వందేళ్లలో ప్రపంచ ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఫలితంగా వ్యవసాయోత్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అయితే, వందేళ్లలో మారిన ప్రకృతి విపరిణామాల గురించి ఆలోచిస్తున్నాం సరే, మరి సమాజంలో ఇంకా మారని దుష్పరిణామాల గురించి ఆలోచిస్తున్నామా? మనుషుల మధ్య ఉన్న పెక్కు సామాజిక అసమానతలు ఇప్పటికీ తొలగిపోవడం లేదు. అంటరానితనమనే రుగ్మత ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్‌నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ కలుషితం చేస్తూనే ఉన్నాయి.
‘‘గత వందేళ్లలోనే ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్ పెరిగాయి. 2100 సంవ త్సరానికల్లా అనూహ్యంగా 4 సెంటిగ్రేడ్ డిగ్రీలు పెరగనున్నాయి. కాగా, ఇంతవరకు ప్రపంచ వాతావరణ రికార్డులో లేని వేడిమి 2022లో నమోదైంది. అంతేగాదు, తరచుగా దక్షిణ ఆసియాలో బిళ్లబీటుగా ఉధృతమవుతున్న వేడిగాలులు రానున్న సంవత్సరాల్లో కూడా కొనసాగ బోతున్నాయి. ఇంతగా వేడి గాలులు భారతదేశంలోని ఉత్తరాది రాష్ట్రా లలోనే గాక, దక్షిణాది రాష్ట్రాలను కూడా అమితంగా పీడిస్తున్నాయి.
ఢిల్లీని 72 ఏళ్ల చరిత్రలో ఎరగని ఉష్ణోగ్రతలు ఈ ఏడాది కుదిపేశాయి. ప్రపంచ వాతావరణంలో అనూ హ్యమైన స్థాయిలో (40 డిగ్రీల సెంటి గ్రేడ్‌కు మించి) వేడిగాలులు వీచే ఈ పరిస్థితుల్లో, భారత్, చైనా, పాకిస్తాన్, ఇండోనేసియా లాంటి దేశాల్లో బయటి పనిచేసుకుని బత కాల్సిన దినసరి కార్మికులు యమ యాతనలకు గురికావల్సి వస్తుంది. 1971–2019 సంవత్సరాల మధ్య ఇండియాను చుట్టబెట్టిన అసాధా రణ వేడిగాలుల ఫలితంగా వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిస్థితులు మళ్లీ పునరావృతమయ్యే ప్రమాదం ఉంది.’’
– ప్రొఫెసర్స్ వినోద్ థామస్, మెహతాబ్ అహ్మద్ జాగిల్,నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్
ఈ ‘మిడిమేల’మంతా భారతదేశాన్ని ఎలా చుట్టబెడుతోంది? మరో వైపు, గత ఏడేళ్లుగా పసిఫిక్ మహాసముద్రం నుంచి ఏనాడూ ఎరుగ నంతటి వేడి గాలులకు నిలయమైన ‘ఎల్‌నినో’ వాతావరణ దృశ్యం భారత దేశాన్ని ‘కుమ్మేస్తూ’ ముంచుకొస్తోంది. ఫలితంగా వ్యవసాయో త్పత్తులు దెబ్బతింటున్నాయి. దీనివల్ల తీవ్రమైన సామాజిక పరిస్థి తులు తలెత్తి, ఆహోరోత్పత్తుల ధరలు చుక్కలనంటి, ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని సిడ్నీ యూనివర్సిటీ ఆర్థిక శాస్త్రాచార్యులు డేవిడ్ యుబిలావా హెచ్చరిస్తున్నారు. ‘ఎల్‌నినో’ ప్రభావం అన్ని చోట్లా ఒకే తీరుగా ఉండదు. కాకపోతే, పెక్కు దేశాలకు వర్తక వ్యాపారాల సంబంధ బాంధవ్యాలున్నందువల్ల ఆర్థికపరమైన ఒడిదు డుకులు అనివార్యమవుతాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలతో పాటు, సామాజిక ఒడిదుడుకులు అనివార్యమనీ అంచనా!
ఇప్పటికే మనుషుల మధ్య పెక్కు సామాజిక అసమానతలు ఉన్నాయి. అంటరానితనమనే రుగ్మత పెక్కుమందిని ఇంకా పీడిస్తున్న పెను‘రోగం’గానే ఉంది. ‘ఎల్‌నినో’ లాంటి వాతావరణం వల్ల వారి జీవితాలకు మరిన్ని అవాంతరాలు తోడవుతున్నాయి. ఈ జాఢ్యం ఇప్పుడే గాదు, ‘ఏలినాటి శని’గా మనదాకా దాపురించి ఉన్నందుననే – మహాకవి జాషువా ఏనాడో ఇలా చాటాడు:
‘‘అంటరాని తనంబునంటి భారత జాతి
భువన సభ్యత గోలుపోయె...
నిమ్న జాతుల కన్నీటి నీరదములు
పిడుగులై దేశమును కాల్చివేయు’’
అంతేనా? తాను ‘పుట్టరాని చోట పుట్టినందుకు’ అసమానతా భారతంలో ఎన్ని అగచాట్లకు గురయ్యాడో వెలిబుచ్చిన గుండె బాధను అర్థం చేసుకోగల మనస్సు కావాలని ఇలా కోరుకున్నాడు:
‘‘ఎంత కోయిల పాట వృథయయ్యెనొ కదా
చిక్కు చీకటి వన సీమలందు
ఎన్ని వెన్నెల వాగు లింకి పోయెనొ కదా
కటికి కొండల మీద మిటకరించి
ఎన్ని కస్తూరి జింక లీడేరెనొ కదా
మురికి తిన్నెల మీద పరిమళించి
ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా
పండిన వెదురు జొంపములలోన
ఎంత గంధవహన మెంత తంగెటి జున్ను
యెంత రత్నకాంతి యెంత శాంతి
ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనొ
పుట్టరాని చోట బుట్టుకతన...’’
‘ఎల్‌నినో’ వాతావరణాన్ని ప్రభావితం చేస్తే... కుల వ్యవస్థ, మత వ్యవస్థలు సంఘ జీవనాన్ని ఇప్పటికీ ఎలా కలుషితం చేస్తున్నాయో ‘గబ్బిలం’ దీనావస్థ ద్వారా జాషువా వ్యక్తం చేశారు. ‘పూజారి’ లేని సమయం చూసి నీ బాధను శివుడి చెవిలో విన్నవించుకోమంటాడు. అప్పటికీ ఇప్పటికీ – పిడుక్కీ, బియ్యానికీ ఒకే మంత్రంగా వ్యవస్థ అవస్థ పడుతూనే ఉంది. కనుకనే జాషువా ‘ముప్పయి మూడు కోట్ల దేవతలు ఎగబడ్డ దేశంలో భాగ్యవిహీనుల కడుపులు చల్లారుతాయా’ అని ప్రశ్నించాడు!
అలాగే అనేక ప్రకృతి వైపరీత్యాల నుంచి మానవుల్ని క్షేమంగా గట్టెక్కించే ఔషధాలు, వాటి విలువల్ని తొలిసారిగా ప్రపంచానికి వెల్లడించిన 18వ శతాబ్ది కవి చెళ్లపిళ్ల నరస కవి. ఒక్క ‘కరణి’ అన్న పదంతోనే (ఒక రీతి, ఒక పద్ధతి) ధరణిని శ్వాసించి, శాసించిన కవి! ఆయన గ్రంథం ‘యామినీ పూర్ణతిలకా విలాసం’ ఎన్ని రకాల ఔషధాలనో వెల్లడించింది: చనిపోయిన వారిని బతికించే ఔషధి – ‘సంజీవకరణి’, విరిగిపోయిన ఎముకల్ని అతికించేది– ‘సంధాన కరణి’, తేజస్సును కోల్పోయిన మనిషికి తేజస్సు ప్రసాదించే ఔషధం– ‘సౌవర్ణకరణి’, మనిషి శరీరంలో విరిగి పోయిన ఎముక ముక్కల్ని తొలగించేసేది – ‘విశల్యకరణి’. ఇవన్నీ నరస కవి చూపిన ప్రకృతి లోని పలు రకాల ఔషధాలు! కళల్ని మెచ్చుకుని వాటికి కాంతులు తొడిగే శిల్పుల్ని నిరసించడం తగదు గదా! ఎందుకని? ‘వానతో వచ్చే వడగండ్లు’ నిలుస్తాయా?!
ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment