గుడ్లురిమే గురివింద నీతి | chandra babu forgets oath of secrecy | Sakshi
Sakshi News home page

గుడ్లురిమే గురివింద నీతి

Published Fri, Mar 11 2016 12:52 AM | Last Updated on Sun, Sep 3 2017 7:26 PM

chandra babu forgets oath of secrecy

సమకాలీనం
ముఖ్యమంత్రి అంటున్నట్టు, ఇంకో మాటలో చెప్పాలంటే గద్దిస్తున్నట్టు భూసమీకరణంతా జరిగిన తర్వాత ఇన్‌సైడర్ ట్రేడింగ్ లాంటిది జరిగిందని ఎవరూ అనట్లేదు. మతలబంతా ముందు జరగడమే! వారిది నికార్సయిన భూవ్యాపారమే అయితే... ఏ విజయనగరం లోనో, ఏలూరులోనో, నూజివీడులోనో ఎందుక్కొనలేదు? అక్కడే, కోర్ క్యాపిటల్ లోనే ఎందుక్కొన్నారు? ఈ ప్రశ్నలకు జవాబెందుకు లేదు? ఇన్ని జరిగినా వేటిపైనా విచారణ అవసరం లేదని, విమర్శించే వారే సాక్ష్యాధారాలతో నిరూపించాలంటున్నారు ఏలినవారు.

రాజకీయాల్లో విమర్శలూ, ప్రతి విమర్శలూ కొత్తకాదు. విపక్షం- పాలకపక్షంగా స్థానం మారగానే వైఖరులు మారడం, విధానాలు తిరగబడటం, నీతిసూత్రాలు అమాంతం రూపాంతరం చెందడం సరికొత్త సం‘గతి’!  ఇన్నాళ్లూ  అవినీతి అని తామే దుమ్మెత్తిపోసిందాన్ని ఇప్పుడు నీతంటూ ఏకంగా నెత్తికెత్తుకోవడం, ఎదుటి వాళ్లు చేసింది తప్పై, అదే తాను చేసినపుడు ఒప్పవడం... ఇదీ, తాజా వైచిత్రి! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో... ఏలిన వారు ఎన్నికల హామీల్ని తుంగలో తొక్కడం నుంచి రాజధాని భూదురాక్రమణ దాకా, నిస్సిగ్గు పార్టీ ఫిరాయింపు పర్వాల నుంచి జాతి యావత్తూ చూసేలా, మీడియాను బెదిరించే వరకు సాగుతున్న ప్రజాస్వామ్య పరాభవాల అంకం అసెంబ్లీ వేదికకు చేరింది. సభ సజావుగా నడిచే బాధ్యత భుజాలమీద మోయాల్సిన సభనాయకుడు ముఖ్యమంత్రే, ‘మేం చెప్పినట్టు జరిగితే తప్ప.. సభను నడువనిచ్చేది లేద’ని హుంకరించడం విస్మయం కలిగిస్తోంది.

సభా న్యాయం పాటించాల్సిన సభాపతి ప్రతిపక్ష హక్కుల రక్షణకు రాకపోగా, విపక్షమిలా ప్రవర్తిస్తే, భూదందాలపై సీబీఐ విచారణే జరిగితే....పెట్టు బడులు రావనే ప్రభుత్వ భావనను పలికించడం మరింత విస్మయం కలిగిం చింది. ‘‘విపక్షంగా మేముండి ఆరోపించినపుడు పాలకపక్షం దర్యాప్తునకు ఆదేశించి, అవినీతి జరగలేదని నిరూపించుకోవాలి. మేమే పాలక పక్షంగా ఉన్నపుడైతే ప్రతిపక్షమే ‘ఇదుగో అవినీతి ఇలా జరిగింది’ అని మాకు సంతృప్తి కలిగేంత వరకు నిరూపించాలి, నిరూపించలేకపోతే క్షమాపణ చెప్పి సభ నుంచి విపక్షమే నిష్ర్కమించాలి!’’ ఇదీ మా నయానీతి!! అంటూ పాలక పక్షీయులు జబ్బలు చరుచుకుంటున్నారు. విసుగెత్తిన విపక్షం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసిచ్చిందంటే, సంఖ్యా బలాల హెచ్చుతగ్గులే కాదు ఇంటా-బయటా పాలకపక్షం-ప్రభుత్వం వ్యవహార శైలినీ చూడాలి.

గోప్యతా ప్రమాణమూ గాలికి!
భారత రాజ్యాంగం, మూడో షెడ్యూల్‌లో నిర్దేశించిన విధంగా ప్రభుత్వ బాధ్యత చేపట్టేవారు గోప్యత ప్రమాణం (ఓత్ ఆఫ్ సీక్రసీ) చేస్తారు. ఒకసారి కాదు, ముఖ్యమంత్రిగా మూడుమార్లు అలా ప్రమాణం చేసిన చంద్రబాబు తన ఎన్నికల హామీలకు పట్టించిన గతే ప్రమాణానికీ పట్టించారు. ‘‘నారా చంద్రబాబునాయుడు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని... నా కర్తవ్యా లను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ పక్షపాతం గానీ, రాగద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్నీ, శాసనాల్నీ అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని... రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్నీ నా కర్తవ్యాల్ని సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప, ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ ఏ వ్యక్తికీ లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడిం చనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’’ అని పెద్ద సభలో, ప్రజల సమక్షంలో చెప్పారు. కానీ ఏం చేశారు? రాజధాని సాక్షిగా సమస్త ప్రజానీకం కళ్లకు కడుతోంది. ప్రభుత్వంలో భాగమై, నిర్ణయాలకు చేరువగా ఉండటాన్ని సానుకూలంగా మలచుకొని పెద్ద ఎత్తున ప్రజా వంచనకు దిగారు. చైనా, జపాన్, సింగపూర్ ప్రభుత్వాల్ని తెరపైన చూపి, అక్కడి ప్రయివేటు సంస్థలతో లోపాయకారి సంప్రదింపులతో ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద రియల్ ఎస్టేట్ దందాగా రాజధాని వ్యవహారాన్ని సాగించడం ఒక ఎత్తు.

రాజధానిని ఏ నిర్దిష్ట ప్రాంతంలో నిర్మిస్తారు అన్న అధికారిక సమా చారాన్ని పరిమితంగా కొందరు మంత్రులు, ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉండే వ్యవహారకర్తలు, రియల్టర్లకు మాత్రమే తెలిపి చేసిన ఘోరం మరో ఎత్తు! వారు ఆ ప్రాంతంలో చౌకగా భూములు కొనుగోలు చేసేలా, రకరకాల పద్ధతుల్లో రైతులు, సామాన్యుల భూముల్ని వారు స్వాధీనపరచుకునేలా వ్యవహారం నడిపారు. 2005లో సమాచార హక్కు చట్టం వచ్చిన దరిమిలా... పారదర్శకత నూతన విధానమైనపుడు ఇంకా ఈ గోప్యతా ప్రమాణమేంటి? ఇందులో అర్థం లేదు, ఇది తప్పుడు సంకేతాలిస్తుంది కనుక దీన్ని తొలగించాలనే వాదన పెరిగింది. సమాచారం అందరితో పంచు కుంటానని ప్రమాణం చేసేలా రాజ్యాంగం మూడో షెడ్యూల్‌ని సవరిం చాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. కానీ, అధికారంలో ఉండే కొందరైనా, అలా ప్రభుత్వంలో భాగం కాని మెజారిటీ సామాన్యులైనా... ఉభయులూ సమానావకాశాలు కలిగి ఉండాలనే ఉద్దేశంతో గోప్యతా ప్రమా ణాన్ని కొనసాగించడానికే కేంద్ర ప్రభుత్వం, నిపుణులూ ప్రాధాన్యత నిచ్చారు.

ఇంతకీ జరిగిన దారుణమేంటి?
‘కొంటే తప్పేంటి?’ అన్న పాలకుల ప్రశ్నలో పొగరున్నంతగా న్యాయం లేదు. లోగడ చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనా కాలంలో అప్పటి రాజధాని హైదరా బాద్ ‘హైటెక్ సిటీ’ ప్రాంత అభివృద్ధి క్రమంలో ప్రయోగించిన స్వార్థపు నమూనానే ఇప్పుడు అమలు పరిచారు. హైటెక్‌సిటీ అభివృద్ధి చేసే విష యాన్ని తగినంత ముందుగా తమ వారికే చెందిన జయభేరి వంటి సంస్థలకు లీకులిచ్చారు. ఆపై అధికారికంగా అభివృద్ధి జోన్ ప్రకటించి, తాము సమీక రించుకున్న భూముల విలువ ఇబ్బడి ముబ్బడిగా పెరిగేటట్టు చేసుకొని కోట్లకు పడగలెత్తారు. ఈ స్వార్థ నమూనానే రాజధానిలో పదునెక్కించి మరీ అమలు పరిచారు. అక్కడికీ ఇక్కడికీ ఇంకో ప్రధాన తేడా ఉంది. నూజివీడు వైపు రాజధాని వస్తోందని ముందు ప్రచారం చేసి, అక్కడ పలువురు రియల్టర్లు, సామాన్యులు భూములు కొనుక్కునేలా, మంగళగిరి-తుళ్ళూరు తదితర ప్రాంతాల్లోని వారు రాజధాని రావట్లేదనే నిరాశతో చౌకగా తమ భూముల్ని అమ్ముకునేలా ఎత్తుగడ వేశారు.

కాదు, రాజధాని తుళ్లూరు చుట్టుపక్కలే వస్తుందన్న కచ్చితమైన రహస్య సమాచారం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి బంధువులు, రాబందులు మాత్రం అక్కడే భూములు కొనుక్కొని, లాక్కొని, నయానో భయానో వశపరచుకొని రైతులు, సామా న్యుల పచ్చని పంటపొలాల్లో తమ దగాను యథేచ్ఛగా విస్తరించారు. ఇది రెండింతల మోసం! ‘‘భూములు కొంటే తప్పేంటి? డబ్బులున్నాయి వ్యాపా రం చేసుకుంటున్నారు. మంత్రులైతే వ్యాపారాలు చేసుకోవద్దా?’’అని నిస్సం కోచంగా ముఖ్యమంత్రే ప్రశ్నిస్తున్నారు. ‘అక్కడే రాజధాని వస్తుందన్న కచ్చి తమైన ముందస్తు సమాచారంతో, నిర్ణయం వెల్లడించడానికి పూర్వం, ప్రభుత్వంలో ఉన్నవారు అలా సామాన్య ప్రజల భూముల్ని తక్కువ ధరలకు కొని ఖరీదైన ఆస్తులుగా సొమ్ము చేసుకోవడం తప్పు’ అని ప్రతిపక్షం విమర్శిస్తే, ‘... మేం అలాగే చేస్తాం, ఏ విచారణా జరపం, ఏం చేసుకుంటారో చేసుకోండి’ అని దబాయిస్తున్నారు. దర్యాప్తు అంటేనే జడుసుకుంటున్నారు. సీబీఐ పేరు ప్రస్తావించిన ప్రతిసారీ ముఖ్యమంత్రి రుసరుసలాడుతున్నారు. ఎందుకు?

ఇన్‌సైడర్ ట్రేడింగ్ కన్నా నీచంగా...
‘ఇందులో ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎక్కడుంది? మేం 34 వేల ఎకరాల భూసమీకరణ చేశాం, ఇప్పుడా భూమి మాతోనే ఉంది, ఇంకెక్కడి ఇన్‌సైడర్ ట్రేడింగ్?’ అని సభావేదికగా ముఖ్యమంత్రి అమాయకత్వం నటిస్తున్నారు. ‘అసలు ఇన్‌సైడ్ (నిజానికి ఇన్‌సైడర్) ట్రేడింగ్ అంటే తెలుసా మీకు? తెలియకుండానే మాట్లాడేస్తున్నారు...’ అని ఎదురుదాడి చేస్తున్నారు. ఒక సంస్థకు సంబంధించిన లోపలి వ్యక్తిగా గోప్య సమాచారం తెలిసుండి, దాన్ని తన స్వప్రయోజనాలకు వాడుకుంటూ స్టాక్ ఎక్స్చేంజ్‌లో వ్యాపారం చేసే అక్రమ ప్రక్రియకే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని నిర్వచనం.

ఇదే జరిగిందిక్కడ. ముఖ్యమంత్రి అంటున్నట్టు, ఇంకో మాటలో చెప్పాలంటే గద్దిస్తున్నట్టు భూసమీకరణంతా జరిగిన తర్వాత ఇన్‌సైడర్ ట్రేడింగ్ లాంటిది జరిగిందని ఎవరూ అనట్లేదు. మతలబంతా ముందు జరగడమే! వారిది నికార్సయిన భూవ్యాపారమే అయితే... ఏ విజయనగరంలోనో, ఏలూరులోనో, నూజివీడులోనో ఎందుక్కొనలేదు? అక్కడే, కోర్ క్యాపిట ల్‌లోనే ఎందుక్కొన్నారు? ఈ ప్రశ్నలకు జవాబెందుకు లేదు? ఉప్పందిన తమ అనుచరగణం పేదల అసైన్‌మెంట్ భూముల్నీ మాయమాటలతో స్వాధీన పరచుకున్న తర్వాత కదా సదరు చట్టాన్ని ఈ సర్కారు పెద్దలు మార్చాలని యత్నిస్తున్నది! ఇప్పటికీ స్పష్టత లేకుండా ఆ చట్టాన్ని అయోమ యంలోకి నెట్టింది సర్కార్ కాదా?  ఇన్ని జరిగినా వేటిపైనా విచారణ అవసరం లేదని, విమర్శించే వారే సాక్ష్యాధారాలతో నిరూపించాలంటు న్నారు ఏలినవారు.

బెదిరింపు, భయపెట్టడాలే ప్రధానాస్త్రాలు
ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా బెదిరించి వ్యవస్థల్ని, వ్యక్తుల్ని లొంగ దీసుకోవాలనేది ముఖ్యమంత్రి ఎత్తుగడగా కనిపిస్తోంది. ఇది ఆయన నైజం కూడానేమో! ఇందుకు అవసరమయితే పచ్చి అబద్ధాల్ని ఒకటికి రెండుమార్లు వల్లెవేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. రాజధాని భూదందాలపై పత్రికల్లో, ముఖ్యంగా సాక్షిలో వచ్చిన కథనాలతో కంపించిపోయినట్టు ఆయన మాటలు, వ్యక్తీకరణని బట్టి స్పష్టమౌతోంది. ‘ముందు మీ పై కేసులు పెట్టాలి, ఎలా రాస్తారు? ఏది పడితే అది రాయడమేనా?  మీ పైన కేసులు పెడితే అప్పుడు భయముంటుంది!’ అని భయపెట్టడమే తమ లక్ష్యమన్నట్టు విలేకరుల భేటీలో మాట్లాడారు.

తప్పిదాలు జరక్కుండా చూడటం కన్నా, వాటిని రాయకుండా జాగ్రత్తపడాలనే తపనే కొట్టొచ్చినట్టు కనిపించింది. అసెంబ్లీ వేదికగానూ అదే బెదిరింపు. ‘సాక్షి’ పత్రికపై మునికాళ్లపై లేస్తున్నారు. ‘సాక్షి’ ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ అటాచ్‌మెంట్‌లో ఉంది, కనుక ఇది ప్రజా ఆస్తే అని ఒకమారు, ప్రభుత్వ ఆస్తి అని మరోమారు, జప్తు అయిందని ఒకమారు, అవుతోందని మరోమారు.... ఇలా ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి తప్పుడు మాటలు చెబుతూ తన మానసిక స్థితిని వెల్లడిం చారు. ప్రజాస్వామ్యయుతంగా ఉండటమే కాదు, ఉన్నట్టు కనబడాలనేది స్ఫూర్తి అయితే, ప్రజాస్వామ్యయుతంగా ఉండం, ఉన్నట్టు కనబడాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదన్నట్టు వ్యవహరిస్తోందీ ప్రభుత్వం. సభా వేదిక నుంచి ముఖ్యమంత్రే చెప్పినట్టు, ‘‘గతకాలపు చర్యలే వర్తమానంలో మన ప్రస్తుత పరిస్థితి అయినపుడు, వర్తమానంలో మన వ్యవహారాలే మన భవిష్యత్తుకు భూమిక అవుతాయి!’’
http://img.sakshi.net/images/cms/2015-07/61438290637_295x200.jpg

దిలీప్ రెడ్డి
ఈమెయిల్: dileepreddy@sakshi.com                                      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement