మద్యరక్కసి పీచమణచాలి | Drinking Affects Your Health | Sakshi
Sakshi News home page

మద్యరక్కసి పీచమణచాలి

Published Thu, Dec 17 2015 11:46 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM

Drinking Affects Your Health

సమకాలీనం
తాగడం మంచిది కాదు, జీవన ప్రమాణాల్ని, కడకు జీవితాల్నే హరిస్తుందన్న ప్రచార యత్నాలుండవు, పరివర్తన కలిగి మానేయాలనుకునే వారికి మద్దతిచ్చే డీ-అడిక్షన్ సెంటర్లుండవు. మద్యనిషేధం విధిస్తే పెద్ద మొత్తంలో రాబడికి గండి పడుతుంది, ఇక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలెలా చేపట్టాలి? అనే వాదననూ పాలకులు ముందుకు తెస్తారు. ఎవరి బతుకుల్ని, జీవితాల్ని పణంగా పెట్టి ఆ డబ్బుల్తో ఇంకెవరి అభివృద్ధి-సంక్షేమాల్ని సాధిస్తారు?  
 
‘వితంతు పెన్షన్లు ఇవ్వడానికి జనగణనకు గ్రామాలకు వెళ్లినపుడు యుక్త వయసు, మధ్య వయస్కులైన ఎందరో వితంతువులు కనిపించేవారు. పిల్లలున్న ఆ తల్లులు తాగుడువల్లే తమ భర్తలు చనిపోయారనీ, ఇల్లు గడ వటం కష్టంగా ఉందనీ చెప్పేవారు. ఎలాగైనా పెన్షన్ వచ్చేలా చూడమని కాళ్లా వేళ్లా పడి రోదిస్తుంటే కళ్లు చెమర్చేవి’ అని సాక్షాత్తూ ఓ మండలాధికారి చెప్పారు. మెదక్ జిల్లా, కుల్చారం మండలం, ఎనగండ్ల... మా స్వగ్రామంలో అంబేద్కర్‌ను స్మరిస్తూ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో నేను పాల్గొన్నపుడు ఆయనీ మాటలు చెప్పారు. గ్రామాల్లో మెజారిటీ వితంతువులది ఇదే నేపథ్యం! రోజూ తప్పతాగి, మత్తులో రోడ్డు ప్రమాదాలకు గురై, తాగి నిర్మానుష్య ప్రాంతంలో పడిపోయి తాగునీరందక డీహైడ్రేషన్‌కు గురై, మద్యం ఖర్చులకు అప్పులు చేసి-తీర్చలేక ఆత్మహత్యలు చేసుకొని.. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్యం వల్ల పెద్ద సంఖ్యలోనే చనిపోతున్నారు. ఇది చనిపో తున్న వారి కథ. ఇక జీవచ్ఛవాలుగా ఉన్న వారిది ఇంకా ఎక్కువ సంఖ్యే!
మన సమాఖ్య పాలనా వ్యవస్థలో ఓ రాష్ట్రంలో సంపూర్ణ మధ్య నిషేధం అమలు సాధ్యం కాదు అనేది వాస్తవమే. కానీ సమాజం మేలు కోసం మద్యంపై నిషేధం విధించాల్సిన అవసరం అంతకన్నా వాస్తవం. ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో మద్యం అందుబాటులో ఉండటం వల్ల కొన్ని రాష్ట్రాల్లో విధించిన మద్య నిషేధం విఫలమైందన్నది నిజం. అయితే, జనహితానికే ఆయా రాష్ట్రాల్లో సదరు నిర్ణయం తీసుకున్నారన్నది అంతకన్నా నిజం. నిషేధం సరిగ్గా అమలు కాక ఇతరేతర సమస్యలు పుట్టుకొస్తున్నాయని చెప్పడానికి రుజువులున్నట్టే, ఈ అనుభవాలుండీ మరి కొన్ని రాష్ట్రాలు కొత్తగా నిషేధం నిర్ణయానికి వెళ్లాయంటేనే అవసరం ఎంత బలమైందో బోధపడు తోంది. మొదటి నిజాన్ని కప్పిపుచ్చి రెండో నిజాన్నే భుజాలకెత్తుకోవడం, నిషేధం సాధ్యపడదని ప్రచారం చేయడం అంత సమంజసం కాదు. సమా జాన్ని జాఢ్యంలా పట్టి పీడిస్తున్న మొదటి నిజంపై విస్తృతంగా చర్చ జరగాలి. అమలు విఫలమౌతోంది కనుక... ఒక దురలవాటును యథేచ్ఛగా అనుమ తించాలనడం, ప్రభుత్వమే పెంచి పోషించాలనడం, దాన్నే ఓ మంచి ఆదా యవనరుగా పాలకులు పరిగణించటం ఇప్పుడు జరుగుతున్న అనర్థం. ఫలి తంగా మద్యం లిఖించే మరణశాసనంతో లక్షల కుటుంబాలు చితికి పోతున్నాయి.

తలనొప్పి ఉందని తలనే తీసేస్తామా?
 మద్య నిషేధం అమలు సరిగా జరగదు, అంతటా విఫలమౌతోందంటూ కొందరు వ్యతిరేకిస్తుంటారు. అమలు సరిగ్గా జరగటం లేదని నిషేధాన్నే ఎత్తివేయడం ఓ విచిత్ర పరిస్థితి. ‘నిషేధం సరిగ్గా అమలు కావట్లేదు, మావో యిస్టులపై నిషేధం విధించినా వారి హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి...’ అని వారిపై నిషేధాన్ని ఎత్తివేస్తారా? అంటే, ఎత్తి వేయరు. తల నొప్పికి నివారణ మార్గాలు అన్వేషించాలి తప్ప, తల ఉండటం వల్లే తలనొప్పి వస్తోంది కనుక తలనే తీసేస్తే సరి అన్నది సరైన పంథా కాదు. ‘ఆంధ్రరాష్ట్ర (ఆంధ్రాప్రాంత) మద్యనిషేధ చట్టం 1937’ ప్రకారం బ్రిటిష్ ఏలుబడి నుంచి 1969 అక్టోబరు 30 వరకూ మద్య నిషేధం అమల్లో ఉంది. అప్పుడూ ఇటువంటి చర్చే జరిగి నిషేధాన్ని 1969 నవంబరు 1 నుంచి ఎత్తివేశారు. తర్వాతి కాలంలో మద్యం విభిన్న రూపాల్లో ప్రజల జీవితాల్ని శాసించింది. మద్యంతో పాటు సారాయిని ప్రభుత్వమే అధికారికంగా అమ్మించేది. ఊరూరా ప్రభుత్వ సారాయి దుకాణాలుండేవి. రాజకీయ నేతలు, వారి అండతో ప్రయివేటు వ్యక్తులు కాంట్రాక్టర్ అవతారాలెత్తి కోట్లకు పడగలెత్తారు. 1983లో ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ‘వారుణి వాహిని’ పేరుతో సారాయిని ప్యాకెట్లలో ప్రభుత్వ యంత్రాంగమే విక్రయించేది.

దశాబ్ద కాలంలో పరిస్థితులు విషమించి వ్యసనం సగటు జీవితాల్ని కల్లోలం చేస్తుంటే, 1992లో మొదలైన సారా వ్యతిరేకోద్యమం క్రమంగా మద్య వ్యతిరేకోద్యమ రూపు సంతరించుకుంది.  1993లో నెల్లూరు జిల్లాలో విధించిన సారా నిషేధాన్ని కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం తర్వాత రాష్ట్ర మంతటికీ విస్తరించింది. అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్యనిషేధం విధి స్తామనే హామీతో ఎన్నికల బరిలో దిగిన ఎన్టీరామారావు 1994లో గెలిచి 1995 జనవరి 16 నుంచి నిషేధం విధించారు. ఎన్టీయార్ ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా జరిగిన అధికార మార్పిడితో ముఖ్యమంత్రి అయిన చంద్ర బాబునాయుడి హయాంలో నిషేధం నీరుగారింది. సంపూర్ణ మద్యనిషేధాన్ని దశలవారీగా తూట్లుపొడిచి, చివరకు 1997 ఏప్రిల్ 1న ఎత్తివేశారు. గుజరాత్, నాగాలాండ్, మణిపూర్ ఇతర ఈశాన్య రాష్ట్రాలతో పాటు లక్షదీవుల్లో మద్య నిషేధం అమల్లో ఉంది. కేరళలో నియంత్రణ అమలవుతోంది. వచ్చే ఏడు సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు చేస్తామని బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రకటించారు. నిషేధ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. కర్ణాటక తదితర ప్రభుత్వాలు ఇదే యోచన చేస్తున్నాయి. భారత రాజ్యాంగం 47 వ అధికరణం ప్రకారం వైద్య ప్రయోజ నాలకు తప్ప ఆరోగ్యానికి హాని కలిగించే అన్ని రకాల మత్తు పానీయాలను నిషేధించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఇది కేవలం అధికారాలకు సంబంధించిన అంశం కాదు, అమలు-ఆచరణకు సంబంధించిందనే వాదనా రావచ్చు. నిజమే! సంక్షేమ రాజ్యమని చెప్పుకునే ప్రభుత్వాలకు సమాజ హితం, ప్రజల మంచిచెడులు, వారి జీవన ప్రమాణాలు... ఇవేవీ బాధ్యతలు కావా? రాష్ట్రాలు ఆదాయం దృష్టి కోణంలో చూస్తాయి. పైగా ఒక రాష్ట్రం నిషేధించి ఇరుగు-పొరుగు రాష్ట్రాలు నిషేధించకుంటే ఆ రాష్ట్రంలోకి అక్రమ మద్యం వరదై పారుతుంది. అందుకే ఏక మొత్తంగా కేంద్ర ప్రభుత్వమే సంపూర్ణ మద్య నిషేధం విధించాలనే డిమాండూ ఉంది.

 పాపపు సొమ్ముపై సర్కార్ కన్నేస్తే..... ‘నియంత్రణ’ ఉత్తి నినాదమే!
 సంపూర్ణ నిషేధం సాధ్యం కాదు, విచ్చలవిడిగా మద్యం దిగుమతి అయి అసాంఘిక శక్తులు పెట్రేగిపోతాయనేది ఒక వాదన. పొరుగునున్న తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం తెలుగు రాష్ట్రాల్లోకి ఏరులై పారుతుందంటారు. ఎంత పటిష్ట పోలీసు-ఎక్సైజ్ వ్యవస్థ ఉన్నా నియంత్రించలేం కాబట్టి నిషేధం వద్దంటారు. నియంత్రణ అమలు జరగాలని, దశలవారిగా సంపూర్ణ నిషేధం వైపు నడవాలనేది వారి ప్రతిపాదన. అంతవరకు బాగానే ఉంది. కానీ, అదే పనిగా సర్కారు అధిక రాబడి కోసం విక్రయ లక్ష్యాలు పెట్టి విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించడాన్ని ఏమనాలి? జీవన ప్రమాణాలు, ప్రజల ప్రాణాలు పణంగా పెట్టయినా సరే  ఏయేటికాయేడు రాబడి కోసం అర్రులు చాచే ప్రభుత్వాలు మద్యం తాగకుండా జనాన్ని చైతన్యపరుస్తాయనుకోవడం భ్రమ! ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడపడితే అక్కడ, ఎంతకు అంటే అంతకు (చీప్ లిక్కర్‌ను మేమే తయారు చేసి, అమ్ముతామన్న ప్రభుత్వం) తేలిగ్గా మద్యం దొరికేట్టు సర్కారు కృషి చేస్తే ఇక నియంత్రణ ఎక్కడ? రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడదే జరుగుతోంది.

ఉమ్మడి రాష్ట్రంలో మద్యం విక్రయాల విలువ రోజూ రూ.40 కోట్లుండేది. అనధికారికంగా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతయ్యేది, మిలటరీ క్యాంటీన్ల నుంచి వచ్చేది, కల్తీ మద్యం... కలిపి రోజుకు మరో 5 నుంచి 10 కోట్ల రూపాయలుండొచ్చని ఓ అంచనా! మద్యం అమ్మకాల ద్వారా  2005-06 నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఏటా 10-15 శాతం వరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ వచ్చింది. 2005-06లో రూ. 5367.92 కోట్లు ఉన్న ఆదాయం 2013-14 నాటికి రూ. 21,319 కి చేరింది. 2011-12 కు 2012-13కు మధ్య ఒక్కసారిగా రూ. 3,700 కోట్లు వృద్ధి చెందింది. 2013-14లో ముందు సంవత్సరం కన్నా రూ. 3,000 కోట్లు అదనపు ఆదాయం లభించింది. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014-15లో తెలంగాణలో రూ. 10,238 కోట్లు ఆదాయం , ఆంధ్రప్రదేశ్‌లో రూ. 11,010 కోట్లు వచ్చింది. ఇది 10 శాతం వృద్ధి. ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలిచ్చి, ఏపీలో ఇప్పుడు 85వేల బెల్టు షాపులు యథేచ్ఛగా సాగుతున్నా కిమ్మనని సర్కారు దోషి కాకుండా పోతుందా?

 పరివర్తన ప్రభుత్వ కర్తవ్యం
 తాగుడు అనర్థాలను సశాస్త్రీయంగా వివరించి వ్యసనం నుంచి వారిని మళ్లించడం ప్రభుత్వాల బాధ్యత. ఇది ఒక్క రోజులో అయ్యే పనికాదు. అలా అని చేతులు ముడుచుక్కూర్చోవడం పరిష్కారం కాదు. నిషేధమో- నియంత్రణో అమలు చేస్తూనే ఏకకాలంలో ప్రచారమూ చిత్తశుద్ధితో చేయాలి. ప్రపంచ అనుభవాలు అదే చెబుతున్నాయి. తాగుడు వ్యసనం బలపడి.. నేరాలు, అవి నీతి పెచ్చుమీరుతున్నాయని అమెరికాలో 1919 నుంచి 1933 వరకు సంపూర్ణ మద్యనిషేధాన్ని అమలు పరిచారు. పురాతన చైనా, ఫ్యూడల్ జపాన్ నుంచి నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, ఐస్‌లాండ్ వంటి దేశాల్లోనూ ఈ ప్రయోగాలు న్నాయి. అలా అని నిషేధం ఏ ఫలితమూ ఇవ్వలేదనడం మొండి వాదన. అభివృద్ధి చెందిన దేశాల్లో నిషేధకాలంలో చేసిన ప్రచారం తాగుడు వ్యసనాన్ని బాగా తగ్గించింది. ఆస్తిపరులు, సంపన్నులు, వైద్యులు సూచించిన వారు మాత్రమే మద్యం సేవించే వాతావరణం బలపడింది. శ్రమజీవులు, దిన కూలీలు, నిరుపేదలు అల్పాదాయవర్గాల వారు విచ్చలవిడిగా తాగి సంసా రాలు గుల్లచేసుకునే సంస్కృతి పోయింది.

ఈ చైతన్యం పెరిగిన దేశాల్లో మద్య సేవనం ఆస్తిపరుల సౌఖ్యంగా మిగిలిందే తప్ప పేదలు, అభాగ్యుల సంసారాల్ని కూల్చే జాఢ్యంగా మారలేదు. మన దగ్గర అది ఉంది, పోవాలి. తాగడం మంచిది కాదు, జీవన ప్రమాణాల్ని, కడకు జీవితాల్నే హరిస్తుందన్న ప్రచార యత్నాలుండవు, పరివర్తన కలిగి మానేయాలనుకునే వారికి మద్ద తిచ్చే డీ-అడిక్షన్ సెంటర్లుండవు. మద్యనిషేధం విధిస్తే పెద్ద మొత్తంలో రాబ డికి గండి పడుతుంది, ఇక అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలెలా చేపట్టాలి? అనే వాదననూ పాలకులు ముందుకు తెస్తారు. ఎవరి బతుకుల్ని, జీవితాల్ని పణంగా పెట్టి ఆ డబ్బుల్తో ఇంకెవరి అభివృద్ధి-సంక్షేమాల్ని సాధిస్తారు?  అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మనసుంటే మార్గముంటుంది. రాబడికి ప్రత్యా మ్నాయాలూ ఉంటాయి. అందుబాటును బట్టే అలవాట్లు వ్యసనాలుగా మారుతాయనేది విశ్వవ్యాప్తంగా ధ్రువపడ్డ అంశం. మరీ ముఖ్యంగా మద్యం విషయంలో ఇది సత్యం! మద్యం అందుబాటును తగ్గించిన చోట విని యోగం పూర్తిగా తగ్గిపోయిన దాఖలాలు చరిత్రలో కోకొల్లలు. ఏం చేస్తారో తెలియదు. తాగుడును మాన్పించే సంకల్పం, చిత్తశుద్ధి కావాలి. ఛిద్రమైన జీవితాల్లో చిరుదీపం వెలిగించాలి. తాగుడు మహమ్మారికి సంసారాలు, నిండు జీవితాలు బలి కాకుండా చూడాలి.
http://img.sakshi.net/images/cms/2015-07/61438290637_295x200.jpg

వ్యాసకర్త: దిలీప్‌రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement