మద్యమే దిక్కు !
- ఆదాయానికి అదే ఆధారం
- మద్యం షాపుల సంఖ్య పెంపు, కొత్త విధానంపై ఆర్థిక శాఖ ఆశలు
సాక్షి, హైదరాబాద్: నూతన మద్యం విధానం ఖజానాకు భారీగా ఆదాయం తెచ్చిపెడుతుందని ఆర్థిక శాఖ ఆశిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో రాష్ట్ర ఆదాయం ఆశించినంతగా మెరుగుపడలేదు. పన్నుల ద్వారా ఏప్రిల్, మే నెలల్లో రూ.7,740 కోట్ల ఆదాయం మాత్రమే సమకూరింది. వార్షిక బడ్జెట్ అంచనాల్లోంచి దాదాపు 15 శాతం ఆదాయ లక్ష్యం తగ్గిందని ఇటీవలే ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షలో ప్రస్తావించారు.
ఇక ఈ ఏడాది మద్యం ద్వారా రూ.12,227 కోట్లు రాబట్టుకోవాలని బడ్జెట్‌లో సర్కారు అంచనా వేసింది. అంటే నెలనెలా రూ.వెయ్యి కోట్లు రావాలి. కానీ తొలి రెండు నెలల్లో మద్యం అమ్మకాలతో కేవలం రూ.1,570 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే ఈ లోటును భర్తీచేసేలా కొత్త మద్యం విధానం ఉంటుందని ఆర్థికశాఖ ఆశిస్తోంది. మరోవైపు గుడుంబాను అరికట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వ సారా లేదా చౌక మద్యం విక్రయాలు చేపట్టే ప్రతిపాదనలను ఎక్సైజ్ విభాగం సిద్ధం చేసింది.
దాంతోపాటు మద్యం షాపుల సంఖ్యను పెంచాలని యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 16 వేల జనాభాకు ఒక మద్యం షాపు చొప్పున మొత్తంగా 2,016 మద్యం షాపులు ఉన్నాయి. వీటికి అదనంగా వెయ్యి వరకు మద్యం దుకాణాలను పెంచాలనేది సర్కారు యోచన. దీనివల్ల ఆదాయం మరింతగా పెరుగుతోందని ఆర్థిక శాఖ భావిస్తోంది.
భూముల విక్రయంపైనా దృష్టి..
మద్యం అమ్మకాలతో పాటు ప్రభుత్వ ఆస్తులు, భూముల అమ్మకం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ ఉద్దేశం బడ్జెట్‌లోనే తేటతెల్లమైంది. భూములు, ఆస్తుల అమ్మకం, క్రమబద్ధీకరణతో రూ.17,500 కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా రెవెన్యూ విభాగం భూముల అమ్మకాలకు సంబంధించి కసరత్తు ప్రారంభించింది.
ప్రభుత్వం తరఫున రక్షణ చర్యలు చేపట్టినా కాపాడుకోలేని, ఆక్రమణకు గురైన భూములను వేలంలో అమ్మితే భారీగా ఆదాయం సమకూరుతుందని భావిస్తోంది. సంబంధిత ప్రతిపాదనలను ఇటీవలే సీఎంకు పంపింది కూడా. దీనికి సీఎం ఆమోదం లభిస్తే.. భూముల వేలం మొదలయ్యే అవకాశం ఉంది.