రూ. 191 కోట్లు, క్యాష్‌ సెగ్మెంట్లో రూ. 288 కోట్లు నష్టపోయింది. దీంతో 2023 జనవరి–2025 మార్చి మధ్య మొత్తం మీద రూ.36,671 కోట్లు అక్రమంగా ఆర్జించింది. ఏం చేసింది.. ఎలా చేసింది..స్టాక్‌ మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉండే నిఫ్టీ, బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ ఆప్షన్స్‌ సెగ్మెంట్స్‌లో ట్రేడింగ్‌ ద్వారా సూచీలను ప్రభావితం చేసి, దాన్నుంచి లాభాలు పొందిందని జేఎస్‌ గ్రూప్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం అది రెండు కీలక వ్యూహాలు అమలు చేసిందని సెబీ విచారణలో వెల్లడైంది. దీని ప్రకారం, బ్యాంక్‌ నిఫ్టీ స్టాక్స్, ఫ్యూచర్లలో ’జేఎస్‌ గ్రూప్‌’ ఉదయం పెద్దయెత్తున కొనుగోళ్లు చేసి, సాయంత్రం భారీగా అమ్మేసేది. అలాగే ఎక్స్‌పైరీ రోజున ఆఖరు రెండు గంటల్లో సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యేలా ఏదో ఒకదాన్ని భారీగా కొనడమో లేదా అమ్మడమో చేసేది. ఉదాహరణకు.. జేఎస్‌ గ్రూప్‌ ఉదయాన్నే కొన్ని ఎంపిక చేసుకున్న బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ షేర్లను భారీగా కొనేసేది. అదే సమయంలో ఇండెక్స్‌ ఆప్షన్స్‌ను షార్ట్‌ (అమ్మేయడం) చేసేది. ట్రేడింగ్‌ ముగిసే సమయం దగ్గరపడే కొద్దీ షేర్లను ఒక్కసారిగా అమ్మేసేది. దీంతో షేరు ధర పడిపోయేది. ఫలితంగా షేర్లపరంగా నష్టాలు వచ్చినప్పటికీ, సమాంతరంగా తీసుకున్న ఇండెక్స్‌ షార్ట్‌ ఆప్షన్లలో భారీగా లాభాలు వచ్చేవి. దీనివల్ల, ఉదయం రూ. 10 దగ్గర ఉన్న ఆప్షన్‌.. సాయంత్రానికి ఎకాయెకిన రూ.300–రూ. 400 అయిపోతుంది. లేదా అటుది ఇటవుతుంది. ఇలా ఎక్స్‌పైరీ రోజుల్లో ఇలా అసా ధారణ తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడటంతో సాధారణ ట్రేడర్లు భారీగా నష్టపోతారు. వాల్యూమ్స్‌పై ప్రభావం.. జేన్‌ స్ట్రీట్‌పై సెబీ చర్యలను మార్కెట్‌ వర్గాలు స్వాగతించాయి. దీనితో చిన్న ట్రేడర్లకు కాస్త ఊరట లభించగలదన్నాయి. కాకపోతే ఆప్షన్స్‌ వాల్యూమ్స్‌పైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ వాల్యూమ్స్‌లో జేన్‌ స్ట్రీట్‌ లాంటి ట్రేడింగ్‌ సంస్థల వాటా దాదాపు 50 శాతం వరకు ఉంటుందని జిరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్‌ కామత్‌ తెలిపారు. ఇలాంటి సంస్థలు వెనక్కి వెళ్లిపోతే దాదాపు రిటైల్‌ కార్యకలాపాలపైనా ప్రభావం పడొచ్చని వివరించారు. ఫలితంగా బిడ్‌–ఆస్క్‌ స్ప్రెడ్‌ (కొనుగోలు, అమ్మకం బిడ్ల మధ్య వ్యత్యాసం), తీవ్ర ఒడిదుడుకులు, అనిశ్చితి పెరిగిపోవచ్చన్నారు. ఇది ఇటు ఎక్సే్చంజీలకు, అటు బ్రోకర్లకు మంచి వార్త కాకపోవచ్చని పేర్కొన్నారు. ఇలాంటి పెద్ద సంస్థలపై మన మార్కెట్‌ ఎంతగా ఆధారపడిందనేది దీనితో తెలిసిపోతుందని కామత్‌ తెలిపారు. స్టాక్స్‌ కుదేలు.. జేఎస్‌ గ్రూప్‌పై సెబీ చర్యలతో ప్రతికూల ప్రభావం పడుతుందనే భయాలతో, విదేశీ సంస్థల ట్రేడింగ్‌ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ప్లాట్‌ఫాంలు, సంస్థల షేర్లు శుక్రవారం గణనీయంగా క్షీణించాయి. బీఎస్‌ఈలో నువామా వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ షేరు 11.26%, స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ ఏంజెల్‌ వన్‌ షేరు 6%, బీఎస్‌ఈ షేరు 6.42%, సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ (ఇండియా) 2.3% క్షీణించాయి. జేఎస్‌ గ్రూప్‌పై సెబీ చర్యలతో ఇన్వెస్టర్ల సెంటిమెంటు దెబ్బతిందని లెమన్‌ మార్కెట్స్‌ డెస్క్‌ అనలిస్ట్‌ గౌరవ్‌ గర్గ్‌ తెలిపారు.ఏమిటీ జేన్‌ స్ట్రీట్‌.. ఆర్థిక సేవల రంగానికి సంబంధించిన జేన్‌ స్ట్రీట్‌ గ్రూప్‌ 2000లో ట్రేడింగ్‌ సంస్థగా అమెరికాలో కార్యకలాపాలు ప్రారంభించింది. అమెరికాతో పాటు యూరప్, ఆసియాలోని 45 దేశాల్లో, 5 కార్యా లయాల్లో 2,600 మంది సిబ్బంది ఉన్నారు. 2020 డిసెంబర్‌లో ఇది భారత్‌లో కార్యకలాపాలు ఆరంభించింది.

Ys Jagan Serious On Mannava Village Sarpanch Nagamalleswara Rao Incident3
పచ్చమూకల పైశాచికత్వంపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

సాక్షి,గుంటూరు: కూటమి ప్రభుత్వంలో కొనసాగుతున్న దారుణాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనపై వైఎస్‌ జగన్‌ శుక్రవారం (జులై 4) ఎక్స్‌ వేదికగా స్పందించారు.‘రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్త‌మోడుతోంది. వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు.గుంటూరు జిల్లా మన్నవ గ్రామ దళిత సర్పంచి నాగమల్లేశ్వర్రావును పట్టపగలే కొట్టి చంపే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన వైరల్‌ అయిన వీడియో రాష్ట్రంలో మాఫియా, దుర్మార్గపు పాలనను తెలియజేస్తోంది. నాగమల్లేశ్వర్రావు కుటుంబం మొదటినుంచి వైఎస్సార్‌సీపీలో ఉండడం, ప్రజల్లో వారికి మంచి గుర్తింపు ఉండడం టీడీపీ వారికి కంటగింపుగా మారింది. పలుమార్లు బెదిరించినా, భయపెట్టినా వెనకడుగు వేయకపోవడంతో, రాజకీయంగా అక్కడ, ఆ ప్రాంతంలో వైఎస్సార్‌సీపీ ప్రాబల్యాన్ని తట్టుకోలేక స్థానిక ఎమ్మెల్యే తన కార్యకర్తలను పురిగొల్పి ఈ దాడులు చేయించారు. ఆ వీడియోలు చూస్తే, జరిగిన దాడి ఎంత అన్యాయమో, ఎంత హేయమో కనిపిస్తుంది. చంద్రబాబు స్వయంగా ప్రోత్సహిస్తూ, తన వాళ్లతో చేయిస్తున్న ఈ దారుణాలతో, వరుసగా జరుగుతున్న ఘటనల నేపథ్యంలో, రాష్ట్రంలో ఎవ్వరికీ రక్షణలేని పరిస్థితులు నెలకొన్నాయి. మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్‌ ఆర్డర్‌ కాపాడలేని ప‌రిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నాను’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్‌ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్త‌మోడుతోంది. వైయస్సార్‌సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఒక పథకం ప్రకారం తప్పుడు కేసులు, అరెస్టులు, అదీ వీలుకాకపోతే, తనవాళ్లని ప్రోత్సహించి మరీ దాడులు చేయిస్తున్నారు. గుంటూరు… pic.twitter.com/VfNxKZRUlz— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2025 విషమంగా నాగమల్లేశ్వర్రావు ఆరోగ్యంకూటమి ప్రభుత్వంలో దారుణాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకు గుంటూరు జిల్లా మన్నవ గ్రామంలో జరిగిన ఘటన ఉదాహరణగా నిలుస్తోంది. మన్నవ గ్రామంలో టీడీపీ అడ్డు అదుపూ లేకుండా పోతున్న ఆగడాల్ని ఆ ఊరి సర్పంచి నాగమల్లేశ్వర్రావు ప్రశ్నించారు. జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేయడంతో పాటు ప్రజల పక్షాన నిలిచి వారి ఆగడాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో నాగమల్లేశ్వర్రావును టీడీపీ నేతలు కొట్టి చంపే ప్రయత్నం చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలో వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం, సర్పంచి నాగమల్లేశ్వర్రావు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.

New Twist in Pune techies Case4
కొత్త మలుపు తిరిగిన అత్యాచారం కేసు

పూణేలో ఇటీవల జరిగిన ‘అత్యాచార ఘటన’ కొత్త మలుపు తిరిగింది. ఓ డెలివరీ బాయ్‌ తనపై పెప్పర్‌ స్ప్రే చల్లి అత్యాచారానికి ఒడిగట్టాడని, మళ్లీ వస్తా అని మెసేజ్‌ కూడా ఫోన్‌లో టైప్‌ చేశాడని అని యువతి చెప్పిందంతా అంతా తూచ్‌ అని పోలీసులు తేల్చేశారు. ఆమె అద్దెకు ఉంటున్న ఇంటికి డెలివరీ బాయ్‌ వచ్చి అ‍త్యాచారానికి పాల్పడలేదని, ఇది తన ఫ్రెండ్‌తో కలిసి ఆ 22 ఏళ్ల యువతి ఆడిన కట్టుకథ అని పోలీసులు స్పష్టం చేశారు. పూణేలో 22 ఏళ్ల ఐటీ ప్రొఫెషనల్ పై జరిగిన అత్యాచారం కేసులో కొత్త మలుపు తిరిగింది. ఈ అఘాయిత్యానికి పాల్పడి వ్యక్తి అపరిచితుడు కాదని, ఆ మహిళకు తెలిసిన వ్యక్తే అని పోలీసులు వెల్లడించారు. అత్యాచారం అనంతరం నిందితుడు తన ఫోన్లో సెల్ఫీ తీసుకున్నాడని యువతి పోలీసులకు చెప్పిన విషయం తెలిసిందే. దాన్ని సాక్ష్యంగా చూపించేందుకు ఆమె సెల్ఫీ స్వయంగా తీసుకుందని తేలింది. నిందితుడు తన ఫోన్లో మళ్లీ వస్తా అని మెసేజ్ టైప్ చేసి ఉంచడం కూడా కల్పితమని పోలీసులు బట్టబయలు చేశారు.పూణే పోలీస్‌ కమిషనర్‌ అమితేష్‌ కుమార్‌ శుక్రవారం( జూలై 4వ తేదీ) మీడియాతో మాట్లాడుతూ.. ‘ ఆ అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తికి ఆమెకు రెండేళ్లుగా పరిచయం ఉంది. ఆమెకు అతను కొత్త వ్యక్తి కాదు. ఆ సెల్ఫీని సైతం ఆమె స్వయంగా తీసుకుంది. ఐ విల్‌ బీ బ్యాక్‌( నేను మళ్లీ వస్తా) అనే మెసేజ్‌ను కూడా ఆమె టైప్‌ చేసింది’ అని చెప్పారు.మరి ఆరోపణలు ఎందుకు చేసింది..? డెలివరీ బాయ్‌ పెప్పర్‌ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని ఆమెకు ఎందుకు చెప్పిందనే దానిపైనే ఇప్పుడు పూర్తి దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇంకా విచారణ దశలోనే ఉందని, అయితే యువతి మానసిక స్థితి సరిగా లేనట్లు ఉందన్నారు. ఇంకా దర్యాప్తు జరుగుతుందని పోలీస్‌ కమిషనర్‌ పేర్కొన్నారు. ఇంతకీ యువతి ఫిర్యాదు ఏమిటంటే..!పూణేలోని షోష్ రెసిడెన్షియల్ సొసైటీలో తన సోదరుడితో కలిసి సదరు యువతి నివాసం ఉంటోంది. ఆమెకు వచ్చిన పార్సిల్‌ను ఇచ్చేందుకు డెలివరీ బాయ్‌.. బుధవారం రాత్రి 7:30 గంటలకు వచ్చాడని. ఇంతలో బాధితురాలికి పార్సిల్‌ ఇచ్చి.. ఓటీపీ చెప్పాలని కోరాడని పేర్కొంది. దీంతో, తన మొబైల్ తెచ్చేందుకు యువతి లోపలికి వెళ్లినట్లు, ఆ తర్వాత డెలివరీ బాయ్‌ తనపై పెప్పర్‌ స్ప్రే చల్లి అత్యాచారం చేశాడని తెలిపింది. ఇదే విషయాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకు చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది.

Video Of Escaped Pet Lion In Pakistan Lahore Street5
Video: తప్పించుకుని వచ్చిన పెంపుడు సింహం.. జనాలపై దాడి

లాహోర్‌: పెంపుడు జంతువుల్లో మనం ఎక్కువగా చూసేది కుక్క. ఈ మధ్య క్రూర మృగాలను కూడా పెంచుకుంటున్న వారు కూడా లేకపోలేదు. క్రూర మృగాలను పెంచుకుంటే ఏమౌతుందో తాజా ఘటనతో అద్దం పడుతోంది,. పాకిస్తాన్‌లో ఓ కుటుంబం సింహాన్ని పెంచుకుంటుంది. ఇది వారి రాయల్టీకీ సింబాలిక్‌ ఏమిటో గానీ, ఇప్పుడు అదే సింహం ఇద్దరు చిన్నారుల జీవితాలను ప్రమాదంలో పడేసింది. సదరు ఇంటి నుంచి తప్పించుకుని వచ్చిన సింహం.. వీధుల్లో పడింది. తొలుత తప్పించుకున్న సింహం ఓ గొడపై మాటువేసి మరీ జనాలపై దాడి చేసింది. ఈ ఘటన పాకిస్తాన్‌లో లాహోర్‌లోని షా దీ కోయి ఏరియాలో చోటు చేసుకుంది. ఇంటి నుంచి తప్పించుకున్న సింహం.. షాపింగ్‌ వెళుతున్న మహిళపై ముందుగా దాడికి దిగింది. మహిళను వెంబడించి దాడికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాము పెంచుకుంటున్న సింహం.. జనావాసాలపై దాడి చేసిందనే వార్త తెలియగానే ఆ ఇంటి యజమానులు అది చూసి ఆనందించినట్లు పిల్లల్ని కోల్పోయిన తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగితే, శుక్రవారం సింహాన్ని పెంచుకుంటున్న యజమానులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. తొలుత వారు ఇంటి నుంచి పారిపోయారని, కానీ 12 గంటల్లో వారిని అరెస్ట్‌ చేసినట్లు లాహోర్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆపరేషన్స్‌ కార్యాలయం స్పష్టం చేసింది. ఆ సింహం 11 నెలల మగ సింహమని, దాన్ని పట్టుకుని వైల్డ్‌ లైఫ్‌ పార్క్‌కి తరలించినట్లు పోలీసులు తెలిపారు.A pet lion, illegally kept in Lahore's Shah Di Khoi area, mauled two children and a woman after escaping. The 5-year-old and 7-year-old are in critical condition at Jinnah Hospital. For more details: https://t.co/UwQpv7eXuA#Lahore pic.twitter.com/h2xI9RhSn5— Daily Pakistan English (@endailypakistan) July 4, 2025

Netizens Trolls Ramayana Part I Writer Shridhar Raghavan For Taking Story Credit6
రామాయణ పార్ట్‌-1 గ్లింప్స్‌.. రచయితపై నెటిజన్ల ట్రోల్స్!

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి జంటగా మైథలాజికల్ చిత్రం 'రామాయణ'. ఈ సినిమాలో రాముడిగా రణ్‌బీర్‌కపూర్‌ , సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. కేజీఎఫ్ స్టార్ యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. నితిశ్ తివారీ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా గ్లింప్స్‌ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్ట్‌ మొదలైనప్పటి నుంచి ఇదే తొలి వీడియో కావడం విశేషం. గతంలో రామాయణంపై చాలా సినిమాలొచ్చినా.. ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి భారీ బడ్జెట్‌తో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.అయితే రామాయణం అంటే అందరికీ గుర్తుకొచ్చేది శ్రీరాముడు మాత్రమే కాదు.. వాల్మీకి పేరు తప్పకుండా ఉంటుంది. అయితే ఈ సినిమాకు కథ అందించిన రచయిత శ్రీధర్‌ రాఘవన్‌పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమాకు కథను తానే రాసినట్లు చెప్పుకోవడంపై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. రామాయణం రచించింది వాల్మీకి అయితే.. ఆ క్రెడిట్‌ కూడా మీరు ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు. పఠాన్‌, టైగర్-3 చిత్రాలకు కథ అందించిన శ్రీధర్ రాఘవన్‌ రామాయణం కూడా రాశాడంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. what about brother valmiki? pic.twitter.com/OtR1lfZQtf— Shreemi Verma (@shreemiverma19) July 3, 2025 Sridhar Raghavan calling himself the writer of Ramayana is not too different from an Indian calling themselves Caucasian or a homeopath calling themselves doctor. pic.twitter.com/L5qIUH0RXL— রাজ শেখর (@DiscourseDancer) July 4, 2025 The writer of #Ramayana is Shridhar Raghavan, who also wrote Pathaan and Tiger 3 pic.twitter.com/18FS6jmzLu— Prayag (@theprayagtiwari) July 3, 2025

AICC President Mallikarjuna Comments on Narendra Modi: Telangana7
యుద్ధాన్ని ఆపేశారేం?

సాక్షి, హైదరాబాద్‌: పాకిస్తాన్‌పై యుద్ధాన్ని ఆకస్మికంగా ఎందుకు ఆపేశారో, అసలు ఆపిందెవరో దేశ ప్రజలకు మోదీ ప్రభుత్వం చెప్పాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. పహల్గాం ఘటనపై దేశం యావత్తు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలిచిందని చెప్పారు. దేశంలోని అన్ని రాజకీయపార్టీలు మోదీకి మద్దతు ఇస్తూ యుద్ధం చేయాలంటూ గొంతు కలిపాయని గుర్తుచేశారు. అయినా యుద్ధం కొనసాగించకుండా అర్ధాంతరంగా నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.దేశానికున్న బలగంతో వీరోచితంగా పోరాడి పాక్‌ పీచమణిచి పీఓకేను స్వాదీనం చేసుకునే అవకాశాన్ని చేజేతులా కోల్పోవడం అత్యంత దురదృష్టకరమంటూ ఖర్గే ధ్వజమెత్తారు. జబ్బలు చరుచుకునే మోదీ కి కీలక సమయంలో చేతులు ఎత్తేయడమే చేతనవుతుందని విమర్శించారు. దేశరక్షణ, సైనికులపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి గైర్హాజరు కావడం ఆయన దేశభక్తికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ అధ్యక్షులు, కార్యకర్తల సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మోదీ మణిపూర్‌ ఎందుకు వెళ్లలేదు? ‘గంభీరంగా కనిపిస్తున్నట్లు నటించే మోదీ నిజానికి అత్యంత భయస్తుడు. ప్రధాని మోదీ ఇప్పటివరకు 42 దేశాల్లో పర్యటించారు. కానీ స్వదేశంలో అగి్నగుండంగా మారిన మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదు. మణిపూర్‌ భారత్‌కు అత్యంత కీలకమైన ప్రదేశం. అక్కడ జరుగుతున్న ఆందోళనలను పరిశీలించేందుకు నేను, రాహుల్‌గాంధీ వెళ్లాం. బాధితులను పరామర్శించాం. మరి మోదీ ఎందుకు మణిపూర్‌ వెళ్లలేదు? వారు దేశ పౌరులు కాదా? దేశ ప్రజలను పట్టించుకోకుండా ప్రపంచ దేశాలు తిరుగుతూ దేశ ప్రజలను మోదీ రోడ్లపై వదిలేశారు. మోదీ మాదిరి అప్పట్లో ఇందిరాగాంధీ భయపడలేదు. బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కల్పిస్తామని చెప్పి చేసి చూపించారు..’ అని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్‌ సర్కారు వచ్చాకే అందరికీ అభివృద్ధి ఫలాలు ‘కార్యకర్తల కృషితోనే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది. కార్యకర్తలే కాంగ్రెస్‌ పార్టీకి ఆత్మ. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నందున రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని చేసిన ప్రచారాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు తిప్పికొట్టారు. రాహుల్‌గాంధీ పాదయాత్ర సమయంలోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని అర్థమైంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కీలక రంగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు, రైతుభరోసా, రుణమాఫీ లాంటి ఎన్నో పథకాలు అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలి. రాజ్యాంగం నుంచి లౌకిక పదాన్ని తొలగించలేరు.. హైదరాబాద్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు దాదాపు 50కి పైగా కాంగ్రెస్‌ పాలనలో ఏర్పడ్డాయి. మరి మోదీ ప్రభుత్వం హైదరాబాద్‌కు ఏమిచ్చిందో చెప్పాలి. నల్లధనం తెచ్చి ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు ఇస్తానన్న మోదీ ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు. మోదీ, అమిత్‌షా అబద్ధాలు చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. సెక్యులర్‌ అనే పదం రాజ్యాంగంలో లేదని బీజేపీ చెప్తోంది. కానీ రాజ్యాంగం నుంచి లౌకిక అనే పదాన్ని తీసేయలేరు. సెక్యులర్‌ అనే పదంతో ఇబ్బందిగా ఉంటే బీజేపీ పార్టీ ప్రణాళిక నుంచి ఆ పదం తొలగించి చూపించాలి..’ అని ఖర్గే సవాల్‌ చేశారు. కాంగ్రెస్‌కు కార్యకర్తలే బ్రాండ్‌ అంబాసిడర్లు: సీఎం ‘తెలంగాణలో అధికార మదంతో తమకు తిరుగులేదనే అహంకారంతో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూలదోసి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత కాంగ్రెస్‌ కార్యకర్తలకే దక్కుతుంది. కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే బ్రాండ్‌ అంబాసిడర్లు. కార్యకర్తల కృషితో ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం..ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నప్పటికీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన 18 నెలల్లోనే రైతులకు రుణమాఫీ, రైతు భరోసా, సన్న వడ్లకు బోనస్, పేదలకు సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు లాంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం. ఈ పథకాలు దేశానికే రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయి. తెలంగాణ మోడల్‌ దేశానికే ఆదర్శంగా మారుతోంది. ఈ పథకాలను కేంద్ర ప్రభుత్వం సైతం అమలు చేయాల్సిన పరిస్థితి వస్తోంది..’ అని సీఎం రేవంత్‌ చెప్పారు. ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి ‘అద్భుతమైన పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నప్పటికీ వాటిని ప్రచారం చేసుకోవడంలో విఫలమవుతున్నాం. ప్రతి శాఖలో ఒక సంక్షేమ పథకం ఉంది. ఈ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తృత ప్రచారం కల్పించాల్సిన బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. ప్రజా ప్రభుత్వం ప్రతి హామీ అమలు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడు కుల సర్వే హామీ ఇచ్చి అమలు చేసి చూపించాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానిని జనగణనలో చేర్చింది. మహిళా సంఘాలకు ఆర్టీసీలో బస్సులు అద్దెకు ఇప్పించి లాభాలు గడించేలా ప్రోత్సహిస్తున్నాం. సోలార్‌ పవర్‌ ప్లాంట్లు, పెట్రోల్‌బంక్‌లు ఏర్పాటు చేయిస్తూ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నాం. కోటిమంది మహిళలను ఎస్‌హెచ్‌జీల్లో చేర్పించి కోటీశ్వరులుగా చేసే బాధ్యత ప్రభుత్వానిదే. మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్‌ చర్చకు రావాలి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేశాం. 18 నెలల్లో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. వంద నియోజకవర్గాల్లో రూ.20 వేల కోట్లతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నాం. యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్సిటీలను స్థాపించాం. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరించాలి. నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలి. ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదంటూ కొందరు వెకిలిగా వ్యాఖ్యానించారు. కానీ 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్ల రైతు భరోసా అందించాం. ఈ అంశంపై మోదీ, కిషన్‌రెడ్డి, కేసీఆర్‌ చర్చకు రావాలి. రైతులకు ఎవరు మేలు చేశారో అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దాం..’ అని ముఖ్యమంత్రి సవాల్‌ చేశారు. కార్యకర్తల ఎన్నికలొస్తున్నాయి.. ‘రాష్ట్రంలో నియోజకవర్గాల పునరి్వభజనతో అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ, 15 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించి అధిష్టానానికి బహుమతి ఇచ్చేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. స్టేజిమీద ఉన్న నాయకుల ఎన్నికలు అయ్యాయి. ఇప్పుడు కార్యకర్తల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం సాధించే బాధ్యత కార్యకర్తలపైనే ఉంది. కార్యకర్తల గెలుపు కోసం పూర్తి సహకారం అందిస్తాం. టిక్కెట్ల కోసం ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదు. బీఫామే ఇంటికి వస్తుంది..’ అని సీఎం అన్నారు. కాగా బహిరంగ సభ అనంతరం ఖర్గే బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు.

AI Helps Couple Get Pregnant After Trying For 18 Years8
పెళ్లైన 18 ఏళ్ల నిరీక్షణకు తెర.. AIతో తల్లిదండ్రులు కాబోతున్న జంట!

వాషింగ్టన్‌: వైద్య చరిత్రలో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) అద్భుతం చేసింది. పెళ్లైన 18 ఏళ్ల తర్వాత మహిళ గర్భం దాల్చేందుకు దారి చూపించింది. త్వరలో ఆమె అమ్మ కాబోతుంది. అంతేకాదు స్టార్‌ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా చరిత్రలో నిలిచారు. ఇంతకీ ఆ ఎవరా? తల్లి.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్న అద్భుత సాధనం. ఏఐతో ఉద్యోగాలకు ఎసరు అని అనుకునే వారికంటే దాని వల్ల మా జీవితాలే మారిపోయాయని సంతోషపడే వారు కోకొల్లలు. అలాంటి వారిలో ఈ మహిళ ఒకరు. వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఆమె పేరు బహిర్గతం చేయలేదు.వివరాల్లోకి వెళితే.. వాళ్లిద్దరూ భార్య,భర్తలు. వివాహం జరిగి 18 ఏళ్లవుతుంది. సంతనాలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానం కోసం ఎక్కని గుడి లేదు. మొక్కని దేవుడు లేడు. సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలో చేయాలో అన్నీ చేశారు. గతంలో అనేక సార్లు ఐవీఎఫ్‌ (In Vitro Fertilization) ద్వారా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. కారణం? ఆమె భర్త అజోస్పెర్మియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నారు. అంటే వీర్యంలో స్పెర్మ్ కనిపించకపోవడం అన్నమాట.అయితే, ఈ నేపథ్యంలో ఆ దంపతులు కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. అక్కడ స్టార్‌(Sperm Tracking and Recovery) అనే ఏఐ ఆధారిత పద్ధతిని ఉపయోగించారు.ఈ పద్దతిలో ఏఐ గంటలో 8 మిలియన్లకు పైగా చిత్రాలను స్కాన్ చేసి, మానవ కంటికి కనిపించని 44 స్పెర్మ్‌లు గుర్తించింది.అలా గుర్తించిన స్పెర్మ్‌లను ఉపయోగించి ఐవీఎఫ్‌ ద్వారా గర్భధారణ జరిపారు. ఈ స్టార్‌ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలవడం గమనార్హం. ఏఐ ఎలా పనిచేస్తుంది?వైద్యులు స్పెర్మ్ నమూనాను ఒక ప్రత్యేక చిప్‌పై ఉంచి హై-పవర్డ్ ఇమేజింగ్ ద్వారా స్కాన్ చేస్తారు. ఏఐ అల్గోరిథం స్పెర్మ్ ఆకారాన్ని, కదలికలను గుర్తించి వాటిని వేరు చేస్తుంది. ఇది సూక్ష్మతతో కూడిన, వేగవంతమైన ప్రక్రియ, మానవ నిపుణులు రెండు రోజులు వెతికినా కనిపించని స్పెర్మ్‌లను ఏఐ ఒక గంటలో కనిపెట్టగలిగింది.వైద్య చరిత్రలో గేమ్‌ చేంజర్‌ఈ స్టార్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డాక్టర్ జెవ్ విలియమ్స్ మాట్లాడుతూ..‘ఇది గేమ్‌ చేంజర్. అమ్మ తనాన్ని నోచుకోలేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది తల్లులకు ఈ ఏఐ టెక్నాలజీ ఓ వరం’ అని అన్నారు.కాగా, ప్రస్తుతం ఈ విధానం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఇలా ఏఐ కేవలం యంత్రాల మేధస్సు కాదు, అది మనిషి ఆశలకు రూపం కూడా కావచ్చనే నానుడిని నిజం చేసింది.

Ferrari zips around Bengaluru for a year without tax made to pay Rs 1 4 cr after RTO steps in9
రూ.7.5 కోట్ల కారు.. బడా బిజినెస్‌మ్యాన్‌ కక్కుర్తి..

రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించకుండా బెంగళూరు వీధుల్లో తిరుగుతున్న ఫెరారీ లగ్జరీ సూపర్ కారును ప్రాంతీయ రవాణా కార్యాలయ అధికారులు పట్టుకున్నారు. ట్యాక్స్‌ కడతావా.. సీజ్‌ చేయమంటావా అని అధికారులు పట్టుబట్టడంతో కారు యజమాని రూ.1.42 కోట్లు చెల్లించాల్సి వచ్చింది.రూ.7.5 కోట్ల విలువైన బ్రైట్‌ రెడ్‌ ఫెరారీ ఎస్ఎఫ్ 90 స్ట్రాడేల్ కారు కొన్ని నెలలుగా బెంగళూరు వీధుల్లో షికారు చేస్తోంది. ఈ లగ్జరీ కారు మహారాష్ట్రలో రిజిస్టర్ అయిందని, అలాంటి వాహనాలపై అక్కడ లైఫ్‌టైమ్‌ ట్యాక్స్‌ రూ.20 లక్షలు ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. ‘మహారాష్ట్రలో ఇలాంటి కార్లపై పన్ను రూ.20 లక్షలు కాగా, కర్ణాటకలో ఇది దాదాపు రూ.1.5 కోట్లు. ఈ వాహనం రెండేళ్ల క్రితం మహారాష్ట్రలో రిజిస్టర్ అయింది’ అని రవాణా అధికారిని ఉటంకిస్తూ పేర్కొంది.జయనగర్ ప్రాంతీయ రవాణా కార్యాలయం (ఆర్టీవో) అధికారులు నగరంలో తరచూ కనిపిస్తున్న ఫెరారీ కారుపై నిఘా పెట్టి పట్టుకున్నారు. డాక్యుమెంట్లు ఇంట్లో ఉన్నాయని డ్రైవర్ తొలుత చెప్పాడు. కారు రిజిస్ట్రేషన్‌ను పరిశీలించిన అధికారులు కర్ణాటక పన్ను చెల్లించకుండా 18 నెలలకు పైగా బెంగళూరులో ఈ వాహనం తిరుగుతున్నట్లు గుర్తించారు. ఏం చేయాలని అధికారులు తమ ఉన్నతాధికారులను సంప్రదించగా బకాయిలు చెల్లించకపోతే వాహనాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో ఫెరారీ కారు యజమాని అదే రోజు పన్నులు, జరిమానాల రూపంలో రూ.1.4 కోట్లు చెల్లించాడు.కాగా ఈ ఖరీదైన ఫెరారీ కారు యజమాని ఓ బడా వ్యాపారవేత్త. దేశంలోని 55 నగరాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్త తక్కువ పన్ను రేటు కారణంగా మహారాష్ట్రలో తన ఫెరారీ కారును రిజిస్టర్ చేయించుకుని బెంగళూరులో తిప్పుతున్నన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, కర్ణాటక నిబంధనల ప్రకారం ఆ రాష్ట్రంలో ఏడాదికి పైగా బయటి రాష్ట్రాల వాహనాలను ఉపయోగించే వారు ఇక్కడ లైఫ్‌టైమ్‌ రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది.పన్ను ఎగవేతకు పాల్పడిన లగ్జరీ కార్ల యజమానులపై బెంగళూరు ఆర్టీవో అధికారులు చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గత మార్చిలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో కర్ణాటక వెలుపల రిజిస్టర్ అయిన హై ఎండ్ వాహనాల నుంచి రూ.40 కోట్ల బకాయిలు వసూలు చేశారు.

AICC Chief Kharge Serious Warning To MLAs At TPCC Meeting10
‘మీలాంటోళ్లను చూసి భయపడం..’ టీపీఏసీ భేటీలో ఖర్గే వ్యాఖ్యలు

గాంధీభవన్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీలో ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలిని తప్పుబడుతూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌, సాక్షి: ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కొందరు ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నలుగురైదుగురు గ్రూపులు కడితే భయపడతాం అనుకుంటున్నారా?. ఇష్టారాజ్యంగా వ్యవహరించే నేతలను నేనూ రాహుల్‌ అసలు పట్టించుకోం. వాళ్ల సంగతి పార్టీ క్రమశిక్షణా కమిటీ తేలుస్తుంది. అందుకే పార్టీ నేతలు ఇష్టానుసారం మాట్లాడొద్దు. పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి ఒకే తాటిపై నిలవాలి’’ అని సున్నితంగా హెచ్చరించారు. మరో సీనియర్‌ నేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా తరచూ వివాదాస్పదంగా వ్యవహరిస్తున్న నేతలకు చురకలంటించారు. ‘‘కాంగ్రెస్‌లో కొంత మంది నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మన ప్రతీ మూమెంట్ ప్రజలు గమనిస్తారు. అందుకే ఆచితూచి వ్యవహరించాలి. మీ వ్యవహార శైలితో పార్టీకి కొత్త నష్టం చేస్తే ఊరుకోం. పార్టీ ఉంటేనే మీరుంటారు. సొంత ఎజెండాతో పనిచేసే వారిపై వేటు తప్పదు. పార్టీ, ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలి. జిల్లాల వారీగా ఆశావహుల లిస్టును పీసీసీ సిద్ధం చేయాలి అని సూచించారు. ఈ మీటింగ్‌ వేదికగా.. పార్టీ పదవులు, ప్రభుత్వ పోస్టుల భర్తీకి కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు ఖర్గే టీపీసీసీకి డెడ్ లైన్ విధించారు. ‘‘ఈ నెల 30 లోపు పోస్టులన్నీ భర్తీ చేయాలి. పదవులు భర్తీ కాకుంటే పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ దే బాధ్యత’’ అని ఖర్గే అన్నారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌ కలగజేసుకుని ఇంచార్జీ మంత్రులు బాధ్యత తీసుకొని పదవుల భర్తీ కోసం లిస్టులు టీపీసీసీ చీఫ్‌కు పంపాలని చెప్పారు. ఆ వెంటనే ఖర్గే మరోసారి ‘పార్టీలో పనిచేసిన వారికి.. అర్హత ఉన్నవాళ్లకే పదవులు ఇవ్వాలి’’ అని సూచించారు. టీపీసీసీ విస్తృత స్థాయి, కార్యవర్గ సమావేశాల్లోనూ ఖర్గే తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రశంసలు గుప్పించారు. మేనిఫెస్టో అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ కృషి అభినందనీయం. హామీలను అమలు చేసే ఏకైక పార్టీగా కాంగ్రెస్ చరిత్రలో నిలిచిపోతుంది. తెలంగాణ లో పరిపాలన బావుంది, పార్టీ కార్యకర్తల పనితీరు బావుంది. పార్టీ మీ అందరికీ ఇచ్చిన పదవులను సద్వినియోగం చేసుకోవాలి. 50 ఏళ్ల క్రితం జరిగిన ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు.. 11 ఏళ్ల వారి పాలనలోని ఎమర్జెన్సీ పరిస్థితులు గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ఖర్గే ప్రసంగించారు. జడ్చర్ల ఎమ్మెల్యేపై పీసీసీ చీఫ్‌ ఆగ్రహంజడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ చీఫ్‌ మహేష్‌ గౌడ్‌ ఆగ్రహంతో ఉన్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని క్రమశిక్షణా కమిటీని పీసీసీ చీఫ్‌ ఆదేశించారు. సోమవారం జరగబోయే క్రమశిక్షణ కమిటీ సమావేశంలో ఈ నోటీసులు జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement
Advertisement