చిర్రెత్తిన యూజర్లు.. క్షమాపణ చెప్పిన వాట్సాప్!
న్యూఢిల్లీ: ఈజీగా చాటింగ్, వీడియో కాలింగ్ యాప్ కోసం ప్రస్తుతం నెటిజన్లకు అందుబాటులో ఉన్న యాప్ వాట్సాప్. కానీ కొన్ని గంటలు వాట్సాప్ నిద్రపోవడంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. దీంతో వాట్సాప్ అధికార ప్రతినిధి తమ యూజర్లకు కలిగిన అసౌకర్యంపై క్షమాపణ చెప్పారు. ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వాట్సాప్ నిద్రపోవడం ఏంటని ఆలోచిస్తున్నారా.. బుధవారం రాత్రి వాట్సాప్ పనిచేయలేదు.
కొన్ని దేశాలకు పగలు కాగా, కొన్ని దేశాలకు అది రాత్రి సమయం. మనం నిద్రపోయినట్లుగా వాట్సాప్ కూడా అప్పుడప్పుడు నిద్రపోతుంది తెలియదా అంటూ జోక్స్ పేలుస్తూ వాట్సాప్ డౌన్, వాట్సాప్ ఈజ్ డౌన్ అని హ్యాష ట్యాగ్స్ తో ఫేస్ బుక్, ట్విట్టర్ లలో నెటిజన్లు తమ కామెంట్లు పోస్టు చేశారు. భారత కాలమానం ప్రకారం రాత్రి సమయంలో వాట్సాప్ వర‍్కింగ్ ఆగిపోవడంతో యాప్ నిద్రపోయిందని ఇతర సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ లలో నెటిజన్లు విపరీతంగా పోస్టింగ్స్ పెట్టారు. ముఖ్యంగా భారత్ తో పాటుగా బ్రెజిల్, అమెరికా, కెనడా దేశాలలో యాప్ పనిచేయలేదు.
అయితే దీనికి కారణాలేంటన్న దానిపై వాట్సాప్ ఎలాంటి వివరణ ఇవ్వలేదు. అయితే ఐఫోన్ యూజర్లు, ఆండ్రాయిడ్ యూజర్లు, మైక్రోసాఫ్ట్ మొబైల్స్ వాడుతున్న వారికి ఈ ఇబ్బందులు తలెత్తాయని మాత్రం చెప్పింది. దాదాపు వంద కోట్లకు పైగా యూజర్లు ఉన్న వాట్సాప్ రెండు గంటల పాటు రెస్పాండ్ కాలేదు. వాట్సాప్ ఓపెన్ చేస్తే కనెక్టింగ్ అని చాలాసమయం డిస్ ప్లే అయిందట. దీంతో సోషల్ మీడియాలో కుళ్లు జోకులు పేలాయి. దీంతో వాట్సాప్ ఒక మెట్టుదిగి యూజర్లను క్షమాపణ కోరింది.