పారదర్శకతకు పాతరేసే యావ | telugu states neglecting RTI commissioner recruitment | Sakshi
Sakshi News home page

పారదర్శకతకు పాతరేసే యావ

Published Fri, Nov 3 2017 12:39 AM | Last Updated on Fri, Nov 3 2017 12:48 AM

telugu states neglecting RTI commissioner recruitment - Sakshi

సమకాలీనం

పారదర్శకత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఈ హక్కుకు 2005లో చట్టబద్ధ రక్షణ కల్పించారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడున్నరేళ్లు తెలుగు ప్రభుత్వాలు ఈ అంశాన్నే పట్టించుకోలేదు. అంతకు ముందున్న కమిషన్‌ను విభజన చేయకుండా, విడివిడిగా కమిషన్లు ఏర్పరచుకోకుండా, ఒక్కో కమిషనర్‌ పదవీ విరమణ చేస్తుంటే సదరు ఖాళీని భర్తీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టున్న తీరే సర్కారు వైఖరిని స్పష్టం చేసింది. ఫలితం కమిషన్‌ సహజ మరణం.


పాలనలో పారదర్శకత ప్రశ్నార్థకమౌతోంది. ప్రజా సమాచారపు గుప్పిటి బిగుసుకుంటోంది. సమాచార హక్కు చట్టం వచ్చిన మొదటి అయిదారేళ్లలో కనిపించిన పాటి సానుకూలత కూడా ఇప్పుడు కరువౌతోంది. జనాల కోసం ఉద్దేశించిన ప్రభుత్వ ఉత్తర్వు(జీవో)లు సహితం రహస్య పత్రాలవుతున్నాయి. ముఖ్యమైన జీవోలు ‘కాన్ఫిడెన్షియల్‌’ ముసుగు కింద కనుమరుగవుతున్నాయి. వెలుగు చూడకుండానే కొన్ని ఉత్తర్వులు అమలవుతున్నాయి. సమాచారం చేరవేస్తున్నారని ఉద్యోగుల్ని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వాలు గోప్యత కోటగోడలు కడుతున్నాయి. సమాచారాన్ని బందీ చేస్తూ, వివిధ స్థాయి పాలనా యంత్రాంగానికి తప్పుడు సంకేతాలిస్తున్నాయి. విప్లవాత్మకమైందిగా చెప్పుకుంటున్న సమాచార హక్కు చట్టం అమలు చతికిలబడుతోంది. చడీచప్పుడు లేకుండా వెలగపండులో గుజ్జును ఏనుగు లాగేసినట్టు చట్టాల స్ఫూర్తిని సర్కార్లే మింగేస్తున్నాయి. అధికారుల్లో బాధ్యత–జవాబుదారితనం అడుగంటుతోంది. న్యాయస్థానాలపై ఒత్తిడిని తగ్గించి, సమాచారాన్ని ప్రజా క్షేత్రంలోకి సులభంగా, వెల్లువలా రానివ్వాలని ఈ చట్టం తీసుకువచ్చిన స్ఫూర్తి ఇప్పుడు భంగపడుతోంది. రాజకీయ పక్షాలు సమాచార హక్కు చట్టం పరిధిలోకే వస్తాయని కేంద్ర సమాచార కమిషన్‌ ఇచ్చిన ఆదేశాల్ని ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చినా పార్టీలు, ప్రభుత్వాలు కనీసం ఖాతరు చేయటం లేదు.

మొన్నటికి మొన్న కేరళ ప్రభుత్వం అడ్డగోలుగా నియమించిందని, అయిదుగురు సమాచార కమిషనర్ల నియామకాన్ని అక్కడి హైకోర్టు కొట్టివేసింది. అంతకు ముందు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సర్కారు జరిపిన నలుగురు కమిషనర్ల నియామకం చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు, దాదాపు పదవీకాలం ముగిసే ముందర వారిని ఇంటికి పంపింది. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టు చర్నాకోలా విదిలిస్తే తప్ప కమిషన్‌ ఏర్పాటు, కమిషనర్ల నియామకానికి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కాలు కదుపలేదు! రాజ్యాంగం సాక్షిగా, చట్టబద్ధంగా కొనసాగాల్సిన కమిషన్లే ఉనికిలో లేని శూన్యతను సర్కార్లే పనిగట్టుకొని çసృష్టిస్తున్నాయి. గడువు విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చిన తర్వాత కిందా మీద పడి తెలంగాణ ప్రభుత్వం కమిషన్‌ ఏర్పరచి, ముఖ్య సమాచార కమిషనర్‌ను, ఒక కమిషనర్‌ను నియమించింది. అది కూడా లేని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం హైకోర్టు వద్ద వాయిదాలు కోరుతూ ఇంకా మల్లగుల్లాలు పడుతోంది. ‘ప్రభుత్వాల వైఖరి చూస్తుంటే... ఇదొక తలనొప్పి చట్టం, ఇది లేకుంటే బాగుండు, ఉన్నా ఊపిరిలేనట్టు ఓ మూలన పడుంటే నయముండు అన్నట్టుంద’న్న ఓ క్రియాశీల కార్యకర్త వ్యాఖ్యలు అక్షర సత్యాలు. సర్కార్లే ఇలా ఉండటంతో కంచే చేను మేసినట్టు తయారైంది పరిస్థితి.

పెచ్చుమీరిన ఇష్టా‘రాజ్య’ధోరణి
కమిషన్ల ఏర్పాటు, కమిషనర్ల నియామకం తెలుగునాట మళ్లీ వివాదమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నియామకం జరిగిన తెలంగాణలో, సదరు ప్రక్రియ వివరాలు కోరుతూ పెట్టుకున్న తమ ఆర్టీఐ దరఖాస్తుకు ఏం సమాచారం ఇస్తారోనని పౌరసంఘాలు నిరీక్షిస్తున్నాయి. అవసరమైతే మళ్లీ న్యాయస్థానం తలుపు తట్టాలని యోచిస్తున్నాయి. కమిషన్‌ ఏర్పాటు ప్రక్రియ సరిగా జరగలేదని, ఎంపికలోనూ న్యాయస్థానం మార్గదర్శకాలు పాటించలేదని, కమిషన్‌ను పూర్తిస్థాయిలో నింపలేదని చాలా అభియోగాలున్నాయి. కోర్టు ఇచ్చిన గడువు మీరిపోయినా, అదనపు సమయం కోరి నోటిఫికేషన్‌ మాత్రమే విడుదల చేసిన ఏపీ సర్కారు కదలికల్నీ అక్కడి పౌర సంఘాలు గమనిస్తున్నాయి. పొడిగించిన తాజా గడువు ప్రకారం నవంబరు 20 లోపు కమిషనర్ల నియామకం జరపాలి. ‘కేంద్ర ప్రభుత్వం వర్సెస్‌ నమిత్‌ శర్మ’(2013) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, గత ఆగస్టు నెలలో తీర్పు వెలువరిస్తూ కేరళ హైకోర్టు నిర్దేశించిన అంశాల నేపధ్యంలో ఇక్కిడి తాజా పరిణామాల్ని పరిశీలిస్తున్నారు. పారదర్శకత పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఈ హక్కుకు 2005లో చట్టబద్ధ రక్షణ కల్పిం చారు. రాష్ట్ర విభజన తర్వాత దాదాపు మూడున్నరేళ్లు తెలుగు ప్రభుత్వాలు ఈ అంశాన్నే పట్టించుకోలేదు. అంతకు ముందున్న కమిషన్‌ను విభజన చేయకుండా, విడివిడిగా కమిషన్లు ఏర్పరచుకోకుండా, ఒక్కో కమిషనర్‌ పదవీ విరమణ చేస్తుంటే సదరు ఖాళీని భర్తీ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టున్న తీరే సర్కారు వైఖరిని స్పష్టం చేసింది. ఫలితం కమిషన్‌ సహజ మరణం. పౌరులు, ప్రజా సంఘాల ఫిర్యాదుతో కోర్టు జోక్యం చేసుకొని ఆరువారాల్లో కమిషన్‌ ఏర్పాటు, కమిషనర్ల నియామక ప్రక్రియ పూర్తి చేయాలన్న ఆదేశాల దరిమిలా కదలిక మొదలయింది. అయితే కమిషన్లే లేకుండా చూడటం, లేదంటే నియామకాలు జరుపకుండా ఖాళీలు కొనసాగించడం ప్రభుత్వాలకు రివాజయింది. కోర్టు ఆదేశాలుండి తప్పని పరిస్థితుల్లో నియామకాలు జరపాల్సి వస్తే, తమవారనుకున్న అధికార– రాజకీయ అనుచరులకు పునరావాసం కల్పిస్తున్నారు. చట్టం అమలును నీరుగార్చడానికి పారదర్శకతపట్ల ఆసక్తి, అర్హతలేని వారితో కమిషన్లను నింపేస్తున్నారు. చట్ట నిబంధనలు, రాజ్యాంగస్ఫూర్తి ప్రకారం ఇవన్నీ కూడా ఒకటిని మించిన తప్పిదం మరొకటి.

అసలెవరిని నియమించాలి?
చట్టం అమలులో కీలక పాత్ర పోషించే కమిషన్లలో ఎవరిని కమిషనర్లుగా నియమించాలి? అన్నదొక ప్రశ్న. విద్యార్హతలు నిర్దేశించనందున చూడ్డానికి ఇదొక చిక్కుముడిలా కనిపిస్తున్నా, చట్టం ఈ విషయంలో సుస్పష్టంగానే ఉంది. సమాచారం... ప్రజలకు అందాల్సిన అవసరాన్ని–ఇవ్వనవసరం లేని సహేతుకతను నిర్ణయించే న్యాయప్రక్రియ, చట్టం అమలు పర్యవేక్షణ, చట్టోల్లంఘనలకు శిక్షలు విధించడం అనే మూడు ప్రధాన బాధ్యతలు నిర్వహించే కమిషనర్లది ఏ రకంగా చూసినా ముఖ్య పాత్రే! అందుకు తగ్గ హోదా వారికి ఇచ్చారు. రాష్ట్ర అత్యున్నత ఉద్యోగి అయిన ప్రధాన కార్యదర్శి(సీఎస్‌)తో సమాన హోదా కమిషనర్లకు, కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమాన హోదాను ముఖ్య సమాచార కమిషనర్‌కు కల్పించారు. కేంద్ర సమాచార కమిషన్‌లోని వారికి ఇంతకన్నా ఒక్కో అంచె అధిక హోదాలున్నాయి. అందుకు తగ్గట్టుగా అర్హులైన వారినే ఎంపిక చేయాలని చట్టం చెబుతోంది. ప్రజా జీవితంలో ప్రముఖులై, ప్రకటించిన న్యాయ, శాస్త్ర–సాంకేతిక, సామాజిక సేవ, మేనేజ్‌మెంట్, జర్నలిజం, జన మాధ్యమాలు, పరిపాలనా రంగాల్లో విశేష పరిజ్ఞానం–విస్తృత అనుభవం కలిగి ఉండాలని చట్టం సెక్షన్‌ 12(5) (రాష్ట్ర కమిషన్లు), సెక్షన్‌ 15(5) (కేంద్ర కమిషన్‌)లలో స్పష్టంగా పేర్కొన్నారు. సమాచారం లభించక కమిషన్‌ వరకు వచ్చే వేర్వేరు రంగాలకు చెందిన అంశాల్ని పరిశీలించాల్సి వచ్చినపుడు ఆయా పరిజ్ఞానం–అనుభవం కలిగిన కమిషనర్లు ఉండాలన్నది ఉద్దేశం! అందుకే, ప్రతి కమిషన్‌లో ఒక ముఖ్య కమిషనర్‌తో పాటు అవసరాన్ని బట్టి పది మంది వరకు కమిషనర్లను నియమించుకోవచ్చని కూడా చట్టం చెబుతోంది. కానీ, దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను ఒక ప్రహసనం చేశారు. పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ అధికారుల్నే అత్యధిక సందర్భాల్లో నియమిస్తున్నారు. పదవిలో ఉండి, తదనంతర పునరావాసం కోసం నిరీక్షిస్తూ కొంత, నియామకం తర్వాత ప్రభుభక్తి చూపుతూ కొంత... పాలనా ప్రక్రియనే ఈ చకోరాలు భ్రష్టు పట్టిస్తున్నాయి. అత్యధిక సందర్భాల్లో ప్రభుత్వాలకు ‘అనుకూలురైన’ అధికారుల్నే నియమిస్తున్నారు. ఇంకా ఇతర వీర విధేయుల్నీ ఏ అర్హతా ప్రమాణాలతో నిమిత్తం లేకుండానే నియమిస్తున్నారు. ఈ ప్రక్రియంతా నిర్దిష్ట ప్రాతిపదికన, పారదర్శకంగా జరగాలని నమిత్‌ శర్మ కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించింది. అభ్యర్థిం చుకున్న/ప్రతిపాదించిన పేర్లలో ఎవరెవరి అర్హతలేమిటి? ప్రజాజీవితంలో ప్రాముఖ్యం ఎలా? ఆయా రంగాల్లో వారికున్న విశేష పరిజ్ఞానం–విస్తృతానుభవం ఏమిటి? అనే వివరాల్ని వారి పేరు పక్కన పొందుపరచాలనీ మార్గదర్శకాలున్నాయి. జాబితా కుదింపులో, తుది ఎంపికలో పేర్లు నిరాకరించిన వారి కన్నా ఎంపిక చేసిన వారికున్న ప్రత్యేకత, అధిక అర్హతలేమిటో సరిపోల్చుకునేలా సదరు సమాచారాన్ని పౌరులకు అందుబాటులో ఉంచాలనీ పేర్కొన్నారు. మన(సు)కు నచ్చిన ఎవరైనా ప్రజాజీవితంలో ముఖ్యులే అని గుడ్డిగా లెక్కిస్తామంటే కుదరదు.

కేరళ తీర్పు గుణపాఠం కావాలి!
కేరళ రాష్ట్ర ప్రభుత్వం జరిపిన అయిదుగురు కమిషనర్ల నియామకాన్ని కొట్టి వేస్తూ రెండు నెలల కింద ఆ రాష్ట్ర హైకోర్టిచ్చిన తీర్పులో పలు అంశాలు ఇమిడి ఉన్నాయి. ఎంపిక కాని ఓ అభ్యర్థి పిటిషన్, తాము ఎంపికయినా గవర్నర్‌ ప్రకటించడం లేదని అయిదుగురు చేసుక్ను పిటిషన్లు, రాష్ట్రం దాఖలు చేసిన రిట్‌ అప్పీళ్లు,.. ఇలా మొత్తం ఆరు అప్పీళ్లను ఉమ్మడిగా పరిశీలిస్తూ న్యాయస్థానం ఈ తీర్పిచ్చింది. ఎంపిక ప్రక్రియ సవ్యంగా, పారదర్శకంగా జరుగలేదన్నదే ఇందులోని ప్రధానాంశం. ముఖ్య సమాచార కమిషనర్, అయిదుగురు సమాచార కమిషనర్ల నియామకానికి గాను ప్రభుత్వం రెండు దఫాలుగా నోటిఫికేషన్‌ ఇచ్చి దరఖాస్తులు ఆహ్వానించింది. సెక్షన్‌ 15 (3)లో చట్టం నిర్దేశించినట్టు ముఖ్యమంత్రి నేతృత్వంలో విపక్షనేత, ఒక సీనియర్‌ మంత్రితో ఏర్పాటయిన త్రిసభ్య కమిటి 2016 ఫిబ్రవరి 24న భేటీ అయింది. ముఖ్య సమాచార కమిషనర్, అయిదుగురు కమిషనర్ల పదవుల కోసం మొత్తం 269 దరఖాస్తులు వచ్చాయి. ఇన్ని దరఖాస్తులు ఒకే రోజు పరిశీలించడం ఎలా? వీటిని క్షుణ్ణంగా పరిశీలించి కుదించడానికి ఒక ప్రాతిపదిక ఉండాలి, కుదింపు కసరత్తు జరగాలని విపక్షనేత అభిప్రాయపడ్డారు. ఆ మేరకు సమావేశాన్ని వాయిదా వేశారు.

మరుసటి రోజు భేటీలో ముఖ్య సమాచార కమిషనర్‌ పదవి కోసం 4, అయిదుగురు కమిషనర్ల నియామకం కోసం 15 దరఖాస్తుల్ని మాత్రం పరిశీలనకు ఉంచారు. ఏ ప్రాతిపదికన? ఎవరు ఈ కుదింపు ప్రక్రియ చేశారన్న విపక్షనేత ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు. కారణాలు, అర్హతలు వంటివి పేర్ల పక్కన పేర్కొనలేదు. తానీ ప్రక్రియకు సమ్మతించనని నోట్‌ రాసి ఆయన వెళ్లిపోయారు. మెజారిటీ సూత్రం ప్రకారం కమిటీ, తగిన సంఖ్యలో పేర్లను ఎంపిక చేసి గవర్నర్‌కు పంపింది. ముఖ్య సమాచార కమిషనర్‌ నియామకం ఆమోదిస్తూ, కమిషనర్ల విషయంలో గవర్నర్‌ కూడ అవే అభ్యంతరాల్ని వ్యక్తం చేస్తూ ఫైల్‌ తిప్పి పంపారు. అభ్యర్థుల విషయంలో తనకు అప్పటికే అందిన ఫిర్యాదుల్ని సర్కారుకు పంపుతూ విచారణ జరుపమన్నారు. కానీ ప్రభుత్వం అవే పేర్లతో జాబితాను తిరిగి పంపింది. అప్పుడు కూడా ఎంపికకు ప్రాతిపదిక, ఇతరుల కన్నా మెరుగైన అర్హతలు, విశేష పరిజ్ఞానం–విస్తృతానుభవాన్ని ధృవీకరించే పత్రాలేవీ జతచేయలేదని గవర్నర్‌ తిప్పి పంపారు. అయినా ప్రభుత్వం అవే పేర్లను ఖరారు చేసింది. ప్రకటన విడుదల చేయాల్సిందిగా గవర్నర్‌ను కోరింది. ఆయన నోటిఫై చేయకపోవడంతో వివాదం తలెత్తింది. ప్రభుత్వ చర్య తప్పని, చట్టం–రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న కోర్టు గవర్నర్‌ చర్యలు సమర్థించింది. పారదర్శకతను పరిరక్షించాల్సిన వారి నియామకాల్లోనే అది లోపించడం సిగ్గుచేటు! ఆవులు పొలాల్లో మేస్తే లేగలు గట్లపైన మేస్తాయా? పౌర సమాజం మేల్కొంటేనే పాదర్శకత లభిస్తుంది. ప్రజాస్వామ్యం దక్కుతుంది.



దిలీప్‌ రెడ్డి
వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్‌
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement