విశ్లేషణ
ఉత్తర భారతదేశ రైతులు ఒకవైపు దేశ రాజధానిలో కనీస మద్దతు ధరతో పాటు ఇతర హక్కుల సాధన కోసం పోరు కొనసాగిస్తున్నారు. ఇంకోవైపు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్ర శాస్త్రవేత్తలు వాతావరణాన్ని మరింత మెరుగ్గా అంచనా వేసేందుకు ఇన్‌శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ఉపగ్రహం వాన రాకడ, పోకడలతోపాటు వాతావరణానికి సంబంధించి మరింత కచ్చితమైన అంచనాలను రూపొందించేందుకు ఉద్దేశించినది. రైతులతోపాటు, మత్స్యకారులకూ ఉపయోగపడుతుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో ఈ రెండు వర్గాలు పలు సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ వర్గాలకు సకాలంలో అందే హెచ్చరికలు, దీర్ఘకాలిక అంచనాలు ఎంతో ఉపయోగపడతాయి.
వాతావరణ మార్పుల ప్రభావం వల్ల 2050 నాటికి గోధుమ, వరి దిగుబడుల్లో గణనీయ మైన తగ్గుదల ఉంటుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. ఇన్‌షాట్–3డీఎస్ ప్రయోగం దేశంలోనే అతి పురాతనమైన ఉపగ్రహ ప్రయోగ కార్యక్రమం తాలూకూ పరిణతికి నిదర్శనం. ఇండియన్ నేషనల్ శాటిలైట్ (ఇన్‌శాట్) కార్యక్రమానికి యాభై ఏళ్ల క్రితమే బీజం పడింది. 1975లో ఇన్‌శాట్ శ్రేణి ఉపగ్రహాల ప్రయోగాలకు అనుమతులు లభించాయి. 1982లో తొలి ఉపగ్రహం (ఇన్‌శాట్–1ఏ) ప్రయోగం జరిగింది.
మొదట్లో ఈ ఉపగ్రహాల్లో అత్యధికం ఫోర్డ్ ఏరోస్పేస్ అండ్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్ నుంచి కొనుగోలు చేసి, ఫ్లారిడా(యూఎస్)లోని కేప్ కానవెరల్ నుంచి ప్రయోగించేవారు. ఇన్‌శాట్–1 శ్రేణి ఉపగ్రహాల కారణంగా భారతీయ వాతావరణ విభాగం ఉపగ్రహ ఆధారిత వాతావరణ అంచనాల రంగంలోకి అడుగుపెట్టింది. తుపానులు, ఈదురుగాలులతోపాటు అల్పపీడనా లను కూడా ఉపగ్రహాల సాయంతో పరిశీలించడం మొదలైంది.
1992లో ప్రయోగించిన ఇన్‌శాట్–2 శ్రేణి ఉపగ్రహాలు మునుపటి వాటి కంటే సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించినవి కావడం గమనార్హం. దేశీయంగా తయారు చేసిన చాలా హై రెజొల్యూషన్ రేడియో మీటర్లను ఇందులో ఉపయోగించారు. ఫలితంగా రోజువారీ వాతావరణ అంచనాలు, ముందస్తు అంచనాలు, మేఘాల ఛాయాచిత్రాల సేకరణ సులువు అయ్యింది.
సమాచార వినిమయానికి కూడా...
ఇన్‌శాట్–1, ఇన్‌శాట్– 2 శ్రేణి ఉపగ్రహాలు అటు వాతావరణ అంచనాలతోపాటు ఇటు సమాచార వినిమయం, బ్రాడ్‌కాస్టింగ్ రంగా లకూ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇన్‌శాట్–2 శ్రేణిలోని కొన్ని ఉప గ్రహాల్లో వాతావరణ సంబంధిత పేలోడ్‌లు అసలు లేకపోవడం గమ నార్హం. కొన్ని రకాల సమాచారాన్ని సేకరించేందుకు (తుపానుల మధ్య భాగం వంటివి) భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమెరికా రక్షణ శాఖ ఉపగ్రహాలపై ఆధారపడింది. ఈ సమస్యను అధిగ మించే లక్ష్యంతో ఐఎండీ 2002లో మెట్‌శాట్‌ను ప్రయోగించింది. తరు వాతి కాలంలో దీని పేరును కల్పన–1గా మార్చారు. కర్‌నాల్ (హరియాణా)లో పుట్టి, ‘నాసా’ వ్యోమగామిగా ఎదిగి 2002లో స్పేస్‌షటిల్ ప్రమాదంలో మరణించిన కల్పనా చావ్లా స్మరణార్థమన్న మాట!
ఈ సమయంలోనే వాతావరణ పరిశోధనలకు ప్రత్యేకంగా ఒక ఉపగ్రహం ఉంటే బాగుంటుందన్న అభిప్రాయాన్ని ఐఎండీ వ్యక్తం చేసింది. ఫలితంగానే 2013లో ఇన్‌శాట్–3డీ శ్రేణి మూడోతరం వాతా వరణ ఉపగ్రహ ప్రయోగం జరిగింది. 2016లో ఇదే శ్రేణిలో ఇంకో ఉపగ్రహాన్ని కూడా విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరి –17న ప్రయోగించిన ఉపగ్రహం ఇన్‌శాట్–3డీ శ్రేణిలో తాజాది. కేంద్ర భూశాస్త్ర మంత్రిత్వ శాఖ ఈ ఉపగ్రహానికి నిధులు సమకూర్చింది. ఐఎండీతోపాటు నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ (నోయిడా), ఇండియన్ ఇన్ స్టి ట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటియరాలజీ (పూణే) వంటి సంస్థలు ఈ ఉపగ్రహం అందించే సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి.
వాతావరణం, సముద్ర సంబంధిత సమగ్ర సమాచారాన్ని ఇన్‌శాట్–3డీఎస్ ద్వారా అందుకోవచ్చు. దీంట్లోని పరికరాలు ఆరు రకాల పౌనఃపున్యాలలో ఛాయాచిత్రాలు తీయగలవు. నేల నుంచి మొదలుపెట్టి అంతరిక్షం వరకూ వేర్వేరు ప్రాంతాలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు, తేమశాతం వంటి వివరాలూ సేకరించగలవు. సముద్ర, భూ ఉపరితల ఉష్ణోగ్రతలు, మేఘాల లక్షణాలు, పొగమంచు, వాన, మంచు ఆవరించిన ప్రాంతం, పడిన మంచు మందం, కార్చిచ్చులు, వాతావరణంలోని కాలుష్యకారక కణాలు, టోటల్ ఓజోన్ వంటి వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు సేకరించేందుకు ఈ ఉపగ్రహం ఉపయోగపడుతుంది.
ఈ దశలో ఒక వైపు ఉపగ్రహ నిర్మాణంలో దేశీ టెక్నాలజీల వాడకం పెంచుకుంటూనే ఇంకోవైపున ఉపగ్రహ సమాచారాన్ని అందుకునేందుకు, విశ్లేషించేందుకు అవసరమైన భూతల సామర్థ్యాన్ని కూడా భారత్ పెంచుకుంది. వాతావరణ ఉపగ్రహాల నుంచి సమా చారం అందుకునేందుకు ఐఎండీ కొత్త కొత్త ఎర్త్ స్టేషన్స్ నిర్మాణాన్ని చేపట్టింది. సమాచారాన్ని అప్పటికప్పుడు విశ్లేషించేందుకు కంప్యూ టింగ్ సామర్థ్యాన్ని కూడా పెంచుకుంది. వాతావరణ మోడలింగ్ కోసం సూపర్ కంప్యూటర్‌ను ఇచ్చేందుకు అమెరికా నిరాకరించిన 1980లలో సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ (సీ– డాక్)ను ఏర్పాటు చేసి, దేశీయంగానే హై స్పీడ్ కంప్యూటింగ్ వ్యవస్థ లను అభివృద్ధి చేసే పనిలో పడింది.
అప్పటి నుంచి ఇప్పటివరకూ భారత్ వాతావరణ సంబంధిత సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థల నిర్మా ణంలో అగ్రగామి దేశంగా నిలిచింది. తాజాగా అంటే గత ఏడాది మరింత అత్యాధునిక వాతావరణ పరిశోధనల కోసం కేంద్ర భూపరి శోధన మంత్రిత్వ శాఖ రెండు సూపర్ కంప్యూటర్ల నిర్మాణానికి సిద్ధమైంది. ఫ్రెంచ్ కంపెనీ సాయంతో పది కోట్ల డాలర్ల ఖర్చుతో వీటిని నిర్మించనున్నారు. నోయిడా, పూణెల్లోని కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
టెక్నాలజీతోపాటు మారుతూ...
వాతావరణ అంచనాల ఫలితాలను సామాన్యులకు చేర్చేందుకు ఐఎండీ టెక్నాలజీతోపాటుగా మారుతూ వచ్చింది. అడ్వయిజరీస్, ఎర్లీ వార్నింగ్, షార్ట్ – మీడియం రేంజ్ స్థానిక అంచనాల వంటివి అందించే వ్యవస్థలను కూడా కాలక్రమంలో ఏర్పాటు చేసుకుంది. ఒకప్పుడు వాతావరణ సమాచారాన్ని టెక్స్‌ట్ ఎస్‌ఎంఎస్ రూపంలో పంపితే, మొబైల్ ఫోన్ల కాలంలో వేర్వేరు భాషల్లో సమాచారాన్ని అందించే వీలేర్పడింది.
అయితే వీటి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం రైతులకు ఎంతవరకూ ఆచరణ సాధ్యమన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. వాట్సప్, సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌ల వంటి అనేకానేక సమాచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఈ ప్రశ్నకు మరింత ప్రాధాన్యమూ ఏర్పడుతోంది. నకిలీ, తప్పుడు వార్తలు విచ్చలవిడిగా ప్రవహిస్తున్న ఈ కాలంలో విశ్వసనీయమైన సమాచారం అందించేందుకు భారత వాతావరణ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది.
ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలన్న భారత ప్రయత్నాల్లో ఇన్‌శాట్–3డీఎస్ ఒక కీలకమైన మైలురాయి అని చెప్పాలి. విదేశాల నుంచి ఉపగ్రహాల కొనుగోళ్లు, ప్రయోగాలు నిర్వహించే స్థితి నుంచి మనం సొంతంగా వాతావరణ ఉపగ్రహాల తయారీ, ప్రయోగాలను చేపట్టే స్థితికి చేరాము. అది కూడా భారతీయ రాకెట్ల సాయంతో మనకు కావాల్సిన కక్ష్యలో ప్రవేశ పెట్టగలుగుతున్నాము.
సాంకేతిక పరిజ్ఞాన లభ్యతలో ఉన్న అంతరా లను జాగ్రత్తగా గుర్తించడం, విదేశీ టెక్నాలజీలను ఔపోసన పట్టడం, వ్యవస్థలు–ఉప వ్యవస్థల నిర్మాణానికి తగిన కార్యక్రమాలను అమల్లోకి తేవడం, ఇండియన్ స్పేస్ ఆర్గనైజేషన్ , ఐఎండీ, ఇతర శాస్త్రీయ సంస్థలతో సన్నిహితంగా పనిచేయడం వంటి అనేకానేక చర్యల వల్ల ఈ అభివృద్ధి సాధ్యమైంది.
ఇటీవలి కాలంలో దేశీ టెక్నాలజీ పరిశ్రమల ముఖచిత్రంలో గణనీమైన మార్పులు వస్తున్నాయి. మైక్రో ఉపగ్రహ సమూహాల ప్రయోగంలో ప్రైవేట్ సంస్థలు బిజీగా ఉంటున్నాయి. వేగంగా ముంచుకొస్తున్న వాతావరణ మార్పులను దృష్టిలో పెట్టుకుని భారత ప్రభుత్వం కూడా సాంకేతిక పరిజ్ఞాన రంగంలో స్వావలంబ నకు, మరీ ముఖ్యంగా అత్యాధునిక టెక్నాలజీల విషయంలో మరిన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
దినేశ్ సి. శర్మ
వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment