ఎండలు కాసేదెందుకురా?
మబ్బులు పట్టేటందుకురా!
మబ్బులు పట్టేదెందుకురా?
వానలు కురిసేటందుకురా
వానలు కురిసేదెందుకురా?
చెరువులు నిండేటందుకురా!
చెరువులు నిండేదెందుకురా?
పంటలు పండేటందుకురా!
పంటలు పండేదెందుకురా?
ప్రజలూ బతికేటందుకురా!
ప్రజలూ బతికేదెందుకురా?
మంచినిపెంచేటందుకురా!
ఇది చిన్నతనంలో మనమంతా పాడుకున్న పాట. మంచిని పెంచుతున్నామా? తుంచుతున్నామా? అన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్న. మంచినే పెంచితే... ఇన్ని అనర్థాలు ఎందుకుంటాయి? ఎవరి స్థాయిలో వారు చేయాల్సింది చేయకపోవడం, చేయకూడనిది చేయ డంవల్ల విపరీత పరిస్థితులు ముంచుకొస్తున్నాయి. ఎండలు వెర్రిగా కాస్తున్నాయి. వానలు అడ్డదిడ్డంగా, అసాధారణంగా కురుస్తున్నాయి. కబ్జాలతో కనుమరుగు కాగా మిగిలిన చెరువులు నిండో, తెగో రాజ ధాని హైదరాబాద్‌లో కాలనీలను ముంచెత్తుతున్నాయి. అక్రమ నిర్మా ణాల వల్ల నదుల్లో, నాలాల్లో, నడివీధుల్లో పరవళ్లు తొక్కిన వరదలు సమస్తాన్నీ ఊడ్చుకుపోతున్నాయి. పల్లానికి పరుగు తీయాల్సిన నీరు కాలనీల్లో నిలిచి, జనావాసాల్లో తిష్టవేస్తోంది.
పది రోజులవుతున్నా వేలాది ఇళ్లు, బంగళాలు ఇంకా నీటిలోనో, బురదలోనో ఉన్నాయి. బతుకు ఛిద్రమై జనం అల్లాడుతున్నారు. ఇంటికో కన్నీటి గాథ ఉంది. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తిన వాన–వరద బీభత్సమైనా, రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న పంటల నష్టమైనా.... కేవలం ప్రకృతి వైపరీత్యం అనడానికి లేదు. దానికి తోడైన మానవ తప్పిదం నష్టాన్ని ఎన్నో రెట్లు పెంచింది. మారిన వాతావరణ పరిస్థితుల (క్లైమెట్ చేంజ్) వల్ల తలెత్తే తీవ్ర ఘటనలు సరేసరి! సరైన విధానం, ప్రణాళిక, వ్యూహం లేకపోవ డమే ఓ పెద్ద సమస్య! ముంచుకొచ్చిన సమస్య తీవ్రత గుర్తించి సకా లంలో తగినట్టు స్పందించకపోవడం ఏ విధ్వంసానికి దారితీసిందో ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. మహానగరం, శివారు కాలనీల్లోని వేలాది కుటుంబాలు ఈ రోజు ఎదుర్కొంటున్న దయనీయ స్థితికి గుండె తరుక్కుపోతుంది. ఇల్లు చెరువైన నిర్భాగ్యుడొకరు పదో రోజున కూడా ఒంటి మీద అవే బట్టలు, కంట్లో అదే ఆరని తడి... పలుకరించవచ్చిన వారిని దీనంగా చూస్తుంటే ఎవరికి మాత్రం హృదయం కదలదు? ఇది అనూహ్యంగా వచ్చిన ప్రమాదమేమీ కాదు. ఎన్నో హెచ్చరికలు, ఎన్నెన్నో అధ్యయన నివేదికలు, ఇరుగుపొరుగు రాష్ట్ర రాజధానులు చెన్నై, ముంబాయి, బెంగళూరు వంటి మహానగరాల్లోని మరెన్నో చేదు అనుభవాలు చూసిన తర్వాత కూడా మేల్కొనని మొద్దు నిద్ర ఫలితం!
హైదరాబాద్‌వి బహుముఖ సమస్యలు
ఇలాంటి పరిస్థితుల్లో ద్విముఖ వ్యూహం కావాలి. దీర్ఘకాలిక ప్రణాళిక, విపత్తు తలెత్తినపుడు ప్రభావవంతమైన తక్షణ చర్యలు, రెండూ ఉండటం లేదు. ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమన చర్యలే! కంటి తుడుపు పనులే! వర్షతీవ్రత, దాని ముప్పు నుంచి హైదరాబాద్‌ను సురక్షితంగా ఉంచడంలో వరుస ప్రభుత్వాలు విఫలమయ్యాయి. నూరేళ్ల కింద ఇలాగే వరద ముంచెత్తినపుడు, నిజాం చొరవతో విశ్వే శ్వరయ్య రూపొందించిన మాస్టర్ ప్లాన్ తర్వాత అలాంటి విస్తృత ప్రణాళికేదీ ఇన్నాళ్లు ముందుకు రాలేదు. వచ్చిన అరకొర అమలుకు నోచలేదు. అమలైన వాటికి అతీగతీ లేదు. మహానగర పాలక సంస్థ పరిధి ఇప్పుడు 625 చ.కి.మీ విస్తరించి, వేలాది కాలనీలు వెలసిన తర్వాత కూడా తాగునీరు, వరదనీరు, మురుగునీటి నిర్వహణకు సరైన వ్యవస్థే లేదు. మహానగరంలో 9వేల కిలోమీటర్ల నిడివి రోడ్లకు ఇరువైపుల సరైన వరదనీటి కాల్వలు లేవు. చాలా చోట్ల మురుగునీటి కాల్వలు, వరదనీటి కాల్వలు కలిసిపోతాయి. అందుకే, చిన్న వానొ చ్చినా రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తాయి. ఇవాళ వేలాది ఇళ్లల్లో చేరిన నీరైనా, బురదైనా మురుగుతో కూడుకున్నదే! ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు ఏడు వేల కిలోమీటర్ల నిడివి మురుగునీటి వ్యవస్థ అందుబాటులో ఉంది. అవసరాలు తీర్చే సామర్థ్యం లేని, కాలం చెల్లిన పైపులైన్లు చాలా చోట్ల ఉన్నాయి. పాతబస్తీలో కొన్ని చోట్ల నిజాం కాలం నాటి పైపులే ఇప్పటికీ వినియోగంలో ఉన్నాయి. ఇక అక్రమ నిర్మాణాల గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రభుత్వమే మూసీ నదీ గర్భంలో నిర్మాణాలు జరిపిన అతిపెద్ద ఆక్రమణదారు. ప్రయివేటుకు లెక్కే లేదు. నాలాలపైన, చెరువుల్లో, పార్కుల్లో... ఇలా ఎక్కడ పడితే అక్కడ అక్రమ కట్టడాలొస్తున్నాయి.
క్రమబద్ధీకరణలు వరమా? శాపమా?
భవనాల (బీఆరెస్), లే అవుట్ల (ఎల్లారెస్) క్రమబద్ధీ్దకరణ పథకాలు దీర్ఘకాలంలో ముప్పుగా మారుతున్నాయి. పర్యావరణపరంగా, భద్ర తపరంగా.. ఎలా చూసినా ఆయా నగరాలు, పట్టణాల క్రమాభివృద్ధికి అవే అవరోధమవుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో పౌరులకు అదొక వెసలుబాటులా కనిపిస్తున్నా, వాస్తవంలో అవి అలా లేవు. వర్తమాన, భవిష్యత్ ఆక్రమణలు, అక్రమనిర్మాణాలను ప్రోత్సహించేవిగా ఉంటు న్నాయి. పథకం ప్రకటన, తరచూ గడువు పొడిగింపులు ఎలా ఉంటు న్నాయంటే... ప్రకటించాక తొలి ఇటుక కొని అక్రమనిర్మాణం జరిపిన వారికి కూడా వెçసులుబాటు వర్తిస్తోంది. ప్రభుత్వాలు ఆయా పథకా లను ఆదాయవనరుగా చూడటం దారుణం. ఖర్చులకు గడవనంత ఆర్థిక ఇబ్బంది రాగానే క్రమబద్ధీకరణ పథకాలు ప్రకటించి, తరచూ పొడిగించి ఖజానా నింపుకోవడంకన్నా దౌర్భాగ్యమేముంటుందని పర్యావరణ నిపుణులంటున్నారు. సదరు ఉల్లంఘనలను మొదట ఉపేక్షించిన అధికారులు, బాధ్యులపై ఏ చర్యలూ ఉండటం లేదు.
వివాదాస్పద భూములు, బఫర్ జోన్లు, చెరువులు–కుంటల శిఖం భూముల్లో, ఎప్టీఎల్ వరకు జరిగే నిర్మాణాలు, వెంచర్ల వెనుక ఉండేది ఎక్కువగా రాజకీయ నాయకులే! వారికదో పెద్ద ఆదాయ వనరు. దీనికి తోడు, ‘ఆపరేషన్ ఆకర్ష్’ వంటి రాజకీయ పథకాల్లో సహకరిం చిన వారికి జాగీర్లలాగా ఆయా ప్రాంతాలనే ఇచ్చేస్తుంటారు. నిబం ధనల్ని ఉల్లంఘించి నిర్మాణాలు జరిపేటప్పుడేమో.. లంచాలు తినే తప్పుడు అధికారులకు, నిర్మాణాలు జరిగిపోయాక.. పథకం ప్రక టించే ప్రభుత్వాలకు ఇదొక మంచి రాబడి మార్గమయింది. అంటే, చట్టోల్లంఘన చేసేవారి తప్పుడు సంపాదనలో అధికారికంగా వాటా దక్కడమే! హైదరాబాద్ శివారుల్లోని 11 మున్సిపాలిటీలు 2007లో కార్పొరేషన్‌లో విలీనమ య్యాయి. ఈ పరిధి వేలాది కాలనీల్లో లక్షల అక్రమ నిర్మాణాలొ చ్చాయి. సుమారు 185 చెరువులు, 200 పైచిలుకు కుంటల్లోనూ లక్షల అక్రమ నిర్మాణాలున్నాయి. 1500 కి.మీ నిడివి నాలాలపైన 9 వేల అక్రమనిర్మాణాల్ని ఇపుడు తొలగించాల్సి ఉంది.
పట్టణాలు, గ్రామాల్లోనూ.....
మారిన వాతావరణ పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పి దాలు తోడయ్యే దుస్థితి నగారలకే పరిమితం కాలేదు. దురాక్రమ ణలు, అక్రమ నిర్మాణాలు పట్టణాలు, పల్లెలకూ విస్తరించాయి. ముఖ్యంగా భూముల ధరలు ఆకాశాన్నంటాక అన్ని అనర్థాలూ చోటు చేసుకుంటున్నాయి. వాగులు, వంకలు, బంజర్లు, పోరంబోకు భూముల్ని అడ్డంగా ఆక్రమించుకుంటున్నారు. పట్టణాల చుట్టూ పెద్ద గృహనిర్మాణ వెంచర్లు వెలుస్తున్నాయి. చెరువు శిఖాల్లో, ప్రభుత్వ భూముల్లోనూ జరుగుతోంది. వర్షాలు కురిస్తే వరద నీరు వెళ్లే మార్గాలు కుంచించుకుపోతున్నాయి. ఎక్కడికక్కడ కొత్త ఆయకట్టు పెరిగిపోయి వాన రాగానే వరద పంట పొలాలపైకి మళ్లుతోంది. వర్ష–వరద తీవ్రత వల్ల పంటలు నాశనమవుతున్నాయి. గత వారం కురిసిన అసాధారణ వానలకు తెలంగాణలో దాదాపు 14 లక్షల ఎకరాల్లో వరి, పత్తి వంటి పంటలు నాశనమయినట్టు ప్రాథమిక సమాచారం. ఏపీలో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో వరి, అనంత పురం వంటి రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ, ఇతర పలు జిల్లాల్లో తమలపాకు, అరటి వంటి పంటలకు నష్టం జరిగింది.
వాతావరణ మార్పుల వల్ల జూలైలో రావాల్సిన గట్టి వానలు సెప్టెంబరు, అక్టోబరు మాసాల్లో పడుతున్నాయి. ఈ సారి వర్షపాతం బాగుండి ఇప్పటికే అత్యధిక చెరువులు నిండాయి. తెలంగాణలో ‘మిషన్ కాకతీయ’ ద్వారా చెరువుల్లో పూడికలు తీసి, అలుగులు, తూముల మరమ్మతులు చేసి సీజన్ నాటికి సంసిద్ధం చేసుండటం వల్ల చెరువులన్నీ నిండు కుండల్లా ఉన్నపుడు తాజా వానలొచ్చాయి. చెరువు కట్టల పరిస్థితి గంభీరంగా ఉందని పౌరసమాజ సంస్థలు, నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. బలహీనంగా ఉన్నచోట కట్టల్ని పటిష్టపరచుకోవాల్సింది. నగరం, శివారు చెరువుల విషయమై నిర్దిష్టంగా పేర్కొన్నారు. వానలు జోరుగా కురిసిన అక్టోబరు 12, 13, 14 తేదీల్లో కూడా ఈ హెచ్చరిక లున్నాయి.
ప్రకృతిని గౌరవిస్తేనే....!
వాతావరణ మార్పు ప్రమాద సూచికలను ప్రభుత్వాలు పెద్దగా ఖాతరు చేయడం లేదు. దాన్ని ఎదుర్కొనేందుకు, నష్ట నివారణకు నిర్దిష్ట ప్రణాళిక ఉండాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల్ని, మహా నగరాల విస్తరణని ప్రభుత్వాలు నిలువరించాలి. సాంకేతికత పెరిగి, ఇంటి నుంచే వృత్తి–ఉద్యోగ బాధ్యతలు నిర్వహించగలిగే పరిస్థితులు ఎక్కువైన నేపథ్యంలో శాటిలైట్ పట్టణాల వృద్ధిని ప్రోత్సహించాలి. ఎక్కటికక్కడ టౌన్ ప్లానింగ్ కఠినంగా అమలుపరచాలి. శిలాజ ఇంధన వినియోగాన్ని తగ్గించి, సౌర–పవన వంటి పునర్వినియోగ విద్యుచ్ఛక్తి వాడకం పెంచాలి. వాయు, జల కాలుష్యాల్ని నివారించాలి. వ్యర్థాల తొలగింపు, నిర్వహణ శాస్త్రీయ పద్ధతుల్లో జరగాలి. భవన నిర్మాణ వ్యర్థాల నుంచి అన్నింటిని మూసీలో కుమ్మరించడం కూడా నీటి ప్రవాహాన్ని అడ్డుకొని, నిన్నటి ప్రమాదాన్ని తీవ్రం చేయడం కళ్లారా చూశాం. కేంద్రంలో, రాష్ట్రంలో పకడ్బందీ భూవినియోగ విధానం లేకపోవడం ఓ పెద్ద లోపం. ఇదివరలో భూముల్ని పలు రకా లుగా నిర్వహించేది.
ప్రయివేటుతో పాటు ప్రభుత్వ, అటవీ, బంజరు, గైరాన్, పోరంబోకు, మైదాన.... ఇలా వేర్వేరుగా! ఏ భూమైనా మరో వినియోగంలోకి మారేటప్పుడు పద్ధతులు పాటించేది. అవన్నీ ప్రతి బింబిస్తూ ఇప్పుడొక పటిష్ట భూవినియోగ విధానం రూపొందించాలి. వాతావరణంలో కీలకమైన జలవనరులు, అడవులు, కొండలు, గుట్టల్ని పరిరక్షించాలి. ప్రభుత్వ భూముల్లో దురాక్రమణల్ని తొలగిం చాలి. హైదరాబాద్‌తో సహా నగరాలు, పట్టణాల్లో నదులు, నాలాలపై అక్రమ నిర్మాణాల్ని తొలగించి, పూడిక తీసి ప్రక్షాళన చేయాలి. నీటి ప్రవాహాన్ని కాస్త ముందుగానే లెక్కించే సెన్సర్లు ఏర్పరచాలి. విపత్తు నిర్వహణ సంస్థ మరింత క్రియాశీలం కావాలి. ప్రభుత్వాలు ప్రణాళికా బద్ధంగా దీర్ఘకాలిక–తక్షణ చర్యలతో వ్యవహరించకుంటే..... మనం పాటలో చెప్పుకున్న పరిస్థితులు తలకిందులవుతాయి. ఎండలు– మబ్బులకు, మబ్బులు–వానలకు, వానలు–చెరువులకు, చెరువులు– పంటలకు, పంటలు–ప్రజలకు, ప్రజలూ–మంచితనానికి మధ్య సంబంధాలు తీవ్రంగా బెడిసినట్టే! తస్మాత్ జాగ్రత్త!!
-దిలీప్ రెడ్డి
ఈ-మెయిల్: dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment