Dileepreddy
-
బువ్వ పెట్టేవాడికి భుక్తి దక్కాలి
సాగు ఎలా సాగాలో నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పాలకులు... ఇలా అందరూ చెప్పేవాళ్లే! అసలు రైతును సంప్రదించరు. అతని ఇబ్బందు లేంటి? ఏం కోరుతున్నాడు? ఏయే సంప్రదాయిక తెలివితేటలు నిరాదరణకు గురై కాలగర్భంలోకి జారిపోతున్నాయి... అతన్నడిగి తెలుసుకోవాలని ఎవరికీ పట్టదు. రైతు తాను పండించేది ఎందుకు తినలేకపోతున్నాడు? ఎందుకు తినజాలక పోతున్నాడు? అంతకుమించి ఎందుకు కొనలేకపోతున్నాడు? అని ప్రశ్నించుకోవాలి. వ్యవసాయాన్ని సంస్కరించి రైతును ఆదుకుంటామని పెద్ద ప్రకటనలు చేసే పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఈ పద్ధతి మారాలి.ౖ రెతు కేంద్రకంగా వ్యవసాయ సంస్కరణలు రావాలి. రైతుకు దయనీయ స్థితి రాకుండా చూడటమే మన జాతీయ వ్యవసాయ విధానం కావాలి. ప్రకృతి ఒడిలో, పంచభూతాల సాక్షిగా రైతు నిరంతరం ఆశనే శ్వాసిస్తుంటాడు. అందులో నెరవేరేవి కొన్ని, నీరుగారి నీరసింపజేసేవి కొన్ని! కోటి ఆశలతో భారత రైతాంగం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భమిది! గత కొన్నేళ్లుగా దేశంలో రైతులు ఎదుర్కొంటున్న ఎడతెరిపి లేని సమస్యలకు శీర్షంలా... ఆటుపోట్లను చవిచూపిన 2021 నేటితో ముగు స్తోంది. ఆశలు కల్పిస్తూ 2022 ఆహ్వానిస్తోంది. దేశానికి వెన్నెముక, తిండిపెట్టేవాడు రైతే. జనాభాలో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న అసంఘటిత రంగం వ్యవసాయం. సమస్త జనాభాకు ఆహారాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పరిపుష్ఠిని, పారిశ్రామిక రంగానికి ముడి సరుకుని, తగు విదేశీ మారకాన్నీ అందిస్తున్న కీలక వ్యవసాయ రంగం... పలు కారణాలతో నేడు కుదేలైంది. (చదవండి: ఆధార్‌తో శర (అను) సంధానం) భూతాపోన్నతి వల్ల ‘వాతావరణ మార్పు’ ప్రమాదమై ముంచుకొస్తున్న ప్రకృతి వైపరీత్య తీవ్రత, ఉన్న సమస్యకు తోడైంది. పెట్టుబడి వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి, ఆదాయం రమారమి పడిపోయి, పిల్లల విద్య– వైద్యం–పెళ్లిల్లు వంటి వ్యయభారాలతో క్రుంగి, రైతు కుటుంబాలు ప్రత్యామ్నాయ జీవనోపాధుల వైపు చూసే దుర్దశ! ఎన్ని చేసినా ఆగని రైతు ఆత్మహత్యలు, బలవన్మరణాలు! వ్యవసాయాన్ని సంస్కరించి రైతును ఆదుకుంటామని పెద్ద ప్రకటనలు చేసే పాలకులు ఆచరణలో విఫలమవుతున్నారు. ఎక్కడో తప్ప... ఎన్నికల ముందరి హామీలకు అంతిమంగా సాధించే ఫలితాలకు పొంతన ఉండటం లేదు. సమగ్ర వ్యవసాయ విధాన లోపం ఒకటైతే, ఉన్నవి సవ్యంగా అమలు కాని దురవస్థ మరొకటి! అన్ని ప్రతికూలతల్ని ఎదుర్కొని తృణమో, పణమో పండించినా, చేతికి వచ్చిన పంటకు ధర రాక రైతు నెత్తికి చేతులు పెట్టే దైన్యం! ప్రపంచ వాణిజ్య ఒప్పందాల నీడలో... శాస్త్ర సాంకేతిక బదలాయింపును మించి, కార్పొరేట్ దోపిడి పెరిగి రైతు నడ్డి విరుగుతోంది. ప్రజాస్వామ్యమే అయినా. నిలదీసి రైతులు వ్యవ సాయ అనుకూల విధానాలను సాధించుకోలేకపోతున్నారు. పైగా ప్రతికూల విధానాల్ని ఎదురించి పోరాటాలే చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో నిరసన తెలిపినందుకే, విచ్ఛిన్న శక్తులని, దేశద్రోహులని, నక్సలైట్లని, ఉగ్రవాదులని అపవాదు మోయాల్సి వస్తోంది. ఇదీ నేటి వ్యవసాయ భారతావని! అడుగడుగున సవాళ్లు, అదే మోతాదులో అవకాశాలూ ఉన్నాయి. అమలుకు చిత్తశుద్ది ఉండాలి! రాబడి పెంచాలి... రైతు రాబడి రెట్టింపు చేస్తామన్నది ఎన్నికల హామీ! ఆ దిశలో నిర్దిష్ట చర్యలే లేవు. పైగా, అసమగ్ర విధానాలు, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయ లోపం వల్ల మరింత దిగజారిన పరిస్థితి! ‘నువ్వు కారణమం’టే, ‘కాదు నువ్వు’ అనే కాట్లాటల్లో నలుగుతున్న లేగదూడ రైతాంగం. గిట్టుబాటు ధర గణించడమే అశాస్త్రీయం! ప్రకటించింది కూడా లభించక, కడకు ధాన్యం కొనే దిక్కే లేక... కల్లాల్లోనే రైతులు కాలం చేయటం, మార్కెట్ ముంగిట ధాన్యరాశుల మీద రైతు అసువులు బాయటమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం! అర్థ శతాబ్ది కిందటి ‘హరిత విప్లవం’ అధిక ఉత్పత్తి సాధించిందన్న మాటే గాని, మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేసింది. కట్టడి లేని ‘వ్యవసాయ రసాయనీకరణ, విత్తన సంకరీకరణ’ స్థూలంగా దేశ వ్యవసాయ ప్రక్రియపైనే కోలుకోలేని దెబ్బ కొట్టింది. విత్తనాల నుంచి, విష రసాయన ఎరువులు, ప్రమాదకర క్రిమిసంహారకాలు పెట్టుబడి వ్యయాన్ని అసాధారణం చేశాయి. (చదవండి: ప్రత్యామ్నాయ పంటలకు మళ్లాల్సిందే కానీ...) మద్దతు ధర సంగతి మరచి పోయినా, కనీస గిట్టుబాటు ధర కూడా లభించక రైతాంగం ఆర్థికంగా అతలాకుతలమౌతోంది. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో తగినన్ని అప్పులు దొరక్క అధిక వడ్డీకి ప్రయివేటు రంగంలో తెచ్చే అప్పుల ఊబీ, రైతును లోనికి లాక్కొని తుదముట్టిస్తోంది. ఉత్పత్తుల్ని మార్కెట్‌కు తీసుకువెళితే నిలువ చేసే వసతి, శీతల గిడ్డంగులు, మద్దతు ధర ఇప్పించే వ్యవస్థలు లేక రైతు ఆల్లాడుతున్నాడు. కొనుగోళ్లకు భరోసా ఇచ్చే మార్కెట్ వ్యవస్థ లేదు. రైతు రాబడి పెంచాలంటే, నిర్దిష్ట చర్యలతో ఆస్కారముంది. రసాయన ఎరువులు–క్రిమిసంహారకాలు– కలుపు నివారకాల్ని వదిలేసి, సహజ–సేంద్రియ వ్యవసాయ పద్దతుల ద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలి. జాతీయ ఉపాధి హామీ కార్యక్రమాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి. క్రమంగా భూసారాన్ని మెరుగు చేసి దిగుబడి పెంచుకోవాలి. పంటకు తగిన ధర లభించేలా చూడాలి. ఇప్పుడున్నట్టు కాక, పూర్తి భిన్నంగా.... పెట్టుబడి ముడిసరుకును టోకు ధరలకు రైతు కొనేలా, తన పంటను చిల్లర ధరకు విక్రయించేలా రైతులో, రైతు సంఘాలో, సహకార వ్యవస్థలో చూసుకుంటే వ్యవసాయ రాబడి పెరుగుతుంది. (చదవండి: నవచరిత్రగా... రైతు విజయగాథ) సర్కార్ల సమన్వయం కీలకం వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమని రాజ్యాంగం చెబుతోంది. కానీ, వ్యవసాయ ప్రక్రియను ప్రభావితం చేసే చాలా అంశాలు కేంద్ర జాబితాలో ఉన్నాయి. ఉమ్మడి జాబితాతో లంకెగల కొన్ని అంశాల ఆసరాతో, కేంద్రం రాష్ట్రాలపై పెత్తనం చేసే సందర్భాలూ ఉంటాయి. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్దమని రాష్ట్రాలు విమర్శిస్తుంటాయి. మొన్న అమలై–రదై్దన మూడు వ్యవసాయ చట్టాలు అలాంటివే! అందుకే, మొత్తంగా ఆ చట్టాలు రద్దవడానికి ముందే, పలు రాష్ట్రాలు సొంతంగా చట్టాలు తెచ్చుకొని, సదరు కేంద్ర చట్టాల ప్రభావం లేకుండా చేశాయి. దేశం నైసర్గికంగా, వాతావరణపరంగా పలు వ్యవ సాయ జోన్లుగా విడిపోయి ఉన్నందున, ఎక్కడికక్కడి ప్రాధాన్యతలు, పరిస్థితుల్ని బట్టి రాష్ట్రాల వారిగా వ్యవసాయ విధానాల అమలే మంచిది! అయితే, మార్కెటింగ్, ఆహార సరఫరా–పంపిణి, దిగు మతి–ఎగుమతులు, ఆహారభద్రత, పౌరసరఫరాలు–ప్రజా పంపిణీ వంటి పలు ప్రభావక అంశాల దృష్ట్యా ‘వ్యవసాయ జాతీయ స్థూల విధానం’ఉండాలంటారు. వ్యవహారకర్తలుగా రాష్ట్రాలుండి, సదరు విధానాన్ని సమన్వయపరిచి, సౌకర్యాలు కల్పిస్తూ కేంద్రం మద్దతి వ్వాలని ‘భారత రైతు సంఘాల పరిషత్’ (సిఫా) అభిప్రాయపడింది. గురువారం హైదరాబాద్‌లో సమావేశమైన పరిషత్ పలు అంశాలు చర్చించి, భవిష్యత్ కార్యాచరణకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. (చదవండి: రాజకీయ సంకల్పంతోనే.. కనీస మద్దతు ధర సాధ్యం) ఒకటికొకటి విరుద్ధం కాదు... తోడవ్వాలి! సాగు ఎలా సాగాలో నిపుణులు, శాస్త్రవేత్తలు, అధికారులు, పాల కులు... ఇలా అందరూ చెప్పేవాళ్లే! అసలు రైతును సంప్రదించరు. అతని ఇబ్బందులేంటి? ఏం కోరుతున్నాడు? ఏయే సంప్రదాయిక తెలివితేటలు నిరాదరణకు గురై కాలగర్భంలోకి జారి పోతున్నాయి... అతన్నడిగి తెలుసుకోవాలని ఎవరికీ పట్టదు. రైతు తాను పండించేది ఎందుకు తినలేకపోతున్నాడు? ఎందుకు తినజాలక పోతున్నాడు? అంతకు మించి ఎందుకు కొనలేకపోతున్నాడు? అని ప్రశ్నించుకోవాలి. లోపభూయిష్ట ఆహార పంపిణీ వ్యవస్థ వల్ల... ఒక ఊళ్లో పండే పంటను నేరుగా అక్కడి వినియోగదారులు కొని, తినే పరిస్థితి ఉండదు. గ్రామం నుంచి టౌన్, అక్కడ్నుంచి రాజధాని, తిరిగి టోకు వ్యాపారుల ద్వారా టౌన్‌కు, చిల్లర వర్తకుల ద్వారా అదే గ్రామానికి, రెట్టింపు ధరతో వచ్చినపుడు ఆ గ్రామస్తులు కొంటుంటారు. ఈ పద్దతి మారాలి. ఎక్కడికక్కడ ఆహార సరఫరా విధానాన్ని అనుసరిస్తే, పలు ప్రయోజనాలు! నేల చదును, విత్తన శుద్ధి నుంచి ఆహార వినియోగం వరకు రైతుకు కొంత సంప్రదాయిక పరిజ్ఞానం ఉంటుంది. సదరు జ్ఞానానికి ఆధునిక శాస్త్ర–సాంకేతికత తోడైతే అద్భుతమైన ఫలితాలుం టాయి. ప్రపంచ వాణిజ్య ఒప్పందంలో భాగమైనపుడు... మన వ్యవ సాయోత్పత్తుల నాణ్యత–ఆమోదం పెంచుకోవడం, అంతర్జాతీయ పోటీని తట్టుకోవడం, ఎగుమతుల వృద్ధి ముఖ్యం! రైతు కేంద్రకంగా వ్యవసాయ సంస్కరణలు రావాలి. విశ్వనరుడు గుర్రం జాషువా అన్నట్టు, ‘వాని రెక్కల కష్టంబు లేనినాడు/సస్యరమ పండి పులకించ సంశయించు/ వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు/భోజనము పెట్టు, వానికి భుక్తి లేదు’ (గబ్బిలం) అన్న దయనీయ స్థితి రైతుకు రాకుండా చూడటమే మన జాతీయ వ్యవసాయ విధానం కావాలి. - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఆధార్‌తో శర (అను) సంధానం
పార్లమెంటులో ఎన్నికల చట్టం (సవరణ) బిల్లు వేగంగా ఆమోదం పొందింది. మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకోవడంపై విమర్శలు తలెత్తు తున్నాయి. బిల్లులో ప్రతిపాదించిన ‘ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించడం’పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.మంచి ప్రతిపాదనలతో వచ్చిన సవరణ బిల్లును, అందరి అంగీకారంతో ఆమోదింపజేసేందుకు పాలకపక్షం చొరవ తీసుకొని ఉండాల్సింది. మరోవైపు ఆయా పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం, నిధుల వివరాలు, బాండ్ల ప్రక్రియ... ఇలా అన్ని సంస్కరణలూ ఫలితమివ్వకుండా ఒట్టిపోతున్నాయి. తాజా అనుసంధానంతో పాటు ఎన్నికల సంస్కరణలన్నీ ఆచరణలో మరింత పదునుదేలి, ఫలితాలిస్తేనే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజలకు ప్రయోజనం. దేశంలో ఎన్నికల సంస్కరణల మందకొడి తనానికి విరుద్ధంగా పార్లమెంటులో ఎన్నికల చట్టం (సవరణ) బిల్లు వేగంగా ఆమోదం పొందింది. ప్రవేశపెట్టాక నిమిషాల్లోనే లోక్‌సభలో ప్రక్రియ పూర్తయితే, ఉభయసభల్లో కలిపి 48 గంటల్లోనే బిల్లుకు ఆమోదం దొరికింది. చట్టసభల స్ఫూర్తి, సంప్ర దాయం, మర్యాదల్ని గాలికొదిలి సాధించిన ఈ వేగం మంచిదా? అన్న చర్చ తెరపైకొస్తోంది. ముసాయిదా అంశాల్ని సభల్లో చర్చించ కుండా, స్థాయీ సంఘానికి పంపాలన్న విపక్ష డిమాండ్ పట్టించు కోకుండా, విభజన వినతిని వినకుండా మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకోవడంపై విమర్శలు తలెత్తుతున్నాయి. ఇక, బిల్లులో ప్రతిపాదించిన ‘ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానించడం’పై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ‘ఇది నిర్బంధమేమీ కాదు, ఓటర్ల ఐచ్ఛికం మాత్రమే!’ అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, బిల్లు లోని అంశాల్ని బట్టి ఇది పూర్తిగా ఐచ్ఛికం కాదని తెలుస్తోంది. తప్పని సరి కాదంటున్నా, తగిన కారణాలుంటే తప్ప ఆధార్ అనుసంధాన పరచకుండా ఒక పౌరుడు కొత్తగా ఓటు నమోదు చేయలేడు, పాత ఓటరు పునరుద్ధరణా చేసుకోలేడన్నది బిల్లు మతలబు! ఆ ‘తగిన కారణాల్ని’ తర్వాత కేంద్రమే నిర్ణయిస్తుంది. దీనిపైనే విపక్షాలకు అభ్యంతరాలున్నాయి. ఒక పౌరుడు, ఆధార్ వివరాలివ్వదలచుకోనందునో, ఇవ్వలేక పోతున్నందుకో కొత్త ఓటరు నమోదును గానీ, పాత ఓటు పునరుద్ధరణను కానీ ఎన్నికల సంఘం నిరాకరించజాలదని కేంద్రం చెబుతోంది. ఈ విషయంలో కొంత అస్పష్టత, సందిగ్ధత ఉన్నాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన, బోగస్ ఓట్లు ఏరివేయటం వంటి లక్ష్యాల సాధనకు ఉద్దేశించిన బిల్లు వివాదాస్పదమవడమే దురదృష్ట కరం! ఓటరు జాబితా–ఆధార్ అనుసంధానంతో పాటు, ఏటా 4 సార్లు విభిన్న గడువు తేదీలతో కొత్త ఓటర్ల నమోదు, సర్వీస్ ఓటర్ల విషయంలో ఇప్పుడున్న లింగ వివక్షను తొలగించడం వంటి మంచి ప్రతిపాదనలతో వచ్చిన సవరణ బిల్లును, అందరి అంగీకారంతో ఆమోదింపజేసేందుకు పాలకపక్షం చొరవ తీసుకొని ఉండాల్సింది. విస్తృత సంప్రదింపులు జరిపి, పార్లమెంటులో లోతైన చర్చకు ఆస్కారం కల్పించి ఉంటే ప్రజస్వామ్య స్ఫూర్తి నిలిచేది. బహుళ నమోదులకు చెక్! ‘నీవు ఎక్కదలచుకున్న రైలు జీవితం కాలం లేటు’ అని ఆరుద్ర అన్నట్టు మన దేశంలో ఎన్నికల సంస్కరణలు ఎప్పుడూ ఆలస్యమే! ఎంతోకాలం బాకీ పడ్డ తర్వాత కానీ అవి రావు. ఆలస్యంగా వచ్చి కూడా వెంటనే అమలుకు నోచుకోవు! ఒకే వ్యక్తి వేర్వేరు నియోజక వర్గాల పరిధిలో ఓటరుగా ఉంటున్న ఉదంతాలు దేశంలో కొల్లలు! విడతలుగా జరిగే ఎన్నికల్లో వీరు రెండేసి చోట్ల ఓటు హక్కును వినియోగించుకొని, ప్రజాస్వామ్య స్ఫూర్తికి గండికొడుతున్నారు. తెలుగు నాట ఇది తరచూ కళ్లకు కట్టేదే! పకడ్బందీగా దీన్ని పరిహరించి, ఒక వ్యక్తికి ఒకే ఓటును శాస్త్రీయంగా పరిమితం చేసే ఓటరు జాబితాల ప్రక్షాళనకి ఎన్నికల సంఘం–కేంద్రం పూనుకున్నాయి. ఓటరు జాబి తాని ఆధార్‌తో అనుసంధానించడమే ఇందుకు మేలైన పరిష్కారమని తాజా బిల్లు తెచ్చాయి. పౌరసత్వం లేని వారూ ఓటర్లుగా ఉండటం పట్ల పాలకపక్షం బీజేపీకి అభ్యంతరాలున్నాయి. బంగ్లాదేశ్, నేపాల్, వంటి పొరుగుదేశాల నుంచి అక్రమంగా వచ్చిన, దేశపౌరులు కాని వారిని ఓటు బ్యాంకులుగా అనుభవించేందుకే విపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ఈ బిల్లును వ్యతిరేకిస్తోందని పాలకపక్షం ఎదురుదాడి చేస్తోంది. విపక్షాలు మాత్రం, ఎన్నికల సంస్కరణల్లో కీలకమయ్యే బిల్లును కేంద్రం ఎందుకింత హడావుడిగా తెచ్చింది? అంటున్నాయి. తొందర వెనుక దురుద్దేశాల్ని శంకిస్తున్నాయి. అనుసంధానం తప్పని సరి కాదు, ఐచ్ఛికం అంటున్నప్పటికీ... వద్దనుకునే పౌరులు ఏ పరిస్థితుల్లో నిరాకరించవచ్చో బిల్లులో లేకపోవడం లోపం! పైగా, అందుకు ‘తగిన కారణాలు’ ఉండాలనటం, వాటిని కేంద్ర నిర్ణయానికి వదలటంపైనే సందేహాలున్నాయి. అలా నిర్ణయించే కారణాలు, పౌరుల అప్రతిహతమైన ఓటుహక్కును భంగపరచవచ్చన్నది భయం! ఈ అనుసంధానం వ్యక్తుల గోప్యత హక్కుకు విఘ్నమని, ఫలితంగా ఆధార్‌లో పొందు పరచిన పౌరుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగ మయ్యే ఆస్కారముందని వారు సందేహిస్తున్నారు. ఆధార్ ప్రామాణికతపైనే.. దేశంలో కోట్ల రూపాయలు వెచ్చించి, ప్రత్యేక గుర్తింపు కార్డు వ్యవస్థ ఏర్పరిచారు. 95 శాతానికి పైబడి జనాభాకు ఆధార్ ఇప్పించినప్పటికీ, నిర్దిష్టంగా దేనికీ తప్పనిసరి చేయలేని పరిస్థితి! అలా చేయడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం అనుమతించడం లేదు. సంక్షేమ కార్యక్రమాల్లో దుబారాను, దుర్వినియోగాన్ని నిలువరించేందుకు ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియకు పలుమార్లు ఎదురుదెబ్బలే తగిలాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, వేరయ్యాక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ చేపట్టినా, అర్ధంతరంగా ఆపాల్సి వచ్చింది. లక్షల్లో ఓట్లు గల్లంతవడం పట్ల పౌర సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆర్టీఐ దరఖాస్తులతో సమాచారం సేకరించినపుడు, ఈ ఓట్ల తొలగింపు–చేర్పు ప్రక్రియ ఇల్లిల్లూ తిరిగి జరిపింది కాదని తేలింది. రాజకీయ పక్షాల ప్రమే యంతో, ఎక్కడో కూర్చొని మూకుమ్మడిగా జరిపినట్టు ఆధారాలతో తప్పుల్ని నిరూపించడంతో, లోపాల్ని ఎన్నికల సంఘమే అంగీకరించాల్సి వచ్చింది. ‘ఇప్పటికిప్పుడు మేమైనా ఏమీ చేయలేమ’ని ఎన్నికల సంఘమే చేతులెత్తడం విమర్శలకు తావిచ్చింది. ఈ దశలోనే, సుప్రీంకోర్టు కల్పించుకొని, సదరు ప్రక్రియ నిలుపుదలకు ఆదేశిం చింది. పైగా ఆధార్ సమాచార ప్రామాణికతపైనే ఎన్నో సందేహాలు న్నాయి. పౌరులు ఆధార్ నమోదు సమయంలో ఇస్తున్న సమాచారం సరైందా? కాదా? తనిఖీ చేసి, ధ్రువీకరించుకునే వ్యవస్థ ‘భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ’(యుఐడిఎఐ) వద్ద లేదు! ఈ లోపాన్ని అలహాబాద్, కలకత్తా హైకోర్టులతో పాటు వేర్వేరు సందర్భాల్లో సుప్రీంకోర్టు కూడా గుర్తించి, తప్పుబట్టాయి. అనుసంధానం వల్ల ఆధార్‌లోని పౌరుల వ్యక్తిగత సమాచారం వెల్లడై, రాజకీయ పక్షాలు ‘ప్రొఫైలింగ్’ చేసే ఆస్కారం ఉంటుంది. ఇది పౌరుల గోప్యతా హక్కుకు భంగం. తమ పరిధి ఓటర్లైన, ఏయే సామాజిక వర్గాల వారు, ఎలాంటి సంక్షేమ పథకాల కింద, ఎంతేసి లబ్ది పొందుతున్నారో అభ్యర్థులు, పార్టీలు తెలుసుకోవచ్చు! తద్వారా వారిని లక్ష్యం చేసి ప్రచారం జరుపడం, ప్రభావితం చేయడం, వశపరచుకోవడం వంటి అకృత్యాలకు ఆస్కారముంటుంది. ఇది పాలకపక్షాలకు సానుకూలాం శమై, పోటీదారుల మధ్య వివక్షకు తావిస్తుంది. లోగడ పుదుచ్చేరిలో ఇలా జరిగినపుడు చైన్నై హైకోర్టు తప్పుబట్టింది. సంస్కరణలింకా నిగ్గుతేలాలి! ‘నోటా’ పోరాట యోధులు ఇప్పుడెక్కడున్నారో? ‘పోటీలోని అభ్యర్థు లెవరికీ తాను ఓటేయజాల’ అని చెప్పడమే నోటా! పెద్ద పోరాటం తర్వాత, సుప్రీంకోర్టు అనుమతితో 2013 నుంచి సంక్రమించిన ఈ ప్రక్రియ, ఇంకా నికర లాభాలివ్వలేదు. ఎన్నికల వ్యయాన్ని నియం త్రించే వ్యవస్థలన్నీ ఇప్పుడు నామమాత్రమయ్యాయి. ఎన్నికల సంఘం విధించే పరిమితికి మించి వ్యయం చేసే వారెందరో ఉన్నా, దొరకటం లేదు. ఆ కారణంగా ఎవరూ అనర్హులు కావటం లేదు. రాజకీయాల్లోకి నేరస్తులు రాకుండా అడ్డుకునేందుకు చేసిన సంస్క రణలు ‘నిర్దిష్టత’ కొరవడి నీరసిస్తున్నాయి. కేంద్ర సమాచార కమిషన్, సుప్రీంకోర్టు చెప్పినా... తాము ‘పబ్లిక్ అథారిటీ’ కాదని రాజకీయ పక్షాలు చేస్తున్న పిడివాదంతో పారదర్శకత లోపించి పార్టీలపరమైన సంస్కరణలు కుంటుపడుతున్నాయి. ఆయా పార్టీల్లో అంతర్గత ప్రజా స్వామ్యం, నిధుల వివరాలు, బాండ్ల ప్రక్రియ... ఇలా అన్ని సంస్కర ణలూ ఫలితమివ్వకుండా ఒట్టిపోతున్నాయి. సగటు ఓటరుకు ఎన్ని కలపైనే విశ్వాసం సడలుతోంది. తాజా అనుసంధానంతో పాటు ఎన్ని కల సంస్కరణలన్నీ ఆచరణలో మరింత పదునుదేలి, ఫలితాలిస్తేనే ప్రజాస్వామ్యానికి బలం. ప్రజలకు ప్రయోజనం. - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
అల వచ్చేసింది... అలర్ట్!
మూడో అల ఉంటుంది – ఉండదు, ఉన్నా ఇప్పుడే రాదు – ఇంకా సమయం పడుతుంది, వస్తుంది – కానీ, పెద్దగా ప్రభావం ఉండదు... ఇలా భిన్న వాదనలు ఇన్నాళ్లూ వినిపించినా, వచ్చేసినట్టే అని అత్యధికులు అంగీకరిస్తున్నారు. రెండో అల ఉధృతికి, మూడో అల పుట్టుకకు కారణమైన ప్రభుత్వాలు, పౌరుల నిర్లక్ష్యమే కొంప ముంచింది. తాజా అల తీవ్రతను నియంత్రణలో ఉంచేది పౌర సమాజమే! నాణ్యత కలిగిన మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని విధిగా పాటించడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచుకోవడం మన నిరంతర ప్రవర్తన కావాలి. జీవన సంస్కృతిలో ఇదొక భాగమవాలి. కోవిడ్–19 రెండో అల సమిసిపోకముందే, మూడో అల ముంచుకువస్తోంది. పలు ప్రపంచ దేశాల్లో, మన దేశంలో, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇవే పరిస్థితులు నెలకొంటున్నాయి. అధ్యయనాలే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల్లో... తాజా కేసులు, పాజిటివిటీ రేటు, వైరస్ పునరుత్పత్తి (ఆర్–ఫ్యాక్టర్) విలువ పెరుగుతున్న తీరు ఇదే చెబు తోంది. జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేస్తోంది. పటిష్ట చర్యలతో వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని సూచిస్తోంది. రానున్న పండుగలు, ఉత్సవాల సందర్భంగా జనం పెద్ద సంఖ్యలో గుమిగూడకుండా ముందే కట్టడి విధించాలని నిర్దేశించింది. భయపడొద్దు, భద్రంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని పౌర సమాజాన్ని శాస్త్రవేత్తలు, వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూడో అల ఉంటుంది– ఉండదు, ఉన్నా ఇప్పుడే రాదు– ఇంకా సమయం పడుతుంది, వస్తుంది–కానీ, పెద్దగా ప్రభావం ఉండదు.... ఇలా భిన్న వాదనలు ఇన్నాళ్లూ వినిపించినా, వచ్చేసినట్టే అని అత్యధికులు అంగీకరిస్తు న్నారు. వ్యాధి వ్యాప్తి వేగం కూడా అంచనాలకు మించి ఉంటోంది. ముఖ్యంగా డెల్టా వైవిధ్యం తాజా విధ్యంసానికి కారణమని సర్వత్రా నిర్ధారణ అవుతోంది. ఇది మరో వైవిధ్యం కింద రూపాంతరం చెందితే... ఇంకా ప్రమాదమంటున్నారు. భారత్‌తో పాటు చైనా, బ్రెజిల్, అమెరికా, ఇండోనేషియా, ఇరాన్ వంటి దేశాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చైనాలో డెల్టా తాజా విధ్వంసానికి కఠినతర ఆంక్షలు మొదలయ్యాయి. అమెరికా, కెనడాలో కేసులు పెరిగాయి. మన దేశంలో తాజా అల ప్రభావం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, ఎప్పుడు తీవ్ర స్థాయి... అనే కాలమానంపై భిన్నాభిప్రాయాలు న్నాయి. మొత్తమ్మీద ప్రపంచంలోని 130 దేశాల్లో డెల్టా తాజా వైవిధ్యమే వ్యాధి వ్యాప్తికి ముఖ్య కారణం. మహమ్మారి మొదలైన ప్పటి నుంచి ప్రపంచంలో కోవిడ్ వైరస్ సోకిన వారి సంఖ్య 20 కోట్లు (2.6 శాతం ప్రపంచ జనాభా) దాటింది. ఆశించినంత వేగంగా టీకా ప్రక్రియ (వాక్సినేషన్) జరుగక, అంచనా వేసిన స్థాయిలో సామూహిక రోగనిరోధకత పెరుగక... అలమటిస్తున్న భారత్ వంటి వ్యవస్థల్లో పౌరసమాజమే మూడో అలను సమర్థంగా ఎదుర్కొవాలి. వ్యాప్తి పెరుగుతోంది కరోనా వ్యాధి వ్యాప్తిని పెంచుతున్న వైరస్ పునరుత్పత్తి (‘ఆర్’ ఫ్యాక్టర్) రేటు ప్రమాదకరమైన ఒకటి (1) దాటుతోంది. వ్యాధి సోకిన ఒకరు సగటున ఎంతమందికి వ్యాప్తి చేస్తున్నారనేది దీనిపైనే ఆధార పడుతుంది. ఇది ఒకటి లోపైతే వ్యాధి వ్యాప్తిని నిరోధించి, తాజా కేసుల సంఖ్యను పరిమితం చేయవచ్చు. పాజిటివిటీ రేటు పెరుగు దలకు ఇదే కారణం. దేశంలోని 10 రాష్ట్రాల్లో, 46 జిల్లాల్లో çపరిస్థితి తీవ్రంగా ఉంది. పరీక్షించిన వారిలో పది శాతం మందిపైనే కోవిడ్ నిర్దారణ (పాజిటివిటీ రేటు) అవుతోందని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కోవిడ్ టాస్క్‌ఫోర్స్ బృంద నేత వి.కె.పాల్ కథనం ప్రకారం, ‘ఆర్’ వ్యాల్యూ 0.6 లోపుంటే, వ్యాధి వ్యాప్తిని అదుపులో ఉంచొచ్చు. కానీ, దేశంలోని పది రాష్ట్రాల్లో ఈ సగటు 1 పైనే ఉంది. ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాలు 1కి దగ్గర్లో ఉన్నాయి. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మాథమెటికల్ సైన్స్ (ఐఎమ్మెస్) నివేదిక ప్రకారం ముంబై, పుణే మినహా దేశంలోని అన్ని మెట్రో నగరాల్లోనూ ఇది 1 ని మించింది. ‘మూడో అల’కిదే సంకేతం, అంచనా కన్నా ముందే, కేరళలో తాజా అల ప్రవేశించినట్టే లెక్క’ అని వైరాలజిస్టుల వ్యాఖ్య! దేశంలో రెండో అల విధ్వంసం సృష్టించిన ఎక్కువ కాలం, దేశ సగటు ‘ఆర్’ వ్యాల్యూ 1 పైనే ఉంది. గత ఫిబ్రవరి 14 నుంచి, మే 7 వరకు 1+ ఉన్న పునరుత్పత్తి విలువ తర్వాత క్రమంగా 1 కన్నా తక్కువకు పడిపోయింది. అందుకే, రెండో అల బలహీనపడింది. జూలై ఆఖరు నుంచి మళ్లీ పెరిగింది. మిచిగాన్ విశ్వవిద్యాలయం వారు ఇది ముందుగానే అంచనా వేశారు, దాన్ని ఐఎమ్మెస్ నిర్దారించింది. ఫలితంగా, దేశంలో రోజువారీ సగటు కొత్త కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. రెండు రోజులు వరుసగా, రోజూ నలభైవేలకు పైగా (గురువారం 42,982) కేసులు నమోదయ్యాయి. రోజువారీ మృతుల సంఖ్య 500 దాటుతోంది. హైదరాబాద్, కాన్పూర్ ఐఐటీలకు చెందిన నిపుణుల బృంద అధ్యయనం ప్రకారం మూడో అల, మూడు నెలల కాలానికి (ఆగస్టు–అక్టోబర్) విస్తరించి ప్రభావం చూపుతుంది. తీవ్ర స్థితిలో రోజూ సగటున లక్ష కేసుల వరకు వెళ్లవచ్చని, ఇప్పుడున్న డెల్టా వైరస్ వైవిధ్యం మరో రూపు సంతరించుకుంటే 1.4 లక్షల వరకు వెళ్లవచ్చనే అభిప్రాయం ఉంది. రెండో అల తీవ్రంగా ఉన్నపుడు, గత మే నెలలో ఒకేరోజు కొత్త కేసుల సంఖ్య 4 లక్షలకు చేరడం చూశాం. టీకా ప్రక్రియ పుంజుకుంటేనే... ఉత్పత్తి పెంచుతున్నామని చెప్పినా, ఇతర కంపెనీల టీకాలకూ దేశంలో అనుమతించాం అంటున్నా... టీకాల ప్రక్రియ వేగం పుంజు కోలేదు. సగటున రోజూ 40 లక్షలకు కొంచెం అటిటుగా టీకాలి స్తున్నారు. దేశంలో ఇప్పటివరకు 48.8 కోట్ల టీకాలిచ్చినట్టు కేంద్రం చెప్పింది. రెండు డోసులు పడ్డవారి సంఖ్య 12 కోట్ల లోపే! దేశంలో ఇంకా 62 శాతం మందికి కనీసం ఒక డోసు కూడా అందలేదు. 18 ఏళ్ల లోపు వారిని పక్కన పెట్టినా, 90 కోట్ల మందికి రెండు డోసుల టీకా లివ్వాలి. కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపినట్టు లక్ష్యాల్ని చేరుకునేలా లేదు. ఏడాది చివరినాటికి, వయోజనులందరికీ టీకా సాధ్యపడక పోవచ్చు. సగటున రోజూ కోటి మందికి టీకా ఇవ్వగలిగితే సాధ్యం! కానీ, ఉత్పత్తి ఆ స్థాయిలో లేదు, నిర్వహణ అంతంతే! నెలకు 11 కోట్ల డోసుల నుంచి, వచ్చే డిసెంబరు తర్వాత కోవిషీల్డ్ ఉత్పత్తి సామర్థ్యం 12 కోట్ల డోసులకు, కోవాక్సిన్ ఉత్పత్తి నెలకు 2.5 కోట్ల నుంచి 5.8 కోట్ల డోసులకు పెరుగనున్నట్టు కేంద్రం చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా టీకా ప్రక్రియ ఏకరీతిలో లేదు. సంపన్నదేశాలు అధికశాతం తమ జనాభాకు రెండు డోసుల టీకాలిచ్చుకొని ‘బూస్టర్’ డోసు గురించి యోచిస్తుంటే, పేద, వెనుకబడిన దేశాలు ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయి. మూడో వంతు దేశాలు తమ ఒక శాతం జనాభాకు కూడా రెండు డోసుల టీకాలివ్వలేకపోయాయి. ప్రపంచ బ్యాంకు జాబితా సంపన్న దేశాల్లో, సగటున ప్రతి 100 మందికి 101 చొప్పున టీకా డోసులు పడ్డాయి. అందుకే, ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘బూస్టర్ డోస్’పై మూడు మాసాల మారిటోరియం విధించాలని నిర్ణయించింది. పేద దేశాల వైపు పంపిణీ, సరఫరా పెంచండని టీకా ఉత్పత్తిదారులకూ సూచించింది. ‘అల’ అదుపు జనం చేతిలో... సామూహిక రోగనిరోధకత ఇప్పుడప్పుడే సాధ్యపడేలా లేదు. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) వెల్లడించిన, తాజా సెరో సర్వే ఫలితాలు ఇదే ధ్రువీకరిస్తున్నాయి. దేశంలో 67 శాతం (ఆరేళ్ల వయసు పైబడిన) జనాభాకు కోవిడ్ వచ్చి వెళ్లినట్టు ఈ నమూనా అధ్యయనంలో వెల్లడైంది. 70 శాతం మందిలో యాంటీబాడీలు ఏర్పడితే సామూహిక రోగనిరోధకత వస్తుందని మొదట భావించినా, అది 85 శాతం మందిలో ఉండాలని కొత్తగా చెబుతున్నారు. ఇప్పుడ ప్పుడే ఇది సాధ్యపడకపోవచ్చు. మనకున్న వైద్య సదుపాయాల వ్యవస్థ ఎంత లోపభూయిష్టమో రెండో అల ఎత్తిచూపింది. ఈ ఏడాది మొదట్లో మన దేశంలో, ఇంకా ఐరోపా, అమెరికా, కెనడాలలోనూ ‘కోవిడ్ తగ్గిందిలే!’ అని కట్టడిని సడలించారు. దాంతో, జనం విచ్చల విడిగా వ్యవహరించారు. రెండో అల ఉధృతికి, మూడో అల పుట్టుకకు కారణమైన ప్రభుత్వాలు–పౌరుల నిర్లక్ష్యమే కొంప ముంచింది. తాజా అల తీవ్రతను నియంత్రణలో ఉంచేది పౌర సమాజమే! కోవిడ్‌కి తగ్గ ప్రవర్తన ముఖ్యం. నాణ్యత కలిగిన మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని విధిగా పాటించడం, ఎప్పటికప్పుడు చేతుల్ని శుభ్రపరచు కోవడం మన నిరంతర ప్రవర్తన కావాలి. జీవన సంస్కృతిలో ఇదొక భాగమవాలి. వైరస్‌తో సహజీవనం అనివార్యమైనపుడు... ఇక ఎన్ని అలలు వచ్చినా, అప్పుడే మనం ఈ మహమ్మారిని గెలువగలుగుతాం. -దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
ఈ బురదలో ‘మురుగూ’ ఉంది!
ఎండలు కాసేదెందుకురా? మబ్బులు పట్టేటందుకురా! మబ్బులు పట్టేదెందుకురా? వానలు కురిసేటందుకురా వానలు కురిసేదెందుకురా? చెరువులు నిండేటందుకురా! చెరువులు నిండేదెందుకురా? పంటలు పండేటందుకురా! పంటలు పండేదెందుకురా? ప్రజలూ బతికేటందుకురా! ప్రజలూ బతికేదెందుకురా? మంచినిపెంచేటందుకురా! ఇది చిన్నతనంలో మనమంతా పాడుకున్న పాట. మంచిని పెంచుతున్నామా? తుంచుతున్నామా? అన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్న. మంచినే పెంచితే... ఇన్ని అనర్థాలు ఎందుకుంటాయి? ఎవరి స్థాయిలో వారు చేయాల్సింది చేయకపోవడం, చేయకూడనిది చేయ డంవల్ల విపరీత పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. ఎండలు వెర్రిగా కాస్తున్నాయి. వానలు అడ్డదిడ్డంగా, అసాధారణంగా కురుస్తున్నాయి. కబ్జాలతో కనుమరుగు కాగా మిగిలిన చెరువులు నిండో, తెగో రాజ ధాని హైదరాబాద్‌లో కాలనీలను ముంచెత్తుతున్నాయి. అక్రమ నిర్మా ణాల వల్ల నదుల్లో, నాలాల్లో, నడివీధుల్లో పరవళ్లు తొక్కిన వరదలు సమస్తాన్నీ ఊడ్చుకుపోతున్నాయి. పల్లానికి పరుగు తీయాల్సిన నీరు కాలనీల్లో నిలిచి, జనావాసాల్లో తిష్టవేస్తోంది. పది రోజులవుతున్నా వేలాది ఇళ్లు, బంగళాలు ఇంకా నీటిలోనో, బురదలోనో ఉన్నాయి. బతుకు ఛిద్రమై జనం అల్లాడుతున్నారు. ఇంటికో కన్నీటి గాథ ఉంది. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వాన–వరద బీభత్సమైనా, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పంటల నష్టమైనా.... కేవలం ప్రకృతి వైపరీత్యం అనడానికి లేదు. దానికి తోడైన మానవ తప్పిదం నష్టాన్ని ఎన్నో రెట్లు పెంచింది. మారిన వాతావరణ పరిస్థితుల (క్లైమెట్ చేంజ్) వల్ల తలెత్తే తీవ్ర ఘటనలు సరేసరి! సరైన విధానం, ప్రణాళిక, వ్యూహం లేకపోవ డమే ఓ పెద్ద సమస్య! ముంచుకొచ్చిన సమస్య తీవ్రత గుర్తించి సకా లంలో తగినట్టు స్పందించకపోవడం ఏ విధ్వంసానికి దారితీసిందో ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. మహానగరం, శివారు కాలనీల్లోని వేలాది కుటుంబాలు ఈ రోజు ఎదుర్కొంటున్న దయనీయ స్థితికి గుండె తరుక్కుపోతుంది. ఇల్లు చెరువైన నిర్భాగ్యుడొకరు పదో రోజున కూడా ఒంటి మీద అవే బట్టలు, కంట్లో అదే ఆరని తడి... పలుకరించవచ్చిన వారిని దీనంగా చూస్తుంటే ఎవరికి మాత్రం హృదయం కదలదు? ఇది అనూహ్యంగా వచ్చిన ప్రమాదమేమీ కాదు. ఎన్నో హెచ్చరికలు, ఎన్నెన్నో అధ్యయన నివేదికలు, ఇరుగుపొరుగు రాష్ట్ర రాజధానులు చెన్నై, ముంబాయి, బెంగళూరు వంటి మహానగరాల్లోని మరెన్నో చేదు అనుభవాలు చూసిన తర్వాత కూడా మేల్కొనని మొద్దు నిద్ర ఫలితం! హైదరాబాద్వి బహుముఖ సమస్యలు ఇలాంటి పరిస్థితుల్లో ద్విముఖ వ్యూహం కావాలి. దీర్ఘకాలిక ప్రణాళిక, విపత్తు తలెత్తినపుడు ప్రభావవంతమైన తక్షణ చర్యలు, రెండూ ఉండటం లేదు. ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలే! కంటి తుడుపు పనులే! వర్షతీవ్రత, దాని ముప్పు నుంచి హైదరాబాద్‌ను సురక్షితంగా ఉంచడంలో వరుస ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నూరేళ్ల కింద ఇలాగే వరద ముంచెత్తినపుడు, నిజాం చొరవతో విశ్వే శ్వరయ్య రూపొందించిన మాస్టర్ ప్లాన్ తర్వాత అలాంటి విస్తృత ప్రణాళికేదీ ఇన్నాళ్లు ముందుకు రాలేదు. వచ్చిన అరకొర అమలుకు నోచలేదు. అమలైన వాటికి అతీగతీ లేదు. మహానగర పాలక సంస్థ పరిధి ఇప్పుడు 625 చ.కి.మీ విస్తరించి, వేలాది కాలనీలు వెలసిన తర్వాత కూడా తాగునీరు, వరదనీరు, మురుగునీటి నిర్వహణకు సరైన వ్యవస్థే లేదు. మహానగరంలో 9వేల కిలోమీటర్ల నిడివి రోడ్లకు ఇరువైపుల సరైన వరదనీటి కాల్వలు లేవు. చాలా చోట్ల మురుగునీటి కాల్వలు, వరదనీటి కాల్వలు కలిసిపోతాయి. అందుకే, చిన్న వానొ చ్చినా రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తాయి. ఇవాళ వేలాది ఇళ్లల్లో చేరిన నీరైనా, బురదైనా మురుగుతో కూడుకున్నదే! ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు ఏడు వేల కిలోమీటర్ల నిడివి మురుగునీటి వ్యవస్థ అందుబాటులో ఉంది. అవసరాలు తీర్చే సామర్థ్యం లేని, కాలం చెల్లిన పైపులైన్లు చాలా చోట్ల ఉన్నాయి. పాతబస్తీలో కొన్ని చోట్ల నిజాం కాలం నాటి పైపులే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. ఇక అక్రమ నిర్మాణాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రభుత్వమే మూసీ నదీ గర్భంలో నిర్మాణాలు జరిపిన అతిపెద్ద ఆక్రమణదారు. ప్రయివేటుకు లెక్కే లేదు. నాలాలపైన, చెరువుల్లో, పార్కుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలొస్తున్నాయి. క్రమబద్ధీకరణలు వరమా? శాపమా? భవనాల (బీఆరెస్), లే అవుట్ల (ఎల్లారెస్) క్రమబద్ధీ్దకరణ పథకాలు దీర్ఘకాలంలో ముప్పుగా మారుతున్నాయి. పర్యావరణపరంగా, భద్ర తపరంగా.. ఎలా చూసినా ఆయా నగరాలు, పట్టణాల క్రమాభివృద్ధికి అవే అవరోధమవుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో పౌరులకు అదొక వెసలుబాటులా కనిపిస్తున్నా, వాస్తవంలో అవి అలా లేవు. వర్తమాన, భవిష్యత్ ఆక్రమణలు, అక్రమనిర్మాణాలను ప్రోత్సహించేవిగా ఉంటు న్నాయి. పథకం ప్రకటన, తరచూ గడువు పొడిగింపులు ఎలా ఉంటు న్నాయంటే... ప్రకటించాక తొలి ఇటుక కొని అక్రమనిర్మాణం జరిపిన వారికి కూడా వెçసులుబాటు వర్తిస్తోంది. ప్రభుత్వాలు ఆయా పథకా లను ఆదాయవనరుగా చూడటం దారుణం. ఖర్చులకు గడవనంత ఆర్థిక ఇబ్బంది రాగానే క్రమబద్ధీకరణ పథకాలు ప్రకటించి, తరచూ పొడిగించి ఖజానా నింపుకోవడంకన్నా దౌర్భాగ్యమేముంటుందని పర్యావరణ నిపుణులంటున్నారు. సదరు ఉల్లంఘనలను మొదట ఉపేక్షించిన అధికారులు, బాధ్యులపై ఏ చర్యలూ ఉండటం లేదు. వివాదాస్పద భూములు, బఫర్ జోన్లు, చెరువులు–కుంటల శిఖం భూముల్లో, ఎప్టీఎల్ వరకు జరిగే నిర్మాణాలు, వెంచర్ల వెనుక ఉండేది ఎక్కువగా రాజకీయ నాయకులే! వారికదో పెద్ద ఆదాయ వనరు. దీనికి తోడు, ‘ఆపరేషన్ ఆకర్ష్’ వంటి రాజకీయ పథకాల్లో సహకరిం చిన వారికి జాగీర్లలాగా ఆయా ప్రాంతాలనే ఇచ్చేస్తుంటారు. నిబం ధనల్ని ఉల్లంఘించి నిర్మాణాలు జరిపేటప్పుడేమో.. లంచాలు తినే తప్పుడు అధికారులకు, నిర్మాణాలు జరిగిపోయాక.. పథకం ప్రక టించే ప్రభుత్వాలకు ఇదొక మంచి రాబడి మార్గమయింది. అంటే, చట్టోల్లంఘన చేసేవారి తప్పుడు సంపాదనలో అధికారికంగా వాటా దక్కడమే! హైదరాబాద్ శివారుల్లోని 11 మున్సిపాలిటీలు 2007లో కార్పొరేషన్లో విలీనమ య్యాయి. ఈ పరిధి వేలాది కాలనీల్లో లక్షల అక్రమ నిర్మాణాలొ చ్చాయి. సుమారు 185 చెరువులు, 200 పైచిలుకు కుంటల్లోనూ లక్షల అక్రమ నిర్మాణాలున్నాయి. 1500 కి.మీ నిడివి నాలాలపైన 9 వేల అక్రమనిర్మాణాల్ని ఇపుడు తొలగించాల్సి ఉంది. పట్టణాలు, గ్రామాల్లోనూ..... మారిన వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పి దాలు తోడయ్యే దుస్థితి నగారలకే పరిమితం కాలేదు. దురాక్రమ ణలు, అక్రమ నిర్మాణాలు పట్టణాలు, పల్లెలకూ విస్తరించాయి. ముఖ్యంగా భూముల ధరలు ఆకాశాన్నంటాక అన్ని అనర్థాలూ చోటు చేసుకుంటున్నాయి. వాగులు, వంకలు, బంజర్లు, పోరంబోకు భూముల్ని అడ్డంగా ఆక్రమించుకుంటున్నారు. పట్టణాల చుట్టూ పెద్ద గృహనిర్మాణ వెంచర్లు వెలుస్తున్నాయి. చెరువు శిఖాల్లో, ప్రభుత్వ భూముల్లోనూ జరుగుతోంది. వర్షాలు కురిస్తే వరద నీరు వెళ్లే మార్గాలు కుంచించుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ కొత్త ఆయకట్టు పెరిగిపోయి వాన రాగానే వరద పంట పొలాలపైకి మళ్లుతోంది. వర్ష–వరద తీవ్రత వల్ల పంటలు నాశనమవుతున్నాయి. గత వారం కురిసిన అసాధారణ వానలకు తెలంగాణలో దాదాపు 14 లక్షల ఎకరాల్లో వరి, పత్తి వంటి పంటలు నాశనమయినట్టు ప్రాథమిక సమాచారం. ఏపీలో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో వరి, అనంత పురం వంటి రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, ఇతర పలు జిల్లాల్లో తమలపాకు, అరటి వంటి పంటలకు నష్టం జరిగింది. వాతావరణ మార్పుల వల్ల జూలైలో రావాల్సిన గట్టి వానలు సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో పడుతున్నాయి. ఈ సారి వర్షపాతం బాగుండి ఇప్పటికే అత్యధిక చెరువులు నిండాయి. తెలంగాణలో ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువుల్లో పూడికలు తీసి, అలుగులు, తూముల మరమ్మతులు చేసి సీజన్ నాటికి సంసిద్ధం చేసుండటం వల్ల చెరువులన్నీ నిండు కుండల్లా ఉన్నపుడు తాజా వానలొచ్చాయి. చెరువు కట్టల పరిస్థితి గంభీరంగా ఉందని పౌరసమాజ సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. బలహీనంగా ఉన్నచోట కట్టల్ని పటిష్టపరచుకోవాల్సింది. నగరం, శివారు చెరువుల విషయమై నిర్దిష్టంగా పేర్కొన్నారు. వానలు జోరుగా కురిసిన అక్టోబరు 12, 13, 14 తేదీల్లో కూడా ఈ హెచ్చరిక లున్నాయి. ప్రకృతిని గౌరవిస్తేనే....! వాతావరణ మార్పు ప్రమాద సూచికలను ప్రభుత్వాలు పెద్దగా ఖాతరు చేయడం లేదు. దాన్ని ఎదుర్కొనేందుకు, నష్ట నివారణకు నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల్ని, మహా నగరాల విస్తరణని ప్రభుత్వాలు నిలువరించాలి. సాంకేతికత పెరిగి, ఇంటి నుంచే వృత్తి–ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలిగే పరిస్థితులు ఎక్కువైన నేపథ్యంలో శాటిలైట్ పట్టణాల వృద్ధిని ప్రోత్సహించాలి. ఎక్కటికక్కడ టౌన్ ప్లానింగ్ కఠినంగా అమలుపరచాలి. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి, సౌర–పవన వంటి పునర్వినియోగ విద్యుచ్ఛక్తి వాడకం పెంచాలి. వాయు, జల కాలుష్యాల్ని నివారించాలి. వ్యర్థాల తొలగింపు, నిర్వహణ శాస్త్రీయ పద్ధతుల్లో జరగాలి. భవన నిర్మాణ వ్యర్థాల నుంచి అన్నింటిని మూసీలో కుమ్మరించడం కూడా నీటి ప్రవాహాన్ని అడ్డుకొని, నిన్నటి ప్రమాదాన్ని తీవ్రం చేయడం కళ్లారా చూశాం. కేంద్రంలో, రాష్ట్రంలో పకడ్బందీ భూవినియోగ విధానం లేకపోవడం ఓ పెద్ద లోపం. ఇదివరలో భూముల్ని పలు రకా లుగా నిర్వహించేది. ప్రయివేటుతో పాటు ప్రభుత్వ, అటవీ, బంజరు, గైరాన్, పోరంబోకు, మైదాన.... ఇలా వేర్వేరుగా! ఏ భూమైనా మరో వినియోగంలోకి మారేటప్పుడు పద్ధతులు పాటించేది. అవన్నీ ప్రతి బింబిస్తూ ఇప్పుడొక పటిష్ట భూవినియోగ విధానం రూపొందించాలి. వాతావరణంలో కీలకమైన జలవనరులు, అడవులు, కొండలు, గుట్టల్ని పరిరక్షించాలి. ప్రభుత్వ భూముల్లో దురాక్రమణల్ని తొలగిం చాలి. హైదరాబాద్‌తో సహా నగరాలు, పట్టణాల్లో నదులు, నాలాలపై అక్రమ నిర్మాణాల్ని తొలగించి, పూడిక తీసి ప్రక్షాళన చేయాలి. నీటి ప్రవాహాన్ని కాస్త ముందుగానే లెక్కించే సెన్సర్లు ఏర్పరచాలి. విపత్తు నిర్వహణ సంస్థ మరింత క్రియాశీలం కావాలి. ప్రభుత్వాలు ప్రణాళికా బద్ధంగా దీర్ఘకాలిక–తక్షణ చర్యలతో వ్యవహరించకుంటే..... మనం పాటలో చెప్పుకున్న పరిస్థితులు తలకిందులవుతాయి. ఎండలు– మబ్బులకు, మబ్బులు–వానలకు, వానలు–చెరువులకు, చెరువులు– పంటలకు, పంటలు–ప్రజలకు, ప్రజలూ–మంచితనానికి మధ్య సంబంధాలు తీవ్రంగా బెడిసినట్టే! తస్మాత్ జాగ్రత్త!! -దిలీప్ రెడ్డి ఈ-మెయిల్: dileepreddy@sakshi.com -
ఇది అత్యంత దారుణం!
‘‘భయం మరణం... ధైర్యమే జీవితం...’’ అన్నారు స్వామీ వివేకానంద. ఆ భయమే ఇప్పుడు ఎన్నో అనర్థాలకు కారణమవుతోంది. ముఖ్యంగా కోవిడ్–19 మహమ్మారి ప్రపంచ జనావళిని పట్టి పీడి స్తున్న వేళ, పలు స్థాయిల్లో నెలకొన్న భయం సమస్యను జటిలం చేస్తోంది. కరోనా సోకిన వారినొకరకంగా, వారిని చూసి జడుసుకునే ఇరుగుపొరుగును మరోరకంగా ఈ భయం వెన్నాడుతోంది. సరైన అవగాహన, ఆచరణ ద్వారా భయం పోయి, దాని స్థానే రావాల్సిన జాగ్రత్త రాకపోవడం వల్ల నష్టం జరుగుతోంది. పాటించాల్సిన ‘జాగ్రత్త’ల పైన శ్రద్ధ కొరవడి, అకారణ ‘భయాల’కు ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ఫలితంగా.. ప్రాణ నష్టం, ఆరోగ్య నష్టమే కాకుండా మానవతా విలువలు కూడా క్షీణించి ‘అమాను షత్వం’ ఎక్కడికక్కడ ప్రబలుతోంది. అనుమానితుల్ని, వ్యాధిగ్రస్తుల్ని అద్దె ఇళ్లలో, అపార్ట్మెంట్లలో ఉండనీయకపోవడం, కోవిడ్ మృతుల పార్థివ శరీరాల్ని వాడల్లోకి, గ్రామాల్లోకి అనుమతించకపోవడం, శ్మశా నవాటికల్లో అంత్యక్రియల్ని అడ్డుకోవడం వంటి దారుణాలు పెరుగు తున్నాయి. కోవిడ్ రోగి అయినా, కాకపోయినా.. సందేహాస్పద మర ణమైతే చాలు, ఉన్నపళంగా వాహనాలు ఆపి దారి మధ్యలో, నట్టడ విలో అయినా దింపేసి వెళ్లే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ‘మనం పోరాడాల్సింది రోగంతోనే తప్ప రోగితో కాదు’ అన్నది కేవలం నినాదంగానే మిగిలిపోతోంది. ఆచరణ నినాదానికి విరుద్ధంగా జరుగుతోంది. ఈ పరిస్థితిని ఇలాగే అనుమతిస్తే.. రేపెప్పుడైనా అంటు వ్యాధులకు గురైన వారిని, వారి కుటుంబాల్ని ఊళ్లోకి రానీయకపోయే, సామాజికంగానే వెలివేసే ప్రమాద సంకేతాలు పొడసూపుతున్నాయి. పట్టణాలు, పల్లెలు, వాడలే కాదు చివరికి కుటుంబ సభ్యులు సహితం కోవిడ్ రోగుల్ని, మృతుల్ని ఈసడించుకుంటున్న ఘటనలూ వెలుగు చూస్తున్నాయి. ఇది అత్యంత దారుణం! ఒకవైపు మానవత్వం వెల్లివిరిసి.. లాక్డౌన్లో కూటికిలేని కుటుంబాలను ఆహారంతో ఆదుకున్నారు. వలసకూలీలను పొదిల్లలో పెట్టుకుని గమ్యస్థానాలకు చేర్చి మానవీయత చాటిన మనిషి మరో పార్శ్వపు వికృతరూపం ఇప్పుడు బయటపడుతోంది. చాలీచాలని సదుపాయాలు, సిబ్బంది కొరతతో ప్రభుత్వాసుపత్రులు విశ్వాసం కలిగించలేకపోతున్నాయి. కోవిడ్ అనుమానముంటే లక్షల రూపాయలు డిపాజిట్ చేయమని, కోవిడ్ కాని జబ్బంటే అసలు చూడనే చూడమని వైద్యం నిరాకరిస్తూ ప్రైవేటు ఆస్పత్రులు నరకం చూపిస్తున్న సందర్భాలు కోకొల్లలు! అమానవీయత తగునా? కరోనా వ్యాధి సోకిన వారికి, వారి కుటుంబాలకు మనోధైర్యం కలిగిం చాల్సింది పోయి కొందరు క్షోభకు గురిచేస్తున్నారు. నిర్హేతుకమైన భయాలతో సామాజిక రౌడీయిజం వెలగబెడుతున్న తీరు గర్హనీయం. ‘కోవిడ్ పాజిటివ్ అయితే ఇక్కడికొద్దు’ అంటూ, కొన్ని అపార్ట్మెం ట్లలో, వాడల్లో, గ్రామాల్లో తలెత్తుతున్న పరిస్థితి దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో, దేశ వ్యాప్తంగా ముందు వరుసలో ఉండి వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది, పారిశుద్య కార్మికులు, ఇతర సేవల్లోని వారు కూడా ‘మావీ ప్రాణాలే కదా! మాకెందుకులే?’ అనుకొని పనులు మానేస్తే పరిస్థితి ఎలా ఉండేది? అని వారెవరూ ఆలోచించడం లేదు. హోమ్ క్వారంటైన్ అయినా, ఇంట్లోనే ఉండి జరి పించుకునే వైద్యమైనా.. కనీస జాగ్రత్తలు పాటిస్తున్నారా చూడాలి. మాస్క్ ధరిస్తున్నారా? భౌతిక దూరం పాటిస్తున్నారా గమనించాలి. లేకుంటే, నిర్బంధం విధించాలి, కట్టడి చేయాలి. అంత్యక్రియలు పరి మిత వ్యక్తులతో, వైద్య–మున్సిపల్ సిబ్బంది పర్యవేక్షణలో ప్రొటోకాల్ ప్రకారం జరిపిస్తున్నారా? లేదా? చూసుకోవాలి. అంతే తప్ప ‘ఈ ఊళ్లో ఖననం జరిపించడానికి లేదు’ అంటే వారెక్కడికి పోవాలి? వేరే చోట మరింత ప్రతిఘటన ఎదురవుతుంది కదా! కోవిడ్ రోగులకు సేవలం దించి చనిపోయిన ఓ డాక్టర్‌కు చెన్నైలో ఎదురైన ఇలాంటి దురాగ తాన్ని చూసి ప్రపంచమే నివ్వెరపోయింది. పక్షం కింద ఢిల్లీ నుంచి శికోహబాద్ వెళ్తూ కదుల్తోన్న బస్సులోంచి, అనుమానంతో 19 ఏళ్ల బాలికను కిందకు పడదోస్తే నిమిషాల్లో అక్కడికక్కడే చనిపోయింది. 108 సిబ్బంది, ఆటోవాలా.... ఇలా ఎవరెవరి సందేహాలో, భయమో.. అన్యాయంగా భూపాలపల్లికి చెందిన 45 ఏళ్ల శంకరమ్మ బతుకు కడతేర్చింది. రోడ్డుమీదే ఆమె ప్రాణాలొదిలింది. ఇలాంటివెన్నో! అదే సమయంలో, కొన్ని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో చక్కటి సమన్వయం చూపుతున్నారు. ఎవరికైనా కోవిడ్ పాజిటివ్ వస్తే, అసో సియేషన్ వాళ్లకి చెప్పి హోమ్ క్వారంటైన్లోకి వెళ్తారు. పక్షం రోజుల పాటు బయటకు రావాల్సిన అవసరమే లేకుండా మిగతా ఇళ్లవా ల్లంతా, వంతుల వారీగా వారికి అవసరమైనవి అందజేస్తారు. సరు కులు, పాలు, మందులు... వారి తలుపుముందు పెట్టి ఫోన్లో సమా చారం ఇస్తారు. ఒత్తిడి వల్లే ఎక్కువ చావులు రోగ నిరోధకత అంటే పౌష్టికాహారం తీసుకుంటూ శరీర పటిష్టత సాధించడం మాత్రమే కాదు! మానసిక దృఢత్వ పరంగానూ అనేది సుస్పష్టం. కోవిడ్ సోకిన వారంతా ఆస్పత్రి పాలుకావాల్సిన అవసరం లేదనేది సందేహాలకతీతంగా నిర్ధారణ అవుతున్న విషయం. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటూ, జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. అయినా చాలామంది భయం వీడటం లేదు. 70 నుంచి 80 శాతం మందికి లక్షణాలు లేకుండానే వ్యాధి వచ్చి–పోతోంది, లేదా బయటే నయమవుతోంది. ఇక ఆస్పత్రుల్లో చేరిన వారిలోనూ కోలుకుంటున్న వారే ఎక్కువ! తగినంత ధైర్యం చెప్పేవాళ్లు లేక ఎక్కువమంది మానసికంగా కలత చెందుతున్నారు. ఏమౌతుందో? అనే భయంతో కుంగిపోతున్నారు. కోవిడ్ భయంతో కొందరు ఆత్మహత్యలకు పాల్ప డుతున్నారు. మానసిక వ్యథ, ఆందోళన (యాంక్సైటీ సిండ్రోమ్)తో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్న వారూ ఉన్నారు. కోవిడ్ సోకి, గుండె పోటుతో మరణిస్తున్న చాలా కేసుల్లో వైరస్ కన్నా ఒత్తిడి ప్రభావమే ఎక్కువని వైద్యులే అంగీకరిస్తున్నారు. ఆస్పత్రిలో చేరి, లేదా హోం క్వారంటైన్లో ఉండి నాలుగ్గోడల మధ్య ఒంటరితనం అనుభవిస్తున్న వారు మానసికంగా కుంగిపోతున్నారు. తమకేదో అవుతోందని, ఆందోళనగా ఉందని, ఏం చేయాలో చెప్పాలని, కౌన్సిలర్ ఎవరినైనా పంపించండని.. ఇలా ఫోన్ చేసి వేడుకుంటున్నారు. ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరిన విద్యార్థుల్లోనూ, తమ ‘భవిష్యత్తు ఏమిటి?’ అనే ఆందోళనలున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం స్వయంగా, ఒక యూనివర్సిటీ సైకాలజీ విభాగం నిర్వహిస్తున్న ‘హెల్ప్‌లైన్’లకు కోవిడ్ రోగులు. అనుమానితులు, విద్యార్థుల నుంచి వస్తున్న వేలకొలది ఫోన్‌కాల్స్ ఇదే విషయాన్ని ధ్రువపరుస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘జాతీయ మానసిక వైద్య–నరాల అధ్యయన శాస్త్ర సంస్థ’ (నిమ్హాన్స్)కు గత 3 నెలల్లో 3 లక్షల కాల్స్ వచ్చాయి. కోవిడ్‌ను నయంచేసే ఖచ్చితమైన మందులు గానీ, రాకుండా నివారించే వ్యాక్సిన్లుగానీ రావడానికి ఇంకా సమయం పడుతుంది. ఈలోపు, అనివార్యంగా కరోనాను గుర్తెరిగి, సహజీవనం సాగించడం తప్పదు. అందుకని, భయాన్ని వీడి తగిన జాగ్రత్తలు పాటించడమే ఉన్నంతలో పరిష్కారమని నిపుణులు చెబుతున్నారు. భరోసా లేకే భయం! కోవిడ్–19ని ఎదుర్కొనే విషయంలో నిర్లక్ష్యం వల్ల కొంత మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఇంత పెద్ద దేశంలో, 135 కోట్ల జనాభాను నిర్బంధించి లాక్డౌన్ ప్రకటించినపుడు కానీ, దాన్ని ఎత్తివేసినపుడు గానీ సమగ్రమైన వ్యూహం–ప్రణాళిక లోపించింది. అవసరాలకు తగిన వైద్య వనరులు, సాధన సంపత్తినీ సమకూర్చుకున్నది లేదు. తగినంత ముందుగానే లాక్డౌన్ విధించడం ఆరంభ ప్రయోజనాన్ని కలిగించింది. కానీ, కష్టమో, నష్టమో! లాక్డౌన్ ఎదుర్కొని ప్రజలు చూపిన త్యాగం స్థాయిలో వైద్యారోగ్య నిర్వహణపరమైన సన్నద్ధత ఉండి ఉంటే, పరిస్థితి భిన్నంగా ఉండేది. కొంచెం ఆలస్యంగానైనా మేల్కొని చర్యలు చేపట్టిన రాష్ట్రాలు సమస్యను దీటుగా ఎదుర్కొం టున్నాయి. వైద్యసేవలకు సంబంధించి ప్రభుత్వ రంగంలో సరైన నిర్వహణ, ప్రైవేటు రంగంపై సమగ్ర నియంత్రణ ఉంటేనే పౌరు లకు భరోసా కల్పించగలుగుతారు. భయం తొలగుతుంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో... ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకలున్నాయి. డాక్టర్లపై నమ్మక ముంది, కానీ నిర్వహణ, నిర్వాకాలపై విశ్వాసం లేక చికిత్స కోసం అక్కడికి పోవడానికి జనం జంకుతున్నారు. అందుకే అక్కడ పడకలు ఖాళీగా ఉంటున్నాయి. అక్కడ కన్నా ఇంట్లో చావడం మేలనే మాట వినిపిస్తోంది. తమ సేవల ద్వారా, లోపాలు సవరించుకోవడం ద్వారా ప్రజాసుపత్రులు ప్రజల్లో విశ్వాసం కలిగించాలి. మరోవంక ప్రైవే టులో దోపిడీకి తెరతీశారు. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లు తమకు గిట్టు బాటు కావంటున్నారు. న్యాయస్థానం చెప్పినా వినటం లేదు. వైద్య బీమా సంస్థలు నిర్దేశించిన రేట్లకూ కోవిడ్ వైద్యం సాధ్య పడదం టున్నారు. పరిస్థితి విషమించి, ప్రాణభయంతో వచ్చే రోగుల్ని అసలు చేర్చుకోమంటున్నారు. అక్కడో ఇక్కడో సిద్ధపడ్డా, లక్షల రూపాయల ప్యాకేజీలు, డిపాజిట్లు అడుగుతున్నారు. ‘భారతదేశంలో ఎక్కువ మంది కోవిడ్ రోగులు, ఏడెనిమిది ప్రైవేటు ఆస్పత్రులు చేర్చుకో కుండా నిరాకరిస్తుంటే.. అంబులెన్సుల్లో చస్తున్నారు’ అని కోల్‌కతాకు చెందిన ఒక ప్రొఫెసర్ చేసిన వ్యాఖ్య అక్షర సత్యం. ఇంట్లో వైద్యం చేయించుకుంటూనో, అనుమానంతో హోమ్ క్వారంటైన్లోనో ఉన్న కొందరు జాగ్రత్తలు పాటించడం లేదు. సరుకులకనో, సరదాలనో స్వేచ్ఛగా బయట తిరుగుతున్న సందర్భాలూ ఉన్నాయి. వైరస్ వ్యాప్తి, వ్యాధి పెరుగుదలకు అదే కారణమౌతోంది. బయటి పరిస్థితుల తీవ్రత దృష్ట్యానైనా జాగ్రత్తగా ఉండటం అవసరం. కోవిడ్‌ను సమర్థంగా ఎదుర్కోవడానికి ఇప్పుడు మనం... భయం నుంచి నమ్మకం వైపు, ఒత్తిడి నుంచి దృఢచిత్తం వైపు, ఆందోళన నుంచి మనశ్శాంతి వైపు, అభద్రత నుంచి ఆత్మవిశ్వాసం వైపు మళ్లా ల్సిందే! మనోఃధైర్యమే మన జీవితం, మన విజయం!! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
జనం దృష్టిలో తనే దోషి!
ప్రజాస్వామ్యంలో ప్రజాభిమానమే పాల నను నిర్ధారించే గీటురాయి. మాయదారి ఎత్తు గడలు, చౌకబారు వ్యూహాలతో తాత్కాలిక గెలుపు సంబరం సాధ్యమేమో కాని, అవే తుది విజయాలు కాజాలవు. పైగా పరాభవాలు తప్పవు! ఇది చరిత్ర చెప్పిన సత్యం. అరచేయి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలే నట్టే... కుట్రపూరిత ఎత్తుగడలతో ప్రజాహిత సత్కార్యాన్ని నిలువరించలేమన్నది రాజకీయ నేతలు గ్రహించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విపక్షనేత చంద్రబాబు నాయుడు నేర్చుకోవాల్సిన పాఠమిది. శాశ్వతంగా, చివరకు తాత్కాలికంగానైనా ప్రజా ప్రయోజనాలకు అడ్డు తగలడం రాజకీయాల్లో ఆత్మహత్యా సదృశం! 1999 ఎన్నికలప్పుడు ‘దీపం’ పథకం విషయంలో కాంగ్రెస్ చేసిన వ్యూహపరమైన తప్పిదానికి ‘లబ్దిదారు’ అయిన చంద్ర బాబుకీ విషయం బాగా తెలుసు. బడుగులకు రాజకీయ సాధికారత, గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్య స్థాపన, పాతిక లక్షలకు పైబడ్డ కుటుంబాలకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టివ్వడం... ఇలా బహువిధ కార్యాచ రణ మొగ్గతొడిగి ఏపీలో ఇప్పుడిపుడే ప్రగతి రూపుదిద్దుకుంటోంది. అసాధారణ పథకాలతో దేశానికే ఏపీ దిక్సూచి అయ్యే సందర్బాన్ని దిగ్విజయంగా అడ్డుకున్నామనే సంబరం కొన్ని రాజకీయ పక్షాల్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఈ దుర్యోచన మేళానికి చంద్రబాబు కేంద్ర బిందువు! వాయిదాపడిన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబం ధించి... వాతావరణం ఎలా ఉండింది, రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) చేసిందేమిటి, సర్వోన్నత న్యాయస్థానం ఏం చెప్పింది, చివరకు ఏం జరుగుతోందన్నది తెలుగు ప్రజలు గమనిస్తున్నారు. కరోనా వ్యాధి నివారణ కోసమే ఎన్నికల వాయిదా ఆశిస్తే, చంద్ర బాబు ఆయన పరివారం చంకలు గుద్దుకొని సంబరపడాల్సిందేమీ లేదు! రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణాత్మక సహకారం అందించి కరోనా మహమ్మారి పెనుముప్పు నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు గంభీరంగా నిలబడాల్సిన సమయమిది. కానీ, అందుకు భిన్నంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. తాము ఆశించినట్టే ఎన్నికలు వాయిదా పడ్డాయని, ఇది పాలకపక్షానికి ‘షాక్’ అని తెగ సంబరపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల సత్వర అమలును, కేంద్రం నుంచి నిధుల రాకను వాయిదా వేస్తున్నామన్న వాస్తవాన్ని సదరు శక్తులు గ్రహిం చడం లేదు. వారి చర్య, ప్రస్తుత ప్రగతి రథానికి ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదే! నిజానికి, ఈ పరిణామాన్ని కాస్త లోతుగా విశ్లేషిస్తే... రాజకీయంగా తామెదుర్కోబోయే ఘోర పరాజయ పరాభవాన్ని ఓ ఆరు వారాలు వాయిదా వేసుకోవడమే తప్ప బాబు–బృందం సాధించేది ఏమీ ఉండదు. ఇది క్షేత్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితి! శాసనసభ ఎన్నికలు ముగిసిన నాటి నుంచి ఇటువంటి వాస్తవాలనెన్నింటినో గ్రహించని చంద్రబాబు తప్పు మీద తప్పు చేస్తున్నారు. రాజకీయంగా ఓ పతనం నుంచి మరో పతనానికి జారిపోతున్నారు. అదేదో ఆంగ్ల సామెత చెప్పినట్టు, తన రాజకీయ శవపేటికపై తానే చివరి మేకు దిగ్గొట్టే పనిలో ఆయన బిజీగా ఉన్నట్టు మేధావి వర్గం విశ్లేషిస్తోంది. రాష్టం ఎంతో నష్టపోయింది... స్థానిక స్వపరిపాలనపై బాబుకు సదభిప్రాయం లేదని గడచిన పాతి కేళ్ల రాజకీయ చరిత్ర చెబుతోంది. ఆయన పద్నాలుగేళ్లు ముఖ్య మంత్రిగా ఉంటే, తన హయాంలో స్థానిక సంస్థలకు ఒకే మారు (2001) ఎన్నికలు జరిపించారు. మిగతా అన్ని మార్లూ వాయిదాలే! పైగా రాజ్యాంగ లక్ష్యానికి, రాజీవ్‌గాంధీ హయాంలో జరిపించిన 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ గుత్తాధిపత్యం నుంచి స్థానిక సంస్థలకు అధికారాలు, నిధుల బదలాయింపులకు ఆయనెప్పుడూ విముఖమే! అందుకే, ఏనాడూ ఈ బదలాయింపులకు ముందుకు రాలేదు. బాబు హయాం ముగిసి డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాతే సదరు బదలా యింపులు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత తాను తిరిగి ముఖ్య మంత్రి అయ్యాక కూడా స్థానిక సంస్థల ఎన్నికలు సకాలంలో జరుగక ఆర్థికంగా రాష్ట్రం ఇప్పటికే ఎంతో నష్టపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2018 లో, ఎంపీపీ, జడ్పీలకు ఎన్నికలు 2019 లోనే జరిగి ఉండాల్సింది. ఈ జాప్యం వల్ల పద్నాలుగో ఆర్థిక సంఘం నిధులు రావాల్సినంత రాలేదు. పదిహేనో ఆర్థిక సంఘం నిధులూ దక్కని ప్రమాదానికి పరిస్థితిని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రెండేళ్లుగా దాదాపు అయిదువేలకోట్ల రూపాయల నిధులు రాకుండా పోయాయి. ఇంకా జాప్యం జరిగితే, మరో రెండు వేల కోట్లకూ ఇబ్బందే! తన స్వీయ అనుభవంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ చెబుతున్నట్టు, తర్వాత కూడా ఆ నిధులు రాబట్టుకోవచ్చనేది నిజమే కావచ్చు! కానీ, సర ళంగా నిధులు వచ్చే అవకాశాన్ని చేజార్చుకొని, ప్రత్యేక వినతులతో కేంద్రం వద్ద పడిగాపులు గాచే పరిస్థితి అంత గొప్పదేం కాదు. వచ్చి తీరుతాయన్న నమ్మకం కూడా లేదు. అదే నిజమైతే, పద్నాలుగో ఆర్థిక సంఘం రెండో విడత రావాల్సిన వెయ్యి కోట్ల రూపాయలు ఇప్పటి వరకూ ఎందుకు రాలేదు? న్యాయస్థానం లోగడ నిర్దేశించినట్టు ఎన్ని కల ప్రక్రియ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు జరిపించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి తాజా పరిణామాలతో గండి పడింది. తేటతెల్లమైన దురుద్దేశాలు వాయిదా పడిన ఎన్నికల ప్రక్రియ తిరిగి ఖరారు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎస్ఈసీకి సుప్రీంకోర్టు నిర్దేశించింది. సంప్రదించకుండానే ఎన్నికల్ని వాయిదా వేయడాన్ని తప్పబట్టింది. అమల్లో ఉంటుందన్న ఎన్నికల నియమావళి (కోడ్)ని రద్దు చేయాలనీ నిర్దేశించింది. కోడ్ కొనసాగించడంలో హేతుబద్ధత ఏమిటన్న న్యాయ స్థానం ప్రశ్నకు ఎస్ఈసీ వద్దగాని, విపక్షం దగ్గర గానీ సమాధానమే లేదు. రాష్ట్రంలో విప్లవాత్మకంగా చేపట్టిన ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను ఎన్నికల ముందు అడ్డుకోవాలన్నది ప్రతిపక్ష పార్టీ తలంపు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఆశించిన పౌర సదుపాయాలు కల్పించ కూడదనేది వారి ఆశ! అందుకనుగుణంగానే, రాష్ట్రంలో కొనసాగు తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు విఘాతం కలిగించేలా ఎస్ఈసీ వ్యవహరించిందనేది పాలకపక్షం అభియోగం. ఎన్నికల నియమావళిలో చెప్పి, ప్రభుత్వం ఏర్పడగానే పథకం రచించి, నిధులు కేటాయించి, భూసేకరణ జరిపి, లబ్దిదారుల్ని గుర్తించి, ఉగాదికి ముహూర్తం ఖరారు చేసిన ఇళ్లస్థలాల పంపిణీ ప్రక్రియను ఈసీ నిలిపివేయమనడమే ఆశ్చర్యకరం. ఎన్నికల్ని వాయిదా వేస్తూ నియ మావళిని కొనసాగించడం సదరు దురుద్దేశాన్ని రుజువుపరిచింది. సర్వోన్నత న్యాయస్థానం కోడ్ అమలు వద్దంది. తదుపరి షెడ్యూల్ ఖరారైనపుడే కోడ్ అమల్లోకి తేవాలని నిర్దేశించింది. ఫలితంగా, ఇప్పుడు పాతిక లక్షల కుటుంబాల్లో సంతోషం ఉగాది ఉషస్సుగా మారనుంది. సొంతంగా స్థలాలున్న వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వడం, లేని వారికి ఇప్పుడు స్థలాలు ఇచ్చి, రానున్న నాలుగేళ్లలో ఇళ్లు నిర్మించి ఇవ్వడం ఈ పథకం సమగ్ర స్వరూపం. రాష్ట్రంలో దాదాపు కోటిన్నర కుటుంబాలుంటే, సుమారు 30 లక్షల కుటుం బాలకు సొంతిళ్లు లేవని, దేశంలో మరెక్కడా లేని విధంగా వారందరికీ (సంపూర్ణ/సంతృప్తికర స్థాయి) ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి విఘ్నం తొలగినట్టే! అందుకే, ఎటూ పాలుపోని విపక్షం ఇప్పుడొక కొత్త ‘లేఖా ప్రహసనా’నికి తెరలేపింది. రాజ్యాంగ, రాజకీయ, ఆశ్రిత మీడియా వ్యవస్థల నడుమ అదొక అంతర్నాటక మని తేలిపోతోంది. ఉనికికి ప్రమాదమనే! పంచాయతీ వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధంగా జన్మభూమి కమిటీలంటూ సమాంతర రాజ్యాంగేతర వ్యవస్థల్ని నడిపిన వారికి నిజంగానే కష్ట కాలమొచ్చింది. ఇప్పుడు పాలకపక్షం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల ముంగిట్లోకి తెచ్చింది. అన్ని పౌర సదు పాయాలు ఊళ్లోనో, వార్డులోనో దొరుకుతున్నాయి. కుల ధ్రువీకరణ నుంచి భూ యాజమాన్య హక్కుల వరకు, బర్త్ సర్టిఫికేట్ నుంచి వైద్య సదుపాయాల వరకు అన్నీ ముంగిట్లోనే లభించే వ్యవస్థ నెలకొంది. ఇవన్నీ కూడా ప్రజలతో ఎన్నికైన సర్పంచ్‌లు, కౌన్సిలర్ల నియంత్రణ లోనే జరుగుతాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నాయ కుల చుట్టూ తిరగాల్సిన పని పౌరులకు లేదు. పైరవీ కారుల్ని ప్రాధే యపడే అవసరం రాదు. అధికారులకు లంచాలివ్వాల్సిన దురవస్థ అంతకన్నా తలెత్తదు. చనువున్న పాకలపక్ష నాయకులే కొందరు ముఖ్యమంత్రి వద్ద సనుక్కుంటున్నారు. ‘అన్నా... ప్రజలు మా వైపు చూడట్లేదు, వారికి ఎక్కడికక్కడే అన్ని పనులూ జరిగిపోతున్నాయి’ అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా చట్టాలు చేయడం, విధానాలు రూపొందించడం, వాటి అమలు కృషి వంటి రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాల్సిన పరిస్థితి నాయకులకు ఏర్పడింది. ప్రజలు హర్షిస్తు న్నారు. విపక్షాలకిది గిట్టినట్టు లేదు. ఈ వ్యవస్థ ఇంతే సజావుగా సాగితే, ఇక తమ రాజకీయ ఉనికికే ప్రమాదమన్న భయం పట్టుకున్న ట్టుంది. లేకుంటే, వీటిని అడ్డుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలు అంతా గ్రహిస్తున్నారు నూరు వేటల్ని తిన్న రాబందు ఒక్క గాలివానతో కూలిందని సామెత! చిన్న చిన్న ఈదురు గాలుల్లో తప్పించుకున్నా... పెద్ద గాలివానలో నేల కూలడం ఖాయం. గత ఎన్నికల్లో వెల్లువలా వచ్చిన ప్రజాతీర్పును కూడా మన్నించకుండా, అన్నిసార్లూ తమ కుయుక్తులే ఫలిస్తాయను కోవడం రాజకీయ అవివేకం! వాయిదాలు తాత్కాలిక తృప్తినిస్తా యేమో గాని తుది విజయాల్ని అందించవు. జాతిపిత గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సాధనలో గ్రామమే గుండెకాయ. సదరు గ్రామ పరిపాలన రాజ్యాంగ బద్ధంగా, ప్రజాస్వామ్య పంథాలో సాగే ప్రక్రి యల్ని అడ్డుకోవడం రాజకీయంగా తన గొయ్యి తానే తవ్వుకోవడం వంటిది! ఈ వైఖరి మార్చుకోకుంటే, సంక్షేమ–అభివృద్ధి కార్యక్ర మాల్ని ఆశించే సగటు పౌరుల దృష్టిలో చంద్రబాబు నిరంతర దోషిగా నిలవటం ఖాయం! పదేపదే తగిన మూల్యం చెల్లించడం అనివార్యం! వ్యాసకర్త : దిలీప్‌రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
విలువల పతనానికి ‘ఈ’ తోడైతే!
సమకాలీనం ఇలా జరిగే ఘోరాలు, నేర ఘటనల్ని దర్యాప్తు సంస్థలు కదిలించినపుడు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల లింకులు బయటపడుతున్నాయి. దారితప్పేలా చేసిన ప్రేరణ వెల్లడవుతోంది. వివాహేతర సంబంధాల వల్ల జరిగే హత్యలు, ఆత్మహత్యలు, నేరపూరిత దాడుల ఘటనల్లోనూ కొత్త పరిచయాల నుంచి అనుచిత, లైంగిక సంబంధాలు, వైషమ్యాల వరకు సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు పోషిస్తున్న పాత్ర విడదీసి చూడరానిదిగా ఉంటోంది. ఒక టెలివిజన్ జర్నలిస్టు నుంచి ఉదయం వాట్సాప్‌లో నాకో గుడ్‌మార్నింగ్ మెసేజ్ వచ్చింది. అందులో ‘ఈ ప్రపంచంలో ఏదీ ‘మంచి’ లేదా ‘చెడు’ అని నిర్దిష్టంగా ఉండదు. మన ఆలోచనల్ని బట్టే ఏదైనా! ప్రాణాల్ని కాపాడేందుకు ఓ వైద్యుడు శస్త్రచికిత్సకు వాడుతున్నపుడు కత్తి మంచిది. ప్రాణాల్ని తీసేందుకు ఓ ఉగ్రవాది వినియోగిస్తున్నపుడు కత్తి చెడ్డది’ ఇదీ సంక్షిప్త సందేశం. అంటే, కత్తి కాకుండా దాని వినియోగాన్ని బట్టే ఫలితం మంచైనా, చెడైనా! సామాజిక మాధ్యమాలపైన ఈ మధ్య తరచూ చర్చ జరుగుతోంది. అవి మంచా–చెడా? శాపమా–వరమా? నిజానికీ చర్చకు ముగింపు లేదు. ఎందుకంటే, చాలా విషయాల్లోలాగానే ఇందులోనూ మంచి, చెడు రెండూ ఉంటాయి! మంచి–చెడు పాళ్లలో వ్యత్యాసం, హెచ్చు తగ్గులే ఈ చర్చను సజీ వంగా ఉంచుతాయి. చెడును పరిహరించి, మంచిని స్వీకరించడమే మనం చేయాల్సింది. శాస్త్ర–సాంకేతిక పరిజ్ఞానం ఫలాలను సమాజం గరిష్టంగా ఉపయోగించుకొని ప్రయోజనం పొందగలుగుతుంది. ఆ తెలివిడి మనకు, అంటే ప్రజా సమూహాలకు, పౌర సంఘాలకు, పాలకులకు ఉండాలి. చెడును తగ్గించి, మంచి నిష్పత్తిని పెంచినపుడు సామాజిక మాధ్యమాలైనా, అంత ర్జాల వ్యవస్థయినా సత్ఫలితాలిస్తుంది. భారతదేశానికి అపారంగా మానవవ నరులున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇదొక పెద్ద చేయూత. యువశక్తి వనరుల్ని భవిష్యత్ సంపదగా మలిచే క్రమంలో ఈ శాస్త్ర–సాంకేతికత సద్వినియోగం అవసరం. మార్కెట్ శక్తులు, సమాచారం శాసించే నేటి విశ్వసమాజంలో మనకు మనంగా స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి ఇదొక గొప్ప అవకాశం. జ్ఞాన–సమాచార వ్యాప్తి, వ్యాపార–వాణిజ్య విస్తరణ, వ్యక్తులు–సంస్థల మధ్య పరస్పర భావ వినిమయం వంటి ఎన్నో ప్రయోజనాలు ఈ సామాజిక మాధ్యమాలు, సైబర్ సాంకేతికత వల్ల ప్రభావవంతంగా నెరవేరతాయి. అలా కాకుండా, దుర్వినియోగమైనపుడు సమాజ వికాసం కుంటుపడుతుంది. తిరోగమనంలో సాగుతాం, ఓ నిర్వీర్య–నిస్తేజపు తరం ఆవిర్భవిస్తుంది. అంతర్జాలం, ఆ సాంకేతికత ఆధారంగా పనిచేసే గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ట్విటర్, లింక్డిన్... తదితర మాధ్యమ వేదికలు సమాచార వ్యవస్థలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తు న్నాయి. ఉపయోగాన్ని బట్టి మంచి ఉపకరణాలు కాగలిగిన బలం, నేపథ్యం వాటికుంది. కానీ, పట్టుతప్పి చెడు మార్గం పడితే, ఒడుపుగా కాక నిర్లక్ష్యంగా ఉపయోగంలో పెడితే... అందుకు తగ్గ సమాజ పతనాన్ని రచించే శక్తి కూడా ఈ ఉపకరణాలకు ఉంది. పెడపోకడలను పెరుగుతున్న సంకేతాలు కనిపి స్తూనే ఉన్నాయి. ఇరువైపులా పదునున్న కత్తినెలా వాడాలి? అదివరకటి వందేళ్ల ప్రపంచ ప్రగతిని మించిన అభివృద్ధి గత ఇరవయేళ్లలో లభించింది. మానవేతిహాసంలో నిప్పును గుర్తించి, వాడటం ఒక విప్లవాత్మక మార్పుగా చెబుతారు. తర్వాత.. ‘చక్రం’ కనుగొనడం ఓ మేలు మలుపై పారి శ్రామిక విప్లవానికి దారులు పరిచింది. ఆధునిక కాలంలో ‘అంతర్జాలం’ అనేక సంచలనాలకు మూలమైంది. సమాచార వ్యవస్థ వేగంగా వృద్ధి–విస్త రణ చెందింది. అది దన్నుగా నూతన ఆర్థిక, రాజకీయ విధానాల నీడలో ఎన్నెన్నో పరిణామాలు చోటు చేసుకున్నాయి. మౌలిక సదుపాయాల స్వరూప స్వభవాలే మారిపోయాయి. సమాజ గతి పెను మార్పులకు లోనవుతోంది. ఖండాలకతీతంగా మనుషుల జీవన శైలిలో వేగంగా మార్పులొస్తున్నాయి. వ్యక్తిగత సౌఖ్యాలు, సదుపాయాలు, ఆస్తులు పెరుగుతున్న క్రమంలోనే విలు వలు నశిస్తున్నాయి. కట్టడిలేని కాలుష్యం! సహజవనరుల అసాధారణ విని యోగంతో భవిష్యత్తును భయానకం చేస్తున్నారు. శాస్త్ర–సాంకేతికత వృద్ధితో సమాచార, రవాణా సదుపాయాలు పెరిగాయి. ఫలితంగా భౌతిక దూరాభా రాలు తగ్గి ప్రపంచమే ఓ కుగ్రామమౌతున్న తరుణంలో మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. సాటి మనుషులపైన, జన సమూహాలపైన, వారి జీవన స్థితిగతులపైన అవగాహన లేమి కన్నా మనుషుల్లో ‘పట్టింపులేని తనం’ పెరిగిపోతోంది! ఆర్థిక అసమానతలు ప్రమాదకర స్థాయికి చేరాయి. 73 శాతం సంపద రెండు శాతం జనాభా వద్ద కేంద్రీకృతమైంది. ఎందుకిలా జరుగుతోంది? ఇది కోటి రూకల ప్రశ్న. మనిషి స్వార్థం హెచ్చడం, నిజా యితీ, విలువలు, సహజ జీవన పద్ధతులు నశించి కృత్రిమత్వం పెరగటం వల్లే ఇదంతా అనే వాదనా ఉంది. సంప్రదాయ ప్రసారమాధ్యమాలతో పాటు సామాజిక మాధ్యమాలు, అంతర్జాల వ్యవస్థ విస్తరించిన నేటి పరిస్థితుల్లో వనరుల హేతుబద్ధ వినియోగం, సంపద సృష్టి, సమగ్ర పంపిణీ, సమస మాజ స్థాపన, పర్యావరణ పరిరక్షణకు చక్కటి సావకాశమున్న సమయమిది. కృత్రిమ మేధ, రోబోటిక్స్ యుగంలోకి దూసుకువెళ్లినా మానవ విలువల పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. వినిమయవాద సంస్కృతి పెరిగి డబ్బు–సంపదకు ఇచ్చిన విలువ సాటి మనుషులకు ఇవ్వటం లేదు. మను షులతో సంబంధాలు, నెట్వర్క్, విద్యావ్యాప్తి, సహాయ–సహకారాలు, సమాచారం–ఆధునీకరణ, వాణిజ్యవృద్ధి, అవగాహన పెంచడం, నేరాల నియంత్రణ, విభిన్న సమాజాల నిర్మాణం.... ఇలా పలు విషయాల్లో ఈ– సైట్లు బాగా ఉపయోగపడుతాయి. కానీ, వాటిని మంచి కోసం ఎక్కువగా వాడుకోవడం లేదు. అమెరికా, రష్యా, యూరప్, జపాన్, చైనా వంటి అభి వృద్ధి చెందిన సమాజాలతో పోల్చినపుడు, వెనుకబడిన, ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో ఇదింకా వేగం పుంజుకోవాల్సి ఉంది. సామాజిక మాధ్యమాల దుర్వినియోగం తగ్గి సద్వినియోగం పెరగాలి. మానవ సంబంధాల విధ్వంసం సున్నితమైన, విలువల ఆధారితమైన మానవ సంబంధాలే సమాజాల స్థితి గతిని నిర్వచిస్తాయి. విలువలతో కూడిన జీవన విధానమే ప్రపంచానికి భారత్ ఇచ్చిన కానుక అని, అమెరికా అధ్యక్షుడి హోదాలో బారాక్ ఒబామా మన పార్లమెంటు ఉభయసభలనుద్దేశించి మాట్లాడుతూ కీర్తించారు. ఆయన పొగిడింది చాన్నాళ్ల కిందటి మన గతం. ఇదివరకే క్షీణిస్తూ ఉన్న విలువలు నేడు మరింత సన్నగిల్లుతున్నాయి. సమిష్ఠి కుటుంబ వ్యవస్థ క్రమంగా కను మరుగవుతూ చిన్న కుటుంబాలు రావడం, సగటుమనిషి ఆలోచనలు డబ్బు మయమవడం, అన్ని రంగాల్లోనూ విలువలు–ప్రమాణాలు పడిపోవడం, అవసరాలకు–అవకాశాలకు మధ్య సంఘర్షణ వంటివి మనుషుల్లో నైతికతను తగ్గిస్తున్నాయి. మారిన విద్యా విధానంతో పాటు ఇందుకెన్నెన్నో కారణా లున్నా, అంతర్జాల వ్యవస్థ, సామాజిక మాధ్యమాల పాత్ర కూడా ఉంది. ముఖ్యంగా సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ (ఎస్సెన్నెస్) యువతపై తీవ్ర ప్రతి కూల ప్రభావం చూపుతున్నాయి. మంచి కన్నా చెడు వైపు వేగంగా ఆకర్షితు లవుతున్నారు. ఫలితంగా వ్యక్తిగత సంబంధాలు, వ్యక్తుల సామాజిక అనుబం ధాలు బలహీనపడుతున్నాయి. పిల్లలు, యువతరం ఎదుగుదలలో బహు ముఖ వికాసం కనిపించడం లేదు. పనికిమాలిన సమయం వృధా వ్యవహా రాల్లో మునిగి తేలుతూ మేధోమరుగుజ్జులవుతున్నారు. సైట్ల ప్రభావం వారిపై అలా ఉంది. ‘మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం అన్నదే ప్రధానంగా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది’ అంటారు శంకరాచార్యుడు. దేశంలో 42 కోట్లమందకి పైగా అంత ర్జాలం వినియోగిస్తున్నారు. అందులో సగం మంది సామాజిక మాధ్యమాల్లో క్రియాశీలంగా ఉన్నారు. 18–24 మధ్య వయస్కులే అత్యధికులు. దేశంలో నేడు సెల్‌ఫోన్ వాడని యువతీయువకులు లేరేమో? పొద్దస్తమానం అదే పనిగా సామాజిక మాధ్యమాలతో గడిపేవారే అత్యధికులు. వారికి లభించే సరుకు అలా ఉంది. ఎదిగే పిల్లల చదువులు, కౌమారంలోని వారి ఆలోచ నలు, యవ్వనంలోని యువతీయువకుల సంబంధాలు తీవ్రంగా ప్రభావిత మౌతున్నాయి. అశ్లీలసైట్ల విచ్చలవిడి తనానికి హద్దే లేదు. 16, 17 ఏళ్ల వయసులోనే ప్రేమలని, వైఫల్యాలని, మానసిక కుంగుబాట్లని, కక్ష్యలు– కార్పణ్యాలని, కడకు ఆత్మహత్యలు, హత్యల వైపు సాగుతున్న ఘటనలెన్నో! ఇలా జరిగే ఘోరాలు, నేర ఘటనల్ని దర్యాప్తు సంస్థలు కదిలించినపుడు ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాల లింకులు బయటపడుతున్నాయి. దారితప్పేలా చేసిన ప్రేరణ వెల్లడవుతోంది. వివాహేతర సంబంధాల వల్ల జరిగే హత్యలు, ఆత్మహత్యలు, నేరపూరిత దాడుల ఘటనల్లోనూ కొత్త పరిచయాల నుంచి అనుచిత, లైంగిక సంబం ధాలు, వైషమ్యాల వరకు సెల్ఫోన్లు, సామాజిక మాధ్యమాలు పోషిస్తున్న పాత్ర విడదీసి చూడరానిదిగా ఉంటోంది. ‘నిర్మిత ప్రపంచంలోని యాదృ చ్ఛిక సంబంధాలకు, వాస్తవిక ప్రపంచంలోని అర్థవంతమైన సంబంధాలకు మధ్య తేడాలు తెలుసుకునే విచక్షణా జ్ఞానాన్ని సామాజిక మాధ్యమాలు హరించివేస్తాయి’ అని కార్నెల్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ స్టీవెన్ స్ట్రాంగజ్ అంటారు. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, సామాజిక మాధ్య మాల పట్ల అజాగ్రత్తగా ఉంటే జరిగే నష్టాలను ప్రపంచ మేధావులు ఏకరువు పెడుతున్నారు. జాగ్రత్త పడకుంటే, బనాయింపుల్తో .... బలహీన మనస్కుల్ని వేధించి, ఆత్మహత్యలకు పురికొల్పే సైబర్ రౌడీయిజం, డాటాను కొల్లగొట్టే హ్యాకింగ్స్, నిలువునా ముంచే నేరాలు–స్కామ్‌లు, వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడాలు పెచ్చుమీరతాయి. వాడేవారికిదొక వ్యసనంగా మార డం, శారీరక–మానసిక రుగ్మతలకు దారితీయడం వంటి అరిష్టాలెన్నో! మూలాల్ని గుర్తించి మందేయాలి విలువల పరిస్థితి మెరుగు పరచకుండా, సామాజిక మాధ్యమాల్లో వచ్చే ‘సరుకు’ ప్రమాణాల్ని నియంత్రించకుండా పైపై చర్యలు ఎన్ని చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదనే భావన వ్యక్తమౌతోంది. ‘షీ–టీమ్’లు, సీసీ కెమె రాలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు వంటివి తదనంతర నియంత్రణ చర్యలే తప్ప సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కార మార్గాలు వెతకటం కాదనే పెదవి విరుపు ఉంది. పట్టణాలు, మండల–గ్రామ స్థాయిల్లో ఇప్పటికే ఇదొక నియం త్రణ లేని వ్యవస్థగా, చేయి దాటిన వ్యసనంగా మారింది. కౌమారంలోని పిల్లలు చదువులు పక్కన పడేసో, చదువుతూనో, అదరాబాదరాగా చదువు ముగించో... పొద్దస్తమానం ఈ సైట్లతో గడిపేస్తున్నారు. వాటి ద్వారానే తప్ప, ప్రత్యక్ష సంభాషణలు, కలయికల్ని మానేస్తున్నారని ‘చైల్డ్ మైండ్ డాట్ ఆర్గ్’ వంటి సంస్థల అధ్యయనాలు తేల్చాయి. ఫలితంగా పిల్లలు–యువతలో సంయమనం, సమ్యక్దృష్టి, నిర్ణయసామర్థ్యం, విచక్షణ లోపిస్తున్నాయని తేలింది. సాధారణ స్థాయి బుద్ధి కుశలత, పనినైపుణ్యాల్ని కూడా చూపలేకపో తున్నారు. ఆదాయాలు, జీవన ప్రమాణాలకు ఆధునిక సెల్‌ఫోన్, ఈ–సైట్స్ వంటి సదుపాయాలకు మధ్య సమతూకం లేనపుడు కూడా కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. నిరంతరం అవే చూస్తుండటం, తమ పరిస్థితిని ఇతరులతో పోల్చి చూసుకోవడం వల్ల కూడా అసంతృప్తి స్థాయి, ఆత్మన్యూనతా భావ నలు పెరిగి అనర్థాలకు దారి తీస్తోందని డాక్టర్ స్టీవెన్ అడెయిర్ విశ్లేషిస్తారు. ఈ–సైట్ల వ్యవసనపరుల్లో తెగించి అత్యాచారాలకు పాల్పడటమే కాకుండా ఈర్ష్య, దుగ్ధ, కక్ష్య–కార్పణ్యం వంటివి పెరిగి హింసకు పురికొల్పుతున్న ఘట నలూ ఉన్నాయి. ‘నీ మిత్రులెవరో చెప్పు... నీవేంటో చెబుతా!’ అన్నాడట బెర్నార్డ్‌షా. ‘పదినిమిషాలు నీ సెల్‌ఫోన్ ఇవ్వు... నీవేంటో చెబుతా అంటోంది శాస్త్ర సాంకేతికత! తస్మాత్ జాగ్రత్త!! - దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
పారదర్శకతకు పాతరేసే యావ
సమకాలీనం పారదర్శకత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఈ హక్కుకు 2005లో చట్టబద్ధ రక్షణ కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడున్నరేళ్లు తెలుగు ప్రభుత్వాలు ఈ అంశాన్నే పట్టించుకోలేదు. అంతకు ముందున్న కమిషన్‌ను విభజన చేయకుండా, విడివిడిగా కమిషన్లు ఏర్పరచుకోకుండా, ఒక్కో కమిషనర్ పదవీ విరమణ చేస్తుంటే సదరు ఖాళీని భర్తీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టున్న తీరే సర్కారు వైఖరిని స్పష్టం చేసింది. ఫలితం కమిషన్ సహజ మరణం. పాలనలో పారదర్శకత ప్రశ్నార్థకమౌతోంది. ప్రజా సమాచారపు గుప్పిటి బిగుసుకుంటోంది. సమాచార హక్కు చట్టం వచ్చిన మొదటి అయిదారేళ్లలో కనిపించిన పాటి సానుకూలత కూడా ఇప్పుడు కరువౌతోంది. జనాల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)లు సహితం రహస్య పత్రాలవుతున్నాయి. ముఖ్యమైన జీవోలు ‘కాన్ఫిడెన్షియల్’ ముసుగు కింద కనుమరుగవుతున్నాయి. వెలుగు చూడకుండానే కొన్ని ఉత్తర్వులు అమలవుతున్నాయి. సమాచారం చేరవేస్తున్నారని ఉద్యోగుల్ని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వాలు గోప్యత కోటగోడలు కడుతున్నాయి. సమాచారాన్ని బందీ చేస్తూ, వివిధ స్థాయి పాలనా యంత్రాంగానికి తప్పుడు సంకేతాలిస్తున్నాయి. విప్లవాత్మకమైందిగా చెప్పుకుంటున్న సమాచార హక్కు చట్టం అమలు చతికిలబడుతోంది. చడీచప్పుడు లేకుండా వెలగపండులో గుజ్జును ఏనుగు లాగేసినట్టు చట్టాల స్ఫూర్తిని సర్కార్లే మింగేస్తున్నాయి. అధికారుల్లో బాధ్యత–జవాబుదారితనం అడుగంటుతోంది. న్యాయస్థానాలపై ఒత్తిడిని తగ్గించి, సమాచారాన్ని ప్రజా క్షేత్రంలోకి సులభంగా, వెల్లువలా రానివ్వాలని ఈ చట్టం తీసుకువచ్చిన స్ఫూర్తి ఇప్పుడు భంగపడుతోంది. రాజకీయ పక్షాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకే వస్తాయని కేంద్ర సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాల్ని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చినా పార్టీలు, ప్రభుత్వాలు కనీసం ఖాతరు చేయటం లేదు. మొన్నటికి మొన్న కేరళ ప్రభుత్వం అడ్డగోలుగా నియమించిందని, అయిదుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. అంతకు ముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కారు జరిపిన నలుగురు కమిషనర్ల నియామకం చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు, దాదాపు పదవీకాలం ముగిసే ముందర వారిని ఇంటికి పంపింది. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు చర్నాకోలా విదిలిస్తే తప్ప కమిషన్ ఏర్పాటు, కమిషనర్ల నియామకానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కాలు కదుపలేదు! రాజ్యాంగం సాక్షిగా, చట్టబద్ధంగా కొనసాగాల్సిన కమిషన్లే ఉనికిలో లేని శూన్యతను సర్కార్లే పనిగట్టుకొని çసృష్టిస్తున్నాయి. గడువు విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత కిందా మీద పడి తెలంగాణ ప్రభుత్వం కమిషన్ ఏర్పరచి, ముఖ్య సమాచార కమిషనర్‌ను, ఒక కమిషనర్‌ను నియమించింది. అది కూడా లేని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టు వద్ద వాయిదాలు కోరుతూ ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. ‘ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే... ఇదొక తలనొప్పి చట్టం, ఇది లేకుంటే బాగుండు, ఉన్నా ఊపిరిలేనట్టు ఓ మూలన పడుంటే నయముండు అన్నట్టుంద’న్న ఓ క్రియాశీల కార్యకర్త వ్యాఖ్యలు అక్షర సత్యాలు. సర్కార్లే ఇలా ఉండటంతో కంచే చేను మేసినట్టు తయారైంది పరిస్థితి. పెచ్చుమీరిన ఇష్టా‘రాజ్య’ధోరణి కమిషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకం తెలుగునాట మళ్లీ వివాదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నియామకం జరిగిన తెలంగాణలో, సదరు ప్రక్రియ వివరాలు కోరుతూ పెట్టుకున్న తమ ఆర్టీఐ దరఖాస్తుకు ఏం సమాచారం ఇస్తారోనని పౌరసంఘాలు నిరీక్షిస్తున్నాయి. అవసరమైతే మళ్లీ న్యాయస్థానం తలుపు తట్టాలని యోచిస్తున్నాయి. కమిషన్ ఏర్పాటు ప్రక్రియ సరిగా జరగలేదని, ఎంపికలోనూ న్యాయస్థానం మార్గదర్శకాలు పాటించలేదని, కమిషన్‌ను పూర్తిస్థాయిలో నింపలేదని చాలా అభియోగాలున్నాయి. కోర్టు ఇచ్చిన గడువు మీరిపోయినా, అదనపు సమయం కోరి నోటిఫికేషన్ మాత్రమే విడుదల చేసిన ఏపీ సర్కారు కదలికల్నీ అక్కడి పౌర సంఘాలు గమనిస్తున్నాయి. పొడిగించిన తాజా గడువు ప్రకారం నవంబరు 20 లోపు కమిషనర్ల నియామకం జరపాలి. ‘కేంద్ర ప్రభుత్వం వర్సెస్ నమిత్ శర్మ’(2013) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, గత ఆగస్టు నెలలో తీర్పు వెలువరిస్తూ కేరళ హైకోర్టు నిర్దేశించిన అంశాల నేపధ్యంలో ఇక్కిడి తాజా పరిణామాల్ని పరిశీలిస్తున్నారు. పారదర్శకత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఈ హక్కుకు 2005లో చట్టబద్ధ రక్షణ కల్పిం చారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడున్నరేళ్లు తెలుగు ప్రభుత్వాలు ఈ అంశాన్నే పట్టించుకోలేదు. అంతకు ముందున్న కమిషన్‌ను విభజన చేయకుండా, విడివిడిగా కమిషన్లు ఏర్పరచుకోకుండా, ఒక్కో కమిషనర్ పదవీ విరమణ చేస్తుంటే సదరు ఖాళీని భర్తీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టున్న తీరే సర్కారు వైఖరిని స్పష్టం చేసింది. ఫలితం కమిషన్ సహజ మరణం. పౌరులు, ప్రజా సంఘాల ఫిర్యాదుతో కోర్టు జోక్యం చేసుకొని ఆరువారాల్లో కమిషన్ ఏర్పాటు, కమిషనర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆదేశాల దరిమిలా కదలిక మొదలయింది. అయితే కమిషన్లే లేకుండా చూడటం, లేదంటే నియామకాలు జరుపకుండా ఖాళీలు కొనసాగించడం ప్రభుత్వాలకు రివాజయింది. కోర్టు ఆదేశాలుండి తప్పని పరిస్థితుల్లో నియామకాలు జరపాల్సి వస్తే, తమవారనుకున్న అధికార– రాజకీయ అనుచరులకు పునరావాసం కల్పిస్తున్నారు. చట్టం అమలును నీరుగార్చడానికి పారదర్శకతపట్ల ఆసక్తి, అర్హతలేని వారితో కమిషన్లను నింపేస్తున్నారు. చట్ట నిబంధనలు, రాజ్యాంగస్ఫూర్తి ప్రకారం ఇవన్నీ కూడా ఒకటిని మించిన తప్పిదం మరొకటి. అసలెవరిని నియమించాలి? చట్టం అమలులో కీలక పాత్ర పోషించే కమిషన్లలో ఎవరిని కమిషనర్లుగా నియమించాలి? అన్నదొక ప్రశ్న. విద్యార్హతలు నిర్దేశించనందున చూడ్డానికి ఇదొక చిక్కుముడిలా కనిపిస్తున్నా, చట్టం ఈ విషయంలో సుస్పష్టంగానే ఉంది. సమాచారం... ప్రజలకు అందాల్సిన అవసరాన్ని–ఇవ్వనవసరం లేని సహేతుకతను నిర్ణయించే న్యాయప్రక్రియ, చట్టం అమలు పర్యవేక్షణ, చట్టోల్లంఘనలకు శిక్షలు విధించడం అనే మూడు ప్రధాన బాధ్యతలు నిర్వహించే కమిషనర్లది ఏ రకంగా చూసినా ముఖ్య పాత్రే! అందుకు తగ్గ హోదా వారికి ఇచ్చారు. రాష్ట్ర అత్యున్నత ఉద్యోగి అయిన ప్రధాన కార్యదర్శి(సీఎస్)తో సమాన హోదా కమిషనర్లకు, కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమాన హోదాను ముఖ్య సమాచార కమిషనర్‌కు కల్పించారు. కేంద్ర సమాచార కమిషన్‌లోని వారికి ఇంతకన్నా ఒక్కో అంచె అధిక హోదాలున్నాయి. అందుకు తగ్గట్టుగా అర్హులైన వారినే ఎంపిక చేయాలని చట్టం చెబుతోంది. ప్రజా జీవితంలో ప్రముఖులై, ప్రకటించిన న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సామాజిక సేవ, మేనేజ్మెంట్, జర్నలిజం, జన మాధ్యమాలు, పరిపాలనా రంగాల్లో విశేష పరిజ్ఞానం–విస్తృత అనుభవం కలిగి ఉండాలని చట్టం సెక్షన్ 12(5) (రాష్ట్ర కమిషన్లు), సెక్షన్ 15(5) (కేంద్ర కమిషన్)లలో స్పష్టంగా పేర్కొన్నారు. సమాచారం లభించక కమిషన్ వరకు వచ్చే వేర్వేరు రంగాలకు చెందిన అంశాల్ని పరిశీలించాల్సి వచ్చినపుడు ఆయా పరిజ్ఞానం–అనుభవం కలిగిన కమిషనర్లు ఉండాలన్నది ఉద్దేశం! అందుకే, ప్రతి కమిషన్‌లో ఒక ముఖ్య కమిషనర్‌తో పాటు అవసరాన్ని బట్టి పది మంది వరకు కమిషనర్లను నియమించుకోవచ్చని కూడా చట్టం చెబుతోంది. కానీ, దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను ఒక ప్రహసనం చేశారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల్నే అత్యధిక సందర్భాల్లో నియమిస్తున్నారు. పదవిలో ఉండి, తదనంతర పునరావాసం కోసం నిరీక్షిస్తూ కొంత, నియామకం తర్వాత ప్రభుభక్తి చూపుతూ కొంత... పాలనా ప్రక్రియనే ఈ చకోరాలు భ్రష్టు పట్టిస్తున్నాయి. అత్యధిక సందర్భాల్లో ప్రభుత్వాలకు ‘అనుకూలురైన’ అధికారుల్నే నియమిస్తున్నారు. ఇంకా ఇతర వీర విధేయుల్నీ ఏ అర్హతా ప్రమాణాలతో నిమిత్తం లేకుండానే నియమిస్తున్నారు. ఈ ప్రక్రియంతా నిర్దిష్ట ప్రాతిపదికన, పారదర్శకంగా జరగాలని నమిత్ శర్మ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించింది. అభ్యర్థిం చుకున్న/ప్రతిపాదించిన పేర్లలో ఎవరెవరి అర్హతలేమిటి? ప్రజాజీవితంలో ప్రాముఖ్యం ఎలా? ఆయా రంగాల్లో వారికున్న విశేష పరిజ్ఞానం–విస్తృతానుభవం ఏమిటి? అనే వివరాల్ని వారి పేరు పక్కన పొందుపరచాలనీ మార్గదర్శకాలున్నాయి. జాబితా కుదింపులో, తుది ఎంపికలో పేర్లు నిరాకరించిన వారి కన్నా ఎంపిక చేసిన వారికున్న ప్రత్యేకత, అధిక అర్హతలేమిటో సరిపోల్చుకునేలా సదరు సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలనీ పేర్కొన్నారు. మన(సు)కు నచ్చిన ఎవరైనా ప్రజాజీవితంలో ముఖ్యులే అని గుడ్డిగా లెక్కిస్తామంటే కుదరదు. కేరళ తీర్పు గుణపాఠం కావాలి! కేరళ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన అయిదుగురు కమిషనర్ల నియామకాన్ని కొట్టి వేస్తూ రెండు నెలల కింద ఆ రాష్ట్ర హైకోర్టిచ్చిన తీర్పులో పలు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఎంపిక కాని ఓ అభ్యర్థి పిటిషన్, తాము ఎంపికయినా గవర్నర్ ప్రకటించడం లేదని అయిదుగురు చేసుక్ను పిటిషన్లు, రాష్ట్రం దాఖలు చేసిన రిట్ అప్పీళ్లు,.. ఇలా మొత్తం ఆరు అప్పీళ్లను ఉమ్మడిగా పరిశీలిస్తూ న్యాయస్థానం ఈ తీర్పిచ్చింది. ఎంపిక ప్రక్రియ సవ్యంగా, పారదర్శకంగా జరుగలేదన్నదే ఇందులోని ప్రధానాంశం. ముఖ్య సమాచార కమిషనర్, అయిదుగురు సమాచార కమిషనర్ల నియామకానికి గాను ప్రభుత్వం రెండు దఫాలుగా నోటిఫికేషన్ ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానించింది. సెక్షన్ 15 (3)లో చట్టం నిర్దేశించినట్టు ముఖ్యమంత్రి నేతృత్వంలో విపక్షనేత, ఒక సీనియర్ మంత్రితో ఏర్పాటయిన త్రిసభ్య కమిటి 2016 ఫిబ్రవరి 24న భేటీ అయింది. ముఖ్య సమాచార కమిషనర్, అయిదుగురు కమిషనర్ల పదవుల కోసం మొత్తం 269 దరఖాస్తులు వచ్చాయి. ఇన్ని దరఖాస్తులు ఒకే రోజు పరిశీలించడం ఎలా? వీటిని క్షుణ్ణంగా పరిశీలించి కుదించడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి, కుదింపు కసరత్తు జరగాలని విపక్షనేత అభిప్రాయపడ్డారు. ఆ మేరకు సమావేశాన్ని వాయిదా వేశారు. మరుసటి రోజు భేటీలో ముఖ్య సమాచార కమిషనర్ పదవి కోసం 4, అయిదుగురు కమిషనర్ల నియామకం కోసం 15 దరఖాస్తుల్ని మాత్రం పరిశీలనకు ఉంచారు. ఏ ప్రాతిపదికన? ఎవరు ఈ కుదింపు ప్రక్రియ చేశారన్న విపక్షనేత ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు. కారణాలు, అర్హతలు వంటివి పేర్ల పక్కన పేర్కొనలేదు. తానీ ప్రక్రియకు సమ్మతించనని నోట్ రాసి ఆయన వెళ్లిపోయారు. మెజారిటీ సూత్రం ప్రకారం కమిటీ, తగిన సంఖ్యలో పేర్లను ఎంపిక చేసి గవర్నర్‌కు పంపింది. ముఖ్య సమాచార కమిషనర్ నియామకం ఆమోదిస్తూ, కమిషనర్ల విషయంలో గవర్నర్ కూడ అవే అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ ఫైల్ తిప్పి పంపారు. అభ్యర్థుల విషయంలో తనకు అప్పటికే అందిన ఫిర్యాదుల్ని సర్కారుకు పంపుతూ విచారణ జరుపమన్నారు. కానీ ప్రభుత్వం అవే పేర్లతో జాబితాను తిరిగి పంపింది. అప్పుడు కూడా ఎంపికకు ప్రాతిపదిక, ఇతరుల కన్నా మెరుగైన అర్హతలు, విశేష పరిజ్ఞానం–విస్తృతానుభవాన్ని ధృవీకరించే పత్రాలేవీ జతచేయలేదని గవర్నర్ తిప్పి పంపారు. అయినా ప్రభుత్వం అవే పేర్లను ఖరారు చేసింది. ప్రకటన విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌ను కోరింది. ఆయన నోటిఫై చేయకపోవడంతో వివాదం తలెత్తింది. ప్రభుత్వ చర్య తప్పని, చట్టం–రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కోర్టు గవర్నర్ చర్యలు సమర్థించింది. పారదర్శకతను పరిరక్షించాల్సిన వారి నియామకాల్లోనే అది లోపించడం సిగ్గుచేటు! ఆవులు పొలాల్లో మేస్తే లేగలు గట్లపైన మేస్తాయా? పౌర సమాజం మేల్కొంటేనే పాదర్శకత లభిస్తుంది. ప్రజాస్వామ్యం దక్కుతుంది. దిలీప్ రెడ్డి వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్ ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
బతుకు–భవిత ‘మేలు’కుంటేనే!
సమకాలీనం రెండు తెలుగు రాష్ట్రాలైనా, మొత్తం భారతదేశమైనా... ఇప్పుడున్న వాతావరణ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి సుస్థిరాభివృద్ధి సాధించడానికి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలి. ‘ఎస్డీజీల సాధనలో కేంద్రంతో పాటు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలది కీలక పాత్ర. 17లో 15 అంశాలు రాష్ట్రాలు, వాటి కింద ఉండే స్థానిక సంస్థల పరిధిలోకే వస్తాయి. పైగా భాగస్వాములుగా ప్రజల్ని ముందుంచి, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా కార్యాచరణ ఏక కాలంలో, అన్ని స్థాయిల్లో జరిపించడానికి రాష్ట్రాల చొరవే ముఖ్యం. ‘నిద్రపట్టక తన భర్త అర్థరాత్రి మంచమ్మీద కూర్చొని బలవంతంగా ఊపిరి పీలుస్తుంటాడు. ఖళ్ళు..ఖళ్ళు మని దగ్గొకటి... మందులు వాడినా ఫలితం ఉండట్లే! చిన్న వయసులో ఎందుకీ దురవస్థ?’ బుర్ర బద్దలు కొట్టుకున్నా అర్థం కాదు హైదరాబాద్ బోరబండలో నివసించే సౌమ్యకు. ‘పటెలా! మీరు చిన్నగున్నపుడు ఆయిటి పూని మిర్గం (మృగశిర) రాంగనె వానలొచ్చేవి, తుకాలు అలికి దుక్కులు దున్నుకుందుము, ఇప్పు డేంది రెన్నెళ్ల మొఖమైతుంది ఇంకా వానళ్లేవు, ఎందుకిట్ల?’ తన అరవయ్యేళ్ల అనుభవాన్నంతా రంగరించి ఆలోచించినా మెదక్ జిల్లా పల్లెటూరి పోశ య్యకు మర్మమేమిటో అర్థం కాదు. ‘మా తాతల తరం నుంచి మాకీ సముద్రుడే దిక్కు, ఎంత కోపమొచ్చినా అలలతో కొట్టేవాడే కాని, మా ఊరిని ముట్టుకోలేదయ్యా! ఇప్పుడేమయిందో రెండు మూడేళ్ల నుంచి చూస్తున్నాం, ఊరు ఊరునే మింగేస్తున్నడు, ఇదో ఇక్క డ్దాకా నేలను కోసింది సంద్రం. ఎటూ దిక్కులేక మేమే యెనక్కి జరుగు తున్నం’ గోదావరి జిల్లా సాగరతీర గ్రామంలో ఓ పల్లెకారుడు ఓదెలు మనో వేదన! వీటన్నిటికీ కారణం.. కాలుష్యం వల్ల భూతాపం పెరిగి వాతావరణంలో వస్తున్న మార్పులే అంటే, అంత తేలిగ్గా బోధపడదు. ప్రత్యక్షంగా లంకె ఎక్క డుందో అర్థం కాక చదువుకున్న వాళ్లు కూడా సందేహిస్తారు. ఇంకొందరయితే, ‘అన్నిటికీ మీరు అదే కారణమంటారు! హు!!’ అని అడ్డంగా వాది స్తారు. ఇది విడమర్చి, ప్రజలకు వివరించి, వారి సహకారం– భాగస్వా మ్యంతో విపత్తును అడ్డుకునే ప్రయత్నానికి పౌర సంఘాలూ ముందుకు రావు, ప్రభుత్వాలూ పూనుకోవు. సమస్య జఠిలమైందే! ముంచుకొస్తున్న విపత్తును గ్రహించారు కనుకే ప్రపంచ దేశాధీశులంతా (189 దేశాలు) ఏకమై సమస్యపై లోతుగా పరిశీలన చేశారు. గడచిన యాౖభై ఏళ్లలో స్టాక్‌హోమ్ (స్వీడన్), రియో (బ్రెజిల్), క్యూటో (జపాన్), బ్యాసెల్ (స్విట్జర్లాండ్), జోహనస్‌బర్గ్ (దక్షిణాఫ్రికా), పారిస్ (ఫ్రెంచ్) ఇలా చాలా చోట్ల పెద్ద పెద్ద సభలు, సమావేశాలు పెట్టి పరిష్కారాలు అన్వేషించారు. పర్యావరణ పరి రక్షణకు మొదట ఎనిమిదంశాలతో ‘మిలీనియం డెవలప్మెంట్ గోల్స్’ (ఎమ్డీజీ) అని లక్ష్యాలు నిర్దేశించుకొని, పదిహేనేళ్లకు సమీక్షించుకున్నారు. సాధించిన మంచి కొంత ఉన్నా, ఫలితాలకన్నా ఎన్నో రెట్ల వేగంతో సమస్య బలపడుతున్న తీరు ఆందోళన కలిగించింది. అభివృద్ధి ముసుగులో ఎదుర వుతున్న అవరోధాలు చూశాక మేధావి వర్గం తమ వ్యూహం దిశ మార్చింది. తాజాగా పదిహేడు అంశాలతో ‘సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని’ (ఎస్డీజీ) ఏర్పాటు చేసుకున్నారు. 2030 నాటికి ఏయే విషయాల్లో ఏమి సాధించాలో స్పష్టమైన అవగాహన, కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ సజావుగా సాధించినపుడే మనిషి మనుగడ, భవిష్యత్తరాలకో అవకాశం సాధ్యమని నిర్ధా రణ అయింది. కార్యాచరణకు కదిలితేనే...! ప్రపంచ పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలకు భారత్ కూడా భాగస్వామి. ఇటీవల జరిగిన ప్యారిస్ భాగస్వాముల సదస్సులో మన దేశం కీలక భూమిక నిర్వహించింది. ఎమ్డీజీల్లో ప్రపంచమంతటా ఆకలి లేకుండా చూడటం, పేద రిక నిర్మూలన ఎజెండాగా ఉండేది. కానీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల (ఎస్డీజీ)కు వచ్చేసరికి ఎజెండా విస్తృతితో పాటు మరింత స్పష్టత సంతరించుకుంది. అభి వృద్ధిని సరైన మార్గంలో నిర్వచించడమే కాక సుస్థిరత అంశాన్ని జోడించారు. ఈ 17 లక్ష్యాల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రపంచ సమకాలీన సమస్యలన్నింటికీ దాదాపు ఇందులో పరిష్కారాలు లభిస్తాయనిపిస్తుంది. పాలకుల్లో, అధికా రుల్లో, పౌరుల్లో ఆచరణకు అవసరమైన చిత్తశుద్ధి ప్రధానాంశం. 1) ప్రపంచ వ్యాప్తంగా అన్ని రూపాల్లోని పేదరిక నిర్మూలన. 2) అందరికీ ఆహార భద్రత, పౌష్ఠికాహారం, సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం. 3) అన్ని వయసుల వారికీ ఆరోగ్యాన్ని, సంతోషకర జీవనాన్ని అందించడం. 4) అందరికీ సమ– నాణ్యమైన విద్యను అందించడం, జీవిత పర్యంతం అవకాశ కల్పన. 5) స్త్రీ– పురుష సమానత్వ సాధన, మహిళలు, బాలికలకు సాధికారత. 6) అందరికీ స్వచ్ఛమైన నీరు, సంపూర్ణ పారిశుధ్య కల్పన. 7) నాణ్యమైన, చవకైన, ఆధు నిక, సుస్థిర విద్యుత్తును అందరికీ అందించడం. 8) అందరికీ సంపూర్ణ– గౌరవప్రద ఉపాధి అవకాశాల కల్పనతో సమ్మిళిత–సుస్థిర ఆర్థిక ప్రగతికి బాటలు వేయడం. 9) నవకల్పనలతో ఉపయుక్త మౌలిక సదుపాయాలు, సమ్మిళిత–సుస్థిర పారిశ్రామికాభివృద్ధి సాధన. 10) దేశాల్లో ప్రాంతాల నడుమ, దేశాలమధ్య సామాజిక–ఆర్థిక అంతరాలు లేని సమసమాజ స్థాపన. 11) నగరాలు, పట్టణాలు, గ్రామాలు, ఇతర అన్ని జనావాసాల్ని ఆవాస యోగ్యంగా, సౌఖ్య, సురక్షిత, సుస్థిరమైనవిగా తీర్చిదిద్దడం. 12) సుస్థిర, బాధ్యతాయుత ఉత్పత్తి–వినియోగ ఒరవడి పెంచడం. 13) వాతావరణ మార్పు, దాని దుష్ప్రభావాల్ని ఎదుర్కొనే తక్షణ కార్యాచరణ. 14) సము ద్రాలు, సాగరజల వనరుల పరిరక్షణ, సుస్థిరాభివృద్దికి తోడ్పడేలా వాటి వినియోగం. 15) భూమిపైనున్న సమస్త జీవావరణ వ్యవస్థల్ని, అడవుల్ని పరిరక్షిస్తూ, ఆ వనరుల్ని సుస్థిరాభివృద్ధికి వినియోగించడం. భూసారహీనత, ఎడారీకరణ, జీవవైవిధ్య నష్టాల్ని అరికట్టడం. 16) శాంతియుత, సమ సమాజ స్థాపనతో అందరికీ న్యాయం అందిస్తూ అన్ని స్థాయిల్లోనూ పటిష్ఠ, బాధ్యతాయుత, సమ్మిళిత పాలనావ్యవస్థల్ని ఏర్పరచడం. 17) ఈ అన్ని లక్ష్యాలతో సుస్థిరాభివృద్ధి సాధనకు అనువైన అంతర్జాతీయ సంబంధాల్ని వృద్ధి చేయడం. జరుగుతున్నదంతా అరాచకమే! సుస్థిరాభివృద్ధి లక్ష్యాల పట్ల, ఇందుకు గాను ఆయా ప్రభుత్వాలు చేపట్టే పథకాలు–కార్యాచరణ పట్ల ప్రజల్లో అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ వ్యవహారాలేవీ సగటు పౌరులకు తెలియనీకుండా సమకాలీన ప్రభుత్వాలు వ్యవహరిస్తు న్నాయి. వాటికి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టు విధాన నిర్ణ యాలు–అమలు ఉంటోంది. ఫలితంగా సమస్యలు పరిష్కారం కాకపోగా జఠిలమౌతున్నాయి. భవిష్యత్తరాల ప్రయోజనాల్ని పణంగా పెట్టి య«థేచ్ఛగా ప్రకృతి సహజవనరుల్ని కొల్లగొట్టే తీరు ప్రమాదకరం. సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో కాకుండా వరుస ప్రభుత్వాలు, ఎన్నికల్లో తమకు కొల్లలుగా ఓట్లు ఈనే అస్థిరాభివృద్ధి పథకాల్నే రచిస్తున్నాయి. పౌరులు ఎప్పుడూ దీనంగా ప్రభుత్వాల వైపు చూసే పరిస్థితుల్నే అవి కొనసాగిస్తున్నాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సగం సాధించినా దేశ పౌరులు గుడ్డిగా ప్రభుత్వాలపై ఆధార పడాల్సిన దుస్థితి తప్పుతుంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందు తున్న దేశాల్లో పరిస్థితులు మరింత దయనీయంగా ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక ప్రకృతి వైపరీత్యాల ప్రాంతంగా ఆసియా–పసిఫిక్ జోన్ నమో దైంది. అసాధారణ ఆర్థిక ప్రగతి, కోట్లాది మందిని పేదరికం నుంచి గట్టెక్కిం చిన మాట నిజమే అయినా ప్రతికూలతలు ఎక్కువే! జీవావరణంపై ఒత్తిడి పెరిగింది. ఆర్థిక వృద్ధి క్రమంలో గాలి, నీరు కలుషితమై అపార చెత్త పేరుకుపోయింది. మనిషి–పరిసరాల ఆరోగ్యానికి పెద్ద సవాల్ విసురు తోంది. గత రెండు దశాబ్దాల్లో 41 శాతం ప్రకృతి వైపరీత్యాలు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. శతాబ్ద కాలంలో 91 శాతం దుర్మరణాలు ఈ ప్రాంతంలోనే జరిగాయి. 1981–2010 మధ్య రికార్డు స్థాయి వర్షపాతం (56 శాతం వృద్ధి) ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో జరిగింది. 2070 నాటికి ఆసియా నగరాలైన బ్యాంకాక్, ఢాకా, కొల్కత్తా, ముంబాయి, షాంఘైలలో కోట్లాది మంది నిర్వాసితులవుతారనే నివేదికలున్నాయి. 24 గంటల అకాల వర్షాలతో హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి మహానగరాలు నిన్నా, మొన్నా అల్లాడిన తీరు మనం కళ్లారా చూశాం. భూతాపోన్నతి వల్ల హిమాలయాలపై మంచు పొర కరిగిపోతోంది. జీవవైవిధ్య నాశనంతో సూక్ష్మక్రిములు అంతరించి ఆహార గొలుసు అక్కడక్కడ ఛిద్రమౌతోంది. ఈ రెండు పరిణామాలే చాలు ఆహారోత్పత్తిపై పడే పెద్ద దెబ్బకు! సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్ని సాధించడానికి ఇదే అత్యవసర, అత్యున్నత సమయంగా మేధావి సమాజం భావిస్తోంది. భారత ప్రభుత్వం ఇప్పుడిప్పుడే కదిలింది. ఎస్డీజీల సాధనకు జాతీయ సూచి కలనేర్పాటు చేసే ప్రక్రియ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలు, కార్యక్రమ అమలు విభాగం ఓ ముసాయిదా పత్రాన్ని విడుదల చేసి ప్రజా భిప్రాయ సేకరణ ప్రారంభించింది. ఏం చేస్తే బావుంటుంది? రెండు తెలుగు రాష్ట్రాలైనా, మొత్తం భారతదేశమైనా... ఇప్పుడున్న వాతావ రణ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి సుస్థిరాభివృద్ధి సాధించడానికి నిర్దిష్ట కార్యాచరణ చేపట్టాలి. ‘ఎస్డీజీల సాధనలో కేంద్రంతో పాటు దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలది కీలక పాత్ర. 17లో 15 అంశాలు రాష్ట్రాలు, వాటి కింద ఉండే స్థానిక సంస్థల పరిధిలోకే వస్తాయి. పైగా భాగస్వాములుగా ప్రజల్ని ముందుంచి, ఏ ఒక్కరూ మిగిలిపోకుండా కార్యాచరణ ఏకకాలంలో, అన్ని స్థాయిల్లో జరిపించడానికి రాష్ట్రాల చొరవే ముఖ్యం. కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛభారత్, మేకిన్ ఇండియా, నైపుణ్య భారత్, డిజిటల్ ఇండియా వంటివన్నీ ఎస్డీజీల సాధనకు దోహదపడేవే’ అని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఛైర్మన్ జస్టిస్ స్వతంతర్ కుమార్ అన్నారు. ఆయనతోపాటు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, ఎ.కె.పట్నా యక్లు పాల్గొన్న ఒక జాతీయ సదస్సు ‘పర్యావరణ పరిరక్షణ–దేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనక్రమం’ అన్న అంశంపై సోమవారం ఢిల్లీలో జరిగింది. ఈ సదస్సు చర్చల సారంగా పలు ప్రతిపాదనలతో ఓ వినతి పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించేందుకు సదస్సు నిర్వాహకుల్లో ఒకరైన కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) సన్నాహాలు చేస్తోంది. భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘సుస్థిరాభివృద్ధి’ పదాన్ని, ఆదేశిక సూత్రాల్లో 17 లక్ష్యాలనూ చేర్చేలా సవరణ చేయాలని ప్రతిపాదిస్తోంది. తన అధీనంలోని వివిధ శాఖలు చేపట్టే అన్ని విధాన కార్యక్రమాల్లో విధిగా ఎస్డీజీ అంశాలు ప్రతిబింబించేట్టు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలివ్వాలని కోరుతోంది. పర్యా వరణ పరిరక్షణ ప్రభుత్వాలకు రాజ్యాంగం (అధికరణం 48ఎ) అప్పగించిన బాధ్యత. రాజకీయ పక్షాలన్నీ తమ ఎన్నికల ప్రణాళికలో ఎస్డీజీలను తప్పని సరి అంశం చేయాలనేది మరో ప్రతిపాదన. కార్పొరేట్లు తమ సామాజిక బాధ్యత (సీఎస్సార్)లో భాగంగా ఈ లక్ష్యాల సాధనకు పెద్దపీట వేయాలని సూచిస్తోంది. భారత రాజ్యాంగం నిర్దేశించే పౌర విధుల్లో (అధికరణం 51ఎ– జీ) ప్రకృతి–పర్యావరణ రక్షణ కూడా ఉంది. లక్ష్యాల సాధనలో తన వంతు బాధ్యత ఏమేరకు నిర్వహించగలనని ప్రతి భారత పౌరుడూ ఆలోచించి, కార్యాచరణ చేపట్టాలని దేశ పౌరులకు వినతి చేస్తోంది. ఇద్దరు పెద్దమనుషుల మాటలు మననం చేసుకుందాం. అభివృద్ధి పేరిట మనం చేస్తున్నదంతా విధ్వంసమే అన్న ఫ్రెంచ్ తత్వవేత్త రూసో, మళ్లీ ప్రకృతిలోకి వెళ్లి పరిష్కారాలు వెతుక్కోవడమే ఏకైక మార్గమన్నాడు. ‘ప్రకృతి లోకి లోతుగా చూడండి..... ఇప్పుడన్ని విషయాలు మరింత మెరుగ్గా అర్థమౌ తాయి’ అన్న సహస్రాబ్ది మేధావి అల్బర్ట్ ఐన్‌స్టీన్‌కు జోహార్! దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
ఈ విజయానికి పునాది ఆ విజన్
సమకాలీనం జనవరి తొలివారం తిరుపతిలో జరిగిన ‘ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ సదస్సులో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన విస్మయం కలిగించింది. తెలుగువారు నోబెల్ బహుమతి తెస్తే వంద కోట్లిస్తామని ప్రకటించారు. ‘నోబెల్ ఎలా సాధించాలి? ఏమైనా మెలకువలుంటే మా పిల్లలకి చెప్పండి’ అంటూ జపాన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత టకాకి కజిటాని కోరడంతో అంతా నవ్వుకున్నారు. తర్వాత యువశాస్త్రవేత్తల భేటీలో ఇదే విషయంపై పలు సందేహాలు, విమర్శలు తలెత్తాయి. విత్తొకటి వేస్తే చెట్టొకటి మొలుస్తుందా? మొలవదు. విత్తును బట్టే చెట్టు. కృషిని బట్టే ఫలితం. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సాధించిన ఘన విజయం ఒకటి రెండు రోజులో, నెలలో, సంవత్సరాల కష్టంతో లభిం చిన ఫలం కాదు. ఎడతెగని నాలుగున్నర దశాబ్దాలకు పైబడ్డ సమీకృత కృషికి దక్కిన ఫలితమిది. యావద్భారత జాతినే మహదానందపరచిన ఈ గెలుపు... అనేక ఆలోచనల, ఆచరణల సమ్మిళిత పరిణామం. ఒకే రాకెట్‌తో 104 ఉప గ్రహాలను అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టి ప్రపంచ రికార్డు సృష్టించింది మన ఇస్రో. ఈ ఘనతను విశ్వసమాజమే వేనోళ్ల పొగడుతోంది. దేశం గర్వంతో ఉప్పొంగుతోంది. ఇది అనితరసాధ్యమైన విజయమే! ఈ ఘనత సాధనకు మూలాలు పలువురు వ్యక్తుల కృషిలో, రాజనీతిజ్ఞుల దూరదృష్టిలో, స్ఫూర్తితో శాస్త్రవేత్తల్ని నడిపినోళ్ల నాయకత్వ లక్షణాల్లో, స్వదేశీ పరిజ్ఞానంతో స్వయంస మృద్ధి సాధించాలన్న తపనలో దాగి ఉన్నాయి. ఇది నిరంతర ప్రక్రియ. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక సందర్భంలో ‘‘శాస్త్ర పరిజ్ఞానం తెచ్చిన పెనుమార్పులెన్నో! అయితే, అన్ని మార్పులూ మానవతకు మంచి చేసినవే కాకపోవచ్చు. కానీ, మనుషుల్లో కలిగించిన శాస్త్రీయ విశాల దృక్పథం, ఆలో చనా సరళి అన్నది శాస్త్రపరిజ్ఞానం తెచ్చిన ఆశావహమైన ఓ గొప్ప మార్పు’’ అన్న మాటలు అక్షర సత్యాలు. పాలకులీ విషయాలను గ్రహించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. శాస్త్రీయ పరిశోధనల్ని, అందుకు గల అవకా శాల్ని ప్రోత్సహించాలి. విత్తు విత్తిన వెంటనే ఫలాలు చేతికి అందనట్టే, ఇటు వంటి కృషికి తక్షణ ఫలితాలు రాకపోవచ్చు. దీర్ఘకాలంలో తప్పక ఫలిస్తాయి. రాజకీయ, అధికార వ్యవస్థలు తమ పాలనా ప్రక్రియల్లో దూరదృష్టితో వ్యవ హరించాల్సిన అవసరాన్ని తాజా విజయం నొక్కి చెప్పింది. పూర్వరంగంలో అయిదారు దశాబ్దాలకు పైబడి సాగిన కృషిని ఇస్రో ఘనత ధృవీకరించింది. ఓటమి నేర్పిన గెలుపు పాఠాలు ప్రతి గెలుపు పరంపర సంపూర్ణ విజయంతోనే మొదలవాలని లేదు. నిబద్ధ తతో చేసే ప్రయత్నం కూడా గొప్పదే! ఒక ఓటమి నుంచి తేరుకొని గెలుపు పాఠాలు నేర్చిన వైవిధ్య అనుభవాలు ఇస్రోకూ ఉన్నాయి. 1969లో ఏర్పడ్డ ఇస్రో 1975లోనే తన తొలి ఉపగ్రహం ‘ఆర్యభట్ట’ను విజయవంతంగా అంత రిక్షంలోకి పంపింది. 1981లో ‘ఆపిల్’ ఉపగ్రహాన్ని రాకెట్ వద్దకు చేర్చడానికి లోహరహిత వాహనం కావాల్సి వచ్చింది. అంతర్జాతీయ ఆంక్షల కారణంగా పెద్ద వ్యయంతో అటువంటి వాహనాన్ని దిగుమతి చేసుకోలేని స్థితిలో ఎడ్ల బండిపై తీసుకెళ్లిన శైశవ దశ. 1987లో ఇస్రోలో చోటు చేసుకున్న ఓ పరి ణామం గురించి సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు సామాజిక మాధ్యమంలో తాజాగా పెట్టిన ఒక వ్యాఖ్య విస్తృతంగా సంచరిస్తోంది. అదేం టంటే, ‘‘1987 మార్చి నెల. ఏఎస్ఎల్వీ–1 ప్రయోగానికి శ్రీహరికోటలో సర్వం సిద్ధమయింది. 31 గంటల కౌంట్‌డౌన్ కూడా పూర్తయింది. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ, ఏపీ గవర్నర్ కుముద్‌బెన్ జోషి, ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, ఇస్రో చైర్మన్ డా.యు.ఆర్.రావు రెండంతస్తుల మిషన్ కంట్రోల్ రూం టెర్రస్ మీద నుంచి రాకెట్ ప్రయోగాన్ని వీక్షించడానికి ఆసీనుల య్యారు. దేశానికి గర్వకారణం కాగల ప్రయోగాన్ని కళ్లారా చూసేందుకు పది వేల మంది ప్రేక్షకుల గ్యాలరీలో, శ్రీహరికోట నివాస గృహాలపైనా వేచి ఉన్నారు. అనుకున్న సమయానికి రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకుపోయింది. పైకి లేస్తుండగానే ఒకరికొకరు అభివాదాలు తెలుపు కుంటూ, కరచాలనాలు చేసుకుంటూ ఉద్విగ్నంగా ఉన్న సమయంలో జరగరా నిది జరిగిపోయింది. నిమిషం కూడా గడవకముందే రాకెట్ బంగాళాఖా తంలో కూలిపోయింది. భయంకర నిశ్శబ్దం, అందరి ముఖాల్లో ఆనందం కనుమరుగై, విషాదం అలుముకుంది. రాజీవ్‌గాంధీ అందరికంటే ముందు తేరుకున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బందిని అనునయించారు. ‘ఇటువంటి శాస్త్రీయ ప్రయోగాల్లో విజయాలే తప్ప అపజయాలుండవు. ముందుకు దూసుకుపోవడానికి ఇదొక అవకాశంగా భావించాల’ని ధైర్యం చెప్పారు. అప్పట్నుంచి అలా పోగుపడిన ధైర్యమే ఈరోజు ఇస్రో బృందాన్ని ప్రపంచ రికార్డు సొంతం చేసుకునేలా చేసింది’’ అని, ఆలిండియా రేడియోకు రిపో ర్టింగ్ చేస్తూ ఘటనా స్థలంలో ప్రత్యక్షసాక్షిగా ఉన్న అనుభవంతో రాశారా యన. ఈ కథనం ఓ అధినేత శాస్త్రీయ దృక్పథాన్ని, సద్యోచనను వెల్లడిస్తోంది. నెహ్రూ నెలకొల్పిన పునాదులపై..... పాశ్చాత్య దేశాల ప్రభావంలో ఉంటుండే నెహ్రూ శాస్త్రీయ దృక్పథం దేశానికి ఎంతో మేలు చేసింది. మనలాంటి ఎదుగుతున్న దేశాలు జాతీయ స్థూలా దాయంలో కనీసం ఒక శాతమైనా శాస్త్రీయ అధ్యయనాలు, పరిశోధనలకు వెచ్చించాలనే వారాయన. శాస్త్ర–పారిశ్రామిక పరిశోధనా మండలి (సిఎస్ ఐఆర్), అణుశక్తి కమిషన్ (ఎఈసీ) వ్యవహారాల్లో తరచూ ప్రమేయం చూపే ఆయన పూనికతోనే జాతీయ శాస్త్ర విధానం, శాస్త్ర విధాన తీర్మానం సాధ్యమ య్యాయి. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత శాస్త్రవేత్తల్ని భారత్‌కు ఆహ్వానించి, తగు మార్గదర్శకత్వం నెరపమని కోరేవారు. బ్రిటన్ను వదిలి వచ్చి భారత్‌లో స్థిరపడ్డ ప్రఖ్యాత శాస్త్రవేత్త జేబీఎస్ హాల్దేన్, తానలా నిర్ణయించుకోవడానికి ప్రధాని నెహ్రూ శాస్త్రీయ దృక్పథమే కారణ మని వెల్లడించారు. నెహ్రూ హయాంలో క్యాబినెట్ శాస్త్రీయ సలహా సంఘ సమావేశాలు ఉత్తేజంగా, నిర్ణయాల అమలు నిజాయితీగా జరిగేదని సీనియర్ జర్నలిస్టు అనీస్ చిస్తీ ఒక వ్యాసంలో పేర్కొన్నారు. 1962 చైనా దూకుడు తర్వాత శాస్త్ర పరిశోధనలకు కేటాయించిన నిధుల్లోంచి కొంత రక్షణ శాఖకు బదలాయించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. పదిశాతం అలా మళ్లించాలని చివరకు ఏకగ్రీవ నిర్ణయమూ జరిగింది. సరిగ్గా అప్పుడే నెహ్రూ అడ్డుకున్నారు. కావాలంటే, అక్కడే రక్షణకు సంబంధించిన శాస్త్రీయ పరిశోధనలకు వెచ్చించండి తప్ప మళ్లింపు వలదని వారించారు. భారత్– పాక్ ఘర్షణల దరిమిలా కూడా ఇలాగే శాస్త్ర పరిశోధనల నిధుల్ని రక్షణకు మళ్లించాలన్న ప్రతిపాదన వచ్చింది. నెహ్రూ లేకపోయినా ఆయన సహచరుడు, భారత అణు కార్య క్రమాల పితామహుడు హోమి బాబా ఈసారి అడ్డుకొని మళ్లింపు లేకుండా చూశారు. 1963 ఆగస్టు 4న ఢిల్లీలో శాస్త్రవేత్తలు, విద్యావేత్తల సదస్సును ప్రారంభిస్తూ నెహ్రూ ఒక గొప్ప మాట చెప్పారు. ‘సైన్స్ ఎంతో ముఖ్యమైంది. అంటే నా ఉద్దేశంలో కేవలం సాంకేతికమైన శాస్త్రం అన్న పరిమిత దృష్టిలో కాకుండా శాస్త్రీయ స్వభావమనే విస్తృతార్థంలో చూసినపుడు. ఎందుకంటే, ఈ సైన్స్ వల్ల గత అర్థ శతాబ్దిలో విశ్వవ్యాప్తంగా అనేక మార్పులొచ్చాయి. నేను– మీలో కొందరు ప్రత్యక్ష సాక్షులం, రాగల నాలుగయిదు దశాబ్దాల్లోనూ పెను మార్పులు రానున్నాయి. అంతరిక్షమనే కాదు, మనిషి జీవితాన్ని ప్రభావితం చేసే అనేకాంశాల్లోనూ ఇది ఖాయం. అందుకు సంసిద్ధం కావాలంటే శాస్త్ర– సాంకేతిక రంగాల్లో మిమ్మల్ని మీరు నవీకరించుకోవాలి’ అన్నారు. అదే తరహాలో సాగిన పంథా ఇందిరాగాంధీ హయాంలో అణుశక్తి కార్యక్రమాలైనా, అంతరిక్ష పరిశోధ నలైనా వ్యూహాత్మకంగా సాగాయి. తొలి పొక్రాన్ అణుపరీక్ష 1974లో జరి గింది. అణ్వాయుధం తయారు చేయబోమని, తమకా శక్తిసామర్థ్యాలు న్నా యని బయటి ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు అణుశక్తిని శాంతియుత అవసరాలకు వినియోగించడమే తమ లక్ష్యమనీ అప్పటి ప్రభుత్వం వెల్లడిం చింది. ఇస్రో ఏర్పాటు, విస్తరణ అన్నీ ఇందిర హయాంలో జరిగినవే! చైనా తన క్షిపణి పరిజ్ఞానాన్ని పెంచుకోవడమే కాకుండా సందేహించదగ్గ స్థాయిలో ఆయుధాలు పోగేస్తోందని రష్యా నుంచి అందిన రహస్య సమాచారం మేరకు భారత్ ప్రతిస్పందించింది. భారత అంతరిక్ష రంగ పితామహుడు విక్రమ్ సారాభాయ్ విశేష సేవలందించారు. 1971లో ఆయన అకాల మరణం తర్వాత పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. నాలుగో పంచవర్ష ప్రణాళిక (1969–74) మధ్యంతర సమీక్షలో ఈ రంగం బడ్జెట్‌ను 15 నుంచి 53 కోట్లకు పెంచారు. అంతరిక్ష కార్యక్రమాలకు రక్షణ అవసరాలకు మధ్య ఓ సంబంధం ఉండాలని అప్పట్లో ఇందిర ఇస్రో చైర్మన్ ఎమ్జీకే మీనన్‌కు లేఖ రాశారు. తదనంతరం అక్కడ పనులు వేగం పుంజుకున్నాయి. ఈ వ్యవహా రాల్లోనే కాకుండా తర్వాత ఇద్దరు ప్రధాన మంత్రుల వద్ద కూడా కీలక శాస్త్ర సలహాదారుగా దివంగత రాష్ట్రపతి డా‘‘ ఏపీజే అబ్దుల్ కలామ్ ముఖ్యపాత్ర పోషించారు. 1996 ఎన్నికల ఫలితాలకు రెండు రోజుల ముందు, నాటి ప్రధాని పీవీ నర్సింహారావు నుంచి కలామ్‌కు పిలుపొచ్చింది. అణుపరీక్షకు సర్వం సిద్ధం చేసుకోండని ఆదేశించారు. ఎన్నికల ఫలితాలు భిన్నంగా వచ్చాయి. అయినా, మరోమారు కలామ్‌ను పిలిపించి అప్పటికి ప్రధానిగా ఖరారైన (డెసిగ్నేటెడ్) అటల్‌బిహారీ వాజ్‌పేయి సమక్షంలోనే అణుపరీక్ష ప్రక్రియను కొనసాగించాల్సిందిగా కోరారు. పార్టీలకతీతంగా, విశాల జనహి తంతో పీవీ ఒక విధాన కార్యక్రమం జరిగేలా సానుకూలత కల్పించి రాజ నీతిజ్ఞత ప్రదర్శించారు. ఎన్డీయే ప్రభుత్వ ప్రధాని వాజ్‌పేయి కూడా అంతే స్ఫూర్తితో స్పందించారు. 1998 మే నెలలో పొక్రాన్ అణుపరీక్షలు నిర్వహించి శాస్త్రీయ దృక్పథంపై తమ నిబద్ధతను చాటారు. సంకుచిత, హస్వ్ర దృష్టితోనే ప్రమాదం శాంతిస్వరూప్ భట్నాగర్, హోమి బాబా, సారాభాయ్, మీనన్, రాజా రామన్న, ఖొరానా, డా.చిదంబరం, యు.ఆర్.రావ్, అబ్దుల్ కలామ్, సతీష్ ధావన్, కస్తూరి రంగన్ వంటి మహామహులు శాస్త్ర భావనల్ని పెంపొం దించిన దేశమిది. దొంగదారులతో, తాత్కాలిక చర్యలతో శాస్త్రీయ రంగంలో కచ్చితమైన ఫలితాలు దక్కవు. ఇందుకు దూరదృష్టి, వ్యూహాత్మక అడుగులు, దీర్ఘకాలిక కృషి అవసరం. ట్విటర్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో చక్కటి భాష వాడినంత మాత్రాన శాస్త్రీయ భావనలు వృద్ధి చెందవు. భారత రాజ్యాంగంలోని 51 (ఎ) అధికరణంలో పేర్కొన్న పౌర బాధ్యతల్లో ‘శాస్త్రీయ స్వభావం’ పెంచుకోవాలని నిర్దేశం ఉంది. ఇందుకు ప్రభుత్వాలు, పాలకులు చోదకశక్తిగా దోహదపడాలి. జనవరి తొలివారం తిరుపతిలో జరిగిన ‘ఇండి యన్ సైన్స్ కాంగ్రెస్’ సదస్సులో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చేసిన ప్రకటన విస్మయం కలిగించింది. తెలుగువారు నోబెల్ బహుమతి తెస్తే వంద కోట్లిస్తామని ప్రకటించారు. ‘నోబెల్ ఎలా సాధించాలి? ఏమైనా మెలకువ లుంటే మా పిల్లలకి చెప్పండి’ అంటూ జపాన్‌కు చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత టకాకి కజిటాని కోరడంతో అంతా నవ్వుకున్నారు. తర్వాత యువశాస్త్రవేత్తల భేటీలో ఇదే విషయంపై పలు సందేహాలు, విమర్శలు తలె త్తాయి. డబ్బుతో ఏదైనా సాధించవచ్చనే భావనతో అనుచిత, అనారోగ్యకర పోటీని పెంచే తత్వం తప్ప మరోటి కాదు. తెలుగు రాష్ట్రాల్లో మెజారిటీ పాఠశాలల్లో, కళాశాలల్లో ప్రయోగశాలల్లేవు. ఉన్నచోటైనా పరికరాలు అలం కార ప్రాయమే! శాస్త్రీయ బోధన అంతంతే! రాష్ట్రంలో శాస్త్ర పరిశోధనలకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా నోబెల్ ఎలా ఆశిస్తారని వారు ప్రశ్నించారు. అవే వందకోట్లు మౌలిక సదుపాయాలకు వెచ్చించాలనే స్పృహ లేకుండా విద్యార్థుల్లో, యువతలో స్ఫూర్తి ఎలా కలిగిస్తారనేది ప్రశ్న. విద్యావకాశాలు, సదుపాయాలు, ప్రమాణాలు, సృజన.. ఇలా ఏ విషయంలో తీసుకున్నా దేశ సగటుకు దిగువన, అట్టడుగునున్న పరిస్థితుల్లో ఫలితాలు ప్రపంచస్థాయిలో ఉండాలనుకోవడం దురాశ! గౌతమ బుద్ధుడన్నట్టు దురాశ దుఃఖ కారణమే! (వ్యాసకర్త : దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com ) -
పల్లె బతుకుపై నగదు పిడుగు
సమకాలీనం పెద్ద నోట్ల రద్దు ముందస్తు కసరత్తు లేకుండా చేపట్టినదనడానికి సాక్ష్యం ఎప్పటికప్పుడు మారుతున్న ప్రభుత్వ నిర్దేశనలే. డిపాజిట్లు పెరిగి డబ్బు పోగవుతున్నా నగదు ఇవ్వలేని స్థితిలో బ్యాకులున్నాయి. లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. గ్రామీణ జన జీవనం కుంటు పడింది. ప్రస్తుత గండం గట్టెక్కితే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతుందని, గ్రామాలు బాగుపడ తాయని అంటున్నారు. కానీ పరిమితంగా ఉన్న రైతాంగపు బ్యాంకు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం వంటివి చూస్తుంటే అది అంత తేలిక కాదనిపిస్తుంది. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఇప్పుడు దేశ గ్రామీణార్థిక వ్యవస్థ స్థితి. నగదు కొరత దాని నడ్డినే విరిచింది. స్థూలంగా చూస్తే తమ ప్రమేయం లేని నల్ల డబ్బును నిర్మూలించే క్రతువు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై మెరుపులు లేని పిడుగులా విరుచుకు పడింది. నగదు కొరతైపై గగ్గోలు పెడుతున్నది సంఘటిత రంగమే అయినా, బాగా కుదేలయింది అసంఘటిత రంగం. ముఖ్యంగా వ్యవసాయం, చిన్న, కుటీర పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, చేతివృత్తులు, సేవలు తదితర రంగాలకూ చేష్టలుడిగినట్ట యింది. రెండేళ్ల వరుస కరువు తర్వాత ఈ ఏడు మంచి వర్షాలు కురిసినా కూడా రైతు కంట కన్నీరుబుకుతోంది. ఖరీఫ్ పంట అమ్మితే డబ్బుల్లేవు. రబీ పంటకు పెట్టుబడి లేదు. పాలు, పళ్లు, కూరగాయలు, కోళ్ల పెంపకం, చేపలు తదితర ఆహారోత్పత్తి రంగం అప్రకటిత సెలవుతో కకావికలమైంది. దినసరి కూలీ, ఉపాధి అవకాశాలపై నేరుగా దెబ్బపడింది. నల్ల సంపదపై పోరులో భాగంగా పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వ లక్ష్యం ఏ మేరకు నెర వేరుతుందో తెలియదు. కానీ సగటు జీవితం దుర్భరమైంది. పాత నోట్లు చెల్లకుండా, కొత్త నోట్లు అందుబాటులోకి రాక ఈ పక్షం రోజుల చేదు అను భవం వర్తమానాన్ని కష్టాల కొలిమిలో కాలుస్తోంది. భవిష్యత్తుపై మరింత ఆందోళన కలిగిస్తోంది. దేశంలో దాదాపు 60% జనాభా వ్యవసాయ, అను బంధ రంగాలపై ఆధారపడ్డారు. మనది 80%కుపైగా బ్యాంకేతర సంప్ర దాయ ఆర్థిక వ్యవస్థ కావడంతో ఈ సమస్య మరింత జటిలమైంది. నగదు కొరత సమస్యను సత్వరం పరిష్కరించకుంటే స్వల్ప, మధ్య కాలిక ఆర్థిక మాంద్యానికి దారితీసే పెను ప్రమాదం ఉన్నదని ఆర్థికవేత్తలు హెచ్చరి స్తున్నారు. ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతింటాయని, వృద్ధి మందగిస్తుందని పెట్టుబడుల సేవా సంస్థ ‘మూడీస్’ తన తాజా నివేదికలో పేర్కొంది. అదే జరిగితే, ప్రధానంగా ప్రభావితమయ్యేది మళ్లీ గ్రామీణార్థిక వ్యవస్థే అనడం నిస్సందేహం. ఈ చర్య తగు ముందస్తు కసరత్తు లేకుండా చేపట్టినదనడానికి సాక్ష్యం గురువారం రాత్రి వరకూ ఎప్పటికప్పుడు మారుతూనే ఉన్న ప్రభుత్వ నిర్దేశనలే. డిపాజిట్లు పెరిగి బ్యాంకు రికార్డుల్లో డబ్బులు పోగవుతున్నా... నగదు ఇవ్వలేని స్థితిలో అవి ఉన్నాయి. దీంతో లావాదేవీలన్నీ నిలిచిపో యాయి. మొత్తం గ్రామీణ జన జీవనమే కుంటి నడకన సాగుతోంది. కోలు కునేదెన్నడో అంతుబట్టడం లేదు. కష్టం ఒక్క తీరున లేదు ప్రపంచంలో ఏ దేశం నగదు రద్దు చర్యలు తీసుకున్నా, పకడ్బందీ ప్రత్యా మ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంది. కొత్త నోట్లు, చెల్లుబాటయ్యే నోట్లతో రద్దయిన నోట్లు మార్చుకునే సదుపాయం కల్పిస్తుంది. పైగా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాలు, గతంలోని ఆయా సందర్భాల్లో ఆర్థిక వ్యవస్థను ఇంతగా కుదపక పోవడానికి కారణం రద్దయిన నోట్ల నిష్పత్తి తక్కువగా ఉండటమే! నేడు రద్దయిన నోట్లు 85% కావడంతో ప్రభావ తీవ్రత పెరిగి, అంత మేరకు ద్రవ్య వ్యవస్థ స్తంభించినట్టయింది. గడువు తర్వాత చెల్లవనడంతో పాత నోట్లన్నీ క్రమంగా డిపాజిట్ అవుతున్నాయి. పలు పరిమితుల నడుమ పాత, కొత్త నోట్లు మార్చుకునే సదుపాయం కల్పించినా అది పెద్దగా అవసరాలు తీర్చ లేదు. కొత్త, చెల్లుబాటయ్యే నోట్లు బ్యాంకుల్లోకి రాలేదు. దాంతో తెరిచిన ఒకటి, రెండు గంటల్లోనే డబ్బు లేదని బ్యాంకులు, ఏటీఎమ్‌లు చేతులెత్తు తున్నాయి. జరుగుబాటుకు డబ్బు దొరక్క జనం... పేద, ఎగువ, దిగువ మధ్య తరగతి వారంతా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మొదట్లో ప్రధాని, ఆర్థిక మంత్రి చెప్పినట్టు రెండు, మూడు రోజులో, వారమో ఉంటుం దనుకున్న ఈ సమస్య పక్షం రోజులైనా తగ్గలేదు. పైగా ముదురుతోంది. ఖర్చులు బాగా తగ్గించుకొని పౌరులు సంపూర్ణ సహకారం అందిస్తున్నా... నగదు తరిగిపోతుండటంతో దినసరి వ్యవహారాలను రద్దు చేసుకోవాల్సి వస్తోంది. వ్యాపారాలు, వ్యాపకాలు, అమ్మకాలు, కొనుగోళ్లు అన్నీ నిలిచి పోయాయి. ఈ మేర ఉత్పత్తి రంగంపైన, ముఖ్యంగా నిలువ ఉండని పాలు, పూలు, కూరగాయలు, పండ్లు వంటి వ్యవసాయోత్పత్తుల విక్రయాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఇతర ఉత్పత్తులదీ ఇదే గతి! ఉపాధి అవకాశాలూ దెబ్బతింటున్నాయి. దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా కొన్ని లక్షలల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచి వర్షాలు కురిసినా... సమయానికి ఎరువులు, విత్తనాలు కొనేందుకో, కూలీ లకిచ్చేందుకో చేతిలో డబ్బుల్లేక నానా పాట్లు పడుతున్నారు. ప్రయివేటు, ప్రభుత్వ ఉద్యోగులకూ కష్టంగానే ఉంది. ఐదారు రోజుల్లో డిసెంబరు వస్తుంది. నెల మొదలైన తొలి వారంలో ఉండే అవసరాలకు నగదెట్ల? అంతు బట్టకుండా ఉంది. నల్లడబ్బును నలిపేసే సంగతి సరే, మా డబ్బు మేం తీసు కోలేని ఈ దురవస్థ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారాన్నంతటినీ వ్యవస్థీకృత, చట్టబద్ధ లూటీగా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ గురువారం రాజ్యసభలో అభివర్ణించారు. ‘బ్యాంకులో దాచుకున్న తమ డబ్బును ఖాతా దారులే పొందలేని దుస్థితి, ఇప్పుడిక్కడ తప్ప... ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండదు’ అన్నారు. ఈ పులి మీద స్వారీ....కడదాకా సాగేనా? గమ్యం మాత్రమే కాదు, అందుకు నిర్ణయించుకున్న మార్గమూ అంతే ముఖ్యమని గాంధీజీ ఊరకే అనలేదు. కుటుంబ నియంత్రణను అందరూ సమర్థిస్తారు. కానీ, ఎమర్జెన్సీ కాలంలో దాన్ని అమలుపరచిన తీరు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. నేటి ‘నల్ల ధనంపై పోరు’ను అమలుచేస్తున్న తీరు కూడా అలాంటిదే! ప్రజల కష్టాలు చూసి దీన్ని విమర్శించిన వారిపై మొదట్లో ఒంటి కాలిపై లేచిన ‘అధికారిక దేశభక్తులు’ సైతం సామాజిక మాధ్యమాల నుంచి మెల్లగా తోక ముడుస్తున్నారు. నిర్వహణ వైఫల్యాల వేడి తమకూ తాకేసరికి కాస్త మెత్తబడ్డారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో నోట్ల రద్దు అనుకూల పోస్టింగ్‌లు తగ్గాయి. ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలనే డిమాండు విపక్షాల నుంచి, పౌర సమాజం నుంచి పెరుగుతోంది. నగదు అందుబాటు ప్రక్రియను వేగవంతం చేసి, తక్షణమే నగదు కొరతను తీర్చ కపోతే అన్ని రంగాల్లో అశాంతికి దారి తీస్తుందని ఆర్థిక నిపుణులంటున్నారు. ఫలితం, ఆర్థిక వ్యవస్థ మందగించడమే కాదు, దీర్ఘకాలికంగా ఇది దేశ ఆర్థిక, రాజకీయ భవితవ్యాన్నే శాసిస్తుంది. బీజేపీ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధాని చేసిన ప్రసంగాన్ని బట్టి దేశంలో నల్లసంపదను తొలగించే సుదీర్ఘ ప్రక్రియలో పెద్ద నోట్ల రద్దు ఆరంభం మాత్రమే! గొలుసు కట్టు చర్యలుంటాయని సంకేలించారు. ప్రస్తుతానికి బంగారం క్రయ, విక్రయాలపై నిఘా, హవాలా నియంత్రణ, బినామీ ఆస్తులు, రియల్ ఎస్టేట్ల అదుపు, సమగ్ర పన్ను వసూళ్లు, అధికార అవినీతి నిర్మూలన. రాజకీయ-ఎన్నికల సంస్కరణల అమలు ఈ క్రమంలో రావాల్సిన తదుపరి చర్యలు. నల్లధనంపై తమ చర్యలకు 90% ప్రజల మద్దతుందని ప్రధాని పేర్కొనడంపై బయటి వారి సంగతెలా ఉన్నా, స్వపక్షీయులే కొందరు సందేహాలు వ్యక్తం చేస్తు న్నారు. ప్రధాని ‘యాప్’కు వచ్చిన ప్రజాభిప్రాయాన్ని ఆయన కార్యాలయం ఎలాగైనా చెప్పుకోవచ్చన్నది ఈ సందేహం వెనుక సహేతుకత! ‘80% తాగు బోతులున్న రాష్ట్రంలోనూ, తాగుడు గురించి జనాభిప్రాయ సేకరణ చేయండి, తాగడం మంచిది కాదనే అభిప్రాయమే వస్తుంది’ అని ఓ సామాజిక విశ్లేషకుడు చెప్పిన మాట ఇందుకు సరిపోతుంది. ఎమర్జెన్సీ కాలంలోనూ ప్రభుత్వం సరైన నిర్ణయమే తీసుకుందని అత్యధిక దేశ ప్రజలు అభిప్రాయ పడుతున్నట్టు నాటి ప్రధాని ఇందిరా గాంధీకి అధికారిక సర్వేలు అందాయి. నల్ల డబ్బును లేకుండా చేస్తామంటే ఎవరూ వ్యతిరేకించరు. కానీ ఆ అంశంపై తీసుకున్న విధాన నిర్ణయం అమలులోని నిర్వహణా లోపాలు, వైఫల్యాలు పౌరులను సుదీర్ఘంగా కష్టపెడితే వారు సహించరనేది చరిత్ర చెప్పిన సత్యం. వారి అభిప్రాయం అందుకు సరిగ్గా వ్యతిరేకంగా మారే ఆస్కారం ఉంటుంది. అదే జరిగితే, ఈ సమస్య ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలిగించి, వృద్ధి రేటును మందగిపజేయడంతోనే ఆగదు. ఏడాదిలో జరగాల్సి ఉన్న ఐదు రాష్ట్రాల ఎన్ని కల్లో పాలకపక్షం ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. అది నల్ల సంపదపై యుద్ధానికి భవిష్యత్తులో తలపెట్టనున్నామంటున్న ఆరంచెల సంస్కరణల అమలూ ఎన్డీఏ ప్రభుత్వానికి కష్టమౌతుంది. నిబద్ధత చూపకుంటే... ఆచరణపై అనుమానాలు ప్రస్తుత గండం గట్టెక్కితే ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతుందని, వడ్డీరేట్లు- ద్రవ్యోల్బణం తగ్గి గ్రామాలు బాగుపడతాయని ప్రభుత్వం చెబుతోంది. గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థ, రైతాంగపు పరిమితమైన బ్యాంకు ఖాతాలు, క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం, నగదు రహిత బ్యాంకింగ్ వ్యవహారాలు సాగించే కుటుంబాల నిష్పత్తి... ఇవన్నీ చూస్తుంటే లక్ష్య సాధన అంత తేలిక కాదనిపిస్తుంది. ఆర్థిక సంస్కరణలను చిత్తశుద్ధితో అమలు చేపట్టినా మార్పు లకు సమయం పడుతుంది. నగదు రహిత బ్యాంకింగ్ పద్ధతుల్ని ప్రోత్స హించడాన్ని ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే ప్రారంభించాయి. ‘మీరు రక్తం చిందించండి, నేను మీకు స్వాతంత్య్రం సాధించిపెడ్తాను’ అని సుభాష్ చంద్రబోస్ అన్నట్టు... ‘50 రోజులు కష్టాలు భరించండి, మీకు అవినీతి రహిత భారత్‌ను అందిస్తాను’ అని ప్రధాని అన్నారు. దీంతో ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అంచనాలు బాగా పెరిగాయి. కానీ, జరుగుతున్న పరిణామాలు కొత్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో, నగదు మార్పిళ్లలో జరుగుతున్న అవకతవకలే అందుకు నిదర్శనం. ఆర్బీఐ నుంచి బ్యాంకుల దాకా చాలా తప్పుడు వ్యవహారాలు నిరాటంకంగా సాగుతు న్నాయి. కోట్ల రూపాయల కొత్త నోట్లు దారి మళ్లుతున్నాయి. లైన్లలో గంటలు, రోజుల తరబడి నిరీక్షించిన వారిని ‘నో క్యాష్’ బోర్డులు వెక్కిరి స్తున్నాయి. పలుకుబడి కలిగిన, కమిషన్ శాతాలు చెల్లించగలిగిన వారి నోట్ల కట్టలే అక్రమంగా మారుతున్నాయి. అక్కడక్కడ కేసులు కూడా నమోదవు తున్నాయి. 10, 20, 30 శాతం కమీషన్‌తో పాత-కొత్త నోట్ల మార్పిళ్ల మార్కెట్ రహస్యంగా సాగుతూనే ఉంది. వీటిని అడ్డుకొని కొత్త విశ్వాసాన్ని కలిగించాలి. ప్రభుత్వం కుహనా ప్రతిష్టకు పాకులాడక విపక్షాల విమర్శల్ని నిర్మాణాత్మక సూచనలుగా తీసు కోవాలి. ఈ పరిణామాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలి. లోపాలు సరిదిద్ది పౌరుల కష్టాలు తొలగించడానికి, భవిష్యత్ విధానాల రూపకల్పనకు నేతలు, నిపుణులు, మేధావులతో కమిటీ వేయాలి. చిత్తశుద్ధితో కృషి చేసి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలే తప్ప, పొదుపు ముసుగు కప్పి నిర్బంధపు వ్యయ పరిమితులు విధించడం సరికాదు. ఇదే ప్రజల ‘వ్యయ సంస్కృతి మార్పు’ అని గప్పాలు కొట్టడం సమంజసం కాదు. బాపూజీ అన్నట్టు ‘భారతదేశం గ్రామాల్లో ఉన్నద’ని గ్రహించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బతికించాలే తప్ప చంపరాదు. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
బాలయ్య అలా...మాల్యా ఇలా?
సమకాలీనం నల్ల సంపదలో పది శాతం కూడా లేని నగదు రూప నల్లధనంపై ఇంత పోరు చేస్తున్న వారు.. బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల ఖాతాదారుల ఆస్తులను ఎందుకు జప్తు చేయరు? సామాన్యులను ఇన్ని కష్టాలు పెట్టి బ్యాంకులకు చేర్చే లక్షల కోట్ల నల్లధనం వల్ల సమకూరే ప్రయోజనాలను సామాన్యులకు అందిస్తారా? లేక కాకుల్ని కొట్టి గద్దల్ని మేపిన చందంగా కార్పొరేట్లకు మేలు చేస్తారా? బ్యాంకుల మొండి బకాయిలను రద్దు పద్దులకు బదలాయించడాన్ని చూస్తుంటే ఈ అనుమానాలు బలపడుతున్నాయి. ఇద్దరు భారతీయులు వేర్వేరు సమయాల్లో, వేర్వేరు లక్ష్యాలతో విదేశాలకెళ్లారు. అంతిమంగా విభిన్న ఫలితాలు సాధించారు. ► చేసిన చిన్నపాటి బ్యాంకు అప్పుతీర్చడానికి ఇక్కడి వ్యవసాయం గిట్టుబాటుగాక, రేయింబవళ్లు కష్టపడి నాలుగు డబ్బులు వెనకేసైనా అప్పు తీర్చొచ్చని మెదక్ జిల్లా ధర్మారం రైతు వర్దా? బాలయ్య దుబాయ్ వెళ్లాడు. ఆశించిన సంపాదన కుదరక, వెనక్కి తిరిగి వచ్చి సొంత భూమి అమ్మే క్రమంలో సర్కారు వారి ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయమే పెనుశాపమై కుటుం బంతో సహా విషం తీసుకొని చనిపోయాడు. ► చేసిన పెద్ద మొత్తం బ్యాంకు అప్పు చెల్లించకుండా ఎగ్గొట్టి, కోర్టు శిక్షల నుంచి తప్పించుకోవడానికి ‘కింగ్’ఫిషర్ విజయ్ మాల్యా లండన్ వెళ్లాడు. తను వెనక్కి తిరిగి రాకపోగా 1200 కోట్ల రూపాయల అప్పును మొదట బ్యాంకు నిరర్థక ఆస్తి (ఎన్పీఏ)గా, ఇప్పుడేకంగా రద్దు (రైటాఫ్) పద్దుగా ప్రక టింపజేసుకొని బ్యాంకులు–ఖాతాదారుల సత్సంబంధాల సంస్కృతినే చంపే శాడు. అదీ, సామాన్యునికి కార్పొరేట్‌కి మధ్య తేడా! అంతే అనుకుంటే పొర పాటు! సదా ప్రజాపక్షం వహించాల్సిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా సామాన్యుల్ని పట్టించుకోకుండా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కార్పొరేట్లకు మేలు చేసే చర్యల వైపే మొగ్గుతున్నాయి. ఇది ప్రమాద సంకేతం. నల్లధనం విధ్వంసానికి చర్యలు సరే సామాన్యుని ఇబ్బందుల్ని పరిష్కరించే చర్యలు చేపట్టండని అత్యున్నత న్యాయస్థానం కేంద్ర ప్రభుత్వానికి బుధవారం దిశానిర్దేశం చేసింది. ‘మీరేమో ఇది సర్జికల్ స్రై్టక్ అంటున్నారు, ప్రతివాదు లేమో కార్పెట్ బాంబింగ్ (ప్రజలపై విచక్షణా రహితంగా బాంబులు కురిపిం చడం) అంటున్నారు. ఏదైనా లక్ష్యం నల్ల కుబేరులైనపుడు సామాన్యులపై సర్జికల్‌స్ట్రైక్స్ సరికాదు. అమాయకులకు వాటిల్లే నష్టం (కొల్లేటరల్ డ్యామేజి) ఎక్కువ లేకుండా చూసుకొమ్మ’ని నిర్దిష్టంగా సూచించింది. అదే రోజున మాల్యా మొండి బకాయిల రద్దు అంశం పార్లమెంటులో వివాదాస్పదమ వడం, కుటుంబ సభ్యులందరికీ కోడి కూరలో విషం కలిపి తినిపించి రైతు బాలయ్య ఆత్మహత్య చేసుకోవడం యాదృచ్ఛికమే అయినా, పరస్పరం సంబంధంలేని అంశాలేం కావు. ఒకదానితో మరొకటి ముడిపడిందే! ఇది మన కరెన్సీతో, బ్యాంకులతో, ఆర్థిక వ్యవస్థతో, ప్ర«భుత్వ ప్రాధాన్యాలతో ప్రత్యక్షంగా ముడిపడి ఉన్న అంశం. ముఖ్యంగా సమాంతర ఆర్థిక వ్యవస్థను నడుపుతున్న నల్ల కుబేరుల కుంభస్థలంపై కొట్టాలని, అవినీతికి, అక్రమ వ్యవహారాలకు, ఉగ్రవాదానికి దన్నుగా నిలుస్తున్న నల్లధనాన్ని నలిపేయా లని కేంద్రం ‘పెద్ద నోటు రద్దు’ నిర్ణయం ప్రకటించిన తర్వాతి పరిణామాలు వెలువరిస్తున్న కీలక సంకేతం! ఎవరికి దన్నుగా ఉంటున్నాం? ఎవరిని ఇబ్బం దుల పాలుచేస్తున్నాం? ఏ సంస్కృతిని నలిపేసి మరే విష సంస్కృతికి ఊపిరి పోస్తున్నాం? అన్నది చాలా కీలకాంశం. వాదన సరే, వాస్తవమేంటి? బ్యాంకుల్ని ముంచిన విజయ్ మాల్యా పన్నెండొందల కోట్లు సహా మొత్తం రూ. 48,000 కోట్ల మొండి బకాయిల్ని రద్దు చేసిన నిర్ణయం ఎవరికి మేలు చేసేది? ‘రద్దంటే రద్దూ కాదు....’ అని మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఓ సమర్థింపు రాగం తీశారు. అంతా గోప్యంగా జరిగిపోతుండగా, ‘డీఎన్ఏ’ పత్రిక ఇచ్చిన కథనం వల్ల రేగిన వివాదంతో పార్లమెంటు వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. ‘రద్దు (రైటాఫ్) పద ప్రయోగం సాంకేతికమే, ఖాతాదారుల నుంచి బకాయలు ఖచ్చితంగా వసూలు చేసి తీరుతాం’ అని వివరణ ఇస్తూ చెప్పకనే ఓ చేదు నిజం చెప్పారు. ‘బ్యాంకు పుస్తకాల్లో లెక్కల కోసం, మొండి బకాయిలు(ఎన్పీఏలు)గా ఉన్న వాటిని ఆ పద్దు నుంచి తొలగించి, మరో పద్దు కింద చూపడం అంతే!’ అన్నారు. అంటే, బ్యాంకుల స్థితిగతుల్ని చూపేటప్పుడు, సాంకేతికంగానే అయినా... వసూలు కావాల్సిన వాటిని బకాయిలుగా కాక, ఇక ఎప్పటికీ వసూలుకు ఆస్కారం లేని పద్దు కింద చూపించడంతో ఇవి లెక్కలోకి రావు. కాబట్టి బ్యాంకు ఆర్థిక స్థితి బాగున్నట్టు కనిపిస్తుంది. ఇది ఎవర్ని మోసం చేయడానికి? అప్పు తీసుకున్నది నిజం, చెల్లించని మాట నిజం, వసూలు చేయాల్సిన అవసరం ఉన్న మాట నిజం, మరి పద్దు మార్పెందుకు? సమా ధానం లేదు. ‘ఏం చేస్తారో తెలీదు, వచ్చే 2017 మార్చి నాటికి వాటిని ఒదిలించుకోండి....’ అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చెబుతూ వచ్చిన ‘క్లీన్ అప్’(ప్రక్షాళన)లో భాగంగా జరిగిందే ఇది! నల్లధనంపై తాజాగా కొనసాగిస్తున్న యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకుల డిపాజిట్లు, ఆరోగ్యకర లావాదేవీలు పెరుగనున్న తరుణంలో ఈ చర్యలు అవసరమా? అన్న సందేహం కలుగు తుంది. నల్ల సంపదలో పది శాతం కూడా లేని నల్లధనం (కరెన్సీ)పై ఇంత పోరు చేస్తున్నవారు, బ్యాంకుల్లో పేరుకుపోయిన మొండి బకాయిల ఖాతా దారుల ఆస్తులను ఎందుకు జప్తు చేయరు? అని సామాన్యులు కూడా ప్రశ్ని స్తున్న తరుణంలో తాజా ‘రద్దు’ అవసరమా? పెద్ద మొత్తాల్లో బ్యాంకుల నుంచి రుణాలు పొంది, తిరిగి చెల్లించని ఇతర ఎగవేత దారులకు ఎటువంటి సంకేతాలిస్తున్నాం? అన్నది ముఖ్యం. మొండి బకాయిల్లో ప్రపంచంలోనే మన పరిస్థితి అధ్వానం. మొత్తం రుణాల్లో ఎన్పీఏలు (మొండి బకాయిలు) 8.6 శాతంగా ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, గ్రీస్ మాత్రమే మనకంటే అధ్వా నంగా ఉన్న దేశాలంటేనే పరిస్థితి తీవ్రత స్పష్టమౌతోంది. కాకుల్ని కొట్టి గద్దలకేస్తారేమో? ‘సామాన్య, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వారికి తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా... దీర్ఘకాలికంగా ప్రస్తుత చర్య మేలు చేసేదే’అనే అభిప్రాయం మెజారిటీ ఆర్థిక మేధావి వర్గంలో వ్యక్తమౌతోంది. ఈ చర్యతో చలామణిలో ఉన్న 87 శాతం డబ్బు (రద్దయిన పెద్ద నోట్లు) ఎటు తిరిగి ఈ 50 రోజుల్లో తప్పనిసరిగా బ్యాంకు గవాక్షానికి రావాల్సిందే! అక్కడ ఏ లెక్కకా లెక్క తేలుతుంది. ఫలితంగా దొంగ నోట్లు నూరు శాతం గల్లంతే! ఆకాంక్ష, అంచనా ప్రకారం ఈ దెబ్బతో... లెక్కలకెక్కకుండా మరుగునున్న నల్లధనం బ్యాంకులకు రాకూడదు. తద్వారా అది ఇక శాశ్వతంగా లేకుండా పోవాలి. కానీ, పాత–కొత్త నోట్ల మార్పిడిని సైక్లింగ్ పద్ధ్దతుల్లో జరిపించడం, పరిమితికి లోబడే అయినా తమవి కాని ఖాతాల్లో డిపాజిట్ చేయించి–తిరిగి పొందడం... తదితర పద్ధతుల్లో నల్లధనాన్ని అక్రమార్కులు తెల్ల ధనంగా మారుస్తున్నారని వార్తలొస్తున్నాయి. దీన్ని ఎలా అడ్డుకుంటారో, ఏ పద్ధతిన నియంత్రిస్తారో ప్రభుత్వ ఆర్థిక నిపుణులే చెప్పాలి. ఐటీ కొరడా బెదిరిం పులతో కొన్ని నియంత్రణ చర్యలిప్పటికే చేపట్టారు. పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్న సదాలోచనా పరులూ కొన్ని సూచనలు చేస్తున్నారు. నల్లధనాన్ని నిర్మూలించడానికి ఈ ఒక్క చర్యే సరిపోదు. అక్రమ, సక్రమ పద్ధతుల్లో సంపాదించి, పన్ను పరిధిలోకి తేకుండా పోగు చేసిన నల్ల సంపద అనేక రూపాల్లో ఉంది. అందులో, నల్లధనం (కరెన్సీ) పదిశాతం లోపే (ఏడెనిమిది శాతాన్ని మించదనేది మరో లెక్క) అన్న అభిప్రాయం ఉంది. ఏదైతేనేం, ఇదొక మంచి ప్రారంభం అనుకున్నా... ఇంకా చాలా చర్యలను పరంపరగా కొనసాగించాలని, ఒకదానితో మరొకదాన్ని ముడిపెట్టాలని, అప్పుడే ప్రభా వమైనా, ఫలతిమైనా ఉంటుందని వారి అభిప్రాయం. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకోవడానికి చేసే రుణమాఫీ అమలుకు ఎన్నో అభ్యంతరాలు వ్యక్తం చేసే బ్యాంకర్లు, అధికారిక ఆర్థికవేత్తలు కార్పొరేట్లకిచ్చే దొడ్డిదారి వెసలుబాట్లను ఎందుకు ప్రశ్నించరు? ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వ్యవసాయ రుణ మాఫీ ప్రకటించే వారు, అధికారంలోకి వచ్చాక తమ ఆర్థిక ప్రాథమ్యాలు మార్చు కొని ఆ మేర బడ్జెట్ కేటాయింపులతో మాఫీ చేస్తామన్నా.... ‘అది బ్యాంకుల రుణ సంస్కృతిని, ఖాతాదారుల చెల్లింపు సంస్కృతిని చెడగొడుతుంద’ని నీతి మాటలు చెప్పే పెద్దలు, ఈ కార్పొరేట్ మొండి బకాయిల ‘రద్దు’ ఏ సంస్కృ తిని పెంచుతుందంటారో! మొన్నటి బ్యాంకుల ‘విలీనాలు’, నిన్నటి‘ క్లీన్ అప్’లు, నేటి ‘రద్దు పద్దు’లను చూస్తుంటే రేపటి వెలుగును కూడా చీకటి చేస్తారేమోనని భయమేస్తోంది. ప్రభుత్వం అంచనా వేస్తున్నట్టు రూ. 3 లక్షల కోట్ల నల్ల« దనం బ్యాంకులకు రాదనుకున్నా... పెద్ద మొత్తంలో డబ్బు బ్యాంకు లకు వచ్చి చేరుతుంది. ప్రస్తుత చర్యలతో పాటు తదుపరి చర్యలూ ఇక కఠినతరంగా ఉంటాయి కనుక బ్యాంకింగ్ డిపాజిట్లు, సక్రమ లావాదేవీలు పెరిగి వడ్డీరేట్లు తగ్గుతాయి. ఆ మేర ద్రవ్యోల్బణమూ తగ్గుతుంది. ఈ ప్రయో జనాల్ని సామాన్యులకు అందిస్తారా? లేక కాకుల్ని కొట్టి గద్దల్ని మేపినట్టు కార్పొరేట్లకే మేలు చేస్తారా? అన్న సందేహాలు కలుగుతున్నాయి. బ్యాంకుల మొండి బకాయిలను (ఎన్పీఏలను) రద్దు పద్దులకు బదలాయించిన చర్యలు పంపుతున్న సంకేతాలు ఈ అనుమానాల్ని బలోపేతం చేస్తున్నాయి. కసరత్తు జరక్కే కష్టాల కొలిమి! కుబేరుల నుంచి కూలీల వరకు, చిత్ర పరిశ్రమ నుంచి చిరు వ్యాపారి దాకా దేశంలోని అందరినీ ప్రత్యక్షంగా ప్రభావితుల్ని చేసిన ‘పెద్ద నోట్ల రద్దు’ నిర్ణయం వెల్లడికి ముందు అవసరమైన కసరత్తు జరగలేదు. జరిగుంటే, తగు ముందస్తు ఏర్పాట్లు, పౌరులకు ప్రత్యామ్నాయాలు అందుబాటులోకొచ్చేవి. వందనోట్లు, అంతకన్నా చిన్నవి విరివిగా లభించేవి. ఇప్పుడున్న ఏటీఎంలే ఉపయోగపడేలా రూ. 2,000 నోటు తగిన సైజులో వచ్చేది. అసలు అదెం దుకు వచ్చిందో హేతుబద్ధ్దమైన కారణం దొరికేది. వెయ్యి నోటు వస్తుందో, రాదో సందిగ్ధం తొలగేది. కొత్త రూ. 500 నోటు కొరత తీరేది. ఆ కసరత్తు అసలే జరగలేదనడానికి ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులు, రోజు రోజుకూ మారుతున్న ప్రభుత్వ నిర్దేశాలే అందుకు నిదర్శనం. 200 ఏళ్ల చరిత్ర కలిగిన ఎస్బీఐ వంటి బ్యాంకు నిపుణుల సూచనలు, సలహాలు ఎందుకు తీసుకో లేదో అర్థం కాదు. ఇంత పెద్ద నిర్ణయం ప్రకటించి, ఆచరిస్తున్నపుడు తగు కసరత్తు జరిగి ఉండాల్సిందని ఎవరైనా కోరుకుంటారు. ప్రజలకు ఇబ్బం దులు రాకుండా జేసే ముందు చూపును విడనాడి, దూకుడుగా చేసిన ప్రక టనతో ఆశించిన రాజకీయ ప్రయోజనమే ఎక్కువున్నట్టు స్పష్టమౌతోంది. నల్లసంపద/నల్లధనంపై యుద్ధం వద్దని ఎవరూ అనరు. ఈ సర్జికల్ స్రై్టక్తోనే సరిపెడతారా? అసలైన యుద్ధం చేసే ఆలోచన పాలకులకుందా? అన్నదే సందేహం! దేశీయ నల్లధనంపై దాడితో పాటు విదేశీ నల్లధనంపై, వివిధ రూపాల్లోని నల్ల సంపదపై, బ్యాంకుల్ని ముంచుతున్న మొండి బకాయి దారులపై చర్యలకు పూనుకుంటేనే నిజమైన యుద్ధం. అసలు యుద్ధం వేరు. పరిమితమైన సర్జికల్ స్రై్టక్స్ వేరు. సరిహద్దు నుంచి అర కిలోమీటరు లేదా ఒకటిన్నర కిలోమీటర్లకు మించని శతృభూభాగంలో చేసే లక్ష్యిత దాడులే సర్జికల్‌స్ట్రైక్స్. విజయ్ మాల్యా మొండి బకాయిల రద్దు ద్వారా..... నిర్యుద్ధ భావనలే సర్కారు సంకేతాలయితే, ఇన్ని కష్టాలు, త్యాగాలతో రేపటి వెలు గుల కోసం నిరీక్షిస్తున్న దేశ పౌరులు స్వల్ప పరిధికి పరిమితమైన ఈ సర్జికల్ స్ట్రైక్స్ తో సరిపెట్టుకోవాల్సిందే! ఈ–మెయిల్ dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
దొంగల జోడీ... సంపద దోపిడీ
సమకాలీనం రాజకీయ అవినీతి, అధికారుల అవినీతి మన వ్యవస్థను పట్టిపీడిస్తున్నాయి. విధాన నిర్ణ యాలు, అమలు, ప్రాజెక్టులు, అభివద్ధి, సంక్షేమం తదితర కార్యక్రమాలకు సంబంధించి అత్యున్నత స్థాయి నుంచే అవినీతి మొదలవుతోంది. అడ్డదారి నేతలు, అంటకాగే అధికా రుల ప్రయోజనాలు కలగలసిపోయి అవినీతి తారస్థాయికి చేరుతోంది. నేతలు ప్రతి ఐదేళ్ల కోసారి ప్రజాతనిఖీకి వెళ్తుంటారు. కానీ, తప్పుచేసిన అధికారులకు.. బదిలీలు, సస్పెన్షన్ల వంటి చిన్న శిక్షలు తప్ప జరిగే నష్టమేమీ లేదని, అదే వారి ధీమా అని విశ్లేషకుల మాట. ఓ పోలీసు ఉన్నతాధికారిని పట్టపగలు హతమార్చిన హంతకునితో జతకట్టి, అవినీతి పునాదులపై పోలీసులే నేర సామ్రాజ్యాన్ని నిర్మిస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో సేవలందిస్తున్న ఓ యువ ఐపీఎస్ అధికారి అర్థంకాని ఒత్తిళ్ల మధ్య నలిగి అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుంటే... రెండు నెలలవుతున్నా కారణాలు తెలియవు. పోలీసు పెద్దల పురమాయింపులు, వసూళ్ల ఒత్తిళ్లు భరించలేక దేశ సైనికుడిగా సేవలందించి వచ్చిన ఓ యువ ఎస్సై సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకు చస్తాడు. ఇవి మన ఆంతరంగిక భద్రతా విభాగంలో వెలుగుజూస్తున్న తాజా పరిణామాలు. కొత్త సినిమా కథలా ఉన్నా ఇవి కఠోర వాస్తవాలు. ప్రజాస్వామ్యం ముసుగులో సామాన్యునికి తగిలే ఈ దెబ్బల బాధితులే తప్ప బాధ్యులుండరు. నీతికీ, నియమాలకూ నీళ్లొదిలి అడ్డదా రులు తొక్కేవారికి సంపదే తప్ప సమస్యలుండవు. దుర్ఘటనల జనాసక్తికర కథనాలే తప్ప అధికార వ్యవస్థ జవాబుదారీతనంసున్నా! ఎందుకిలా జరుగు తోంది? ఒక్కమాటలో చెప్పలేం. చాలా కాలంగా పోలీసు తదితర కీలక ప్రభుత్వ శాఖల్లో, దారితప్పిన రాజకీయ మంత్రాంగంతో జోడీకట్టే అధికార యంత్రాంగం పుణ్యమానిప్రభుత్వ వ్యవస్థలన్నిటా బలపడుతున్న అవినీతి విశంఖలతకు ఇవి మచ్చుతునకలు. ఇంకా లోతుల్లోకి వెళితే గగుర్పాటు కలిగించే అరాచకాలు, అన్యాయాలు యథేచ్ఛగా సాగుతుంటాయి. ఆశ్చర్యం కలిగించే వింత కథనాలూ ఉంటాయి. పాలనావ్యవస్థల్ని కేన్సర్‌లా కమ్ము కుంటున్న అవినీతి సగటు మనిషి జీవితపు ప్రతి పార్శా్వన్నీ తాకుతోంది. మనిషి నిత్యజీవితంతో విడదీయరాని బంధమున్న పలు కీలక విభాగాల్లో లంచాల ‘సరఫరా గొలుసులు’న్నాయి. అట్టడుగు స్థాయిలో ఎవరో వసూళ్లు చేస్తారు, పై మెట్లలోని అధికారులకి లెక్కల ప్రకారం వాటాలందుతాయి. ఈ శంఖలంలో ఇమిడితే సరేసరి, లేదంటే స్వయంగా తప్పుకోవాలి లేదా తప్పి స్తారు. రెండూ జరక్కపోతే ఓ శశికుమార్లాగో, ఓ ఆర్కేరెడ్డిలాగో హతమై పోయే పరిస్థితులు కల్పిస్తారు. చిన్నప్పట్నుంచి ఎంతో శ్రమించి, ఎన్నో ఆశయాలతో వచ్చిన వారు కూడా వ్యవస్థీకతమైన ‘అవినీతి’ చేతిలో ఓడిపో తున్నారు. అర్థంతరంగా బతుకు చాలిస్తున్నారు. వారిని కాపాడుకోవాల్సిన అవసరముంది, దీనిపై విస్తత స్థాయిలో చర్చ జరగాలి. పౌర సమాజంలో ఇంకా చలనం రావట్లేదు. ఆసక్తికర కథనాల్ని వింటూ, నెమరేస్తారు, ముచ్చటి స్తారు... ఒకటి రెండు రోజులాగి మరో కథ! ఎందుకీ దురాగతాలు? మెదక్ జిల్లా కుకునూర్‌పల్లి ఎస్సై రామకష్ణారెడ్డి సర్వీస్ రివాల్వర్‌తో కాల్చు కొని చనిపోవడానికి ముందు... పై అధికారుల ఒత్తిళ్లు తట్టుకోలేకపోతు న్నాను, వారు నిర్దేశించిన ‘వసూళ్లు’ తన వల్ల కావట్లేదు, అందుకే చని పోతున్నానని రాసి పెట్టి మరీ పోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే కేసు నమోదు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దర్యాప్తు చేస్తున్నాం, ఆధారాలుంటే కేసు నమోదు చేస్తామని పోలీసు లంటున్నారు. ఒక ఎస్సై లంచాల వసూళ్ల గొలుసులో ఇమడలేక బలైపోవడం వల్ల బయటపడ్డ వ్యవహారం ఇది. అంతర్గతంగా ఇలాంటి ‘వసూళ్లు–ఒత్తిళు’్ల చాలా చోట్ల జరుగుతున్నవే! పోలీసుతోపాటు రెవెన్యూ, ఎక్సైజ్, పౌర సరఫరాలు, స్టాంపులు – రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, వాణిజ్యపన్నులు... ఇలా చాలా విభాగాల్లో లంచాల వ్యవహారం బహిరంగ రహస్యమే. ‘ఈ దందాకు ఇంత’ అని జులుం చేసి మరీ లంచాలు గుంజుతారు. అధికారి స్థాయినిబట్టి ఎవరి వాటాలు వారికందుతాయనీ చెబుతారు. ఆంధ్రప్రదేశ్‌లోని పాడేరు– చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న యువ ఐపీఎస్ అధికారి కె. శశికుమార్ (30) ఇలాగే సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకు చనిపోయి దాదాపు రెండు నెలలు కావస్తోంది. అనుమానాస్పద మతి అని కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. మరణం ముందు వారం రోజులుగా ఒత్తిడికి గురవుతున్నట్టు, విధులకు న్యాయం చేయలేకపోతున్నట్టు సన్నిహితులతో ఆయనన్నట్టు ఓ కారణాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఇక్కడి అధికారులెంత భయపెట్టారో, ఏమో... తమ కుమారుడు అంతటి దుర్బలుడు కాదని ఆయన తల్లిదండ్రులు తమిళనాడుకు వెళ్లిన తర్వాత విలేకరులతో చెప్పారు. విశాఖ ఏజెన్సీపై పట్టున్న గంజాయి లాబీ నుంచి వచ్చిన ఒత్తిళ్లే ఆయన మతికి కారణమై ఉంటాయనే అభి ప్రాయం బలంగానే వినవస్తోంది. తప్పుడు రాజకీయ నాయకులు, దారి తప్పిన అధికారులు చేతులు కలిపిన చోట అన్ని స్థాయిల్లో అవినీతి రాజ్య మేలుతోంది. వారి ఆగడాలకు అంతుం డటం లేదు. ఒకప్పుడు లంచాలంటే.. నిబంధనలకు విరుద్ధంగా, తప్పుడు పద్ధతిలో పని చేయించుకోడానికి కొంత సొమ్మును చాటు మాటుగా ‘వసూల్ రాజా’లకు చెల్లించేవారు. కానీ, ఇప్పటి పద్ధతి వేరు. చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం జరగాల్సిన పనులు కూడా అధికారుల, వారి ఏజెంట్ల చేయి తడపకుండా, పర్సంటేజీలు చెల్లించకుండా జరుగవు. ప్రభుత్వ ఉద్యో గులంతా ఇంతే అని కాదు. మంచి వారు, నిజాయితీపరులూ ఉంటారు. కాకపోతే, కాలక్రమంలో ఈ మంచి – చెడుల శాతాలు తిరగబడుతున్నాయి. ఉద్యోగుల్లోనే నైతిక విలువలు లోపించడం, అవినీతికి అడ్డూ అదుపూ లేక పోవడం, తప్పులు తేటతెల్లమైనా తగు చర్యలు లేకపోవడం, ప్రభుత్వాల ‘ఉద్యోగులతో స్నేహపూర్వక వైఖరి’, దాన్ని సానుకూలంగా మలచుకొని కొల్ల గొట్టే అవినీతి అధికారుల తత్వం.. ఇలాంటివన్నీ ఇందుకు కారణమవు తున్నాయి. అపవిత్ర కలయికే అసలు కారణం రాజకీయ అవినీతి, అధికారుల అవినీతి మన వ్యవస్థను ప్రధానంగా పట్టి పీడిస్తున్నాయి. విధాన నిర్ణయాలు, అమలు, ప్రాజెక్టులు, అభివద్ధి–సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి అత్యున్నత స్థాయిలోనే రాజకీయ యంత్రాంగం అవినీతికి పాల్పడటం తరచూ వివాదా స్పదమౌతోంది. తమ అధికారాన్ని నిరంతరం కొనసాగించడానికి, ఆధి పత్యం చెలాయించడానికి కార్యనిర్వాహక వ్యవస్థను గుప్పిట్లో ఉంచుకునే క్రమంలో వారు అధికారులకు అనుచిత ప్రయోజనాలు కల్పిస్తూ అవినీతిపరు లను చేసే సందర్భాలూ ఉంటాయి. చట్టాల్లో లొసుగుల్ని చూపిస్తూ, తప్పుల్ని మరుగుపరుస్తూ... రకరకాలుగా రాజకీయ నేతలకు అవినీతి అధికారులు దన్నుగా ఉంటారు. వారి ఇష్టానుసారం బదిలీలు, పోస్టింగులు, కేసులు ఎత్తి వేత, మినహాయింపులు ఇప్పిస్తూ నేతలు వారికి అండగా నిలుస్తారు. అటు నేతలు, ఇటు అధికారులు పరస్పరం ప్రయోజనం పొందుతూ చేస్తున్న నిర్వా కాలతో అవినీతి తారస్థాయికి చేరుతోంది. రాజకీయ అవినీతి వల్ల పోగయ్యే డబ్బులో కొంతయినా ఎన్నికలప్పుడు తిరిగి ప్రజాబాహుళ్యంలోకి వస్తోంది, ప్రతి అయిదేళ్లకోసారి ఎన్నికల రూపంలో వారు ప్రజాతనిఖీకి వెళ్తుంటారు. కానీ, అధికారులు అవినీతికి అలవాటు పడితే... బదిలీలు, తాత్కాలిక సస్పె న్షన్లు వంటి చిన్న చిన్న శిక్షలుంటాయేమో తప్ప పదవీ విరమణ వరకు వారి దురాగతాలకు అడ్డు అదుపూ ఉండదని విశ్లేషకులు చెబుతుంటారు. లంచాలు తీసుకుంటూ ఏసీబీ కేసుల్లో ఇరుక్కున్న అధికారులు సైతం... తదనంతర దశల్లో ఉన్నతాధికారులకో, నేతలకో పెద్ద మొత్తాల్లో లంచాలిచ్చి సదరు కేసుల్ని ఉపసంహరింపజేసుకుంటున్న ఉదంతాలూ ఉన్నాయి. రూ. 20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ అధికారి, సదరు కేసు విరమింప జేసు కోవడానికిచ్చే రెండు, మూడు లక్షల్లో కొంత వాటా సహకరించిన మంత్రికీ వెళుతుందని ఉద్యోగులే అంటున్న మాట. సహజ సంపద కొల్లగొడుతున్న తోడు దొంగలు రాజకీయ, అధికార వ్యవస్థలు కూడబలుక్కుని జరిపే సహజ వనరుల దోపిడీ మరింత ప్రమాదకరమైంది. భవిష్యత్తరాలకు శాపంగా పరిణమిస్తున్న వీరి జమిలి నిర్వాకాల్లో ఎర్రచందనం, ఇసుక, ఇతర ఖనిజ సంపద దోపిడీ అత్యంత ప్రమాదకరమైంది. ప్రకతి భవిష్యత్తునే వీరు పణంగా పెడుతు న్నారు. దానికి తోడు, ప్రాజెక్టుల్లో వాటాలు, అక్రమ నిర్మాణాలు, దొంగ సరుకు రవాణా, కల్తీలు, ప్రజా పంపిణీ సరుకుల దారి మళ్లింపులను ప్రోత్సహించడం వంటివి వారికి ఇబ్బడి ముబ్బడిగా రాబడి తెచ్చిపెడు తుండటంతో ఈ అపవిత్ర కలయిక మరింత బలపడింది. ఆశయాలు, లక్ష్యాలతో పనిచేయాలనుకునే యువ ఉద్యోగులకు స్థానం లేకుండా చేస్తున్నారు. కాలక్రమంలో వారిని తమలో కలిపేసుకొని అవినీతిపరు ల్నయినా చేస్తారు, లేదంటే ప్రాధాన్యత లేని స్థానాల్లోకయినా బదిలీ చేయి స్తారు. ఇదేదీ కుదరకపోతే, ప్రత్యక్షంగా, పరోక్షంగా ఒత్తిళ్లు పెంచి ఉద్యో గంలోంచో, కడకు జీవితాల్లోంచో వైదొలగే పరిస్థితులు కల్పించి తమ అడ్డు తొలగించుకుంటారు. ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును, పౌరుల ఉమ్మడి సహజ వనరుల్ని ఈ అవినీతిపరులు దోచేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపుదారుల నుంచి రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖల అధికారులు పెద్ద మొత్తాల్లో మామూళ్లు వసూలు చేస్తున్నారనడానికి ఇటీవలి గజ్వేల్ తాజా ఉదంతమే నిలువెత్తు నిదర్శనం. పోలీసు శాఖలో కింది ఉద్యోగుల పనితీరు గురించి వారి పై అధికారులిచ్చే వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)లే కీల కమైనవి. చెప్పింది వినకుంటే ఏం రాస్తారో? అనే భయం, నోరువిప్పితే ‘యూనిఫామ్ సర్వీసు’ ఉద్యోగులుగా క్రమశిక్షణా చర్యలకు గురి కావాల్సి వస్తుందనే భయం. తగు శిక్షలు లేకే తప్పులు పునరావతం అవినీతి అధికారుల్ని శిక్షించే వ్యవస్థలు సరిగా లేవు. లోకాయుక్త, ఏసీబీ, విజిలెన్స్, మానవ హక్కుల సంఘం వంటివి ఆచరణలో ఎంతో బలహీనంగా ఉండటం అవినీతి అధికారులకు ఆటవిడుపుగా మారింది. ఎవరికీ పెద్దగా శిక్షలు పడటం లేదు. అందుకే బలమైన లోక్‌పాల్ వ్యవస్థను పౌర సమాజం కోరుకుంది. ‘ట్రాన్స్ఫరెన్సీ ఇంటర్నేషనల్’ పౌర సంస్థ ఆధ్వర్యంలో ఏడాది కింద మలేషియాలో సమావేశమైన 16వ ‘అవినీతి వ్యతిరేక అంతర్జాతీయ సదస్సు’ భారత్‌లో పరిస్థితిపై అసంతప్తి వ్యక్తం చేసింది. అవినీతి వ్యతిరేక విధానాలు, సంప్రదాయాలు, పద్ధతులు కాగితాల్లోనే తప్ప ఆచరణలో ఉండవని పేర్కొంది. కర్ణాటకలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న డీఎస్పీ ఎమ్.కె. గణపతి తన సుసైడ్‌నోట్‌లో ప్రస్తావించిన మంత్రి కె.జె. జార్జి పేరును ఎఫ్ఐఆర్లో చేర్చాలని ఆయన కుటుంబీకులు కోరినపుడు, స్థానిక కోర్టు అలాగే ఆదేశాలిచ్చింది. దాంతో, కేసు నమోదయింది, మంత్రి స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. కానీ, ఎఫ్ఐఆర్లో ఆయన పేరును చేర్చడానికి పోలీసులు ససేమిరా అంటున్నారు. ఇంకా విచిత్రంగా, చని పోతూ ఎస్సై రామకష్ణారెడ్డి ఏ పోలీసు అధికారిపై ఫిర్యాదు చేశాడో ఆయనే ఆ కేసు ఎఫ్ఐఆర్ తయారు చేశాడు. ఎస్సై చచ్చిపోతూ ఎలుగెత్తిన దురా గతాలపై విచారణకు నియమించిన ఏఎస్పీ స్థాయి దర్యాప్తు అధికారికి, రామకష్ణారెడ్డి అభియోగాలు మోపిన వివిధ స్థాయి పోలీసులు వసతులు కల్పిస్తూ సహకారం అందించనున్నారు. ఇదీ, మన దగ్గర జరిగే ధృతరాష్ట్ర నీతి! దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
నిరసనపై జులుం నేరంతో నెయ్యం
సమకాలీనం షర్మిల వంటి గాంధేయవాదుల నిరసనల్ని, పోరాటాల్ని పాలకులు ఏళ్ల తరబడి లక్ష్య పెట్టకపోవడం అనర్థాలకు దారి తీస్తోంది. నిరసించే, ప్రశ్నించే పరిస్థితులే లేకుండా పోతు న్నాయి. ప్రజాస్వామ్యం పట్ల, వ్యవస్థల పట్ల మంచి వారికి విశ్వాసం సన్నగిల్లుతోంది. చెడ్డ వారికి భయం లేకుండాపోతోంది. డబ్బు, పలుకుబడిగలవారు సత్వర ఫలితాలకు నయీమ్ లను ఆశ్రయిస్తుంటే... చట్టబద్ధ వ్యవస్థల రక్షణ కరవై బడుగుజీవులు తృణమో, పణమో, సాంతమో ఈ ముఠాలకు సమర్పించుకొని ‘బతుకు జీవుడా’ అనాల్సిన దుస్థితి నెలకొంది. 24 గంటల వ్యవధిలోనే రెండు పరస్పర విరుద్ధ భావధారలు భారత రాజ కీయ తెరపైన ప్రతీకలుగా ప్రస్ఫుటమయ్యాయి. అత్యధికుల్ని చలింప జేశాయి. ఇప్పుడాలోచింపజేస్తున్నాయి. ఒకటి: ప్రజాస్వామ్యయుతమైన నైతికతకు శీర్షాయమానంగా నిలిచిన తన పదహారేళ్ల నిరాహార దీక్షకు స్పందన లేనందుకు విరమిస్తూ, వ్యవస్థలో భాగమై పోరాటం కొనసాగిస్తానని ప్రకటించిన ఈరోమ్. రెండు: అమానుష నేరగాడిగా... రాజకీయ అవినీతిని, పోలీసు దిగజారు డుతనాన్ని ఆయుధాలుగా మలచుకొని రెండు దశాబ్దాల పాటు నెలకొల్పిన నేరసామ్రాజ్యం కుప్పకూలి, నరకాసుర వధలా బతుకు చాలించిన నయీమ్. ఈ రెంటిలో ఎన్నో సామ్యాలను. మరెన్నో వైరుధ్యాలను, పరస్పర విరుద్ధమైన అంశాల్ని కలిపి చర్చించాల్సిరావడం బాధ కలిగిస్తున్నా... ఒక ప్రజాస్వామ్య ప్రక్రియను మన నయా ఉదారవాద ఆర్థిక పాలనా నమూనా నిర్దయగా తొక్కేసిన కుటిల నీతి పర్యవసానమైతే, రెండోది అదే నమూనా వల్ల ఒక దుర్మార్గపు ప్రక్రియ బలపడటం కావ డమే ఇక్కడ ముఖ్యాంశం. రెండు చోట్లా తుది ఫలితం సమాజం బలహీనపడటమే! రెండుచోట్లా స్వార్థ పర శక్తులదే ఆధిపత్యం, సామాన్యులే బాధితులు. అందుకే, కలిపి చర్చిం చాల్సి వస్తోంది. అధికార బలంతో, చట్టం దన్నుగా ‘ప్రత్యేక’ సాయుధ బల గాలు సాగిస్తున్న అరాచకాలను నిలిపివేయండన్న ఈరోమ్ షర్మిల ఆక్రందన గాలికి పోయింది. శాంతియుతంగా గాంధేయ మార్గంలో 16 ఏళ్లుగా తిండి తినకుండా ఆమె నిరసన తెలిపితే ప్రభుత్వ, రాజకీయ, అధికార వ్యవస్థల నుంచి కించిత్తయినా స్పందన రాలేదు. నిబద్ధత కలిగిన వ్యక్తిగా షర్మిల తన పంథాను మార్చుకొని, పోరాటం కొనసాగించాల్సి వస్తోంది. ఆమె పట్టుద లకు, త్యాగనిరతికి ప్రపంచమంతా నీరాజనం పలికింది. దీక్ష మాత్రమే విరమించానని, పోరాటాన్ని కొనసాగిస్తున్నాననీ ఆమె గర్వంగా ప్రకటిం చింది. ఇది అభినందించాల్సిన పరిణామం. ఆదర్శాల నిబద్ధతతోనో, పచ్చి ముసుగుగానో నక్సలైటుగా మొదలై - నేరస్తుడి రూపమెత్తాడు నయీమ్. నేరాల రుచి మరిగి, పోలీసుల, నాయకుల చేతిలో పావుగా, వారి స్వార్థమే నిచ్చెనగా అతగాడు నెలకొల్పిన నేర సామ్రాజ్యం ప్రజాస్వామ్య వ్వవస్థకు ఓ రాచపుండు. ఎన్ని కిడ్నాప్‌లు, హత్యలు, దోపిడీలు, దొమ్మీలు, మెడమీద కత్తిపెట్టి చేసిన కోట్లాది రూపాయల, స్థిరచరాస్తుల వసూళ్లు! సంపద సంగతి సరే, చట్ట రక్షకుల కనుసన్నల్లో నయీమ్ ముఠా తూటాలకు, కత్తిపోట్లకు ఎన్నో జీవితాలు బుగ్గిపాలయ్యాయి. కుటుంబాలు చెల్లా చెదురయ్యాయి. రాజకీయాల్ని అనివార్యం-అంతిమం చేశాం చేసుకున్నోళ్లకు చేసుకున్నంత.... అనే పెదవి విరుపు నానుడొకటుంది. కాలక్ర మంలో మనం మన రాజకీయ వ్యవస్థను అంతగా అనివార్యం, అంతిమం చేసుకున్నాం. రాజ్యాంగంలో తప్ప... ఆచరణలో ఎక్కడా తనిఖీల్లేవు, సమ తూకాల్లేవు. మన జీవితాల్లో ప్రతి పార్శ్వాన్నీ శాసించే గుత్తాధికారాన్ని రాజకీయ వ్యవస్థకు తెలిసో తెలియకో ధారాదత్తం చేశాం. మంచి వాళ్లైనా, చెడ్డవాళ్లైనా అందరూ అటువైపే చూడాల్సిన పరిస్థితులిప్పుడు నెలకొన్నాయన డానికి ఈరోమ్, నయీమ్లే తాజా ఉదాహరణ. ఇద్దరూ రాజకీయాల్లోకి రావాలనుకున్నారు! ‘మణిపూర్‌లో సానుకూల మార్పులు తీసుకురావడానికి నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను, అందుకే 2017లో స్వతంత్య్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే పదవికి పోటీచేస్తాన’ని ఈరోమ్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎమ్మెల్యే కావాలని ఆశించి భూమిక సిద్ధం చేసు కుంటున్న నయీమ్, ఏమో.... కలిసొస్తే ఏకంగా ముఖ్యమంత్రే కావాలను కున్నాడేమో! తెలియదు. ఇప్పుడు నయీమ్ ఎలాగూ లేడు. రాజకీయాలవైపు రావడానికి మంచివాళ్లు సాహసించట్లేదని ప్రచారం జరుగుతున్న ఈ రోజుల్లో షర్మిల ప్రకటన ఆహ్వానించదగ్గ పరిణామం. పదహారేళ్ల దీక్షతో కానిది ఎమ్మెల్యేగా గెలిచి సాధిస్తుందా? అసలు ముఖ్యమంత్రి అవుతుందా? అయినా.. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) రద్దు చేయించగలరా? వంటి ధర్మసందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు మేధావులు. అవి పెద్దగా ప్రాముఖ్యత లేని ప్రశ్నలు. మేధావి వర్గపు ప్రతి నిధిగా చిత్తశుద్ధితో అంత సుదీర్ఘకాలం దీక్ష చేసిన షర్మిల ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా... పోరాటపంథా వీడకపోవడమే గొప్ప! రూపు మార్చి పోరాటం కొనసాగిస్తాననడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీక. ఆమె ఇంకో గొప్ప మాట చెప్పారు. ‘కొందరు రాజకీయాలు మురికి అంటారు, సమాజం కూడా అంతే!’ అన్న ఆమె మాటలు కుహనా మేధావి వర్గానికి చెంపదెబ్బ. షర్మిల దీక్షకి పదహారేళ్లపాటు స్పందించని పాలనా వ్యవస్థల్ని మన సమాజం లోనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇబ్బడి ముబ్బడిగా అధికార బలం, పట్టపగ్గాల్లేని చట్టస్వామ్యం చేతుల్లో ఉన్న నేతలు, పోలీసులు చెక్కిన వంచనా శిల్పం నయీమ్. నయీమ్ చచ్చిన తర్వాత దొంతర్లు దొంతర్లుగా ఆస్తులు, టన్నులు టన్నులుగా సమాచారం బయటకొచ్చే వరకు ఆయా ముఖ్యుల చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఈ సమాజంలో ప్రతిబంధకాలేవి? ఇప్పటికైనా ముసుగుల్లో దాగిన ముఖ్యుల బండారం బయటకొస్తుందో? రాదో? సందే హమే! రంగు మారని రాజకీయాలే వారికి రక్షణ కవచం అవుతాయనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే, రాజకీయాలు మారాలంటారు. ‘‘రాజకీయాల్లో చేర కుండా ‘రాజకీయాల్ని‘ తుదముట్టించడమో, సంస్కరించడమో కుదరదు కాక కుదరదు’’ అని జీన్ పాల్ సార్ట్రే విశ్వవిఖ్యాత నాటిక ‘డర్టీ హ్యాండ్స్’లో ఒక పాత్ర చేత పలికిస్తారు. ‘రాజకీయాల్ని ముట్టుకోకుండా నేను నా సామాజిక సేవను కూడా కొనసాగించలేను. ప్రజాస్వామ్యంలో రాజకీయం తడమని జీవన ప్రక్రియలే ఉండవు’ అని మహాత్మా గాంధీ ‘యంగ్ ఇండియా’ (1920) లో రాశారు. రాజకీయాల్లో మంచివాళ్లు, ఆలోచనాపరుల దామాషా పెరిగి వాటిలో పరివర్తనను తేవాల్సిన అవసరాన్ని సమకాలీన పరిస్థితులు నొక్కిచెబు తున్నాయి. నిరసన అస్త్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారు ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థల్లో నిరసన తెలుపడం ఒక బలమైన ఆయుధం. నిరాయుధ అహింసావాదిగా విశ్వమంతా పేరు తెచ్చుకున్న జాతిపిత బాపూజీ ఈ ఆయుధంతోనే పోరాడారు. రవి అస్తమించని బ్రిటిష్ పాలకుల మెడలు వంచి దేశానికి స్వాతంత్య్రం సాధించారు. ఆంగ్లేయుల వంటి వలస పాలకులు సైతం గౌరవించిన ‘నిరసన’ నేటి మన ప్రజాస్వామ్య పాలకులకు కంటగింపయింది. స్వాతంత్య్రం సిద్ధించిన తదుపరి తొలి దశాబ్దాల్లో ఉన్న సామరస్య ధోరణి కూడా లేదు. తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తన చివరి రోజుల వరకూ కూడా ఏ నిరాహార దీక్షనూ నిర్లక్ష్యం చేయలేదంటారు. ఎవరైనా దీక్ష చేస్తే వారి వద్దకు ప్రధాని తరఫు నుంచో, ప్రభుత్వం వైపు నుంచో సంప్రదింపులకు, చర్చలకు పంపేవారు. కానీ, ఇప్పుడు శాంతి భద్రతల ముసుగులో శాంతియుత నిరసనలనూ కర్కశంగా అణచివేస్తు న్నారు. రేపు ఫలానా చోటకు వెళ్లి నిరసన తెలుపుతామంటే, ఈరోజే అరెస్టు చేస్తారు. లాఠీలతో హింసిస్తారు, గుర్రాలతో తొక్కిస్తారు, ప్లాస్టిక్ పిల్లెట్లతో నెత్తురు కళ్లజూస్తారు. మగ పోలీసులే మహిళా నిరసనకారులపై చేయి చేసుకుంటారు, చేతుల్లో బంధిస్తారు, ఒంటిపై గుడ్డలు చింపుతారు, రోడ్లపై ఈడ్చుకెళ్తారు. ఈశాన్య రాష్ట్రాల్లో, కశ్మీర్లో, దేశంలోని పలు ఇతరేతర ప్రాంతాల్లో పాలకుల దమననీతి నేడు నడివీధుల్లో నెత్తురు చిమ్మిస్తోంది. అందుకే, కశ్మీర్లో బుర్హాన్ వనీ మరణానంతర పరిణామాల్లో పోలీసుల దాష్టికాల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. వారిలో మానవీయ కోణమే కొరవడిం దని నొక్కిచెప్పింది. సాయుధ బలగాల అమానవీయ చేష్టల్ని, నేరపూరిత చర్యల్ని విచారించనవసరం లేని మినహాయింపు (ఇమ్యునిటీ) తలంపే ఎక్కడా లేదని స్పష్టం చేసింది. రాజ్యం తన అణచివేత చర్యల ద్వారా రాను, రాను పౌరులు నిరసన తెలిపే ద్వారాలనే మూసివేస్తోంది. కూర్చున్న చోటే చేసే సత్యాగ్రహాన్ని, నిరసన దీక్షల్ని ఇక అసలు ఖాతరు చేయరు. ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలైనా పట్టించుకోరు. రోడ్లపైకి ప్రదర్శనగా వస్తే చతురంగ బలాలతో అణచివేతకు దిగుతారు. 108 వైద్య సర్వీసుల ఉద్యో గులు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఇందిరాపార్కు వద్ద ఏడాది పాటు దీక్ష చేశారు. ప్రభుత్వం పలకరించిన పాపాన పోలేదు. ఎండకు ఎండి, వానకు తడిసి, చలికి నలిగి కడకు ఏ పరిష్కారం లేకుండానే దీక్ష నుంచి వైదొలిగారు. ఏపీలో విపక్షనేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి చేసిన పలు నిరసన, నిరాహార దీక్షలపై పోలీసు దాష్టికాల్ని చూశాం. ముద్రగడ పద్మనాభంపై ఆస్పత్రిలో భౌతికదాడి, కుటుంబసభ్యుల్ని అవమానించడం వంటి దుర్మార్గాల్ని మీడియా కళ్లకు కట్టింది. తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు, మల్లన్నసాగర్‌ను వ్యతిరేకిస్తున్న పార్టీలకు, ప్రజాసంఘాలకు ఎదురైన చేదు అనుభవాలు తెలిసినవే! జాతీయ స్థాయిలో కూడా... సాయుధ బలగాలకు చెందిన మాజీ సిబ్బంది ‘ఒక ర్యాంకు ఒక పెన్షన్’ నినాదంతో జంతర్‌మంతర్ వద్ద నెలల తరబడి దీక్ష జరిపినా పట్టించుకున్నవారు లేరు. కడకొక రాజకీయ పరిష్కారంగానే ఆ సమస్యకు తెరపడింది. బాధల వల్లే.... బాదరాయణ బంధం షర్మిల వంటి గాంధేయవాదుల నిరసనల్ని, పోరాటాల్ని పాలకులు సంవత్స రాల పాటు లక్ష్యపెట్టకపోవడం ఎన్నో అనర్థాలకు దారి తీస్తోంది. నిరసించే, ప్రశ్నించే పరిస్థితులే లేకుండా చేస్తున్నారు. విమర్శను తట్టుకోలేక విమ ర్శకుల్ని నిర్మూలించే నియంతృత్వ పోకడలు పాలకుల్లో పెచ్చుమీరాయి. ప్రజాస్వామ్యం పట్ల, దాని విభిన్న అంగాల పట్ల, వ్యవస్థల పట్ల మంచి వారికి విశ్వాసం సన్నగిల్లుతోంది. చెడ్డవారికి భయం లేకుండా పోతోంది. డబ్బు, పలుకుబడి కలిగిన వారికి సత్వర ఫలితాలకు ‘నయీమ్’వంటి వ్యవస్థలే నయమనే అభిప్రాయానికి వస్తున్నారు. చట్టబద్ధ వ్యవస్థలు తమ రక్షణకు రానపుడు తృణమో, పణమో, కడకు సాంతమో.... హంతక ముఠాలకు సమర్పించుకొని ‘బతుకు జీవుడా’ అనాల్సిన దుస్థితి బడుగుజీవులది. ఇటీవలి కాలంలో తెరపైకి వచ్చిన పాలకుల నయా ఉదారవాద అభివృద్ధి నమూనా పర్యవసానమే ఇది. ఏ కొందరికో అసాధారణ ప్రయోజనాల్ని కల్పించి, అత్యధికులకు కన్నీళ్లను మిగులుస్తోంది. కొందరి గుప్పిట చిక్కిన ‘అధికారం’ దాష్టికాలను అడ్డగించేవారే ఉండట్లేదు, ఉన్నా, నయీమ్ లాంటి కిరాయి ముఠాల ఊడిగంతో వారి అడ్డు తొలగించుకుంటున్నారు. యథేచ్ఛగా చీకటి రాజ్యాలేలుతున్నారు. లేకపోతే, వందల సెల్ఫోన్లు, వేల సిమ్‌కార్డులు, లక్షల లావాదేవీలు, వేల కోట్ల ఆస్తులు... ఒక ముఠా నేర సామ్రాజ్యంలో ఎలా పోగుపడ్డాయి? ఇరవై ఏళ్లుగా ఇది నిరాఘాటంగా సాగుతుంటే, మననిఘా సంస్థలు, నియంత్రణ వ్యవస్థలు, తనిఖీ యంత్రాంగాలు ఏం చేశాయనే సందేహం రావడం సహజం. దీనికి పాలకులు సమాధానం చెప్పాలి. లేకుంటే ప్రజలే వారికి, వారి దాష్టీకాలకు చరమగీతం పాడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం! వ్యాసకర్త: ఆర్. దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
గుడ్లురిమే గురివింద నీతి
సమకాలీనం ముఖ్యమంత్రి అంటున్నట్టు, ఇంకో మాటలో చెప్పాలంటే గద్దిస్తున్నట్టు భూసమీకరణంతా జరిగిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది జరిగిందని ఎవరూ అనట్లేదు. మతలబంతా ముందు జరగడమే! వారిది నికార్సయిన భూవ్యాపారమే అయితే... ఏ విజయనగరం లోనో, ఏలూరులోనో, నూజివీడులోనో ఎందుక్కొనలేదు? అక్కడే, కోర్ క్యాపిటల్ లోనే ఎందుక్కొన్నారు? ఈ ప్రశ్నలకు జవాబెందుకు లేదు? ఇన్ని జరిగినా వేటిపైనా విచారణ అవసరం లేదని, విమర్శించే వారే సాక్ష్యాధారాలతో నిరూపించాలంటున్నారు ఏలినవారు. రాజకీయాల్లో విమర్శలూ, ప్రతి విమర్శలూ కొత్తకాదు. విపక్షం- పాలకపక్షంగా స్థానం మారగానే వైఖరులు మారడం, విధానాలు తిరగబడటం, నీతిసూత్రాలు అమాంతం రూపాంతరం చెందడం సరికొత్త సం‘గతి’! ఇన్నాళ్లూ అవినీతి అని తామే దుమ్మెత్తిపోసిందాన్ని ఇప్పుడు నీతంటూ ఏకంగా నెత్తికెత్తుకోవడం, ఎదుటి వాళ్లు చేసింది తప్పై, అదే తాను చేసినపుడు ఒప్పవడం... ఇదీ, తాజా వైచిత్రి! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఏలిన వారు ఎన్నికల హామీల్ని తుంగలో తొక్కడం నుంచి రాజధాని భూదురాక్రమణ దాకా, నిస్సిగ్గు పార్టీ ఫిరాయింపు పర్వాల నుంచి జాతి యావత్తూ చూసేలా, మీడియాను బెదిరించే వరకు సాగుతున్న ప్రజాస్వామ్య పరాభవాల అంకం అసెంబ్లీ వేదికకు చేరింది. సభ సజావుగా నడిచే బాధ్యత భుజాలమీద మోయాల్సిన సభనాయకుడు ముఖ్యమంత్రే, ‘మేం చెప్పినట్టు జరిగితే తప్ప.. సభను నడువనిచ్చేది లేద’ని హుంకరించడం విస్మయం కలిగిస్తోంది. సభా న్యాయం పాటించాల్సిన సభాపతి ప్రతిపక్ష హక్కుల రక్షణకు రాకపోగా, విపక్షమిలా ప్రవర్తిస్తే, భూదందాలపై సీబీఐ విచారణే జరిగితే....పెట్టు బడులు రావనే ప్రభుత్వ భావనను పలికించడం మరింత విస్మయం కలిగిం చింది. ‘‘విపక్షంగా మేముండి ఆరోపించినపుడు పాలకపక్షం దర్యాప్తునకు ఆదేశించి, అవినీతి జరగలేదని నిరూపించుకోవాలి. మేమే పాలక పక్షంగా ఉన్నపుడైతే ప్రతిపక్షమే ‘ఇదుగో అవినీతి ఇలా జరిగింది’ అని మాకు సంతృప్తి కలిగేంత వరకు నిరూపించాలి, నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పి సభ నుంచి విపక్షమే నిష్ర్కమించాలి!’’ ఇదీ మా నయానీతి!! అంటూ పాలక పక్షీయులు జబ్బలు చరుచుకుంటున్నారు. విసుగెత్తిన విపక్షం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిందంటే, సంఖ్యా బలాల హెచ్చుతగ్గులే కాదు ఇంటా-బయటా పాలకపక్షం-ప్రభుత్వం వ్యవహార శైలినీ చూడాలి. గోప్యతా ప్రమాణమూ గాలికి! భారత రాజ్యాంగం, మూడో షెడ్యూల్లో నిర్దేశించిన విధంగా ప్రభుత్వ బాధ్యత చేపట్టేవారు గోప్యత ప్రమాణం (ఓత్ ఆఫ్ సీక్రసీ) చేస్తారు. ఒకసారి కాదు, ముఖ్యమంత్రిగా మూడుమార్లు అలా ప్రమాణం చేసిన చంద్రబాబు తన ఎన్నికల హామీలకు పట్టించిన గతే ప్రమాణానికీ పట్టించారు. ‘‘నారా చంద్రబాబునాయుడు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని... నా కర్తవ్యా లను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ పక్షపాతం గానీ, రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్నీ, శాసనాల్నీ అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని... రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడిం చనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని పెద్ద సభలో, ప్రజల సమక్షంలో చెప్పారు. కానీ ఏం చేశారు? రాజధాని సాక్షిగా సమస్త ప్రజానీకం కళ్లకు కడుతోంది. ప్రభుత్వంలో భాగమై, నిర్ణయాలకు చేరువగా ఉండటాన్ని సానుకూలంగా మలచుకొని పెద్ద ఎత్తున ప్రజా వంచనకు దిగారు. చైనా, జపాన్, సింగపూర్ ప్రభుత్వాల్ని తెరపైన చూపి, అక్కడి ప్రయివేటు సంస్థలతో లోపాయకారి సంప్రదింపులతో ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద రియల్ ఎస్టేట్ దందాగా రాజధాని వ్యవహారాన్ని సాగించడం ఒక ఎత్తు. రాజధానిని ఏ నిర్దిష్ట ప్రాంతంలో నిర్మిస్తారు అన్న అధికారిక సమా చారాన్ని పరిమితంగా కొందరు మంత్రులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే వ్యవహారకర్తలు, రియల్టర్లకు మాత్రమే తెలిపి చేసిన ఘోరం మరో ఎత్తు! వారు ఆ ప్రాంతంలో చౌకగా భూములు కొనుగోలు చేసేలా, రకరకాల పద్ధతుల్లో రైతులు, సామాన్యుల భూముల్ని వారు స్వాధీనపరచుకునేలా వ్యవహారం నడిపారు. 2005లో సమాచార హక్కు చట్టం వచ్చిన దరిమిలా... పారదర్శకత నూతన విధానమైనపుడు ఇంకా ఈ గోప్యతా ప్రమాణమేంటి? ఇందులో అర్థం లేదు, ఇది తప్పుడు సంకేతాలిస్తుంది కనుక దీన్ని తొలగించాలనే వాదన పెరిగింది. సమాచారం అందరితో పంచు కుంటానని ప్రమాణం చేసేలా రాజ్యాంగం మూడో షెడ్యూల్‌ని సవరిం చాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. కానీ, అధికారంలో ఉండే కొందరైనా, అలా ప్రభుత్వంలో భాగం కాని మెజారిటీ సామాన్యులైనా... ఉభయులూ సమానావకాశాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో గోప్యతా ప్రమా ణాన్ని కొనసాగించడానికే కేంద్ర ప్రభుత్వం, నిపుణులూ ప్రాధాన్యత నిచ్చారు. ఇంతకీ జరిగిన దారుణమేంటి? ‘కొంటే తప్పేంటి?’ అన్న పాలకుల ప్రశ్నలో పొగరున్నంతగా న్యాయం లేదు. లోగడ చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనా కాలంలో అప్పటి రాజధాని హైదరా బాద్ ‘హైటెక్ సిటీ’ ప్రాంత అభివృద్ధి క్రమంలో ప్రయోగించిన స్వార్థపు నమూనానే ఇప్పుడు అమలు పరిచారు. హైటెక్‌సిటీ అభివృద్ధి చేసే విష యాన్ని తగినంత ముందుగా తమ వారికే చెందిన జయభేరి వంటి సంస్థలకు లీకులిచ్చారు. ఆపై అధికారికంగా అభివృద్ధి జోన్ ప్రకటించి, తాము సమీక రించుకున్న భూముల విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటట్టు చేసుకొని కోట్లకు పడగలెత్తారు. ఈ స్వార్థ నమూనానే రాజధానిలో పదునెక్కించి మరీ అమలు పరిచారు. అక్కడికీ ఇక్కడికీ ఇంకో ప్రధాన తేడా ఉంది. నూజివీడు వైపు రాజధాని వస్తోందని ముందు ప్రచారం చేసి, అక్కడ పలువురు రియల్టర్లు, సామాన్యులు భూములు కొనుక్కునేలా, మంగళగిరి-తుళ్ళూరు తదితర ప్రాంతాల్లోని వారు రాజధాని రావట్లేదనే నిరాశతో చౌకగా తమ భూముల్ని అమ్ముకునేలా ఎత్తుగడ వేశారు. కాదు, రాజధాని తుళ్లూరు చుట్టుపక్కలే వస్తుందన్న కచ్చితమైన రహస్య సమాచారం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి బంధువులు, రాబందులు మాత్రం అక్కడే భూములు కొనుక్కొని, లాక్కొని, నయానో భయానో వశపరచుకొని రైతులు, సామా న్యుల పచ్చని పంటపొలాల్లో తమ దగాను యథేచ్ఛగా విస్తరించారు. ఇది రెండింతల మోసం! ‘‘భూములు కొంటే తప్పేంటి? డబ్బులున్నాయి వ్యాపా రం చేసుకుంటున్నారు. మంత్రులైతే వ్యాపారాలు చేసుకోవద్దా?’’అని నిస్సం కోచంగా ముఖ్యమంత్రే ప్రశ్నిస్తున్నారు. ‘అక్కడే రాజధాని వస్తుందన్న కచ్చి తమైన ముందస్తు సమాచారంతో, నిర్ణయం వెల్లడించడానికి పూర్వం, ప్రభుత్వంలో ఉన్నవారు అలా సామాన్య ప్రజల భూముల్ని తక్కువ ధరలకు కొని ఖరీదైన ఆస్తులుగా సొమ్ము చేసుకోవడం తప్పు’ అని ప్రతిపక్షం విమర్శిస్తే, ‘... మేం అలాగే చేస్తాం, ఏ విచారణా జరపం, ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని దబాయిస్తున్నారు. దర్యాప్తు అంటేనే జడుసుకుంటున్నారు. సీబీఐ పేరు ప్రస్తావించిన ప్రతిసారీ ముఖ్యమంత్రి రుసరుసలాడుతున్నారు. ఎందుకు? ఇన్సైడర్ ట్రేడింగ్ కన్నా నీచంగా... ‘ఇందులో ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడుంది? మేం 34 వేల ఎకరాల భూసమీకరణ చేశాం, ఇప్పుడా భూమి మాతోనే ఉంది, ఇంకెక్కడి ఇన్సైడర్ ట్రేడింగ్?’ అని సభావేదికగా ముఖ్యమంత్రి అమాయకత్వం నటిస్తున్నారు. ‘అసలు ఇన్సైడ్ (నిజానికి ఇన్సైడర్) ట్రేడింగ్ అంటే తెలుసా మీకు? తెలియకుండానే మాట్లాడేస్తున్నారు...’ అని ఎదురుదాడి చేస్తున్నారు. ఒక సంస్థకు సంబంధించిన లోపలి వ్యక్తిగా గోప్య సమాచారం తెలిసుండి, దాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకుంటూ స్టాక్ ఎక్స్చేంజ్లో వ్యాపారం చేసే అక్రమ ప్రక్రియకే ఇన్సైడర్ ట్రేడింగ్ అని నిర్వచనం. ఇదే జరిగిందిక్కడ. ముఖ్యమంత్రి అంటున్నట్టు, ఇంకో మాటలో చెప్పాలంటే గద్దిస్తున్నట్టు భూసమీకరణంతా జరిగిన తర్వాత ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది జరిగిందని ఎవరూ అనట్లేదు. మతలబంతా ముందు జరగడమే! వారిది నికార్సయిన భూవ్యాపారమే అయితే... ఏ విజయనగరంలోనో, ఏలూరులోనో, నూజివీడులోనో ఎందుక్కొనలేదు? అక్కడే, కోర్ క్యాపిట ల్లోనే ఎందుక్కొన్నారు? ఈ ప్రశ్నలకు జవాబెందుకు లేదు? ఉప్పందిన తమ అనుచరగణం పేదల అసైన్మెంట్ భూముల్నీ మాయమాటలతో స్వాధీన పరచుకున్న తర్వాత కదా సదరు చట్టాన్ని ఈ సర్కారు పెద్దలు మార్చాలని యత్నిస్తున్నది! ఇప్పటికీ స్పష్టత లేకుండా ఆ చట్టాన్ని అయోమ యంలోకి నెట్టింది సర్కార్ కాదా? ఇన్ని జరిగినా వేటిపైనా విచారణ అవసరం లేదని, విమర్శించే వారే సాక్ష్యాధారాలతో నిరూపించాలంటు న్నారు ఏలినవారు. బెదిరింపు, భయపెట్టడాలే ప్రధానాస్త్రాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా బెదిరించి వ్యవస్థల్ని, వ్యక్తుల్ని లొంగ దీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇది ఆయన నైజం కూడానేమో! ఇందుకు అవసరమయితే పచ్చి అబద్ధాల్ని ఒకటికి రెండుమార్లు వల్లెవేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. రాజధాని భూదందాలపై పత్రికల్లో, ముఖ్యంగా సాక్షిలో వచ్చిన కథనాలతో కంపించిపోయినట్టు ఆయన మాటలు, వ్యక్తీకరణని బట్టి స్పష్టమౌతోంది. ‘ముందు మీ పై కేసులు పెట్టాలి, ఎలా రాస్తారు? ఏది పడితే అది రాయడమేనా? మీ పైన కేసులు పెడితే అప్పుడు భయముంటుంది!’ అని భయపెట్టడమే తమ లక్ష్యమన్నట్టు విలేకరుల భేటీలో మాట్లాడారు. తప్పిదాలు జరక్కుండా చూడటం కన్నా, వాటిని రాయకుండా జాగ్రత్తపడాలనే తపనే కొట్టొచ్చినట్టు కనిపించింది. అసెంబ్లీ వేదికగానూ అదే బెదిరింపు. ‘సాక్షి’ పత్రికపై మునికాళ్లపై లేస్తున్నారు. ‘సాక్షి’ ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ అటాచ్మెంట్లో ఉంది, కనుక ఇది ప్రజా ఆస్తే అని ఒకమారు, ప్రభుత్వ ఆస్తి అని మరోమారు, జప్తు అయిందని ఒకమారు, అవుతోందని మరోమారు.... ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి తప్పుడు మాటలు చెబుతూ తన మానసిక స్థితిని వెల్లడిం చారు. ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాదు, ఉన్నట్టు కనబడాలనేది స్ఫూర్తి అయితే, ప్రజాస్వామ్యయుతంగా ఉండం, ఉన్నట్టు కనబడాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదన్నట్టు వ్యవహరిస్తోందీ ప్రభుత్వం. సభా వేదిక నుంచి ముఖ్యమంత్రే చెప్పినట్టు, ‘‘గతకాలపు చర్యలే వర్తమానంలో మన ప్రస్తుత పరిస్థితి అయినపుడు, వర్తమానంలో మన వ్యవహారాలే మన భవిష్యత్తుకు భూమిక అవుతాయి!’’ దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
పల్లె కన్నీరు తుడిస్తేనే పండగ
సమకాలీనం ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్లా, నిర్లక్ష్యం వల్లా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది. సాగుబడి చిన్న రైతు బతుక్కు భరోసాను ఇవ్వలేని స్థితి ఏర్పడింది. గ్రామాల నుంచి వలసలు పెరిగాయి. మూలాలను మరవని పట్టణవాసి ‘ఊరెళ్లాలనే ఉబలాటం’ అభినంద నీయం! ఏడాదికోసారి ఇలా ఆ అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకుంటేనే చాలదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసి పల్లెకు కొత్త ఊపిరి పోయడానికి పూనుకోవాలి! పాలకులపై ఒత్తిడి తేవడమే కాదు, ఊరిని కాపాడుకునే సాంస్కృతిక ఉద్యమమే తేవాలి! ఊరెలా ఉంది? ఇంకా ఉంది సంతోషించాలి! జీవకళ నశించి, గాజు కళ్లతో నిర్జీవంగా పడి ఉంది. బతుకుదెరువు కోసమో, మరే ఇతర కారణాలతోనో పట్టణాలు, నగరాలకు వలసవెళ్లినవారు వెళ్లగా... మిగిలిన కొద్దిమందితో ఉస్సూరుమంటోంది. పని సంస్కృతితో పాటూ గ్రామీణ సంస్కృతులు, సంప్రదాయాలు, విలువలు, మానవసంబంధాలు మరుగునపడ్డాయి. సంక్రాంతికి స్వగ్రామం వెళ్లాలన్న తపనతో నగరాలు, పట్టణాల నుంచి సుమారు డెబ్బై లక్షల మంది తెలుగువాళ్లు ఇవ్వాళ సొంతూళ్లకొచ్చి ఉంటారు. అదీ, ఒకటి రెండు రోజుల కోసం! ఓ మారు గుండె మీద చెయ్యేసుకుని స్పం దించాల్సి వస్తే, ‘ఊరొకప్పటిలా లేదు. ఆ కళే పోయింది!’ అంటారు. అవును, ఊరు ఛిద్రమైంది. భారతీయత గ్రామాల్లోనే ఉందని, గ్రామస్వరాజ్యమే భవి తకు మనుగడని జాతిపిత బాపూజీ చెప్పారు. ఆయనెందుకలా అన్నారు...? ఆ రోజుల్లోనే ఆయన ఏవో అవలక్షణాల్ని పసిగట్టి అలా హెచ్చరించారేమో? భారతీయతకు ఊరే భూమికగా ఉండేది. ఈ దేశాన్ని ఇన్నూరేళ్లు పాలించిన బ్రిటిష్ వాడు చెరచలేకపోయిన మన ‘ఊరు’ను మనమే ఛిద్రం చేసుకున్నాం, చేజేతులా! ముఖ్యంగా గడిచిన రెండు, రెండున్నర దశాబ్దాలలో ఊరు, ప్రత్యేకించి తెలుగునాట మరీ ధ్వంసమైంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుదేల యింది. ప్రధాన వ్యాపకమైన వ్యవసాయం కునారిల్లింది. అనుబంధ చేతి వృత్తులు నాశనమయ్యాయి. బతుకుదెరువు కోసం వలసలు అనివార్యమ య్యాయి. సరైన ఉపాధి, విద్య, వైద్యం లభించక కన్నీళ్లతో ఊరికి దూరమైన కుటుంబాలు లెక్కలేనన్ని. పాలకుల పక్షపాతం, ప్రభుత్వాల తప్పుడు ప్రాధాన్యాలు, మన నిర్లక్ష్యం, సాంస్కృతిక దాడులు వెరసి ఊరిని ఒంటరిని చేశాయి. గోరటి వెంకన్న అన్నట్టు... పల్లె కన్నీరు పెట్టింది... కనిపించని కుట్ర ల్లో, కనిపిస్తున్న కుట్రల్లో బందీ అయింది. కానీ బతికే ఉంది! బాగు కోసం ఇక ఏమీ చేయలేమా? ఊరును బాగు చేయొచ్చు. ఇప్పుడది ఉమ్మడి కర్తవ్యం. వెళ్లిపోయింది కొందరే, వెళ్లగొట్టింది ఎందరినో... గ్రామాలొకప్పుడు కళకళలాడేవి. ప్రశాంత వాతావరణం, ఆహ్లాదకరమైన పరిసరాలు, అన్నిటికీ మించి మంచితనం ఉట్టిపడేవి. మానవసంబంధాలు ఉత్కృష్టంగా ఉండేవి. గౌరవ మర్యాదలకు లోటుండేది కాదు. సంపదలతో తులతూగకున్నా, చిన్నాపెద్దా తేడాల్లేకుండా ఊరూరూ స్వయం సమృద్ధంగా ఉండేవి. వివిధ సామాజిక వర్గాలు, విభిన్న ఆర్థిక నేపథ్యాలున్నా ఊరంతా కలిసి మెలిసి ఉండేవారు. ఒకరి బాగోగులపై వేరొకరికి పట్టింపుండేది. ఆనం దాలను పంచుకున్నట్టే ఇరుగుపొరుగుల కష్టాలను, బాధలను పంచుకునే వారు. అవసరాలకు ఆదుకునే వారు, అనునయించి ధైర్యం చెప్పేవారు. కోలుకోలేని కష్టాల్లో ఉన్నా బతుకుపై భరోసాకు ధీమా దొరికేది. ఆత్మహత్య అనే ఆలోచనే రాని సామాజిక జీవనానికి నాటి ఊరు నెలవు. ఆర్థిక స్వావలంబన ఉండేది. రైతుకు వ్యవసాయం గిట్టుబాటయేది. పాడీపంటా, గొడ్డూ గోదా, గొర్లూ, మేకలూ రైతును ఆర్థికంగా ఆదుకునేవి. బడుగు బలహీన వర్గాలకు సైతం తిండిగింజలు తదితరాలు అందుబాటులో ఉండేవి. వ్యవ సాయ అనుబంధ సేవలైనా, చేతి వృత్తులైనా తలెత్తుకు బతగ్గలిగేంత గౌర వంగా ఉండేవి. గత రెండున్నర దశాబ్దాల్లో అవన్నీ కుదేలైపోయి గ్రామ ఆర్థిక సమీకరణాన్నే సమూలంగా మార్చేశాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఛిద్రమైంది. ప్రధానంగా చిన్న కమతాలతో కూడిన మన వ్యవసాయం రైతు బతుక్కు భరోసా కల్పించే స్థితి లేదు. విత్తనాలు, ఎరువులు, కూలీలు, క్రిమిసంహార కాలు తదితరాలన్నిటి ధరలూ ఆకాశమంటి ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగింది. వాతావరణ పరిస్థితుల్లో స్థిరత్వం, క్రమత తప్పాయి. అన్ని అరిష్టాలూ దాటి చేతికి అందిన ఆ ఇంత పంటకూ గిట్టుబాటు ధర సంగతలా ఉంచి, కనీస మద్దతు ధర కూడా లభించని దుస్థితి. వ్యయం పెరిగి, రాబడి తగ్గి ఏటేటా అప్పులు పెరుగుతుంటే ఆస్తులు తరుగుతున్నాయి. బతుకు భార మౌతోంది. కమ్మరి, కుమ్మరి, కంసాలి, వడ్రంగి, చేనేత తదితర చేతి వృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడ్డ వారందరిదీ ఇదే స్థితి. వ్యవసాయానికి ఇతర ఆదాయవనరులు తోడైన సందర్భాల్లో కాస్త నయం. కానీ, వ్యవసాయమే ఆదరువుగా ఉన్న కుటుం బాలు గుల్ల. గౌరవంగా బతకడం పోయి, బతుకుదెరువుకూ గడ్డుకాలం వచ్చినపుడు వలస అనివార్యమైంది. పొట్టచేత పట్టుకొని సమీప పట్టణాలకో, నగరాలకో తరలివెళ్లిన దుస్థితి. ఇది ఒక దశ. ఆ పైన, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి తోడు సరైన విద్య, వైద్య సదుపాయాలు లేక ఆర్థిక స్తోమతగల కుటుంబాలూ ఊరొదిలి నగరాల బాట పట్టాయి. వీటికి తోడు రాజకీయ వ్యవస్థలోని వివక్ష కూడా గ్రామాన్ని బలహీనపరిచింది. ఇది గ్రహించిన దివంగత నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేయడం కోసం రుణమాఫీ, ఉచిత విద్యుత్తు, ఫీజు రీ-ఇంబర్స్మెంట్ తదితర చర్యలు చేపట్టారు. కానీ, అంతకు ముందు, ఆ తర్వాత మనుషుల్ని ఓటర్లుగా మాత్రమే చూడగల వ్యవస్థకు ఊరు జనం ఆనలేదు. వ్యవస్థీకృత మైన, చదువరులతో కూడిన పట్టణ, నగరవాసుల పట్లా, వారి ప్రయోజనాల పట్లా చూపే శ్రద్ధ గ్రామీణుల పట్ల చూపట్లేదు. తాగునీరు, రోడ్లు, రవాణా, విద్య, వైద్యం, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలలో పట్టణాలకు, గ్రామాలకు పొంతనే లేదు! పట్టణాల కోసం వేల కోట్ల రూపాయల పథకాలు రచించే ప్రభుత్వాలకు గ్రామీణులపైనే శీతకన్ను! ఉల్లిధర రెట్టింపైతే భూకంపం వచ్చినట్టు గగ్గోలు పెట్టే ప్రభుత్వాలు, ప్రసారమాధ్యమాలకు అతివృష్టికో, అనావృష్టికో రైతు పంట మొత్తం పోయినా పట్టదు. ఆదుకునే దిక్కేలేక గత్యంతరంలేక ఊళ్లొదిలిన వారే ఎక్కువ! తేలిక సంపాదనొకటి... కఠిన రాబడి మరొకటి.... సాఫ్ట్వేర్ విప్లవం తర్వాత పల్లె-పట్టణం మధ్య అంతరం బాగా పెరిగింది. ఆర్థిక పరంగా ఇది విరుద్ధ సమీకరణాన్ని ఆవిష్కరించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు తగ్గిన క్రమంలోనే పట్టణాలు, నగరాల్లో అవకాశాలు క్రమంగా పెరిగాయి. బతుకు తెరువు ఆశ గ్రామీణుల్ని పట్టణం వైపు తరిమింది. దూరపు కొండలు నునుపన్నట్టు పట్టణాల్లో డబ్బు సంపాదన తేలికనే భ్రమ కొంద ర్ని కాటేసి, వలసల్ని గుడ్డిగా పెంచింది. ఒక జీవిత కాలంలో వెనకేయగలమా? అని గ్రామీణులు నివ్వెరపోయేటంత పెద్ద జీతాల్ని సాఫ్ట్వేర్, తదితర ఉన్నతోద్యోగులు ఒకటి రెండు నెలల్లోనే సంపాదించారు. గ్రామీణ సంపన్నులు తరాలపాటూ కూడబెట్టలేని సంపద లను రాజకీయ, వ్యాపార వర్గాలు, వ్యవహర్తలు, పారిశ్రామికవేత్తలు, వైద్యం తదితర వృత్తినిపుణులు ఒకటి రెండేళ్లలోనే సంపాదించడం వారిని విస్మయ పరిచింది. ఇక మామూలు మధ్య తరగతి వారికీ చిన్నదో, పెద్దదో, ప్రయి వేటుదో, సర్కారుదో ఏదో ఓ కొలువు పట్టణాల్లోనే దొరుకుతుందనే ఆశలు బలపడ్డాయి. ‘ఏం లేకున్నా ఎక్కడో ఓ చోట ఇంత పనిచేసుకొని బతకొచ్చు’ అన్న భరోసా వారిని పట్టణాల వైపు నడిపించింది. పట్టణాలు, నగరాలు చేరి కోట్లకు పడగలెత్తినవారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనివ్వక పోగా అనైతిక పద్ధతుల్లో అక్కడా ఆర్థిక ప్రయోజనాలను ఆశించారు. ఒకప్పుడు పద్ధతిగా సాగిన ప్రయివేటు రుణ వ్యవస్థ, వడ్డీవ్యాపారం ప్రాణాల్ని పిండేసే దోపిడీ రూపమెత్తింది. ‘కాల్‌మనీ’ నాగుల కాట్లవే! దీంతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారింది. వ్యవసాయాన్ని, అనుబంధ పరిశ్రమల్ని, చేతి వృత్తుల్ని దారుణంగా అలక్ష్యం చేసిన ప్రభుత్వాలు కుటీరపరిశ్రమల్నీ కూడా ఎదగనీయలేదు. దీనికితోడు ప్రపంచీకరణ ప్రతికూల ప్రభావం అప్పటికే పెను భారంతో కుంగి, వంగి నడుస్తున్న గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నడుములు విరిగేలా దెబ్బతీసింది. విద్య, ఉపాధి అవకాశాల్లేని గ్రామీణ యువత టీవీలు, సినిమాల ప్రభావంతో వినియోగ వస్తు మార్కెట్ మాయలో పడి కొట్టుకు పోవడం గ్రామం పాలిటి తాజా శాపమైంది. కాస్మెటిక్స్ నుంచి సెల్‌ఫోన్ వరకు వినియోగ వస్తు వ్యామోహ మార్కెట్ సంస్కృతి ప్రతి ఇంటిలోకీ చొరబడింది. ఉపాధి అవకాశాల్లేని గ్రామీణ యువతలో సంపన్నులు, ఎగువ మధ్యతరగతితో పోల్చి చూసుకునే తత్వం పెరిగింది. దీంతో నిస్పృహకు గురై చిన్న వయసులోనే తెంపరితనం, చెడు తిరుగుళ్లు, తాగుడు వంటి వ్యసనానికి బానిసలై ఏ పనీ చేయలేని అనుత్పాదక భారంగా గ్రామ యువత మిగలడం మరో కొత్త విషాదం. గ్రామం వదల్లేని వృద్ధులు, పెన్షనర్లు, ఎవరూ లేని వితంతువులు, రూపాయికి కిలో బియ్యంపై ఆధారపడ్డ నిరుపేదలు, పెద్దగా శ్రమించకపోయినా ప్రభుత్వ పథకాల్ని ఉపాధిగా మలచుకోగలమని రాజీపడ్డ వాళ్లు తదితరులే చాలా గ్రామాల్లో అత్యధికులుగా మారుతున్నారు. సాంస్కృతిక దాడి సామాన్యమైందేమీ కాదు! ఒకప్పుడు రాత్రి తొమ్మిదయిందంటే ఊరంతా నిశ్శబ్దం రాజ్యమేలేది. అంతా రాత్రి భోజనాలు ముగించి నిద్రలోకి జారేవారు. తెల్లారక ముందే పల్లె చేతనమయ్యేది. రకరకాల పనుల్లో పడిపోయేది. ఇప్పుడు అధిక కుటుంబాల్లో మధ్య రాత్రి దాటే వరకు, ఇంటి తలుపులైనా మూసు కోకుండా టీవీలకు అతుక్కుపోయే సంస్కృతి బలపడింది. బాధ్యతల కన్నా బరితెగింపునే ప్రోత్సహించే చౌకబారు వినోదాన్ని గ్రామంపై జరుగుతున్న సాంస్కృతిక దాడిగానే పరిగణించాలి. డబ్బింగ్ సీరియల్స్, ఉద్రేకపు మసాలాల సినిమాలు వినోదం పేరిట మత్తులో ముంచుతుంటే అన్ని వయసుల వాళ్లూ తుళ్ళుతుంటారు. బారెడు పొద్దెక్కినా అత్యధికులు నిద్రలోనే దొర్లే పరిస్థితి. పనీపాటూ లేక గాలికి తిరగడం, పోసుకోలు కబుర్లు, గిల్లికజ్జాలే యువత జీవితంగా మారుతోంది. ఈ స్థితిని పెంచి గ్రామీణుల్ని వర్గాలుగా, గ్రూపులుగా చీల్చే స్వార్థ రాజకీయ వ్యవస్థ ద్రోహం ఇంతా అంతా కాదు. ఇన్ని ప్రతికూలతల నడుమ కూడా... గ్రామాన్ని కాపాడుకునే దారులున్నాయి. కావాల్సింది కాసింత తపన, నిజాయితీ, చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ! ఎంత ఎత్తు ఎదిగినా మూలాలను మరవని పట్టణ, నగర వాసిలోని ‘ఊరెళ్లాలనే ఉబలాటం’ అభినందనీయమే! అయితే, ఏడాదిలో ఒక సంక్రాంతి రోజో, ఒక దసరా రోజో మాత్రమే గ్రామంతో అనుబంధం కలుపుకుంటేనే చాలదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేసే విధాన నిర్ణయాలు కావాలి. అందుకు, రాజకీయ, పాలనా వ్యవస్థలపై ఒత్తిడి తేవాలి. అంతకు మించి ఊరును కాపాడుకునే సాంస్కృతిక ఉద్యమమే రావాలి! ఊరి ఉనికి నిలబెట్టాలి! ఈమెయిల్: dileepreddy@sakshi.com దిలీప్ రెడ్డి -
మద్యరక్కసి పీచమణచాలి
సమకాలీనం తాగడం మంచిది కాదు, జీవన ప్రమాణాల్ని, కడకు జీవితాల్నే హరిస్తుందన్న ప్రచార యత్నాలుండవు, పరివర్తన కలిగి మానేయాలనుకునే వారికి మద్దతిచ్చే డీ-అడిక్షన్ సెంటర్లుండవు. మద్యనిషేధం విధిస్తే పెద్ద మొత్తంలో రాబడికి గండి పడుతుంది, ఇక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలెలా చేపట్టాలి? అనే వాదననూ పాలకులు ముందుకు తెస్తారు. ఎవరి బతుకుల్ని, జీవితాల్ని పణంగా పెట్టి ఆ డబ్బుల్తో ఇంకెవరి అభివృద్ధి-సంక్షేమాల్ని సాధిస్తారు? ‘వితంతు పెన్షన్లు ఇవ్వడానికి జనగణనకు గ్రామాలకు వెళ్లినపుడు యుక్త వయసు, మధ్య వయస్కులైన ఎందరో వితంతువులు కనిపించేవారు. పిల్లలున్న ఆ తల్లులు తాగుడువల్లే తమ భర్తలు చనిపోయారనీ, ఇల్లు గడ వటం కష్టంగా ఉందనీ చెప్పేవారు. ఎలాగైనా పెన్షన్ వచ్చేలా చూడమని కాళ్లా వేళ్లా పడి రోదిస్తుంటే కళ్లు చెమర్చేవి’ అని సాక్షాత్తూ ఓ మండలాధికారి చెప్పారు. మెదక్ జిల్లా, కుల్చారం మండలం, ఎనగండ్ల... మా స్వగ్రామంలో అంబేద్కర్‌ను స్మరిస్తూ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నేను పాల్గొన్నపుడు ఆయనీ మాటలు చెప్పారు. గ్రామాల్లో మెజారిటీ వితంతువులది ఇదే నేపథ్యం! రోజూ తప్పతాగి, మత్తులో రోడ్డు ప్రమాదాలకు గురై, తాగి నిర్మానుష్య ప్రాంతంలో పడిపోయి తాగునీరందక డీహైడ్రేషన్‌కు గురై, మద్యం ఖర్చులకు అప్పులు చేసి-తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొని.. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్యం వల్ల పెద్ద సంఖ్యలోనే చనిపోతున్నారు. ఇది చనిపో తున్న వారి కథ. ఇక జీవచ్ఛవాలుగా ఉన్న వారిది ఇంకా ఎక్కువ సంఖ్యే! మన సమాఖ్య పాలనా వ్యవస్థలో ఓ రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలు సాధ్యం కాదు అనేది వాస్తవమే. కానీ సమాజం మేలు కోసం మద్యంపై నిషేధం విధించాల్సిన అవసరం అంతకన్నా వాస్తవం. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో మద్యం అందుబాటులో ఉండటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో విధించిన మద్య నిషేధం విఫలమైందన్నది నిజం. అయితే, జనహితానికే ఆయా రాష్ట్రాల్లో సదరు నిర్ణయం తీసుకున్నారన్నది అంతకన్నా నిజం. నిషేధం సరిగ్గా అమలు కాక ఇతరేతర సమస్యలు పుట్టుకొస్తున్నాయని చెప్పడానికి రుజువులున్నట్టే, ఈ అనుభవాలుండీ మరి కొన్ని రాష్ట్రాలు కొత్తగా నిషేధం నిర్ణయానికి వెళ్లాయంటేనే అవసరం ఎంత బలమైందో బోధపడు తోంది. మొదటి నిజాన్ని కప్పిపుచ్చి రెండో నిజాన్నే భుజాలకెత్తుకోవడం, నిషేధం సాధ్యపడదని ప్రచారం చేయడం అంత సమంజసం కాదు. సమా జాన్ని జాఢ్యంలా పట్టి పీడిస్తున్న మొదటి నిజంపై విస్తృతంగా చర్చ జరగాలి. అమలు విఫలమౌతోంది కనుక... ఒక దురలవాటును యథేచ్ఛగా అనుమ తించాలనడం, ప్రభుత్వమే పెంచి పోషించాలనడం, దాన్నే ఓ మంచి ఆదా యవనరుగా పాలకులు పరిగణించటం ఇప్పుడు జరుగుతున్న అనర్థం. ఫలి తంగా మద్యం లిఖించే మరణశాసనంతో లక్షల కుటుంబాలు చితికి పోతున్నాయి. తలనొప్పి ఉందని తలనే తీసేస్తామా? మద్య నిషేధం అమలు సరిగా జరగదు, అంతటా విఫలమౌతోందంటూ కొందరు వ్యతిరేకిస్తుంటారు. అమలు సరిగ్గా జరగటం లేదని నిషేధాన్నే ఎత్తివేయడం ఓ విచిత్ర పరిస్థితి. ‘నిషేధం సరిగ్గా అమలు కావట్లేదు, మావో యిస్టులపై నిషేధం విధించినా వారి హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి...’ అని వారిపై నిషేధాన్ని ఎత్తివేస్తారా? అంటే, ఎత్తి వేయరు. తల నొప్పికి నివారణ మార్గాలు అన్వేషించాలి తప్ప, తల ఉండటం వల్లే తలనొప్పి వస్తోంది కనుక తలనే తీసేస్తే సరి అన్నది సరైన పంథా కాదు. ‘ఆంధ్రరాష్ట్ర (ఆంధ్రాప్రాంత) మద్యనిషేధ చట్టం 1937’ ప్రకారం బ్రిటిష్ ఏలుబడి నుంచి 1969 అక్టోబరు 30 వరకూ మద్య నిషేధం అమల్లో ఉంది. అప్పుడూ ఇటువంటి చర్చే జరిగి నిషేధాన్ని 1969 నవంబరు 1 నుంచి ఎత్తివేశారు. తర్వాతి కాలంలో మద్యం విభిన్న రూపాల్లో ప్రజల జీవితాల్ని శాసించింది. మద్యంతో పాటు సారాయిని ప్రభుత్వమే అధికారికంగా అమ్మించేది. ఊరూరా ప్రభుత్వ సారాయి దుకాణాలుండేవి. రాజకీయ నేతలు, వారి అండతో ప్రయివేటు వ్యక్తులు కాంట్రాక్టర్ అవతారాలెత్తి కోట్లకు పడగలెత్తారు. 1983లో ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ‘వారుణి వాహిని’ పేరుతో సారాయిని ప్యాకెట్లలో ప్రభుత్వ యంత్రాంగమే విక్రయించేది. దశాబ్ద కాలంలో పరిస్థితులు విషమించి వ్యసనం సగటు జీవితాల్ని కల్లోలం చేస్తుంటే, 1992లో మొదలైన సారా వ్యతిరేకోద్యమం క్రమంగా మద్య వ్యతిరేకోద్యమ రూపు సంతరించుకుంది. 1993లో నెల్లూరు జిల్లాలో విధించిన సారా నిషేధాన్ని కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం తర్వాత రాష్ట్ర మంతటికీ విస్తరించింది. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యనిషేధం విధి స్తామనే హామీతో ఎన్నికల బరిలో దిగిన ఎన్టీరామారావు 1994లో గెలిచి 1995 జనవరి 16 నుంచి నిషేధం విధించారు. ఎన్టీయార్ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా జరిగిన అధికార మార్పిడితో ముఖ్యమంత్రి అయిన చంద్ర బాబునాయుడి హయాంలో నిషేధం నీరుగారింది. సంపూర్ణ మద్యనిషేధాన్ని దశలవారీగా తూట్లుపొడిచి, చివరకు 1997 ఏప్రిల్ 1న ఎత్తివేశారు. గుజరాత్, నాగాలాండ్, మణిపూర్ ఇతర ఈశాన్య రాష్ట్రాలతో పాటు లక్షదీవుల్లో మద్య నిషేధం అమల్లో ఉంది. కేరళలో నియంత్రణ అమలవుతోంది. వచ్చే ఏడు సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తామని బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రకటించారు. నిషేధ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కర్ణాటక తదితర ప్రభుత్వాలు ఇదే యోచన చేస్తున్నాయి. భారత రాజ్యాంగం 47 వ అధికరణం ప్రకారం వైద్య ప్రయోజ నాలకు తప్ప ఆరోగ్యానికి హాని కలిగించే అన్ని రకాల మత్తు పానీయాలను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది కేవలం అధికారాలకు సంబంధించిన అంశం కాదు, అమలు-ఆచరణకు సంబంధించిందనే వాదనా రావచ్చు. నిజమే! సంక్షేమ రాజ్యమని చెప్పుకునే ప్రభుత్వాలకు సమాజ హితం, ప్రజల మంచిచెడులు, వారి జీవన ప్రమాణాలు... ఇవేవీ బాధ్యతలు కావా? రాష్ట్రాలు ఆదాయం దృష్టి కోణంలో చూస్తాయి. పైగా ఒక రాష్ట్రం నిషేధించి ఇరుగు-పొరుగు రాష్ట్రాలు నిషేధించకుంటే ఆ రాష్ట్రంలోకి అక్రమ మద్యం వరదై పారుతుంది. అందుకే ఏక మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే సంపూర్ణ మద్య నిషేధం విధించాలనే డిమాండూ ఉంది. పాపపు సొమ్ముపై సర్కార్ కన్నేస్తే..... ‘నియంత్రణ’ ఉత్తి నినాదమే! సంపూర్ణ నిషేధం సాధ్యం కాదు, విచ్చలవిడిగా మద్యం దిగుమతి అయి అసాంఘిక శక్తులు పెట్రేగిపోతాయనేది ఒక వాదన. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తెలుగు రాష్ట్రాల్లోకి ఏరులై పారుతుందంటారు. ఎంత పటిష్ట పోలీసు-ఎక్సైజ్ వ్యవస్థ ఉన్నా నియంత్రించలేం కాబట్టి నిషేధం వద్దంటారు. నియంత్రణ అమలు జరగాలని, దశలవారిగా సంపూర్ణ నిషేధం వైపు నడవాలనేది వారి ప్రతిపాదన. అంతవరకు బాగానే ఉంది. కానీ, అదే పనిగా సర్కారు అధిక రాబడి కోసం విక్రయ లక్ష్యాలు పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించడాన్ని ఏమనాలి? జీవన ప్రమాణాలు, ప్రజల ప్రాణాలు పణంగా పెట్టయినా సరే ఏయేటికాయేడు రాబడి కోసం అర్రులు చాచే ప్రభుత్వాలు మద్యం తాగకుండా జనాన్ని చైతన్యపరుస్తాయనుకోవడం భ్రమ! ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ, ఎంతకు అంటే అంతకు (చీప్ లిక్కర్‌ను మేమే తయారు చేసి, అమ్ముతామన్న ప్రభుత్వం) తేలిగ్గా మద్యం దొరికేట్టు సర్కారు కృషి చేస్తే ఇక నియంత్రణ ఎక్కడ? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడదే జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో మద్యం విక్రయాల విలువ రోజూ రూ.40 కోట్లుండేది. అనధికారికంగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతయ్యేది, మిలటరీ క్యాంటీన్ల నుంచి వచ్చేది, కల్తీ మద్యం... కలిపి రోజుకు మరో 5 నుంచి 10 కోట్ల రూపాయలుండొచ్చని ఓ అంచనా! మద్యం అమ్మకాల ద్వారా 2005-06 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 10-15 శాతం వరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ వచ్చింది. 2005-06లో రూ. 5367.92 కోట్లు ఉన్న ఆదాయం 2013-14 నాటికి రూ. 21,319 కి చేరింది. 2011-12 కు 2012-13కు మధ్య ఒక్కసారిగా రూ. 3,700 కోట్లు వృద్ధి చెందింది. 2013-14లో ముందు సంవత్సరం కన్నా రూ. 3,000 కోట్లు అదనపు ఆదాయం లభించింది. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014-15లో తెలంగాణలో రూ. 10,238 కోట్లు ఆదాయం , ఆంధ్రప్రదేశ్‌లో రూ. 11,010 కోట్లు వచ్చింది. ఇది 10 శాతం వృద్ధి. ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలిచ్చి, ఏపీలో ఇప్పుడు 85వేల బెల్టు షాపులు యథేచ్ఛగా సాగుతున్నా కిమ్మనని సర్కారు దోషి కాకుండా పోతుందా? పరివర్తన ప్రభుత్వ కర్తవ్యం తాగుడు అనర్థాలను సశాస్త్రీయంగా వివరించి వ్యసనం నుంచి వారిని మళ్లించడం ప్రభుత్వాల బాధ్యత. ఇది ఒక్క రోజులో అయ్యే పనికాదు. అలా అని చేతులు ముడుచుక్కూర్చోవడం పరిష్కారం కాదు. నిషేధమో- నియంత్రణో అమలు చేస్తూనే ఏకకాలంలో ప్రచారమూ చిత్తశుద్ధితో చేయాలి. ప్రపంచ అనుభవాలు అదే చెబుతున్నాయి. తాగుడు వ్యసనం బలపడి.. నేరాలు, అవి నీతి పెచ్చుమీరుతున్నాయని అమెరికాలో 1919 నుంచి 1933 వరకు సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు పరిచారు. పురాతన చైనా, ఫ్యూడల్ జపాన్ నుంచి నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్లాండ్ వంటి దేశాల్లోనూ ఈ ప్రయోగాలు న్నాయి. అలా అని నిషేధం ఏ ఫలితమూ ఇవ్వలేదనడం మొండి వాదన. అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధకాలంలో చేసిన ప్రచారం తాగుడు వ్యసనాన్ని బాగా తగ్గించింది. ఆస్తిపరులు, సంపన్నులు, వైద్యులు సూచించిన వారు మాత్రమే మద్యం సేవించే వాతావరణం బలపడింది. శ్రమజీవులు, దిన కూలీలు, నిరుపేదలు అల్పాదాయవర్గాల వారు విచ్చలవిడిగా తాగి సంసా రాలు గుల్లచేసుకునే సంస్కృతి పోయింది. ఈ చైతన్యం పెరిగిన దేశాల్లో మద్య సేవనం ఆస్తిపరుల సౌఖ్యంగా మిగిలిందే తప్ప పేదలు, అభాగ్యుల సంసారాల్ని కూల్చే జాఢ్యంగా మారలేదు. మన దగ్గర అది ఉంది, పోవాలి. తాగడం మంచిది కాదు, జీవన ప్రమాణాల్ని, కడకు జీవితాల్నే హరిస్తుందన్న ప్రచార యత్నాలుండవు, పరివర్తన కలిగి మానేయాలనుకునే వారికి మద్ద తిచ్చే డీ-అడిక్షన్ సెంటర్లుండవు. మద్యనిషేధం విధిస్తే పెద్ద మొత్తంలో రాబ డికి గండి పడుతుంది, ఇక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలెలా చేపట్టాలి? అనే వాదననూ పాలకులు ముందుకు తెస్తారు. ఎవరి బతుకుల్ని, జీవితాల్ని పణంగా పెట్టి ఆ డబ్బుల్తో ఇంకెవరి అభివృద్ధి-సంక్షేమాల్ని సాధిస్తారు? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మనసుంటే మార్గముంటుంది. రాబడికి ప్రత్యా మ్నాయాలూ ఉంటాయి. అందుబాటును బట్టే అలవాట్లు వ్యసనాలుగా మారుతాయనేది విశ్వవ్యాప్తంగా ధ్రువపడ్డ అంశం. మరీ ముఖ్యంగా మద్యం విషయంలో ఇది సత్యం! మద్యం అందుబాటును తగ్గించిన చోట విని యోగం పూర్తిగా తగ్గిపోయిన దాఖలాలు చరిత్రలో కోకొల్లలు. ఏం చేస్తారో తెలియదు. తాగుడును మాన్పించే సంకల్పం, చిత్తశుద్ధి కావాలి. ఛిద్రమైన జీవితాల్లో చిరుదీపం వెలిగించాలి. తాగుడు మహమ్మారికి సంసారాలు, నిండు జీవితాలు బలి కాకుండా చూడాలి. వ్యాసకర్త: దిలీప్‌రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com -
అయినా.. మనిషి మార(టం) లేదు!
సమకాలీనం ఈ విలయం కోటి మందిని కకావికలం చేసింది. సముద్రతీర నగరం శోక సంద్రమైంది. ఇది కేవలం ప్రకృతి విపత్తేనా? మానవ ప్రమేయం ఎంత? ఇది కోటి రూకల ప్రశ్న! ఈ విలయానికి హేతువైన వాతావరణ మార్పులకు, అడ్డదిడ్డపు నగరీకరణకు మనమే కారణం. ఈ అనర్థాల పర్యవసానమే నేటి చెన్నై దుస్థితి. నాలుగువందల ఏళ్ల పైబడ్డ చరిత్ర కలిగిన హైదరాబాదు (తెలంగాణ), ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న అమరావతి (ఆంధ్రప్రదేశ్)- రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు ఇదొక హెచ్చరిక. 'పారిస్‌పై దాడి జరిపిన ఉగ్రవాదుల తుపాకీ చప్పుళ్లు వినిపించినంతగా... ఉపద్రవంలో క్షతగాత్రులైనవారి మౌనరోదనలు మనలో ప్రతిధ్వనించ లేదు... వాతావరణ మార్పు దుష్పరిణామాల గురించి ఆందోళన చెందు తున్న గొంతుల తీవ్రతను పరిగణనలోకి తీసుకోవడంలో ఇక ఏ మాత్రం ఆలస్యం కూడదు' అని పారిస్‌లోనే జరుగుతున్న పర్యావరణ సదస్సుకు, ఆతిథ్య దేశం ఫ్రాన్స్ అధ్యక్షుడు హొలాండ్ సందేశమిచ్చారు. పాల్గొన్న 150కి పైగా దేశాల ప్రతినిధుల్లో ఎందరు ఈ సూక్ష్మార్థాన్ని గ్రహించారో కాని, మన పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాజధాని చెన్నై ఇందుకు ఓ పాఠమే. వాతావరణ మార్పుల ఫలితంగా అకాల, అసాధారణ వర్షాలకు మనం, మన పాలకుల రూపంలో మానవ తప్పిదం తోడైంది. భళ్లున వర్షం కురిసినట్టే, చెన్నై రోదన మిన్నంటింది. తక్షణ సహాయం అందించడానికి కూడా వీల్లేనంత అతలాకుతలమైంది. ఈ విలయం కోటి మందిని కకావికలం చేసింది. సముద్ర తీర నగరం శోక సంద్రమైంది. ఇది కేవలం ప్రకృతి విపత్తేనా? మానవ ప్రమేయం ఎంత? ఇది కోటి రూకల ప్రశ్న! ఈ విలయానికి హేతువైన వాతావరణ మార్పులకు, అడ్డదిడ్డపు నగరీకరణకు మనమే కారణం. ఈ అనర్థాల పర్యవసానమే నేటి చెన్నై దుస్థితి. నాలుగువందల ఏళ్ల పైబడ్డ చరిత్ర కలిగిన హైదరాబాదు (తెలంగాణ), ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న అమరావతి (ఆంధ్రప్రదేశ్)- రెండు తెలుగు రాష్ట్రాల రాజధానులకు ఇదొక హెచ్చరిక. కష్టాల్లో ఉన్న సాటివారిని ఆదుకునేందుకు చూపుతున్న మానవత్వంలో నాలుగో వంతు శ్రద్ధయినా ముందు జాగ్రత్తల విషయంలో తీసుకుంటే ఇలాంటి ఉపద్రవాల్ని అరికట్టడం, లేదా తీవ్రత తగ్గించడం చేయవచ్చని నిపుణులు అభిప్రాయం. హెచ్చరికల్ని బేఖాతరన్నందుకే! వాతావరణ విభాగం లెక్కల ప్రకారం చెన్నై తీవ్ర వరద ప్రమాద ప్రాంత మేమీ కాదు. తూర్పున బంగాళాఖాతమున్న ఈ నగరం సగటు సముద్ర మట్టానికి అయిదారు మీటర్ల ఎత్తునుంది. కానీ, చెన్నైలోని కొన్ని లోతట్టు ప్రాంతాలు కనీస సముద్ర మట్టం కన్నా 27 అంగుళాల ఎత్తులోనే ఉన్నాయి! ఇక్కడ డ్రైనేజీ నిర్వహణ కొంత కష్టం. చెన్నైలో తరచూ అక్టోబర్-డిసెంబర్ లోనే అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. 1200 మి.మీ నుంచి 1300 మి.మీ సగటు వర్షపాతం కురిసేది, క్రమంగా పెరుగుతోంది. అల్పపీడనం, తుపానుల వల్ల 1976, 1985, 1996, 1998, 2005, 2008, 2010లో, మళ్లీ ఇప్పుడు కుంభవృష్టి కురిసి భారీ నష్టం సంభవించింది. 1901 తర్వాత, అంటే 114 సంవత్సరాల్లో నమోదైన అతి పెద్ద వర్షపాతం ఇదే. గత అనుభ వాల దృష్ట్యా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడటానికి, ముందు జాగ్రత్త చర్యలకు అవకాశమున్నా పాలకులు నిర్లక్ష్యం చేశారు. చెరువులు-కుంటల పరిరక్షణలో, మురుగునీటి వ్యవస్థ నిర్వహణలో, ఘనవ్యర్థాల్ని నగరం బయటకు తరలించ డంలో విఫలమయ్యారు. స్పృహ కొరవడ్డ పౌరుల సహకారం కూడా అంతంతే! స్థానిక విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్కిటెక్ట్ కె.లావణ్య జరిపిన అధ్యయనంలో చాలా విషయాలు వెలుగు చూశాయి. చెన్నైలో ఒకప్పుడు 650 చెరువులుండేవి. ఇప్పుడు 40కి లోపే మిగిలాయి. చిత్తడి ప్రాంతాలన్నింటా నిర్మాణాలొచ్చాయి. నగరంలో ప్రవహించే మూడు నదులు కుపుం, అడ యార్, కోనసత్తలయార్ పరీవాహక ప్రాంతాలన్నీ అక్రమణలకు గురయ్యా యి. నగరం నుంచి వచ్చే వాననీటిని గ్రహిస్తూ ప్రవహించే బకింగ్‌హామ్ కాలువ దాదాపు మూసుకుపోయింది. అక్కడక్కడ మిగిలిపోయిన కుంటలు, బహిరంగ లోతట్టు ప్రాంతాల్లో చెత్త, చెదారం వేస్తూ ఘనవ్యర్థాలతో నింపు తున్నారు. దేశంలో మరే నగరంలో లేనంత అత్యధిక తలసరి ఘన వ్యర్థాల్ని (0.6 కి.గ్రా/రోజు) ఉత్పత్తి చేస్తున్న నగరమిది. హై'డర్'బాదూ సురక్షితమేం కాదు! నిన్నటి చెన్నై వర్షం మన చారిత్రక హైదరాబాద్ నగరంలో కురిస్తే... అన్న ఊహ చాలా మందిని గగుర్పాటుకు గురిచేసింది. 2000 సంవత్సరంలో భారీ వర్షం జంటనగరాలను అతలాకుతలం చేసింది. నగరం నడిమధ్యన ప్రవ హించే మూసీ పోటెత్తింది. నాటి వర్షం దాదాపు 20 సెంటీ మీటర్లే! నిన్నటి వర్షం ఏకంగా 49 సెంటీ మీటర్లు! మన నగరంలో తాగునీటి సరఫరా- మురుగునీటి వ్యవస్థకు కాలం చెల్లింది. దురాక్రమణల వల్ల చెరువులు- కుంటలు కనుమరుగయ్యాయి. ఆదర్శ ప్రణాళిక అటకెక్కి, ముందు చూపు కొరవడటంతో చిన్నపాటి వర్షానికే మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. దాదాపు నూరేళ్ల కింద మూసీ వరదల్ని నియంత్రించడం, నగర తాగునీటి అవసరాలు తీర్చడం, హుస్సేన్‌సాగర్ పరిరక్షణ, డ్రైనేజీ వ్యవస్థ అంకురార్పణ కోసం విశ్వ విఖ్యాత ఇంజినీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మాస్టర్‌ప్లాన్ సిద్ధంచేశారు. నియంత నిజాం రాజైనా కొంత అమలు చేశాడు కానీ, ప్రజాస్వామ్య పాలకులై ఉండీ, దీన్ని దశలవారీగా అమలుచేయడంలో గ్రేటర్ విభాగాలు దారుణంగా విఫలమౌతున్నాయి. నగర జనాభా నాలుగున్నర లక్షలు మాత్రమే ఉన్నపుడు నిజాం వినతి మేరకు విశ్వేశ్వరయ్య పూనిక వహిం చారు. ఇప్పుడు... గ్రేటర్ జనాభా 80 లక్షలకు చేరువైంది. గృహసముదాయాలు సుమారు 20 లక్షలున్నాయి. 35 లక్షల మందికి మురుగు కష్టాలు నిత్యనరకం చూపుతున్నాయి. నగరంలోకి తాగునీరు తెప్పించేందుకు చేసే కృషిలో నాలుగో వంతు కూడా వాడిన నీటిని బయటికి పంపడంపై పాల కులకు శ్రద్ద లేదు. రోజువారీగా జీహెచ్ఎంసీ పరిధిలో సుమారు రెండువేల మిలియన్ లీటర్ల మురుగు నీరు ఉత్పన్నమౌతోంది. ఇది సాఫీగా వె ళ్లేందుకు కనీసం 4500 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ అవసరం. అందుబాటులో ఉన్నది 3,000 కిలోమీటర్లే. మేల్కొంటేనే సరైన నిద్ర! ఒక్క చెన్నై, హైదరాబాద్ ఘోష కాదిది. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగ రాల పరిస్థితీ ఇదే! మేఘాలావర్తించి వర్షం మొదలైతే.... నగరాల వాసు లకిక నిద్రలేని రాత్రులే! కలకత్తాకూ లోగడ కష్టాలు తప్పలేదు. 2005 నాటి వర్షాలకు ముంబై ముద్దయింది. 24 గంటల్లో కురిసిన 944 మి.మీ వర్షం, పొంగి ప్రవహించిన మురుగునీటితో కలిసి నగరాన్ని ముంచెత్తింది. కృష్ణా తీరంలో ఇప్పుడు నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. శివరామకృష్ణన్ కమిటీ హెచ్చరికను కాదని జరుపుతున్న నిర్మాణమని మరచిపోవద్దు. వందేళ్ల చరిత్ర సృష్టించిన వర్షం తమిళనాడులో కురిస్తే... పక్క తెలుగు రాష్ట్రాల్లో జీవనదులు, కృష్ణా-గోదావరి నూరేళ్లలో లేనంత ఎండిపోయి తీర నగరాలు-పట్టణాల్ని దప్పికతో అల్లాడిస్తు న్నాయి. నగరాలు నాగరికత చిహ్నాలంటారు. అది అవునో... కాదో? కానీ, నరకానికి నకళ్లు మాత్రం కాకూడదు. వ్యాసకర్త: దిలీప్ రెడ్డి, ఈ మెయిల్: dileepreddy@sakshi.com -
పారదర్శకత.. పదేళ్ల పాఠం
సమకాలీనం ఈరోజు, రేపు... రెండురోజుల పాటు ఢిల్లీలో జరుగుతున్న ‘సమాచార హక్కు జాతీయ వార్షిక సదస్సు‘లో ఆర్టీఐ క్షేత్రస్థాయి కార్యకర్తల్ని భాగస్వా ముల్ని చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇది ఉద్దేశపూర్వక చర్య, కేంద్రంలోని ఎన్డీయే విభిన్న వైఖరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లుగా సాగుతున్న పద్ధతికి తిలోదకాలిచ్చి, కేంద్ర-రాష్ట్ర కమిషనర్లు, ప్రభుత్వాధికారులకు తోడు పౌర సమాజం నుంచి ఎంపిక చేసిన కొందరు పెద్దల్ని మాత్రమే ఆహ్వానించారు. వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆర్టీఐ కార్యకర్తల్ని ఆహ్వానించకపోవడం వల్ల చట్టం అమలుపై జనాభిప్రా యం సదస్సులో చర్చకు వచ్చే అవకాశం పోతోంది. లోగడ జరిగిన వార్షిక సదస్సులలో వారు భాగస్వాములు. వారిచ్చే సమాచారం ఆధారంగా చర్చ, కొన్ని నిర్ణయాలూ జరిగేవి. చట్టం అమలు మొదలై పదేళ్లు పూర్తయిన సందర్భంలో జరుగుతున్న ఈ సదస్సులో ఇటువంటి చర్య ఉపేక్షించదగింది కాదనేది విమర్శ. ఈ పదేళ్లపాటు దేశంలో, అనేక ప్రతిబంధకాల నడుమ ఆర్టీఐ సజీవంగా ఉండటానికి కార్యకర్తలే ముఖ్య కారణం. రెండు తెలుగు రాష్ట్రాలుసహా, దేశంలో పదేళ్ల ఆర్టీఐ ప్రస్థానాన్ని పరిశీలిస్తే రెండంశాలు స్పష్టమౌతున్నాయి. పాలనా వ్యవస్థల్లో పారదర్శకతకు పట్టంకట్టిన సమా చార హక్కు చట్టం విజయవంతమైంది. కానీ, దాని అమలే విఫలమై పలు విధాలుగా భంగపడింది, భంగపడుతూనే ఉంది. పదేళ్లు చిన్న సమయమా? పెద్ద సమయమా? అంటే, వేళ్లూనుకు పోయిన దుర్వవస్థను సమూలంగా సంస్కరించడానికి ఇది పెద్ద సమయం కాకపోవచ్చు. కానీ, ఆశించిన లక్ష్యాల సాధన దిశలో సరైన పంథాలోనే ఉన్నామా అని సమీక్షించుకోవడానికి పదేళ్లు సముచిత సమయమే! వాడుకున్నోళ్లకు వాడుకున్నంత పిండికొద్ది రొట్టె వంటిది ఆర్టీఐ చట్టం. ఉపయోగిస్తేనే ప్రయోజనాలు. దర ఖాస్తుదారు ఆశపడ్డట్టే సంబంధిత అధికారులు స్పందిస్తేనే ఫలితం. మొదట్లో అంతగా లేదు కానీ, రానురాను వినియోగం పెరిగింది. దేశవ్యాప్తంగా ఆర్టీఐ దరఖాస్తుల సంఖ్య ఇప్పుడు ఏడాదికి దాదాపు 50 లక్షలకు చేరింది. రాష్ట్రం లోనూ, మొదటి ఏడాది 2005-06లో 8 వేల పైచిలుకున్న దరఖాస్తుల సంఖ్య ఇప్పుడు ఏడాదికి సగటున 1.7 లక్షలకు చేరింది. గతంలో గోప్యంగా ఉండే రకరకాల సమాచారం ఆర్టీఐ పుణ్యమాని ఇప్పుడు తేలికగా ప్రజా బాహుళ్యం లోకి వస్తోంది. పౌర సదుపాయాలతోపాటు సంక్షేమ కార్యక్రమాల అమలు, లబ్ధిదారుల ప్రయోజనాలు- హక్కులు, ప్రజాపంపిణీ, భూయాజమాన్య హక్కులు, పిల్లలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు వంటి విషయాల్లో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అధికార యంత్రాంగం సహజ వైఖరి, గోప్యంగా ఉంచే తత్వంవల్ల సాధారణ పరిస్థితుల్లో నిరాకరించే సమాచారాన్ని కూడా ఈ చట్టం కింద కోరినపుడు ఇవ్వాల్సి వస్తోంది. వేగం, ప్రభావం పెరగాలి పౌర కార్యాలయాల స్థాయిలోనే సమాచారం తేలిగ్గా లభించాలి. ఆ మేరకు అధికారుల్లో స్పందన, బాధ్యత-జవాబుదారీతనం పెరగాలి. అది లోపించిన పుడు కఠిన చర్యలు తీసుకునేలా సమాచార కమిషన్లు బలోపేతం కావాలి. అప్పీళ్లు, ఫిర్యాదుల్ని పరిష్కరించడంలో వేగంతో పాటు అధికార యంత్రాం గంపై వారి తీర్పులు, ఆదేశాల ప్రభావం పెరగాలి. వారి ఆదేశాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో సహకరించాలి. రెండూ జరగట్లేదు. చట్టం స్ఫూర్తిని పరిరక్షిస్తూ జనహితంతో ఆలోచించి, స్వతంత్రంగా వ్యవహరించే వారిని కమిషనర్లుగా నియమించాలి. గత పదేళ్ల అనుభవం మాత్రం ఇందుకు భిన్నం. చాలా రాష్ట్రాల్లో కమిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు నియమితులైన కమిషనర్లలో 76 శాతం మంది రిటైర్డ్ అధికారులని ఒక అధ్యయనం చెబుతోంది. సర్వీసులో ఎక్కువమార్లు ప్రజలకు సమాచారం నిరాకరించి పారదర్శకతకు మంగళం పాడినవారు, పునరావాస కేంద్రంలో భిన్నంగా వ్యవహరిస్తారనుకోవడం భ్రమే అన్నది నిపుణుల అభిప్రాయం. ఆర్టీఐ అప్పీళ్లు, ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉంటున్నాయి. సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ (సీఈఎస్) అధ్యయనం ప్రకారం, ఇప్పుడున్న వేగంతో వాటిని పరిష్కరిస్తే ఒక్కో రాష్ట్రంలో కేసుల పరిష్కారానికి 20, 30, 40 సంవత్సరాల కాలం పట్టొచ్చు. ఈ పంథా మారాలి. అన్ని కీలక పదవులు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లకే అప్పగించనవసరం లేదు, ఆయా రంగాల్లో నిపుణులైన బయటి వ్యక్తులకు ప్రాధాన్యమివ్వండని 2011, 2013లో సుప్రీంకోర్టు సుస్పష్టంగా చెప్పింది. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. భద్రతకు భరోసా కావాలి! ఆర్టీఐ పదేళ్ల ప్రస్థానంలో కార్యకర్తలపై జరిగిన హత్యలు ప్రమాద సంకేతం. ఓ పరిశీలన ప్రకారం, దేశవ్యాప్తంగా ఆర్టీఐ కార్యకర్తలపై 260కి పైగా దాడులు జరిగి 49 మంది హత్యకు గురయ్యారు. వేళ్లూనుకున్న పాలనా దాష్టీకాలకు, రాజకీయ-అధికార యంత్రాంగానికి, అక్రమార్కులకూ మధ్య చీకటి సంబంధాలకు ఇది ప్రతీక! చాలా సందర్భాల్లో... దరఖాస్తుదారు సమాచారం కోరిన సంగతి, అక్రమాలతో సంబంధమున్న అసాంఘికశక్తులకు పౌర సమాచార అధికారు (పీఐవో)లే చేరవేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ‘వ్యాపం’కేసులో, ఆర్టీఐ కార్యకర్త నిర్దిష్ట సమాచారం కోరినట్టు పీఐవో ద్వారా విషయం తెలుసుకున్న ఓ డాక్డర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. సతీష్శెట్టి హత్యకేసు విచారిస్తూ, ఆర్టీఐ కార్యకర్తలకు తగిన రక్షణ కల్పించా లని 2010లో ముంబై హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అంతకు ముందే, 2009లో ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒక ఉత్తర్వు ఇప్పించింది. సమాచారం కోరే ఆర్టీఐ కార్యకర్తలపై అధికారులుగానీ, వారి పనుపున అసాంఘికశక్తులుగానీ బెదిరిం పులు, భౌతికదాడులకు పాల్పడ్డపుడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సత్వరం స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలి. ఆ ఆదేశం ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది, అమలు మాత్రం అనుమానమే! ‘సమాజ వైతాళికుల రక్షణ చట్టం’ (డబ్లూబీపీఏ)కు పట్టిన గ్రహణం వీడటం లేదు. సమాజ హితం కోరి ఆర్టీఐనో మరో ప్రగతిశీల చట్టాన్నో వాడే కార్య కర్తల రక్షణ కోసం విజిల్ బ్లోయర్స్ యాక్ట్‌ను ప్రతిపాదించారు. 2011లో అప్పటి యూపీయే ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. 2014 మే 9న అది ఆర్డినెన్స్ రూపంలో వచ్చింది. అటుపై అధికారంలోకొచ్చిన ఎన్డీయే ప్రభు త్వం దాన్ని కనీసం నోటిఫై చేయకుండా ఉంచింది. సవరణలతో నీరుగార్చి బలహీనంగా తెచ్చే యోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. నీరుగార్చే వైఖరివల్లే అనర్థాలు ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచీ దాన్ని నీరుగార్చే యత్నాలు సాగు తున్నాయి.. చట్టం పుట్టి ఏడాది గడవకముందే, 2006లో ఫైళ్లలో రహస్యాల్ని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించేందుకు జరిగిన యత్నాన్ని పౌరసమాజం తిప్పికొట్టింది. మధ్యలో చాలా కుతంత్రాలు జరిగాయి. పర్యవేక్షణ విభాగ మంటూ, సిబ్బంది-శిక్షణ (డీవోపీటీ) మంత్రిత్వశాఖ పేరిట చట్టం స్ఫూర్తిని కాపాడాల్సింది పోయి గండికొట్టిన సందర్భాలెన్నో! ఒక కేసులో సీఐసీ ఉత్త ర్వుల్ని ధ్రువపరుస్తూ, ‘మీరు సమాచారం ఇవ్వాల్సిందే’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వంచించేలా రాజకీయ పక్షాల్ని పరిధి నుంచి తప్పించే చట్ట సవరణ యత్నాలు సాగుతున్నాయిపుడు. అంతకన్నా ప్రమాదకరంగా, మంత్రివర్గ సమావేశ పత్రాలు, ఆర్థికవ్యవహార పత్రాలు వంటి కీలక సమా చారాన్ని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించే ముసాయిదా ప్రతిపాదనలు వేచి ఉన్నాయి. అర్థంపర్థంలేని దరఖాస్తుల (ఫ్రీవోలస్)ని ముద్రవేసి వినతులకు పురిట్లోనే సంధి కొట్టడానికి, కార్యకర్తల్ని భయపెట్టడానికి ఇంకో యత్నం సాగుతోంది. ఇలా అసంబద్ధ దరఖాస్తులు చేసిన వారిపై 30 వేల రూపాయల వరకు జరిమానా, 3 మాసా లకు తగ్గకుండా జైలు శిక్ష విధించాలని ప్రతిపాదిస్తున్నారు. పౌరసమాజం మరింత చైతన్యవంతమై ఆర్టీఐని కాపాడుకోవాల్సిన అవసరాన్ని పదేళ్ల చరిత్ర నొక్కిచెబుతోంది. పాలనలో పారదర్శకత పెంచి వ్యవస్థను జవాబుదారుగా నిలిపే క్రమంలో.. సమాచార సాధన చేయాల్సిందే, ఆర్టీఐ చట్టాన్ని ఉపకరణంగా వాడాల్సిందే! దిలీప్ రెడ్డి ( వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్). dileepreddy@sakshi.com -
గతి తప్పిన గ్రామ స్వరాజ్యం
సమకాలీనం ‘స్మార్ట్ విలేజ్’, ‘గ్రామజ్యోతి’ పేరిట ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు గ్రామోద్ధరణకు దిగాయి. వాటి లక్ష్యాలు, ఆశయాలు అద్భుతం. ప్రచారంలోని ఆసక్తి అమలులో కూడా కనిపిస్తే వచ్చే ఫలితాల కోసం తెలుగు ప్రజ ఎదురుచూస్తోంది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు కేంద్రం నిధుల్ని పంచాయతీలకే ఇస్తానంటోంది. కాబట్టే రెండు ప్రభుత్వాలు గ్రామోద్ధరణ రాగమెత్తుకున్నాయా? లేక చిత్తశుద్ధితోనా? అమలులో తేలాల్సిందే. ప్రచారానికి, ఆచరణకి మధ్య అంతరాన్ని పూడ్చటానికి ప్రజలు పూనుకుంటేనే పల్లెలకు పూర్వ వైభవం. ఈ వాక్యం రాయడం పూర్తిచేసినంత సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఎని మిది మంది గ్రామీణులు నగరాలకు వలస వెళుతున్నారు. ఇది ఏ రోజు కారోజు పెరుగుతోందే తప్ప తగ్గటంలేదు. మన వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది మరీ ఎక్కువ. అందుకే గ్రామాలు నిస్తేజంగా, జీవకళ లేక దైన్యం గా కనిపిస్తున్నాయి. మెజారిటీ గ్రామాలు వన్నె తగ్గి వెలవెల బోతున్నాయి. ‘‘పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, తల్లి బందీ అయిపోయిం దో...’’ అన్న గోరటి వెంకన్న పాట కంట తడి పెట్టించి పుష్కర కాలం దాటిం ది. లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి చూపిన చేతి వృత్తులు తెలుగునాట చేష్టలుడిగిపోయాయి. కోలుకునే యత్నంలో పల్లెలు పడిలేస్తూ, సాము గరిడీలు చేస్తున్నాయి. అయినా అక్కడే పడున్నాయి. గంగలో కలిసిన గ్రామ స్వరాజ్యాన్ని ఒడ్డుకు చేర్చాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు గ్రామాలను బాగు చేయడానికి ప్రత్యేక కార్యక్రమాల్ని చేపట్టాయి. పాత ‘జన్మ భూమి’కి మెరుగులద్ది ‘స్మార్ట్ విలేజ్’ పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామోద్ధ రణకు బయలుదేరితే, చీకట్లు ముసిరిన పల్లెల్లో ‘గ్రామజ్యోతి’ వెలిగించడానికి తెలంగాణ ప్రభుత్వం కాగడా పట్టింది. రెండు కార్యక్రమాల లక్ష్యాలు, ఆశ యాలు అద్భుతం. పథకాల వెల్లడిలో, ప్రచారంలో కనిపిస్తున్న ఆసక్తి అమ లులో ప్రతిబింబిస్తే కలిగే ఫలితాల కోసం దాదాపు 22 వేల గ్రామ పంచాయ తీల ప్రజలు నిరీక్షిస్తున్నారు. పట్టణవాసుల్లోని అత్యధికుల మూలాలు గ్రామా ల్లోనే ఉన్నాయి లేదా ఒకప్పుడు ఉండేవి! అదే వారిని సైతం పల్లెల వైపు చూసేలా చేస్తోంది. రెండు రాష్ట్రాల సర్కార్లు, కేంద్రమూ నిబద్ధతతో గ్రామీణా భివృద్ధికి ప్రాధాన్యతనిస్తే... సగర్వంగా స్వస్థలాలకు తిరిగి వెళ్లే (రివర్స్ మైగ్రే షన్) మంచి రోజులొస్తాయనే ఆశలు వారిలో బలంగా ఉన్నాయి. చిత్తశుద్ధా! చెత్తబుద్ధా? దేశ స్వరూప స్వభావాలెరిగిన వాడు కనుకే, భావి భారతం పల్లెల్లోనే ఉందని, గ్రామ స్వరాజ్యమే అంతిమ లక్ష్యమని బాపూజీ చెప్పారు. కానీ, రాజ్యాంగం లోని ఆదేశికసూత్రాలు, పంచవర్ష ప్రణాళికలు, గరీబీ హఠావో నినాదాల వల్ల ఆశించిన ఫలితాలు కలుగక గ్రామాలు ఆర్థిక స్వావలంబన సాధించక సమ స్యలతో కునారిల్లుతున్నాయి. గాంధీజీ తర్వాత భూదానోద్యమ సారథి ఆచా ర్య వినోభాబావే గ్రామీణ భారతంపై కొంత శ్రద్ధ చూపారు. గ్రామస్తుల సం ఘటిత, స్వయంకృషితో అన్నా హజారే రాలేగావ్ సిద్ధిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్ది కొత్త ఆశలు రేపారు. అక్కడక్కడ ఒక రాజేందర్‌సింగ్, ఓ అరుణ రాయ్ లాంటి వాళ్లు రాజస్థాన్ గ్రామాల వికాసానికి తోడ్పాటును అందిం చారు. కేరళ వంటి రాష్ట్రాల్లో స్థానిక చైతన్యం, వరుసగా ప్రభుత్వాలు ప్రాధా న్యతనివ్వడం వంటి కారణాలవల్ల స్థానిక సంస్థలు బలోపేతమై గ్రామం కొం త నిబ్బరంగా ఉంది. రాజ్యాంగంలోని అధికరణం 243 ‘బి’ ప్రకారం గ్రామ పంచాయతీ రాజ్యాంగ సంస్థే అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూవచ్చాయి. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమిం చిన 29 అధికారాల్ని బదిలీచేయని రాష్ట్ర ప్రభుత్వాల దుర్బుద్ధివల్ల గ్రామీణుల కలలు కల్లలే అయ్యాయి. స్వయం నిర్ణయం, నిధుల్లో తమ వాటా కోసం కేం ద్రంతో దెబ్బలాడే రాష్ట్ర ప్రభుత్వాలు... స్థానిక సంస్థలకి నిధులు, అధికారాల బదిలీకి ససేమిరా ఒప్పుకోవు. పదిరోజుల కింద ‘గ్రామజ్యోతి’ని ప్రారం భిస్తూ తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు గంగదేవిపల్లె గ్రామ వికాసమే తననిక్కడికి రప్పించిందన్నారు. ఒక గంగదేవిపల్లి (వరంగల్), ఓ ముల్క నూరు (కరీంనగర్), అంకాపూర్ (నిజామాబాద్), వెలివెన్ను (పశ్చిమగోదా వరి)... ఐదో పేరుకు తడుముకోవాలి. అవి నాలుగు కూడా గ్రామస్తుల ఐక్య తతో, సహకార స్ఫూర్తితో ఎదిగినవే తప్ప ప్రభుత్వాలు చేసిందేమీ లేదు. ఏడు దశాబ్దాల స్వతంత్ర చరిత్రలో తెలుగునేలపై పట్టుమని పది గ్రామాలైనా చెప్పుకోదగ్గ స్థితిలో లేవు. ఈ ప్రభుత్వాలకు చిత్తశుద్ధే ఉండుంటే వందల, వేల గంగదేవి పల్లెలు ఈ పాటికి కనబడాల్సింది. పథకాలు ప్రభుత్వ ప్రచారానికి, పాలకపక్షాల ఓట్ల వేటకే పనికొచ్చాయి. వివిధ పథకాలపై వెచ్చించే కోట్ల రూపాయల ప్రజాధనం ఉన్నత స్థాయిలో పాలకపక్షానికి మార్జిన్లిచ్చే కాంట్రా క్టర్ల బొక్కసాలను నింపేందుకు, దిగువ స్థాయిలో పార్టీ కార్యకర్తలను మేపేం దుకు కాకూడదు. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల తదుపరి కేంద్రం మొత్తం నిధులను నేరుగా గ్రామ పంచాయతీలకే ఇస్తానంది. కాబట్టే రెండు ప్రభు త్వాలు గ్రామాలంటూ కొత్త రాగమెత్తుకున్నాయా? నిజంగానే చిత్తశుద్ధి తోనా? అన్నది అమలును బట్టి తేలుతుంది. చీకట్లు తొలగించేందుకే గ్రామ జ్యోతి ఈ కార్యక్రమం కింద వచ్చే నాలుగేళ్లలో రూ.25 వేల కోట్లు ఖర్చు చేయనున్నా రు. గ్రామాభివృద్ధి ప్రణాళికలను పంచాయతీ స్థాయిలోనే రూపొందించడం, గ్రామాల సంపూర్ణ అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములుగా చేయడమే గ్రామజ్యోతి ప్రధాన ఆశయమని సర్కారు చెబుతోంది. గ్రామాల సాధికార తకు ఏడు కీలక రంగాలలో అభివృద్ధి నిలకడగా జరగాలని ప్రభుత్వం భావి స్తోంది. తాగునీరు-పారిశుద్ధ్యం, ఆరోగ్యం-పౌష్టికాహారం, విద్య, మౌలిక సదుపాయాలు, సహజ వనరుల నిర్వహణ, సామాజిక భద్రత-పేదరికాన్ని తగ్గించడం, వ్యవసాయం ప్రధానాంశాలు. సమగ్రాభివృద్ధికి అవసరమైన ప్రణాళికా రూపకల్పనలో గ్రామ స్వయం సహాయక గ్రూపులు, శ్రమశక్తి సం ఘాలు, యువజన సమూహాలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, రిటై ర్డు ఉద్యోగులు, వివిధ రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తులను భాగస్వాము లను చేయాలని గ్రామజ్యోతి మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రతి అంశానికీ ఒక కార్యనిర్వాహక కమిటీని వేసి నిరంతరం పర్యవేక్షణ చేసేలా చూడటం ఈ కార్యక్రమం ప్రత్యేకత. సర్పంచ్, ఉపసర్పంచ్, మహిళా సభ్యురాలు, ఎస్సీ- ఎస్టీ మహిళా సభ్యురాలు ఈ కమిటీలకు నేతృత్వం వహిస్తారు. మండల/ గ్రామ పంచాయతీ స్థాయి అధికారి కన్వీనర్‌గా ఉండే ఈ క మిటీలో ఒకరు, అంతకుమించి వార్డు సభ్యులు, ఎస్‌హెచ్‌జీ గ్రూపు లీడరు, కుల సంఘం, గ్రామ పంచాయతీ పరిధిలో పనిచేసే ఎన్జీవో ప్రతినిధి సభ్యులుగా ఉంటా రు. గ్రామంలోని ప్రతి అభివృద్ధి కార్యక్రమం సకాలంలో పూర్తయ్యేలా ఈ కమిటీలు పర ్యవేక్షిస్తాయి. ప్రణాళికల రూపకల్పనకు ఆయా రంగాల సమగ్ర సమాచారాన్ని సేకరించి, ప్రస్తుత పరిస్థితిని సమీక్షించాలి. గ్రామంలో ప్రతిచో టికి నడిచివెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి విశ్లేషణలు చేయాలి. నిర్ణయాలు తీసుకోవడంలో అంతా భాగస్వాములయ్యే పద్ధతులను పాటించాలి. సమష్టి అవసరా లను అంచనా వేయాలి. అలా రూపొందిన ప్రణాళిక గ్రామసభ ఆమోదం పొందాలి. పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లా కలెక్టర్ దాకా పాలనాధికారు లను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు(జీఓ ఎంఎస్ నం:63, 64) జారీ చేసింది. కేంద్ర నిధులపై పరోక్ష పెత్తనానికై రాష్ట్ర ప్రభుత్వం ఎత్తుగడ వేసిందే తప్ప, గ్రామజ్యోతిలో కొత్తదనమేమీ లేదని, పైగా స్థానికసంస్థల స్వేచ్ఛకు ప్రతిబంధకమని విపక్షాల విమర్శ. నోడల్ అధికారుల రూపంలో అధికార వ్యవస్థ పెత్తనం చలాయించే ఎత్తుగడ అని అవి అంటున్నాయి. గ్రామసభ చెరువు మరమ్మతు చేయాలంటే దాన్ని మిషన్ కాకతీయలో చేపడతామని, రక్షిత నీటి ట్యాంక్ కడతామంటే వాటర్ గ్రిడ్‌లో ఇస్తామని ప్రభుత్వం వారి ఆర్థికస్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని విమర్శ. ఆకర్షణీయ గ్రామానికై జన్మభూమికి కొత్త రంగు సూక్ష్మస్థాయి గ్రామ ప్రణాళికా రచనతోపాటు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్య క్రమాల లబ్ధిదారుల ఎంపిక, సమన్వయం వంటి పనుల్ని పర్యవేక్షిస్తూ గ్రామాభివృద్ధి లక్ష్యంతో ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమాన్ని ఏపీ ప్రభు త్వం రచించింది. ఇక్కడో మతలబుంది. 2014 సెప్టెంబర్‌లో ఆ మేరకు (జీఓ ఎంఎస్ నం:22) ఆదేశాలిచ్చిన ప్రభుత్వం.. కమిటీల కూర్పులో స్వయం సహాయక బృందాలు, సామాజిక కార్యకర్తల పేరిట పార్టీ కార్యకర్తలు, సాను భూతిపరులకు దొడ్డిదారిన స్థానం కల్పించే ఎత్తుగడ వేసింది. పెన్షన్ అర్హు లతోపాటు వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపికలో వీళ్లదే కీలకపాత్ర. గ్రామ స్థాయి ప్రణాళిక, ప్రాథమ్యాల నిర్ణయంలో ప్రజాప్రతినిధులకన్నా అధికారు లకే ప్రాధాన్యముండేలా ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం కొత్త ఆదేశాలిచ్చిం ది. ‘స్మార్ట్ విలేజ్’ దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. అంటే కార్పొరేట్ అధిపతులు, ఉన్నతాధికారులు, ఇతర వితరణశీలురు గ్రామాన్ని దత్తత తీసు కుంటారు. అమల్లో ఉన్న అధికారిక కార్యక్రమాలతో వారి ఆలోచనల్ని మేళ వించి ప్రజల జీవనవిధానంలో మార్పు తీసుకొచ్చేలా కార్యాచరణ నిర్వహి స్తారు. అన్ని పంచాయతీల్లో ఏకరీతి అభివృద్ధి పేరిట కేంద్రమిచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంటోందనేది విమర్శ. తెలంగాణ ‘హరితహారం’ లాగే ఏపీలో ‘చెట్టు-నీరు’ పథకం చేపట్టినా నిధుల దుర్విని యోగమేతప్ప చెట్టూలేదు, నీరూలేదని విమర్శ. అటు శాశ్వత ఆస్తులు నిర్మిం చకుండా, ఇటు నిరుపేదలకు ఉపాధి కల్పించకుండా ప్రొక్లెయినర్లతో పనులు చేయిస్తూ, ఉపాధి హామీ పథకం నిధుల్ని ఇతరేతరాలకు దారి మళ్లిస్తున్నారు. ప్రజలు పూనుకోవాల్సిందే! రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వయంగా పౌరులు పూనుకుంటే తప్ప గ్రామాలు బాగుపడే ఛాయలు పొడచూపట్లేదు. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేప ట్టినా వాటి ప్రచారానికి, ఆచరణకి మధ్య అంతరాలు తగ్గించడంలో ప్రజల పాత్ర, ప్రమేయం ఉంటేనే పల్లెలు పూర్వవైభవాన్ని సంతరించుకుంటాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మూలాధారమైన వ్యవసాయానికి దన్నుగా నిలవ డం, విద్య-ఆరోగ్యం-పారిశుధ్యంపట్ల శ్రద్ధ, అన్నింటికీమించి ఆర్థిక స్వావ లంభన ముఖ్యం. ఇదివరకటిలా జిల్లా, మండల, గ్రామస్థాయిల్లో వేర్వేరు నిష్పత్తుల్లో నిధులివ్వడంగాక 14వ ఆర్థిక సంఘం నేరుగా గ్రామ పంచాయ తీలకే ఇవ్వాలని ప్రతిపాదించింది. దాన్ని కేంద్రం ఆమోదించింది. ఏపీలో 12,918 గ్రామ పంచాయతీల్లోని 3.50 కోట్ల గ్రామీణ జనాభా బాగోగుల కోసం వచ్చే ఐదేళ్లలో రూ.8,500 కోట్ల నిధుల్ని నేరుగా ఇవ్వనుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని 2.27 కోట్ల గ్రామీణుల ప్రయోజనాల కోసం 8,685 గ్రామ పంచాయతీలకు రూ.5,376 కోట్లను విడుదల చేస్తుంది. ఇవన్నీ సద్వి నియోగమై తెలుగు పల్లెలు వెలగాల్సి ఉంది. వ్యవసాయాన్ని ఆదుకోవాలి. చదువుల కోసం పిల్లలు, వారి తల్లిదండ్రులూ, బతుకుదెరువు కోసం యువ త, నడివయస్కులు ఊరొదిలి వెళితే... వయసుడిగిన వారితో ఉసూరుమం టున్న గ్రామాలకు కొత్తగా ఊపిరులూదాలి. గ్రామ స్వరాజ్యం సిద్ధించాలి. దిలీప్ రెడ్డి సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com. -
భయం నిర్భయం నడుమ...?
ఎన్ని చర్యలు తీసుకున్నా, సంప్రదాయ నియంత్రణా పద్ధతులేవీ ఫలితాలివ్వనప్పుడు, మహిళల పట్ల పురుషల ఆలోచనా ధోరణిలోనే మార్పు తేవడం మంచిదే కదా! ఆ మార్పు తేవాలంటే ముందు ఇప్పుడున్న ఆలోచనా ధోరణి ఏంటో తెలియాలి కదా? నికృష్టుడి నీచపు వ్యాఖ్యలు మినహాయిస్తే ఈ డాక్యుమెంటరీలో ఉన్నదదే. ‘దేశంలోని దయనీయ పరిస్థితులకు ఇది అద్దం పట్టింది. మన పాలకులు ఆ ప్రతిబింబాన్ని ఇంటా బయటా ఎవరూ చూడకుండా అద్దాన్ని పగులగొట్టడమో, ముసుగుకప్పడమో చేస్తున్నారు’ అన్న ఓ కార్యకర్త వ్యాఖ్య అక్షర సత్యం. ‘తలనొప్పి వచ్చిందీ!’ అనంటే, ‘తల తీసేస్తే పోలా?’ అన్నది మన పాల కుల వైఖరి. వారు అనుసరించే పద్ధతి కూడా అదే అనడానికి ‘భారతపుత్రి’ (ఇండియాస్ డాటర్) డాక్యుమెంటరీని కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిషేధించిన తీరే నిదర్శనం. ఇది ఈ రోజు కొత్తగా వచ్చిన జబ్బేమీ కాదు. సత్యజిత్ రే వంటి ప్రపంచస్థాయి దర్శకుడు ‘పథేర్ పాంచాలి’ అనే ఓ దృశ్య కావ్యాన్ని ఆవిష్కరిస్తే, భారత పేదరికాన్ని బయటి ప్రపంచానికి ఎత్తి చూపు తున్నాడని బలమైన ఓ వర్గం విమర్శించిన నాటి నుంచీ ఈ ఒరవడి కొనసా గుతున్నదే! దేశభక్తి, సంస్కృతి, మత భావనలు, ఇతర భావోద్రేకాంశాలు వివాదాస్పదం కావడం ఇక్కడ మామూలే! వివాద సందర్భాల్లో భావ వ్యక్తీక రణ స్వేచ్ఛపై ఇటువంటి అధికారిక నిషేధాలు ఈ దేశంలో తరచూ జరుగుతు న్నవే! కానీ, ఆ ధోరణి ప్రమాదకర పరిణామాలకు దారితీస్తున్నపుడు, భవిష్యత్ ప్రయోజనాలకు భంగకరమైన సంకేతాలిస్తున్నపుడు అంతా అప్ర మత్తం కావాల్సిందే! అత్యాచారాల సంస్కృతి, బాధితుల్నే తూలనాడే వైఖరి, దర్యాప్తుల్ని నీరుగార్చి నేరప్రవృత్తిగల వారిలో ధీమా పెంచే దుస్థితికన్నా కూడా... ఈ విషయాలు బయటి ప్రపంచానికి తెలియడమే పెద్ద ఘోరమ న్నట్టు ప్రభుత్వం స్పందించిన తీరు అభ్యంతరకరం. అరచేయి అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేనట్టే ఈ డాక్యుమెంటరీ పరివ్యాప్తిని కూడా నిషేధం నియంత్రించలేకపోతోంది. బీబీసీ ఇప్పటికే దీన్ని ప్రసారం చేసింది. యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైంది. బీబీసీకి నోటీ సిచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాల ప్రసారాల్ని అదుపుచేసే చర్యల్ని ప్రారంభించింది. రెండేళ్ల కింద, 2012 డిసెంబర్లో ఢిల్లీలో జరిగిన నిర్భయ పాశవిక అత్యాచారం, హత్య కేసు పూర్వాపరాలు కథావస్తువుగా లెస్లీ ఉద్విన్ దాదాపు గంట నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ తీశారు. నిర్భయ కేసులో శిక్షపడిన దోషుల్లో ఒకరైన ముఖేష్‌సింగ్ ఇంటర్వ్యూ కూడా అందులో ఉంది. బాధితురాలిపైన, మొత్తం మహిళలపైన అతడు ఆ ఇంటర్వ్యూలో విపరీత వ్యాఖ్యలు చేశాడు. దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున, అం తకుముందు ఒక భారత టెలివిజన్ సంస్థతో కలిసి ప్రసారం చేస్తామని బీబీసీ ప్రకటించింది. దీంతో అందులో ఏముందోనని పత్రికల్లో కథనాలు రావడం, ఆ వెంటనే పార్లమెంట్లో దుమారం, ప్రసారాలపై నిషేధం.. అన్నీ చకచకా సాగిపోయాయి. నిజంగానే అదంత అభ్యంతరకరమా? అని కొందరు, ప్రజా స్వామ్యంలో ఒక డాక్యుమెంటరీపై నిషేధమా? అని ఇంకొందరు, ఒక దోషిని ఇంటర్వ్యూ చేయడమేమిటి, అతనలా నిస్సిగ్గుగా అమానవీయ వ్యాఖ్యలు చేయడమేమిటనే ఆగ్రహంతో మరికొందరు... కారణమేదైతేనేం చాలా మం దే డాక్యుమెంటరీని చూస్తున్నారు. చూడాలి కూడానని విజ్ఞుల అభిప్రాయం. అవునూ... చూస్తే తప్పేంటి? ఈ వివాదంపై ప్రస్తుతం మూడు రకాల ఆలోచనా ధోరణులు సాగుతు న్నాయి. నిషేధం తప్పు, డాక్యుమెంటరీని అంతా చూడాలన్నది ఒక అభిప్రా యమైతే, ఇది దురుద్దేశ్యంతో, తప్పుడు భావనల వ్యాప్తి కోసం రూపొందిం చిన డాక్యుమెంటరీ కనుక నిషేధమే సబబన్నది మరో అభిప్రాయం. మూడో అభిప్రాయమూ ఉంది. న్యాయ ప్రక్రియ కొనసాగుతుండగా శిక్షపడిన ఖైదీగా ఉన్న దోషి అభిప్రాయాల్ని, వ్యాఖ్యల్ని జోడించిన డాక్యుమెంటరీని ప్రసారం చేయడం సముచితం కాదన్నది ఈ భావన. అనైతిక పద్ధతుల్లో ముఖేష్ ఇంటర్వ్యూ సంపాదించడం, చట్ట విరుద్ధంగా తిహార్ జైలు అధికారులు ఆ అవకాశం కల్పించడం, ఇలాంటి అత్యాచారాలు అంతటా జరుగుతున్నపుడు ఒక దేశం, ఒక వర్గం, ఒక కేసునే ప్రాతిపదిక చేసి కథనం నడపడం... వంటి అంశాలపైనా వీరికి అభ్యంతరాలున్నాయి. అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం (ఏఐపీడబ్ల్యూఏ) కార్యదర్శి కవితా కృష్ణన్ లాంటి వారు ఈ భావన లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రసారాల్ని వాయిదా వేయాలని స్థానిక మీడియా సంస్థల్ని కోరిన వీరు, తదుపరి చర్యల కోసం సమాలోచనలు జరు పుతున్నారు. పాలక-విపక్షాలతో సహా కొన్ని రాజకీయపక్షాలు, మత, సామా జిక, సేవా సంఘాలు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు డాక్యుమెంటరీపై తీవ్ర ఆగ్ర హంతో ఉన్నాయి. ఎలా జరిగిందో తేల్చాలని అంతర్గత దర్యాప్తునకు ఆదే శించి, ప్రసారాలు పరివ్యాప్తం కాకుండా కట్టడి చేసే చర్యలు చేపట్టారు. వారికి రకరకాల అభ్యంతరాలున్నప్పటికీ, నిషేధానికి ప్రధానమైనదిగా చూపుతున్న కారణాలు మాత్రం రెండు. ఒకటి పాశవిక అత్యాచార నేరానికి పాల్పడ్డ దోషిని ఇంటర్వ్యూ చేసి, అమానుషమైన అతని వ్యాఖ్యల్ని ప్రచారంలోకి తేవడం. అత్యాచారాలకు, ఇతర హింసకు గురవుతున్న మహిళలపైనే కాక మొత్తంగా మహిళలపైనే దాడిగా దీన్ని వారు అభివర్ణిస్తున్నారు. రెండోది, పాశవిక అత్యాచారాలు, ఇతర నేరాలు ఒక్క మన దేశంలోనే జరుగుతున్నట్టు, ఇవికాక ఇక్కడ ఇంకేమీ లేనట్టు బయటి ప్రపంచంలో భారత్‌ను అప్రదిష్ట పాల్జేయాలని పనిగట్టుకొని తీసిన డాక్యుమెంటరీ ఇది అన్నది వారి ప్రధాన ఆరోపణ. ఇదే వారి తీవ్ర ఆగ్రహానికి కారణం. చర్చ జరగడమే ఆరోగ్యకరం ప్రాధాన్యతగల అంశాల్ని మామూలుగా, అతి మామూలు విషయాల్ని అత్యం త ప్రాధాన్యతగల అంశాలుగా మన పాలకులు తిరగేసి చూస్తున్నారని ఎక్కు వగా వినిపిస్తున్న విమర్శ. తాజా ఉదంతంలో వారి వ్యవహారశైలే అందుకు తార్కాణం. మహిళలపై దాడులు, హింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు వంటి వాటిని నియంత్రించడంపై పెట్టాల్సిన శ్రద్ధాసక్తులను, వాటి వ్యతిరేక ప్రచారాన్ని నియంత్రించడంపై చూపుతున్నారు. నికృష్టుడు ముఖేష్ నీచపు వ్యాఖ్యలను మినహాయిస్తే ఈ డాక్యుమెంటరీలో ఉన్నదదే. ‘దేశంలోని దయనీయ పరిస్థితులకు ఇది అద్దం పట్టింది. ‘దేశంలో నెలకొన్న దయనీయ పరిస్థితుల్ని ఇది అద్దం పట్టి చూపింది. మన పాలకులు ఆ ప్రతిబింబాన్ని ఇంటా బయటా ఎవరూ చూడకుండా అద్దాన్ని పగులగొట్టడమో, ముసుగు కప్పడమో చేస్తున్నారు’ అన్న ఓ సామాజిక కార్యకర్త వ్యాఖ్య అక్షర సత్యం. నిర్భయ ఉదంతం తర్వాత ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున ఉద్యమాలు లేచాయి. సమాజం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తక్కువ సమయంలో ఇం తటి వ్యవస్థీకృత ఉద్యమాన్ని మున్నెప్పుడూ చూడలేదు. ‘ఇంత ఘోరమా!’ అని లోకమంతా ఒక్క గొంతై అరిచింది. ప్రభుత్వాలు స్పందించాయి. దర్యా ప్తును ముమ్మరం చేసి, ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పరచి, విచారణను వేగిరపరిచి నిందితుల్ని దోషులుగా నిర్ధారించి మరణదండన విధించారు. కానీ, ఇదే వేగం, నిక్కచ్చితనం ఇతరత్రా వందలు, వేల అత్యాచార కేసుల్లో జరగటం లేదు. ఇది కేవలం భద్రతా చర్యలు, పోలీసు దర్యాప్తులు, న్యాయ విచార ణలు, చట్టాల్లో పొందుపరచిన శిక్షలు తదితర అంశాలకు మాత్రమే సంబం ధించినది కాదని తేటతెల్లమైంది. ఇంకేదో జరగాలి, అప్పుడే ఈ నేరాలు అదు పులో కొస్తాయని స్పష్టమైంది. బలంగా పాతుకుపోయిన ఈ పురుషాధిక్య వ్యవస్థలో ఆలోచనా ధోరణి మారాలనే అభిప్రాయం బలపడుతూవచ్చింది. ఇందుకవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని వివిధ ప్రజాసంఘాలు, అధ్య యన నివేదికలు స్పష్టంచేస్తున్న తరుణంలో... ఒక ప్రశ్న ఉదయిస్తోంది. ఎన్ని చర్యలు తీసుకున్నా భద్రత, దర్యాప్తు, విచారణ, శిక్షలు వంటి సంప్రదాయ నియంత్రణా పద్ధతులు ఫలితాలివ్వనప్పుడు, మహిళలపట్ల పురుషల ఆలో చనా ధోరణిలోనే మార్పుతేవడం మంచిదే కదా! ఆ మార్పు తేవాలంటే ముం దు ఇప్పుడున్న ఆలోచనా ధోరణి ఏంటో తెలియాలి కదా? ‘భారత పుత్రి’ డాక్యుమెంటరీలో ఉన్నదదే. మహిళలపట్ల స్థాయీ భేదాలు లేకుండా ఉన్న ధోరణి ఏంటో అద్దం పట్టింది. దోషితోనే కాకుండా దోషుల తల్లిదండ్రులతో, బాధితురాలి తల్లిదండ్రులతో, రిటైర్డు న్యాయమూర్తితో, న్యాయవాదులతో, సామాజిక కార్యకర్తలతో, బాధితురాలి మిత్రుడితో... ఇలా వివిధ వర్గాల వారితో మాట్లాడించి రూపొందించిన ఆ డాక్యుమెంటరీ వాస్తవ పరిస్థితిని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. అది ఖచ్చితంగా ఓ ఆరోగ్యకరమైన చర్చకు దారితీస్తుంది. మహిళలపట్ల పురుషుల ఆలోచనాధోరణి ఎలా ఉంటుందో చెబుతుంది. ఎలా ఉండాలనే వైపు చర్చను రేకెత్తిస్తుందని, ఇది ఆహ్వానిం చదగ్గ పరిణామమేనని పరిశీలకుల అభిప్రాయం. మాట్లాడకుండా ఎవరినాపగలిగామని? నిర్భయ కేసు దోషుల చర్యల్ని, వారి అమానుష ఆలోచనా ధోరణిని, అను చిత వ్యాఖ్యల్ని ఎవరూ సమర్థించరు. పైగా అసహ్యించుకుంటారు. అవిద్య, అజ్ఞానం, మురికివాడల్లో పెరిగిన నేపథ్యం కలిగిన ముఖేష్ వ్యాఖ్యలు దారుణం, అభ్యంతరకరం. అయితే, ఆయన తరపు న్యాయవాది వ్యక్తీకరణ, భావజాలం, మహిళలపట్ల అతని ఆలోచనా ధోరణి ముఖేష్ మాటలకన్నా నీచంగా ఉండటం గమనార్హం. మహిళలపై అత్యాచారాలు జరగొద్దంటే, వారెలా ఉండాలి, ఎలా బట్టలేసుకోవాలి, ఎప్పుడెప్పుడు-ఎక్కడెక్కడికి- ఎవరితో వెళ్లాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి...అని చెప్పే పెద్ద మనుషుల జాబితా చాంతాడంత. ఒక న్యాయవాది, ఒక సాధుమహరాజ్, ఓ స్వచ్ఛంద సేవా సంస్థ అధిపతి, ఒక మంత్రి, ఓ పార్టీ అధినేత, ఒక ఎమ్పీ, ఒక డీజీపీ... ఇలా పెద్ద పెద్ద హోదాలున్న మహానుభావులు మహిళల పట్ల వ్యక్తం చేసిన చిల్లర అభిప్రాయాలు ముఖేష్ మాటల కన్నా తక్కువ నీచమైనవేం కావు. వాటిని నిషేధించవద్దా? నిషేధించామా? నిషేధించగలమా? వాటిని నిషేధిం చలేనపుడు, అవి యథేచ్ఛగా షికార్లు చేస్తున్నప్పుడు, అవి ఏ నష్టమూ కలగ జేస్తలేవనుకున్నప్పుడు, ముఖేష్ ముతక మాటలే తీరని నష్టం కలిగిస్తాయ నడంలో అర్థమేముంది? డాక్యుమెంటరీపై నిషేధం సాధించగల ప్రయోజన మేముంటుంది? ముఖేష్ వ్యాఖ్యలనైనా తొలగించి డాక్యుమెంటరీని ప్రసారం చేయనిస్తే బాగుండేది. పురుషుల ఆలోచనా ధోరణి మారేలా భావజాల వ్యాప్తి జరగాలి. మహిళలపై ధాష్టీకాలకు వ్యతిరేకంగా ఇంకా చాలా ప్రజా ఉద్యమాలు రావాలి. పాలకులు వారి మాట వినాలి, వారితో చర్చించాలి. మహిళలపై జరుగుతున్న ధాష్టీకాలకు వ్యక్తుల్ని, కుటుంబాల్ని, సమాజాల్ని, ప్రభుత్వాల్ని, న్యాయస్థానాల్ని అందర్నీ బాధ్యుల్ని చేస్తూ, జవాబుదారుగా నిలపాలి. స్త్రీ, పురుషుల మధ్య హెచ్చు తగ్గులు లేవు, ఆకాశంలో కాదు, నేల మీద సగం నువ్వు, సగం నేను కావాలి. ఆర్. దిలీప్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
ఈ ఆనందం అందరికీ పంచుదాం
రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరు స్తోంది. పదో పీఆర్సీ సిఫారసుల అమలు కోసం పలు పోరాటాలు చేసిన తర్వాత, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అందిన ఆనందమిది. ప్రభుత్వ ఖజానాపై పడే ఈ భారాన్ని భర్తీ చేయడం కోసం వారి కుటుంబాలే కాక, ఇంకా రెండు కోట్ల కుటుంబాలు పన్నుల భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఆ బరువును మోస్తూ ప్రభుత్వ కార్యాలయాలకు చేరే సామాన్యుల పనులను బాధ్యతతో, సంతోషంగా చేయడానికి కొత్త జీతాలు ప్రేరణ కాగలవని ఆశిద్దాం. బతుకుపోరు నిత్య సంఘర్షణలో మునిగి ఉండేవారు బాధైనైనా, సంతోషా న్నయినా తమకు తాము అనుభవించాల్సిందే తప్ప ఇతరులతో పంచుకునే తీరిక, తెగువ వారికి ఉండవు. కానీ, ఇతరులతో పంచుకుంటే బాధ తగ్గుతుం దని, సంతోషం రెట్టింపవుతుందనీ పెద్దల మాట. కొందరి బాధల్ని, మరి కొందరి సంతోషాల్ని చర్చకు పెట్టడం ద్వారా అటు బాధను తగ్గించి, ఇటు సంతోషాన్ని పెంచాలనే ఈ చిరు ప్రయత్నం. సందర్భం... రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వోద్యోగులు, పెన్షనర్ల కుటుంబాల్లో వెల్లివిరుస్తున్న సంతోషం. మారుతున్న కాలమాన పరిస్థితులు, పెరిగిన జీవన వ్యయం, చట్టబద్ధంగా పెరగాల్సిన జీతభత్యాల లెక్కల ఆధారంగా వేతన సవరణ సంఘం (పీఆర్సీ) చేసిన సిఫారసుల అమలుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించిన ఫలితమది. పదో పీఆర్సీ సిఫారసుల అమలు కోసం పలు ఉద్యమాలు, పోరా టాలు చేసిన తర్వాత, ఉద్యోగులు, వారి కుటుంబాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎట్టకేలకు అంది వచ్చిన ఆనందమది. ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు, పెన్షనర్లకు మధ్యంతర ఉపశ మనంతో కలుపుకొని మూలవేతనాలు దాదాపు రెట్టింపవుతున్నాయి. ఇది అందరికీ సంతోషదాయకమే. ఎవరికీ ఈర్ష్యాసూయలు లేవు. ఏ అభ్యంత రాలూ లేవు. కాకపోతే, తెలంగాణ శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, టీఎన్జీవో నేత దేవీప్రసాద్, ఏపీ ఉద్యోగుల సంఘ నాయకుడు అశోక్‌బాబు సహా చాలా మంది భావిసు ్తన్నట్టు... ఉద్యోగస్తులు ఇంకా బాగా పనిచేయాలి. సామాన్యపౌరుల అవస రాల్ని దృష్టిలో పెట్టుకొని తమ సేవల్ని విస్తరించాలి. సామాజిక సృహతో మరింత బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో విధు లను నిర్వహించాలి. ఉద్యోగస్తుల జీత, భత్యాలను చెల్లించే ప్రభుత్వ ఖజా నాకు పన్నుల రూపంలో పైసా పైసా జమచేస్తున్నది తెలుగు ప్రజలే. వారిలో సుమారు రెండు కోట్ల కుటుంబాలకు ఆ ఖజానాలు నేరుగా ఎలాంటి ఉపాధి భద్రతను కల్పించడం లేదు. నిజాయితీగా, ఆత్మపరిశీలనతో సేవలందించి వారి రుణం తీర్చు కోవాలి. అప్పుడే అందరి సంతోషం ద్విగుణీకృతం అవుతుంది. ఎవరు ఎవరికి భారం-భాగ్యం! 2011 జనాభా లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల జనాభా దాదాపు తొమ్మిది కోట్లు. అంటే సుమారు 2.10 కోట్ల కుటుంబాలు. వాటిలో ప్రభుత్వో ద్యోగుల కుటుంబాలు 8.5 లక్షలు. ప్రభుత్వోద్యోగులతోపాటూ, 5.5 లక్షల మంది పెన్షనర్ల పెన్షన్ కూడా పెరుగుతుంది. మరో 6 నుంచి 7 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వోద్యోగు లకు అమలు చేసే కనీస వేతనాన్ని వారికి కూడా అమలు చేయాలని పీఆర్సీ సూచించింది. కాబట్టి వారి జీతాలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అంటే, ఈ పెంపుదల వర్తించే కుటుంబాల మొత్తం సంఖ్య సుమారు 20 లక్షలు. ఇవి పోను దాదాపు 2 కోట్ల కుటుంబాలు వ్యవస్థీకృతంగా ప్రభుత్వం నుంచి జీత భత్యాలు పొందనివి. వారిలో ప్రైవేటు ఉద్యోగులు, రైతులు, రైతు కూలీలు, వృత్తి పనుల వారు, వివిధ సేవా కార్మికులు, రోజు కూలీ చేసుకునే అసం ఘటిత రంగ కుటుంబాలూ ఉంటాయి. జీతాల పెరుగుదలకు సంతోషిస్తున్న ఉద్యోగుల కుటుంబాలేకాక దాదాపు రెండు కోట్ల ఇతర కుటుంబాలు పీఆర్సీ వల్ల పడే అధిక పన్నుల భారాన్ని మోయాల్సి ఉంటుంది. మాడు పగిలే పన్నుల మోతను తట్టుకుని, బతుకు బండి లాక్కుంటూ బక్కచిక్కిన సామా న్యుడు ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చి అడిగిన పనిని బాధ్యతగానే గాక సంతోషంగా చేయడానికి కొత్త జీతాలు ప్రేరణ కాగలవని ఆశించడంలో తప్పులేదు. మన ఖజానా శేష, విశేష భాగాలివీ రెండు తెలుగు ప్రభుత్వాలు లక్ష కోట్ల రూపాయలకు తగ్గని వార్షిక బడ్జెట్లను రూపొందిస్తున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, పన్నేతర ఆదాయ వనరులు, అప్పుల ద్వారా ఈ బడ్జెట్లకు వనరుల్ని సమీకరిస్తారు. ప్రణాళికా పద్దుల కన్నా, ప్రణాళికేతర పద్దులకే పెద్ద పీట లభిస్తుంది. ఉదాహరణకు, గత ఏడా ది ఏపీ ప్రభుత్వం రూ. 26,673 కోట్లు ప్రణాళికా వ్యయంగా, రూ.85,151 కోట్లు ప్రణాళికేతర పద్దుగా చూపింది (మొత్తం వ్యయం రూ 1,11,823 కోట్లు). ప్రణాళికేతర వ్యయంలో దాదాపు మూడో వంతు (రూ. 30 వేల కోట్లు) ఉద్యోగుల జీతాలకు వెచ్చిస్తున్నారు. పీఆర్సీ అదనపు భారం తోడవు తుంది. ఇక భత్యాలు, ఇతర నిర్వహణ వ్యయాలు, ఉద్యోగులకిచ్చే పరోక్ష ప్రయోజనాలు, రాయితీలు వేరే! తెలంగాణ బడ్జెట్లో రూ 48,648 కోట్లు ప్రణాళికా పద్దుల కింద, రూ 51,989 కోట్లు ప్రణాళికేతర పద్దుల కింద (మొత్తం రూ 1,00,637 కోట్లు) చూపించారు. ప్రణాళికేతర వ్యయంలో మూడో వంతుకుపైగా (రూ.18,437 కోట్లు) ఉద్యోగుల జీతాలు. పీఆర్సీ పెరుగుదల అదనం. ఉద్యోగుల జీవన ప్రమాణాలు పెరగాల్సిందే. కానీ, వ్యవస్థీకృత ఉద్యోగ-ఉపాధి చట్రంలోకి రాని నిరుద్యోగులు, అల్పాదాయ, బడుగు, బలహీన వర్గాల పరిస్థితేంటి? వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేరే దెలా? నిర్దాక్షిణ్యంగా వాటిని అణచివేస్తే, రాజకీయ, ఉద్యోగ, కార్పొరేట్ శక్తులు మాటల గారడీతో తొక్కిపెడితే.... ఎగదన్నే లావాలా విరుచుకు పడతాయి, నిన్నటి ఢిల్లీవాలాలా రాజకీయ సునామీలను సృష్టిస్తాయి. జీతాలు పెరిగితే అవినీతి తగ్గుతుందా? చేతినిండా జీతాలుంటే అవినీతికి పాల్పడరనే ఆలోచనా స్రవంతి ఒకటుంది. నిజంగా అలా జరుగుతుందా? అంటే, కచ్చితంగా అవునని చెప్పలేం. కానీ తగ్గే ఆస్కారమైతే ఉంది. అది వ్యక్తుల నిజాయితీ, ప్రవృత్తి, ఆలోచనా సరళిని బట్టి ఉంటుంది. ప్రజా ఖజానా నుంచి జీతభత్యాలు పొందుతున్నాం. ఇతరు లకు ఉన్నా, లేకున్నా మన నెల జీతం మనకు ఠంచనుగా వస్తోంది. కాబట్టి వారి పట్ల మనం బాధ్యతతో, జవాబుదారీతనంతో వ్యవహరించాలన్న స్పృహ ఉద్యోగుల్లో ఉంటే అవినీతి కచ్చితంగా తగ్గుతుంది. నిజాయితీగా ఉండాలనిఎవరికి వారు వ్యక్తిగతంగా దీక్ష పూనితే తప్ప ఈ జాడ్యం పోదు. ‘నేను లంచాలు తీసుకోను, నిబంధనలకి విరుద్ధంగా వెళ్లను, పలుకుబడికి, సంపదల ప్రలోభాలకు లొంగి ప్రాథమ్యాలను మార్చను’ అనే సంకల్పానికి ప్రతి ఉద్యోగి కట్టుబడితే అవినీతి తొలగిపోతుంది. రాజకీయ నేతల, సంప న్నుల, పలుకుబడి గలవారల ఫైళ్లు కదిలినట్టే, పనులు జరిగినట్టే.... సామా న్యుల ఫైళ్లు కదిలితే, పనులు జరిగితే వ్యవస్థ దానంతట అదే బాగుపడు తుంది. అంతరాలు తగ్గుతాయి. ప్రభుత్వంలోని ఒక శాఖ ఉద్యోగులు జీవితంలోని పలు అవసరాలకు ఇతర శాఖలపై ఆధారపడాల్సి వస్తుంది. అక్కడ అమలు కావాలనుకునే నీతి, నిజాయితీ, సుపరిపాలన తన శాఖలో, తన సీటులో కూడా అమలుకావాలని ఎవరికి వారు కోరుకుంటే అది చాలు. అతీంద్రియ శక్తులు అవసరం లేదు రెండు రాష్ట్రాల్లోనూ పల్లెల నుంచి పట్టణాలకు వలసపోతున్న మధ్య తరగతి కుటుంబాల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఉపాధి వేట ఓ కారణమైతే, పిల్లల చదువుల కోసమే వెళ్తున్న కుటుంబాలు కోకొల్లలు. సర్కారు బడుల్లో నాణ్యమై న విద్య దొరకకపోవడమే దీనికి కారణం. కేజీ నుంచి పీజీ వరకు విద్య మీద రెండు రాష్ట్రాలు ఏటా దాదాపు రూ. 20 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని సర్కారు పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల సంఖ్య అధికారికంగా 97 లక్షలు. జూనియర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీలు, యూనివర్సిటీల్లో చదువుతున్న వారు మరో 50 లక్షలని అంచనా. ప్రభుత్వ స్కూళ్లలో ఒక్కో విద్యార్థి మీద ప్రభుత్వం ఏటా దాదాపు రూ. 10 వేలు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న పిల్లలకు నాలుగు అక్షరాలు నేర్పి ప్రయోజకులను చేసే బాధ్యతను 3.5 లక్షల మంది ఉపాధ్యాయులు తీసుకోవాలి. వైద్య వ్యవస్థ స్థితి కూడా తెలుగు నేలంతటా కడు దయనీయంగా ఉంది. ఏటా అయిదారు వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తు న్నా గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, పట్టణాలు, నగరాలు, చివరకు రాజధాను ల్లో కూడా పరిస్థితేమీ బాగోలేదు. ప్రజాసుపత్రులు మృత్యు కుహరాలుగా మారాయి. ప్రజారోగ్య వ్యవస్థలోనే కీలక మైన పీహెచ్‌సీల్లోనే సదుపాయాలు శూన్యం. అన్ని స్థాయిల వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తే తప్ప సగటు మనిషికి సాంత్వన చేకూరని స్థితి. ఇక సామాన్యుని రోజువారీ జీవితా న్ని శాసించే పంచాయతీరాజ్, రెవెన్యూ తదితర విభాగాల సిబ్బంది మరింత మానవీయకోణంలో పనిచేయాల్సిన అవసరం ఉంది. సిబ్బంది కొరత, సదు పాయాల లేమి వంటి వ్యవస్థాగత లోపాలకు తోడు సిబ్బంది అమానవీయ ప్రవర్తన వల్ల ప్రభుత్వాలపై పౌరులకు సదభిప్రాయం కొరవడుతోంది. జనజీవితంతో సజీవ సత్సంబంధాలలో ఉండాల్సిన శాంతిభద్రతల వ్యవస్థ ఇంకా బ్రిటిష్ కాలపు పద్ధతుల్లో, నిందితుల్ని, బాధితుల్ని ఒకే గాటనకట్టి చూసే దృష్టితో పనిచేస్తోంది. పోలీసు వ్యవస్థ భద్రతకు భరోసాగా పరివర్తిన చెందితే తప్ప పౌరుల మన్నన పొందలేదు. మునిసిపల్ సేవలు సక్రమంగా అందకుంటే పట్టణాలు, నగరాల్లో మనిషి జీవితం దుర్భరం. మౌలికంగా పాలనను నిర్దేశించేవి ప్రభుత్వ విధాన నిర్ణయాలు, రాజకీయ వ్యవస్థ పనితీరులే. అయితే తుది ఫలితాలు అధికార వ్యవస్థ పని తీరు, వ్యవహారశైలిని బట్టే ఉంటాయి. అన్ని స్థాయిల అధికారులు, సిబ్బంది ఈ సూక్ష్మాన్ని గ్రహించి మసలుకుంటేనే సగటు జీవికి న్యాయం జరిగేది. జాతిపిత గాంధీజీయే అందుకు తగు మార్గం సూచించారు. స్వాతంత్య్రానం తరం తాను ఎలాంటి ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించబోనని బాపూజీ స్పష్టం చేయడంతో... అనునిత్యం మహాత్ముని మార్గదర్శకత్వం తనకిక ఉండబోదనే ఊహే జవహర్లాల్ నెహ్రూకు మింగుడు పడలేదు. ‘‘బాపూ! నాకేదో భయం గా ఉంది, మీ మార్గదర్శకత్వం లేకుండా ఎలా నిర్ణయాలు తీసుకోవాలని ఆం దోళనగా ఉంది’’ అన్నారు. అప్పుడు గాంధీజీ బక్కచిక్కిన ఒక సామాన్యుడి ఫొటో ఒకటి తీసి నెహ్రూకిస్తూ, ‘‘ఇది నీ టేబుల్‌పై పెట్టుకో, విధాన నిర్ణయా లకు సంబంధించి సంతకం పెట్టాల్సి వచ్చిన ప్రతిసారీ ఈ ఫొటో వంక చూడు. తీసుకోబోయే నిర్ణయం ఈ సామాన్యుడికి ఏ మాత్రం ఉపయోగపడు తుందని భావించినా నిస్సంకోచంగా సంతకం చెయ్యి. లేదనిపిస్తే చెయ్యకు’’ అని చెప్పారు. ఆ మాట నెహ్రూని ఎంతగానో ప్రభావితం చేసింది. తెలుగు రాష్ట్రాల సగటు స్వరూపమైన సామాన్యులతో వ్యవహరించే శైలికి సంబం దించి ప్రతి ఉద్యోగికీ బాపూజీ మాటలు స్పూర్తి కావాలి. ఈమెయిల్: dileepreddy@sakshi.com -
అన్నం గిన్నే తొణికితే అరిష్టం
సమకాలీనం సంక్షోభానికి తట్టుకోలేక గడచిన ఆరు నెలల్లో రాష్ట్రంలో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది 90 పైనే అని మానవహక్కుల వేదిక చెబుతోంది. ‘‘ఆత్మహత్యలా? ఏవీ? ఎక్కడ? ఏ రాష్ట్రంలో?’’ అని తన ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ ముఖ్య మంత్రి వెటకారం చేశారు. అదే ధోరణిని సాక్షాత్తూ చట్టసభ వేదికపైనా కనబరిచారు. చేతనైతే, రుణ మాఫీ అమలుకానందునే ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితా ఇవ్వాలని విపక్షాన్ని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతు విధిలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దాని అర్థమేంటి? రుణమాఫీ జరగనందుకే అని విడిగా ఎలా నిరూపిస్తారు? ఈ భూమ్మీద తన ఉత్పత్తికి తాను ధర నిర్ణయించని వారెవరైనా ఉన్నారంటే ఒక్క రైతులే! భూమి, నీళ్లు, పనిముట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, విద్యుత్తు ఇలా... వ్యవసాయోత్పత్తుల కోసం వినియోగించే ప్రతి వస్తువుకు, సేవలకు ధరల్ని వాటి యజమానులో, ఉత్పత్తిదారులో నిర్ణయి స్తారు. కానీ, అన్ని పెట్టుబడులు పెట్టి, ఆరుగాలం శ్రమించి పండించిన మీదట, ప్రకృతి దయానుసారం తన చేతికి దక్కే పంటకు మాత్రం ధర వేరేవారు నిర్ణయిస్తారు. లాభానికీ నష్టానికీ సిద్ధపడి ఉత్పత్తిపై సర్వహక్కులు కలిగిన రైతు ధర నిర్ణయించడు. గిట్టుబాటు కాకపోయినా, అత్యధిక సందర్భాల్లో ఉత్పత్తి వ్యయం కన్నా తక్కువే లభించినా... అమ్ముకోక తప్పని దయనీయ స్థితి రైతుది. ఇంతటి దుర్మార్గమైన పరిస్థితి ప్రపంచంలో వేరెక్కడా ఉండదు. ఇంత తేలికైన ఆర్థిక సమీకరణాన్ని కూడా పాలకులు అర్థం చేసుకోవటం లేదు. ఎన్ని అధ్యయనాలు జరిపినా... గతితప్పిన ఈ ఆర్థిక సూత్రమే రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వంద లాది రైతు కుటుంబాలు ఈ రోజు ఇంటి పెద్దదిక్కును కోల్పోయి రోదిస్తు న్నాయి. ఆహారోత్పత్తిలో తలమునకలై బతుకు బండిలాగే రైతు, ప్రపంచానికి అన్నం పెట్టి తాను పస్తులుంటే, ఆత్మహత్య చేసుకుంటుంటే మిగతా ప్రపంచం ఇంత స్పందనా రహితంగా ఉండటమే ఆశ్చర్యకరం. ముఖ్యంగా ప్రభుత్వాల అలసత్వం, నిర్లక్ష్య ధోరణి క్షమించరానిది. తిండిగింజల ఉత్పత్తికి కారకుడిగా కాదు, కనీస పౌరులుగా కూడా గణించడం లేదు. ఆ వంకర చూపు కూడా ఎన్నికల ముందొకలా-వెనుకొకలా పూర్తి భిన్నంగా ఉంటోంది. ముందు ఓటు బ్యాంకులుగా పరిగణించి హామీలతో వారి ఓట్లు కొల్లగొట్టి, ఆపై అధికారం లోకి వచ్చాక మొండిచేయితో ఎదురు బుకాయింపులకు పాల్పడుతున్నాయి. నిన్నటికి నిన్న ముగిసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ విపరిణామానికి వేదికయినాయి. రుణమాఫీపై ఎంతో కొంత స్పష్టత వస్తుందని ఆశగా ఎదురు చూసిన రైతుకు ఒట్టి వేదనే మిగిలింది. బలవన్మరణాలకు గురైన రైతు కుటుంబాల ఆర్తి హారతి కర్పూరమైంది. వైఖరిలోనే లోపం రైతు పట్ల, వ్యవసాయం పట్ల రాష్ట్ర ప్రభుత్వాధినేత చంద్రబాబునాయుడి వైఖరిలోనే లోపముంది. ఇది చాలాసార్లు రుజువైంది. ఉచిత విద్యుత్తు విషయం లోనూ తడవకో మాట చెప్పిన వైనమే ఈ వైఖరి లోపానికి నిలువెత్తు నిదర్శనం. ఉచిత విద్యుత్తు సాధ్యం కాదని మొదట, ‘నేనూ ఇస్తానని చెప్పి ఉండాల్సింది, ఎన్నికల్లో గెలిచి ఉండేవాళ్లం, తప్పయిపోయింది’ అని మరోమారు, ‘ప్రస్తుత విద్యుత్ సంక్షోభానికి ఉచిత విద్యుత్తే కారణం-అందుకే నేను మొదట్నుంచీ చెబుతున్నాను, ఇవ్వడం సరికాద’ని ఇంకోమారు.. ఇలా తడవకో మాట చెప్పారు. ఇప్పుడు రుణమాఫీ విషయంలోనూ అదే జరుగుతోంది. ముందు వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు. తర్వాత పంట రుణాలు మాత్రమే నన్నారు. అందులోనూ రకరకాల ఆంక్షలు, షరతులు వర్తింపజేసి లబ్ధిని- లబ్ధిదారుల్ని కుదిస్తున్నారు. ఆయన హామీని అమలు చేస్తారని నమ్మిన రైతులి ప్పుడు కుమిలిపోతున్నారు. షరతులు పెట్టి మాటమార్చడంతో రుణమాఫీ కాస్తా హామీ మాఫీగా మారిన దుస్థితి. సంక్షోభానికి తట్టుకోలేక గడచిన ఆరు నెలల్లో రాష్ట్రంలో 86 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది 90 పైనే అని మానవహక్కుల వేదిక చెబుతోంది. ‘‘ఆత్మహత్యలా? ఏవీ? ఎక్కడ? ఏ రాష్ట్రంలో?’’ అని తన ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ ముఖ్య మంత్రి వెటకారం చేశారు. అదే ధోరణిని సాక్షాత్తూ చట్టసభ వేదికపైనా కనబరి చారు. చేతనైతే, రుణ మాఫీ అమలుకానందునే ఆత్మహత్య చేసుకున్న రైతుల జాబితా ఇవ్వాలని విపక్షాన్ని డిమాండ్ చేశారు. కష్టాల్లో ఉన్న రైతు విధిలేక ఆత్మ హత్య చేసుకున్నాడు. దాని అర్థమేంటి? రుణమాఫీ జరగనందుకే అని విడిగా ఎలా నిరూపిస్తారు. ఫోరెన్సిక్ నివేదికే కాదు, ఇప్పుడు నష్టపరిహారం పొందడా నికి సమర్పించాల్సిన 13 పత్రాల్లో ఏదీ ఆ విషయాన్ని నిరూపించలేదేమో! ఇది, సమస్య పట్ల-సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న రైతు పట్ల పాలకుల బాధ్యతా రాహిత్యాన్ని, పలాయనవాదాన్నే వెల్లడి చేస్తోంది. అదే ముఖ్యమంత్రి రెండు రోజులాగి, ‘రైతు ఆత్మహత్యలు బాధాకరం, రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని గొంతు మార్చారు. ఇలా, అవసరాన్ని బట్టి మాట మార్చే పాలకుల అవకాశవాద ధోరణి రైతులకు శాపంగా మారి నైరాశ్యంలో వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతోంది. మిగిలిన రైతాంగానికి వ్యవసాయమంటేనే భయం కలిగిస్తోంది. దీన రైతుకిక దిక్కెవ్వరు? కన్నతల్లి దయ్యమైతే ఇంట్లో తొట్టెల కట్టే చోటెక్కడ? అన్న సామెత చందంగా మారింది రైతు పరిస్థితి. రాష్ట్రాధినేతే రైతు ఆత్మహత్యలు అంతగా లేవంటే, ఇక గోడు ఎవరికి చెప్పుకునేది. ఇదే ధోరణి అధికార వ్యవస్థకు కూడా అలవాటైపోతే, ఇక రైతు ఆత్మహత్యలన్నింటినీ ఇతరేతర కారణాల వల్ల జరిగిన సాధారణ ఆత్మహత్యలుగానే రికార్డులకెక్కిస్తారు. ‘...ఒక్క రైతులే ఏమిటి, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ప్రేమలో విఫలమైన యువత కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు...’ అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్య మంత్రి చెప్పిన పోలిక రాష్ట్రంలో చాలా మందికి జీర్ణం కాలేదు. ఇది రైతు సమస్య తీవ్రతను తక్కువ చేసి చూపేదిగానూ కనిపించింది. ఇప్పటికే, దుర్భర పరిస్థితుల్లో ఓ రైతు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం నుంచి నష్టపరిహారం పొందడానికి కుటుంబీకులు 13 పత్రాల్ని అధికారులకు సమర్పించి, సంతృప్తిప రచాల్సి వస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా, ఆత్మహత్యా యత్నం నేరం కాదంటూ, ఐపీసీ సెక్షన్ 309 ని తొలగిస్తూ చట్ట సవరణ తెచ్చాక ఇంకెన్ని ఇబ్బందులో! అసలు కేసులు సక్రమంగా రికార్డవుతాయా? అన్నది పెద్ద సందేహం. రైతు ఆత్మహత్యల విషయంలో పోలీసు రికార్డులకు, ప్రభుత్వ శాఖలు అంగీకరించే లెక్కలకు ఇప్పటికే పొంతన లేదు. 2010లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 2,525 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్టు జాతీయ పోలీసు నేర నమోదు విభాగం (పీసీఆర్బీ) చెబితే, 158 మంది మాత్రమే చనిపోయి నట్టు రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. రైతు ఆత్మహత్య చేసుకున్న ప్రతి కేసులోనూ ఎఫ్.ఐ.ఆర్, పంచనామా, పోస్టుమార్టమ్, ఫోరెన్సిక్, ఫైనల్ రిపోర్టు వంటి అయిదు పత్రాల్ని పోలీసుల నుంచి తేవాల్సివస్తోంది. ఇంకా ప్రయి వేటు-బ్యాంకు రుణపత్రాలు, పాస్‌బుక్, డిపెండెంట్ సర్టిఫికెట్, రేషన్‌కార్డు, మూడేళ్ల పహాణి, మండల స్థాయి, డివిజన్ స్థాయి పరిశీలన కమిటీ నివేదిక... ఇలా పలు పత్రాలు సమర్పించాల్సిన ప్రక్రియ సంక్లిష్టతే ఈ వ్యత్యాసానికి కారణమౌతోంది. ఏ ఒక్క పత్రం సరిగాలేక సదరు అధికారుల్ని సంతృప్తిపరచ లేకపోయినా అది రైతు ఆత్మహత్య కాదు. బాధ్యత వహిస్తేనే బతుకులు నిలిచేది సమస్య మూలాల్లోకి వెళ్లకుండా పెమైరుగులతో పబ్బం గడపాలనుకునే ప్రభు త్వాల వైఖరి మారాలి. అప్పుడు గాని రైతు స్థితిలో మార్పు రాదు. సమస్య శాశ్వ త పరిష్కారం కన్నా తక్షణ విరుగుడు చర్యలపై దృష్టి పెట్టే పాలకుల దాటవేత ధోరణే తాజా దుస్థితికి కారణం. పాతికేళ్ల కింద ఆదిలాబాద్ జిల్లాలో సర్‌సిల్క్ ఫ్యాక్టరీ లాకౌట్తో మూతపడింది. నెలల తరబడి జీతాలు లేని కార్మికులు ఒక్క సారిగా రొడ్డునపడ్డారు. ఏదోరకంగా ఆదుకుంటామన్న ప్రభుత్వం ఆపై ముఖం చాటేసింది. ‘అన్ని మార్గాల్లో యత్నించా. ఎక్కడా డబ్బు పుట్టలేదు. బతుకు దుర్భరంగా ఉంది. వెంటనే కొంతైనా జీతం బకాయి ఇప్పించండి, లేకుంటే ఫలానా 21వ తేదీన ఫ్యాక్టరీ గేటుముందున్న వేపచెట్టుకు నేను, నా భార్య, ఇద్ద రు పిల్లలం ఉరేసుకొని చనిపోతాం’ అని విలేకరులను పిలిచి మొరపెట్టుకు న్నాడో కార్మికుడు. ఏ ప్రభుత్వ ప్రతినిధీ చొరవ తీసుకొని ఊరడించలేదు! అను నయించే యత్నం చేయలేదు. కానీ, సరిగ్గా 20వ తేదీ రాత్రి నుంచి మాత్రం సదరు వేపచెట్టు చుట్టూ 8 మంది పోలీసులతో కాపలా పెట్టారు. ఆ రోజు కాదు గానీ, కొన్ని రోజుల వ్యవధిలో తన స్వగ్రామపు పొలిమేరల్లో చెట్టుకు ఉరేసుకొని ఆ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది మన ప్రభుత్వాల పద్ధతి. ఈ వైఖరి పోవాలి. జాతీయ నమూనా సర్వే (ఎన్నెస్సెస్వో) నివేదిక, అప్పులు-పెట్టుబ డుల సర్వే (ఎ.ఐ.డి.ఐ.ఎస్) నివేదిక, జయతీఘోష్ కమిషన్ నివేదిక, ఆత్మహ త్యలపై అధ్యయనపు ప్రత్యేక (ఆశా) నివేదిక... ఇలా ఎన్ని నివేదికలైనా, చెప్పిం దొకటే! రైతు సంక్షోభంలో కూరుకుపోతున్నాడు. ప్రభుత్వాలు పట్టించుకోవ డంలేదు. పెట్టుబడి వ్యయం తగ్గేలా చూడాలి. వ్యవస్థీకృత రుణాలు పెంచాలి. రుణాల ఊబిలోంచి రైతును గట్టెక్కించాలి. మార్కెటింగ్ సదుపాయం కల్పిం చాలి. మంచి మద్దతు ధర ప్రకటించాలి. అదైనా దక్కేలాచూడాలి. స్వామినాథన్ లాంటి విశ్వసనీయత కలిగిన పెద్దమనిషి చిత్తశుద్ధితో ఎప్పుడో ఇచ్చిన నివేదిక కూడా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే, 2004 జూన్‌లో ఆయన ప్రభుత్వం ఒక ఉత్తర్వు (జి.వో.నం:421) ఇచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి లక్ష రూపాయల నష్టపరిహారం, యాభై వేల రూపాయల వరకు రుణం తీర్చడం, పిల్లల్ని సాంఘిక సంక్షేమ బడుల్లో, వసతి గృహాల్లో చేర్చడం, ఇళ్లు ఇప్పించడం, వివిధ పథకాల కింద ఆర్థిక సహాయం, పెన్షన్ ఇప్పించడం వంటివి అందులో ఉన్నాయి. వాటన్నింటికీ మించి ఇంకొకటి కూడా ఉంది. ‘‘దయనీయ స్థితిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది, తిండిపెట్టే పోషకుడిని పోగొట్టు కుంటున్న ఆయా కుటుంబాల దుఃఖం మాత్రమే కాదు, తన రైతును కోల్పో యిన రాష్ట్ర దుఃఖం కూడా...’ అన్న మాట సదరు ఉత్తర్వులో ఉంది. పాలకులకు ఆ మానవతా హృదయం ఇప్పుడు కావాలి. ఈమెయిల్: dileepreddy@sakshi.com