పారదర్శకత.. పదేళ్ల పాఠం | dileepreddy article on RTI act | Sakshi
Sakshi News home page

పారదర్శకత.. పదేళ్ల పాఠం

Published Fri, Oct 16 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

పారదర్శకత.. పదేళ్ల పాఠం

పారదర్శకత.. పదేళ్ల పాఠం

సమకాలీనం
ఈరోజు, రేపు... రెండురోజుల పాటు ఢిల్లీలో జరుగుతున్న ‘సమాచార హక్కు జాతీయ వార్షిక సదస్సు‘లో ఆర్టీఐ క్షేత్రస్థాయి కార్యకర్తల్ని భాగస్వా ముల్ని చేయకపోవడం విస్మయం కలిగిస్తోంది. ఇది ఉద్దేశపూర్వక చర్య, కేంద్రంలోని ఎన్డీయే విభిన్న వైఖరని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదేళ్లుగా సాగుతున్న పద్ధతికి తిలోదకాలిచ్చి, కేంద్ర-రాష్ట్ర కమిషనర్లు, ప్రభుత్వాధికారులకు తోడు పౌర సమాజం నుంచి ఎంపిక చేసిన కొందరు పెద్దల్ని మాత్రమే ఆహ్వానించారు. వివిధ రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఆర్టీఐ కార్యకర్తల్ని ఆహ్వానించకపోవడం వల్ల చట్టం అమలుపై జనాభిప్రా యం సదస్సులో చర్చకు వచ్చే అవకాశం పోతోంది. లోగడ జరిగిన వార్షిక సదస్సులలో వారు భాగస్వాములు. వారిచ్చే సమాచారం ఆధారంగా చర్చ, కొన్ని నిర్ణయాలూ జరిగేవి. చట్టం అమలు మొదలై పదేళ్లు పూర్తయిన సందర్భంలో జరుగుతున్న ఈ సదస్సులో ఇటువంటి చర్య ఉపేక్షించదగింది కాదనేది విమర్శ.

ఈ పదేళ్లపాటు దేశంలో, అనేక ప్రతిబంధకాల నడుమ ఆర్టీఐ సజీవంగా ఉండటానికి కార్యకర్తలే ముఖ్య కారణం. రెండు తెలుగు రాష్ట్రాలుసహా, దేశంలో పదేళ్ల ఆర్టీఐ ప్రస్థానాన్ని పరిశీలిస్తే రెండంశాలు స్పష్టమౌతున్నాయి. పాలనా వ్యవస్థల్లో పారదర్శకతకు పట్టంకట్టిన సమా చార హక్కు చట్టం విజయవంతమైంది. కానీ, దాని అమలే విఫలమై పలు విధాలుగా భంగపడింది, భంగపడుతూనే ఉంది. పదేళ్లు చిన్న సమయమా? పెద్ద సమయమా? అంటే, వేళ్లూనుకు పోయిన దుర్వవస్థను సమూలంగా సంస్కరించడానికి ఇది పెద్ద సమయం కాకపోవచ్చు. కానీ, ఆశించిన లక్ష్యాల సాధన దిశలో సరైన పంథాలోనే ఉన్నామా అని సమీక్షించుకోవడానికి పదేళ్లు సముచిత సమయమే!

వాడుకున్నోళ్లకు వాడుకున్నంత
 పిండికొద్ది రొట్టె వంటిది ఆర్టీఐ చట్టం. ఉపయోగిస్తేనే ప్రయోజనాలు. దర ఖాస్తుదారు ఆశపడ్డట్టే సంబంధిత అధికారులు స్పందిస్తేనే ఫలితం. మొదట్లో అంతగా లేదు కానీ, రానురాను వినియోగం పెరిగింది. దేశవ్యాప్తంగా ఆర్టీఐ దరఖాస్తుల సంఖ్య ఇప్పుడు ఏడాదికి దాదాపు 50 లక్షలకు చేరింది. రాష్ట్రం లోనూ, మొదటి ఏడాది 2005-06లో 8 వేల పైచిలుకున్న దరఖాస్తుల సంఖ్య ఇప్పుడు ఏడాదికి సగటున 1.7 లక్షలకు చేరింది. గతంలో గోప్యంగా ఉండే రకరకాల సమాచారం ఆర్టీఐ పుణ్యమాని ఇప్పుడు తేలికగా ప్రజా బాహుళ్యం లోకి వస్తోంది. పౌర సదుపాయాలతోపాటు సంక్షేమ కార్యక్రమాల అమలు, లబ్ధిదారుల ప్రయోజనాలు- హక్కులు, ప్రజాపంపిణీ, భూయాజమాన్య హక్కులు, పిల్లలకు విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు వంటి విషయాల్లో దరఖాస్తుల సంఖ్య పెరిగింది. అధికార యంత్రాంగం సహజ వైఖరి, గోప్యంగా ఉంచే తత్వంవల్ల సాధారణ పరిస్థితుల్లో నిరాకరించే సమాచారాన్ని కూడా ఈ చట్టం కింద కోరినపుడు ఇవ్వాల్సి వస్తోంది.

వేగం, ప్రభావం పెరగాలి
 పౌర కార్యాలయాల స్థాయిలోనే సమాచారం తేలిగ్గా లభించాలి. ఆ మేరకు అధికారుల్లో స్పందన, బాధ్యత-జవాబుదారీతనం పెరగాలి. అది లోపించిన పుడు కఠిన చర్యలు తీసుకునేలా సమాచార కమిషన్లు బలోపేతం కావాలి. అప్పీళ్లు, ఫిర్యాదుల్ని పరిష్కరించడంలో వేగంతో పాటు అధికార యంత్రాం గంపై వారి తీర్పులు, ఆదేశాల ప్రభావం పెరగాలి. వారి ఆదేశాల అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో సహకరించాలి. రెండూ జరగట్లేదు. చట్టం స్ఫూర్తిని పరిరక్షిస్తూ జనహితంతో ఆలోచించి, స్వతంత్రంగా వ్యవహరించే వారిని కమిషనర్లుగా నియమించాలి. గత పదేళ్ల అనుభవం మాత్రం ఇందుకు భిన్నం. చాలా రాష్ట్రాల్లో కమిషన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక, ఇప్పటి వరకు నియమితులైన కమిషనర్లలో 76 శాతం మంది రిటైర్డ్ అధికారులని ఒక అధ్యయనం చెబుతోంది. సర్వీసులో ఎక్కువమార్లు ప్రజలకు సమాచారం నిరాకరించి పారదర్శకతకు మంగళం పాడినవారు, పునరావాస కేంద్రంలో భిన్నంగా వ్యవహరిస్తారనుకోవడం భ్రమే అన్నది నిపుణుల అభిప్రాయం.

ఆర్టీఐ అప్పీళ్లు, ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉంటున్నాయి. సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ (సీఈఎస్) అధ్యయనం ప్రకారం, ఇప్పుడున్న వేగంతో వాటిని పరిష్కరిస్తే ఒక్కో రాష్ట్రంలో కేసుల పరిష్కారానికి 20, 30, 40 సంవత్సరాల కాలం పట్టొచ్చు. ఈ పంథా మారాలి. అన్ని కీలక పదవులు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్‌లకే అప్పగించనవసరం లేదు, ఆయా రంగాల్లో నిపుణులైన బయటి వ్యక్తులకు ప్రాధాన్యమివ్వండని 2011, 2013లో సుప్రీంకోర్టు సుస్పష్టంగా చెప్పింది. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.

భద్రతకు భరోసా కావాలి!
 ఆర్టీఐ పదేళ్ల ప్రస్థానంలో కార్యకర్తలపై జరిగిన హత్యలు ప్రమాద సంకేతం. ఓ పరిశీలన ప్రకారం, దేశవ్యాప్తంగా ఆర్టీఐ కార్యకర్తలపై 260కి పైగా దాడులు జరిగి 49 మంది హత్యకు గురయ్యారు. వేళ్లూనుకున్న పాలనా దాష్టీకాలకు, రాజకీయ-అధికార యంత్రాంగానికి, అక్రమార్కులకూ మధ్య చీకటి సంబంధాలకు ఇది ప్రతీక! చాలా సందర్భాల్లో... దరఖాస్తుదారు సమాచారం కోరిన సంగతి, అక్రమాలతో సంబంధమున్న అసాంఘికశక్తులకు పౌర సమాచార అధికారు (పీఐవో)లే చేరవేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ‘వ్యాపం’కేసులో, ఆర్టీఐ కార్యకర్త నిర్దిష్ట సమాచారం కోరినట్టు పీఐవో ద్వారా విషయం తెలుసుకున్న ఓ డాక్డర్ బెదిరింపులకు పాల్పడ్డాడు. సతీష్‌శెట్టి హత్యకేసు విచారిస్తూ, ఆర్టీఐ కార్యకర్తలకు తగిన రక్షణ కల్పించా లని 2010లో ముంబై హైకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది. ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. అంతకు ముందే, 2009లో ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఒక ఉత్తర్వు ఇప్పించింది.

సమాచారం కోరే ఆర్టీఐ కార్యకర్తలపై అధికారులుగానీ, వారి పనుపున అసాంఘికశక్తులుగానీ బెదిరిం పులు, భౌతికదాడులకు పాల్పడ్డపుడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు సత్వరం స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలి. ఆ ఆదేశం ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది, అమలు మాత్రం అనుమానమే! ‘సమాజ వైతాళికుల రక్షణ చట్టం’ (డబ్లూబీపీఏ)కు పట్టిన గ్రహణం వీడటం లేదు. సమాజ హితం కోరి ఆర్టీఐనో మరో ప్రగతిశీల చట్టాన్నో వాడే కార్య కర్తల రక్షణ కోసం విజిల్ బ్లోయర్స్ యాక్ట్‌ను ప్రతిపాదించారు. 2011లో అప్పటి యూపీయే ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించింది. 2014 మే 9న అది ఆర్డినెన్స్ రూపంలో వచ్చింది. అటుపై అధికారంలోకొచ్చిన ఎన్డీయే ప్రభు త్వం దాన్ని కనీసం నోటిఫై చేయకుండా ఉంచింది. సవరణలతో నీరుగార్చి బలహీనంగా తెచ్చే యోచన ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

నీరుగార్చే వైఖరివల్లే అనర్థాలు
 ఆర్టీఐ చట్టం అమల్లోకి వచ్చిననాటి నుంచీ దాన్ని నీరుగార్చే యత్నాలు సాగు తున్నాయి.. చట్టం పుట్టి ఏడాది గడవకముందే, 2006లో ఫైళ్లలో రహస్యాల్ని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించేందుకు జరిగిన యత్నాన్ని పౌరసమాజం తిప్పికొట్టింది. మధ్యలో చాలా కుతంత్రాలు జరిగాయి. పర్యవేక్షణ విభాగ మంటూ, సిబ్బంది-శిక్షణ (డీవోపీటీ) మంత్రిత్వశాఖ పేరిట చట్టం స్ఫూర్తిని కాపాడాల్సింది పోయి గండికొట్టిన సందర్భాలెన్నో! ఒక కేసులో సీఐసీ ఉత్త ర్వుల్ని  ధ్రువపరుస్తూ, ‘మీరు సమాచారం ఇవ్వాల్సిందే’ అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వంచించేలా రాజకీయ పక్షాల్ని పరిధి నుంచి తప్పించే చట్ట సవరణ యత్నాలు సాగుతున్నాయిపుడు.

అంతకన్నా ప్రమాదకరంగా, మంత్రివర్గ సమావేశ పత్రాలు, ఆర్థికవ్యవహార పత్రాలు వంటి కీలక సమా చారాన్ని ఆర్టీఐ పరిధి నుంచి తప్పించే ముసాయిదా ప్రతిపాదనలు వేచి ఉన్నాయి. అర్థంపర్థంలేని దరఖాస్తుల (ఫ్రీవోలస్)ని ముద్రవేసి వినతులకు పురిట్లోనే సంధి కొట్టడానికి, కార్యకర్తల్ని భయపెట్టడానికి ఇంకో యత్నం సాగుతోంది. ఇలా అసంబద్ధ దరఖాస్తులు చేసిన వారిపై 30 వేల రూపాయల వరకు జరిమానా, 3 మాసా లకు తగ్గకుండా జైలు శిక్ష విధించాలని ప్రతిపాదిస్తున్నారు. పౌరసమాజం మరింత చైతన్యవంతమై ఆర్టీఐని కాపాడుకోవాల్సిన అవసరాన్ని పదేళ్ల చరిత్ర నొక్కిచెబుతోంది. పాలనలో పారదర్శకత పెంచి వ్యవస్థను జవాబుదారుగా నిలిపే క్రమంలో.. సమాచార సాధన చేయాల్సిందే, ఆర్టీఐ చట్టాన్ని ఉపకరణంగా వాడాల్సిందే!

 దిలీప్ రెడ్డి ( వ్యాసకర్త పూర్వ సమాచార కమిషనర్). dileepreddy@sakshi.com                                    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement