బాని‘సెల్‌’ | Special Story On Smartphone Addicts | Sakshi
Sakshi News home page

బాని‘సెల్‌’

Published Fri, Jun 8 2018 11:59 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

Special Story On Smartphone Addicts - Sakshi

కర్నూలు : కళ్లు.. నిద్రలేవగానే మొదట టైం కోసం సెల్‌ అందుకుంటారు. తర్వాత వాట్సప్‌లో గుడ్‌ మార్నింగ్‌ అంటూ చాటింగ్‌ మొదలై.. ఫేస్‌ బుక్‌లో లైక్‌లు, షేరింగ్‌లు.. గేమ్స్‌.. ఇలా గంటల తరబడి సెల్‌ చూస్తుండటంతో చూపు మందగిస్తోంది.  
చెవులు.. స్మార్ట్‌ ఫోన్‌ మాయలో పడిన వారికి పక్కనొళ్లు పిలిస్తే కూడా వినపడం లేదు.
ముక్కు.. శ్వాస మీద ధ్యాసనే ఉండటం లేదు.  
నోరు.. కుటుంబీకులు, మిత్రులు పక్కనే ఉన్నా స్మార్ట్‌ ఫోన్‌కు బానిసైన వారు నోరు తెరవడమే మానేశారు. అన్నం తినేటప్పుడు కనీసం ఏదీ రుచిగా ఉందా అనే స్పృహ కూడా ఉండటం లేదు.  
చర్మం.. 3జీ, 4జీ పుణ్యమా అంటూ ఇంటర్నెట్‌ స్పీడ్‌ ఎంత పెరిగిందో సెల్‌ బానిసలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నారు. గంటల తరబడి కదలకుండా సెల్‌ ఫోన్‌ ఉపయోగించడంతో చర్మం మొద్దుబారి అనేక రుగ్మతలకు దారిస్తోంది.

ఇలా.. స్మార్ట్‌ ఫోన్‌ మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. స్లో పాయిజన్‌గా మారి ప్రజల ఆయుష్సు తగ్గిస్తోంది. ఆరోగ్యంతో పాటు మానవ సంబంధాలను దెబ్బతీస్తోంది.  కర్నూలు జిల్లాలో స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఓ అంచానా ప్రకారం జిల్లాలో నాలుగు లక్షలకుపైగా స్మార్ట్‌ఫోన్‌ యూజర్లు ఉన్నారు. వీరిలో గంటల తరబడి వాటిని వినియోగిస్తూ సెల్‌ బానిసలుగా మారిపోయారు. పక్కన ఏమి జరుగుతోందో కూడా చూడడం లేదు. పది మందిలో ఉన్న ఒంటరిగానే ఉంటున్నారు. మొబైల్‌ అతి వినియోగంతో అనార్థలే ఎక్కువని, చివరకు మానవ సంబంధాలపైన కూడా ప్రభావాన్ని చూపుతున్నాయని వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఇటీవల ప్రకటించడంతో ఆందోళన మొదలైంది. ఎక్కువసేపు ఫోన్లలో మాట్లాడడం, చాటింగ్‌ చేసే వారిలో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ప్రకటించింది. ఈ తరుణంలో అవసరం మేరకు మొబైళ్లను వినియోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. వినియో గదారు ల్లో మార్పు రాకపోతే   తీవ్ర  పరిణామాలు.

సాధారణ ఫోన్‌ వాడుతున్న ఓ గృహిణికి తన భర్త స్మార్ట్‌ ఫోన్‌ గిఫ్ట్‌గా ఇచ్చాడు.  అప్పటి నుంచి ఆమె నిద్ర మేల్కొని అందులోనే  సీరియళ్లు, సినిమాలు చూస్తోంది. ఆ ప్రభావం ఆమె జీవనశైలిపై పడింది. నిద్ర లేకపోవడంతో పిల్లలను కోపగించుకోవడం.. చిన్న పాటి విషయానికే భర్తతో గొడవ పడటంతరుచూ జరుగుతోంది.    

ఓ ప్రవేటు సంస్థలో పని చేసే ఉద్యోగి రాజేష్‌కు చేయి నొప్పి రావడంతో మొదట టాబెట్లు వాడారు. తగ్గక పోగా మెడ, వెన్ను నొప్పి కూడా తీవ్రమైంది. వెంటనే ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించగా రిపోర్టులు అన్నీ నార్మల్‌గానే వచ్చాయి. డాక్టర్‌ అన్ని వివరాలు తెలుసుకుని మొబైల్‌ను అధిక సమయం వినియోగించడంతోనే నొప్పికి కారణమని చెప్పారు. ఆ తర్వాత ఆ ఉద్యోగి వారం రోజుల పాటు మొబైల్‌ను చాలా తక్కువగా ఉపయోగించడంతో నొప్పి తీవ్రత తగ్గింది.        

కర్నూలు నగరం బుధవారుపేటకు చెందిన దంపతులు నరేంద్ర, పావని ప్రభుత్వ ఉద్యోగులు. వీరి కుమారుడు శ్రీను ఐదో తరగతి చదువుతున్నాడు. ఇటీవల క్లాస్‌లో బోర్డుపై టీచర్‌ రాసే అక్షరాలు కనిపిచండం లేదని తల్లిదండ్రులకు చెప్పడంతో కంటి వైద్యుడికి చూపించారు. సైట్‌ చాలా ఎక్కువగా ఉన్నట్లు పరీక్షలో తేలింది. తరచూ సెల్‌ ఫోన్‌లో గేమ్స్‌ ఆడుతుండటంతోనే చూపు తగ్గినట్లు డాక్టర్‌ చెప్పారు.   

ప్రమాదాలకు మొ‘బెల్‌’ స్మార్ట్‌ ఫోన్లతో అప్పుడప్పుడు మృత్యుగంట మోగుతోంది. స్మార్ట్‌ ఫోన్లను చూస్తూ డ్రైవింగ్‌ చేసేవారి కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసు కుంటున్నాయి. డ్రైవింగ్‌ చేసే సమయంలో సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ, సెల్ఫీలు తీసుకుంటూ కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు.  

చెవులు రింగుమని..వినికిడి సన్నబడి నిరంతరం హెడ్‌ఫోన్లు పెట్టుకొని పాటలు వినడం, సినిమాలు చూడడంతో వినికిడి సమస్యలు తలెత్తుతాయి. హెడ్‌ ఫోన్లలో శబ్ధతరంగాలు నేగరుగా అతి పలుచని కర్ణభేరికి చేరుతుండడంతో వినికిడి సమస్యలు వస్తాయి. వినికిడి శక్తి సాధారణంగా 60–65 డెసిబుల్స్‌ మధ్య ఉంటే ఆరోగ్యం. అయితే హెడ్‌ఫోన్లతో వినికిడి శక్తి 85 డెసిబుల్స్‌కు చేరుతుండడంతో చెముడు వస్తోంది.  

 చూపు మందగిస్తోంది  స్మార్ట్‌ఫోన్‌ విడుదల చేసే బ్లూ వయోలెట్‌ కాంతి కంటి చూపునకు కీలకమైన రెటీనాపై ప్రభావం పడుతుంది. దీంతో కుంటి చూపు క్రమంగా క్షిణించి కళ్లు ఎరువు ఎక్కడం, పొడిబారండం వంటి వాటితో కంటిచూపు మందగించే ప్రమాదం కూడా ఉందని నేత్ర వైద్యులు చెబుతున్నారు.  

యువత..హల్‌‘సెల్‌’ :సెల్‌ ఫోన్‌తో ఎంతటి ఉపయోగాలు ఉన్నాయో.. అంత కంటే అనర్థాలు ఎక్కువని ఇటీవల కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. స్మార్ట్‌ను అధికంగా వినియోగిస్తున్న వారిలో యువతే ఎక్కువగా ఉంటోంది. దీంతో ఆ ప్రభావం యువత హల్‌‘సెల్‌’ చేస్తోంది.
నేటి యువకులు నలుగురిలో ఉన్న సమయంలో కూడా సెల్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడుతున్నప్పుడే సెల్‌ఫోనే ప్రపంచమవుతోంది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ల.. ఇలా సామాజిక మాధ్యమాల్లో వచ్చే విషయాలపై దృష్టి సారిస్తున్నారే కానీ.. పక్కన ఏమి జరుగుతుందో పట్టించుకోవడం లేదు.   
చదువు, కుటుంబం కంటే అధిక సమయం సెల్‌కే కేటాయిస్తుండటం ఆశ్చర్యం కలిగించే అంశం.  
నలుగురితో మాట్లాడేందుకు కూడా ఇష్టపడం లేదు. ఒంటరి జీవితానికి అలవాటు పడుతున్నారు. దీంతో చర్చలు లేకపోవడం విషయ పరిజ్ఞానం తగ్గిపోతోంది.  
స్మార్ట్‌ ఫోన్‌లో అధికంగా అనవసర విషయాలు, గేమ్స్‌కే అధిక సమయం కేటాయిస్తున్నారు.  
బంధువులు ఇంటికొస్తే కూడా వారితో మాట్లడకుండా సెల్‌ ఫోన్‌ చూస్తూ అదే జీవితం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.  
బాత్‌ రూమ్‌కు వెళ్తూ కూడా మొబైల్‌ను వెంట తీసుకెళ్లే ఘనులూ ఉన్నారు. 

వెన్నునొప్పి సమస్యలు

స్మార్ట్‌ఫోన్‌ వినియోగిస్తున్న సమయంలో వెన్నుముకపై ఒత్తిడి పెరుగుతోంది. తల బరువు 4.5 కిలోల నుంచి 5.5 కిలోల బరువు ఉంటుంది. తలను ముందుకు వంచ్చి స్మార్ట్‌ఫోన్‌ చూస్తున్న సమయంలో మెడపై భారం పెరుగుతుంది. 30 డిగ్రీల కోణంలో మెడ వంచినపుపడు వెన్నుముకపై సుమారు 1.6 కిలోల భార పడుతుందని సర్వే చెప్పింది. దీర్ఘకాలంపాటు ఈ స్థాయి భారం పడడం కొనసాగితే వెన్నుపూసలో నడుము నొప్పి  సమస్యలు ఎదురయ్యే సమస్యలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండు గంటలపాటు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించే వారికి ఈ ముప్పు అధికంగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement